• facebook
  • whatsapp
  • telegram

గుప్తుల కాలం - స్వర్ణయుగం

సాహిత్యాభివృద్ధి

* గుప్తుల కాలంలో ‘సంస్కృతం’ రాజభాష. రాజశాసనాలు, గ్రంథాలు ఎక్కువగా సంస్కృతంలోనే ఉన్నాయి. పురాణాలు, రామాయణ, మహాభారతాలకు ప్రాచుర్యం లభించింది. 

* గుప్తరాజులు స్వయంగా కవులు. సముద్రగుప్తుడికి ‘కవిరాజు’ అనే బిరుదు ఉంది. సముద్రగుప్తుడి సేనాని ‘హరిసేనుడు’ అలహాబాద్‌ శాసనాన్ని రచించగా, ఒకటో కుమారగుప్తుడి ‘దశపుర’ శాసనాన్ని వత్సభట్టి రాశాడు.

* రెండో చంద్రగుప్తుడు తన ఆస్థానంలో ‘నవరత్నాలు’ అనే కవులను పోషించాడు. వారు: వరరుచి, క్షపణికుడు, ధన్వంతరి, అమరసింహుడు, బేతాళభట్టు, ఘటకర్పరుడు, కాళిదాసు, శంఖు, వరాహమిహిరుడు. వీరిలో కాళిదాసు గొప్పవాడు. ఇతడు అభిజ్ఞాన శాకుంతలం, విక్రమోర్వశీయం, మాళవికాగ్నిమిత్రం అనే సంస్కృత నాటకాలు; రఘువంశం, రుతుసంహారం, మేఘసందేశం అనే సంస్కృత కావ్యాలు రచించాడు. వీటిలో ‘అభిజ్ఞాన శాకుంతలం’ ప్రపంచంలోని వంద అద్భుత సాహిత్యాల్లో ఒకటిగా పేరొందింది. దీన్ని యూరోపియన్‌ భాషల్లోకి కూడా అనువదించారు. వి.ఎ.స్మిత్‌ అనే చరిత్రకారుడు కాళిదాసును ‘ఇండియన్‌ షేక్‌స్పియర్‌’గా అభివర్ణించాడు.

* విశాఖదత్తుడు గుప్తుల కాలానికి చెందిన వారు. ఈయన దేవీచంద్రగుప్తం, ముద్రారాక్షసం అనే నాటకాలు రచించాడు. శూద్రకుడు ‘మృచ్ఛకటికం’; విష్ణుశర్మ ‘పంచతంత్రం’, ‘మిత్రభేదం’, ‘సంధి’; హరిసేనుడు ‘ప్రయోగప్రశస్తి’; దండి ‘దశకుమార చరిత్ర’; అమరసింహుడు ‘అమరకోశం’; దిగ్నాగుడు ‘పరమ సముచ్ఛయం’ గ్రంథాలను ఈ కాలంలోనే రాశారు. 


వైజ్ఞానిక శాస్త్రాభివృద్ధి 

గుప్తుల యుగంలో సాహిత్యం, విద్యాభివృద్ధితోపాటు వైజ్ఞానికశాస్త్రంలోనూ గణనీయమైన అభివృద్ధి జరిగింది. క్రీ.శ. 8వ శతాబ్దం నాటికే శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎన్నో రచనలు వెలుగులోకి వచ్చాయి. బీజగణితం, గణితం, ఖగోళశాస్త్రాలు బాగా అభివృద్ధి చెందాయి. గ్రీకులతో ఏర్పడిన పరిచయాలు దీనికి ఉపయోగపడ్డాయి. ఆర్యభట్ట, వరాహమిహిరుడు, బ్రహ్మగుప్తుడు మొదలైనవారు గుప్తులకాలం నాటి ప్రముఖ గణితశాస్త్రజ్ఞులు.

i) ఆర్యభట్ట: ఈయన పాటలీపుత్రానికి చెందిన గణితశాస్త్రవేత్త. క్రీ.శ.476లో జన్మించారు.

* ఆర్యభట్ట గణితశాస్త్రం నుంచి ఖగోళశాస్త్రాన్ని విడదీసి, ఒక ప్రత్యేక విషయంగా రూపొందించారు. ‘ఆర్యభట్టీయం’ అనే గ్రంథాన్ని రచించారు. అందులో చుట్టుకొలతలు, వ్యాసానికి ఉన్న సంబంధాన్ని వివరించారు.

* ఈయన π అంటే 3.1416 అని, సూర్యసంవత్సరకాలం 365.3586805 రోజులని పేర్కొన్నాడు. తన ‘సూర్య సిద్ధాంత’ గ్రంథంలో సూర్య, చంద్ర గ్రహణాలు ఎలా ఏర్పడతాయో శాస్త్రీయంగా వివరించారు. 

* ‘సున్నా’ను కనిపెట్టింది ఈయనే అని చాలామంది చరిత్రకారుల అభిప్రాయం. స్థానభేదం వల్ల సున్నా విలువ ఎలా మారుతుందో వివరించి, దశాంశ పద్ధతికి నాంది పలికారు.  

ii) వరాహమిహిరుడు: ఈయన క్రీ.శ.550 కాలంలో జీవించినట్లు చరిత్రకారుల అభిప్రాయం. ‘పంచసిద్ధాంతిక’ అనే గ్రంథాన్ని రచించారు. ‘లఘు’, ‘బృహత్‌’ అనే జాతక గ్రంథాలను రాశారు. ఇవి జాతకచక్రాన్ని వివరిస్తాయి. ఈయన రచించిన ముఖ్యమైన గ్రంథాల్లో ‘బృహత్‌ సంహిత’ ఒకటి. ఇది ఖగోళశాస్త్రాభివృద్ధిని తెలుపుతుంది.

iii) బ్రహ్మ గుప్తుడు: ఈయన క్రీ.శ. 628 లో బ్రహ్మగుప్త సిద్ధాంతాన్ని రచించారు. వీటిలో గ్రహాలు, నక్షత్రాలు, గ్రహణాల గురించి వివరించారు. భూమి ఆకర్షణ శక్తి గురించి మొదటిసారి చెప్పింది ఈయనే. 

iv) శుశ్రుతుడు: ఈయన ప్రముఖ వైద్యుడు. ‘శుశ్రుత సంహిత’ అనే గ్రంథాన్ని రచించారు. శస్త్రచికిత్స చేసిన మొదటి వైద్యుడు. శస్త్రచికిత్స పితామహుడిగా పేరొందారు.

v) చరకుడు: ‘చరక సంహిత’ అనే గ్రంథాన్ని రచించారు. వైద్యశాస్త్రంలో నూతన ఆవిష్కరణలు చేశారు. వ్యాధులు - వాటి నివారణ పద్ధతులను వివరించారు.

vi) వాగ్భటుడు: వైద్యశాస్త్ర గ్రంథమైన ‘అష్టాంగ సంగ్రహాన్ని’ రచించారు.

vii) ఫలకావ్వుడు: ‘హస్తాయుర్వేదం’ అనే గ్రంథాన్ని రచించారు. ఇది పశువైద్యానికి సంబంధించింది. ఇందులో గుర్రాలు, ఏనుగులకు సంబంధించిన అనేక వైద్య పద్ధతులు ఉన్నాయి.

viii) ధన్వంతరి: ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు. వృక్షాల నుంచి మూలికలు తీసి, వైద్యంలో వాడారు. ‘నవనీతకం’ అనే ప్రముఖ వైద్యశాస్త్ర గ్రంథాన్ని రాశారు.


లోహ పరిశ్రమ అభివృద్ధి

* గుప్తుల కాలంలో ప్రజలు ఎక్కువగా లోహాలతో తయారైన వస్తువులను ఉపయోగించారు. ఆ కాలంనాటి వెండి, బంగారు, రాగి నాణేలు; పతకాలు, ముద్రలు, స్తంభాలు వీరి లోహ నైపుణ్యాన్ని తెలుపుతున్నాయి. 

* దిల్లీలో ఉన్న 23 అడుగుల మొహరౌలి ఇనుప స్తంభం వీరి ఇంజినీరింగ్‌ నైపుణ్యానికి చక్కటి ఉదాహరణ. దీనిపై ఉన్న శాసనం రెండో చంద్రగుప్తుడి విజయాలను తెలుపుతుంది. నలందాలోని బుద్ధుడి రాగి విగ్రహం, దానేసర్‌ శేరా, సుల్తాన్‌గంజ్‌లోని బుద్ధుడి కంచు విగ్రహాలు, లోహాలను కరిగించి పోతపోయడం మొదలైనవన్నీ వారి విషయ నైపుణ్యానికి నిదర్శనాలు.


శిల్పకళ 

* గుప్తుల శిల్పకళలలో జైన, బౌద్ధ, హిందూమత సంస్కృతి గోచరిస్తుంది. క్రీ.శ 4, 5 శతాబ్దాల్లో వివిధ దేవతల విగ్రహాలతో దేవాలయాలను అలంకరించడం ప్రారంభించారు. రాజుల నుంచి సామాన్యుల వరకు  శిల్పకళను ఆదరించి, పోషించారు. 

* ఆనాటి ప్రధాన శిల్పకళారీతుల్లో మధురశైలి, బెనారస్‌ శైలి ప్రముఖంగా ఉన్నాయి. గుప్తుల కంటే ముందు పాలకులు గాంధార శిల్పకళను ప్రోత్సహించారు. ఇది విదేశీ పరిజ్ఞానం. 

* గుప్తుల కాలంలో శిల్పకళలో దేశీయ సాంప్రదాయమైన బర్హూత్‌ను ఉపయోగించారు. సారనాథ్‌ బౌద్ధ శిల్పం; శివుడు, విష్ణువు లాంటి ఇతర దేవతా శిల్పాల్లోనూ ఇది కనిపిస్తుంది. 

* మధురశైలిలో ఎర్రరాయిపై విగ్రహాలను చెక్కగా, బెనారస్‌ శైలిలో సున్నం, ఇసుక, రాయిని ఉపయోగించి శిల్పాలు చెక్కారు. సుల్తాన్‌గంజ్, నలందాలోని బౌద్ధవిగ్రహాల్లో లోహాన్ని వాడారు. ఉదయగిరి, భిల్సా, ఎరాన్, దేవ్‌గఢ్‌ ప్రాంతాల్లో శిల్ప కళాకేంద్రాలుండేవి.

* బుమ్రాలోని గణేశ్వర, ఏకముఖలింగాలు; బ్రహ్మ, యమ, కుబేర, కార్తికేయ, నటేశ్వర, సూర్య, ఇంద్రుడి శిల్పాలు; దేవగఢ్‌లోని దశావతార దేవాలయంలో విష్ణు, శివ, రామ, కృష్ణ ప్రతిమలు; ఉదయగిరిలోని వరాహ విగ్రహం; రాజషాహిలోని కృష్ణుడు, అతడి స్నేహితుల ప్రతిమలు; నాచన్‌కుటారలోని పార్వతీ దేవాలయంలో చెక్కిన శిల్పాలు వీరి శిల్పకళకు ప్రధాన తార్కాణాలు.

* వీరి కాలంలో మధుర, బెనారస్, పాటలీపుత్రం ప్రధాన శిల్పకళా కేంద్రాలు. 

* మధురలోని బుద్ధుడు, బోధిసత్వుడి విగ్రహాలను మంచిరూపం, శరీరసౌష్ఠవం, సమగ్ర రూపురేఖలు, గుండ్రటి అవయవాలతో చెక్కారు. సారనాథ్‌ (బెనారస్‌) కేంద్రంలో తయారైన శిల్పాలకు సన్నటి రూపం, సున్నిత అవయవాలు, ముఖవర్చస్సు, అర్ధనిమీలిత నేత్రాలు ప్రధాన లక్షణాలుగా ఉన్నాయి. 


లలితకళలు 

* గుప్తులకాలంలో సంగీతం, నృత్యం, చిత్రకళలు బాగా అభివృద్ధి చెందాయి. ఎల్లోరా గుహల్లో శివుడు తాండవం చేస్తున్నట్లు ఉండే శిల్పం; బర్హూత్, సాంచి, అజంతా, అమరావతిలో నృత్యకారుల శిల్పాలు ఉన్నాయి. ఔరంగాబాద్‌లో లభించిన ఒక శిల్పంలో వాకాటక శిల్పరీతి, స్త్రీ సంగీత విద్వాంసులు, నృత్యకారులు పూర్తి వాయిద్యాలతో ఉన్నాయి.


చిత్రకళ 

* బాగ్, అజంతా, ఎల్లోరాలోని చిత్రాలు గుప్తుల చిత్రకళకు ప్రముఖ నిదర్శనాలు. గుప్తులకాలానికి చెందిన చిత్రాలు అజంతాలో 1, 2, 9, 10, 17, 20 గుహల్లో నేటికీ మనకు కనిపిస్తాయి.

* అజంతా 16, 17 గుహల్లో గరుడ, యక్ష, గంధర్వ, అప్సరస చిత్రాలు; పద్మపాణి, అవలోకితేశ్వర, బోధిసత్వ విగ్రహాలు; జాతకకథలకు చెందిన చిత్రాలు ఉన్నాయి. ఈ గుహల్లోని చిత్రలేఖనాలు మత భావాలను, నగర జీవనాన్ని ప్రతిబింబిస్తున్నాయి.

* చిత్రకళ గురించి కాళిదాసు, దండి, బాణుడు తమ గ్రంథాల్లో ప్రస్తావించారు. 

* ఆనాటి చిత్రకారులు వృక్షాలు, జంతువులు, పుష్పాలు, గంధర్వులు, పక్షులు, అప్సరసలు మొదలైన కథా వస్తువులను ఇతివృత్తంగా తీసుకుని జీవం ఉట్టిపడేటట్లు చిత్రీకరించారు. 

* అజంతాలోని 16వ గుహలో మరణశయ్యపై ఉన్న రాకుమారి చిత్రం ఉంది.


సంగీతం 

* గుప్తుల కాలంలో సంగీతం, నృత్యం మంచి ఆదరణ పొందాయి. సముద్రగుప్తుడు గొప్ప సంగీత విద్వాంసుడు. అతడు నాణేలపై వీణ వాయిస్తున్నట్లు ఉండే చిత్రాన్ని ముద్రించాడు. 

* ప్రజలకు శిక్షణ ఇచ్చేందుకు సంగీత, నృత్యశాలలు ఉండేవి. రాజు ఆస్థానంలో రాజనర్తకులు, గాయకులు ఉండేవారు. వీణ, మృదంగం, వేణువు లాంటి వాయిద్యాలు ఉండేవి. దేవాలయాల్లో దేవదాసీలు నృత్యాలు చేసేవారు. కాళిదాసు నాటకాలను తరచూ సమాజంలో ప్రదర్శించేవారు. ఈ కాలంలో గుప్త చక్రవర్తులకు మధ్య ఆసియా, ఆగ్నేయాసియా, సింహళం, చైనా, రోమ్‌తో సాంస్కృతిక సంబంధాలు ఉండేవి.


వాస్తుకళ 

* గుప్తుల కాలంలో భారతదేశంలో వాస్తు, శిల్పకళలు ఎంతో అభివృద్ధి చెందాయి. వీరు నిర్మాణాల్లో భారతీయతత్వానికి, సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇచ్చారు. 

* కాళిదాసు ‘రఘువంశం’లో వాస్తుకళ, వాస్తుశిల్పాలకు చెందిన సంఘాన్ని శిల్పకారుల శ్రేణిగా ఉదహరించారు. 

* ఆనాటి నిర్మాణాల్లో రాళ్లు, ఇటుకలు వాడినట్లు ప్రస్తుతం లభించిన అవశేషాల ద్వారా తెలుస్తోంది. 

* హిందూ దేవాలయాల నిర్మాణానికి మొట్టమొదటి రూపకల్పన చేసింది గుప్తులే. దేవగఢ్‌లోని దశావతార దేవాలయం, బుమ్రాలోని శివాలయం, టిగవాలోని విష్ణు ఆలయం, నాచన్‌కుఠారాలోని పార్వతీ ఆలయం; సాంచి, సారనాథ్, గయలోని బౌద్ధ దేవాలయాలు గుప్తుల కాలంలో నిర్మించినవే. బీటర్‌గావ్‌ దేవాలయాన్ని మొదటి ఇటుక కట్టడంగా పేర్కొంటారు. 

* గుప్తుల కాలంలో నిర్మించిన దేవాలయాల్లో ప్రధానంగా మూడు లక్షణాలు ఉన్నాయి.అవి:

1. చట్రంలాంటి విస్తృతమైన నిర్మాణం  

2. ఒక భాగానికి అనేకముఖాలు ఉండటం   

3. సాధనపు చతురస్ర వేదిక

* క్రీ.శ. 6వ శతాబ్దానికి చెందిన బాగ్‌ గుహల నిర్మాణంలో గుప్తులు కొన్ని మార్పులు చేశారు. ముఖ్యంగా బుద్ధుడి ప్రతిమకు బదులు చైత్యం ఉంచారు. ఇది ప్రత్యేక శైలి. చిన్న గదులతో కూడిన మహామండపాలు కట్టారు. ముందు భాగంలో ఎలాంటి నిర్మాణాలు లేవు. 

* ఉదయగిరి వద్ద గుహాలయంలో గర్భగుడిని రాతితో తొలిచి, ముందు రెండు స్తంభాల మండపాన్ని నిర్మించారు. ఇది గుప్తుల వాస్తు కళను తెలుపుతుంది. 

* గుప్తులు తొలుత ఆలయాలను రాతితో నిర్మించగా, తర్వాతి కాలంలో రాయి, ఇటుకలతో గుడులు కట్టారు. తొలి ఆలయాల్లో చతురస్రాకార గర్భ గృహం; దాని ముందు స్తంభాల మండపం; ఆలయ పైకప్పు సమతలంగా ఉండేది. తర్వాతి కాలంలో నిర్మించిన వాటిలో గర్భగృహం, ప్రదక్షిణాపథం, గర్భగృహం పైభాగంలో శిఖరాన్ని కట్టారు. ఆలయ స్తంభాల పైభాగం పూర్ణకుంభాకారంతో ఉంటే, సింహద్వారానికి రెండువైపులా గంగా-యమున శిల్పాలు చెక్కారు. డోగ్రదేవాలయంపై ఇతిహాస ఘట్టాలు చిత్రించారు. 

* అజంతా, ఎల్లోరా, గ్వాలియర్‌లోని బాగ్‌గుహల్లో ఉన్న చిత్రాలు; దక్షిణ భారతదేశంలోని ఉండవల్లి, మొగల్రాజపురం, అక్కన్న-మాదన్న గుహలు గుప్తులకాలానికి చెందినవే. 

* కీర్తిముఖలు, అమలకాలు, అర్ధవర్తులాకార గుళ్లు, అభిముఖాలు, పద్మాలు, కూర్చున్న సింహాలు, దేవతలు మొదలైనవి వీరి వాస్తుకళకు నిదర్శనాలు. ఒకే స్తంభంలో ద్వాదశకోణాలు, అష్టకోణాలు, షట్కోణాలు, నాలుగు పలకలు ఉండి, చిత్రవిచిత్రమైన లతాకుంజాలతో మనోహరంగా నిర్మించారు.  

Posted Date : 13-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌