• facebook
  • whatsapp
  • telegram

ఇనుపయుగం - ఇతర సంస్కృతులు

మెగాలిథిక్‌ కల్చర్‌

* ఈ కాలం ప్రజలు కొడవళ్లు, గొడ్డళ్లు లాంటి పనిముట్లను ఎక్కువగా ఉపయోగించారు. దీంతో వీరు స్థిరమైన వ్యవసాయం చేయలేదని చరిత్రకారులు పేర్కొన్నారు. కానీ విదర్భ, తమిళనాడు, ఉత్తర దక్కన్‌ ప్రాంతాల్లో వివిధ రకాల పంటలు పండించారు. ముఖ్యంగా తృణధాన్యాలు, కాయగూరలు, వరి, మినుములు సాగు చేసినట్లు ఆనవాళ్లు లభించాయి. 

* కుండలు ఎరుపు, నలుపు రంగుల్లో ఉండేవి. వీటిపై కత్తులు, బాకులు, బాణం తలలు, గొడ్డలి, కొడవలి, త్రిశూలం బొమ్మలు గీశారు. వీటి ద్వారా వీరు ఇనుము వాడారని తెలుస్తోంది.

* ఈ కాలంలో మరణించినవారిని లోతైన గోతిలో పూడ్చి, ఈ సమాధుల చుట్టూ పెద్ద రాళ్లను ఉంచేవారు. ఇదే మెగాలిథిక్‌ కల్చర్‌ ప్రధాన లక్షణం. ద్వీపకల్ప భారతదేశంలో కనుక్కున్న ఈ కాలం నాటి శ్మశానవాటికల సముదాయాల్లో ఇనుప పనిముట్లు లభించాయి.


రకాలు

శవాలను పూడ్చే పద్ధతి, సమాధుల దగ్గర బండరాళ్లను అమర్చే విధానం ఆధారంగా మెగాలిథిక్‌ సంస్కృతిని మూడు రకాలుగా విభజించారు. అవి:

1. అర్థోస్టాట్‌              2. డోల్మెనాయిడ్‌ సిస్ట్‌                3. డోల్మెన్‌


అర్థోస్టాట్‌: భూమిలో లోతుగా గొయ్యి తీసి అక్కడ శవాన్ని పాతిపెడతారు. ఈ ప్రదేశాన్ని సిస్ట్‌ అంటారు. ఇది ఒక గది ఆకారంలో ఉంటుంది. సమాధి చుట్టూ రెండు లేదా నాలుగు నిలువు రాతి పలకలను అమర్చి, వీటిపైన క్షితిజసమాంతరంగా మరో రాతి పలకను ఉంచేవారు.

డోల్మెనాయిడ్‌ సిస్ట్‌: దీనికి అర్థోస్టాట్‌ లక్షణాలే ఉంటాయి. అయితే ఇందులో గది పాక్షికంగా భూగర్భంలో ఉంటుంది.

డోల్మెన్‌: గది పూర్తిగా భూమిపై ఉంటే దాన్ని ‘డోల్మెన్‌’ అంటారు.

లక్షణాలు: వీటిలో గది (ఛాంబర్‌) ప్రధానంగా ఉంటుంది. 

* ఈ గది నిలువు స్లాబ్‌లో ఒక దానికి రంధ్రం ఉంటుంది. దీన్ని port hole అంటారు.

* నిలువుగా, విభాగాలుగా విభజించించిన కొన్ని గదులను చరిత్రకారులు గుర్తించారు. వీటికి transepts అని పేరుపెట్టారు.

* ఈ గదుల దగ్గర వాడిన రాళ్లలోనూ తేడాలున్నాయి. టోపికల్స్‌గా పేర్కొనే బ్చ్మీHat stones (టోపీ రాళ్లు), కుడైకల్స్‌గా పిలిచే  Umbrella Stornes వాటి దగ్గర లభించాయి. ఇవి ఎక్కువగా కేరళ, కర్ణాటకల్లో కనిపిస్తాయి.

* టోపికల్‌లో మరణించిన వ్యక్తిని భూగర్భంలోని గొయ్యిలో ఉంచుతారు. తక్కువ ఎత్తుండే కుంభాకార, వృత్తాకార ముద్దరాయితో కప్పుతారు.

* కుడైకల్స్‌లో కలశాన్ని (urn), పెద్ద అర్ధగోళాకార రాయిని గదిలో ఉంచుతారు.

గది లేని శ్మశానవాటికలు: ఇవి రెండు రకాలు.

అవి: 1. పిట్‌ బరియల్స్‌   

        2. అర్న్‌ (urn) బరియల్స్‌ 


పిట్‌ బరియల్స్‌: ఇందులో ఖననం చేసే గొయ్యి చుట్టూ పెద్ద రాళ్లను వృత్తాకారంలో ఉంచుతారు. అంత్యక్రియల అవశేషాలను ఒక గొయ్యిలో పాతిపెడతారు. దీన్నే పిట్‌ సర్కిల్‌ అంటారు. దీని పైభాగంలో పెద్ద రాళ్ల కుప్ప ఉంటే దాన్ని ‘కైర్న్‌’ అంటారు.

* సమాధి చుట్టూ వృత్తాకార రాయి, కుప్పగా ఉన్న రాళ్లు ఉంటే దాన్ని ‘కైర్న్‌ స్టోన్‌’ అంటారు.

మెన్‌హిర్‌: ఖననం చేసిన గొయ్యి వద్ద ఒకే చోట పెద్దగా నిలబెట్టిన రాతి పలకలను మెన్‌హిర్‌ అంటారు.

సార్కోఫగస్‌ బరియల్స్‌: సమాధుల వద్ద కుండ లేదా పాత్రలో కొన్ని వస్తువులను ఉంచుతారు.

అర్న్‌ బరియల్స్‌: ఈ సమాధుల్లో కొన్ని వస్తువులను పెద్ద కుండ లేదా పాత్రలో ఉంచుతారు. వీటిలో కొన్నింటిని రాతిపలకతో కప్పుతారు. 

* అర్న్, సార్కోఫగస్‌ ఖననాలు ఎక్కువగా మెగాలిథిక్‌ సమాధుల్లో కనిపిస్తాయి. ఈ పద్ధతిలో సమాధులను పూర్తిగా రాళ్లతో కప్పి ఉంచుతారు. వీటి అమరికలు కొన్ని రేఖాగణిత నమూనాకు దగ్గరగా ఉన్నాయి. ఈ లక్షణాలున్న సమాధులు మెగాలిథిక్‌ సంప్రదాయానికి చెందిన స్మారక చిహ్నాలుగా గుర్తిస్తారు.


ఆచార సంప్రదాయాలు

* మెగాలిథిక్‌లో రాళ్ల ఆకారం, పరిమాణం వివిధ రకాలుగా ఉంటాయి. అప్పటి మానవుల నమ్మకాలను ప్రతిబింబించే నిర్మాణాలుగా ఈ సమాధులను పేర్కొంటారు. 

* వ్యక్తుల జీవితం, ఆచారాలు, మూఢనమ్మకాలు, మనిషిని ఖననం చేసే విధానం, నివాస స్థలాలు, చనిపోయిన వారి విషయంపై నమ్మకాలు మొదలైనవి ఈ మెగాలిథిక్‌ సంస్కృతిలోని శ్మశానవాటికల ద్వారా తెలుసుకోవచ్చు. 

* నియోలిథిక్, చాల్కోలిథిక్‌ సంస్కృతుల్లోనూ ఇలాంటి ఆచారాలు మనకు కనిపిస్తాయి.

* మనిషి అంత్యక్రియల విధానాలు, సమాధులు, వ్యక్తుల అవశేషాలను, వారి పద్ధతులు తెలుసుకోవడానికి ఈ సమాధులే ఆధారం.

* కొన్ని సమాధుల్లో సామూహిక ఖననం చేసిన ఆనవాళ్లు లభించాయి. ఒక కుటుంబానికి చెందిన అందరినీ ఒచే చోట సమాధి చేసే ఆచారం ఉన్నట్లు దీని ద్వారా తెలుస్తోంది. అయితే మరణించిన వారి శవాలను బట్టి వారు ఒకేకాలంలో మరణించారా లేదా మరేదైనా వ్యాధుల కారణంగా చనిపోయారా అనే దానిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి.

* సమాధిలో ఆయుధాలు, కుండలు, ఆభరణాలు, ఇతర వస్తువులను ఉంచేవారు.

చారిత్రక ఆధారాలు 

* మెగాలిథిక్‌ సంస్కృతి దక్షిణ భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో విలసిల్లింది. 

* తమిళనాడులోని పొత్తూర్, శంకరపురం, పల్లవరం, వయావూర్, పుడుకొట్టాయ్‌; కేరళలోని విల్లడం, ఇయ్యాల్‌ ప్రాంతాల్లో మెగాలిథిక్‌ కల్చర్‌కు సంబంధించిన సమాధుల అవశేషాలు లభించాయి. భారత పురావస్తు శాస్త్రవేత్త వి.డి. కృష్ణస్వామి వీటిపై పరిశోధనలు చేశారు.

* తమిళనాడులోని మోత్తూర్‌లో ఒక పెద్ద ఆంత్రోప్రోమార్ఫ్స్‌ (Snthropomorphs) ను కనుక్కున్నారు. దీనికి రెండు బాహ్య వృత్తాలు ఉంటాయి.

* మహారాష్ట్రలోనూ మెగాలిథిక్‌ సమాధులు, వాటి అనుబంధ నివాస నిక్షేపాలు, ఇనుప వస్తువులను గుర్తించారు. ముఖ్య ప్రదేశాలు: తక్లాఘాట్‌ - కాపా, నైకుంద్, మహర్‌ ఝరి, భాగిమొహరి, బోర్‌గాన్‌.


బ్లాక్‌ అండ్‌ రెడ్‌ వేర్‌ కల్చర్‌

ముఖ్య స్థావరాలు: బిహార్‌లోని చిరాండ్, సోన్‌పూర్, తారాడిహ్‌; పశ్చిమ్‌ బంగాలోని మహిస్‌దల్, అజయ్‌ వ్యాలీలో బ్లాక్‌ అండ్‌ రెడ్‌  వేర్‌ కల్చర్‌కి సంబంధించిన ముఖ్య స్థావరాలను కనుక్కున్నారు.


దక్షిణ భారతదేశంలోని మెగాలిథిక్‌ ప్రదేశాలు


తమిళనాడు: ఆడిచెన్నలూర్, అమృతమంగళం, కున్నాత్తూర్, సనూర్, టెంకారీ, కోవ్‌కాయ్, వసుదేవనల్లూర్, కాయల్, కలుగుమలై, పేరుమాల్‌మలై, పడుక్కోటై.

కర్ణాటక: బ్రహ్మగిరి, మస్కీ, హనమ్‌సాగర్, టెర్‌దల్‌-హంగేలీ, టి.నర్సీపూర్, హల్లూర్‌.

ఆంధ్ర: కదంబాపూర్, నాగార్జునకొండ, ఏలేశ్వరం, గొల్లపల్లి

* ఈ ఆనవాళ్లు శ్రీలంకలోనూ లభించాయి. 

*పాండిచ్చేరి యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసే కె. రాజన్‌ 2003లో తమిళనాడులోని పురుకొట్టై ప్రాంతంలో మెగాలిథిక్‌ స్థావరాలను నీటి  ప్రవాహాలకు దగ్గరగా కనుక్కున్నారు.

పెయింటెడ్‌ గ్రే వేర్‌ కల్చర్‌ (బూడిదరంగు వర్ణ పాత్ర సంస్కృతి)

* ఈ కల్చర్‌ పశ్చిమ గంగా మైదానం, ఘగ్గర్‌ - హక్రా నదీ లోయలో విలసిల్లింది. ఈ కాలంలో ప్రజలు బూడిద, ఎరుపు రంగుల్లో మట్టి కుండలు చేసి, వాటిపై కొన్ని గీతలతో డిజైనింగ్‌ చేశారు. వీటినే పెయింటెడ్‌ గ్రే వేర్‌ అంటారు.

* బ్రజ్‌ బసి లాల్‌ అనే భారత పురావస్తు శాస్త్రవేత్త ఈ సంస్కృతిపై పరిశోధనలు చేశారు. ఈయన మొదటిసారి 1946లో ఉత్తర్‌ ప్రదేశ్‌లోని అహిచ్చత్రలో జరిపిన తవ్వకాల్లో ఈ కుండలు లభించాయి. వీటికి ఆయన డీలక్స్‌ వేర్‌ అని పేరు పెట్టారు. రోపార్, కురుక్షేత్ర, పానిపట్, ఇంద్రప్రస్థ, మధుర, బైరాట్, సోనెపట్, అత్రాంజిఖేరా, అలంగీర్‌పుర్‌లో ఈ డీలక్స్‌ వేర్‌ లభించాయి.

* పెయింటెడ్‌ గ్రే వేర్‌కు సంబంధించి సుమారు 725 ప్రాంతాలకు పైగా కనుక్కున్నారు. వాటిలో ప్రధానమైనవి అహిచ్చత్ర, అలంగీర్‌పుర్, అల్లాపూర్, అత్రాంజిఖేరా, సర్దార్‌గర్, శ్రావస్థి, నోహ్, కంపిల, జఖేరా.

లక్షణాలు: ఈ కాలం నాటి కుండలను నాణ్యమైన మట్టితో తయారు చేశారు. వీటిపై రేఖాగణిత నమూనాలను నలుపురంగుతో చిత్రించారు.

* కుండలు ఏకరీతితో, వివిధ ఆకృతుల్లో ఉన్నాయి. దీని కోసం వీరు ఆధనాతన పద్ధతులను అవలంబించారు. 

* కొలిమిలో అధిక ఉష్ణోగ్రత వద్ద కుండలను కాల్చినప్పుడు, మట్టితో బ్లాక్‌ ఫెర్రస్‌ ఆక్సైడ్‌ కలిసి వీటికి బూడిదరంగు వచ్చింది. 

* చక్రం సాయంతో ఈ కుండలను తయారుచేసి, వాటి ఉపరితలంపై ఎమల్షన్‌ను పూసేవారు. 

* మట్టిలోని రకాల వల్ల కుండలు నలుపు, ఎరుపు రంగుల్లో ఉండేవి.

* ఈ కుండలపై చుక్కలు, వృత్తాలు, స్వస్తిక్, పూలు, సూర్యుడు లాంటి నమూనాలు ఉన్నాయి. ఈ రకమైనవి రాజస్థాన్‌లో నిర్వహించిన తవ్వకాల్లో లభించాయి.

* కుండలను రోజువారీ అవసరాలకు, ఆహారం వండుకోవడానికి, వస్తువులు - ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి ఉంపయోగించారు.

* ప్రజలు వరి, గోధుమ, బార్లీ మొదలైన పంటల పండించేవారు. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని అత్రాంజిఖేరా వద్ద వృత్తాకార బావులు, నివాస ప్రాంతాలను కనుక్కున్నారు. ఇనుముతో చేసిన నాగళ్లు, కొడవళ్లు, గొర్రు మొదలైనవాటిని వ్యవసాయానికి ఉపయోగించారు. రాజస్థాన్‌లోని జఖేరాలో నిర్వహించిన తవ్వకాల్లో ఈ అవశేషాలు లభించాయి.

* పశుపోషణ ఉండేది. గొర్రెలు, పశువులు, పందులకు చెందిన ఎముకలు తవ్వకాల్లో లభించాయి.

* యుద్ధాల్లో వాడే కత్తులు, బల్లేలు, ఈటెలు మొదలైనని కూడా కనుక్కున్నారు. వీటిని వేటకు కూడా వాడేవారు.

చారిత్రక ఆధారాలు 


* భారతీయ చరిత్రకారుడు మక్కన్‌లాల్‌ 1984లో కాన్పూర్‌ (యూపీ)లో ఈ సంస్కృతికి చెందిన 46 సైట్‌లను కనుక్కున్నారు.

* జార్జ్‌ ఎర్‌డోసీ అనే పురావస్తు శాస్త్రవేత్త 1988లో పెయింటెడ్‌ గ్రే వేర్‌ కల్చర్‌పై పరిశోధనలు చేశారు. ఈయన  అలహాబాద్‌ (యూపీ)లో ప్రజలు దాదాపు రెండంచెల స్థిరనివాసాలు ఏర్పటు చేసుకున్నట్లు గుర్తించారు. ఒక గ్రామంలో 60 నుంచి 450 మంది ప్రజలు నివసించేవారని తెలిపారు.

* హరియాణాలో ఈ సంస్కృతికి చెందిన 40 ప్రదేశాలు ఉన్నాయి.

* రాజస్థాన్‌లోని జోధ్‌పూర్, అహర్‌; మధ్య గంగా లోయ ప్రాంతం; ఉత్తర్‌ ప్రదేశ్‌లోని దాదాపూర్, మల్హార్, రాజా నల్‌ కీ తిల, ఝాన్సీ, గాన్‌వేరియా, కోల్డిహల్లో ఈ సంస్కృతి కనిపిస్తుంది.

Posted Date : 15-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌