• facebook
  • whatsapp
  • telegram

ఖనిజాలు, శక్తి వనరులు  

ఒక నిర్దిష్ట రసాయన సమ్మేళనంతో సహజంగా లభించే పదార్థమే ఖనిజం. ఖనిజాల విస్తరణ భూమి అంతటా ఒకే విధంగా ఉండదు. అవి ఒక నిర్దిష్ట ప్రాంతంలో లేదా రాతి పొరల్లో నిక్షిప్తమై ఉంటాయి. వివిధ పరిస్థితుల కారణంగా ఖనిజాలు అనేక రకాలైన భౌగోళిక వాతావరణంలో ఏర్పడతాయి. అవి మానవ జోక్యం లేకుండా సహజ ప్రక్రియల ద్వారా ఏర్పడతాయి. రసాయన ధర్మం అయిన ద్రావణీయత, భౌతిక ధర్మాలైన రంగు, సాంద్రత, కాఠిన్యతల ఆధారంగా వీటిని గుర్తించవచ్చు.

సంప్రదాయ శక్తి వనరులు

మానవుడు ఎన్నో ఏళ్లుగా ఉపయోగిస్తున్న శక్తి వనరులను సంప్రదాయ శక్తి వనరులు (Conventional Sources) అంటారు.

* వంట చెరకు, శిలాజ ఇంధనాలు ముఖ్యమైన సంప్రదాయ శక్తి వనరులు.

వంట చెరకు (Fire Wood): దీన్ని వంటకు, వేడి చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు.

అనుకూలతలు:

* సులభంగా లభిస్తుంది.

* పెద్ద సంఖ్యలో ప్రజలకు శక్తిని అందిస్తుంది.

ప్రతికూలతలు:

* సేకరణకు ఎక్కువ సమయం పడుతుంది.

* కాలుష్యానికి కారణం.

* అడవులను నిర్మూలించాల్సి వస్తుంది.

శిలాజ ఇంధనాలు (Fossil fuel):  మిలియన్‌ సంవత్సరాలకు పూర్వం భూకంపాల కారణంగా భూమిలోకి కుంగి పోయిన మొక్కలు, జంతువుల అవశేషాలు అధిక వేడి, పీడనం వల్ల శిలాజ ఇంధనాలుగా మారతాయి.

* బొగ్గు, సహజవాయువు, పెట్రోలియం లాంటి శిలాజ ఇంధనాలు సంప్రదాయ శక్తి వనరుల్లో ప్రధానమైనవి. వీటి నిల్వలు పరిమితం. ప్రపంచ జనాభా ఖనిజాలను వినియోగిస్తున్న రేటు ఆ ఖనిజాలు ఏర్పడుతున్న రేటు కంటే చాలా ఎక్కువ. కాబట్టి ఇవి త్వరలోనే అంతరించిపోయే అవకాశం ఉంది.

బొగ్గు: ఇది అత్యంత సమృద్ధిగా లభించే శిలాజ ఇంధనం. దీన్ని గృహ ఇంధనంగా, ఇనుము-ఉక్కు పరిశ్రమల్లో, ఆవిరి యంత్రాల్లో, విద్యుత్‌ ఉత్పత్తి పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. బొగ్గు నుంచి ఉత్పత్తి చేసే విద్యుత్‌ను తాపవిద్యుత్‌ (Thermal Power) అంటారు. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న బొగ్గు కొన్ని మిలియన్‌ సంవత్సరాల క్రితం ఏర్పడింది. 

* అతిపెద్ద వృక్షాలు, చిత్తడి నేలలు భూమి పొరల్లో నిక్షిప్తమై కాలక్రమంలో బొగ్గుగా రూపాంతరం చెందాయి. అందుకే బొగ్గును ‘ఖననం చేసిన సూర్యరశ్మి’ (Buried Sunshine) అంటారు.

* చైనా, అమెరికా, జర్మనీ, రష్యా, దక్షిణాఫ్రికా, ఫ్రాన్స్‌లు ప్రపంచంలో ముఖ్య బొగ్గు ఉత్పత్తి దారులు.

* భారతదేశంలో బొగ్గును అధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఝార్ఖండ్‌.


దేశంలో బొగ్గు ఉత్పత్తి కేంద్రాలు

రాణిగంజ్‌ - పశ్చిమ్‌ బంగా

ఝరియా, ధన్‌బాద్, బొకారో - ఝార్ఖండ్‌

అనుకూలతలు:

* విస్తృతంగా అందుబాటులో ఉంటుంది.

* విద్యుత్‌ ఉత్పత్తికి ఉపయోగిస్తారు.


ప్రతికూలతలు:

* కాలుష్యానికి మూలం

* రవాణా కష్టం


సహజవాయువు (Natural Gas): 

సహజవాయువు పెట్రోలియం నిక్షేపాల్లో కలిసి లభిస్తుంది. ముడిచమురును బయటకు తీశాక ఇది విడుదలవుతుంది. దీన్ని గృహ, పారిశ్రామిక, ఇతర అవసరాలకు ముఖ్య ఇంధనంగా ఉపయోగిస్తారు. ఇది స్వచ్ఛమైన శక్తి వనరు. దీన్ని విద్యుత్‌ ఉత్పత్తిలో ఇంధనంగా, పరిశ్రమల్లో వేడి కోసం ఉపయోగిస్తారు. అదేవిధంగా రసాయన, పెట్రోకెమికల్, ఎరువుల పరిశ్రమల్లో ముడి పదార్థంగా, రవాణా, వంట ఇంధనంగానూ వాడతారు.

* అమెరికా, రష్యా, ఇరాన్, ఖతార్, చైనా, కెనడా, ఆస్ట్రేలియాలు సహజ వాయువును అధికంగా ఉత్పత్తి చేస్తున్నాయి.

* భారత్‌లో ముంబయి హై, కృష్ణా - గోదావరి బేసిన్, గుజరాత్‌లోని కాంబే బేసిన్, త్రిపుర, అసోంలో అధిక మొత్తంలో సహజవాయు నిక్షేపాలు ఉన్నాయి.

* సహజ వాయువును పునరుత్పాదక లేదా సంప్రదాయేతర శక్తి వనరులకు సహాయకారిగా, శిలాజ ఇంధనాలకు స్వచ్ఛమైన ప్రత్యామ్నాయంగా చెప్పొచ్చు.

* CNG (Compressed Natural Gas) ని పర్యావరణహిత వాహన ఇంధనంగా పేర్కొంటారు. ఇది పెట్రోలియం, డీజిల్‌ కంటే తక్కువ కాలుష్యాన్ని కలిగిస్తుంది.

అనుకూలతలు:

* పైపుల ద్వారా రవాణా చేయొచ్చు.

* బొగ్గు, చమురు కంటే శుద్ధమైంది.

* చమురు కంటే చవకైంది.


జల విద్యుత్‌ (Hydel Power): 

డ్యాంలలో నిల్వచేసిన నీటిని లేదా నది నీటిని ఎత్తు నుంచి ఆనకట్టకు దిగువన ఉన్న టర్బైన్స్‌పై పడేలా చేసి, విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తారు. దీన్నే జల విద్యుత్‌ అంటారు.

* ప్రపంచంలో జల విద్యుత్‌ను అభివృద్ధి చేసిన మొదటి దేశం నార్వే.

* ప్రపంచవ్యాప్తంగా లభించే విద్యుత్‌లో నాలుగో వంతు జల విద్యుత్‌ ద్వారా ఉత్పత్తి అవుతోంది.

* పరాగ్వే, నార్వే, బ్రెజిల్, చైనాలు జలవిద్యుత్‌ ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్నాయి.


పెట్రోలియం:

పెట్రోలియం అనే పదం పెట్రా, ఓలం అనే లాటిన్‌ పదాల నుంచి ఆవిర్భవించింది. ‘పెట్ర’ అంటే రాయి, ‘ఓలియం’ అంటే నూనె అని అర్థం.

* ఇది సహజంగా రాతిపొరల మధ్య నుంచి లభిస్తుంది. తీర ప్రాంతాల్లో, సముద్రంలో ఉండే చమురు క్షేత్రాల నుంచి పెట్రోలియంను వెలికితీస్తారు.

* పెట్రోలియం నుంచి డీజిల్, పెట్రోల్, కిరోసిన్, మైనం, ప్లాస్టిక్, కందెనలు లాంటి ఉత్పత్తులు తయారు చేస్తారు. 

* పెట్రోలియం, వాటి ఉత్పత్తులు చాలా విలువైనవి. అందుకే దీన్ని ‘లిక్విడ్‌ గోల్డ్‌’ అంటారు.

* ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, ఖతార్‌ ముఖ్యమైన పెట్రోలియం ఉత్పత్తి దేశాలు.

* అసోంలోని దిగ్బాయ్, ముంబయి హై, కృష్ణా - గోదావరి నదీ డెల్టాలు భారతదేశంలో ముఖ్యమైన పెట్రోలియం ఉత్పత్తి కేంద్రాలు.

అనుకూలతలు:

* రవాణా చేయడం సులభం.

* పెట్రో రసాయన పరిశ్రమలకు ఇదే ఆధారం.

ప్రతికూలతలు:

* చమురు చిందడం, గ్యాస్‌ లీకేజీ కారణంగా ఆక్సిజన్‌ క్షీణించడం.

* దీని ద్వారా విడుదలయ్యే కాలుష్య కారకాలు ఆమ్ల వర్షాలకు కారణమవుతాయి.

* త్వరగా తరిగిపోయే శక్తి వనరులు. కొత్తవి అన్వేషించడం చాలా కష్టం.


సంప్రదాయేతర శక్తి వనరులు

సౌరశక్తి, పవన శక్తి, తరంగశక్తిని సంప్రదాయేతర శక్తి వనరులు అంటారు. ప్రస్తుతం వీటినే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వినియోగిస్తున్నారు.

* ఇవి పర్యావరణాన్ని కలుషితం చేయవు.


సౌరశక్తి (Solar Energy): 

సూర్యుడి ఉష్ణం, కాంతి శక్తి నుంచి విద్యుత్‌ను తయారు చేసే ప్రక్రియ. సూర్యుడి నుంచి వచ్చే సౌరశక్తిని సౌరఘటాల్లో నిల్వ చేసి, విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తారు. అనేక సౌర ఘటాలను సౌరపలకలకు కలుపుతారు. ఇవి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి.

అనుకూలతలు:

* ఇది తరగని శక్తి.

* కాలుష్య రహితం.

ప్రతికూలతలు:

* ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది.

* వ్యాప్తి, వృథా ఎక్కువ.


అణుశక్తి (Nuclear Power):  

యురేనియం, థోరియం పరమాణువుల కేంద్రకంలో నిల్వ చేసిన శక్తి నుంచి అణుశక్తిని పొందొచ్చు. ఇవి అణు రియాక్టర్‌లో కేంద్రక విచ్ఛిత్తి అనే ప్రక్రియ ద్వారా శక్తిని విడుదల చేస్తాయి.

* ఐరోపా దేశాలు, అమెరికా అణుశక్తిని అధికంగా ఉత్పత్తి చేస్తున్నాయి.

* భారతదేశంలో రాజస్థాన్, ఝార్ఖండ్‌లో యురేనియం నిల్వలు ఎక్కువగా ఉన్నాయి.

* కేరళలోని మోనోజైట్‌ ఇసుక నిక్షేపాల్లో థోరియం అధిక పరిమాణంలో ఉంది.


భారతదేశంలో అణువిద్యుత్‌ కేంద్రాలు

కల్పకం - తమిళనాడు; 

తారాపూర్‌ - మహారాష్ట్ర;

రాణాప్రతాప్‌ సాగర్‌ - రాజస్థాన్‌; 

నరోరా - ఉత్తర్‌ ప్రదేశ్‌;

కైరా - కర్ణాటక.


భూఉష్ణ శక్తి (Geothermal Energy):

జియో అంటే భూమి. దీని నుంచి లభించే ఉష్ణశక్తిని ‘భూఉష్ణ శక్తి’ అంటారు.

* భూమి లోపలికి వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయి. కొన్నిసార్లు భూమి లోపల ఉష్ణశక్తి వేడినీటి బుగ్గల రూపంలో భూఉపరితలానికి చేరుకుంటుంది. దీని నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేయొచ్చు.

* భూఉష్ణ శక్తి కేంద్రాలు ఎక్కువగా ఉన్న దేశం అమెరికా. తర్వాతి స్థానాల్లో న్యూజిలాండ్, ఐస్‌లాండ్, ఫిలిప్పీన్స్, మధ్య అమెరికాలు ఉన్నాయి.

* మనదేశంలో హిమాచల్‌ ప్రదేశ్‌లోని మణికరన్, లద్దాక్‌లోని పుగా లోయల్లో భూఉష్ణ శక్తి కేంద్రాలు ఉన్నాయి.


వేలాశక్తి (Tidal Energy):  

ప్రపంచంలో మొట్టమొదటి వేలాశక్తి కేంద్రాన్ని ఫ్రాన్స్‌లో ఏర్పాటు చేశారు.

* సముద్ర నీటి మట్టం పెరగడం (పోటు), తగ్గడం (పాటు) ద్వారా ఉత్పత్తి చేసే శక్తిని వేలాశక్తి అంటారు.

* ఇరుకైన సముద్ర ప్రవేశ ద్వారాల వద్ద ఆనకట్టలు నిర్మించి, దీన్ని ఉత్పత్తి చేయొచ్చు.

* పోటు వల్ల ఉద్భవించే వేలా తరంగాలు ఆనకట్టలోని టర్బైన్లను తిప్పడం ద్వారా విద్యుత్‌ని ఉత్పత్తి చేస్తాయి.

* రష్యా, ఫ్రాన్స్‌; భారత్‌లోని కచ్‌ సింధూ శాఖలో వేలాశక్తి కేంద్రాలు భారీగా ఉన్నాయి.


బయోగ్యాస్‌: 

నిర్జీవమైన మొక్కలు, జంతు పదార్థాలు, పశువుల పేడ, వంటింటి వ్యర్థాలు లాంటి సేంద్రియ వ్యర్థాలను వాయు ఇంధనంగా మార్చడాన్ని ‘బయోగ్యాస్‌’ అంటారు.

* ఈ పదార్థాలను ట్యాంకుల్లో నింపి, దానిలో బ్యాక్టీరియాను పంపుతారు. ఇది వాటిని కుళ్లిపోయేలా చేస్తుంది. ఈ క్రమంలో మీథేన్, కార్బన్‌ డైఆక్సైడ్‌ (CO2) తో కూడిన బయోగ్యాస్‌ విడుదలవుతుంది.

* ఇది వంటకు, దీపాలు వెలిగించుకోవడానికి ఉపయోగపడుతుంది.

* దీని ద్వారా ఏటా ఎక్కువ మొత్తంలో సేంద్రియ ఎరువులు కూడా తయారవుతాయి.


పవన శక్తి (Wind Energy):

ఇది తరగని శక్తి వనరు. గాలి మరల వాడకం పురాతన కాలం నుంచే ఉంది. ధాన్యం నూర్పుడి సమయంలో, భూగర్భ జలాలను పైకి తేవడానికి వీటిని ఉపయోగించేవారు.

* ఆధునిక కాలంలో జనరేటర్‌తో అనుసంధానం చేసిన గాలిమరను అధిక వేగంతో వీచే గాలులు తిప్పడం ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు.

* అనేక గాలి మరల సముదాయాన్ని ‘పవన క్షేత్రం’ అంటారు.

*  బలమైన, స్థిరమైన గాలులు వీచే సముద్ర తీర ప్రాంతాలు, పర్వత కనుమల్లో పవన క్షేత్రాలను ఏర్పాటు చేస్తారు.

* పవన శక్తి ఉత్పత్తిలో నెదర్లాండ్స్, జర్మనీ, డెన్మార్క్, ఇంగ్లండ్, అమెరికా, స్పెయిన్‌ దేశాలు అగ్రస్థానంలో ఉన్నాయి.


అనుకూలతలు:

* కాలుష్య రహితం

* ఒక్కసారి ఏర్పాటు చేస్తే, తక్కువ ఖర్చుతో విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది.

* సురక్షితమైంది, శుభ్రమైంది.


ప్రతికూలతలు:

* శబ్ద కాలుష్యం ఎక్కువ.

* గాలి మరల ఏర్పాటుకు ఖర్చు ఎక్కువ.

* రేడియో, టెలివిజన్‌ ప్రసారాలకు అంతరాయం కలిగిస్తుంది.

* పక్షులకు హానికరం.


ముఖ్యాంశాలు

* ప్రపంచంలో ఇనుపధాతు ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న ఖండం ఐరోపా.

* బొగ్గును ‘ఖననం చేసిన సూర్యరశ్మి’ అంటారు.

* ప్రపంచంలో జల విద్యుత్‌ను అభివృద్ధి చేసిన మొదటి దేశం నార్వే.

* ప్రపంచంలోనే మొదటిసారిగా సౌర, పవన శక్తిని ఉపయోగించే బస్సు షెల్టర్‌ను ఏర్పాటు చేసిన దేశం స్కాట్లాండ్‌.

* సలాల్‌ జల విద్యుత్‌ కేంద్రం జమ్మూకశ్మీర్‌లో ఉంది.

* భారతదేశంలో యురేనియం నిల్వలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు రాజస్థాన్, ఝార్ఖండ్‌.

* ముడిచమురు నుంచి అనేక రకాల ఇంధనాలను వేరుచేయడానికి వాడే ప్రక్రియను అంశిక స్వేదనం అంటారు.

* భారతదేశంలో అణు విద్యుత్‌ కేంద్రాలు కల్పకం - తమిళనాడు, తారాపూర్‌ - మహారాష్ట్ర, రాణాప్రతాప్‌ సాగర్‌ - రాజస్థాన్‌లో ఉన్నాయి.

* వేలాశక్తి కేంద్రాన్ని మొదట నిర్మించింది ఫ్రాన్స్‌. 

ఖనిజాల రకాలు/ వర్గీకరణ

భూమిపై సుమారు మూడు వేల రకాలకు పైగా ఖనిజాలు ఉన్నాయి. రసాయనాల మార్పు ఆధారంగా వీటిని ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరించారు. అవి:

1. లోహ ఖనిజాలు (Metallic Minerals) 

2. అలోహ ఖనిజాలు (Non-Metallic Minerals) 

లోహ ఖనిజాలు: వీటిని ఫెర్రస్, నాన్‌ ఫెర్రస్‌ లోహ ఖనిజాలుగా విభజించారు.

ఫెర్రస్‌ లోహఖనిజాలు: వీటిలో ముడి ఇనుము లోహం ఉంటుంది. ఇవి కఠినంగా ఉండి, తమ మీదుగా వేడి, విద్యుత్‌ను ప్రసరింపజేస్తాయి. వీటికి మెరిసే స్వభావం ఉంటుంది.

ఉదా: ఇనుము, మాంగనీస్, నికెల్, టంగ్‌స్టన్‌.

నాన్‌ ఫెర్రస్‌ ఖనిజాలు: వీటిలో ఇనుము ఉండదు.

ఉదా: ఇసుక, నైట్రేట్స్, రత్నాలు, వజ్రాలు, బంగారం, వెండి, రాగి మొదలైనవి.

అలోహ ఖనిజాలు: వీటిలో ఎలాంటి లోహాలు ఉండవు.

ఉదా: సున్నపురాయి, జిప్సం మొదలైనవి.

* అలోహ ఖనిజాల నిల్వలు, ఉత్పత్తిలో భారతదేశం స్వయం సమృద్ధిని కలిగి ఉంది.

ఇంధన ఖనిజాలు: మండే స్వభావం ఉన్న ఖనిజాలు. వీటిని శక్తి అవసరాలకు ఉపయోగిస్తారు. మనదేశంలో వీటి కొరత ఎక్కువగా ఉంది.

ఉదా: నేలబొగ్గు, పెట్రోలియం, సహజవాయువు

* ఇంధన ఖనిజాలను అలోహ ఖనిజాలు అని కూడా అంటారు.

అణు ఇంధన ఖనిజాలు (Nuclear fuel minerals): ఇవి శక్తిని రేడియేషన్‌ రూపంలో వెదజల్లే అస్థిర కేంద్రక ముడి పదార్థాలు. ఇవి కూడా భారత్‌లో తక్కువగానే ఉన్నాయి.

ఉదా: యురేనియం, థోరియం, ఇల్మనైట్‌


మైనింగ్‌

భూమి లోపలి పొరల నుంచి ఖనిజాలను తవ్వి తీయడాన్ని ‘మైనింగ్‌’ అంటారు.

* ఖనిజాల మైనింగ్‌ లేదా ఖనిజాల వెలికితీత మూడు విధాలుగా జరుగుతుంది. 

1. సాధారణ మైనింగ్‌: ఇది రెండు రకాలు. అవి: 

a) బహిరంగ మైనింగ్‌ (open cast mining)

b) భూగర్భ మైనింగ్‌ (shaft mining)

బహిరంగ మైనింగ్‌: గోతులు తవ్వి, గుట్టలను పేల్చి, కొండలను తొలిచి ఖనిజాలను వెలికి తీయడాన్ని బహిరంగ మైనింగ్‌ అంటారు. దీనికి ఖర్చు తక్కువ. ఈ పద్ధతి ద్వారా రోజుకి 10 వేల టన్నుల ఖనిజాలను వెలికి తీయవచ్చు.

భూగర్భ మైనింగ్‌: ఈ పద్ధతి ద్వారా భూఉపరితలానికి చాలా లోతుల్లో ఉండే ఖనిజాలను వెలికి తీయవచ్చు. ఇందులో భూమికి సొరంగాలు తవ్వి, ఖనిజాలను వెలికి తీస్తారు. దీనికి ఖర్చు అధికం. దీని ద్వారా రోజుకి 1500 టన్నుల ఖనిజాలను వెలికితీయవచ్చు.

2. డ్రిల్లింగ్‌ పద్ధతి: పెట్రోలియం, సహజవాయువు లాంటి ఖనిజాలు భూఉపరితలం నుంచి చాలా లోతులో ఉంటాయి. వీటిని వెలికి తీసేందుకు చాలా లోతైన బోరు బావులను తవ్వాల్సి ఉంటుంది. దీన్నే డ్రిల్లింగ్‌ అంటారు.

3. క్వారీయింగ్‌: భూఉపరితలానికి సమీపంలో ఉన్న ఖనిజాలను సులభంగా తవ్వి తీసే ప్రక్రియను క్వారీయింగ్‌ అంటారు.


ఖనిజాల విస్తరణ 


ఖనిజాలు వివిధ రకాల శిలల్లో నిక్షిప్తమై ఉంటాయి. కొన్ని ఖనిజాలు అగ్నిశిలల్లో, మరికొన్ని రూపాంతర శిలల్లో, ఇంకొన్ని అవక్షేపశిలల్లో ఉంటాయి.

సాధారణంగా పెద్ద పీఠభూములను ఏర్పర్చిన అగ్నిశిలలు, రూపాంతర శిలల్లో లోహ ఖనిజాలు ఉంటాయి. ఉత్తర స్వీడన్‌లోని ఇనుప నిక్షేపాలు, దక్షిణాఫ్రికాలోని ఇనుము, నికెల్, ప్లాటినం మొదలైనవి అగ్ని, రూపాంతర శిలల్లో లభించే ఖనిజాలు.

* అవక్షేప శిలా మైదానాల్లోని తరుణ - ముడత పర్వతాల్లో సున్నపురాయి లాంటి లోహరహిత ఖనిజాలుంటాయి. 

* ఫ్రాన్స్‌లోని కాకరస్‌ ప్రాంతంలోని సున్నపురాయి నిక్షేపాలు; జార్జియా, ఉక్రెయిన్‌లో ఉన్న మాంగనీస్‌ నిక్షేపాలు; అల్జీరియాలోని ఫాస్ఫేట్‌ నిక్షేపాలు వీటికి ఉదాహరణలు.

* బొగ్గు, పెట్రోలియం లాంటి ఇంధన ఖనిజాలు కూడా అవక్షేప పొరల్లో లభిస్తాయి.


ఖనిజాల ఉపయోగాలు

ఖనిజ నిల్వల ఆధారంగా దేశంలో పరిశ్రమల స్థాపన జరుగుతుంది. రత్నాల కోసం ఉపయోగించే ఖనిజాలు సాధారణంగా కఠినమైనవి. వీటిని వివిధ రకాల ఆభరణాల్లో ఉపయోగిస్తారు. కంప్యూటర్‌ పరిశ్రమలో వాడే సిలికాన్‌ను క్వార్ట్జ్‌ నుంచి తీస్తారు.


ముఖ్యమైన ఖనిజాలు 


బాక్సైట్‌: అల్యూమినియం నుంచి తీస్తారు. దీన్ని ‘విశ్వఖనిజం’గా పేర్కొంటారు.

* అల్యూమినియం చాలా తక్కువ బరువు ఉండటం వల్ల ఇది మన జీవితాల్లో ముఖ్యమైన ఖనిజంగా మారింది.

* ఆటోమొబైల్స్, విమానాలు, బాటిల్స్‌ తయారీ పరిశ్రమ, విద్యుత్‌ తీగలు, భవనాలు, వంట సామాగ్రి తయారీ, ఆహార పదార్థాల ప్యాకేజింగ్‌లో బాక్సైట్‌ను ఉపయోగిస్తారు.

* బాక్సైట్‌ నిల్వలు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో ఉన్నాయి.

మైకా: ఇది మెరిసే ఖనిజం.

* విద్యుత్, ఎలక్ట్రానిక్‌ పరిశ్రమల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు.

* ఇది సన్నని పొరల్లో లభ్యమవుతుంది. ఇది విద్యుత్‌ నిరోధకం.

క్రోమియం: స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ తయారీలో ఉపయోగిస్తారు.

* ఇది తుప్పు పట్టదు. దీన్ని అన్నం వండటానికి, పారిశ్రామికంగా ఆమ్లాలను నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు.

రాతినార/ ఆస్‌బెస్టాస్‌: ఇది వేడిని నిరోధించే పదార్థం.

* ఇళ్లు, పరిశ్రమల నిర్మాణంలో వాటి పైకప్పుగా విస్తృతంగా వాడతారు.

* దీన్ని ఉత్పత్తి చేసే సమయంలో విడుదలయ్యే రసాయనాల వల్ల అనేక ఆరోగ్య  సమస్యలు వస్తున్నాయి. కాబట్టి, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దీన్ని నిషేధిస్తున్నారు.

* సిమెంట్ రేకులు, పెయింటింగ్, బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్ల తయారీలో దీన్ని ఉపయోగిస్తారు.

ముగ్గురాయి/ బెరైటీస్‌: ఇది కొన్ని ఖనిజాల సమూహం. దీని నుంచి బేరియం అనే మూలకాన్ని తీస్తారు.

* పారిశ్రామిక, వైద్య అవసరాల కోసం బేరియంను ఉపయోగిస్తారు.

* ముడిచమురు, సహజవాయువుల కోసం చాలా లోతుగా తవ్వడానికి బెరైటీస్‌ను ఉపయోగిస్తారు.

* గాజు (వాష్‌బేసిన్‌) సెరామిక్‌ వస్తువులు తయారు చేయడానికి ఫెల్డ్‌స్పార్‌ అనే ఖనిజాన్ని ఉపయోగిస్తారు. ఇది తెలంగాణలో ఎక్కువగా లభిస్తుంది.

* బెరైటీస్, డోలమైట్, సున్నపురాయి, క్వార్ట్జ్,  ఫెల్డ్‌స్పార్‌ ఖనిజాలు తెలంగాణలో ఎక్కువగా లభిస్తాయి.        

* దక్షిణ భారతదేశంలో బొగ్గు నిల్వలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం తెలంగాణ.


ప్రపంచవ్యాప్తంగా లభించే వివిధ ఖనిజాలు


ఆసియా: చైనా, భారత్‌ అధిక మొత్తంలో ఇనుప నిక్షేపాలను కలిగి ఉన్నాయి.

భారతదేశంలో ఖనిజాలు అసమానంగా విస్తరించి ఉన్నాయి. ఉత్తర భారతదేశంలోని విశాలమైన మైదానాల్లో ఆర్థికంగా విలువైన ఖనిజాలు ఇంచుమించుగా లేవు. దానికి భిన్నంగా ద్వీపకల్ప భాగంలో లోహ, అలోహ, ఇంధన ఖనిజ నిక్షేపాలు ఎక్కువగా ఉన్నాయి.

* ప్రపంచంలో మొత్తం తగరం ఉత్పత్తి సగానికి పైగా ఆసియా ఖండంలోనే జరుగుతుంది.

* చైనా, మలేసియా, ఇండోనేసియా దేశాలు ప్రపంచంలోనే ప్రముఖ తగరం ఉత్పత్తిదారులు.

* సీసం, యాంటిమోని, టంగ్‌స్టన్‌ ఉత్పత్తుల్లో చైనా మొదటి స్థానంలో ఉంది.


ఐరోపా: ప్రపంచంలో ఇనుపధాతువు (Iron-ore) ఉత్పత్తిలో ఐరోపా ఖండం అగ్రగామిగా ఉంది. రష్యా, ఉక్రెయిన్, స్వీడన్, ఫ్రాన్స్‌లలో ఇనుపధాతువు నిక్షేపాలు ఎక్కువగా ఉన్నాయి. తూర్పు ఐరోపా, యురేషియా భూభాగంలో రాగి, సీసం, జింక్‌ నిక్షేపాలు ఎక్కువ.

* ప్రపంచంలో ఎలాంటి ఖనిజ నిక్షేపాలు లేని దేశం స్విట్జర్లాండ్‌.

* ఒక శిల నీలిరంగులో ఉంటే అందులో రాగి కలిసి ఉందని అర్థం.


ఉత్తర అమెరికా: ఉత్తర అమెరికాలోని ఖనిజ నిక్షేపాలు మూడు జోన్లలో ఉన్నాయి. అవి: 

1) కెనడా ప్రాంతం: ఇక్కడ ఇనుపధాతువు, నికెల్, బంగారం, యురేనియం, రాగి లభిస్తాయి.

2) అపలేచియన్‌ పర్వత ప్రాంతం: ఈ పర్వతాలు ఖండానికి తూర్పు ప్రాంతంలో ఉన్నాయి. ఇక్కడ బొగ్గు విరివిగా లభిస్తుంది.

3) పశ్చిమ కార్డిలరాస్‌: వీటిని రాఖీ పర్వతాలు అని కూడా పిలుస్తారు.

* ఇక్కడ రాగి, సీసం, బంగారం, వెండి నిక్షేపాలు ఎక్కువగా ఉన్నాయి.

* ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సు సుపీరియర్‌. దీని చుట్టూ విరివిగా లభించే ఖనిజం ఇనుము.


దక్షిణ అమెరికా: ప్రపంచంలో నాణ్యమైన ఇనుపధాతువును అధికంగా ఉత్పత్తి చేసే దేశం బ్రెజిల్‌.

* ఈ ఖండంలోని బొలీవియా తగరం ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంది.

* అటకామా ఎడారిలో లభించే ఖనిజం నైట్రేట్స్‌.

* వెనిజులా, అర్జెంటీనా, చిలీ, కొలంబియా దేశాలు పెట్రోలియానికి ప్రసిద్ధి.


ఆఫ్రికా: ఆఫ్రికా అనేక ఖనిజ వనరులకు ప్రసిద్ధి చెందింది. ఇది ప్రపంచవ్యాప్తంగా వజ్రాలు, బంగారం, ప్లాటినాన్ని అధికంగా ఉత్పత్తి చేస్తుంది.

* దక్షిణాఫ్రికాలోని జోహెన్నస్‌బర్గ్‌ (విట్‌ వాటర్స్‌రాండ్‌) - బంగారానికి ప్రసిద్ధి.

* దక్షిణాఫ్రికాలోని కింబర్లీ వజ్రాలకు ప్రసిద్ధి.

* గినియా తీరం బాక్సైట్ నిల్వలకు ప్రసిద్ధి.

* నైజీరియా, అంగోలా, లిబియా దేశాల్లో పెట్రోలియం లభిస్తుంది.


ఆస్ట్రేలియా: ప్రపంచంలోనే అతిపురాతన శిలలు పశ్చిమ ఆస్ట్రేలియాలో ఉన్నాయి.

ఇవి 4,300 మిలియన్‌ సంవత్సరాల క్రితం నాటివి. అంటే భూమి ఏర్పడిన 300 మిలియన్‌ సంవత్సరాల తర్వాత ఏర్పడ్డాయి.

* ఆస్ట్రేలియా ప్రపంచంలో బాక్సైట్‌ను అధికంగా ఉత్పత్తి చేస్తుంది.

* సీసం, జింక్, మాంగనీస్‌ ఖనిజాలు ఈ ఖండంలో పుష్కలంగా ఉన్నాయి.

* పశ్చిమ ఆస్ట్రేలియా ప్రాంతాలైన ‘కల్గూర్లి’, ‘కూల్గార్ది’లలో బంగారు నిల్వలు అధిక మొత్తంలో ఉన్నాయి.


అంటార్కిటికా: ట్రాన్స్‌ అంటార్కిటికా ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలు ఎక్కువగా ఉన్నాయి.

తూర్పు అంటార్కిటికాలోని ప్రిన్స్‌ ఛార్లెస్‌ పర్వతాల సమీపంలో ఇనుప ఖనిజ నిల్వలు ఉన్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.


లోహాలు - వాటి ముడి ఖనిజాలు

అల్యూమినియం - బాక్సైట్‌

క్రోమియం - క్రోమైట్

కాపర్‌ - చాల్‌కోసైట్, చాల్‌కోపెరైట్‌

ఐరన్‌ - హెమటైట్, మాగ్నటైట్, లిమోనైట్‌

లెడ్‌ (సీసం) - గెలీనా

మెగ్నీషియం - మాగ్నసైట్, డోలమైట్‌

మాంగనీస్‌ - పైరోల్‌సైట్

మెర్క్యూరీ - సిన్నబార్‌

టిన్‌ - క్యాసిటెరైట్‌

టైటానియం - ఇల్మనైట్‌

టంగ్‌స్టన్‌ - ఓల్ఫ్రమైట్‌

యురేనియం - పిచ్‌బ్లెండ్‌

సిల్వర్‌ - అర్జెంటైట్‌

నికెల్‌ - పెంట్లాండైట్‌


Yellow cake -  యురేనియం 

Black gold -  బొగ్గు 

Liquid gold -  పెట్రోలియం 

Noble metal - బంగారం 

Shiny mineral -  మైకా 

Posted Date : 26-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌