• facebook
  • whatsapp
  • telegram

భారతదేశ వ్యవసాయ రంగం

    భారతదేశ ఆర్థికవ్యవస్థలో వ్యవసాయరంగం పాత్ర కీలకమైంది. ఉపాధికల్పన లేదా ఆహారభద్రతలకు సంబంధించి కూడా వ్యవసాయ రంగం ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ రంగంలో ఇటు భారతదేశ భూగోళశాస్త్రం విభాగం నుంచి లేదా భారతదేశ ఆర్థికవ్యవస్థ నుంచి మొత్తం 3 లేదా 4 ప్రశ్నలు వస్తాయి. ఈ ప్రశ్నలు తుది ఎంపికలో కీలకపాత్ర వహిస్తాయి. ఇవి ఏ కోణం నుంచి వస్తాయో తెలుసుకుందాం. 

          భారతదేశ ఆర్థికవ్యవస్థకు వ్యవసాయ రంగం వెన్నెముకలాంటిది. తాజా గణాంకాల ప్రకారం దేశజనాభాలో దాదాపు 64 శాతానికి జీవనోపాధి కల్పిస్తోంది. జాతీయాదాయంలో దాదాపు 17.8 శాతం (2008-09 ప్రకారం) వ్యవసాయ రంగం నుంచే లభిస్తోంది. నిజానికి 2003-04లో దీని శాతం 21.7. 2008-09లో దీని వాటా 17.8 శాతానికి పడిపోయింది. దేశం మొత్తం ఎగుమతుల విలువలో దాదాపు 12.2 శాతం వ్యవసాయోత్పత్తుల ఎగుమతుల ద్వారా లభిస్తోంది. వ్యవసాయాధార పరిశ్రమలన్నింటికీ కావలసిన ముడిసరకులను వ్యవసాయ రంగమే సమకూరుస్తోంది. 

          దేశంలోని మొత్తం సాగుభూమిలో దాదాపు 58 శాతం వర్షాధారం. అందుకే భారతదేశంలోని పంటలు ప్రధానంగా రుతుపవన వ్యవస్థపై ఆధారపడినా, దేశ ఆహారభద్రతలో వ్యవసాయ రంగం కీలకపాత్ర పోషిస్తోంది.

         2007-08లో దేశంలో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి (తృణ ధాన్యాలు, పప్పు దినుసులు) 230.78 మిలియన్ టన్నులు కాగా, 2008-09 సంవత్సరానికి స్వల్పంగా అంటే, 229.85 మిలియన్ టన్నులకు తగ్గింది.
ప్రతికూల వాతావరణమే దీనికి కారణం. 2009-10 నాటికి దేశంలోని క్షామ పరిస్థితుల వల్ల ఆహార ధాన్యాల ఉత్పత్తి ఇంకా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే భారతదేశ వ్యవసాయ రంగంలో సాలీనా 4 శాతం వృద్ధిని సాధించడానికి కేంద్ర ప్రభుత్వం 11వ పంచవర్ష ప్రణాళిక మొదటి సంవత్సరం.. అంటే 2007-08లో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అనే పథకాన్ని ప్రారంభించింది. 

          లభ్యమయ్యే తాజా గణాంకాల ప్రకారం (2005-06) భారతదేశ మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో అంటే 3287263 చ.కి.మీ. (3287 లక్షల హెక్టార్ల)లో 1419 లక్షల హెక్టార్ల భూమి మాత్రమే నికర సాగుభూమి. అంటే భౌగోళిక విస్తీర్ణంలో దాదాపు 43 శాతం మాత్రమే వ్యవసాయ వినియోగంలో ఉంది. అయితే దీనిలో ఒకటికంటే ఎక్కువసార్లు పంటలను పండించేందుకు అనువైన భూమి 509 లక్షల హెక్టార్లు. కాబట్టి, దేశం స్థూల సాగుభూమి 1928 లక్షల హెక్టార్లు. అంటే మొత్తం సాగుభూమి 58.6 శాతం అని అర్థం. (కాబట్టి, ప్రశ్నలు ఏ కోణంలో వస్తాయో ముందుగానే తెలుసుకొని వాటికి కచ్చితమైన సమాధానాలను గుర్తించాల్సి ఉంటుంది.)

భారతదేశంలో వ్యవసాయ రుతువులు (కాలాలు) :

         భారతదేశంలో దీర్ఘకాలం ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. అందుకే పలు వ్యవసాయ రుతువులు (కాలాలు) ఉన్నాయి. ముఖ్యమైన వ్యవసాయ రుతువులు

1) ఖరీఫ్,

2) రబీ,

3) జైద్ (Zaid).

ఖరీఫ్ పంటలు : 

         ఖరీప్ పంటలను సాధారణంగా నైరుతీ రుతుపవనాల ఆగమనంతో విత్తుతారు. అదే రుతుపవన కాలం చివరలో పంటలను కోస్తారు (Harvest). అంటే, ఇవి జూన్, జులై నెలల్లో విత్తి, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో కోసే పంటలు. ముఖ్యమైన ఖరీఫ్ పంటలు వరి, జొన్న, రాగి, మొక్కజొన్న, సజ్జ, పత్తి, జనుము, చెరకు, వేరుశనగ, నువ్వులు మొదలైనవి.

 

రబీ పంటలు : 

         రబీ పంటలను నవంబరు లేదా డిసెంబరులో విత్తి, మార్చి, ఏప్రిల్‌లలో నూరుస్తారు. సామాన్యంగా రబీ పంట ఈశాన్య రుతుపవనాల కాలంలో ప్రారంభమవుతుంది. ముఖ్యమైన రబీ పంటలు. గోధుమ, బార్లీ, బంగాళాదుంపలు, చిక్కుళ్లు, ఆవాలు మొదలైనవి. రబీ పంట పండించే విస్తీర్ణం 45 మి.హె.లు. (మొత్తం సాగుభూమిలో 35.7%). రబీ పంటలో ప్రథమ స్థానం ఉత్తర ప్రదేశ్‌ది. రెండో స్థానం మధ్యప్రదేశ్, ఆ తరువాత స్థానాలను వరుసగా మహారాష్ట్ర, పంజాబ్, ఆంధ్రప్రదేశ్‌లు ఆక్రమిస్తాయి. కొన్ని ప్రదేశాల్లో నీటి పారుదల సౌకర్యాలున్న ప్రాంతాల్లో కొన్ని పంటలను ఖరీఫ్, రబీ రెండు కాలాల్లో పండిస్తారు. ఉదా: వరి, వేరుశనగ, జొన్న, మొక్కజొన్న మొదలైనవి.

 

జైద్ పంటలు : 

         కృత్రిమ నీటి పారుదల సౌకర్యాలు కలిగిన ప్రాంతాల్లో సంవత్సరం పొడవునా పండించేందుకు జైద్ పంటలు అనువైనవి. ఈ పంటలను జైద్ ఖరీఫ్, జైద్ రబీ పంటలుగా విభజించవచ్చు.

జైద్ ఖరీఫ్ పంటలు : 

         దీనికి చెందిన పంటలను ఆగస్టు - సెప్టెంబరు నెలల్లో విత్తి, డిసెంబరు - జనవరి నెలల్లో కోస్తారు. ముఖ్యమైన జైద్ ఖరీఫ్ పంటలు వరి, జొన్న, పత్తి, నూనెగింజలు.

జైద్ రబీ పంటలు : 

         ఈ పంటలను ఫిబ్రవరి - మార్చిలలో ప్రారంభిస్తారు. ఏప్రిల్ - మే నెలల్లో కోస్తారు.

ముఖ్యమైన పంటలు : 

         తర్పూజ కాయలు, దోసకాయలు, ఆకుకూరలు, ఇతర కాయగూరలు.

పంటల వర్గీకరణ : 

         పంటలను ఆహార, ఆహారేతర పంటలని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు.

1. ఆహార పంటలు (Food Crops)
         మానవుడికి ఆహారంగా పనికొచ్చే పంటలను ఆహారపంటలంటారు. ఆహార ధాన్యాలు, నూనెగింజలు ఈ వర్గంలోకి వస్తాయి. ఈ వర్గాన్ని ఆహార ధాన్యాలు, పప్పు దినుసులు, నూనెగింజలు, పానీయాలు మొదలైనవాటి ఉపవర్గాలుగా విభజించవచ్చు. 

ఆహారధాన్యాలు (Food Grains) : 
         తృణ ధాన్యాలను, పప్పు దినుసులను కలిపి ఆహార ధాన్యాలుగా పిలుస్తారు. తృణధాన్యాలను మనిషి వివిధ రూపాల్లో ఉపయోగించుకుంటాడు.
 వరి, గోధుమ, మొక్కజొన్న, జొన్న, సజ్జ, బార్లీ అనేవి భారతదేశంలో చాలా ముఖ్యమైన ఆహారధాన్యాలు.

పప్పు ధాన్యాలు (Pulses) : 
         భారతదేశంలో పండించే పప్పు దినుసుల్లో సెనగ, కంది, పెసర, మినుములు ముఖ్యమైనవి. ఇవి కూడా ధాన్యపు పంటలే కానీ, వీటిని పప్పు దినుసుల రూపంలోనే వినియోగిస్తారు. ఇది ప్రజలకు ప్రధాన ఆహారం (Staple Food) కాదు.
నూనెగింజలు (Oil Seeds) : 
         నూనెగింజలను ఆహారధాన్యాలుగా పరిగణించరు. నూనెను వెలికితీయడానికి తగిన గింజలనిచ్చే పంటల్లో ఆవ, పొద్దుతిరుగుడు, వేరుశనగ, ఆముదం మొదలైన పంటలు ముఖ్యమైనవి.

పానీయాలు : 
         
భారతదేశంలో తేయాకు, కాఫీ అత్యంత ముఖ్యమైన పానీయ రకం పంటలు.

2. ఆహారేతర పంటలు
వాణిజ్య పంటలు (Commerical Crops) : 
         ఇవి జీవనోపాధి పంటలకు భిన్నమైనవి. వీటిని ప్రధానంగా మార్కెట్ చేయడానికి పండిస్తారు. వీటి ఉత్పత్తిలో కొంత భాగాన్ని మాత్రమే రైతులు స్వయంగా వినియోగించుకుంటారు. చెరకు, పత్తి అనేవి ముఖ్యమైన వాణిజ్య పంటలు. వీటిని నగదు పంటలని కూడా అంటారు.

తోటలరూపంలోని పంటలు (Plantation Crops) : 
         కొన్ని సందర్భాల్లో తోటల రూపంలో పండించే పంటలను ఒకసారి మాత్రమే నాటి, కొన్ని సంవత్సరాలపాటు పంట తీసుకుంటారు. ఇలాంటి పంటల్లో చాలాభాగం చెట్లరూపంలోనే ఉంటాయి.
కాఫీ, తేయాకు, రబ్బరు తోటల రూపంలోని పంటల్లో ముఖ్యమైన ఉదాహరణలు.

ఉద్యానవన పంటలు (Horticultural Crops) : 
         భారతదేశంలోని వివిధరకాల శీతోష్ణస్థితి, మృత్తికలు (నేలలు) దేశంలో వివిధరకాల ఉద్యానవన పంటలు (పండ్ల తోటలు) పెంచడానికి అనువుగా ఉన్నాయి. ఈ ఉద్యానవన పంటలు పలువురికి ఉపాధిని కూడా కల్పిస్తున్నాయి. 
         పండ్ల తోటల పెంపకంలో భారతదేశం ఇటీవల బ్రెజిల్‌ను అధిగమించి ప్రపంచంలో ప్రథమస్థానాన్ని ఆక్రమించింది. పండ్ల ఉత్పత్తిలోనే కాకుండా అరటి, ఉల్లి, జీడిపప్పు పంటల్లో కూడా భారతదేశం ప్రపంచంలో ప్రథమస్థానాన్ని ఆక్రమిస్తుంది. 
         ఇక కాయగూరల ఉత్పత్తి విషయంలో భారత్ ప్రపంచంలో చైనా తరువాత రెండో స్థానంలో ఉంది. దేశంలో ప్లాంటేషన్ పంటల విస్తీర్ణం కూడా ప్రతి సంవత్సరం పెరుగుతోంది. ఇటీవలికాలంలో కాయగూరలు, పండ్లు, సుగంధ ద్రవ్యాలు, పూలు, టిష్యూకల్చర్‌కు సంబంధించిన మొక్కల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ఉద్యానవనశాఖ పంటల అభివృద్ధి పథకాల్లో పండ్లు, కాయగూరలు, జీడిపప్పు, కొబ్బరికాయలు, సుగంధ ద్రవ్యాలు, దుంపలు, వాణిజ్య పుష్పాలు, పుట్టగొడుగులు, ఔషధ మొక్కలు మొదలైనవి ఉన్నాయి.

సుగంధ ద్రవ్యాలు (Spices) : 
         మిరియాలు, ఏలకులు, ఎండు మిరప, పసుపు వంటి పంటలు ఈ వర్గంలోకి వస్తాయి. వీటిని సాధారణంగా నగదు పంటలుగా పండిస్తారు. వీటిలో కొన్నింటిని తోటల రూపంలో కూడా పండిస్తారు.

నార (పీచు) పంటలు (Fiber Crops) : 
         ఈ పంటలను కూడా సాధారణంగా నగదు పంటలుగా పండిస్తారు. జనుము, పత్తి అనేవి భారతదేశంలో అత్యంత ముఖ్యమైన నార (పీచు) పంటలు.

పశుగ్రాస పంటలు (Fodder Crops) : 
         సాధారణంగా పచ్చటి పశుగ్రాసంగా వాడే పంటలు ఉన్నాయి. అలాంటివాటికి బెర్సీం ఒక ఉదాహరణ. కొన్ని పశుగ్రాస పంటలను పక్వమయ్యేవరకూ ఉంచితే అవి ధాన్యం కూడా ఇస్తాయి.
ఉదా: జొన్న.

వ్యవసాయ పద్ధతులు (Types of Cultivation)
       పంటలను వివిధ వర్గాల కింద విభజించడం సంప్రదాయమైనా ఈ వర్గాలన్నీ పరస్పరం భిన్నమైనవి కావు.          వర్గీకరణ ప్రాతిపదిక మీద ఆధారపడి, ఎన్నోరకాల పంటలను ఒక వర్గం కంటే ఎక్కువ వర్గాల్లో కలపవచ్చు. పర్యావరణం మీద ఆధారపడి భారతదేశంలో వివిధరకాల వ్యవసాయ పద్ధతులు అమల్లో ఉన్నాయి.
కొన్ని ముఖ్యమైన వ్యవసాయ పద్ధతులు :

1. స్థిర వ్యవసాయం (Sedentary Cultivation) : 
         సంవత్సరం తర్వాత సంవత్సరం అదే భూమిని వినియోగించుకుంటూ చేసే వ్యవసాయ పద్ధతి ఇది. భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో ఇది సర్వసాధారణమైన వ్యవసాయ పద్ధతి.

2. విస్థాపన వ్యవసాయం (Shifiting Cultivation) : 
         ఇది స్థిర వ్యవసాయానికి పూర్తిగా భిన్నమైన పద్ధతిలో ఉంటుంది. భూమిలో సారత్వ స్థాయి పడిపోయేవరకు కొన్ని సంవత్సరాల పాటు మాత్రమే భూమిని వినియోగిస్తారు. ఆ తర్వాత రైతు కొత్త భూమిని ఆశ్రయిస్తాడు. ఈ పద్ధతిని ఎక్కువగా గిరిజనులు అనుసరిస్తారు. ఈ పద్ధతిని అస్సాంలో 'ఝూమ్ అని, కేరళలో 'పోణం అని ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాలలో పోడు అని, మధ్యప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో బీవర్ మాషా 'పెండ్, 'బెర అని పిలుస్తారు.

3. వేదిక (Terrace) వ్యవసాయం : 
         పర్వత ప్రాంతాల్లో భూమి వినియోగానికి సంబంధించి, స్థిర వ్యవసాయానికి భిన్నం కాని తరహాలో వేదికలేర్పరచిన (Terrace) క్షేత్రాల్లో వ్యవసాయం చేస్తారు.

4. నీటిపారుదల వ్యవసాయం (Wet of irrigated Cultivation) : 
         నీటిపారుదల సహాయంతో చేసే వ్యవసాయ పద్ధతి. వరి, చెరకు పంటలు ఈ పద్ధతి వ్యవసాయానికి ముఖ్యమైన ఉదాహరణలు.

5. మెట్టసాగు (Dry Cultivation) : 
         నీటిపారుదల సౌకర్యాలు లేని ప్రాంతాల్లో మెట్ట సాగును అనుసరిస్తారు. ఇలాంటి ప్రాంతాల్లో పండే పంటలు, శుష్కమైన అశాస్త్రీయ పరిస్థితులను తట్టుకుంటాయి. కొన్ని ప్రాంతాల్లో సాధారణంగా నీటిపారుదల సౌకర్యాలతో పండే పంటలు కూడా నీటిపారుదల సౌకర్యం లేకుండానే పండుతాయి.

6. పంటల మార్పిడి (Crop Rotation) : 
         వివిధ రకాల పంటలను ఒకదాని తరువాత ఒకటిగా పండించే పద్ధతి. దీనివల్ల భూసారం తగ్గిపోదు.

7. మిశ్రమ, బహుళ పంటల విధానం (Mixed and Multiple Cropping) : 
         కొన్ని సందర్భాల్లో వివిధ పరిపక్వ కాలాలున్న అనేక పంటలను కలిపి పండిస్తారు. దీన్ని మిశ్రమ పంట విధానం అంటారు. మరోవైపు ఒక సంవత్సరంలో నిర్ణీత భూభాగంలో వరుసగా రెండు లేదా అంతకంటే ఎక్కువ పంటలను పండించడాన్ని అనేక పంటల విధానం అంటారు. నీటిపారుదల వ్యవసాయం ఉన్న ప్రాంతాల్లో ఇలాంటి పద్దతి సర్వసాధారణం.

8. అంతర పంటల విధానం (Inter - Cropping) :
         రెండు వేర్వేరు పంటలను ఒకేసారి ఒకే భూమిలో పండించే విధానాన్ని అంతర పంటల విధానం అంటారు.

9. మిశ్రమ వ్యవసాయం (Mixed Farming) : 
         ఒకే భూమిలో వ్యవసాయానికి, పశుపోషణకు అవసరమైన పంటలు పండించే విధానాన్ని అనుసరించడం మిశ్రమ వ్యవసాయం. ఉదా: పాడి, కోళ్ల పరిశ్రమ, పందులు, చేపల పెంపకం మొదలైనవాటితో పాటు వ్యవసాయం.

10. సాంద్ర, విస్తృత వ్యవసాయం (Intensive and Extension Farming) : 
            వ్యవసాయ శాస్త్ర విజ్ఞానంలో ఇటీవల రెండు పదాలను తరచుగా ఉపయోగిస్తున్నారు. అవి సాంద్ర, విస్తృత వ్యవసాయం. ఒక చిన్న భూ ఖండాన్ని సాంద్రతరంగా సాగుచేసే పద్ధతే సాంద్ర వ్యవసాయం.
ఈ పద్ధతిలో ఒక యూనిట్ విస్తీర్ణానికి ఉపయోగించే మానవ శ్రమ, ఎరువులు, రసాయనిక ఎరువులు మొదలైనవి చాలా అధిక స్థాయిలో ఉంటాయి. ఇది శ్రమ సాంద్రమైన పద్ధతి. అధిక జన సాంద్రత, ఒక్కో హెక్టారుకు వచ్చే దిగుబడులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఈ పద్ధతిని అనుసరిస్తారు. పశ్చిమ బెంగాల్‌లోని వరి సాగు సాంద్ర వ్యవసాయానికి ఉదాహరణ. ఈ వ్యవసాయ పద్ధతిలో ఒకే భూమిలో సాధ్యమైనన్ని ఎక్కువపంటలు పండించడానికి రైతులు ప్రయత్నిస్తారు. 
         విస్తృత వ్యవసాయం దీనికి పూర్తిగా భిన్నమైంది. యంత్రాల సహాయంతో పెద్ద పెద్ద వ్యవసాయ క్షేత్రాల్లో ఈ పద్ధతిని అనుసరిస్తారు. దీనిలో వినియోగించాల్సిన శ్రామిక శక్తి, జంతు శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి, జనసాంద్రత తక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే ఈ పద్ధతి సాధ్యమవుతుంది. ఒక్కో హెక్టారుకు వచ్చే ఉత్పత్తి లేదా రసాయనిక ఎరువుల వినియోగం బాగా తక్కువే. ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియాల్లోని గోధుమ సాగుకు ఈ పద్ధతి ఉదాహరణ. పంటల్లో ప్రత్యేకీకరణ అనేది విస్తృత వ్యవసాయంలో గుర్తుంచుకోదగింది.

Posted Date : 06-11-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌