• facebook
  • whatsapp
  • telegram

భారతదేశ నదీ వ్యవస్థ - 2

ద్వీపకల్ప నదులు   (దక్షిణ భారతదేశ నదులు)

మహానది 

* ఛత్తీస్‌గఢ్‌లోని అమర్‌కంటక్‌ పీఠభూమిలో ఉన్న దండకారణ్యంలో ‘సిహావా’ వద్ద జన్మించింది.

* దీని పొడవు 857 కి.మీ.

* ఈ నది ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల మీదుగా ప్రవహించి, కటక్‌ వద్ద డెల్టాను ఏర్పరిచింది.

* ఇది కటక్‌ వద్ద నూన, భార్గవి, కుష్‌భద్ర, దయా అనే శాఖలుగా విడిపోయింది. దయాశాఖ చిలుక సరస్సులోకి ప్రవహిస్తుంది.

మహానదిని ‘ఒడిశా దుఃఖదాయిని’ (Sorrow of Odisha) అంటారు.

* మహానది మొత్తం పరీవాహక ప్రాంతం 1,42,600 చ.కి.మీ. 

* ప్రపంచంలోనే అతి పొడవైన ప్రాజెక్టు హీరాకుడ్‌. దీన్ని ఒడిశాలో మహానదిపై నిర్మించారు.

‘సత్‌ కోషియా గార్జ్‌’ మహానది వల్ల ఏర్పడింది.


ఉపనదులు

 ఎడమవైపు ప్రవహించేవి: సియోనాథ్, ఇబ్, మాండ్, హస్‌దో.

కుడివైపు ప్రవహించేవి: బంగ్, జోంక్, తెల్‌.

మహానది ఉపనదుల్లో పొడవైంది - సియోనాథ్‌

మహానది ఉపనదుల్లో పెద్దది - హస్‌దో

* కోర్బా బొగ్గు క్షేత్రాలు హస్‌దో నది ఒడ్డున ఉన్నాయి.


వంశధార నది 

* ఇది ఒడిశాలోని తూర్పు కనుమల్లో భాగంగా ఉన్న జయపూర్‌ కొండల్లో జన్మించింది. 

* పొడవు 254 కి.మీ.

ఈ నది ఒడిశా నుంచి శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం వద్ద ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. ఇది కళింగపట్నం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.

* తూర్పు కనుమల్లో పుట్టి బంగాళాఖాతంలో కలిసే నదుల్లో అతిపెద్దది వంశధార. 

* వంశధారా నదిపై శ్రీకాకుళం జిల్లాలో రేగులపాడు బ్యారేజీ, వెంగళరాయసాగర్‌ ప్రాజెక్టు ఉన్నాయి.

* ఈ నదికి ప్రధాన ఉపనది మహేంద్రతనయ.


నాగావళి నది 

* ఒడిశాలోని రాయ్‌గఢ్‌ కొండల్లో జన్మించి, శ్రీకాకుళం జిల్లాలోని మోఫస్‌బందర్‌ (mofusbandar) వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.

*ఈ నది పొడవు 256 కి.మీ. నాగావళి నదికి ఉన్న మరొక పేరు లాంగుల్య నది.

* రాయ్‌గఢ్, శ్రీకాకుళం పట్టణాలు ఈ నది ఒడ్డున ఉన్నాయి.

ఉపనదులు: జంఝావతి, వేగవతి, బల్దియా, బర్హ.

* ఆసియాలోనే తొలి రబ్బరు డ్యాంను జంఝావతి నదిపై నిర్మించారు. ఇది ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లాలో ఉంది.


మాచ్‌ఖండ్‌ నది

* విశాఖపట్నంలోని మాడుగుల కొండల్లో జన్మించింది.

ఇది గోదావరికి ఉపనదిగా ఉన్న సీలేరులో కలుస్తుంది.

* డుడుమా జలపాతం మాచ్‌ఖండ్‌ నదిపై ఉంది.

* మాచ్‌ఖండ్‌ జల విద్యుత్‌ కేంద్రం ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుల్లో ఉంది.


బ్రాహ్మణి నది 

* ఒడిశాలోని సౌత్‌ కోయల్, శాంఖ నదుల కలయిక వల్ల ఏర్పడింది.

ఒడిశాలో మహానది తర్వాత రెండో పొడవైన నది. దీని పొడవు 480 కి.మీ.

* ఒడిశాలోని రూర్కెలా ఇనుము - ఉక్కు కర్మాగారానికి ఈ నది నుంచే నీటిని అందిస్తున్నారు.


సువర్ణరేఖ/ సుబర్నరేఖ నది 

* చోటా నాగ్‌పుర్‌ పీఠభూమిలో జన్మించింది.

ఝార్ఖండ్, పశ్చిమ్‌ బంగా, ఒడిశా రాష్ట్రాల మీదుగా ప్రవహించి ఒడిశాలోని కిర్తానియా పోర్టువద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.

* ఈ నది పొడవు 395 కి.మీ.

* రాంచి, జంషెడ్‌పుర్‌ పట్ణణాలు ఈ నది ఒడ్డున ఉన్నాయి.


స్వర్ణముఖి నది 

* తిరుపతి జిల్లాలోని చంద్రగిరి కొండల్లో జన్మించింది. ఇది శ్రీకాళహస్తి మీదుగా ప్రవహించి, బంగాళాఖాతంలో కలుస్తుంది.


పెన్నా/ పినాకిని నది 

* కర్ణాటకలోని నందిదుర్గ కొండల్లో జన్మించింది.

పెన్నానది పొడవు 597 కి.మీ.

* సత్యసాయి జిల్లాలోని హిందూపురం సమీపంలో ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాల మీదుగా ప్రవహించి నెల్లూరు జిల్లాలోని ఊటుకూరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.

* తూర్పువైపు ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలిసే నదుల్లో డెల్టాలను ఏర్పరచనిది పెన్నా నది మాత్రమే. 

* కడప జిల్లాలో ఎర్రమల లేదా గండికోట కొండలవద్ద ఇది గండికోట గార్జ్‌ను ఏర్పరచింది. దీన్ని ‘భారతదేశ గ్రాండ్‌ కాన్యోన్‌’గా పిలుస్తారు.

* పెన్నానదిపై నెల్లూరు జిల్లాలో సోమశిల ప్రాజెక్టును నిర్మించారు.


ఉపనదులు 

ఎడమవైపు ప్రవహించేవి: జయమంగళి, కుందేరు, సగిలేరు.

కుడివైపు ప్రవహించేవి: చిత్రావతి, పాపాఘ్ని, చెయ్యేరు.

చెయ్యేరు నదిపై అన్నమయ్య జిల్లాలోని రాజంపేట సమీపంలో అన్నమయ్య ప్రాజెక్టు నిర్మించారు.

* పెన్నానదిని ‘రాయలసీమ జీవనాడి’  (Lifeline of the Rayalaseema) అంటారు.

* సలిగేరు నల్లమల, వెలికొండల మధ్య ప్రవహిస్తుంది.

* కుందేరు ఎర్రమల, నల్లమల కొండల మధ్య ప్రవహిస్తుంది.


కావేరి నది 

కర్ణాటకలోని కూర్గ్‌ జిల్లాలో ఉన్న బ్రహ్మగిరి కొండల్లో తలైకావేరి అనే ప్రదేశంలో జన్మించింది. పొడవు 805 కి.మీ.

కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో దీని నదీ పరీవాహక విస్తీర్ణం ఉంది.

* కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మీదుగా ప్రవహించి తమిళనాడులోని పూంపుహార్‌ వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.

* దేశంలో నైరుతి, ఈశాన్య రుతుపవనాల వల్ల వర్షపాతాన్ని పొందే ఏకైక నది కావేరి.

*ద్వీపకల్ప నదుల్లో జీవనది కావేరి. దీన్ని దక్షిణ భారతదేశ జీవనది అంటారు.

* ఇది తిరుచిరాపల్లిలోని శ్రీరంగం వద్ద రెండు (ఉత్తర, దక్షిణ) శాఖలుగా విడిపోయి ‘శ్రీరంగం ద్వీపాన్ని’ ఏర్పరిచింది. ఉత్తర శాఖను ‘కోవెరూన్‌’, దక్షిణశాఖను ‘కావేరి’ అంటారు.

కావేరి నది కర్ణాటకలో సన్నటి ‘మేకదాటు’ గార్జ్‌ను ఏర్పరిచింది.

* కావేరి నదిపై శివసముద్ర జలపాతం, హొగినేకల్‌ జలపాతం ఉన్నాయి.

శివసముద్ర జలపాతాన్ని ‘భారాచుక్కి జలపాతం’ అనికూడా అంటారు. ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉంది. దీనిపై 1902లో ఆసియాలోనే మొదటి జల విద్యుత్‌ ప్రాజెక్టును నిర్మించారు. శేషాద్రి అయ్యర్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఈ ప్రాజెక్ట రూపకల్పన చేశారు.

* హొగినేకల్‌ జలపాతం తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లో ఉంది.


ఉపనదులు 

కుడివైపు ప్రవహించేవి: కబని, సువర్ణావతి, భవాని, లక్ష్మణతీర్థ, అమరావతి, నోయ్యల్‌.

ఎడమవైపు ప్రవహించేవి: హేమావతి, ఆర్కావతి, షింస, హరంగి.

కావేరి నది ఉపనదుల్లో పొడవైంది - కబని. దీని పొడవు 236 కి.మీ.

* బెంగళూరు ఆర్కావతి నదీ పరీవాహక ప్రాంతంలో ఉంది.

* ఊటీ భవానీనదీ పరీవాహక ప్రాంతంలో ఉంది.

* కోయంబత్తూరు పట్టణం నోయ్యల్‌ నది ఒడ్డన ఉంది.


పరస్థానీయ నదులు లేదా ఎక్సోటిక్‌ నదీ వ్యవస్థ

నీటి లభ్యత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లేదా అధిక వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో జన్మించి, ఎడారి ప్రాంతాల మీదుగా ప్రవహిస్తూ, అక్కడి పంట పొలాలకు సాగునీటిని అందించే నదులను ‘ఎక్సోటిక్‌ రివర్స్‌’ అంటారు.

* ఎడారుల్లో వర్షం కురిసినప్పుడు ఏర్పడే తాత్కాలిక నీటి ప్రవాహ వాగులను వాడీలు అంటారు.

* ఎడారుల్లోని ఉప్పునీటి సరస్సులను ‘ప్లయాలు’ అని, మంచినీటి సరస్సులను ‘ఒయాసిస్‌’ అని అంటారు.


ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎక్సోటిక్‌ నదులు - ప్రవహించే ఎడారులు - ఖండం 

 నది  ఎడారి ఖండం
నైలునది సహారా ఎడారి  ఆఫ్రికా

సింధూ నది
థార్‌ ఎడారి ఆసియా
టైగ్రిస్‌ నది అరేబియా ఎడారి  ఆసియా
ఆరెంజ్‌ నది  కలహారి ఎడారి ఆఫ్రికా
కొలరాడో నది సొనారన్‌  ఎడారి ఉత్తర అమెరికా
డార్లింగ్‌ నది  గ్రేట్‌  ఆస్ట్రేలియా  ఎడారి 
 
ఆస్ట్రేలియా

అమెజాన్‌ నది
అటకామా ఎడారి   దక్షిణ  అమెరికా

 

అంతర్భూభాగ నదీ వ్యవస్థ

* సాధారణంగా నదులు సముద్రాల్లో కలుస్తాయి. కానీ వర్షాభావ (వర్షాలు లేని) ప్రాంతాల్లో ప్రవహించే కొన్ని నదులు తమ ప్రవాహాన్ని సముద్రం వరకు చేరవేయకుండా మార్గమధ్యలో ఉన్న ఉప్పునీటి సరస్సుల్లో లేదా ఇసుక రేణువుల వద్దే ఆగిపోతే అలాంటి వాటిని అంతర్భూభాగ నదులు అంటారు.

ప్రపంచంలో అతిపెద్ద అంతర్భూభాగ నది ఓల్గా  (Volga)

* భారతదేశంలో అతిపెద్ద అంతర్భూభాగ నదీ వ్యవస్థ ఉన్న రాష్ట్రం రాజస్థాన్‌.

* భారతదేశంలోని అంతర్భూభాగ నదులు:

 1. లూని    2. ఘగ్గర్‌   3. బాణి


లూని నది: 

* ఆరావళి పర్వతాల్లోని అజ్మీర్‌ సమీపంలో ఉన్న అన్నాసాగర్‌లో జన్మించింది. ఇది పుష్కర్‌ సరస్సు మీదుగా ప్రవహిస్తూ గుజరాత్‌లోని రాణ్‌ ఆఫ్‌ కచ్‌ ప్రాంతం వద్ద ఆగిపోతుంది.

* ఈ నది పొడవు 462 కి.మీ. భారతదేశ ఎడారి మీదుగా ప్రవహించే ఏకైక నది.

* వాయవ్య భారతదేశంలో అతిపెద్ద నది లూని.

* ఈ నదికి ఉన్న పేర్లు: లవణవతి, లోనరి, సాల్ట్‌ రివర్‌.

ఉపనదులు: బండి, సుక్రి, మిత్రి, జువాయి. 

* లూని ఉపనదుల్లో పొడవైంది జువాయి.

* జశ్వంత్‌ సాగర్‌ డ్యాం జువాయి నదిపై ఉంది.


ఘగ్గర్‌ నది: 

* హిమాచల్‌ప్రదేశ్‌లోని శివాలిక్‌ కొండల్లో జన్మించింది.

* పంజాబ్, హరియాణా, రాజస్థాన్‌ రాష్ట్రాల మీదుగా ప్రవహించి రాజస్థాన్‌కు దక్షిణంగా ఉన్న హనుమాన్‌ఘర్‌ వద్ద ఇసుక రేణువుల్లో ఆగిపోతుంది.

* మనదేశంలో అతిపెద్ద అంతర్భూభాగ నది ఘగ్గర్‌. దీని పొడవు 465 కి.మీ.

ఉపనదులు: మార్కండేయ, తంగ్రి, చైతన్య, సరస్వతి, కౌసల్య.

బాణినది: 

 * రాజస్థాన్‌లోని జైసముంద సరస్సు వద్ద ప్రారంభమై, థార్‌ ఎడారి మీదుగా ప్రవహిస్తూ సాంబార్‌ సరస్సులో కలుస్తుంది.

Posted Date : 21-01-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌