• facebook
  • whatsapp
  • telegram

మౌర్య సామ్రాజ్యం - అశోకుడు

దమ్మ విధాన వ్యాప్తి

* దమ్మ విధానాలను వ్యాప్తి చేసేందుకు అశోకుడు ధర్మ మహామాత్యులు అనే ఉద్యోగులను నియమించాడు. వీరు దేశవిదేశాల్లో వీటిని ప్రచారం చేశారు. అశోకుడి అయిదో శిలాశాసనంలో వీరి ప్రస్తావన ఉంది.

* గండశిలలు, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలు, ఆధ్యాత్మిక కేంద్రాల వద్ద తన శాసనాలు వేయించాడు. 

* కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడం; ఖైదీల శిక్షలు తగ్గించడం, వారి కుటుంబాలకు ధన సహాయం చేయడం; వృద్ధులను ఆదుకోవడం మొదలైనవాటిని ధర్మ మహామాత్యులు వ్యాప్తి చేయాలి.

* రాజోద్యోగులు, రాజకులు, ప్రాదేశికులు ప్రతి అయిదేళ్లకోసారి తమ పాలిత ప్రాంతాల్లో ధర్మప్రచారం చేయాలని అశోకుడు ఆజ్ఞాపించాడు.

* అశోకుడు క్రీ.పూ.248లో లుంబిని వనాన్ని దర్శించాడని రుమ్మిందై శాసనంలో ఉంది. గయలోని బోధివృక్షాన్ని దర్శించి, తన సామ్రాజ్యంలోని అనేక ప్రదేశాల్లో ధర్మయాత్రలు చేశాడు.

అశోకుడి మొదటి స్తంభశాసనంలో ‘‘ఇది నా సిద్ధాంతం, ధర్మం ద్వారా రక్షణ, దమ్మ పరిపాలన, ప్రజాసుఖం, సామ్రాజ్య పరిరక్షణకు తోడ్పడుతుంది’’ అని ఉంది. 

* 13వ శిలాశాసనంలో అశోకుడి ధర్మ మహామాత్యులు, అన్ని మతశాఖల ధర్మ మహామాత్యుల నియామకం; వారు పరిరక్షించాల్సిన ధార్మిక ప్రదేశాలు, విధులు మొదలైనవాటిని పేర్కొన్నారు.

* 6వ శిలాశాసనంలో ధర్మ మహామాత్యుల పనితీరుపై పర్యవేక్షణ కోసం తగిన ఏర్పాట్లు చేసినట్లు ఉంది.


దమ్మవిధానం - విమర్శ

* దమ్మవిధానాన్ని చరిత్రకారులు విమర్శించారు.

*దీని వల్ల సామ్రాజ్యం సంఘటితమైంది. వేటగాళ్లు, జాలర్లు కూడా దీన్ని అనుసరించారు. 

* ధర్మసూత్రాలు బౌద్ధమత ప్రచారానికే అని, ధర్మాన్ని పాటించని ప్రజలను శిక్షించే అధికారం తమకు ఉందని స్థానిక అధికారులు భావించారు.

* 6వ స్తంభశాసనంలో ధర్మ సూత్రాలు పాటించిన ప్రజలు సుఖమయజీవనం గడుపుతారని ఉంది. దీంతో దీన్ని పాటించని వారిపై పక్షపాతం చూపారనే విమర్శ ఉంది.

* అశోకుడు తన దమ్మ విధానాలను అందరూ పాటించాలని చెప్పడంతో సామాజిక ఉద్రిక్తతలు, వివిధ శాఖల మధ్య ఘర్షణలు కొనసాగాయి. మౌర్య సామ్రాజ్య పతనానికి దమ్మ విధానం ముఖ్యకారణమని కొందమంది చరిత్రకారుల భావన.

* అశోకుడు మరణించాక మౌర్య పాలకులెవరూ దమ్మసూత్రాలను పాటించలేదు.


దమ్మ విధానం - అనుకూలతలు

*సమాజంలో శాంతిని నెలకొల్పడానికి, మానవులు మంచి మార్గంలో నడిచేందుకు దమ్మవిధానం ఎంతగానో తోడ్పడింది.

దీనివల్ల అశోకుడు తన లక్ష్యాన్ని చేరగలిగాడు. 

* భారతదేశంలోని ప్రజలందరి మధ్య సత్సంబంధాలు నెలకొన్నాయి. వారు స్వేచ్ఛగా అన్ని ప్రాంతాలకు తిరగగలిగారు.

*పాళీ భాషకు ప్రాధాన్యం పెరిగింది. బౌద్ధగ్రంథాలు మాగధి నుంచి పాళీలోకి అనువదించారు. దేశంలో కొంతమేర సాంస్కృతిక ఏకత్వం సాధ్యమైంది.

అశోకుడి పాలనా విధానం

అశోకుడు బౌద్ధమత వ్యాప్తికి కృషిచేస్తూనే పరిపాలన పట్ల శ్రద్ధవహించాడు. ఉద్యోగుల సాయంతో ప్రజాసంక్షేమ కార్యక్రమాలు నిర్వహించాడు. 

* బావులు తవ్వించి, చెట్లు నాటించి, విశ్రాంతి గృహాలు నిర్మించి, వ్యవసాయాభివృద్ధికి కృషిచేశాడు.

* ఏ సమయంలోనైనా ప్రజాసమస్యలు, అవసరాలను తనకు చెప్పొచ్చని అశోకుడు పేర్కొన్నాడు.

* మానవులు, పశువుల కోసం వైద్యశాలలు నిర్మించాడు.

అశోకుడు తన 28వ రాజ్యపాలనా సంవత్సరంలో ధర్మప్రచారం వల్ల జరిగిన అభివృద్ధిని సమీక్షిస్తూ ఒక స్తంభశాసనాన్ని వేయించాడు. ఇదే అతడి చివరి శాసనం. 

* అశోకుడు క్రీ.పూ.232లో మరణించాడు.

చరిత్రకారుల అభిప్రాయాలు

* ‘‘ప్రపంచ చక్రవర్తుల్లో అశోకుడు ప్రథముడు. అలెగ్జాండర్, సీజర్, నెపోలియన్‌లు ప్రపంచానికి చేసింది ఏమీ లేదు.’’ -హెచ్‌.జి.వేల్స్‌.

* ‘‘అశోకుడితో పోల్చదగిన వ్యక్తి ఒక సెయింట్‌ పాల్‌ మాత్రమే’’ - డాక్టర్‌ మెకెబెల్‌.

* ‘‘అశోకుడు బౌద్ధమతాన్ని స్వీకరించడం, సంఘానికి సేవ చేయడం బౌద్ధమత ఆరంధ దశ. భారతదేశంలో బౌద్ధమతం క్షీణించడం అశోకుడు మరణిచిన చాలా కాలానికి జరిగింది.’’ - ప్రొఫెసర్‌ రైస్‌డేవిడ్‌.

* కొంతమంది చరిత్రకారులు అశోకుడ్ని మార్కస్‌ అరిలియస్, షార్లేమాన్, ఒమర్‌ ఖలిఫాలతో పోలుస్తారు.

* అశోకుడి విధానాలు, ప్రాణులపట్ల దయ, పరమత సహనం, శాంతి, వ్యక్తిత్వం మొదలైన కారణాలతో అతడ్ని ‘‘అశోక ది గ్రేట్‌’’గా చరిత్రకారులు పేర్కొన్నారు.


అశోకుడి పరిపాలనాకాలంలో ముఖ్య సంఘటనలు

ధర్మమహామాత్రులను నియమించింది - 14వ పాలనా సంవత్సరం

* రుమ్మిందైని సందర్శించింది - 21వ పాలనా సంవత్సరం

* బోధి వృక్షాన్ని సందర్శించింది - 11వ పాలనా సంవత్సరం

* కళింగ యుద్ధం చేసింది - 9వ పాలనా సంవత్సరం

* దమ్మసూత్రాల ప్రచారానికి యుక్తులు, రజుకులు, ప్రాదేశికులను పంపింది - 13 పాలనా సంవత్సరం

* కోటాన్‌ను సందర్శించింది - 33వ పాలనా సంవత్సరం

* బుద్ధకోనకమన స్తూపాన్ని విస్తరించింది - 15వ పాలనా సంవత్సరం


అశోకుడు వివిధ ప్రాంతాలకు పంపిన బౌద్ధమత ప్రచారకులు

అశోకుడు బౌద్ధమతాన్ని ప్రపంచవ్యాప్తం చేసేందుకు వివిధ ప్రచారకులను దేశ విదేశాలకు పంపాడు.

 ప్రచారకుడు  ప్రాంతం
 మహేంద్రుడు  శ్రీలంక
మజ్‌హంతికా  కశ్మీర్, గాంధార
సోన, ఉత్తర సువర్ణభూమి
 మహారహిత      యోన
మహదేవ మహిసామన్‌దోల
 రక్షిత  వనవాసి
యోనాదమ్మరక్షిత  అపరాంతక
మహాదమ్మరక్షిత  మహారాత్త
 మజ్జిహిమ  హిమాలయ ప్రాంతం


మూడో బౌద్ధసంగీతి

మూడో బౌద్ధసంగీతి క్రీ.పూ.256లో అశోకుడి కాలంలో పాటలీపుత్రంలో జరిగింది. దీనికి అధ్యక్షుడు మొగలిపుత్తతిస్స. 

* ఈ సమావేశంలో బౌద్ధ ధర్మాన్ని స్పష్టంగా నిర్వహించి, బౌద్ధమత శాఖల పట్ల శాంతిని నెలకొల్పే ప్రయత్నం జరిగింది. అయితే అది సాధ్యం కాలేదు.

* త్రిపీటకాల్లో మూడోదైన అభిదమ్మ పీఠికను తయారుచేశారు.

* ఈ సంగీతిలో జరిగిన వాదోపవాదాలను ‘కథావత్తు’ అనే గ్రంథంగా రూపొందించారు.

* ఈ బౌద్ధసంగీతి తర్వాత అశోకుడు దేశదేశాలకు బౌద్ధబిక్షువులను నియమించాడు. 

బౌద్ధమత సేవ

* అశోకుడు మొదట శైవ మతస్థుడు. 

* కళింగ యుద్ధం తర్వాత ఉపగుప్తుడి బోధనలకు ప్రభావితుడైన అశోకుడు బౌద్ధమతాన్ని స్వీకరించాడు. ఈ విషయం రాజస్థాన్‌లో లభించిన బబ్రూ శాసనంలో ఉంది.

* బౌద్ధమతం స్వీకరించిన రెండున్నరేళ్ల తర్వాత ఇతడు బౌద్ధ భిక్షువుగా మారాడు. భిక్షువు దుస్తుల్లోనే రాజ్యపాలన చేశాడు. 

* భార్య విదిశాదేవి (మహాదేవి), అన్నకుమారుడు నిగ్రోధుడి ప్రభావం అశోకుడిపై ఉండేది. వీరి ప్రోత్సాహంతోనే ఇతడు బౌద్ధమతం స్వీకరించాడని దీపవంశం, మహావంశం బౌద్ధగ్రంథాలు పేర్కొంటున్నాయి.

* బౌద్ధధర్మాలు, సిద్ధాంతాల వ్యాప్తికి స్తూపాలు, చైత్యాలు నిర్మించాడు. కల్హణుడు రచించిన రాజతరంగిణిలో ఈ విషయాలు ఉన్నాయి.

* దివ్యవదన అనే బౌద్ధమత గ్రంథం ప్రకారం, అశోకుడు ఒక జైలును నిర్మించి అందులో భిక్షువుగా మారిన సముద్ర అనే వైశ్యుడ్ని ఉంచాడు. ఒకే సమయంలో సుమారు 84వేల స్తూపాలు నిర్మించి బౌద్ధమత వ్యాప్తికి ఎంతో కృషి చేశాడు. బ్రహ్మగిరి శిలాశాసనంలో అశోకుడు రెండున్నరేళ్లకుపైగా సామాన్య బౌద్ధ భిక్షువుగా ఉన్నట్లు ఉంది. 

* అశోకుడు సింహాసనాన్ని అధిష్టించిన పదేళ్లకు బోధివృక్షాన్ని దర్శించాడు. 

* అశోకుడు స్వయంగా వివిధ పర్యటనలు చేసి ప్రజల్లో బౌద్ధమతంపై అభిమానం పెరిగేలా చేశాడు.

మతం పేరుతో జరిగే జంతుబలులు, కర్మకాండలు, పూజలు, హింసాయుత కార్యక్రమాలను నిషేధించాడు. 

* అశోకుడి ఒకటో శిలాశాసనంలో జీవహింసను నిషేధించినట్లు ఉంది. 

* ఎనిమిదో శిలాశాసనంలో వేట, వినోదయాత్రలు త్యజించి, ధర్మయాత్రలు చేశాడని ఉంది. 

* బుద్ధుడి ప్రధాన నగరాలైన గయ, కపిలవస్తు, శ్రావస్థి, కుశి నగరాలను దర్శించి, అక్కడి పన్నులను రద్దుచేశాడు. 

* అశోకుడు బౌద్ధులకే కాక, అజీవకులకు కూడా బరాబర్‌ గుహలను దానం చేశాడు. 

* క్రీ.పూ.255లో లుంబినీవనాన్ని దర్శించి, అశ్వకిరీట శిల్పం ఉన్న శిలాస్తంభాన్ని ప్రతిష్ఠించాడు. 

* బౌద్ధమత సూత్రాలు ఉన్న శాసనాలను మీరట్, కౌశాంబి, గిర్నార్, చిత్తదుర్గ, సాంచి, జౌగడ మొదలైన ప్రాంతాల్లో వేయించాడు.

Posted Date : 15-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌