* ఆసియా ఖండం దక్షిణ భాగాన ఉన్న భారత ఉపఖండంలో అధిక భాగం ద్వీపకల్ప ప్రాంతంగా ఉంది.
భారత ఉపఖండంలోని ప్రధాన దేశాలు:
1) భారతదేశం
2) పాకిస్థాన్
3) నేపాల్
4) భూటాన్
5) బంగ్లాదేశ్
6) శ్రీలంక
7) మాల్దీవులు
* ఒక ఖండానికి ఉండాల్సిన విశాల విస్తీర్ణం లేకపోయినప్పటికీ భౌతిక, సాంస్కృతిక, సాంఘిక వైవిధ్యాన్ని ఈ ప్రాంతం కలిగి ఉండటం వల్ల దీన్ని భారత ఉపఖండం అని పిలుస్తున్నారు.
* భారత ఉపఖండంలోని దేశాలన్నింటినీ దక్షిణాసియా దేశాలు అని కూడా పిలుస్తారు. ఈ భూభాగమంతా భారత ద్వీపకల్ప ఫలకంపై ఇమిడి ఉంది.
* ఇది ప్రధానంగా గోండ్వానా భూభాగంలో ఉండి యురేషియా ఫలకంతో కలవడం వల్ల ఏర్పడింది.
* భారత ఉపఖండ ప్రాంతం హిమాలయ పర్వత వ్యవస్థ కారకోరం, హిందూకుష్ పర్వత వ్యవస్థ ద్వారా ఆసియా ఖండం నుంచి వేరై ప్రత్యేకమైన రుతుపవన శీతోష్ణస్థితిని కలిగి ఉంది. ఈ ప్రాంతం 3 - 37º6' ఉత్తర అక్షాంశాలు, 61º - 97º25' తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. దీని మొత్తం విస్తీర్ణం సుమారు 45,68,229 చ.కి.మీ.
* భారత ఉపఖండ దేశాల్లో విస్తీర్ణపరంగా పెద్ద దేశం భారత్, చిన్న దేశం మాల్దీవులు.
భారత ఉపఖండ దేశాలు - విస్తీర్ణ వివరాలు
* దక్షిణాసియా ప్రాంతం ఆసియా ఖండ విస్తీర్ణంలో సుమారు 10%, ప్రపంచ భూభాగంలో 3.3% ఆక్రమించి ఉంది. ఆసియా ఖండ జనాభాలో సుమారు 45%, ప్రపంచ జనాభాలో సుమారు 25% జనాభాను కలిగి ఉంది.
* భారత ఉపఖండ దేశాల్లో అత్యధిక జనాభా కలిగిన దేశం భారత్. తర్వాతి స్థానాల్లో వరుసగా పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, భూటాన్, మాల్దీవులు ఉన్నాయి. ఈ దక్షిణాసియా దేశాలన్నీ కలిసి 1985, డిసెంబరు 8న బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో దక్షిణాసియా ప్రాంతీయ సహకార కూటమి (SAARC - South Asian Association for Regional Co-operation) గా ఏర్పడ్డాయి. 2007లో అఫ్గానిస్థాన్ చేరికతో సార్క్ దేశాల సంఖ్య 8కి చేరింది.
సార్క్
* సార్క్ ప్రధాన కార్యాలయం నేపాల్ రాజధాని కాఠ్‌మాండూలో ఉంది.
భారత ఉపఖండపు సహజ సరిహద్దులు:
* ఉత్తరాన హిందూకుష్ పర్వతాలు, కారకోరం పర్వతాలు, హిమాలయ పర్వతాలు.
* దక్షిణాన హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం, బంగాళాఖాతం.
* తూర్పున మయన్మార్, పశ్చిమ సరిహద్దుగా ఉన్న అరకన్‌యోమా పర్వతాలు.
* పడమరన ఇరాన్, అఫ్గానిస్థాన్ ఉన్నత భూభాగాలు.
భారత ఉపఖండాన్ని ప్రధానంగా 5 నైసర్గిక భాగాలుగా విభజించారు.
అవి: 1) ఉత్తర పర్వత ప్రాంతం
2) ఉత్తర మైదాన ప్రాంతాలు (గంగా, సింధూ, బ్రహ్మపుత్ర మైదానాలు)
3) ద్వీపకల్ప ప్రాంతం
4) తీర మైదానాలు
5) ఎడారి ప్రాంతం
* భారత ఉపఖండ నైసర్గిక స్వరూపాల్లో ప్రధానమైంది ఉత్తర పర్వత ప్రాంతం.
* కజకిస్థాన్‌కు దక్షిణంగా అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, భారత్, చైనా దేశాల సరిహద్దుల్లో పామీర్ పీఠభూమి నుంచి ఉత్తర పర్వత ప్రాంతాలు అన్ని దిశల్లో విస్తరించి ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనవి.....
ఎ) కారకోరం పర్వతాలు
బి) సులేమాన్ పర్వతాలు
సి) హిందూకుష్ పర్వతాలు
డి) కిర్తార్ పర్వతాలు
ఇ) హిమాలయాలు
కారకోరం పర్వతాలు:
* భారత ఉపఖండానికి వాయవ్య దిశలో తజికిస్థాన్, అఫ్గానిస్థాన్ సరిహద్దుల నుంచి పాకిస్థాన్, చైనా, భారత్‌లో విస్తరించి ఉన్నాయి.
* అఫ్గానిస్థాన్‌లోని వాఖన్ కారిడార్, పాకిస్థాన్‌లోని గిల్గిత్ - బల్టిస్థాన్, భారత్‌లోని లడక్, చైనా నియంత్రణలో ఉన్న ఆక్సాయ్ చిన్ ఈ పర్వత ప్రాంతాల్లోనే ఉన్నాయి.
* ప్రపంచంలోనే రెండో ఎత్తయిన పర్వత శిఖరం k2 లేదా గాడ్విన్ - ఆస్టిన్ (8811 మీ.) కారకోరం పర్వతశ్రేణుల్లోనే ఉంది. అత్యంత ఎత్తయిన యుద్ధ క్షేత్రం సియాచిన్ కూడా ఇక్కడే ఉంది.
* కారకోరం కనుమ భారత ఉపఖండాన్ని చైనా, మధ్య ఆసియాలతో కలుపుతుంది.
సులేమాన్ పర్వతాలు:
* ఇవి పామీర్, హిమాలయ పర్వతాలకు నైరుతి దిశగా అఫ్గానిస్థాన్, పాకిస్థాన్‌లలో విస్తరించి ఉన్నాయి.
* ఇవి హిందూకుష్ పర్వతశ్రేణికి కొనసాగింపు.
* సులేమాన్ పర్వతాల్లో ప్రాచీన కాలంలో మధ్య ఆసియా ప్రాంతం, భారత ఉపఖండం మధ్య వ్యాపార, రవాణా మార్గాలుగా ఉపయోగపడిన కైబర్, బోలాన్, గోమాల్ కనుమలు ఉన్నాయి.
హిందూకుష్ పర్వతాలు:
* ఇవి అఫ్గానిస్థాన్, పాకిస్థాన్‌ల మధ్య సరిహద్దుగా ఉన్నాయి.
* ఈ పర్వతాలు ఉత్తరాన అముదర్యా లోయను, దక్షిణాన సింధూ లోయను వేరుచేస్తున్నాయి.
* హిందూకుష్ పర్వతాల్లోనే బమియన్ బుద్ధవిగ్రహాలు ఉన్నాయి.
కిర్తార్ పర్వతాలు:
* ఇవి పాకిస్థాన్‌లోని బెలూచిస్థాన్, సింధ్ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి.
* సులేమాన్ పర్వతాల దక్షిణ శ్రేణి విస్తరణనే కిర్తార్ పర్వతాలు అంటారు.
* ఇవి బెలూచిస్థాన్ ప్రాంతాన్ని, దిగువ సింధూ మైదాన ప్రాంతాన్ని వేరుచేస్తున్నాయి.
హిమాలయ పర్వతాలు:
* భారత ద్వీపకల్ప ఫలకం, యురేషియా ఫలకాల అభిసరణం వల్ల టెథిస్ సముద్రంలోని శిథిలాలు సంపీడన బలాల ఒత్తిడికి లోనై 30 - 50 మిలియన్ సంవత్సరాల కిందట టెర్షియరీ భౌమకాలంలో హిమాలయ పర్వతాలుగా ఏర్పడ్డాయి.
* ఇవి ప్రపంచంలోనే అతి తక్కువ వయసు గల ముడత పర్వతాలు.
* ఈ పర్వతాలు పడమరన సింధూ నది, తూర్పున బ్రహ్మపుత్ర నది గార్జ్‌ల మధ్య సుమారు 2400 కి.మీ. పొడవున ఒక చాపంలా విస్తరించి ఉన్నాయి. ప్రధానంగా పాకిస్థాన్, భారతదేశం, నేపాల్, భూటాన్‌లో ఉన్నాయి.
* ప్రపంచంలో అత్యంత ఎత్తయిన శిఖరాలన్నీ దాదాపు హిమాలయాల్లోనే ఉన్నాయి.
హిమాలయ పర్వతాల్లో ఎత్తయిన శిఖరాలు

శీతోష్ణస్థితి:
* భారత ఉపఖండ భూభాగంలో భిన్న రకాల శీతోష్ణ పరిస్థితులు ఉన్నాయి.
* ఉపఖండ దక్షిణ ప్రాంతాలు ఉష్ణమండల రుతుపవన శీతోష్ణస్థితిని, ఉత్తర ప్రాంతాలు సమశీతోష్ణ మండల శీతోష్ణస్థితిని కలిగి ఉన్నాయి.
* దక్షిణ ప్రాంతం సముద్ర తీరానికి దగ్గరగా ఉండటం వల్ల అక్కడి శీతోష్ణస్థితిపై సముద్ర ప్రభావం అధికంగా ఉంటుంది.
* ఉత్తర ప్రాంతాలు సముద్ర తీరానికి దూరంగా ఉండటం వల్ల వేసవికాలంలో వేడిగా, శీతాకాలంలో తీవ్ర చలితో ఖండాంతర్గత శీతోష్ణస్థితి లక్షణాలను కలిగి ఉన్నాయి.
* ఉపఖండంలో సంభవించే వర్షపాతంలో దాదాపు 70 - 90% వార్షిక సగటు వర్షపాతం నైరుతి రుతుపవనాల వల్ల,
10 - 30% ఈశాన్య రుతుపవనాల వల్ల ఏర్పడుతుంది.
* భారతదేశంలోని కోరమండల్ తీరప్రాంతం, శ్రీలంక, మాల్దీవుల్లో ఈశాన్య రుతుపవనాల వల్ల అధిక వర్షపాతం సంభవిస్తుంది.