• facebook
  • whatsapp
  • telegram

మహాజనపదాలు - 2

మహాజనపదాలు


*  భారతదేశ సమాజంలో క్రీ.పూ.6వ శతాబ్దం నాటికి రాజకీయ, ఆర్థిక, మత వ్యవస్థల్లో మౌలికమైన మార్పులు సంభవించాయి. ఆ సమయంలో రాజకీయంగా స్థిరంగా లేనప్పటికీ మనదేశంలో తొలి రాజ్యానికి  పునాదులు పడ్డాయి.

* మతరంగంలో జైన, బౌద్ధ మతాలు ఆవిర్భవించాయి. ఇనుము ఉపయోగం ఆర్థికపరంగా జీవనవిధానాన్ని సమూలంగా మార్చింది.

* జనపదాల మధ్య రాజకీయ అనైక్యత కారణంగా తరచూ సంఘర్షణలు జరిగేవి. ఈ పరిస్థితుల్లోనే విదేశీదాడులు ప్రారంభమయ్యాయి.

* వాయవ్య భారతదేశంలోకి పారశీక, గ్రీకు రాజులు ప్రవేశించి కొన్ని ప్రాంతాలను జయించారు. చిన్న రాజ్యాలు వాటి ప్రాబల్యం కోల్పోయి, తూర్పు భారతదేశంలోని మగధ సామ్రాజ్యం ఆధీనంలోకి వెళ్లాయి.

ఆవిర్భావం

ఇవి వింధ్య పర్వతాలకు ఉత్తరంగా, ఈశాన్య సరిహద్దు నుంచి బిహార్‌ వరకు; తూర్పుగంగా మైదానం నుంచి బెంగాల్‌ వరకు విస్తరించాయి. ఈ ప్రాంతాల్లో వ్యాపారం బాగా అభివృద్ధి చెందడం, జనాభా పెరుగుదల, సామాజిక అవసరాలు, ముడి ఇనుము లభించడం - దానిపై నియంత్రణ, పన్నులు వసూలు చేయడం మొదలైనవన్నీ షోడశ మహాజనపదాల ఆవిర్భావానికి దోహదం చేశాయి. వేదకాలంలో తెగ, గణ రాజ్యాలుగా ఉన్నవి జనపదాలు, మహాజనపదాలుగా మారాయి. ఇవేకాకుండా, కొన్ని స్వతంత్ర తెగ వ్యవస్థలు కూడా ఉండేవి. ఈ తెగ రాజ్యాల మధ్య తరచూ యుద్ధాలు జరిగేవి.

రాజ్యాలు

ప్రతి మహాజనపదానికి ఒక రాజధాని, ప్రత్యేక పాలనా యంత్రాంగం ఉండేది. ఈ రాజ్యాలను క్షత్రియ వంశానికి చెందిన రాజులే ఎక్కువగా పాలించారు. 16 మహాజనపదాలు:

కాశీ 

దీని రాజధాని ‘వారణాసి’. ఇది వరుణ-ఆశి నదుల మధ్యలో ఉంది. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. ఇది ప్రాచీన విద్యాకేంద్రం. ప్రస్తుతం దీన్ని ‘బెనారస్‌’గా పిలుస్తున్నారు.

మగధ 

దీని మొదటి రాజధాని గిరివ్రజపురం. తర్వాత ఇది రాజగృహానికి మారింది. చివరగా పాటలీపుత్రం దీని రాజధానిగా స్థిరపడింది. ఇది ప్రస్తుత బిహార్‌లోని పట్నా, గయా జిల్లాలు ఉన్న ప్రాంతం.

అంగ 

దీని రాజధాని ‘చంప’. ప్రస్తుతం దీన్ని ‘తూర్పు బిహార్‌’గా పిలుస్తున్నారు. ఇది ఒక గొప్ప వర్తక కేంద్రం. ఇది గంగా-చంపా నదుల కూడలిలో ఉంది.

కోసల 

సరయూ నది దీన్ని ఉత్తర, దక్షిణ భాగాలుగా విభజిస్తుంది. రెండు భాగాలకు వేర్వేరు రాజధానులు ఉన్నాయి. ఉత్తర కోసల రాజధాని శ్రావస్తి. ఇది ఔద్‌ (అవధ్‌) ప్రాంతంలో ఉండేది. ప్రస్తుతం ఇది ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఉంది. దక్షిణ కోసల రాజధాని కుషావటి.

వజ్జి 

దీని రాజధాని ‘వైశాలి’. ప్రస్తుత ఉత్తర బిహార్‌ ప్రాంతమే ఒకప్పటి వజ్జి. ఇది 9 తెగలు కలిసి ఏర్పడిన గణరాజ్య సమ్మేళనం. వీటిలో విదేహ, లిచ్చవి, జ్ఞాత్రిక, వజ్జి తెగలు ముఖ్యమైనవి.

ఛేది 

దీని రాజధాని ‘శుక్తిమతి’. ఇది నేటి బుందేల్‌ఖండ్‌ (మధ్యప్రదేశ్‌) ప్రాంతం. ఛేది వంశంలోని ఒక శాఖ కళింగ రాజ్యంలో రాజవంశాన్ని స్థాపించింది.

వత్స  

ఇది ప్రస్తుత ఉత్తర్‌ ప్రదేశ్‌లోని అలహాబాద్‌ ప్రాంతం. దీని రాజధాని ‘కౌశాంబి’. ఇది యమునా నది తీరాన ఉంది. ఇది ప్రముఖ వ్యాపారకేంద్రం.

కురు 

దీని రాజధాని ఇంద్రప్రస్థం. ప్రస్తుత దిల్లీ-మీరట్‌ ప్రాంతం. దీన్ని పూర్వం స్థానేశ్వర్‌ అని పిలిచేవారు. హస్తినాపురం (యూపీలోని మీరట్‌ ప్రాంతం) కూడా దీనికి రాజధానిగా ఉండేది.

పాంచాల  

దీని రాజధాని ‘అహిచ్ఛత్రం’. దీన్ని గంగా నది ఉత్తర-దక్షిణాలుగా విభజిస్తుంది. దక్షిణ ప్రాంతానికి కాంపిల్య రాజధానిగా ఉండేది. నేటి ఉత్తర్‌ ప్రదేశ్‌లోని బదాన్, ఫరూకాబాద్‌ ప్రాంతాలే ఒకప్పటి పాంచాల.

మత్స్య  

ప్రస్తుత రాజస్థాన్‌లోని జైపూర్‌ ప్రాంతంలో ఉన్న బైరట్‌ నగరమే అప్పటి మత్స్య. దీని రాజధాని విరాటనగరం. ఆల్వార్, భరత్‌పూర్‌ ప్రాంతాల వరకు ఈ రాజ్యం విస్తరించింది. దీని రాజధానిని విరాట రాజు నిర్మించాడు.

శూరసేన 

దీని రాజధాని మధురానగరం. ఇది యమునా నది తీరంలో ఉంది.

అశ్మక 

దీని రాజధాని పొటాన్‌/ పొతన్‌ లేదా బోధన్‌. ఇది నేటి తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లాలో ఉంది. ములక రాజ్యం కూడా ఇందులో అంతర్భాగంగా ఉండేది. దీని రాజధాని పైఠాన్‌ లేదా ప్రతిష్ఠానపురం. ఇది దక్షిణ భారతదేశంలోని ఏకైక మహాజనపదం.

అవంతి 

ఇది ప్రస్తుత మధ్యప్రదేశ్‌లోని మాల్వా ప్రాంతం. దీని రాజధాని ఉజ్జయిని. వింధ్య పర్వతాలు, వేత్రవతి నది ఈ రాజ్యాన్ని ఉత్తర-దక్షిణ భాగాలుగా విభజిస్తున్నాయి. ఉత్తర అవంతి రాజధాని ఉజ్జయిని కాగా, దక్షిణ అవంతి రాజధాని మహిష్మతి నగరం (లేదా) మహిసట్టి.

గాంధార  

ఇది ప్రస్తుత అఫ్గానిస్థాన్‌ ప్రాంతం. దీని రాజధాని తక్షశిల. పాకిస్థాన్‌లోని పెషావర్, రావల్పిండి జిల్లాలే అప్పటి తక్షశిల.

కాంభోజ

దీని రాజధాని రాజపురం లేదా భోజపురం. ఇది నేటి వాయవ్య సరిహద్దులోని రాజోరి, హాజీరా జిల్లాల ప్రాంతం.

* ఇవేకాకుండా చిన్న చిన్న గణరాజ్యాలు కూడా ఉండేవి. వాటిలో ముఖ్యమైనవి:

శక్యల - రాజధాని ‘కపిలవస్తు’, కోలియుల - రాజధాని ‘రామగ్రామ’, మోరీయుల - రాజధాని పిప్పిలివనం, భగ్గుల రాజ్యం. బుద్ధుడు శాక్యవంశానికి చెందినవాడు కావడం వల్ల ఈ రాజ్యానికీ ప్రాధాన్యం ఉండేది.

మాదిరి ప్రశ్నలు


1. మగధను పాలించిన రాజవంశాలు వరుసగా...

i) బృహద్రదవంశం        ii) హర్యాంకవంశం    iii) శిశునాగవంశం      iv) నందవంశం    v) మౌర్యవంశం

1) i, ii, iii, iv, v        2) ii, i, iv, iii, v      3) v, iv, ii, iii, i    4) iii, ii, i, iv, v


2. ఇతిహాస యుగంలో మగధను పాలించిన తొలి పాలకుడు ఎవరు?

1) బింబిసార        2)బృహద్రద      3) ప్రద్యోధన        4)దుర్యోధన


3. బృహద్రద వంశంలో చివరి పాలకుడు ఎవరు?

1) అజాత శత్రువు      2) బింబిసార     3) రిపుంజయ    4) పక్కువతి


4. వంగ మలయతో కూడిన 16 మహాజనపదాలను ప్రస్తావించిన జైన గ్రంథం ఏది?

1)స్థూల బాహుసూత్ర     2) భగవతి సూత్ర      3) పరిశిష్ట పర్వన్‌    4)సూత్రాలంకార 


5. బుద్ధుడి కాలంలో కాశీని ఆక్రమించిన మహాజనపదం ఏది?

1) మగధ        2) అంగ    3) వజ్జి        4)కోసల 


6. 16 మహాజనపదాల్లో శక్తిమంతమైంది ఏది?

1) కోసల      2)వత్స  3)మగధ       4) శ్రావస్తి


7. మహాజనపదాల కాలంలో శిస్తు వసూలు చేసే అధికారులను ఏమనేవారు?

1)రజ్జు గహక        2)రజుక     3)సన్నిదాత       4) సమాహార్త


8. హస్తినాపురంలో వరదల వల్ల పాండవుల రాజధానిని ఎక్కడికి మార్చారు?

1) బెనారస్‌        2) కుషినగర్‌      3)కౌశాంబి        4)రాజగృహం


9. బింబిసారుడి చేతిలో ఓడిపోయిన అంగరాజ్యాధిపతి ఎవరు? 

1) శుద్ధోధన      2) ప్రసేనజిత్‌    3) విశ్వజిత్‌       4)బ్రహ్మదత్త


10. హర్యాంకవంశ స్థాపకుడు ఎవరు?

1) అజాతశత్రువు       2) ప్రసేనజిత్తు     3) బృహద్రద        4) బింబిసార


11. జీవకుడు అనే వైద్యుడు ఎవరి ఆస్థానంలో ఉన్నాడు?

1) బింబిసార        2) శిశునాగ     3) మహాపద్మనంద    4) ధననంద


12. బింబిసారుడి రాజధాని ఎది?

1)కాశీ      2) గిరివ్రజం   3) విదేహ       4) కోసల


13. మహాశీల కంటక (బరువైన రాళ్లను విసిరే యంత్రం), రథముసలం (రథానికి బలమైన ఇనుప ఇరుసుతో పాటు ముందు భాగంలో కత్తులు ఉంటాయి) లాంటివాటినిని ఎవరి కాలంలో ఎక్కువగా వాడారు?

1) ధననంద        2)శిశునాగ    3) అజాత శత్రువు      4) అలెగ్జాండర్‌


14. ‘దాతుచైత్యం’ అనే స్తూపాన్ని నిర్మించింది ఎవరు?

1) కాలాశోక        2)ఉదయనుడు     3)అనిరుద్ధ        4) అజాతశత్రువు


సమాధానాలు


1-1  2-2  3-3  4-2  5-4  6-3  7-1  8-3  9-4  10-4  11-1  12-2  13-3  14-4 

Posted Date : 15-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌