• facebook
  • whatsapp
  • telegram

మొగల్‌ యుగ విశేషాలు

భారతదేశాన్ని క్రీ.శ. 1526 నుంచి క్రీ.శ. 1858 వరకు మొగలులు పాలించారు. బాబర్‌ నుంచి ఔరంగజేబ్‌ వరకూ మొగల్‌ పాలన గొప్పగా సాగిందని చరిత్రకారులు కొనియాడారు. మొగల్‌ పాలనను ప్రారంభించింది సూర్‌ వంశానికి చెందిన షేర్షా. అతడు ప్రవేశపెట్టిన పాలనా,   రెవెన్యూ, ఆర్థిక సంస్కరణలనే అక్బర్‌ కొద్ది మార్పులతో కొనసాగించాడు. అందుకే షేర్షాను అక్బర్‌కు మార్గదర్శకుడిగా పేర్కొంటారు. 

పరిపాలనా సంస్కరణలు

కేంద్రపాలన

మొగల్‌ చక్రవర్తులు కేంద్ర, రాష్ట్ర, స్థానిక పాలనా విధానాల్లో అనేక మార్పులు ప్రవేశపెట్టి, సమర్థవంతమైన పాలనను అందించారు. కేంద్రపాలనలో చక్రవర్తే అత్యున్నతాధికారి. పౌరపాలన మొత్తం అతడి చుట్టే కేంద్రీకృతమై ఉండేది. మంత్రిమండలి, ఉద్యోగ బృంద సహాయంతో చక్రవర్తి పాలనను కొనసాగించేవాడు. షేర్షా పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని సర్కారులు - పరగణాలు - గ్రామాలుగా విభజిస్తే, కొద్దిమార్పులతో అక్బర్‌ తన సామ్రాజ్యాన్ని సుబాలు - సర్కారులు - పరగణాలు - గ్రామాలు అనే భాగాలుగా ఏర్పాటు చేశాడు. కేంద్రమంత్రి మండలిలో వకీల్‌ (ప్రధానమంత్రి), వజీర్‌ (ఆర్థికమంత్రి), మీర్‌భక్షీ (యుద్ధమంత్రి), మీర్‌-ఇ-సదర్‌ (దానధర్మాల మంత్రి), ప్రధాన ఖాజీ (న్యాయశాఖామంత్రి) పరిపాలనలో చక్రవర్తికి సహాయపడేవారు.  

రాష్ట్ర పాలన

షేర్షా సర్కారులు అనే రాష్ట్రాలను ఏర్పాటు చేయగా, అక్బర్‌ ‘సుబాలు’ అనే ప్రత్యేక రాష్ట్రాలను ఏర్పాటు చేశాడు. సుబా అధిపతి సుబేదార్‌. వీరి పాలన కూడా కేంద్ర పాలనను పోలి ఉండేది. సుబేదార్‌కు రాష్ట్ర పాలనలో తోడ్పడేందుకు ఫొతేదార్, పౌజ్‌దార్‌ లాంటి అధికారులు ఉండేవారు. అమీన్‌ను రాష్ట్ర రెవెన్యూ అధికారిగా, నేటి కలెక్టర్‌తో పోల్చవచ్చు. ఫొతేదార్‌ రాష్ట్ర కోశాధికారి. రాష్ట్రంలో సైనిక వ్యవహారాలు చూడటానికి ‘భక్షీ’ అనే అధికారిని నియమించారు. రాష్ట్ర గవర్నర్‌లను సిఫా-సలార్‌ అనేవారు. తర్వాతి కాలంలో సిఫా-సలార్‌ పదవి సుబేదార్‌ లేదా నజీమ్‌గా మారింది. వీరితో పాటు కాజీ, సాదర్, ముతాసిబ్‌ లాంటి ఇతర అధికారులు కూడా రాష్ట్ర పాలనలో సాయపడేవారు.

స్థానిక పాలన

మొగలుల స్థానిక పాలనలో సర్కారులు - పరగణాలు - గ్రామాలతోపాటు మహల్స్, ఠాణాలు, పట్టణాలు, ఓడరేవులు లాంటి ఇతర పాలనా విభాగాలు కూడా ఉండేవి. సర్కారు అధిపతిని పౌజ్‌దార్‌ అని, పరగణా అధిపతిని షిక్‌దార్‌ అని పిలిచేవారు. గ్రామపాలనలో పట్వారీ, చౌకీదార్, ముఖద్దమ్‌ లాంటి ఉద్యోగులు ఉండేవారు. ఇలా మొగలులు తమ కాలంలో కేంద్రం నుంచి గ్రామం వరకు సమర్థవంతమైన పాలన అందించారు.

రెవెన్యూ పాలన

మొగలుల కాలం నాటి రెవెన్యూ విధానాల్లో కొన్ని నేటికీ కొనసాగుతున్నాయి. భూములను సర్వే చేయించడం, విభజించడం, శిస్తు నిర్ణయించడం లాంటి రెవెన్యూ విధానాలను అనుసరించారు. కేంద్రంలో వజీర్, సుబాలలో (రాష్ట్రాలు) దివాన్‌లు, అమీన్‌లు, సర్కారులు; పరగణాల్లో కనుంగోలు రెవెన్యూ విధులను నిర్వహించేవారు. షేర్షా భూములను కొలిపించి ఉత్తమ - మధ్యమ - అధమ అనే మూడు రకాలుగా విభజించాడు. అక్బర్‌ కాలంలో భూములను పోలజ్, పరౌటీ, చాచర్, బంజర్‌ అనే నాలుగు రకాలుగా విభజించారు. 

పండిన పంటలో 1/3 వంతు భూమి శిస్తుగా వసూలుచేసేవారు. అక్బర్‌ కాలంలో బందోబస్తు రెవెన్యూ విధానం (రైత్వారీ పద్ధతి) ప్రవేశపెట్టారు. నాటి భూమి శిస్తు విధానాన్ని జబ్తి (జాబితా) పద్ధతిగా పేర్కొంటారు. ఈ పద్ధతిలో ప్రతి 10 సంవత్సరాల సగటు పంటను లెక్కించి భూమి శిస్తు విధిస్తారు. అందుకే దీన్ని దహ్‌సాలా పద్ధతి అని కూడా పిలిచేవారు. రైతులు భూమి శిస్తును ధన, ధాన్య రూపంలో చెల్లించడానికి అనుమతించారు.

న్యాయపాలన 

మొగలుల కాలంలో చక్రవర్తే రాజ్యంలో అత్యున్నత న్యాయాధికారి. ఫర్మానాలు జారీ చేయడం, మరణ శిక్షలు విధించడం లాంటి విశేషాధికారాలు కూడా ఉండేవి. చక్రవర్తికి న్యాయపాలనలో సహాయపడటానికి ‘ఖాజీ’లు అనే న్యాయశాఖామంత్రులు, ఇతర ఉద్యోగులు ఉండేవారు. మహ్మదీయ మతానికి చెందిన వారైనా మొగలులు ఇతర మతాల విశ్వాసాలు, మత గ్రంథాల ప్రకారం తీర్పులు చెప్పేవారు. ముఖ్యంగా ప్రజలకు సత్వర న్యాయాన్ని అందించడానికి అక్బర్‌ తన కాలంలో ఘరోకా-ఇ-దర్శన్‌ అనే విధానాన్ని ప్రవేశపెట్టాడు. జహంగీర్‌ ఆగ్రా కోటలో న్యాయగంటను ఏర్పాటు చేశాడు. సుబాలు, సర్కారులు, పరగణాల్లో కూడా ప్రత్యేక న్యాయాధికారులను నియమించి మొగలులు ప్రజలకు సత్వర న్యాయాన్ని అందించారు.

సైనిక పాలన

మొగలుల కాలం నాటి సైనిక పద్ధతిని మున్సబ్‌దారీ పద్ధతిగా పేర్కొంటారు. ఈ విధానాన్ని అక్బర్‌ కాలంలో ప్రవేశపెట్టారు. సామ్రాజ్యంలోని వివిధ ప్రాంతాల్లో మున్సబ్‌దారులను నియమించారు. వాళ్లు సైన్యాన్ని పోషించి, యుద్ధ సమయంలో చక్రవర్తికి సరఫరా చేసేలా ఏర్పాట్లు చేశారు. మున్సబ్‌దారులకు వంశపారంపర్య హక్కులు లేవు. తరచూ బదిలీ అయ్యేవారు. మున్సబ్‌దార్‌ అంటే ఒక శ్రేణికి అధికారి అని అర్థం. 

అబుల్‌ ఫజల్‌ రచనల ప్రకారం నాటి మున్సబ్‌దారుల్లో సుమారు 33 తరగతులు ఉన్నట్లు తెలుస్తోంది. కనీసం 10 గుర్రాల నుంచి అధికంగా 10 వేల గుర్రాలను పోషించే 33 తరగతుల మున్సబ్‌దారులుండేవారని అబుల్‌ ఫజల్‌ రాశాడు. నాటి మున్సబ్‌దారీ విధానంలో జాత్‌ (హోదా), సవారీ (అదనపు అలవెన్స్‌) అనే రెండు ముఖ్య విధానాలు అమల్లో ఉండేవి. జహంగీర్‌ కాలంలో, అనంతరం షాజహాన్‌ కాలంలో మున్సబ్‌దారీ విధానంలో కొన్ని మార్పులు చేశారు. అనంతర కాలంలో మున్సబ్‌దారుల స్థానంలో జాగీర్దారులను నియమించారు. మరికొన్నిచోట్ల మున్సబ్‌దారులకే జాగీరులను కేటాయించారు.  అయితే మున్సబ్‌దారులందరూ జాగీర్దారులు కాదు. 

సామాజిక వ్యవస్థ  

మొగలుల కాలంనాటి సామాజిక వ్యవస్థ భూస్వామ్య లక్షణాలను కలిగి ఉండేదని ఆర్‌.సి. మజుందార్, రాయ్‌చౌదరి లాంటి చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. నాటి సమాజంలో ప్రభు, మధ్యతరగతి, సామాన్య అనే మూడు ప్రధాన వర్గాలు ఉండేవి. ప్రభు వర్గంలో చక్రవర్తి, అంతఃపుర ఉద్యోగ బృందం; మధ్యతరగతి వర్గంలో జమీందారులు, జాగీర్దారులు, వృత్తి నిపుణులు ఉండేవారు. రైతులు, కూలీలు, కౌలు రైతులు, సేద్య బానిసలు లాంటి పేదవారు సామాన్య వర్గంలో ఉండేవారు. నాటి సామాజిక వ్యవస్థలో రైతులు, కూలీలు తీవ్రమైన దోపిడీకి గురయ్యేవారు. సమాజంలో బహుభార్యత్వం, వ్యభిచారం, సతీసహగమనం, పరదా పద్ధతి లాంటి సాంఘిక దురాచారాలు అధికంగా ఉండేవి. స్త్రీ విద్య అందుబాటులో లేదు.

సాంస్కృతిక వికాసం

మొగలులు తమ కాలంలో వాస్తు, కళ, విద్యా సారస్వతాల అభివృద్ధి కోసం విశేషంగా కృషిచేశారు. ముస్లిం పాలకులైనా మొగలుల్లో ఔరంగజేబ్‌ మినహా అంతా పరమత సహనం పాటించారు. లౌకిక రాజ్యంగా ఉన్న భారతదేశాన్ని ఇస్లాం రాజ్యంగా మార్చడానికి ఔరంగజేబ్‌ చేసిన ప్రయత్నాల వల్లే మొగల్‌ సామ్రాజ్య పతనం ప్రారంభమైంది. మొగలులు దేశవ్యాప్తంగా మదర్సాలు, పాఠశాలలను స్థాపించారు. కానీ స్త్రీ విద్యాభివృద్ధి గురించి పట్టించుకోలేదు. చక్రవర్తులు తమ ఆస్థానంలో అనేకమంది కవి పండితులను పోషించారు. రాజభాష అయిన పారశీకంతోపాటు, హిందీ, సంస్కృతం, మరాఠీ లాంటి ప్రాంతీయ భాషల్లో కూడా చక్కటి సాహిత్య సృష్టి జరిగింది. ఢిల్లీ సుల్తానుల కాలంలో ప్రారంభమైన ఇండో-ఇస్లామిక్‌ మిశ్రమ సంస్కృతి మొగలుల కాలంలో అత్యున్నత స్థాయికి చేరింది. సంగీతం, శిల్పం, చిత్రలేఖనం, వాస్తు రంగాల్లో గణనీయమైన అభివృద్ధి జరిగింది. బాబర్‌ నుంచి షాజహాన్‌ వరకు వాస్తురంగంలో ఎక్కువ శ్రద్ధ చూపించారు.ఉద్యానవనాలు, మసీదులు, కోటలు, దర్గాలు, రాజప్రసాదాలు లాంటి నిర్మాణాల్లో పర్షియన్‌ - భారతీయ వాస్తు విధానాలను అనుసరించారు. బాబర్‌తో ప్రారంభమైన ఉద్యానవనాల నిర్మాణం జహంగీర్, షాజహాన్‌ల కాలంలో ఉన్నత దశకు చేరింది. షాలిమార్‌ గార్డెన్స్, మొగల్‌ గార్డెన్స్‌ ప్రఖ్యాతి గాంచాయి.

అక్బర్‌ కాలంలో ఫతేపూర్‌ సిక్రీలో నిర్మించిన కట్టడాలు, షాజహాన్‌ కాలంలో నిర్మించిన ఎర్రకోట, తాజ్‌మహల్‌ నిర్మాణాలు మొగలుల వాస్తు కళాపోషణకు దర్పణాలు. అలహాబాద్‌లో అక్బర్‌ పూర్తిగా హిందూ పద్ధతిలో నిర్మించిన 40 స్తంభాల భవనం చాలా ప్రసిద్ధిచెందింది. సంగీతంలో ప్రఖ్యాతి గాంచిన తాన్‌సేన్, బైజుబావరా, బాజ్‌బహదూర్, రూపవతి లాంటి వారిని మొగలులు ఆదరించారు. చిత్రలేఖనంలో చక్రవర్తులు సైతం ప్రావీణ్యం పొందారు. జహంగీర్‌ సూక్ష్మ చిత్రలేఖనంలో నిష్ణాతుడు. హుమయూన్‌ తన ఆస్థానంలో పర్షియన్‌ చిత్రకారులను పోషించాడు. అక్బర్‌ కాలంలో ఖ్వాజా అబ్దుల్‌ సమద్‌ నాయకత్వంలో ప్రత్యేక చిత్రలేఖన విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈవిధంగా మొగలుల కాలంలో సాహిత్యం, వాస్తు కళలు వర్ధిల్లాయి.

ఆర్థిక వ్యవస్థ

మొగలుల కాలంలో భారత ఆర్థిక వ్యవస్థలో కొన్ని నూతన మార్పులు సంభవించాయి. పాలకులు వ్యవసాయం, వాణిజ్యం, పరిశ్రమల రంగాల అభివృద్ధికి కృషి చేశారు. ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. రాజ్యానికి ప్రధాన ఆదాయం భూమి శిస్తు. అందుకే, అటు ప్రజలు, ఇటు ప్రభుత్వ ఆర్థిక స్థితులను మెరుగుపరచడానికి మొగల్‌ చక్రవర్తులు వ్యవసాయరంగ అభివృద్ధిపై ఎక్కువ శ్రద్ధవహించారు. రాజ్యంలో భూమి మొత్తం చక్రవర్తిదే అయినప్పటికీ వాస్తవ రూపంలో దాన్ని అనేకమంది అధీనంలో ఉంచారు. భూములకు సంబంధించి ఖుద్‌కాస్త్‌లు, పాహీలు, ముజారియమ్‌లు లాంటి అనేక రకాల పేర్లు వాడుకలో ఉండేవి. రాజ్యానికి లేదా చక్రవర్తికి చెందిన సొంత భూములను ఖలీఫా భూములని, రైతులకు చెందిన భూములను ఖుద్‌కాస్త్‌ భూములని పిలిచేవారు. పాహీలు, ముజారియమ్‌లను కౌలు రైతుల భూములుగా పరిగణించేవారు. జమీందారుల అధీనంలో కూడా కొన్ని భూములు ఉండేవి. నాటి జమీందారుల్లో  స్వయం ప్రతిపత్తి ఉన్న జమీందారులు, మధ్యంతరస్థాయి జమీందారులు, ప్రాథమికస్థాయి జమీందారులు అనే మూడు ప్రధాన వర్గాలు ఉండేవి. ఈ విధంగా మొగలుల కాలంలో వ్యవసాయ రంగంలో కొన్ని మౌలిక మార్పులు ప్రవేశపెట్టారు. రైతాంగ అభివృద్ధికి, నీటిపారుదల సౌకర్యాల కల్పనకు, శిస్తు విధింపునకు పాలకులు కృషి చేశారు. అయితే, నాటి రైతులు జమీందారుల దౌర్జన్యానికి గురయ్యేవారు. అధిక పన్నులతో సామాన్యులు బాధపడేవారు.

నాటి వర్తక, వాణిజ్యాలను జాతీయ, అంతర్జాతీయ వర్తకాలుగా వర్గీకరించవచ్చు. దేశంలో జరిగే జాతీయ వర్తకంతోపాటు, పశ్చిమ ఆగ్నేయాసియా దేశాలతో జరిగే విదేశీ వర్తకం కూడా బాగా అభివృద్ధి చెందింది. భారతీయ నూలు వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు పాశ్చాత్య దేశాలను ఆకర్షించాయి. లాహోర్, ముల్తాన్‌ గొప్ప రవాణా కేంద్రాలుగా రూపొందాయి. 

విశాలమైన తీరప్రాంతం సముద్ర వ్యాపారానికి తోడ్పడింది. పట్టు, నూలు వస్త్రాలు, ఆయుధాలు, వజ్రాలు, చక్కెర లాంటివి ఎక్కువగా విదేశాలకు ఎగుమతయ్యేవి. బంగారం, కర్పూరం, విలాస వస్తువులను దిగుమతి చేసుకునేవారు. భారతదేశంలో పట్టణ కేంద్రాలు అధికంగా వృద్ధి చెందటం కూడా పట్టణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి కారణమైంది. చిన్నచిన్న పట్టణాలు, సరాయిలు, కాస్బాలు కూడా స్థానిక మార్కెట్లుగా మార్పు చెందడం, రవాణా సౌకర్యాలు మెరుగుపడటం, పటిష్టమైన రక్షణ వ్యవస్థ ఏర్పాటు లాంటి కారణాల వల్ల వర్తక, వాణిజ్యాలు అభివృద్ధి చెందాయి.

నాడు గ్రామీణ చేతివృత్తులతోపాటు కుటీర పరిశ్రమలు, నూలు, పట్టు, వజ్రాలు, ఉన్ని లాంటి భారీ పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. గ్రామీణ ప్రాంతాల్లో హస్తకళాకారుడి కుటుంబం ఉత్పత్తికి ప్రథమస్థానంగా ఉండేది. వడ్రంగం, నేత, అద్దకం, కమ్మరం లాంటి గ్రామీణ చేతివృత్తులవారు అనేక రకాల వస్తువులను ఉత్పత్తి చేసి, వివిధ వర్గాల అవసరాలు తీర్చేవారు. పత్తి, నూనె గింజలు, నీలిమందు లాంటి ఉత్పత్తులు గ్రామీణ పరిశ్రమల అభివృద్ధికి తోడ్పడ్డాయి. కుమ్మరం, తోలు ఉత్పత్తులు పెరిగాయి. పాదరక్షలు, తోలు సంచుల తయారీ లాంటి కుటీర పరిశ్రమలు ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి దోహదం చేశాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు భిన్నమైన భారీ పట్టణ పరిశ్రమలు కూడా వృద్ధి చెందాయి. బెంగాల్, గుజరాత్‌ ప్రాంతాల్లో జౌళి పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. బెంగాల్, కోరమాండల్‌ ప్రాంతాల్లో ఉత్పత్తి అయ్యే లాంగ్‌క్లాత్, మస్లిన్‌ వస్త్రాలకు ఆసియా మార్కెట్లలో అధిక గిరాకీ ఉండేది. ఇత్తడి, రాగి, వజ్రాల పరిశ్రమలు వృద్ధి చెందాయి. మొగలుల కాలంలో పంజాబ్, ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రాంతాలు చక్కెర పరిశ్రమలకు, ఢిల్లీ రాగి పరిశ్రమకు, బెనారస్‌ ఇత్తడి పరిశ్రమకు; ఢాకా, అహ్మదాబాద్, జాన్‌పూర్‌ ప్రాంతాలు వస్త్ర పరిశ్రమలకు ప్రసిద్ధికెక్కాయి. బెర్నియార్‌ అనే ఫ్రెంచి యాత్రికుడు ‘పత్తి పంటలో భారతదేశం ప్రపంచానికే నిధి’ అని పేర్కొన్నాడు.

మొగల్‌ సామ్రాజ్యం - రాజకీయ చరిత్ర

బాబర్‌ క్రీ.శ.1526 లో మొగల్‌ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అనంతరం అతడి కుమారుడైన హుమయూన్, మనవడైన అక్బర్‌ చక్రవర్తి పరిపాలించారు. క్రీ.శ.1605లో అక్బర్‌ మరణానంతరం అతడి కొడుకు జహంగీర్, మనవడు షాజహాన్‌లు రాజ్యపాలన చేశారు.

జహంగీర్‌ (1606 - 27)

జహంగీర్‌ అసలు పేరు సలీం. అక్బర్, మర్యంఉజ్‌ జమానీ (జోధాబాయ్‌) దంపతులకు అజ్మీర్‌లో జన్మించాడు. అక్బర్‌ ఇతడ్ని ముద్దుగా షేక్‌బాబా అని పిలిచేవాడు. జహంగీర్‌ గురువు అబ్దుల్‌-రహీం-ఖానీ-ఖానన్‌. జహంగీర్‌ సోదరులు మురాద్, డానియెల్‌. వీరు అక్బర్‌ కంటే ముందే చనిపోయారు. సలీం తన తండ్రి పాలనాకాలంలోనే తిరుగుబాటు చేశాడు. కానీ అక్బర్‌ అతడ్ని శిక్షించి, అనంతరం బెంగాల్‌ గవర్నర్‌గా నియమించాడు. తండ్రికి, తనకు మధ్య రాజీ కోసం ప్రయత్నించిన అబుల్‌ ఫజల్‌ను జహంగీర్‌ బుందేల్‌ఖండ్‌ ప్రాంతంలో చంపించాడు. క్రీ.శ.1605లో అక్బర్‌ మరణానంతరం జహంగీర్‌ ఆగ్రా కోటలో చక్రవర్తిగా పట్టాభిషేకం జరుపుకున్నాడు. అతడి భార్యలు మన్‌బాయ్‌ (షాబేగం), జగత్‌ గోసైన్, నూర్జహాన్‌. జహంగీర్‌ 1611లో నూర్జహాన్‌ను వివాహం చేసుకున్నాక మొగల్‌ సామ్రాజ్యంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. చక్రవర్తి అయ్యాక జహంగీర్‌ ప్రజా సంక్షేమం కోసం 12 రాజశాసనాలను జారీ చేశాడు. కానీ వాటిని సమర్థవంతంగా అమలు చేయలేక పోయాడు. ఆగ్రా కోటలో న్యాయగంటను ఏర్పాటు చేశాడు. జహంగీర్‌ కుమారుడైన ఖుస్రూ 1606లో తండ్రికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. ఖుస్రూకి ఆశ్రయం ఇచ్చిన సిక్కు గురువు అర్జున్‌ సింగ్‌ను జహంగీర్‌ చంపించాడు. ఫలితంగా సిక్కులతో మొగలులకు ఘర్షణలు ప్రారంభమయ్యాయి.

రాజ్య విస్తరణ

జహంగీర్‌ బెంగాల్, మేవాడ్, కాంగ్రా, అహ్మద్‌నగర్‌ లాంటి రాజ్యాలపై దండయాత్రలు చేసి రాజ్యాన్ని విస్తరించాడు. బెంగాల్‌ పాలకుడైన ఉస్మాన్‌ఖాన్‌ (ఆఫ్గన్‌)ను ఓడించి, ఇస్లాంఖాన్‌ను గవర్నర్‌గా నియమించాడు. అనంతరం ఖాసింఖాన్, ఇబ్రహీం ఖాన్‌లు బెంగాల్‌ గవర్నర్లుగా పనిచేశారు. 

జహంగీర్‌ సాధించిన విజయాల్లో మేవాడ్‌ను చేజిక్కించుకోవడం అత్యుత్తమమైంది. మేవాడ్‌ (మేవార్‌) పాలకుడైన రాణా అమర్‌సింగ్‌పై 1605, 1608, 1615 సంవత్సరాల్లో దండెత్తి, చివరికి 1615 లో సంధికి ఒప్పించాడు. పంజాబ్‌ పర్వత ప్రాంతాల్లో ఉన్న కాంగ్రా ప్రాంతాన్ని సైతం జయించాడు. 

చాంద్‌బీబీ మరణానంతరం అహ్మద్‌నగర్‌ను మాలిక్‌అంబర్‌ పాలించేవాడు. జహంగీర్‌ ఈ ప్రాంతంపై అనేకసార్లు దండయాత్ర చేశాడు. సుమారు ఏడుసార్లు మాలిక్‌ అంబర్‌ మొగల్‌ దాడులను తిప్పికొట్టాడు. చివరికి జహంగీర్‌ ఆ ప్రాంతంపై ఆధిపత్యం సాధించి, ‘దక్షిణ సుబా’ను ఏర్పాటు చేశాడు. కానీ జహంగీర్‌ పరిపాలనా కాలమంతా తిరుగుబాట్లతోనే సరిపోయింది. మొదట ఖుస్రూ, అనంతరం జుంటాముఠా, ఖుర్రం, మహబత్‌ఖాన్‌ లాంటివారు తిరుగుబాట్లు చేశారు. ఈ విధమైన అంతఃకలహాల వల్లే మొగలులు 1622 లో కాందహార్‌ను శాశ్వతంగా కోల్పోయారు. నాటి పర్షియా రాజు షా అబ్బాస్‌ కాందహార్‌ను ఆక్రమించాడు. 

జహంగీర్‌ కాలంలో ఇంకా అనేక ముఖ్య సంఘటనలు చోటుచేసుకున్నాయి. 1608లో విలియం హాకిన్స్, 1615 లో సర్‌ థామస్‌ రో లాంటి ఆంగ్లేయులు ఈయన ఆస్థానాన్ని సందర్శించారు. జహంగీర్‌ అనుమతితోనే ఆంగ్లేయులు 1616 లో సూరత్‌లో తమ తొలి వర్తక స్థావరాన్ని ఏర్పాటుచేశారు. 

ఇతడి కాలంలో 1616లో ‘బొబ్బల ప్లేగు’ అనే వ్యాధి వ్యాపించింది. 

మహబత్‌ఖాన్‌ అనే సేనాని జహంగీర్, నూర్జహాన్‌లను బంధించి, 1625 లో వందరోజుల పాలన చేశాడు. చివరికి 1628 లో ఖుర్రం (షాజహాన్‌) అందరినీ ఓడించి మొగల్‌ చక్రవర్తి అయ్యాడు. దీంతో జహంగీర్‌ పాలన అంతమయ్యింది.

జహంగీర్‌ గొప్ప విజేత, పరిపాలనాదక్షుడే కాక గొప్ప కళాభిమాని. అనేకమంది కవి పండితులను, కళాకారులను పోషించాడు. ఈయన సూక్ష్మచిత్రలేఖనంలో గొప్ప నిష్ణాతుడు. ఇతడి ఆస్థానంలో బిషన్‌దాస్, మనోహర్‌ గోవర్ధన్‌ లాంటి ప్రసిద్ధ చిత్రకారులు ఉండేవారు. జహంగీర్‌ తుజ్‌కీ-ఇ-జహంగిరీ పేరుతో స్వీయచరిత్రను రాశాడు. తన తండ్రి అక్బర్‌ సమాధిని సికిందర్‌ (ఆగ్రా)లో నిర్మించాడు. కశ్మీర్‌ ఉద్యానవనాలు (షాలిమర్‌ ఉద్యానవనాలు) నిర్మించింది ఇతడే. ఈయన కాలంలో నిర్మించిన ఇతిముద్దౌలా సమాధి, జహంగీర్‌ మహల్‌ (ఆగ్రా) గొప్ప కట్టడాలుగా పేరుగాంచాయి.

నూర్జహాన్‌

మొగల్‌ సామ్రాజ్యంలో ప్రధానపాత్ర పోషించిన వనిత నూర్జహాన్‌. ఈమె అసలు పేరు మెహరున్నీసా. మొదటి భర్త షేర్‌ అఫ్గాన్‌ ద్వారా లాడ్లీబేగం అనే కుమార్తెకు జన్మనిచ్చింది. నౌరోజ్‌ పండుగలో ఈమెను చూసిన జహంగీర్‌ వివాహం చేసుకోవాలనుకున్నాడు.1611లో అఫ్గాన్‌ మరణించాక వీరి పెళ్లి జరిగింది. మెహరున్నీసాను జహంగీర్‌ నూర్‌మహర్‌ (ఇంటి వెలుగు), నూర్జహాన్‌ (ప్రపంచ వెలుగు) అని ప్రేమగా పిలుచుకునేవాడు. వీరి వివాహం మొగల్‌ సామ్రాజ్యంలో పెను మార్పులకు కారణమైంది. గొప్ప విద్యావంతురాలు, మేధావి అయిన నూర్జహాన్‌కు అధికార దాహం కూడా ఎక్కువే. జహంగీర్‌తో వివాహం అనంతరం అధికారాన్ని హస్తగతం చేసుకుంది. తన తండ్రి ఘియాస్‌బేగ్‌ను, సోదరుడు అబుల్‌ హసన్‌ (ఆసఫ్‌ఖాన్‌)ను ఉన్నత పదవుల్లో నియమించింది. 

తన అనుచరులందరితో ‘నూర్జహాన్‌ జుంఠా’ (జుంటాముఠా)ను ఏర్పాటు చేసింది. రాజ్యపాలనలో సర్వాధికారాలు చెలాయించేది. నాణేలపై కూడా నూర్జహాన్‌ తన పేరును ముద్రించుకుంది. తన కుమార్తె లాడ్లీబేగంను జహంగీర్‌ చిన్న కుమారుడు షహ్రియార్‌కిచ్చి వివాహం చేసి, అతడ్ని చక్రవర్తిని చేయాలని ప్రయత్నించింది. ఫలితంగా అప్పటివరకు జుంటాముఠా సభ్యుడిగా ఉన్న జహంగీర్‌ పెద్ద కుమారుడు ఖుర్రం (షాజహాన్‌) తిరుగుబాటు చేశాడు. తన భర్త జహంగీర్‌ సమాధిని లాహోర్‌లో నిర్మించింది. తండ్రి జ్ఞాపకార్థం ఇతిముద్దౌలా పేరుతో సమాధిని కట్టించింది. ఇదే షాజహాన్‌ నిర్మించిన తాజ్‌మహల్‌కు నమూనాగా పేరొందింది. 

జహంగీర్‌ పెద్ద కుమారుడు షాజహాన్‌. ఇతడి అసలు పేరు ఖుర్రం. తండ్రి పాలనాకాలంలో ఇతడు అనేక దండయాత్రల్లో పాల్గొన్నాడు. నూర్జహాన్‌ జుంటాముఠాలో సభ్యుడు. నూర్జహాన్‌ తన అల్లుడైన షహ్రియార్‌ను చక్రవర్తిని చేయడానికి ప్రయత్నించడంతో ఖుర్రం తిరుగుబాటు చేశాడు. 1628 నాటికి అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు. షాజహాన్‌ గొప్ప విజేత, పరిపాలనా దక్షుడు, సారస్వత కళాభిమాని. గొప్ప భవన నిర్మాత. ఇతడి పాలనా కాలాన్ని చరిత్రకారులు స్వర్ణయుగంగా పేర్కొంటారు.

మహారాష్ట్రులు - శివాజీ

క్రీ.శ. 17వ శతాబ్దం ద్వితీయార్ధంలో మొగలుల పాలనా కాలంలో మహారాష్ట్రులు శివాజీ నాయకత్వంలో దక్కన్‌లో స్వరాజ్యాన్ని స్థాపించారు. వీరు రాజకీయంగా, సాంస్కృతికంగా భారతదేశానికి విశేష సేవలు అందించారు. భౌగోళికపరమైన, మతపరమైన అంశాలు మహారాష్ట్రుల రాజ్య స్థాపనకు దోహదం చేశాయి. 

వీరి విజయానికి దోహదం చేసిన మొదటి అంశంగా దక్కన్‌ భౌగోళిక స్వరూపాన్ని పేర్కొనవచ్చు. వింధ్య, సాత్పూరా, సహ్యాద్రి పర్వతాలు; నర్మద, తపతి నదులు మహారాష్ట్రులకు సహజ రక్షణలుగా నిలిచాయి. దట్టమైన అడవులు, బలీయమైన దుర్గాలతో ఉన్న మహారాష్ట్ర ప్రాంతాన్ని ఆక్రమించడం కష్టసాధ్యంగా ఉండేది. ఈ భౌగోళిక పరిస్థితులు శివాజీ అధికారంలోకి రావడానికి తోడ్పడ్డాయి. నాటి మహారాష్ట్రలోని మావళీలు అనే కొండ జాతుల వారి సహకారంతో శివాజీ గెరిల్లా యుద్ధ పద్ధతులను అనుసరించి, విజయం సాధించాడు. 

సమర్థ రామదాసు, ఏక్‌నాథ్, తుకారాం, వామన పండిట్‌ లాంటి మరాఠా భక్తి ఉద్యమకారుల బోధనలు మహారాష్ట్రులు ఏకమవడానికి, స్వరాజ్య సాధనకు కృషి చేయడానికి తోడ్పడ్డాయి. వీరు భగవంతుడి ముందు జాతి, కుల, మత తారతమ్యాలు లేవని, మనం చేసే పనిని బట్టి మనకు గౌరవం ఉంటుందని బోధించడం ద్వారా మహారాష్ట్రుల్లో సాంస్కృతిక పునరుజ్జీవనానికి, రాజకీయ చైతన్యానికి పునాది వేశారు. మతపరమైన ఈ ఐక్యత వారి భాషాభివృద్ధికి కూడా దోహదపడింది. శివాజీ పూర్వీకులు నాటి దక్కన్‌ సుల్తాన్‌ల  వద్ద ఉద్యోగాలు చేయడం ద్వారా రాజకీయ పాలనానుభవాన్ని గడించారు. ఇదే అనంతర కాలంలో వారి రాజ్య స్థాపనలో ఉపయోగపడింది. మొదట తమపట్ల సహన భావాన్ని, అభిమానాన్ని చూపిన దక్కన్‌ సుల్తాన్‌లు క్రమంగా అసహనాన్ని, ద్వేషాన్ని పెంచుకోవడంతో మహారాష్ట్రులు శివాజీ నాయకత్వంలో స్వరాజ్య స్థాపనకు పూనుకున్నారు. మొగల్‌ చక్రవర్తులు దక్కన్‌ రాష్ట్రాలపై దాడులు చేయడం, దక్కన్‌ సుల్తాన్‌లు బలహీనులు కావడం లాంటి కారణాలు శివాజీ స్వరాజ్యాన్ని స్థాపించడానికి దోహదం చేశాయి.

శివాజీ 1627లో శివనీర్‌ దుర్గంలో జన్మించాడు. తండ్రి షాజీభాన్‌స్లే, తల్లి జిజియాబాయి. తండ్రి తన జాగీర్‌ పరిపాలనకు వెళ్లిన తరుణంలో తల్లి జిజియాబాయి చెప్పిన సాహసగాథలు శివాజీని ప్రభావితం చేశాయి. రాజకీయ గురువైన దాదాజీ కొండదేవ్‌ (దాదాజీ ఖాందియో), మత గురువైన సమర్థ రామదాసు వల్ల శివాజీ మరింత ఆధ్యాత్మిక, శరణాగత లక్షణ¦లను పెంపొందించుకున్నాడు. దక్కన్‌లో సుల్తాన్‌లు బలహీనపడటం, మొగల్‌ పాలకుల దాడులు శివాజీని ప్రభావితం చేశాయి. మావళీలు అనే కొండ జాతివారితో స్నేహం వల్ల అతడికి గెరిల్లా యుద్ధ పద్ధతులు అవగతమయ్యాయి. ఫలితంగా శివాజీ నాటి బీజాపూర్‌ సుల్తాన్‌ను, మొగల్‌ చక్రవర్తిని ఎదిరించి స్వరాజ్య స్థాపనకు పూనుకున్నాడు.

అష్ట ప్రధానులు

1. పీష్వా - ప్రధానమంత్రి: సాధారణ పాలనా వ్యవహారాల నిర్వహణ

2. అమాత్య - ఆర్థిక మంత్రి: ఆదాయ వ్యయాలు, బడ్జెట్‌ నిర్వహణ

3. మంత్రి - ఆంతరంగిక వ్యవహారాల నిర్వహణ

4. సచివ - సమాచార మంత్రి: ఉత్తర, ప్రత్యుత్తరాల నిర్వహణ

5. సుమంత్‌ - విదేశీ వ్యవహారాల నిర్వహణ

6. పండితరావు - మత వ్యవహారాలు, దానధర్మాలు, ధర్మాదాయశాఖ

7. సేనాపతి - సర్వసైన్యాధ్యక్షుడు, యుద్ధ మంత్రి

8. న్యాయాదీశ్‌ - న్యాయశాఖామంత్రి

రాష్ట్ర, స్థానిక పాలన: పరిపాలనా సౌలభ్యం కోసం శివాజీ రాజ్యాన్ని నాలుగు రాష్ట్రాలుగా విభజించాడు. వాటికి అధిపతిగా వైస్రాయ్‌/గవర్నర్‌లను నియమించాడు. రాష్ట్రాలను మళ్లీ ప్రాంతాలు/ పరగణాలు, తరఫ్‌లు, గ్రామాలుగా ఏర్పాటుచేశాడు. ప్రతీ స్థానంలో సమర్థులైన ఉద్యోగులను నియమించాడు. తరఫ్‌లో తరఫ్‌దారులు; గ్రామాల్లో పటేల్, కులకర్ణి వంటి ఉద్యోగులు పాలనా వ్యవహారాలు నిర్వహించేవారు. శివాజీ సమీప ప్రాంతాల నుంచి (తన రాజ్య సరిహద్దుల్లోని ఇతర ప్రాంతాలు) చౌత్‌ (1/4 వ వంతు), సర్దేశ్‌ముఖ్‌ (1/10) లాంటి పన్నులను వసూలు చేసేవాడు.

రెవెన్యూ పాలన: శివాజీ రెవెన్యూ విధానంలో ప్రధానమైంది రైత్వారీ విధానం. అంతకుముందున్న ‘‘ఫార్మింగ్‌ ఔట్‌’’, జాగీర్దారీ విధానాలను రద్దు చేసిన శివాజీ అధికారుల ద్వారా రైతుల నుంచే నేరుగా భూమి శిస్తు వసూలు చేసే విధానాన్ని ప్రవేశపెట్టాడు. భూములను సర్వే చేయడానికి దేశమంతటా ఒకే రకమైన కొలమానాన్ని అమలు చేశాడు. పండిన పంటలో 30 శాతాన్ని భూమి శిస్తుగా నిర్ణయించి, దాన్ని ధన, ధాన్య రూపాల్లో చెల్లించడానికి అనుమతించాడు. విత్తనాలు, పశువులను కొనుగోలు చేయడానికి రైతులకు ప్రభుత్వ కోశాగారం నుంచి రుణాలు మంజూరు చేశాడు. రాజ్యానికి భూమి శిస్తుతో పాటు వాణిజ్య పన్నులు, చౌత్, సర్దేశ్‌ముఖ్‌ పన్నుల ద్వారా ఆదాయం లభించేది. తన రాజ్య భాగాల నుంచే గాక, సమీప రాజ్యాల నుంచి కూడా శివాజీ బలవంతంగా పన్నులు వసూలు చేయడం, సూరత్‌ లాంటి పట్టణాలపై దాడి చేసి, దోచుకోవడం లాంటి చర్యల వల్ల ప్రముఖ చరిత్రకారుడైన కాఫీఖాన్‌ శివాజీని ‘‘బందిపోటు దొంగ’’ అని వ్యాఖానించాడు.

సైనిక పాలన: శివాజీ బలం అంతా సైనిక శక్తిపైనే ఆధారపడి ఉంది. అందుకే సైనిక పాలన విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు. శివాజీ సైన్యంలో 45 వేల అశ్విక దళం, 60 వేల కాల్బలం, లక్షమందితో పదాతి దళంతోపాటు గజ దళం, ఫిరంగి దళం, నౌకాదళం కూడా ఉండేవి. శివాజీ కొలాబా వద్ద నౌకాదళం ఏర్పాటు చేశాడు. కోటలు, దుర్గాల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నాడు. సమర్థులైన వారికి బిరుదులు ఇవ్వడం, ప్రతిభావంతులకు అదనపు సౌకర్యాలు కల్పించడం లాంటి చర్యల ద్వారా సైనికుల్లో సామర్థ్యాన్ని, అంకిత భావాన్ని పెంపొందించాడు. యుద్ధ రంగానికి స్త్రీలను తీసుకెళ్లడాన్ని నిషేధించాడు.

న్యాయ పాలన: శివాజీ న్యాయ వ్యవస్థలో సంప్రదాయ పద్ధతులను పాటించాడు. అత్యున్నత న్యాయాధికారిగా తానే వ్యవహరించి సమ న్యాయపాలన అందించాడు. న్యాయపాలనలో తనకు సాయం చేయడానికి న్యాయాధీశ్‌ అనే న్యాయశాఖామంత్రిని నియమించాడు. గ్రామస్థాయిలో పంచాయతీలు న్యాయపాలన చేసేవి. 

కేసుల విచారణ, తీర్పులు ఇవ్వడంలో ప్రాచీన హిందూ చట్టాలను పరిగణనలోకి తీసుకునేవాడు. ఈ విధంగా భారతదేశంలో స్వతంత్ర మరాఠా రాజ్యాన్ని నిర్మించి, సమర్థవంతమైన పాలనను అందించాడు. ప్రముఖ చరిత్రకారుడైన జె.ఎన్‌. సర్కార్‌ ‘‘శివాజీ మహారాష్ట్రులకు వెలుగు. మొగలుల పాలిట సింహస్వప్నం. తన వారసులకు స్ఫూర్తి ప్రదాత’’ అని పేర్కొన్నాడు. 

శివాజీ వారసులు

శివాజీ క్రీ.శ. 1680లో మరణించాడు. అనంతరం అతడి కుమారుడైన శంభాజీ 1680 - 89 వరకు, రాజారాం 1689 నుంచి 1700 వరకు, తారాబాయి 1700 నుంచి 1707 వరకు, సాహూ 1707 నుంచి 1948 వరకు రాజ్యాన్ని పాలించారు. శివాజీ వారసులు బలహీనులు కావడం, వారసత్వ యుద్ధాలు చేయడం, పీష్వాలకు అధికారం వారసత్వంగా ఇవ్వడం లాంటి కారణాల వల్ల క్రమంగా మరాఠాల స్వాతంత్య్రం అంతరించింది. ముఖ్యంగా తారాబాయి, సాహూ మధ్య వారసత్వ తగాదాల వల్ల మరాఠా సామ్రాజ్యం కొల్హాపూర్, సతారాలుగా విడిపోయింది. సాహూ చక్రవర్తి 1714లో బాలాజీ విశ్వనాథ్‌కు పీష్వా పదవిని వంశపారంపర్యం చేయడంతో పీష్వాల యుగం ప్రారంభమైంది. బాలాజీ విశ్వనాథ్‌ (1713 - 20), మొదటి బాజీరావు (1720  - 40), బాలాజీ బాజీరావు (1740 - 61) లాంటి పీష్వాల కాలంలో మహారాష్ట్రులు కొంత వరకు సమర్థంగా పరిపాలించారు. 

ఆంగ్లేయుల రాకతో ముఖ్యంగా 1761నాటి మూడో పానిపట్టు యుద్ధంతో మహారాష్ట్రులు పతనం ప్రారంభమైంది. చివరికి మూడో ఆంగ్ల-మరాఠా యుద్ధానంతరం 1818లో ఆంగ్లేయులు పీష్వా పదవిని రద్దుచేయడంతో నాటి చివరి పీష్వా రెండో బాజీరావు పదవిని కోల్పోయాడు. దాంతో శివాజీ స్థాపించిన స్వరాజ్యం చరిత్రలో కనుమరుగైంది.

శివాజీ విజయాలు

శివాజీ 1646లో ‘తోరణదుర్గ’ ఆక్రమణతో తన విజయాలను ప్రారంభించాడు. అనంతరం బీజాపూర్‌ సుల్తాన్‌ ఆధీనంలో ఉన్న కొండన్, చకాన్, రాయ్‌గఢ్‌ లాంటి ప్రాంతాలను ఆక్రమించుకున్నాడు. శివాజీ ధాటికి భీతిల్లిన నాటి బీజాపూర్‌ సుల్తాన్‌ శివాజీ తండ్రిని బంధించాడు. దీంతో శివాజీ అతడితో సంధి చేసుకుని, తండ్రిని విడిపించి దండయాత్రలు నిలిపివేశాడు. అనంతరం 1656లో సర్దార్‌  చంద్రరావును ఓడించి జావళి ప్రాంతాన్ని; 1657లో కొంకణ్, మహూళీ దుర్గాలను ఆక్రమించాడు. శివాజీ దాడులను అడ్డుకోవడానికి బీజాపూర్‌ సుల్తాన్‌ అఫ్జల్‌ఖాన్‌ నాయకత్వంలో సైన్యాన్ని పంపించాడు. తనతో సంధి కుదుర్చుకుంటున్నట్లు నాటకం ఆడి, చంపడానికి ప్రయత్నించిన అఫ్జల్‌ఖాన్‌ను శివాజీ పులిగోళ్లు ధరించి వధించాడు. నాటి మొగల్‌ చక్రవర్తి ఔరంగజేబ్‌ శివాజీని ఓడించడానికి మొదట తన మేనమామ షయిస్తాఖాన్‌ను పంపించాడు.

కానీ శివాజీ అతడిని ఓడించి, అతడు ఆక్రమించిన పూనా, కళ్యాణ దుర్గాలను పునరాక్రమించాడు. ఈ సమయంలోనే షయిస్తాఖాన్‌ తన బొటనవేలును కోల్పోయి, గాయపడి ఓటమిని అంగీకరించాడు. అనంతరం శివాజీ సూరత్‌ ఓడరేవును ముట్టడించాడు. ఈ రేవునుంచి సుమారు కోటి రూపాయలను దోచుకున్నారు. అనంతరం ఔరంగజేబ్‌ రాజా జైసింగ్‌ నాయకత్వంలో సేనలను పంపించాడు. అతడి చేతిలో ఓడిపోయిన శివాజీ 1665లో పురంధర్‌ సంధి కుదుర్చుకున్నాడు. ఈ సంధి వల్ల శివాజీ దాదాపు 23 కోటలను మొగలులకు స్వాధీనం చేశాడు. బీజాపూర్‌ సుల్తాన్‌తో మొగలులు చేసే యుద్ధానికి సాయం చేస్తానని అంగీకరించాడు. తన కుమారుడు శంభాజీని, 5000 మంది అశ్వకులతో (మున్సబ్‌దార్‌) మొగల్‌ ఆస్థానానికి పంపించడానికి, 13 సంవత్సరాల కాలంలో నలబై లక్షల పన్నులు చెల్లించడానికి శివాజీ అంగీకరించాడు. ఈ సంధి షరతుల ప్రకారం, శివాజీ ఆగ్రాలోని మొగల్‌ దర్బారును సందర్శించాడు. ఈ సమయంలోనే ఔరంగజేబ్‌ శివాజీని చెరసాలలో బంధించగా, అతడు తెలివిగా తప్పించుకున్నాడు

శివాజీ మళ్లీ తన దండయాత్రలను ప్రారంభించాడు. పురంధర్‌ సంధి ద్వారా తాను మొగలులకు కోల్పోయిన కోటలను తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. 1670లో సూరత్‌పై రెండో దాడి చేశాడు. ఈ విజయాల అనంతరం శివాజీ 1674 జూన్‌ 16న రాయ్‌గఢ్‌ కోటలో ఛత్రపతి బిరుదుతో పట్టాభిషేకం జరుపుకున్నాడు. ఈ కార్యక్రమాన్ని కాశీకి చెందిన గాగభట్టు అనే పండితుడు నిర్వహించాడు. పట్టాభిషేకం తర్వాత శివాజీ కర్ణాటకపై తొలి దండయాత్ర చేశాడు. గోల్కొండ సుల్తాన్‌లతో మైత్రిని కుదుర్చుకున్నాడు. జింజి, వెల్లూరు ప్రాంతాలను ఆక్రమించుకున్నాడు. మద్రాస్‌ - కర్ణాటక ప్రాంతమంతా శివాజీ ఆధీనంలోకి వచ్చింది. ఈ విధంగా శివాజీ మొగలులు, బీజాపూర్‌ పాలకులు, పోర్చుగీసువారు, గోల్కొండ సుల్తాన్‌లు అనే శక్తిమంతమైన శత్రువులతో పోరాడి, స్వరాజ్య స్థాపన చేయడం చరిత్రలో అరుదైన ఘట్టంగా నిలిచిపోయింది.

Posted Date : 17-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌