• facebook
  • whatsapp
  • telegram

 సహజ ఉద్భిజ సంపద

విశాలమైన భూభాగంలో మానవ ప్రమేయం లేకుండా సహజంగా, ఏపుగా లేదా పొదలుగా పెరిగిన అనేక రకాల వృక్షజాతులను సహజ ఉద్భిజ సంపదగా నిర్వచిస్తారు. కొన్ని వేల సంవత్సరాల క్రితం మట్టి, సూర్యరశ్మి, వర్షపాతం ఉన్న ప్రతిచోటా అడవులు పెరిగేవి. మానవులు వ్యవసాయం కోసం; గ్రామాలు, పట్టణాల విస్తరణ కోసం చెట్లను కొట్టేయడం ప్రారంభించారు. గనులు, పరిశ్రమల అవసరాల కోసం మరింతగా అడవులను నరకడం మొదలుపెట్టారు. ఈ కారణంగా 20వ శతాబ్దం ప్రారంభం నాటికి వ్యవసాయానికి అనువుకాని ప్రాంతాల్లో మాత్రమే అడవులు మిగిలాయి.

అడవుల రకాలు

వర్షపాతం, నేల స్వభావం, భూభాగాల ఎత్తు ఆధారంగా భారతదేశంలో అడవులను అయిదు రకాలుగా విభజించారు. అవి: 

1. సతత హరితారణ్యాలు

2. ఆకురాల్చే అడవులు  

3. చిట్టడవులు

4. టైడల్‌/ క్షారజల అడవులు

5. పర్వత ప్రాంత అడవులు


సతత హరితారణ్యాలు

ఈ అడవులు సాధారణంగా 500 నుంచి 1500 మీటర్ల ఎత్తు ఉన్న ప్రాంతాల్లో పెరుగుతాయి. వీటికి 200 సెం.మీ. కంటే ఎక్కువ వర్షపాతం కలిగిన ప్రాంతాలు అనుకూలం. ఈ అడవులు మనదేశంలో 21% విస్తరించి ఉన్నాయి.

* ఈ అరణ్యాల్లో వృక్షాలు 45-60 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి.

* ఇవి భారతదేశంలో పశ్చిమ కనుమల దక్షిణ భాగం (కర్ణాటక, కేరళ), ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్‌ నికోబార్‌ దీవులు, పశ్చిమ్‌ బంగా, ఒడిశాలోని మైదానాల్లో ఉన్నాయి.

ఈ అరణ్యాల్లో పెరిగే వృక్ష జాతులు: రోజ్‌వుడ్, మహాగని, ఐరన్‌ఉడ్, ఎబోని, టూన్‌.

* అగ్గిపుల్లల తయారీలో ఉపయోగించే ‘చిర్‌’ రకపు వృక్షాలు ఈశాన్య భారత్‌లోని సతత హరితారణ్యాల్లో పెరుగుతాయి.

* ఈ అరణ్యాల వాణిజ్య విలువ చాలా తక్కువ.

ఆకురాల్చే అడవులు (Deciduous Forests)

* ఇవి 70200 సెం.మీ. వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో పెరుగుతాయి.

* ఇవి మనదేశంలో ఎక్కువగా (58.51%) విస్తరించాయి.

* ఈ అడవుల్లోని వృక్షాలు వేసవి కాలంలో బాష్పోత్సేకాన్ని తగ్గించుకునేందుకు ఆకులు రాలుస్తాయి.

* ఈ రకమైన అడవులు ద్వీపకల్ప పీఠభూమిలో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి.

* ఇవి భారతదేశంలో ఆర్థికంగా చాలా ముఖ్యమైన అడవులు.

వృక్షజాతులు: టేకు, గుగ్గిలం (శివాలిక్‌ కొండలు), మంచి గంధం (కర్ణాటక), షీషమ్, వెదురు, సాల్‌ వృక్షాలు మొదలైనవి పెరుగుతాయి.

* బ్రిటిష్‌ వారి కాలంలో రైల్వే స్లీపర్ల తయారీకి సాల్‌ వృక్షాల కలపను ఉపయోగించేవారు.

* సాల్‌ వృక్షాలు చోటానాగ్‌పుర్‌ పీఠభూమిలో విరివిగా పెరుగుతాయి. ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు సాల్‌ చెట్టును తమ రాష్ట్ర వృక్షంగా ప్రకటించాయి.

* మనదేశలో వెదురును ప్రధానంగా కాగితం తయారీకి ఉపయోగిస్తారు. పేదవారి ఇంటి నిర్మాణంలోనూ దీన్ని విరివిగా వాడతారు. అందుకే వెదురును ‘పేదవాడి కలప’ అంటారు.

* మనదేశంలో ఏటా సెప్టెంబరు 18ని ‘ప్రపంచ వెదురు దినోత్సవం’గా నిర్వహిస్తారు.


చిట్టడవులు (Thorny/ Shrub Forests)

* వీటిని ముళ్లజాతి అడవులు అని కూడా అంటారు.

* 75 సెం.మీ. కంటే తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో ఇవి పెరుగుతాయి.

* ఈ అడవుల్లోని చెట్లు ముళ్లతో, పొదలుగా ఉంటాయి.

* పంజాబ్, రాజస్థాన్‌; పశ్చిమ ఉత్తర్‌ ప్రదేశ్‌లోని మైదానాలు; గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాలు; సముద్రం దగ్గర్లో ఉన్న దక్కన్‌ పీఠభూమి ప్రాంతాల్లో ఈ రకమైన అడవులు పెరుగుతాయి.

వృక్షజాతులు: రేగు, తాటి, బ్రహ్మజెముడు, తుమ్మ, నల్లతుమ్మ, ఉసిరి మొదలైనవి.

* చిట్టడవులు భారతదేశంలో 2.72% విస్తరించి ఉన్నాయి.

టైడల్‌/క్షారజల అడవులు

బురద, ఒండ్రుతో కూడిన సముద్ర తరంగాలు; పోటుపాట్లకు గురయ్యే, ఉప్పునీటి, మంచినీటి తీర ప్రాంతాల్లో ఇవి పెరుగుతాయి.

* ఈ అడవుల్లో మడ చెట్లు ఎక్కువగా పెరుగుతాయి. అందుకే వీటిని ‘మడ అడవులు’ అని కూడా అంటారు.

* బెంగాల్‌ డెల్టా ప్రాంతంలోని ఈ అడవుల్లో ‘సుందరి’ వృక్షాలు ఎక్కువగా పెరుగుతాయి. వీటిని ఈ ప్రాంతంలో ‘సుందరి వనాలు’ అంటారు.

* తుపానుల సమయంలో తీరాన్ని తాకే ఎత్తయిన కెరటాల నుంచి తీర ప్రాంత భూభాగాలను రక్షించడంలో ఈ అడవులు కీలక పాత్ర పోషిస్తాయి.

* ఇటీవలి కాలంలో ఆక్వాకల్చర్, సెజ్‌లుగా ఈ ప్రాంతాలను ప్రకటించడం; టూరిజం లాంటి అభివృద్ధి కార్యక్రమాల వల్ల టైడల్‌ అరణ్యాల ఉనికికి నష్టం వాటిల్లుతోంది.

* వీటి సంరక్షణ కోసం 1971లో ‘రామ్‌సర్‌ ఒప్పందం’ అమల్లోకి వచ్చింది.

* ఇవి దేశంలో 0.73% వరకు విస్తరించి ఉన్నాయి.

పర్వతప్రాంత అడవులు

ఇవి పర్వత ప్రాంతాల్లో పెరుగుతాయి.

* భారతదేశంలో హిమాలయ వాలులు, నీలగిరి, అన్నామలై వాలు ప్రాంతాల్లో పెరుగుతాయి.

* హిమాలయాల్లో 1000 మీ. నుంచి 1800 మీ. ఎత్తు ఉన్న ప్రాంతాల్లో పెరిగే అడవులను ఉష్ణమండల సతతహరితారణ్యాలు అంటారు.

* ఈ అడవులు 1800 నుంచి 3300 మీ. ఎత్తులో పెరుగుతాయి. వీటిని శృంగాకార అడవులు లేదా కోనిఫెరస్‌ అడవులు అని కూడా అంటారు.

* శృంగాకార అడవుల్లో దేవదారు, సిల్వర్‌ఫర్, చెస్ట్‌నట్, వాల్‌నట్‌ వృక్షాలు పెరుగుతాయి.

* దేవదారు వృక్షాల ఆకులు సన్నటి సూదంటు రాయి ఆకారంలో, త్రిభుజాకారంలో ఉండి; మంచు, వర్షపునీరు సులువుగా జారిపోయే లక్షణాన్ని కలిగి ఉంటాయి.

* దేవదారు వృక్షాలకు పూలు పూయవు, శంకువుల లాంటి పునరుత్పత్తి భాగాలు ఉంటాయి.

* 3,300 మీ. లేదా అంతకంటే ఎక్కువ ఎత్తులో ఉండే హిమాద్రి హిమాలయాల్లో పెరిగే అడవులను ఆల్పైన్‌ అడవులు అంటారు.

* పశ్చిమ కనుమల్లో 1800 మీ. నుంచి 3000 మీ. ఎత్తు వరకు పెరిగే అడవులను ‘షోలాస్‌’ అడవులు అంటారు.

జాతీయ అటవీ విధానం (National Forest Policy)

భారతదేశంలో మొదటి జాతీయ అటవీ విధానాన్ని బ్రిటిష్‌ ప్రభుత్వం 1894లో ప్రకటించింది. 

* ఇందులో అడవుల నుంచి వచ్చే ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు, జమీందారులకు చెందిన బహిరంగ ప్రాంతాలను వ్యవసాయ భూములుగా మార్చేందుకు ప్రాధాన్యం ఇచ్చారు.

జాతీయ అటవీ విధానం 1952: ఇది స్వాతంత్య్రం వచ్చాక ప్రకటించిన మొట్టమొదటి అటవీ విధానం. 

లక్ష్యాలు:

* 1952 జాతీయ అటవీ విధానం ప్రకారం ఆవరణ సమతౌల్యాన్ని కాపాడటానికి మైదానాల్లో 20%; పర్వతాలు, కొండ ప్రాంతాలలో 60%; మొత్తం సగటు భౌగోళిక విస్తీర్ణంలో 33% భూభాగంలో అడవులు ఉండాలి.

* గిరిజనులు పోడు వ్యవసాయం చేయకుండా చూడాలి.

* పరిశ్రమలకు కావాల్సిన కలపను అందించాలి.

నూతన అటవీ విధానం 1988: 

* దీన్ని సవరించిన అటవీ విధానం అని కూడా అంటారు.

ముఖ్యాంశాలు:

* అడవుల రక్షణ, పునరుద్ధరణలో గిరిజనులను భాగస్వామ్యం చేయడం.

* అడవులను కాపాడటం ద్వారా పర్యావరణ స్థిరత్వాన్ని, జీవవైవిధ్య సమతౌల్యాన్ని సాధించడం.

* 1988లో ఉమ్మడి అటవీ యాజమాన్యాన్ని ఏర్పాటు చేశారు. అడవుల పరిరక్షణలో స్థానికుల సహాయ సహకారాలు తీసుకోవడం దీని లక్ష్యం. వీటిని తెలుగు రాష్ట్రాల్లో ‘ప్రజా అటవీ యాజమాన్యాలు’గా అమలుచేశారు.

* 1988 కమ్యూనిటీ ఫారెస్ట్‌ మేనేజ్‌మెంట్, జాయింట్‌ ఫారెస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రకారం గిరిజనులు తాము సాగు భూములుగా మార్చిన అటవీ భూములను వదులుకోవాల్సి వచ్చింది.

* అదే సమయంలో అటవీ జంతువుల సంరక్షణకు పులుల అభయారణ్యాలు అనేకం ఏర్పాటయ్యాయి.

అటవీ హక్కుల చట్టం 2006

* 1988 జాయింట్‌ ఫారెస్ట్‌ మేనేజ్‌మెంట్‌లోని అంశాలకు వ్యతిరేకంగా గిరిజనులు నిరసనలు ప్రారంభించారు.

* అనేక స్వచ్ఛంద సంస్థలు గిరిజనులకు సహాయంగా నిలిచి అడవులపై వారి హక్కుల కోసం జాతీయ స్థాయి ప్రచార ఉద్యమాన్ని చేపట్టాయి.

* సుదీర్ఘ చర్చల తర్వాత 2006లో పార్లమెంట్‌ అటవీ హక్కుల చట్టాన్ని తెచ్చింది.

ప్రధానాంశాలు:

* అడవుల సంరక్షణతో పాటు, అటవీ వాసులకు జీవనోపాధిని, ఆహార భద్రతను కల్పించడం.

* అడవుల సుస్థిరత, మనుగడలతో అంతర్భాగమైన అటవీవాసులకు వారు తరతరాలుగా సాగుచేస్తున్న భూములపై, వారి నివాస ప్రాంతాలపై వారికే హక్కులు కల్పించడం.

* ప్రభుత్వం చేపట్టిన ఆనకట్టల నిర్మాణం, పులుల అభయారణ్యాల ఏర్పాటు లాంటి కార్యక్రమాల వల్ల నిర్వాసితులైన వారికి నష్టపరిహారం చెల్లించడంతో పాటు వారి జీవనానికి భద్రత కల్పించడం.

అడవుల సంరక్షణకు భారత ప్రభుత్వం చేపట్టిన చర్యలు

* 1954లో యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం (UNDP) ఆధ్వర్యంలో చంద్రాపూర్, నైనిటాల్‌లలో వనీకరణ కార్యక్రమాన్ని చేపట్టారు.

* 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్ర జాబితాలోని అడవులను ఉమ్మడి జాబితాలోకి మార్చారు.

* 1976లో సామాజిక అడవుల పెంపకం కార్యక్రమాన్ని ప్రతిపాదించారు.

* 5వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా సామాజిక అడవుల పెంపకాన్ని ప్రారంభించారు.

* 1980లో అటవీ సంరక్షణ చట్టం చేశారు.

* ప్రభుత్వం ఏటా మార్చి 21న అటవీ దినోత్సవాన్ని, జులై నెల మొదటి వారంలో వనమహోత్సవాలను జరుపుతూ ప్రజల్లో అడవుల ప్రాధాన్యం, వాటి సంరక్షణపై అవగాహనను పెంపొందిస్తోంది.

* కణజాల వర్ధన ప్రక్రియ (Tissue Culture) ద్వారా కలపనిచ్చే మొక్కల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.

* ప్రభుత్వం స్థానిక ప్రజలను భాగస్వాములుగా చేసి, అడవిని రక్షించే ‘వన సంరక్షణ సమితులను’ ఏర్పాటు చేసింది.

* 1972లో వన్యమృగ సంరక్షణ చట్టాన్ని ప్రారంభించారు.

* అంతరించిపోతున్న పులుల సంతతిని కాపాడేందుకు భారత ప్రభుత్వం 1973లో ‘ప్రాజెక్ట్‌ టైగర్‌’ అనే పథకాన్ని ప్రారంభించింది.

* 1974లో యూఎన్‌డీపీ సహకారంతో ‘మొసళ్ల పెంపకం’ పథకాన్ని ప్రారంభించింది.

* 1991-92లో ఏనుగుల సంరక్షణ కోసం భారత ప్రభుత్వం ‘ప్రాజెక్ట్‌ ఎలిఫెంట్‌’ను తీసుకొచ్చింది.

ఇండియన్‌ స్టేట్‌ ఫారెస్ట్‌ రిపోర్ట్‌ (ISFR)

* ఈ నివేదికను ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (FSI) ప్రతి రెండేళ్లకోసారి ప్రకటిస్తుంది. ఇందులో అడవుల విస్తీర్ణాన్ని పేర్కొంటారు.

* FSI ప్రధాన కార్యాలయం డెహ్రడూన్‌లో ఉంది.

* FSI 1987లో తన మొదటి ఫారెస్ట్‌ రిపోర్ట్‌ను విడుదల చేసింది.

ISFR 2021 రిపోర్ట్‌లోని ముఖ్యాంశాలు:

* దేశంలో మొత్తం అడవుల విస్తీర్ణం: 7,13,789 చ.కి.మీ.

* భారతదేశ భూభాగంలో అడవుల శాతం: 21.71%.

* అడవులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్, తక్కువగా ఉన్న రాష్ట్రం హరియాణ.

* అడవులు ఎక్కువగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్, అత్యల్పంగా చంఢీగఢ్‌లో ఉన్నాయి.

* అటవీ భూముల శాతం ఎక్కువగా మిజోరం (84.53%)లో ఉండగా అత్యల్పంగా హరియాణ  (3.63%)లో నమోదైంది.

* తెలంగాణలో అటవీ విస్తీర్ణం 26,969.48 చ.కి.మీ.

* 2019 - 21 మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్రంలో 632 చ.కి.మీ. మేర అటవీ విస్తీర్ణం పెరిగింది.

* తెలంగాణలో ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లో అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉంది.

* తెలంగాణలోని కరీంనగర్, వరంగల్‌ జిల్లాల్లో అధిక అటవీ పెరుగుదల నమోదైంది.

* ఆంధ్రప్రదేశ్‌లో అటవీ విస్తీర్ణం 37,392.24 చ.కి.మీ.

పాలనా పరంగా విభజించిన అడవులు

పరిపాలనా సౌలభ్యం కోసం అడవులను మూడు రకాలుగా వర్గీకరించారు. అవి:

1. అభయారణ్యాలు (Reserved forests)

2. రక్షిత అడవులు (Protected forests)

3. కేటాయించని అడవులు (Unclassified / Open forests)

అభయారణ్యాలు

ఈ అడవులు ప్రభుత్వ అధీనంలో ఉంటాయి.

* వీటిలోకి ప్రజలు ప్రవేశించడం, పశువులను మేపడం, కలప కోసం చెట్లు నరకడం నిషిద్ధం.

* భారతదేశంలో ఈ అడవులు 53% మేర విస్తరించి ఉన్నాయి.

* వీటిని ఉత్తమ అడవులుగా పేర్కొంటారు.

రక్షిత అడవులు 

* ఇవి కూడా ప్రభుత్వ పరిరక్షణలో ఉంటాయి.

* ప్రభుత్వ అనుమతితో ప్రజలు సంచరించవచ్చు, పశువులను మేపవచ్చు. కలపను సేకరించవచ్చు. 

* ప్రత్యేక వృక్షజాలం, జంతుజాలాలను రక్షించడానికి వీటిని ఏర్పాటు చేస్తారు.

* మనదేశంలో ఈ అడవులు 29% వరకు ఉన్నాయి.

కేటాయించని అడవులు

ఈ అడవుల్లో మనుషులు తిరిగేందుకు, చెట్లు నరకడానికి, పశువులను మేపడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవు.

* మనదేశంలో ఈ అడవులు 18% మేర విస్తరించి ఉన్నాయి.

* దేశంలో అనేక షెడ్యూల్డ్‌ తెగల జనాభా ఈ అడవుల్లో నివసిస్తూ, పోడు వ్యవసాయం చేస్తూ, అటవీ సంపదను సేకరిస్తూ జీవనం సాగిస్తున్నారు.

* 2011 జనాభా లెక్కల ప్రకారం 573 షెడ్యూల్డ్‌ తెగల జాతులవారు ఈ అడవుల్లో నివసిస్తున్నారు.

భారత అటవీశాఖ

బ్రిటిష్‌ ప్రభుత్వం భారతదేశంలోని అడవులపై గిరిజనుల ప్రభావాన్ని తగ్గించడడానికి, అడవులను సక్రమ విధానంలో ఉపయోగించుకోవడానికి, అటవీ క్షీణతను కాపాడటానికి 1864లో ‘భారతీయ అటవీశాఖ’ (Indian Forest Department)ను ఏర్పాటు చేసింది.

* స్థానికంగా ఉన్న ఉన్నత/ సంపన్న, జమీందారీ కుటుంబాలకు చెందిన వ్యక్తులను అటవీశాఖ అధికారులుగా నియమించారు.



 

******************************************

అడవులు సహజమైన, అపార విలువ ఉన్న విశిష్ట వనరులు. మానవ అవసరాలకు ఉపయోగపడే అనేక వస్తువులు అడవుల నుంచి లభిస్తాయి. ప్రపంచ భూభాగంలో నాలుగింట ఒక వంతు అడవులు ఉన్నా, అవి అన్ని ఖండాల్లో సమానంగా వ్యాపించిలేవు. దీనికి ప్రధాన కారణాలు: వాతావరణంలోని తారతమ్యాలు, మనిషికి అవసరమైన ఆహారం, వంట చెరకు, కలప, ఔషధాలు, ఫలాల సేకరణ, ఇతర అవసరాల కోసం అడవులను వ్యవసాయ భూములుగా మార్చడం.

భారతదేశంలోని సహజ ఉద్భిజ సంపద అధికంగా ఉష్ణ, సమశీతోష్ణ మండలాలకు చెందింది. అడవులను ఆంగ్లంలో ‘ఫారెస్ట్‌’ అంటారు. ఫారెస్ట్‌ అనే పదం ‘ఫారీస్‌’ అనే లాటిన్‌ పదం నుంచి వచ్చింది. అంటే ‘గ్రామం వెలుపల ఉన్న అటవీ సముదాయం’ అని అర్థం. అడవుల అధ్యయనాన్ని ‘సిల్వాలజీ’  (Silvology)  అని, అటవీ మొక్కల పెంపకాన్ని ‘సిల్వికల్చర్‌’ అని అంటారు. ఏటా మార్చి 21న ప్రపంచ అటవీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అడవుల అభివృద్ధి - సంరక్షణ, జీవవైవిధ్య పరిరక్షణ కోసం భారత ప్రభుత్వం జాతీయ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా 2014 ఫిబ్రవరి 24న ‘గ్రీన్‌ ఇండియా మిషన్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీన్ని 2016లో ప్రారంభించిన 8 జాతీయ మిషన్‌లలో విలీనం చేశారు.

అడవులు - రకాలు

భారతదేశంలోని కొంత భాగం అడవుల్లో ఒకే రకమైన చెట్లు; ఎక్కువ విస్తీర్ణంలోని అడవుల్లో వివిధ రకాల చెట్లు పెరుగుతాయి.కారణం - మన దేశ భౌగోళిక వైశాల్యంలో అధికభాగం అడవులపై ఉష్ణమండల సమశీతోష్ణ పరిస్థితి ప్రభావం ఉంటుంది. అందుకే శీతోష్ణస్థితి అంశాలైన ఉష్ణోగ్రత, వర్షపాతం ఆధారంగా అడవులు పెరుగుతాయి.

భారతదేశంలో మొదటిసారిగా 1936లో హెచ్‌.జి.చాంపియన్, ఎస్‌.కె.సేథ్‌ అటవీ రకాలను వర్గీకరించారు. ఆ తర్వాత వీరే 1968 లో ‘రివైజ్డ్ సర్వే ఆఫ్‌ ఫారెస్ట్‌ టైప్స్‌ ఆఫ్‌ ఇండియా’ అనే పేరుతో శీతోష్ణస్థితి, వర్షపాతాన్ని అనుసరించి భారతీయ అడవులను 5 ప్రధాన సమూహ రకాలుగా, 16 శీతోష్ణస్థితి రకాల అడవులుగా, సుమారు 200 రకాల ఉప గ్రూపులుగా వర్గీకరించారు. ఈ వర్గీకరణను డెహ్రాడూన్‌లోని ‘ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఫారెస్ట్రీ రిసెర్చ్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌’ (ICFRE) ఆమోదించింది.  

2012లో డెహ్రాడూన్‌లోని ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా  (FIS) ఫారెస్ట్‌ రకపు అట్లాస్, డిజిటైజింగ్‌ ఫారెస్ట్‌ టైప్‌ ఆఫ్‌ ఇండియాను అమల్లోకి తెచ్చింది. 2012 లో రష్యాలో నిర్వహించిన వరల్డ్‌ హెరిటేజ్‌ కమిటీ 36వ సెషన్‌లో ‘పశ్చిమ కనుమల’ను యునెస్కో (UNESCO) హెరిటేజ్‌ సైట్‌గా గుర్తించింది.

సతత హరితారణ్యాలు 

సతత హరితారణ్యాలు (Evergreen Forests) అధిక వర్షపాతం ్బ200 సెం.మీ.కంటే ఎక్కువ) ఉన్న ప్రాంతాల్లో ఏడాది పొడవునా పెరుగుతాయి. ఈ అరణ్యాల్లోని చెట్లు వెడల్పైన ఆకులతో 45 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. ఈ రకం దట్టమైన అడవులు భూమధ్యరేఖ ప్రాంత శీతోష్ణస్థితిలో ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచంలోనే అధిక విస్తీర్ణంలో ఉన్న అమెజాన్‌ అడవులు ఈ రకానికి చెందినవే. ఈ అడవులు దట్టంగా ఉండటం వల్ల సూర్యుడి నుంచి వచ్చే కాంతి/వెలుతురు 2% మాత్రమే కిందికి చేరుతుంది. అందుకే అడవి మొత్తం చీకటిగా ఉండి, జీవజాతులకు అనుకూలంగా మారింది. సతతహరితారణ్యాలు ఒకదానితో ఒకటి బాగా అల్లుకుపోయి అర్ధచంద్రాకారంలో కనిపిస్తాయి. వీటినే ‘కనోపి’ అంటారు. భారతదేశంలో ఈ రకమైన అడవులు పశ్చిమ కనుమలు, అండమాన్‌ నికోబార్‌ దీవులు, ఈశాన్య అసోం, బెంగాల్, హిమాలయ పర్వతాల్లో ఎక్కువగా పెరుగుతాయి. ఈ అడవుల్లో ప్రధానంగా మహాగని, ఎబోని, రోజ్‌వుడ్, ఐరన్‌ఉడ్, వెదురు, పామ్స్‌ జాతులు, సింకోనా, రబ్బరు, సిడార్, ఎయిని, కదంబం, దేవదారు మొదలైన వృక్షాలు పెరుగుతాయి. ఈ అడవుల నుంచి లభించే కలపను రైలు, భవన నిర్మాణాలు, ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ రకమైన అడవులు లేవు.

ఆకురాల్చే అరణ్యాలు 

ఆకురాల్చే అడవులు (Deciduous Forests) రుతుపవన ప్రభావ శీతోష్ణస్థితి ఆధారంగా, 100  200 సెం.మీ. వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో పెరుగుతాయి. భారతదేశంలో వర్షాలు ఒక కాలంలో కురిసి, మిగతా కాలాల్లో కురవవు. అందుకే వేసవి (వసంత రుతువు) కాలంలో అడవులు ఆకులు రాలుస్తాయి. కాబట్టి వీటిని రుతుపవన/ ఆకురాల్చే/ బోడి అడవులు అని పిలుస్తారు. మనదేశంలో అత్యధికంగా ్బ65  శాతానికి పైగా) ఈ రకానికి చెందిన అడవులు ఉన్నాయి. ఇవి ఆర్థిక వనరుల రీత్యా, వాణిజ్యపరంగా అత్యంత ఉపయోగకరం. గృహోపకరణాలు, పనిముట్ల తయారీలో ఈ అడవుల నుంచి లభించే కలపను అధికంగా వినియోగిస్తారు. శీతోష్ణస్థితి, వర్షపాతాన్ని అనుసరించి భారతదేశం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ రకమైన అడవులను స్థూలంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు.

ఎ) అధిక వర్షం కురిసే ఆర్ధ్రత ఆకురాల్చే అడవులు: ఈ రకమైన అడవులు పశ్చిమ, తూర్పు కనుమలు, ఈశాన్య రాష్ట్రాలు, శివాలిక్‌ కొండలు, చోటా నాగ్‌పుర్‌ పీఠభూమి ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, తూర్పు గోదావరి, కర్నూలు, కడప, తెలంగాణలోని ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, ఉమ్మడి వరంగల్‌ జిల్లాల్లో అధికంగా పెరుగుతాయి. ఈ అడవుల్లో అధికంగా టేకు, సాల్, వెదురు, ఇప్ప, జిట్టెగి, యూకలిప్టస్‌ (నీలగిరి) చెట్లు పెరుగుతాయి.

బి) తక్కువ వర్షం కురిసే అనార్ధ్ర ఆకురాల్చే అడవులు: ఇవి అధికంగా ద్వీపకల్ప పీఠభూమి ప్రాంతం, ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, శ్రీకాకుళం, తెలంగాణలోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, ఖమ్మం జిల్లాల్లో పెరుగుతాయి. ఈ అడవుల్లో ప్రధానంగా శ్రీగంధం, మంచిగంధం, ఎర్రచందనం, ఇరుగుడు చెట్లు పెరుగుతాయి.

వర్షాభావ ప్రాంత అరణ్యాలు 

అల్ప వర్షపాతం ఉన్న  (50-70 సెం.మీ.) ప్రాంతాల్లో వర్షాభావ ప్రాంత అడవులు  (Scrub Forests) పెరుగుతాయి. ఇవి రెండు రకాలు:

ఎ) చిట్టడవులు: 70 సెం.మీ. కంటే తక్కువ వర్షపాతం ఉన్న పర్వత, కొండ, పీఠభూమి ప్రాంతాల్లో, వర్షచ్ఛాయ ప్రాంతాలైన ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, ప్రకాశం, గుంటూరు; తెలంగాణలోని నల్గొండ, మెదక్, నిజామాబాద్‌ జిల్లాల్లో ఈ రకం అడవులు పెరుగుతాయి. ఈ అడవుల్లో ప్రధానంగా పనిముట్ల తయారీ, వంటచెరకుకు ఉపయోగపడే వేప, మర్రి, సుబాబుల్, తంగేడు, మోదుగ, పాలకొడిశ చెట్లు పెరుగుతాయి.

బి) ముళ్ల అడవులు: 50 సెం.మీ. కంటే ఎక్కువ వర్షం కురిసే ప్రాంతాల్లో ఈ అడవులు పెరుగుతాయి. ప్రధానంగా రాజస్థాన్‌ ఎడారి ప్రాంతం, పంజాబ్, హరియాణా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ అడవులు కనిపిస్తాయి. ముళ్ల అడవుల్లో పెరిగే చెట్లు మందంగా ఉండి, ఎండను తట్టుకుంటాయి. వీటినే గ్జెరోఫైటిక్‌ లక్షణాలు ఉన్న అడవులు అంటారు. ఇందులో ప్రధానంగా తుమ్మ, ముళ్ల పొదలు, బాబుల్, జంద్, టమారిక్స్, షిషకు, నాగజెముడు, బ్రహ్మజెముడు, రేగు, బలుసు చెట్లు పెరుగుతాయి.

క్షార జలారణ్యాలు 

క్షార జలారణ్యాలు (Mangrove Forests) వర్షంతో సంబంధం లేకుండా సముద్ర తీర ప్రాంతాలు  (Littoral), నదీ ముఖద్వారాల్లో ఉప్పు నీరు నిల్వ ఉన్న బురద నేలల్లో పెరుగుతాయి. అందువల్ల వీటిని టైడల్‌ లేదా మాంగ్రూవ్‌ లేదా క్షార జలారణ్యాలు అంటారు. ఇవి దేశంలో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా కోరింగా ప్రాంతం, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలో ఇవి ఉన్నాయి. మాంగ్రూవ్స్‌ నుంచి సేకరించిన కలపను నావలు, కాగితం పరిశ్రమల్లో ఉపయోగిస్తారు.

మన దేశంలో మాంగ్రూవ్‌ అడవులు అత్యధికంగా పశ్చిమ్‌బెంగాల్, గుజరాత్, అండమాన్‌లో అత్యల్పంగా కేరళ, కర్ణాటక, గోవాలో విస్తరించి ఉన్నాయి. ఈ అడవుల్లో ప్రధానంగా సుంద్రి, పుస్సార్, ఉరడ, మొగలి, పొన్న, పొనికి, ఫేము, కాజురైనా చెట్లు పెరుగుతాయి.

పర్వత ప్రాంత అడవులు 

ఎత్తు, శీతోష్ణస్థితి, వర్షపాతాన్ని బట్టి, ఉష్ణోగ్రతలు మారడం వల్ల పర్వత ప్రాంత అడవులు (Mountain Forests) ధ్రువ, ఎత్తయిన పర్వత ప్రాంతాల్లో పెరుగుతాయి. భారతదేశంలో అధికంగా హిమాలయ పర్వతాల్లో, అసోం నుంచి లద్దాఖ్‌ వరకు అక్కడక్కడ, నీలగిరి పర్వతాల్లో పెరుగుతాయి. ఈ అడవుల నుంచి లభించే కలపను ఎక్కువగా నగిషీ వస్తువులు, హస్తకళలు, ఔషధాల తయారీలో వినియోగిస్తారు. ఈ అడవుల్లో ఎత్తుకు వెళ్లే కొద్ది వేర్వేరు వృక్షజాతులు పెరుగుతాయి.

మాంగ్రూవ్స్‌ విస్తరించి ఉన్న ప్రాంతాలు

పశ్చిమ్‌బెంగాల్‌ - సుందర్బన్‌ డెల్టా

ఒడిశా - బితర్‌కనిక

ఆంధ్రప్రదేశ్‌ - కోరింగా 

తమిళనాడు - పిచ్చావరం

కేరళ - వెంబనాడ్‌

కర్ణాటక - కార్వార్‌

మహారాష్ట్ర - ముంబయి, థానే, రత్నగిరి

గుజరాత్‌ - కచ్‌ ప్రాంతం

అండమాన్‌ - భరతాంగ్‌ దీవులు

ఎత్తు (అడుగుల్లో)  - అరణ్యాలు

5000   ఉష్ణమండల అరణ్యాలు

9000   సతత హరితారణ్యాలు

12,000   శృంగాకారపు అరణ్యాలు

14,000   టండ్రా అడవులు

15,000   మంచుతో కూడిన శిఖరాలు

ఈ అడవుల్లో ప్రధానంగా పైౖన్, సల్రాస్, లార్చ్, బిర్చ్, దేవదారు, చెస్ట్‌నట్, వాల్‌నట్, మేఫిల్, విల్లోబ, మల్బరీ, పాప్లర్, సిల్వర్‌ఫర్, జానీఫర్, రోడోడింట్రిన్‌ లాంటివి పెరుగుతాయి.

అటవీ సంపద - కలప ఉత్పత్తులు

తమంతట తామే వృద్ధి చెందే వృక్ష సమూహాన్ని సహజ వృక్షసంపద అంటారు. ఈ సంపదను అడవులు, పచ్చిక బయళ్లు, ఎడారులుగా వర్గీకరించవచ్చు. అడవుల నుంచి మనకు అనేక రకాలైన వస్తువులు లభిస్తాయి. అటవీ సంపదను ప్రధాన, గౌణ ఉత్పత్తులుగా పేర్కొంటారు.

సిల్వర్‌ ఫర్‌ - మెత్తగా, తెలుపురంగులో ఉంటుంది. దీన్ని ప్యాకింగ్‌ కాగితం, అగ్గిపెట్టెల తయారీలో ఉపయోగిస్తారు.

దేవదారు - గోధుమరంగులో ఉండి రైలు పరిశ్రమలో ఉపయోగపడుతుంది. ఇది పుష్పించని వృక్షం.

బ్లూపైన్‌ - ఊదారంగులో ఉంటుంది. దీన్ని భవన నిర్మాణంలో ఉపయోగిస్తారు.

టేకు - దీన్ని గృహ నిర్మాణం, పరికరాలు, ఓడల తయారీ, వంతెనల నిర్మాణంలో వాడతారు.

సాల్‌ - ఈ కలపను రైల్వే స్లీపర్లకు ఉపయోగిస్తారు.

షీషమ్‌ - దీన్ని సిస్సో చెట్టు అంటారు. దీని కలపను బండ్లు, పడవల తయారీలో వినియోగిస్తారు.

చీర్‌ - ఇది ఎరుపుతో కూడిన గోధుమరంగులో ఉంటుంది. తేయాకు నిల్వపెట్టెలు, రేసిన్, టర్పంటైన్‌ తయారీలో వాడతారు.

మంచి గంధం - పసుపు వర్ణంతో కూడిన గోధుమరంగులో ఉంటుంది. సుగంధ పరిమళాలు, అగరువత్తుల తయారీలో వాడతారు.

ఎర్ర చందనం - దీన్ని జంత్ర వాయిద్యాలు, రంగుల తయారీలో వినియోగిస్తారు.

సెమూల్‌ - దీన్ని ఆట వస్తువులు, ప్యాకింగ్‌ సామాన్ల తయారీలో వాడతారు.

హల్దా - పసుపుపచ్చ రంగులో ఉంటుంది. దీన్ని సిగరెట్‌ పెట్టెల తయారీలో ఉపయోగిస్తారు.

రోజ్‌వుడ్‌ - దీన్ని అలంకరణ సామగ్రి, తుపాకులు, చెస్‌ కాయిన్స్, రైలు పెట్టెల తయారీకి వాడతారు.

లక్క - దీన్ని వార్నిష్, గ్రామ్‌ఫోన్‌ రికార్డ్‌ తయారీ, ప్రింటింగ్‌ ఇంక్‌లో, ఉత్తరాలు సీలు వేసేందుకు ఉపయోగిస్తారు. లక్కకు ఝార్ఖండ్‌ ప్రసిద్ధి.

కరక్కాయలు - రంగులు, మందుల తయారీలో ఉపయోగిస్తారు

గుగ్గిలం - కాగితం, సబ్బు పరిశ్రమ, టర్పంటైన్‌ తయారీలో వినియోగిస్తారు.

Posted Date : 27-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌