• facebook
  • whatsapp
  • telegram

జైన, బౌద్ధ మతాలు

క్రీ.పూ. ఆరో శతాబ్దం నాటికి ప్రపంచవ్యాప్తంగా మతపరమైన ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. చైనాలో కన్ఫ్యూజియనిజం, టావోయిజాలు; పర్షియాలో జొరాష్ట్రియనిజం అనే మతాలు ఏర్పడ్డాయి. గంగానదీ పరీవాహక ప్రాంతంలో అనేక మతాచార్యులు ఆవిర్భవించారు. వైదిక మతాన్ని వ్యతిరేకించేవారి సంఖ్య క్రమంగా పెరిగింది. ఆ కాలంలోనే జైన, బౌద్ధమతాలు వచ్చి, క్రమంగా ప్రజల ఆదరణ పొందాయి. వీటిపై పోటీ పరీక్షార్థికి అవగాహన ఉండాలి.

బౌద్ధసంగీతులు 

‘సంగీతి’ అంటే ‘సమావేశం’. బుద్ధుడు మరణించాక, అతడి బోధనలను గ్రంథస్తం చేయడానికి, దేశంలోని అనేక సమస్యలను పరిష్కరించడానికి నాలుగు బౌద్ధసంగీతులు నిర్వహించారు.

మొదటి బౌద్ధసంగీతి: 

* ఇది ‘అజాతశత్రు’ కాలంలో జరిగింది. 

* మొదటి సంగీతిని రాజగృహం (సత్తపన్నుగుహ)లో మహాకశ్యప అధ్యక్షతన క్రీ.పూ.487లో నిర్వహించారు. 

* బుద్ధుడి బోధనలను గ్రంథస్తం చేయడం దీని ప్రధాన ఉద్దేశం.

* ఈ సమావేశంలో వినయ, సుత్త అనే పీటకాలను క్రోడీకరించారు. 

* వినయ పీటకాన్ని ఉపాలి, సుత్త పీటకాన్ని ఆనందుడు రచించారు. 

* వినయ పీటకంలో బౌద్ధనీతి, నియమాలు; సుత్త పీటకంలో బుద్ధుడి బోధనలు ఉన్నాయి. ఇవి ‘పాళీ’ భాషలో ఉన్నాయి.

రెండో బౌద్ధసంగీతి:

* క్రీ.పూ.387లో ‘సభాకామి’ అధ్యక్షతన ‘వైశాలి’లో జరిగింది. అప్పటి రాజు ‘కాలాశోకుడు’.

* ఈ సమావేశ ప్రధాన ఉద్దేశం వజ్జీ (బిహార్‌) సంప్రదాయ, సాంప్రదాయేతర సన్యాసుల మధ్య విభేదాలను పరిష్కరించడం.

* దీనికి తూర్పు ప్రాంతాలైన వైశాలి, పాటలీపుత్రం; పశ్చిమ ప్రాంతాలైన కౌశాంబి, అవంతి భిక్షువులు హాజరయ్యారు. 

* వినయ పీటకంలోని పది సూత్రాల విషయంలో కొన్నింటిని సడలించాలని పశ్చిమ ప్రాంత భిక్షువులు కోరారు. రెండు వర్గాల మధ్య చర్చలు జరిగాయి. కానీ ఎలాంటి పరిష్కారం దొరకలేదు. 

* చివరికి వైశాలి వారు వినయ పీటకంలోని పది సూత్రాలను ఆమోదించి, వాటినే ప్రామాణికంగా నిర్ణయించారు. వీరిని ‘మహాసాంఘికులు’ అంటారు. వీరి నాయకుడు ‘మహాకశ్యప’. ప్రధాన కేంద్రం ‘వైశాలి’.

* అదేవిధంగా పశ్చిమ ప్రాంత సన్యాసులు కూడా ‘మహాకాచ్ఛాయన’ నాయకత్వంలో ‘థెరవాదులు’ (లేదా) ‘స్థవిరవాదులు’గా విడిపోయారు. వీరి ప్రచార భాష ‘పాళీ’. వీరు వినయ పీటకంలోని కొన్ని సూత్రాలను, నియమాలను సడలించుకున్నారు. 

* ఈ సమావేశంలోనే బౌద్ధసన్యాసులు రెండు వర్గాలుగా విడిపోయారు.

మూడో బౌద్ధసంగీతి: క్రీ.పూ.250లో ‘అశోకుడి’ కాలంలో ‘మొగ్గలిపుత్తతిస్స’ అధ్యక్షతన ‘పాటలీపుత్రం’లో జరిగింది.

* ఈ సమావేశంలో థెరవాదులను సంఘం నుంచి తొలగించారు. ‘అభిదమ్మ పీటకాన్ని’ సంకలనం చేశారు. దీంతో వినయ, సుత్త, అభిదమ్మలు త్రిపీటకాలు అయ్యాయి. వీటిలో బుద్ధుడి బోధనలు, వాదసంవాదాలు, వ్యాఖ్యానాలు ఉన్నాయి.

నాలుగో బౌద్ధ సంగీతి:

* క్రీ.శ. 100లో కుషాణ రాజు కనిష్కుడి కాలంలో ‘కశ్మీర్‌’లోని కుందనవనంలో జరిగింది. దీనికి వసుమిత్రుడు అధ్యక్షత వహించగా, అశ్వఘోషుడు ఉపాధ్యక్షుడిగా వ్యవహరించాడు.

* 18 శాఖోపశాఖలుగా విడిపోయిన బౌద్ధమతశాఖల వివాదాల్ని పరిష్కరించడం ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం. 

* అయితే బౌద్ధ మతం మళ్లీ రెండు శాఖలుగా విడిపోయింది. మహాసంఘికులు మహాయానులుగా, థెరవాదులు హీనయానులుగా విడిపోయారు. 

* ఇక్కడి చర్చలను వ్యాఖ్యాన రూపంలో ‘విభాషాశాస్త్రం’ అనే పేరుతో గ్రంథస్తం చేశారు.

బౌద్ధమత శాఖలు 

బౌద్ధమతం అనేక శాఖలుగా విడిపోయింది. వాటిలో ప్రధానమైనవి: మహాయానం, హీనయానం, వజ్రయానం.

మహాయానం:

* మహాయానం అంటే ‘పెద్దవాహనం’. ఈ శాఖవారు బుద్ధుడ్ని భగవంతుడి అవతారంగా భావించి, ఆయన విగ్రహాన్ని పూజిస్తారు.

వీరి భావనలు:

* బుద్ధుడి యందు భక్తిశ్రద్ధలతో ఉంటే నిర్యాణం పొందొచ్చు.

* మానవులంతా నిర్యాణానికి అర్హులు. 

* అజ్ఞానులను ఉద్ధరించడానికి బోధిసత్వులు అనేక జన్మలు ఎత్తుతారు. 

* వస్తువులు శూన్యం, అనవసరం. 

శూన్యవాదాన్ని, మాథ్యమికవాదాన్ని ఆచార్య నాగార్జునుడు ప్రచారం చేశాడు. ఈ శాఖ భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో బాగా వ్యాప్తి చెందింది. దేవుడి అస్థిత్వానికి, స్వర్గం అనే భావనకు ఈ శాఖ విలువ ఇచ్చింది. వీరు పాళీ, సంస్కృత భాషల్లో ప్రచారం చేశారు.

హీనయానం: 

* ‘హీనయానం’ అంటే ‘చిన్నవాహనం’ అని అర్థం. ఈ శాఖవారు విగ్రహారాధనను వ్యతిరేకించి, దేవుడి అస్థిత్వాన్ని గుర్తించలేదు. 

*తార్కిక వాదనకు విలువిచ్చి, నిరాడంబర జీవనం గడపాలనేది వీరి ప్రధాన సూత్రం.

* హీనయానంలో బుద్ధుడ్ని ఒక గురువుగా భావించారు. అతడి ఉనికిని, పాదాలు, బోధివృక్షం, స్వస్తిక్‌ గుర్తు ఉన్న ఖాళీ సింహాసనం, ఛత్రాన్ని గుర్తించి వాటిని పూజిస్తారు.

* ప్రపంచంలోని వస్తువులన్నీ అశాశ్వతం అని వీరి నమ్మకం. ఇది బౌద్ధమత సాంప్రదాయ, వేదాంతానికి మద్దతిచ్చింది. 

* ఇది శ్రీలంక, బర్మా, థాయ్‌లాండ్, ఇతర దక్షిణాసియా దేశాల్లో మాత్రమే ప్రాచుర్యం పొందింది.

వజ్రయానం:

* ఇది తూర్పు భారతదేశంలో 7  8 వ శతాబ్ద కాలంలో ఆవిర్భవించింది. వీరు బుద్ధుడ్ని మంత్రతంత్రాలతో పూజిస్తారు.

* బెంగాల్, బిహార్‌కు చెందిన శాంత రక్షిత, దీపాంకరులనే బౌద్ధ సన్యాసులు వజ్రయానాన్ని టిబెట్‌లో వ్యాప్తి చేశారు. 

* పాల, సేన రాజులు దీని పోషకులు. విక్రమశిల, ఉద్ధండపుర, జగద్ధల విశ్వవిద్యాలయాలు వజ్రాయన ప్రధాన కేంద్రాలు.

* వజ్రయాన, మహాయాన శాఖ వారు గౌతమ బుద్ధుడు సుఖావతి (స్వర్గ) లోకంలో ఉంటాడని అక్కడ బుద్ధుడ్ని ‘అమితాబు’ అని, ఆయన భార్యను ‘తార’ అని పిలుస్తారని నమ్ముతారు. ఈ శాఖ అంతగా ప్రాచుర్యం పొందలేదు.


1. జైన మతంలోని మొదటి తీర్థంకరుడు ఎవరు?

1) వర్ధమాన మహావీర  2) రిషభనాథ      3) పార్శ్వనాథ       4) ఎవరూకాదు

జ: 2


2. వర్ధమాన మహావీరుడు ఎక్కడ జన్మించాడు?

1) కుంద గ్రామం    2) జృంబిక గ్రామం     3) వైశాలి    4) రాజగృహం

జ: 1


3. వర్ధమాన మహావీరుడి తండ్రి?

1) రిషభనాథ    2) శుద్ధోధనుడు     3) జమాలి    4) సిద్ధార్థుడు

జ: 4


4. వర్ధమాన మహావీరుడికి జ్ఞానోదయమైన స్థలం?

1) జృంబికవనం    2) లిచ్ఛవి      3) రిజుపాలిక    4) పావానగరం

జ: 3


5. వర్ధమాన మహావీరుడి భార్య పేరు?

1) యశోద    2) ప్రియదర్శిని     3) అంజలి    4) యశోధర

జ: 1


6. వర్ధమాన మహావీరుడు ఎక్కడ మరణించాడు?

1) వైశాలి    2) రాజగృహం     3) పావాపురి    4) పాటలీపుత్రం

జ: 3


7. వర్ధమాన మహావీరుడు కింది ఏ తెగకు చెందినవాడు?

1) జిన        2) చంద్రవంశ        3) శాక్య        4) జ్ఞాతిక

జ: 4


8. వర్ధమాన మహావీరుడికి ఎన్నో ఏట జ్ఞానోదయం అయ్యింది?

1) 42        2) 32        3) 52        4) 44

జ: 1


9. ‘నిర్గంధులు’ అంటే?

1) పురోహితులు     2) బంధంలేని వారు      3) ఆరాధించేవారు    4) వ్యాపారులు

జ: 2


10. వర్ధమాన మహావీరుడి మొదటి గురువు ఎవరు?

1) నేమినాథ         2) మక్కలిగొసల     3) మొగ్గలిపుత్తతిస్స     4) అనంతనాథ

జ: 2


11. వర్ధమాన మహావీరుడు ఎన్నో ఏట మరణించాడు?

1) 66       2) 82        3) 72        4) 62

జ: 3
 

జైనమతం

జైన పరిషత్‌లు 

పరిషత్‌ అంటే సమావేశం. మొత్తం రెండు జైనపరిషత్‌లు జరిగాయి. ఇందులో జైనసాహిత్యాన్ని క్రోడీకరించారు.

మొదటి జైనపరిషత్‌: 

* క్రీ.పూ.3వ శతాబ్దం (క్రీ.పూ.300) లో పాటలీపుత్రంలో స్థూలభద్రుడి అధ్యక్షతన జరిగింది. 

* ఇందులో 12 అంగాల క్రోడీకరణ, ఆర్యరక్షిత, వీరభద్ర అనే అంగాలను చేర్చారు. వీటిపై వచ్చిన వ్యాఖ్యానాలను ‘నిర్యుక్తులు’ అంటారు. ఇవి మొత్తం 10 భాగాలు. 

* క్రీ.పూ.4వ శతాబ్దం చివర్లో బిహార్‌లో భయంకర కరవు సంభవించింది. ఇది 12 సంవత్సరాలు కొనసాగింది. 

* ఈ సమయంలో ‘భద్రబాహు’ నాయకత్వంలో కొంతమంది జైన సన్యాసులు దక్షిణ మైసూరుకు వెళ్లగా, మరికొంతమంది ‘స్థూలభద్ర’ నాయకత్వంలో అక్కడే ఉండి, ‘పాటలీపుత్రం’లో జైన సమావేశం నిర్వహించారు. 

* ఈ సమావేశంలో కొన్ని జైనమత నిర్ణయాలు, సిద్ధాంతాలను క్రోడీకరించారు. 

* భద్రబాహు నాయకత్వంలోని వారు తిరిగి వచ్చాక, వారి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి. దీంతో జైనమతం రెండుగా విడిపోయింది.

ఎ) శ్వేతాంబరులు: అంటే తెల్లటి వస్త్రం ధరించి, మహావీరుడి బోధనలు పాటించేవారు. స్థూలభద్ర వీరి నాయకుడు. 

బి) దిగంబరులు: అంటే నగ్నంగా ఉండి, మహావీరుడి బోధనలను పాటించేవారు, వీరి నాయకుడు ‘భద్రబాహు’.


రెండో జైనపరిషత్‌:

* ఇది క్రీ.శ. 5వ శతాబ్దంలో గుజరాత్‌లోని ‘వల్లభి’లో జరిగింది. దీనికి ‘దేవార్థిక్షమరణ’ అధ్యక్షత వహించారు.

* పవిత్ర గ్రంథాలను సేకరించి, వాటిని క్రమపద్ధతిలో రాయడం ఈ సమావేశం ఉద్దేశం. 

* ఇందులో చివరగా 12 అంగాలు, ఉపాంగాలను సంకలనం చేశారు.

తర్వాతి కాలంలో జైనమతం మళ్లీ రెండు శాఖలుగా విడిపోయింది. 

తెరపంథీలు: అంటే విగ్రహారాధనను పూర్తిగా త్యజించి, పవిత్ర గ్రంథాలను మాత్రమే పూజించేవారు. వీరు శ్వేతాంబరుల నుంచి విడిపోయారు. 

సమైయాలు: వీరు దిగంబర శాఖ నుంచి విడిపోయారు. మహావీరుడి బోధనలను తు.చ. తప్పకుండా పాటించేవారు. భారతదేశంలో అధికశాతం ఈ వర్గం వారే. 

Posted Date : 15-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌