• facebook
  • whatsapp
  • telegram

లోహశోధన పరిశ్రమలు

లోహ ఆధారిత పరిశ్రమలు భారతదేశ ఆర్థికాభివృద్ధికి వెన్నెముకగా అభివర్ణించవచ్చు. మన దేశంలో లోహయుగం ఐరోపాలో కంటే మూడు వేల సంవత్సరాల కిందటే ప్రారంభమైంది. ప్రకృతి సిద్ధంగా లభించే లోహాల ద్వారా అనేక రకాల ఉత్పత్తులను తయారు చేస్తున్నారు.


ఇనుము - ఉక్కు 

దేశంలో మొదట 1830లో తమిళనాడులోని పొర్టొనోవా వద్ద ఇనుము - ఉక్కు పరిశ్రమను స్థాపించారు. 1870లో జెమ్స్‌ ఎర్స్‌కైన్‌ కుల్టీ వద్ద చిన్న ప్లాంట్‌ను స్థాపించాడు. ఆధునిక పద్ధతిలో 1875 నుంచి బెంగాల్‌ ఐరన్‌ వర్క్స్‌ కంపెనీ పేరుతో ఇనుము, ఉక్కు తయారీ ప్రారంభమైంది. దీన్ని 1881లో బారాకర్‌ ఐరన్‌ వర్క్స్‌గా, 1890లో బెంగాల్‌ ఐరన్‌ అండ్‌ స్టీల్‌ కంపెనీగా పేరు మార్చారు. ఇనుము తయారీకి ముడి ఇనుము, బొగ్గు, సున్నపురాయి 4 : 2 : 1 నిష్పత్తిలో వినియోగిస్తున్నారు. ఉక్కు/ స్టీల్‌ తయారీకి నికెల్, జింకు మిశ్రమాలను ఉపయోగిస్తారు. ఇనుము గట్టిదనానికి మాంగనీస్‌ వినియోగిస్తారు. స్టెయిన్‌లెస్‌ స్టీలు తయారీకి ఇనుము, నికెల్, క్రోమియం, ఇతర మిశ్రమాలను వాడతారు. ఉక్కు పరిశ్రమలను ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారు. ప్రభుత్వరంగ సంస్థల యూనిట్స్‌ ఉక్కు మంత్రిత్వశాఖ నియంత్రణలో ఉంటాయి. ఇవి SAIL, RINL ఆధీనంలో పనిచేస్తాయి.


స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(SAIL): కేంద్ర ప్రభుత్వం 1954లో స్టీల్‌ ప్లాంట్లను పర్యవేక్షించడానికి హిందుస్థాన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ను ఏర్పాటు చేసింది. దీన్ని 1973 జనవరి 24న స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాగా మార్చారు. దీని కింద బిలాయ్, రూర్కెలా, బర్నపూర్, బొకారో, దుర్గాపూర్‌ అనే ఇంటిగ్రేటెడ్‌ ప్లాంట్లు; సేలం, భద్రావతి అనే ప్రత్యేక స్టీల్‌ ప్లాంట్లు ఉన్నాయి.


రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌(RINL):  దీన్ని వైజాగ్‌లో 1982 ఫిబ్రవరి 18న స్థాపించారు. ఇది దేశంలో మొదటి తీర ప్రాంతం ఆధారంగా నిర్మించిన స్టీల్‌ప్లాంట్‌ కార్పొరేషన్‌ సంస్థ.


ఇనుము - ఉక్కు పరిశ్రమ కేంద్రాలు

భారతదేశంలో ప్రస్తుతం 10 ప్రధాన ఇనుము - ఉక్కు పరిశ్రమలు, 600కు పైగా చిన్నతరహా ఉక్కు పరిశ్రమలు పనిచేస్తున్నాయి.

టాటా ఐరన్‌ అండ్‌ స్టీల్‌ కంపెనీ (TISCO): ఇది భారతదేశంలో అతి ప్రాచీన ఇనుము - ఉక్కు కర్మాగారం, ప్రైవేటు యాజమాన్య సంస్థ. దీన్ని 1907లో ఝార్కండ్‌లోని సింగ్‌బమ్‌ జిల్లా ‘సక్చి’ వద్ద జెంషెడ్‌జీ టాటా స్థాపించారు. 1911లో దుక్కు ఇనుము ఉత్పత్తి చేసి, 1912 నుంచి ఉక్కు తయారీ ప్రారంభించారు. దీనికి ఒడిశాలోని నోముండి, గురుహిసాని నుంచి ఇనుము, ఝార్కండ్‌లోని ఝరియా నుంచి బొగ్గు, జొడా (ఒడిశా) నుంచి మాంగనీస్, సుందర్‌ఘర్‌ నుంచి డోలమైట్, సున్నపురాయి ముడి పదార్థాలు లభిస్తాయి. ఖర్కయోనది నుంచి నీటి సరఫరా జరుగుతుంది. టిస్కో యాజమాన్యం రెండో స్టీల్‌ప్లాంట్‌ను ఒడిశాలోని గోపాల్‌పూర్‌ వద్ద దుబరీ స్టీల్‌ వర్క్స్‌ను ఏర్పాటు చేసింది.


ఇండియన్‌ ఐరన్‌ అండ్‌ స్టీల్‌ కంపెనీ(IISCO): దీన్ని 1919లో పశ్చిమ్‌ బంగలోని బరన్‌పూర్‌ వద్ద స్థాపించారు. దీనిలో కుల్టీ (1875), హిరాపూర్‌ (1908) స్టీల్‌ ప్లాంట్లను 1937లో విలీనం చేశారు. ఈ మూడు పరిశ్రమలను ప్రస్తుతం ఇండియన్‌ ఐరన్‌ అండ్‌ స్టీల్‌ కంపెనీగా పిలుస్తున్నారు. ఇది 1972లో ప్రభుత్వ యాజమాన్యంలోకి వచ్చింది. దీనికి సింగ్‌బమ్, మయూర్‌భంజ్‌ నుంచి ఇనుప ఖనిజం, ఝరియా నుంచి బొగ్గు, సుందర్‌ఘర్‌ నుంచి డోలమైట్, సున్నపురాయి లభిస్తాయి. దామోదర్‌ వ్యాలీ కార్పొరేషన్‌ నుంచి నీరు, విద్యుత్‌శక్తి సరఫరా అవుతుంది.


మైసూర్‌ ఐరన్‌ అండ్‌ స్టీల్‌ కంపెనీ (MISCO): దీన్ని 1923లో కర్ణాటక రాష్ట్రంలో భద్రావతి నది తీరంలో స్థాపించారు. అందువల్ల దీన్ని భద్రావతి స్టీల్‌ ప్లాంట్‌ అని కూడా పిలుస్తారు. దీనికి అమెరికా ఫెరి అండ్‌ మార్షల్‌ సంస్థ సాంకేతిక సహాయాన్ని అందించింది. 1962లో కర్ణాటక ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకొని విశ్వేశ్వరయ్య ఐరన్‌ అండ్‌ స్టీల్‌ కంపెనీగా నామకరణం చేసింది. దీన్ని 1988లో సెయిల్‌లో విలీనం చేశారు. దీనికి ముడి పదార్థాలన్నీ కర్ణాటకలోనే లభిస్తాయి.


బిలాయ్‌ ఐరన్‌ అండ్‌ స్టీల్‌ కంపెనీ (BISCO): ఇది 1959లో ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌ జిల్లాలో రెండో ప్రణాళిక కాలంలో రష్యా వైజ్ఞానిక నైపుణ్యంతో ప్రారంభమైంది. దీనికి దాలి - రాజరా నుంచి ఇనుము, కొర్బా నుంచి బొగ్గు, నందిని గనుల నుంచి సున్నపురాయి, బాలఘాట్‌ నుంచి మాంగనీస్‌ ముడి పదార్థం, కొర్బా థర్మల్‌ కేంద్రం నుంచి శక్తి వనరు లభిస్తాయి.


రూర్కెలా ఐరన్‌ అండ్‌ స్టీల్‌ కంపెనీ (RISCO): ఇది ఒడిశాలోని సుందర్‌ఘర్‌ జిల్లాలో పశ్చిమ జర్మనీ సాంకేతిక సహాయంతో ‘క్రుప్స్‌ అండ్‌ డెమాంగ్‌’ అనే పేరుతో ప్రారంభమైంది. 1959లో రెండో ప్రణాళిక కాలంలో ఉత్పత్తి ప్రారంభించారు. దీనికి కియోంజర్‌ నుంచి ఇనుము, ఝరియా - తాల్చెరు నుంచి బొగ్గు, బరజ్‌మాడ్‌ నుంచి మాంగనీస్, భరద్వార్‌ నుంచి డోలమైట్, పూర్ణపాణి నుంచి సున్నపురాయి లభిస్తాయి. బ్రహ్మణి నది నుంచి నీటిని, హీరాకుడ్‌ ప్రాజెక్టు నుంచి శక్తిని సరఫరా చేస్తున్నారు.


దుర్గాపూర్‌ ఐరన్‌ అండ్‌ స్టీల్‌ కంపెనీ(DISCO): దీన్ని హిందుస్థాన్‌ స్టీల్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో 1959లో పశ్చిమ్‌ బంగలోని దుర్గాపూర్‌ జిల్లా బార్దమాన్‌ వద్ద స్థాపించారు. దీన్ని రెండో ప్రణాళిక కాలంలో బ్రిటన్‌ సాంకేతిక సహాయంతో ప్రారంభించగా, 1962 నుంచి ఉక్కు ఉత్పత్తి చేస్తున్నారు. దీనికి మయూర్‌భంజ్‌ - బోవాని నుంచి ఇనుము; ఝరియా - రాణిగంజ్‌ నుంచి బొగ్గు; బిర్‌మిత్రాపూర్‌ నుంచి డోలమైట్, సున్నపురాయి; దుర్గాపూర్‌ బ్యారేజి నుంచి నీరు, దామోదర్‌ కార్పొరేషన్‌ నుంచి విద్యుత్‌శక్తి లభిస్తాయి.


బొకారో ఐరన్‌ అండ్‌ స్టీల్‌ కంపెనీ (BISCO): దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ కర్మాగారం. కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంతో 1964లో ఝార్కండ్‌లోని హజారీబాగ్‌ జిల్లాలో దామోదర్‌ నది సంగమ ప్రాంతంలో స్థాపించారు. ఈ కర్మాగారం 1972 నుంచి ఉత్పత్తి ప్రారంభించింది. దీన్ని సోవియట్‌ రష్యా సహకారంతో నిర్మించారు. దీనికి కిరిబురు నుంచి ఇనుము; ఝరియా నుంచి బొగ్గు; పాలము నుంచి సున్నపురాయి; దామోదర్‌ వ్యాలీ నుంచి నీరు, విద్యుత్‌శక్తి లభిస్తాయి.


ఇతర స్టీల్‌ కంపెనీలు: నాలుగో పంచవర్ష ప్రణాళికలో జాతీయస్థాయిలో స్టీల్‌ అవసరం పెరగడం దృష్ట్యా కేంద్రం మరికొన్ని స్టీల్‌ కంపెనీలను స్థాపించడానికి నిర్ణయం తీసుకుంది.


వైజాగ్‌ ఐరన్‌ అండ్‌ స్టీల్‌ కంపెనీ (VISCO): దీన్ని రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో నిర్మించారు. దేశంలోనే మొదటి తీర ప్రాంత ఆధారిత పబ్లిక్‌ సెక్టార్‌ ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ప్లాంట్‌. దీన్ని రష్యా - పశ్చిమ జర్మనీ వైజ్ఞానిక సహాయంతో 1971లో ప్రారంభించారు. 1982లో ఉత్పత్తి మొదలుపెట్టి, 1992లో జాతీయం చేశారు. దీనికి బైలాదిల్లా నుంచి ఇనుము, సింగరేణి నుంచి బొగ్గు; మహారాష్ట్ర నుంచి మాంగనీస్, సున్నపురాయి; ఏలేశ్వరం నుంచి నీరు లభిస్తాయి.


సేలం స్టీల్‌ కంపెనీ(SSCO):  దీన్ని తమిళనాడులోని సేలం వద్ద స్థాపించి 1982లో ఉత్పత్తి ప్రారంభించారు. ప్రభుత్వం ముద్రించే నాణేల తయారీ, స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఉక్కు కర్మాగారం మెక్సికో, ఆస్ట్రేలియా, దక్షిణ - తూర్పు ఆసియా దేశాలకు స్టీల్‌ ఎగుమతి చేస్తుంది. కర్ణాటకలోని బళ్లారిలో గల హోస్పేట్‌ వద్ద విజయనగర్‌ స్టీల్‌ప్లాంట్, ఒడిశాలోని కళింగనగర్‌ వద్ద నిలాంచల్‌ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్, ఎన్‌ఎండీసీ సంస్థ ఆధ్వర్యంలో ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ జిల్లాలో నగర్‌నార్‌ స్టీల్‌ ప్లాంట్, కర్ణాటకలోని దోనిమలై వద్ద సమీకృత ఉక్కు కర్మాగారాలను స్థాపించారు.


అల్యూమినియం: ఇది దేశంలో స్టీల్‌పరిశ్రమ తర్వాత రెండో అత్యంత ప్రాముఖ్యత కలిగిన లోహశోధన పరిశ్రమ. దీన్ని బాక్సైట్‌ ముడి ఖనిజం నుంచి వెలికితీస్తారు. ఇది తేలికగా ఉండి, తుప్పు పట్టదు, వేడిని గ్రహిస్తుంది. దీని తయారీకి అత్యధిక నీరు, విద్యుత్‌శక్తి అవసరం. అల్యూమినియం విద్యుత్‌శక్తికి 48%, ఆటోమొబైల్స్‌కు 15%, నిర్మాణానికి 13%, ప్యాకింగ్‌ అవసరాలకు 8%, పరిశ్రమలకు 7% ఉపయోగపడుతుంది. దేశంలో మొదటి అల్యూమినియం ప్లాంట్‌ను 1937లో కేరళలోని ఆల్వే (ఆలుపురం) వద్ద ఏర్పాటు చేసి ఇండియన్‌ అల్యూమినియం కంపెనీ, 1938 నుంచి ఆలుపురం రిడక్షన్‌ వర్క్స్‌ ద్వారా ఉత్పత్తి ప్రారంభించారు. తర్వాత 1944లో పబ్లిక్‌ సెక్టార్‌ కంపెనీగా మారింది. రెండో పంచవర్ష ప్రణాళిక కాలంలో హిందాల్కో - రేణుకుట్, ఇందాల్కో - హీరాకుడ్, మూడో ప్రణాళిక కాలంలో మాల్కో(మెట్టూరు) స్థాపించారు.


సిమెంట్‌: సిమెంట్‌ పరిశ్రమకు సున్నపురాయి, బొగ్గు, సుద్ద, జిప్సం, సిలికా, అల్యూమినియం, డోలమైట్, ఎర్రమట్టి ముడి సరకులు. దేశంలో మొదటిసారిగా 1904లో మద్రాసు వద్ద పోర్ట్‌లాండ్‌ సిమెంట్‌ ఉత్పత్తి ప్రారంభమైంది. 1912లో గుజరాత్‌ పోర్‌బందర్‌ వద్ద ఇండియన్‌ సిమెంట్‌ కంపెనీ లిమిటెడ్‌ ద్వారా సిమెంట్‌ ఉత్పత్తి చేయడం విజయవంతమైంది. 1936లో అసోసియేటెడ్‌ సిమెంట్‌ కంపెనీ ఉత్పత్తి ప్రారంభించడంతో ఈ రంగంలో మార్పు వచ్చింది. దేశంలో దాల్మియా సిమెంట్‌ లిమిటెడ్‌ 100% పునరుత్పాదక శక్తిని కల్పించే మొదటి సిమెంట్‌ ఫ్యాక్టరీగా మారింది. ప్రపంచంలో సిమెంట్‌ రంగంలో చైనా మొదటి స్థానంలో ఉండగా, భారత్‌ది రెండో అతిపెద్ద మార్కెట్‌. అత్యధిక సిమెంట్‌ ఉత్పత్తిని మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్‌; ఎక్కువ సంఖ్యలో సిమెంట్‌ ప్లాంట్స్‌ ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు; అత్యధిక సిమెంట్‌ వినియోగం మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, తమిళనాడు కలిగి ఉన్నాయి.


ఎరువులు: దేశంలో ఆహార ధాన్యాల కోసం మొదటి ఎరువుల కర్మాగారాన్ని 1906లో తమిళనాడులోని రాణిపేటలో స్థాపించారు. ఇది సూపర్‌ ఫాస్ఫేట్‌ ప్లాంట్‌. 1938లో కర్ణాటకలోని బెళగోళ, 1947లో కేరళలోని అల్వే వద్ద ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఆహార ధాన్యాల యోచనా సంఘం 1943లో ఎరువులను తయారుచేసే బాధ్యతను భారత ప్రభుత్వానికి అప్పగించింది. ఈ సంఘం సూచన మేరకు 1951లో ఝార్కండ్‌లోని ధన్‌బాద్‌ సమీపంలో సింధ్రి వద్ద ఎరువుల కర్మాగారాన్ని స్థాపించింది. ఇందులో అమ్మోనియా సల్ఫేట్, యూరియా తయారు చేస్తారు. ఇది మొదటి ప్రభుత్వరంగ సంస్థ. 1956లో నంగల్‌ ఫెర్టిలైజర్‌ అండ్‌ కెమికల్‌ లిమిటెడ్, 1961లో న్యూదిల్లీ కేంద్రంగా ఫెర్టిలైజర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, 1974లో నేషనల్‌ ఫెర్టిలైజర్‌ లిమిటెడ్‌ ఏర్పడ్డాయి. ప్రస్తుతం దేశంలో 57 ఫెర్టిలైజర్‌ యూనిట్లు ఉన్నాయి. ఇందులో నత్రజని ద్వారా యూరియా, అమ్మోనియా ఫాస్ఫేట్‌ ద్వారా దీతిశి (డై అమ్మోనియా ఫాస్ఫేట్‌), మిశ్రమ ఎరువుల ద్వారా విశిరీ (నత్రజని, ఫాస్ఫేట్, పొటాషియం) తయారు చేస్తారు.


మోటార్‌ కార్లు: భారతదేశ ఆటోమొబైల్‌ రంగం ప్రపంచ అమ్మకాల్లో 4వ అతిపెద్ద రంగం. ఇది వాణిజ్య వాహనాల తయారీలో 7వ స్థానంలో ఉంది. ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. దేశంలో మోటార్‌ పరిశ్రమ 1928లో జనరల్‌ మోటార్స్‌ ఇండియా లిమిటెడ్‌తో ప్రారంభమైంది. 1930లో ఫోర్డ్‌ కంపెనీ మద్రాసులో ట్రక్కులు, కార్ల తయారీ; 1947లో ముంబయిలో కుర్లా ప్రిమియర్‌ ఆటోమొబైల్స్‌ లిమిటెడ్‌; 1948లో కోల్‌కతాలోని ఉత్తరఫర్‌ వద్ద హిందుస్థాన్‌ మోటార్స్‌ లిమిటెడ్‌లను ఏర్పాటు చేసింది. 1958 నుంచి రక్షణశాఖ కార్ల ఉత్పత్తికి జపాన్‌ సహాయంతో నిసాన్‌ కంపెనీ జీప్‌లను తయారు చేయడం ప్రారంభించింది.

Posted Date : 14-12-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌