• facebook
  • whatsapp
  • telegram

ఇనుప యుగం

* చాల్కోలిథిక్‌ ప్రజలు ఇనుమును విరివిగా ఉపయోగించారు. వీరు ఇనుమును కరిగించి వివిధ రకాల పనిముట్లను తయారు చేసేవారు. ఇనుమును కరిగించడానికి వాడిన కొలుములను పురావస్తు శాస్త్రవేత్తలు కనుక్కున్నారు.

* గట్టిదనం, మన్నిక విషయంలో రాగి కంటే ఇనుము మెరుగైనది కావడంతో దీన్ని ఎక్కువగా వినియోగించేవారు. రోజువారీ కార్యక్రమాలకు, ఉత్పత్తి ప్రయోజనాలు, వ్యవసాయం కోసం, కొడవళ్లు, ‘నాగలి’ లాంటి సాధనాల తయారీకి ఎక్కువగా వాడేవారు.

* క్రీ.పూ.1000-500 మధ్యకాలంలో గంగా పరీవాహక ప్రాంతంలో ఇనుము వాడిన ఆనవాళ్లు లభించాయి. ఇదే ఇనుప యుగ ఆరంభానికి నాందిగా చెప్పుకోవచ్చు.

* వాయవ్య బెలూచిస్తాన్, గంగాలోయ, రాజస్థాన్, తూర్పు భారతదేశంలో మాల్వా, మధ్యభారతదేశంలో విదర్భ, దక్కన్, దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇనుమును కరిగించే, వస్తువు తయారీ పరిశ్రమలు ఉండేవి. 

* ఇనుము ఇండో-ఆర్యన్ల ద్వారా భారత ఉపఖండంలోకి ప్రవేశించిందని కచ్చితంగా చెప్పలేమని, పశ్చిమాసియా లేదా ఇతర మార్గాల ద్వారా ఇనుము వాడకం ప్రారంభమై ఉండవచ్చని ఆచార్య చక్రవర్తి అభిప్రాయపడ్డారు.

* భారత్‌లో కాంస్య యుగం తర్వాత ఇనుప యుగం వచ్చింది. ఇది పాక్షికంగా భారతదేశంలో మెగాలిథిక్‌ సంస్కృతులకు అనుగుణంగా ఉంది. భారతదేశంలో ఇతర ఇనుప యుగ పురావస్తు సంస్కృతులు పెయింటెడ్‌ గ్రే వేర్‌ (painted grey ware క్రీ.పూ.1300 - 300), నార్తన్‌ బ్లాక్‌ పాలిష్డ్‌ వేర్‌ (northern black poilshed ware క్రీ.పూ 700 - 200) ల్లో కన్పిస్తాయి. వేదకాలం, మహాజనపదాల కాలాల్లోనూ దీని వాడకం ఉండేది. మగధ సామ్రాజ్య విస్తరణకు కూడా ఇది ఒక ప్రధాన కారణం.

* రేడియో కార్బన్‌ డేటింగ్‌ (C14) ప్రకారం ఉత్తర భారతదేశ తవ్వకాల్లో ముఖ్యంగా ఇనుప కొలిమి, దానికి సంబంధించిన సాక్ష్యాలు లభించాయి

* దీంతో మధ్యగంగా మైదానం, వింధ్య (తూర్పు) పర్వతాల్లో క్రీ.పూ. 1800-1000 మధ్యకాలంలో ఇనుము వాడకం ఉండేదని తెలుస్తోంది. దీని వాడకంతో ఉత్తర్‌ప్రదేశ్, బిహార్‌ రాష్ట్రాల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి.

* రాకేశ్‌ తివారీ అభిప్రాయం ప్రకారం భారతదేశం ఇనుము తయారీ రంగంలో ఒక ప్రముఖ కేంద్రంగా అభివృద్ధి చెందింది. 

* క్రీ.పూ. 1000 నాటి ఇనుము వాడకపు ఆనవాళ్లు దక్షిణ భారతదేశంలో లభ్యమయ్యాయి. 

* నాటి తొలి ఇనుప యుగ ప్రదేశాలైన కర్ణాటకలోని హల్లూరు, తమిళనాడులోని ఆదిచల్లనూరులో ఇవి వెలుగు చూశాయి. నాగ్‌పుర్‌లో (మహూర్ఘరి) పూసల పరిశ్రమ ఉండేది.

* చాల్కోలిథిక్‌ కాలం ముగిసే నాటికి భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లో గ్రామీణ స్థావరాలు ఏర్పడి భౌతిక సంస్కృతిలో మార్పులు వచ్చాయి.

సాధారణంగా మానవ చరిత్రను మూడు భాగాలుగా విభజించవచ్చు. 

1. రాతి యుగం     2. కాంస్య యుగం     3. ఇనుప యుగం

* ప్రపంచ చరిత్రలో ఇనుప యుగం క్రీ.పూ.1300లో ప్రారంభమైందని కొంతమంది పురావస్తు శాస్త్రవేత్తలు వాదించారు. ఇనుప యుగం క్రీ.పూ.1200లో మధ్యధరా ప్రాంతం, సమీప ప్రాచ్యంలో ప్రారంభమైందని తెలిపారు.  భారతదేశంలో క్రీ.పూ. 1500-200 మధ్యలో ఇనుప యుగం విలసిల్లిందని చరిత్రకారుల వాదన. దక్షిణాసియాలోని ముండిగాక్‌ కొన్ని ఇనుప వస్తువులు క్రీ.పూ. 3వ సహస్రాబ్దిలో లభించాయి. 

* భారతదేశంలోని తెలంగాణలోనూ చిన్న కత్తులు, బేడ్లు లాంటి పరికరాలు క్రీ.పూ. 2400-1800 మధ్యకాలంలో కనుక్కున్నారు. 

* భారతీయ ఉపనిషత్తుల్లో లోహశాస్త్రం గురించి ప్రస్తావన కనిపిస్తుంది. మౌర్యుల కాలంనాటికి లోహశాస్త్రం బాగా అభివృద్ధి చెంది పలు రకాల ఇనుప పనిముట్లను తయారు చేశారు.

* బెనర్జీ అభిప్రాయం ప్రకారం క్రీ.పూ 1000 నాటికి ఇనుము వాడకం ప్రారంభమైందని, క్రీ.పూ. 800 నాటికి ఇనుము వాడకం సాధారణంగా మారింది.

* ఇనుప యుగం పెయింటెడ్‌ గ్రే వేర్‌ కల్చర్‌తో ముడిపడి ఉంది. మొట్టమొదట అహిచ్చత్రలో డీలక్స్‌ వేర్‌ (delux ware) గా లభించగా, హస్తినాపూర్‌లో వేరు చేశారు. రోపార్, కురుక్షేత్ర, పానిపట్, ఇంద్రప్రస్థ, మధుర, బైరాట్, సోనెపట్, అత్రాంజిఖేరా, అలంగీర్‌పుర్‌లో ఈ డీలక్స్‌ వేర్‌ సంస్కృతి ఉండేది.

* హస్తినాపూర్‌లో గాజు పూసలు, గాజులు, ఎముకల డిస్క్‌లతో పాటు రాగి వస్తువులు లభించాయి.

* పెయింటెడ్‌ గ్రే వేర్‌కు సంబంధించి సుమారు 725 ప్రాంతాలకు పైగా కనుక్కున్నారు. వాటిలో అహిచ్చత్ర, అలంగీర్‌పుర్, అల్లాపూర్, అత్రాంజిఖేరా, సర్దార్‌గర్, శ్రావస్థి, నోహ్, కంపిల, జెఖేరా మొదలైనవి. 

* వస్త్రం ఆనవాళ్లను అత్రాంజిఖేరా, నోహ్‌ ప్రాంతాల్లో కనుగొన్నారు.

* అహర్‌ సంస్కృతి మెదటిదశలో డజను ఇనుప వస్తువులు లభించాయి.

* నాగ్దా వద్ద నలుపు - ఎరుపు రంగులో గల ఇనుప వస్తువులు లభించాయి.

* మహిసదల్‌లో ఇనుము వాడకం దాని పనికి సంబంధించిన ఆనవాళ్లు గుర్తించారు.

* దక్షిణ భారతదేశంలోని దక్కన్‌లో ఇనుప వస్తువులు చివరి జోర్వే చాల్కోలిథిక్‌ దశ క్రీ.పూ.900-800 తర్వాత కనిపించాయి.

* తాపి లోయలో ప్లాట్‌షెల్‌ లాంటి గొడ్డలి, రంధ్రం ఉన్న గొడ్డలి లభించాయి.

* చాల్కోలిథిక్‌ చివరి దశలో కర్ణాటకలోని బ్రహ్మగిరి, పిక్లిహాల్, సంగనకల్లు, మస్కీ, పియంపల్లి తదితర కేంద్రాల్లో ఇనుమును ప్రవేశపెట్టినట్లు ఆధారాలున్నాయి.

* పిక్లిహాల్, హల్లూరులో ఇనుప యుగ తొలి దశ ఆనవాళ్లు లభించాయి.

* కార్బన్‌ డేటింగ్‌ (C4) ప్రకారం క్రీ.పూ.1150 -1030 మధ్యకాలానికి చెందిన ఇనుప పనిముట్లను హల్లూరులో గుర్తించారు. 

* ఇనుప యుగం ‘మెగాలిథిక్‌ కల్చర్‌’తోనూ ముడిపడి ఉంది. ద్వీపకల్ప భారతదేశంలో శ్మశానవాటికల సముదాయంలో ఇనుము పనిముట్లు లభించాయి. 

* బెలూచిస్తాన్, వాఘదూర్, షా బిల్లావల్, లేహ్‌ లోయ, బుర్జాహం, గుఫ్‌క్రాల్, దౌసా (రాజస్థాన్‌), ఖేరా (యూపీ), కోటియా (అలహాబాద్‌), బందా, మీర్జాపూర్, కకోరియా (వారణాసి, యూపీ), సరైకోలా, అసోం, బస్తర్, మొదలైన ప్రాంతాల్లో శ్మశాన వాటికలు కనుక్కున్నారు.

* కొడవళ్లు, గొడ్డళ్లు లాంటి పనిముట్ల ఆధారంగా మెగాలిథిక్‌ ప్రజలు స్థిరమైన వ్యవసాయం చేయలేదని తెలుస్తోంది. కానీ విదర్భ, తమిళనాడు, ఉత్తర దక్కన్‌ ప్రాంతాల్లో వివిధ రకాల పంటలు పండించేవారు. ముఖ్యంగా తృణధాన్యాలు, కాయగూరలు, వరి, మినుములు పండించేవారు. కుండలు ఎరుపు, నలుపు రంగుల్లో ఉండేవి.

ఇనుము-ఆనవాళ్లు

* క్రీ.పూ.1000లో దక్షిణ భారతదేశ ప్రాంతమైన కర్ణాటకలోని ‘ధార్వార్‌’ జిల్లాలో వీటి ఆనవాళ్లు దొరికాయి. పిరాక్, ముండిగాక్, గాంధార సమాధుల్లో ఇనుము ఆనవాళ్లు (ఇనుము ముక్కలు) లభించాయి.  

* పంజాబ్, ఉత్తర రాజస్థాన్, గంగా-యమునా దోబ్‌ ప్రాంతాల్లో ఇనుము గణనీయంగా లభించింది

* క్రీ.పూ. 900-500 మధ్య అత్రాంజిఖేరా (యూపీ)లో ఇనుముకు సంబంధించిన తొలి ఆనవాళ్లు లభించాయి. ఇక్కడ గోధుమలు, బార్లీ, బియ్యంతో పాటు పెద్దసంఖ్యలో ఇనుప పనిముట్లు లభించాయి. ముఖ్యంగా బాణం తలలు (arrow heads), ఈటె తలలు (spear heads), ఇనుము పట్టకార్లు (spear heads),  ఉలి, గొడ్డలి, కత్తులు కనుక్కున్నారు.

* నోహ్, అత్రాంజిఖేరాలో రంధ్రం ఉన్న గొడ్డలిని గుర్తించారు.


మాదిరి ప్రశ్నలు

1. ప్రాచీన మానవ శిలాజాలు లభించిన ప్రదేశం....

1) ఆసియా ఖండం    2) ఆఫ్రికా ఖండం   3) ఉత్తర అమెరికా ఖండం    4) యూరప్‌ ఖండం

జ: ఆఫ్రికా ఖండం


2. ఏ ప్రదేశంలో ఉత్తర ప్రాచీన శిలాయుగపు పరికరాలు దొరికాయి?

1) రాజస్థాన్, గంగా ప్రాంతం        2) బెలాన్‌లోయ, మధ్య తూర్పు భారత్‌

3) కర్ణాటక, గుజరాత్, ఆంధ్రప్రదేశ్‌          4) పైవన్నీ

జ: పైవన్నీ


3. శిలా లేఖనాల్లో ఎక్కువగా కనిపించే శిలాజ స్వరూపం ఏది? 

1) పక్షులు     2) జంతువులు      3) చేపలు     4) పైవన్నీ

జ: జంతువులు​​​​​​​


4. భారత ‘ఉపఖండం’లో నవీన శిలాయుగం ప్రథమంగా అభివృద్ధి చెందిన ప్రాంతం....

1) గంగా ఉత్తర ప్రాంతం     2) నర్మదా దక్షిణ ప్రాంతం

3) పడమటి సింధు        4) తూర్పు బ్రహ్మపుత్ర

జ: పడమటి సింధు​​​​​​​


5.  కింది వాటిలో తామ్ర శిలాయుగానికి సంబంధించి ప్రధాన లక్షణం ఏది?

1) వ్యాపారం     2) వ్యవసాయం       3) పట్టణీకరణ     4) కుండల అలంకరణ

జ: కుండల అలంకరణ​​​​​​​


6. కింది ప్రాంతాల్లో వరి ఆనవాళ్లు కనిపించినవి

1) ఇనామ్‌గాన్‌      2) అహర్‌        3) నవదోతిలి         4) 1, 2

జ: 1, 2​​​​​​​


7. తామ్రశిలాయుగ ప్రజలు ఎవరిని పూజించేవారు?

1) అమ్మతల్లి      2) ఎద్దు       3) లింగం      4) పైవన్నీ

జ:  పైవన్నీ​​​​​​​


8. 'The wonder that was India' గ్రంథ రచయిత ఎవరు?

1) జేమ్స్‌ ప్రిన్స్‌      2) ఆర్‌కే ముఖర్జీ      3) ఏఎల్‌ భాషమ్‌     4) గార్డన్‌ చైల్డ్‌

జ: ఏఎల్‌ భాషమ్‌​​​​​​​


9. బంగారు ఆభరణాలు అతి తక్కువగా వినియోగించిన సంస్కృతి....

1) అహర్‌ సంస్కృతి           2) కయథా సంస్కృతి 

3) ప్రభాస్‌ సంస్కృతి        4) జోర్‌ సంస్కృతి

జ: జోర్‌ సంస్కృతి​​​​​​​


10. ఏ ప్రదేశంలో మొట్టమొదట రాగితో తయారుచేసిన కత్తిలాంటి నిర్మాణం లభించింది?

1) ఖేెత్రి - రాజస్థాన్‌       2) బిటుర్‌ - కాన్పూర్‌ 

3) బరేరి - ముజఫరాపూర్‌       4) కాల్మి - డెహ్రాదూన్‌

జ: బిటుర్‌ - కాన్పూర్‌ 


11. పెద్ద సంఖ్యలో 424 రాగి ముక్కలు, 102 వెండి దళసరి రేకులు లభించిన ప్రదేశం.....

1) ఖేెత్రి - రాజస్థాన్‌        2) చిరాన్‌ - బిహార్‌

3) గుంగేరియా - మధ్యప్రదేశ్‌       4) చందోలి - మహారాష్ట్ర

జ: గుంగేరియా - మధ్యప్రదేశ్‌ ​​​​​​​


12. ఇనుము ఆనవాళ్లు దొరికిన ‘అత్రాంజిఖెరా’ ఏ రాష్ట్రంలో ఉంది?

1) మధ్యప్రదేశ్‌      2) మహారాష్ట్ర        3) ఉత్తర్‌ప్రదేశ్‌      4) కర్ణాటక 

జ: ఉత్తర్‌ప్రదేశ్‌  


13. కింది వాటిలో ఆధునిక శిలాయుగంలో ఏ పెంపుడు జంతువు ఎముక లభించింది?

1) గొర్రె, మేక          2) ఆవు        3) పంది      4) పైవన్నీ

జ: పైవన్నీ

Posted Date : 14-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌