• facebook
  • whatsapp
  • telegram

ప్ర‌ధాన జాతులు - వ‌ర్గీక‌ర‌ణ‌

పురాతన, చారిత్రక నాగరికత కాలంలోనూ భారతదేశంలో జాతుల ప్రస్తావన ఉంది. వారు నివసించే ప్రాంతాల ఆధారంగా భౌతిక, జీవ వ్యత్యాసాలను అనుసరించి పలు విభాగాల జాతులను గుర్తించారు. మనదేశంలోని ప్రజల భౌతిక లక్షణాలను బట్టి ఎంతోమంది శాస్త్రజ్ఞులు జాతులను వర్గీకరించారు. ప్రధానంగా ఆంత్రోపోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌  బి.ఎస్‌. గుహ ‘శారీరక నిర్మాణ పటుత్వం, చర్మవర్ణం’ ఆధారంగా జాతులను ఆరు రకాలుగా వర్గీకరించారు. దీన్ని 1931 నాటి జనాభాగణనలో ఆమోదించి, అధికారికంగా లెక్కించడం ప్రారంభించారు.


నీగ్రోయిట్స్‌ జాతి 

వీరు భారతదేశంలో నివసించే అత్యంత పురాతన జాతి. ఆఫ్రికా నుంచి వలస వచ్చారు. కాదర్స్, పొలిగార్స్, ఇరులస్, రాజమహల్‌హిల్, అండమాన్‌ రక్త సంబంధీకులుగా  నీగ్రోయిట్స్‌ను  భావిస్తారు. నలుపు చర్మవర్ణం, ఉంగరాల జుట్టు, లావు పెదాలు, పెద్ద ముక్కు కలిగి ఉంటారు.  ప్రస్తుతం ఇరులస్, కాదర్స్, కనిక్కర్స్, ముత్తైవాన్స్, పనియాన్స్, పులియాన్స్, ఉరలీస్‌ అనే గిరిజన జాతుల వారు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఝార్ఖండ్‌లోని రాజమహల్‌ కొండల్లో ఉన్నారు.  
అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో జార్వాస్, ఓంగా, శంటిలేస్, షోంపేన్‌ అనే జాతులు ఉంటున్నారు. వీరు మలేసియా, సెమాంగ్, సకామి తెగలను పోలి ఉంటారు. ఇందులో జార్వాస్‌ అంతరించిపోతున్న జాతి; శంటిలేస్‌ అత్యంత ప్రమాదకర జాతి.

ప్రొటో ఆస్ట్రాలాయిడ్స్‌  

ఇది మనదేశంలో రెండో అత్యంత పురాతన జాతి. వీరు పూర్వ ద్రావిడ సంతతికి చెందినవారని, ఆస్ట్రేలియా నుంచి వలస వచ్చారని పేర్కొంటారు. సింధూలోయ నాగరికతను గుర్తించినట్లు చెబుతారు. వీరు మధ్య భారతదేశంలో నివసిస్తూ గోధుమ వర్ణాన్ని కలిగి, వెడల్పు ముఖం, ఒత్తయిన జుట్టును కలిగి ఉంటారు.     ప్రస్తుతం బరైన్స్, ముండా,  సంతాల్‌లు, చెంచులు, కురుంబాస్, బిల్లులు, కొలాస్, హస్, ఎరువాస్‌ మొదలైనవి ఈ సంతతికి చెందిన గిరిజన జాతులు.


మంగోలాయిడ్స్‌  

ఈ జాతికి చెందిన వారు చైనీయులను పోలి ఉంటారు. వీరు హిమాలయ సరిహద్దులకు వలస వచ్చారు. ప్రస్తుతం లద్దాఖ్, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్, ఈశాన్య భారతంలో నివసిస్తున్నారు. వీరు క్రీ.పూ.మొదటి వెయ్యి సంవత్సరాల్లో మంగోలియా, టిబెట్, థాయిలాండ్, మయన్మార్‌ నుంచి వచ్చారు. పొడవైన తల, పసుపు, లైట్‌బ్రౌన్‌ వర్ణంలో ఉంటారు. కంటిరెప్పలపై ముడతలు ఉంటాయి. వీరిలో మాలాయి, టిబెట్‌ మంగోలాయిడ్స్‌ అనే రెండు రకాల జాతులవారు ఉన్నారు.  ప్రస్తుతం మాలాయి తెగలో డఫ్‌లాస్, గారోస్, కంచరిస్, ఖాసి, కుకి - నాగస్, మిరిస్, మచి, లాలుంగ్, టిప్పరస్‌ మొదలైన గిరిజన జాతులు ఉన్నాయి. భుటియాస్, గోర్కాస్, డఖిస్‌ గద్దీస్, కిన్నేరస్‌ మొదలైనవారు టిబెట్‌ జాతికి చెందినవారు.


మెడిటేరియన్స్‌  

క్రీస్తుపూర్వం రెండు లేదా మూడో మిలీనియంలో నైరుతీ ఆసియా నుంచి వలస వచ్చారు. వీరిని ద్రావిడ సంతతికి చెందిన వారిగా పేర్కొన్నారు. ఈ జాతివారు మాదిరి నలుపు రంగు, చామనఛాయ వర్ణం, గుండ్రని ముఖాన్ని కలిగిఉంటారు. వీరిలో ఎక్కువగా నాయకత్వ లక్షణాలు, ఆలోచన, తీర్పు, ఆధ్యాత్మికత గుణాలుంటాయి. ఇందులో పాలాయి, మెడిటేరియన్, ఓరియంటల్‌ అనే మూడు రకాల జాతులున్నాయి. ప్రస్తుతం దక్షిణ వింధ్య పర్వత ప్రాంతాల్లోని తమిళ, తెలుగు బ్రాహ్మణులను పాలాయి జాతికి చెందినవారిగా పేర్కొంటారు. కేరళకు చెందిన నాయర్స్, నంబ్రూది బ్రాహ్మణులు మెడిటేరియన్స్‌ తెగకు చెందినవారు. ఓరింటియల్‌ జాతిలో పంజాబ్‌ ఖత్రీస్‌ (Khatris), రాజస్థాన్‌కు చెందిన  బనియాస్‌ (Banias)ముఖ్యమైనవారు.

పశ్చిమ బ్రాకీసెప్లాస్‌  

వీరు తూర్పు, పశ్చిమ ప్రాంతాల నుంచి వలస వచ్చిన పార్శీ మతస్థులు. పలచని వెంట్రుకలు, తెల్లని దేహాన్ని కలిగిఉంటారు. వీరిలో మూడు ప్రధాన సమూహాలు ఉన్నాయి.  నీ ఆల్ఫినోయిడ్స్‌ సమూహానికి చెందిన వారు గుజరాతీ బనియాస్, కథిస్‌ ఆఫ్‌ కథియవార్, బెంగాల్‌ కయస్తాస్‌ ప్రాంతాల్లో ఉన్నారు. నీ డైనారిక్‌ సమూహానికి చెందిన వారు బెంగాల్, ఒడిశా, కర్ణాటక, కూర్గ్‌ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. నీ ఆన్నేనోయిడ్స్‌ సమూహానికి చెందినవారు పారసిస్, బెంగాలీ, వైద్యాస్, కయస్తాస్‌ ప్రాంతాల్లో ఉంటున్నారు.    ఈ సమూహాలకు చెందిన జనాభా బెలూచిస్తాన్, సింధ్, కథియవార్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, గంగా డెల్టా, చిత్రాల్, గిల్గిత్, కశ్మీర్, నేపాల్‌లో ఉన్నారు.


నార్డిక్స్‌ 

వీరు వాయవ్య భారత్‌ నుంచి మన దేశానికి  చివరగా వలస వచ్చారు. వీరు ఆర్య సంతతికి చెందినవారు. ఎరుపు వర్ణం, శారీరక దృఢత్వం కలిగి, బాగా అభివృద్ధి చెందినవారు. క్రీ.పూ.రెండో మిలియన్‌లో భారత్‌లో ప్రవేశించారు. ప్రస్తుత వాయవ్య సరిహద్దు ప్రాంతాలైన పాకిస్థాన్, పంజాబ్, హరియాణా, రాజస్థాన్‌లోని అగ్ర వర్ణాలకు చెందినవారు.


షెడ్యూల్డ్‌ జాతులు 

మనదేశంలో 1931 జనాభా లెక్కల్లో మొదటిసారిగా షెడ్యూల్డ్‌ జాతులు/ సామాజిక కులాల గణన నిర్వహించారు. మళ్లీ 80 సంవత్సరాల తర్వాత పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో 2011 జనాభాగణనలో సామాజిక కుల జనాభా గణన జరిగింది. 1932లో సర్‌ మెక్‌డొనాల్డ్‌ సామాజిక కుల ప్రాతిపదికన సీట్ల కేటాయింపు కోసం మొదటిసారి ‘కమ్యూనల్‌ అవార్డు’ను ప్రకటించారు. తర్వాత అదే సంవత్సరంలో  గాంధీజీ హరిజన, గిరిజన అనే పదాలను  ఉపయోగించారు. 

మనదేశంలో షెడ్యూల్డ్‌ కులాలు అనే పదాన్ని మొదటిసారి 1935 నాటి భారత ప్రభుత్వ చట్టానికి చేర్చారు. 1936లో కులాల ఉత్తర్వులను జారీ చేశారు. రాజ్యాంగంలో 341, 342 అధికరణల్లో షెడ్యూల్డ్‌ కులాలు, తెగల నిర్వచనాలను స్పష్టంగా పేర్కొన్నారు. 1950 నాటి రాజ్యాంగ ఉత్తర్వు ప్రకారం మొదటి షెడ్యూల్‌లో 28 రాష్ట్ర, కేంద్రపాలితప్రాంతాల్లో 1108 షెడ్యూల్డ్‌ కులాలు; 22 రాష్ట్ర, కేంద్రపాలితప్రాంతాల్లో 744 షెడ్యూల్డ్‌ తెగలున్నాయి. 1955లో అంటరానితన నిషేధచట్టం, 1989లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టాన్ని అమలుచేశారు.


షెడ్యూల్డ్‌ కులాలు (ఎస్సీ) 

1935 భారత ప్రభుత్వ చట్టం, 1936 భారత ప్రభుత్వ కులాల ఉత్తర్వుల ప్రకారం ‘షెడ్యూల్డ్‌ కులాలు’ పదాన్ని ఉపయోగించారు. బీఆర్‌ అంబేడ్కర్‌ డిప్రెస్స్‌డ్‌ క్లాసెస్, గాంధీజీ హరిజన రాజ్యాంగం నుంచి ఎస్సీ పదాన్ని గ్రహించారు.     2011 జనాభా గణనలో 31 రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల్లో 1241 కులాలు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో అతిపెద్ద ఎస్సీ కులం చమోర్‌ - ఉత్తర్‌ప్రదేశ్, ఆది ద్రావిడ - తమిళనాడు.  2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం దేశ జనాభాలో ఎస్సీలు 20.14 కోట్లు (16.6 శాతం) ఉన్నారు. వీరు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అభివృద్ధి చెందేందుకు రాజ్యాంగంలో 15 శాతం రిజర్వేషన్లు కేటాయించారు. వీరికి  లోక్‌సభలో 84 స్థానాలు; ఆంధ్రప్రదేశ్‌లో 29, తెలంగాణలో 18 అసెంబ్లీ స్థానాలను రిజర్వ్‌ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 18.5 శాతం, పట్టణాల్లో 11.8 శాతం ఎస్సీలు ఉన్నారు.  జనాభాపరంగా ఎస్సీలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ్‌బెంగాల్, బిహార్, దిల్లీ; అత్యల్పంగా ఉన్న రాష్ట్రాలు మిజోరాం, మేఘలయ, డామన్‌డయ్యూ; శాతాల పరంగా ఎస్సీల జనాభా అధికంగా ఉన్న రాష్ట్రాలు పంజాబ్‌ 31.9%, పశ్చిమ్‌బెంగాల్‌ 25.5%, హిమాచల్‌ ప్రదేశ్‌ 23.2%; అత్యల్పంగా ఉన్న రాష్ట్రాలు అరుణాచల్‌ప్రదేశ్‌ 0.6%, మేఘాలయ 0.6%, గోవా 1.7%; అత్యధికంగా ఎస్సీలు ఉన్న కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్‌ 18.9%, దిల్లీ 16.8%; అత్యల్పంగా ఎస్సీలు ఉన్న కేంద్రపాలితప్రాంతం - దాద్రానగర్‌హవేలి 1.9%; ఎస్సీలు అత్యధికంగా ఉన్న జిల్లా  కుచ్‌ (బిహార్‌ - 50.1%); అత్యల్పంగా ఉన్న జిల్లా లవ్దతాలై - మిజోరాం 0.01;  లక్షద్వీప్, అండమాన్, నాగాలాండ్‌ ప్రాంతాల్లో ఎస్సీలు లేరు; ఆంధ్రప్రదేశ్‌లో 17.09%; తెలంగాణలో 15.45% ఎస్సీలు ఉన్నారు.


షెడ్యూల్డ్‌ తెగలు (ఎస్టీ) 

1950 రాజ్యాంగ ఉత్తర్వుల ప్రకారం దేశంలో 744 ఎస్టీ కులాలు ఉండగా, 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ సంఖ్య 705కు తగ్గింది. వీరు మొత్తం దేశ జనాభాలో 10.4 కోట్లు 8.6% ఉన్నారు. 30 రాష్ట్ర,  కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్టీ జనాభా ఉన్నట్లు గుర్తించారు. విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో వీరి అభ్యున్నతికి రాజ్యాంగంలో 7.5 శాతం రిజర్వేషన్లు కేటాయించారు. ఈ వర్గానికి లోక్‌సభలో 47 స్థానాలు; ఆంధ్రప్రదేశ్‌లో 7, తెలంగాణలో 9 అసెంబ్లీ స్థానాలను రిజర్వ్‌ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 11.3%, పట్టణాల్లో 2.8% ఎస్టీలు ఉన్నారు. జనాభాపరంగా ఎస్టీలు అధికంగా ఉన్న రాష్ట్రాలు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, దాద్రానగర్‌హవేలి; అత్యల్పంగా ఉన్న రాష్ట్రాలు ఉత్తరాఖండ్, సిక్కిం, డామన్‌డయ్యూ; శాతాల పరంగా ఎస్టీలు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు మిజోరం 94.4%, నాగాలాండ్‌ 86.5%;  కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్‌ 98.8%. శాతాల పరంగా ఎస్టీలు అత్యల్పంగా ఉన్న రాష్ట్రాలు ఉత్తర్‌ప్రదేశ్‌ 0.6%, బిహార్‌ 1.3%; కేంద్రపాలిత ప్రాంతం అండమాన్‌ నికోబార్‌ 7.5%. గోవా, హరియాణా, పంజాబ్, చండీగఢ్, దిల్లీ, పుదుచ్చేరిలో ఎస్టీలు లేరు. ఆంధ్రప్రదేశ్‌లో 5.53%, తెలంగాణలో 9.08% ఎస్టీలు ఉన్నారు. ఎస్టీలు అధికంగా ఉన్న జిల్లా సెర్చిప్‌ - మిజోరం 98.1%); అత్యల్పంగా ఉన్న జిల్లా హద్రేస్‌ - ఉత్తర్‌ప్రదేశ్‌ 0.01%). 


ఆదిమ గిరిజన సమూహాలు (Primitive Tribal Group) 

1973 దేబర్‌ కమిషన్‌ ప్రకారం 1975లో ప్రిమిటివ్‌ ట్రైబల్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. అనంతరం 2002 ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రకారం 2006లో భారత ప్రభుత్వం పర్టిక్యులర్లీ వల్నరబుల్‌ ట్రైబల్‌ గ్రూప్‌ - పీవీటీజీ (ప్రత్యేక దుర్భలత్వ గిరిజన తెగలుగా) ఏర్పాటుచేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం 705 గిరిజన తెగల్లో 17 రాష్ట్రాల్లో 75 ప్రత్యేక దుర్భలత్వ గిరిజన తెగలు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 7, తెలంగాణలో 5  గిరిజన తెగలు ఉన్నాయి.


మరికొన్ని ప్రాధాన్య గిరిజన తెగలు 

గోండ్స్‌(Gonds): ప్రస్తుతం ఇందులో 8 మిలియన్ల జనాభా ఉన్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద గిరిజనతెగ సమూహం.  వీరు అధికంగా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఝార్ఖండ్, పశ్చిమ్‌బెంగాల్‌లో ఉన్నారు. వీరు నిజాయతీ గల శ్రమజీవులు. 


బిల్లులు(Bills): ప్రస్తుతం వీరి జనాభా ఆరు మిలియన్లు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, మహారాష్ట్రలో వీరి జనాభా అధికంగా ఉంది. వీరు విలువిద్య నైపుణ్యంలో ప్రావీణ్యులు. ఏకలవ్యుడు ఈ తెగకు చెందినవాడు. 

సంతాల్స్(Santhals): వీరి జనాభా ఆరు మిలియన్లు. సింధూలోయ నాగరికత కాలంలో అభివృద్ధి చెందారు. ప్రస్తుతం ఝార్ఖండ్‌లోని రాజమహల్‌ కొండలు, ఛోటా నాగ్‌పుర్‌ పీఠభూమి, ఒడిశా, పశ్చిమ్‌బెంగాల్, ఆంధ్రప్రదేశ్‌లో నివసిస్తున్నారు. ప్రాథమికంగా వీరు వ్యవసాయదారులు. ఇది సాంస్కృతిక వారసత్వ తెగ. 

 
నాగాలు(Nagas): ఈశాన్య భారత్‌లో 2 మిలియన్ల నాగా తెగకు చెందిన వారు నివసిస్తున్నారు. వీరు రాజకీయ చైతన్యం కలిగినవారు. నాగాలాండ్, మణిపూర్, అస్సోం, అరకాన్‌ యోమా, బ్రెయిల్‌ శ్రేణుల్లో జీవిస్తారు. వీరు 85% విస్తాపన వ్యవసాయం చేస్తారు.


థారస్‌(Tharus): వీరు ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో ఉన్నారు.


తోడాలు(Thodas): ఇది అతిచిన్న  గిరిజన తెగ. తమిళనాడులోని నీలగిరి కొండలు, కర్ణాటక - కర్నూలు జిల్లా సరిహద్దుల్లో ఉన్నారు. వీరి ప్రధాన వృత్తి పశుగణాభివృద్ధి. పాల ఉత్పత్తులుపై ఆధారపడి ఉంటారు. ఈ తెగలో మహిళలకు ఎక్కువ గౌరవం ఉంటుంది. బహు భర్తుత్వం ఉంది.


జర్వాస్‌(Jarawas): ఈ తెగ ప్రపంచంలో అంతరించిపోయే జాబితాలో ఉంది.  వీరు అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో నివసిస్తారు. 2001లో ఈ తెగకు చెందిన వారు 266 మంది ఉండగా, 2016 నాటికి 429 మందికి పెరిగారు. 


హిమాచల్‌ ప్రదేశ్, జమ్మూకశ్మీర్‌లో బోలియా, గుజ్జర్‌ గద్దీ, పాంగ్‌వాల్‌ తెగలు; ఉత్తర్‌ప్రదేశ్,  ఉత్తరాఖండ్‌లో బోటియా, చెరో, రాజి, థార్, వియర్‌; కేరళలో ఇరులా, కాదర్, కొచ్, మల్లయాన్, షొలింగా, సుమలి, యురాలి; ఆంధ్రప్రదేశ్‌లో చెంచు, కొండరెడ్లు, సవర; తెలంగాణలో గోండు, కోయ, లంబాడీ; రాజస్థాన్‌లో థంకా, మీనా, మిర, రావాత్, సహరియ; గుజరాత్‌లో కోలి, దుబలా వరాలి, తొడియా, రాయ్‌బరి, దఫార్‌; ఝార్ఖండ్‌లో ముండా; ఒడిశాలో సంతాల్, సవర మొదలైన గిరిజన తెగులు ఉన్నాయి.

Posted Date : 03-12-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌