• facebook
  • whatsapp
  • telegram

కొత్త రాతి యుగం/ నవీన శిలా యుగం సంస్కృతులు

కొత్త రాతి యుగ (నియోలిథిక్‌) సంస్కృతి భారతదేశం, దాని పరిసర ప్రాంతాల్లోని వివిధ భౌగోళిక ప్రదేశాల్లో వ్యాపించింది. 

* మధ్య-పశ్చిమ భారతదేశం: చంబల్‌లోయ, రాజస్థాన్‌లోని నాగ్డా, అహర్‌

* ఉత్తర-పశ్చిమ ప్రాంతం: ఆఫ్గనిస్థాన్, పశ్చిమ పాకిస్థాన్, బలూచిస్థాన్‌

* నర్మదా లోయ: మహేశ్వర్, నవదటోలి, మెహర్‌ ఘర్, టెలోడ్, త్రిపురి

* తపతి లోయ: బహల్, టేక్వాడ, ప్రకాశ్‌

* గోదావరి లోయ: నాసిక్, జోర్వే, నివాస 

* కృష్ణా లోయ: మస్కీ, నాగార్జున కొండ, ఇతర ప్రదేశాలు

* దక్షిణ భారతదేశం: కర్ణాటక, సేలం, ఆంధ్రప్రదేశ్‌

* తుంగభద్ర లోయ: బ్రహ్మగిరి, సంగనకల్లు

* తూర్పు భారతదేశం: అసోం, పశ్చిమ్‌ బంగా, బిహార్, ఒడిశా

* ఉత్తర ప్రాంతం: కశ్మీర్‌ లోయ

* ఈ ప్రాంతాల్లోని సంస్కృతులు వివిధ సమయాల్లో ఉద్భవించాయి. భారత ఉపఖండంలో పర్యావరణ మార్పుల కారణంగా, పంటలు కూడా మారుతూ వచ్చాయి. పురావస్తు శాస్త్రవేత్తలు వివిధ పురాతన ప్రదేశాల్లో జరిపిన విస్తృతమైన తవ్వకాల ఫలితంగా వాటి మధ్య ఉన్న వైవిధ్యాలు బయటపడ్డాయి. 

* నియోలిథిక్‌ సంస్కృతి సాధారణ లక్షణాల్లో వేట/ సేకరణ నుంచి సాగుకు మారడాన్ని గమనించవచ్చు. దీనికి సంబంధించిన ఆధారాలు నైలు నదీ లోయలో, పశ్చిమ ఆసియాలో లభ్యమయ్యాయి. 

* వ్యవసాయం పశ్చిమ ఆసియా నుంచి వాయవ్య భారతదేశానికి వ్యాపించినట్లు పరిశోధకుల అభిప్రాయం.

* మనదేశంలోని వాయవ్య ప్రాంతంలో, బలూచిస్థాన్‌లోని కాచి మైదానాల్లో ప్రారంభ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ (Early forming), జంతువుల పెంపకానికి సంబంధించిన ఆనవాళ్లు లభించాయి. 

* నియోలిథిక్‌ కాలంలో వ్యవసాయం, పశుపోషణ పరస్పరం ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉన్నాయి. ఇవే అప్పటి ప్రధాన ఆర్థిక కార్యకలాపాలు. 

* వరికి సంబంధించిన ఆధారాలు బేలాన్‌ లోయలోని కోల్దిహ్వాలో లభించాయి. 

* ఇండో - పాకిస్థాన్‌ ప్రాంతంలోని వాయవ్య భాగంలో క్వెట్టా, లోరలై, జోబ్‌ నదీ లోయల్లో వ్యవసాయ ఆధారిత ఆనవాళ్లు దొరికాయి. 

ప్రదేశాలు


మెహర్‌ఘర్‌: మెహర్‌ఘర్‌లో కుండలు, జంతువుల ఎముకలు, సిరామిక్, గోధుమ, బార్లీ అవశేషాలను కనుక్కున్నారు. దాదాపు క్రీ.పూ. 7000 నాటికే ఈ ప్రాంతంలో ప్రజలు నివాసాలు ఏర్పరుచుకున్నట్లు చారిత్రక ఆధారాలు లభించాయి.


బుర్జాహం: కశ్మీర్‌కు ఈశాన్యంగా ఉన్న బుర్జాహంలో Bone Tool Industry ని కనుక్కున్నారు. ఇక్కడ పాయింట్లు (Points), ఈటెలు, సూదులు, ముద్దలు, ఈటెల తలలు, బాకులు, స్క్రాపర్లు లాంటి పనిముట్లు లభ్యమయ్యాయి.

* కొత్త రాతి యుగం రెండో దశలో జంతువులను ఖననం చేశారు. బుర్జాహంలోని నివాసప్రాంతాల వద్ద జంతువుల కోసం ప్రత్యేకంగా కేటాయించిన గొయ్యి ఖననాలు లభ్యమయ్యాయి. ఈ కాలంలో మనుషులను కూడా ఖననం చేసినట్లు ఆధారాలున్నాయి.

* ఈ కాలంలో చేతి కుండలను ఎక్కువగా తయారు చేశారు. ఇవి వివిధ ఆకారాల్లో, నల్లటి, బూడిద రంగులో ఉన్నాయి. వీటిని డీలక్స్‌ వేర్‌ అంటారు.

* బుర్జాహంలోని ప్రజలు జంతువులను వేటాడటం, చేపలు పట్టడం లాంటి పనులు ఎక్కువగా చేసేవారు. 

మరికొన్ని: బెలన్‌ లోయ (Belan valley)లో రైతులు భూమిని సాగు చేసేవారు. 

* కోల్దిహ్వాలో నిర్వహించిన తవ్వకాలలో మూడు దశల సాంస్కృతిక క్రమాన్ని (నియోలిథిక్, చాల్‌కోలిథిక్, ఇనుపయుగం) కనుక్కున్నారు. 

* ఉత్తర్‌ ప్రదేశ్‌లోని మహాగర, కోల్దిహ్వా ప్రాంతాల్లో మానవ నిశ్చల జీవితం (Sedentary life), వరి సాగు, పశువులు, గొర్రెలు, మేకల పెంపకానికి సంబంధించిన ఆనవాళ్లు లభించాయి. 

* ప్రపంచంలోనే కుండలను మొదటగా చోప్ని-మాండోలో వాడినట్లు ఆధారాలు గుర్తించారు. 

వ్యవసాయ గ్రామాలు


* ప్రపంచంలో మొట్టమొదటి వ్యవసాయ గ్రామాలు క్రీ.పూ. 8000 - 6000 లో ఏర్పడినట్లు శాస్త్రవేత్తల అంచనా. 

* పశ్చిమాసియా గోధుమ, బార్లీ వ్యవసాయానికి ప్రారంభ కేంద్రంగా ఉండేది. ఈ ప్రాంతంలోని తొలి పెంపుడు జంతువుల్లో గొర్రెలు, మేకలు ఉన్నాయి. దీనికి సంబంధించిన ఆధారాలు మెహర్‌ఘర్‌లో లభించాయి. 

* ప్రారంభ వ్యవసాయంలో మూడో జోన్‌గా దక్షిణాసియాలోని బలూచిస్థాన్‌ ఉంది. 

* ఉత్తర్‌ ప్రదేశ్‌లోని వింధ్య పర్వతాల ఉత్తర అంచులో వరిని సాగు చేసేవారు. 

* ఉత్తర్‌ ప్రదేశ్‌లోని మహాగర, కోల్దిహ్వా ప్రాంతాల్లో చేతితో తయారుచేసిన కుండలతో పాటు వృత్తాకార గుడిసెలను కన్కున్నారు. 

* ఇళ్లు చతురస్రాకారంలో లేదా దీర్ఘచతురస్రాకారంలో ఉండేవి. వీటిని మట్టి, ఇటుకలతో తయారుచేశారు. తొలి నియోలిథిక్‌ ప్రజలు ఎండలో ఎండబెట్టిన ఇటుకలతో నిర్మించిన ఇళ్లలో నివసించారు. 

* మెహర్‌ఘర్‌లో పత్తి, గోధుమ పంటలను సాగు చేశారు. 

* వ్యవసాయం, ఆహార ఉత్పత్తి అభివృద్ధి కారణంగా జనాభా పెరిగింది. 

* కోల్దిహ్వా, దాని చుట్టుపక్కల ఉన్న ఇతర ప్రదేశాలు; వింధ్య పర్వత ఉత్తర అంచులు వరి సాగుకు కేంద్రంగా ఉండేవి.

* మధ్య గంగా మైదానంలో వ్యవసాయ ఆవాసాలు ఉండేవి. 

* క్రీ.పూ.7000 నాటి తృణధాన్యాల రకం పుప్పొడిని రాజస్థాన్‌లోని దిద్వానా, లుంకరన్‌సర్‌ (Lunkaransar), సాంబార్‌ సరస్సులో గుర్తించారు. 

* క్రీ.పూ. 8000 నాటి ధాన్యపు పుప్పొడిని దక్షిణ భారతదేశంలోని నీలగిరి కొండల్లో కనుక్కున్నారు.  

* ప్రజలు చిన్న, దీర్ఘచతురస్రాకార గదుల్లో, చేతితో చేసిన మట్టి ఇటుకలతో నిర్మించిన ఇళ్లలో నివసించేవారు. బెలాన్‌ నది ఒడ్డున ఉన్న మహాగరాలో ఇరవై గుడిసెలకు సంబంధించిన అంతస్తులను గుర్తించారు. 

* కొత్తరాతియుగం మానవులకు పడవలను తయారు చేయడం తెలుసు. పత్తి, ఉన్ని వాడేవారు. దుస్తులు నేసేవారు, ప్రజలు ఒక నిర్దిష్ట ప్రదేశంలో స్థిర జీవితాన్ని ప్రారంభించారు. ఇది నాగరికత ప్రారంభానికి తొలి మెట్టు.

* నియోలిథిక్‌ ప్రజలు కొండ ప్రాంతాలకు దగ్గరగా, ముఖ్యంగా నదీ లోయలు, రాక్‌ షెల్టర్లు, కొండల వాలు ప్రాంతంలో నివసించేవారు. దీనికి కారణం వారు పూర్తిగా ఆయుధాలు, రాతితో చేసిన పనిముట్లపై ఆధారపడటమే. 

* భారత ఉపఖండంలోని తొలి గ్రామ స్థావరాలు క్రీ.పూ. 7000 - 3000 మధ్య కాలంలో అభివృద్ధి చెందాయి. సమాజాలు సంక్లిష్టంగా ఉండేవి. కార్మిక వ్యవస్థ ప్రారంభమైంది. బలూచిస్థాన్‌లోని అనేక ప్రదేశాల్లో సెమీ సంచార (Semi nomadic) జీవనం నుంచి స్థిరపడిన వ్యవసాయం దిశగా వచ్చిన మార్పును గమనించవచ్చు.

* మెహర్‌ఘర్‌లో జరిపిన తవ్వకాల్లో క్రీ.పూ. 7000 నాటి స్థిరనివాస, పురాతన స్థావరాల అవశేషాలు, ఏడు వృత్తి స్థాయులను గుర్తించారు. ఇవేకాకుండా వేలాది మొక్కల నమూనాలను, బార్లీ రకాలను కనుక్కున్నారు. 

* నియోలిథిక్‌ ప్రజలు జింక, బ్లాక్‌బక్, మేక, అడవి గాడిద, నీటి గేదె, పంది, ఏనుగులను పెంపుడు జంతువులుగా పరిగణించారు. 

* కర్ణాటకలోని పికిలిహాల్‌లో బూడిద దిబ్బలు, నివాసాలను గుర్తించారు.

* కోల్దిహ్వాలో లభించిన కాలిన మట్టి ముక్కల్లో బియ్యం, వరిపొట్టుకు సంబంధించిన అవశేషాలు లభించాయి. 

* ఈ కాలంలో నిప్పును కనుక్కున్నారు. ఆహారాన్ని వండటం ప్రారంభించారు. 

* ఆహార ధాన్యాలను కుండల్లో నిల్వ చేసేవారు. ఈ కాలం నాటి కుండలను గ్రేవేర్, బ్లాక్‌ బర్నిష్డ్‌ వేర్, మ్యాట్‌ ఇంప్రెస్డ్‌ వేర్‌ అని మూడు రకాలుగా వర్గీకరించారు.

* నియోలిథిక్‌ ప్రారంభంలో కుండలను చేతితో చేస్తే, తర్వాతి కాలంలో వీటి తయారీకి పాద చక్రాలు ఉపయోగించారు.

* మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లాలో ఉన్న సోన్‌ లోయలో కుంఝన్‌ కర్మాగారాన్ని కనుక్కున్నారు. ఇక్కడ రాతి కళాఖండాలను తయారు చేసేవారు.

* భారత ఉపఖండంలోని వివిధ ప్రాంతాల్లో అనేక నియోలిథిక్‌ సైట్లు ఉన్నాయి. అక్కడ పురావస్తు శాస్త్రవేత్తలు పలు పురాతన వస్తువులను కనుక్కున్నారు. ఉదాహరణకు, క్వెట్టాలోయ (Quetta Valley), కిలి-గుల్‌-మొహమ్మద్‌ (ఇది హన్నా నది ఒడ్డున క్వెట్టా నగరానికి దాదాపు 3.2 కి.మీ. దూరంలో ఉంది) డాంబ్‌ సాదాత్‌ మొదలైనవి. 

నియోలిథిక్‌ ప్రజలు మానవ మృతదేహాలను వారి ఇళ్ల మధ్య, బహిరంగ ప్రదేశాల్లో గుండ్రటి గోతిలో పాతిపెట్టేవారు. ఖననం చేసే సమయంలో సమాధిలో రాగి పూసలు, కుండను పెట్టేవారు. కొన్ని సమాధుల్లో ఒకరి కంటే ఎక్కువ వ్యక్తుల ఎముకలు లభించాయి. 

* ఉత్తర, దక్షిణ బలూచిస్థాన్‌ను కలిపే ఖోజ్దార్‌ ప్రాంతంలో 1925లో తవ్వకాలు జరపగా, కొన్ని నిర్మాణాలు, అనేక సమాధులు బయటపడ్డాయి. పెంపుడు కుక్కలను వాటి యజమానితో పాటు ఖననం చేసిన ఆనవాళ్లు అక్కడ లభించాయి. 

పరికరాలు


* వాయవ్య ప్రాంతంలో లభించిన నియోలిథిక్‌ పనిముట్లు దీర్ఘచతురస్రాకారంలో ఉండి, వాటి కొన ఒంపు తిరిగి ఉంటే, ఈశాన్య ప్రాంతంలో దీర్ఘచతురస్రాకార గొట్టాలతో పాలిష్‌ చేసిన రాతి గొడ్డలిని ఉపయోగించారు. దక్షిణ ప్రాంత నియోలిథిక్‌ ప్రజలు రెండు వైపులా పదును ఉన్న సాధనాలను వాడారు.

* నియోలిథిక్‌ కాలంలో పాలిష్‌ రాళ్లతో తయారు చేసిన ఉపకరణాలతో పాటు మైక్రోలిథిక్‌ బ్లేడ్‌లను ఎక్కువగా ఉపయోగించారు. సూదులు, స్క్రాపర్‌లు, బోరర్స్‌ బాణపు తలలు మొదలైన ఎముకలతో తయారు చేసిన ఆయుధాలను ఉపయోగించారు. 

* మంచి పద్ధతిలో సాగు చేయడం, వేటాడటం, ఇతర కార్యకలాపాలను సాన పెట్టిన ఆయుధాలు సులభతరం చేశాయి. 

* పట్టుకోవడానికి వీలుగా కొన్ని బ్లేడ్‌లకు చెక్కను అమర్చారు. ధాన్యాన్ని కోయడానికి కొడవలిని ఉపయోగించారు. 

* ఆహారాన్ని ప్రాసెసింగ్‌ చేయడానికి గ్రౌండింగ్‌ రాళ్లు (రోళ్లు) ఉపయోగించారు. 

* ఆఫ్గనిస్థాన్‌లోని ముండిగాక్‌లో చక్రాలతో తయారుచేసిన కుండలు, ఎద్దు బొమ్మ (Humped bull) దొరికాయి. ఇదే ప్రాంతంలో ఎముకలు, అలబాస్టర్‌ కుండీలు, రాతి బ్లేడ్‌లు, రాయితో చేసిన పూసలు, లాపిస్‌ లాజులి అనే రత్నం, ఫ్రిట్‌ (సిరామిక్‌ కూర్పు)ను కనుక్కున్నారు. 

* బిహార్‌లోని చిరంద్‌లో ఎముకలతో తయారుచేసిన ఉపకరణాలు, ఆయుధాలు లభించాయి. వెదురు, మట్టి ప్లాస్టింగ్‌ చేసిన గుడిసెలు ఉన్న చిన్న గ్రామాన్ని కూడా ఇదే ప్రాంతంలో గుర్తించారు.


గుఫ్‌క్రాల్‌

* కొత్త రాతి యుగం నాటి మరొక ప్రధాన ప్రదేశం గుఫ్‌క్రాల్‌ (Gufkral). దీన్ని కుమ్మరి గుహ (Cave of the potter) అంటారు. ఇది కశ్మీర్‌లో ఉంది. 

* ఇక్కడ పాత కుండలు, అడవి జంతువుల ఎముకలు, వివిధ సాధనాలను కనుక్కున్నారు. 

* కార్బన్‌ డేటింగ్‌ (C-4) ఆధారంగా ఈ ప్రాంతం క్రీ.పూ. 2500-1500 కాలానికి చెందిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. 

* గుఫ్‌క్రాల్‌లో మూడు దశల ప్రారంభ వృత్తి  (Three Stages of Early Occupation) ఆనవాళ్లను, సిరామిక్‌ సాధనాలు, స్వాత్‌ లోయలో అనేక సమాధి ప్రదేశాలను గుర్తించారు. 

Posted Date : 14-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌