• facebook
  • whatsapp
  • telegram

మౌర్య సామ్రాజ్యం - అశోకుడు - 2

* అశోకుడు క్రీ.పూ.273 నుంచి క్రీ.పూ. 232 వరకు రాజ్యాన్ని పాలించాడు.

* ఇతడు ఉజ్జయినిలో గవర్నర్‌గా ఉన్న సమయంలో ‘విదిశ’ పట్టణానికి చెందిన వైశ్య స్త్రీ మహాదేవిని ప్రేమించి, వివాహం చేసుకున్నాడు. వీరికి మహేంద్ర, సంఘమిత్ర జన్మించారు.

* అశోకుడికి అసంధిమిత్ర, తిస్మరఖ, చారువాకి, కారువాకి, పద్మావతి అనే భార్యలు ఉన్నారు. 

* ఇతడికి చారుమతి అనే కుమార్తె; కుణాల, త్రివర, జతాక అనే కుమారులు ఉన్నారు.

* అశోకుడి శాసనాల్లో ఇతడ్ని ‘దేవానాం ప్రియ’ (దేవతలకు ప్రియమైనవాడు), ‘ప్రియదర్శి’ (సుందరరూపం కలవాడు) అని పేర్కొన్నారు.

* మస్కి, గిర్నార్‌ శాసనాల్లో ‘అశోక’ అనే పేరు ఉంది. 

* పురాణాల్లో ఇతడ్ని ‘అశోకవర్ధన’ అని పేర్కొన్నారు. 

బబ్రూ శాసనంలో అశోకుడి పేరు ‘ప్రియదర్శిరాజా మగధే’ అని ఉంది.

* అశోకుడి పట్టాభిషేకం, బౌద్ధమత దీక్ష తీసుకోవడం మొదలైన విషయాల్లో చరిత్రకారుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. 

* అశోకుడి పట్టాభిషేకం జరిగిన తొమ్మిదేళ్లకు (క్రీ.పూ.261లో) ‘కళింగ యుద్ధం’ చేసినట్లు 13వ శిలాశాసనంలో ఉంది.

అశోకుడి శాసనాలు 

* అశోకుడు స్వయంగా శిలలు, స్తంభాలపై తన ఆశయాలు, పథకాలను, సంక్షేమ కార్యక్రమాలను చెక్కించాడు. వీటిలో మొత్తం 14 శిలా, 7 స్తంభ శాసనాలు ఉన్నాయి. ఇవి దిల్లీ, ఎర్రగుడి, మధుర, శ్రీనగర్, నందన్‌ఘాట్, రాంపూర్వ, సారనాథ్‌ మొదలైన ప్రదేశాల్లో లభించాయి. 

* మనదేశ చరిత్రలో మొట్టమొదటి శాసనాలు  వేయించింది అశోకుడు. అవి బ్రహ్మీ, ఖరోష్ఠి, గ్రీకు, అరబిక్‌ లిపుల్లో ఉన్నాయి.

* వాయవ్య భారతదేశంలో అరబిక్, ఖరోష్ఠి; అఫ్గానిస్థాన్‌లో అరబిక్, గ్రీకు లిపులను వాడారు.

ఈ శాసనాల్లో అశోకుడి జీవితం, అతడి దేశీ - విదేశీ విధానాలు, సామ్రాజ్య విస్తృతి మొదలైన విషయాలు ఉన్నాయి.

* అశోకుడి రుమిందై స్తంభశాసనం బ్రహ్మీ లిపిలో, ప్రాకృత భాషలో ఉంది. బబ్రూ శాసనంలో అశోకుడు తనను తాను మగధరాజుగా పేర్కొన్నాడు.

* 1837లో జేమ్స్‌ ప్రిన్సెప్‌ అశోకుని శాసనాల్లో ‘ప్రియదర్శి’ అనే పదాన్ని కనుకున్నాడు. 

* అశోకుడి స్తంభ శాసనాలైన తోప్రా (హరియాణా), మీరట్‌ (ఉత్తర్‌ ప్రదేశ్‌)లను ఫిరోజ్‌ తుగ్లక్‌ దిల్లీకి తరలించాడు. 

అలహాబాద్‌ స్తంభ శాసనాన్ని అక్బర్‌ కౌశాంబి నుంచి అలహాబాద్‌కు తరలించాడు. 

* ఇంగ్లండ్‌కి చెందిన అలెగ్జాండర్‌ కన్నింగ్‌హామ్‌ బబ్రూ శాసనాన్ని బైరాట్‌ (జైపూర్‌) నుంచి కలకత్తాకు మార్చాడు. 

* 14 పెద్దశిలా శాసనాల్లో మస్కి, ఎర్రగుడి (కర్నూలు), రాజుల మందగిరి (కడప) ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి.

* అశోకుడి పేరును మొదటిసారి మస్కి శాసనంలో ప్రస్తావించారు. 

* 4వ చిన్న శిలాశాసనాన్ని ‘రాణిశాసనం’గా పేర్కొంటారు. 

* అశోకుడు బరాబర్‌ గుహల (బిహార్‌)ను అజీవకులకు దానం చేశాడని గుహాలయ శాసనాల్లో ఉంది. ఇవి అశోకుడితో పాటు మౌర్యుల చరిత్రకు ప్రధాన ఆధారాలు. 

* మౌర్యుల తర్వాతి కాలానికి చెందిన సాగౌర తామ్ర (రాగి) శాసనం, మహాస్థాన్‌ శాసనాలు కరవు కాటకాల సమయంలో మౌర్యులు తీసుకొన్న చర్యల గురించి తెలియజేస్తున్నాయి. 

* అశోకుడి శాసనాలు ఉత్తర్‌ ప్రదేశ్, పాకిస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లో లభించాయి. 

* అశోకుడు శిలా, స్తంభ, గుహాలయ శాసనాల్లో ‘ధర్మం’ అనే పదంతోపాటు, అహింస, సత్ప్రవర్తనను బోధించాడు.

అశోకుడి దమ్మ విధానం 

* రోమిల్లా థాపర్‌ ప్రకారం, ధర్మ అనే సంస్కృత పదానికి ప్రాకృత రూపం ‘దమ్మ’. దీని అర్థం విశ్వవ్యాప్త చట్టం లేదా ధార్మికత. 

మానవుడు ధర్మానికి, సామాజిక నీతికి కట్టుబడి ఉండటం, సమాజంలోని అసహనాన్ని తగ్గించి, సామాజిక ఘర్షణలను తొలగించి, నీతిమంతమైన జీవితం గడపటమే దమ్మవిధాన లక్ష్యం.

* అశోకుడు సామ్రాజ్యాన్ని విస్తరించటం, నూతన పట్టణాల ఆవిర్భావం, వ్యాపార సమూహాలు ఏర్పడటం, చేతివృత్తి పనివారు తమ హక్కుల గురించి ప్రతిపాదించడం లాంటివి రాజ్య పాలనను  క్లిష్టతరం చేశాయి. సామ్రాజ్యంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ సమయంలో ప్రజలందరినీ ఒకే తాటిపై తెచ్చేందుకు అశోకుడు దర్మమార్గాన్ని ఎంచుకున్నాడు. 

* అశోకుడి ధర్మయాత్రల గురించి తెలిపే బౌద్ధ గ్రంథం ‘దివ్యవదన్‌’.

* అశోకుడు బౌద్ధమతాన్ని స్వీకరించినప్పటికీ దాన్ని రాజమతంగా ప్రకటించలేదు. 

* ‘‘ధర్మం అంటే నైతిక విలువలతో కూడిన జీవనం సాగించడం, వాటిని సాధించడానికి కరుణ, దయ, ప్రేమ, సత్ప్రవర్తన, ఆత్మనిగ్రహం లాంటి లక్షణాలు ఉండాలి’’ అని ప్రజలకు తెలిపాడు. 


దమ్మ సిద్ధాంతంలో ముఖ్యమైనవి:

* పెద్దలు, గురువుల పట్ల గౌరవం; తల్లిదండ్రుల పట్ల విధేయత ఉండాలి. బ్రాహ్మణులు, స్నేహితులు, బంధువుల పట్ల ఉదారత చూపించాలి. ఈ విషయాలను తన మూడో శిలాశాసనంలో పేర్కొన్నాడు. మొదటి శిలాశాసనంలో విందు, వినోదాలను నిషేధించాడు.

* బ్రాహ్మణులు, యాచకులకు దానధర్మాలు చేయాలి. అన్ని జీవుల పట్ల దయ చూపాలి.

* మాటలను అదుపులో ఉంచుకోవాలి. ప్రజల అభిప్రాయాలు, భావాలను ప్రతివారు సహనంతో ఆమోదించాలి. తన ఏడో శిలాశాసనంలో ప్రజలంతా ఐకమత్యంతో ఉండాలని పేర్కొన్నాడు.

* ఇతర మతాలు, సిద్ధాంతాలను కించపరచ కూడదు. ప్రతి ఒక్కరూ ఇతర మతాలవారిని గౌరవించాలి. ప్రజలు సామరస్యంతో జీవించాలి. ఈ విషయాలను తన మూడో శాసనంలో పేర్కొన్నాడు.

విభేదాలను బహిరంగంగా ఒప్పుకోవచ్చు. చెప్పుకోవచ్చు. వాటిని సహనంతో ఆమోదించాలి. తన అయిదో శాసనంలో సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు.

* ప్రజల సామరస్యాన్ని దెబ్బతీసే, వ్యతిరేక భావాలు పెంపొందించే సభలు, సమావేశాలను నిషేధించాలి.

హింసను విడనాడాలి. యుద్ధాన్ని బలప్రయోగం ద్వారా జయించడం త్యజించాలి.

* జంతుహింస చేయకూడదు.

* వైద్య సంబంధ చెట్లు నాటాలి. వాటివల్ల మానవులకు మేలు కలుగుతుంది.

*  7వ స్తంభశాసనంలో చెట్లు నాటడం, బావులు తవ్వించడం, ప్రతి 9 మైళ్లకు విశ్రాంతి గృహాలు నిర్మించడం లాంటి ప్రజాసంక్షేమ కార్యక్రమాల గురించి వివరించాడు.

మౌర్యుల కాలంలోని ప్రాదేశిక రాజ్యాలు - రాజధానులు

ఉత్తరాపథ - తక్షశిల

దక్షిణాపథ - సువర్ణగిరి

* ప్రాచ్య - పాటలీపుత్ర

*కళింగ - తోసలి

అవంతిరథ - ఉజ్జయిని

అశోకుడి వ్యక్తిగత విశేషాలు

సోదరులు: సుమన, తిస్స, వితోసన్‌

భార్యలు: దేవి, కారువాకి, అసంధిమిత్ర, పద్మావతి, తిష్యరక్షిత

కుమారులు: మహేంద్ర, తివర, కునాల, జాలూక

కుమార్తెలు: సంఘమిత్ర, చారుమతి

అల్లుళ్లు: అగ్నిబ్రహ్మ (సంఘమిత్ర భర్త), దేవపాల క్షత్రియ (చారుమతి భర్త)

మనవళ్లు: దశరథుడు, సంప్రతి, సుమన

వ్యక్తిగత సేవకులు: కంచు, ఉష్నిషి, కల్పక, ప్రసాదక, సనపాక

అశోకుని స్తంభాలపై ఉన్న జంతు తలలు

* రామపూర్వ - 1 : ఏక సింహం

లౌర్య - నందన్‌గర్‌ : ఏకసింహం

* బాసర్‌: ఏక సింహం

* రామపూర్వ - 2 : ఏక వృషభం

* సారనాథ్‌ : నాలుగు సింహాలు

* సాంచి : నాలుగు సింహాలు

* శాన్‌కిస్సా : ఏక గజం

మౌర్యుల మత నమ్మకాలు

* చంద్రగుప్తుడు  - జైన మతం

బిందుసారుడు -  అజీవక

* అశోకుడు - బౌద్ధమతం

* దశరథుడు  - అజీవక

అశోకుడి శాసనాల వర్గీకరణ

* బబ్రూ - బౌద్ధమతాన్ని స్వీకరించడం

* బరాబర్‌ - మతసహనం

* తెరయి స్తంభాలు - బౌద్ధమతం పట్ల అశోకుడికి ఉన్న గౌరవం

* 14 రాతి శాసనాలు - పరిపాలన, నైతికత

* చిన్న రాతి శాసనాలు - అశోకుడి వ్యక్తిగత చరిత్ర, స్థూలంగా ధర్మాన్ని గురించిన వివరణ

* 7 స్తంభ రాతిశాసనాలు - రాతి శాసనాలకు అనుబంధాలు

* 4 చిన్న స్తంభశాసనాలు - విలువైనవి కావు

కళింగ యుద్ధం 

* బిందుసారుడి కాలం నాటికే మౌర్యసామ్రాజ్యం దక్షిణాన కర్ణాటకలోని ‘సిద్ధపురం’ వరకు విస్తరించింది. ఆ సమయంలో ‘కళింగ’ (ఒడిశా) రాజ్యం స్వతంత్రంగా ఉండేది. దీన్ని స్వాధీనం చేసుకుని తన రాజ్యంలో విలీనం చేసుకోవాలని అశోకుడు భావించాడు.

* కళింగ గోదావరి, మహానది మధ్య ఉంది. ఉత్తర - దక్షిణ భారతదేశానికి భూ, జలమార్గాలు కళింగ ద్వారా ఉండటం; మౌర్య సామ్రాజ్య వాణిజ్యం బర్మా, ఆగ్నేయ ఆసియా, సింహళంతో జరగడం; అదే సమయంలో భూ, జల మార్గాల వాణిజ్యాన్ని కళింగ హస్తగతం చేసుకోవడం లాంటి కారణాల వల్ల మౌర్య సామ్రాజ్య వాణిజ్యానికి అవరోధం ఏర్పడింది. అంతేకాక బిందుసారుడు దక్షిణ భారతదేశంపై దండెత్తినప్పుడు కళింగ రాజ్యం చోళ, పాండ్యులకు తన సహాయాన్ని అందించింది. ఈ కారణాల వల్లే అశోకుడు కళింగపై దండెత్తాడు.

* ఈ యుద్ధంలో అశోకుడు విజయం సాధించాడు. 

* ఇందులో సుమారు లక్షమంది మరణించగా, లక్షన్నర మంది గాయపడ్డారు. ఈ సంఘటనలతో అశోకుడు తన యుద్ధ కాంక్షను వదిలి; శాంతి, అహింసను కోరుకున్నాడు. 

* ఈ విషయాలను అశోకుడు తన 13వ శిలాశాసనంలో ఈ విధంగా పేర్కొన్నాడు ‘‘ఇకపై యుద్ధాలు చేయను, ఆటవికులతో సహా సమస్త ప్రజలతో సామరస్యంగా మెలుగుతాను, నా సామ్రాజ్యంలోనే కాదు ప్రపంచంలోని ప్రజలంతా ధర్మం, అహింస, సత్‌ప్రవర్తనలను పాటిస్తే సుఖాన్ని పొందుతారు.’’ 

* యుద్ధంలో ఘన విజయం సాధించాక యుద్ధాలు చేయనని ప్రకటించిన ఏకైక రాజు ‘అశోకుడు’. 

* ఈ యుద్ధం తర్వాత అశోకుడు ‘ఉపగుప్తుడి’ బోధనలకు ప్రభావితుడై బౌద్ధమతాన్ని స్వీకరించాడు. ఇతడు ధర్మవిధానాన్ని పాటించి, పరమత సహనాన్ని చాటి, లౌకిక చక్రవర్తిగా పేరొందాడు.

Posted Date : 15-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌