• facebook
  • whatsapp
  • telegram

పల్లవులు-సాంస్కృతిక పరిస్థితులు

పల్లవులు సాంస్కృతికంగా ఎంతో అభివృద్ధి సాధించారు. సాహిత్యం, విద్య, వాస్తు-శిల్పకళ, చిత్రలేఖనంలో తమదైన ముద్ర వేసి భారతీయ సంస్కృతికి ఎనలేని సేవ చేశారు.

   విద్యా - సారస్వతాలు

* పల్లవుల రాజభాష ‘సంస్కృతం’. వీరి శాసనాలు ఈ భాషలోనే ఉన్నాయి. పల్లవులు ‘ఘటికలు’ అనే విద్యాకేంద్రాలు స్థాపించి సంస్కృతం, వైదిక విద్యలను ప్రోత్సహించారు. ఇందులో చతుర్విధ, అష్టాదశ విద్యలతో పాటు వేదాలు, వేదాంగాలు, పురాణాలు, తర్కం, మీమాంస, ధర్మశాస్త్రాలు, ఆయుర్వేద, గాంధర్వవేద, అర్థశాస్త్రాలు బోధించేవారు.

* రాజ్యంలోని దేవాలయాలను విద్యానిలయాలు, సాంస్కృతిక కేంద్రాలుగా మార్చారు. 

* ధర్మపాలుడు, కదంబ రాజ్యస్థాపకుడు మయూరశర్మ కంచిలోని ఘటికలో విద్యను అభ్యసించాడు. 

* ఘటిక సభ్యులను ‘మహాజనం’ అనేవారు. 

* శ్రీ ఆదిశంకరాచార్యులు కాంచీపురంలో ‘కామకోటి’ పీఠాన్ని స్థాపించారు. ఇది అనేక విద్యలకు నిలయమైంది. తమిళ భాష కూడా అభివృద్ధి చెందింది. కంచి పీఠంలో ‘మేఘసిద్ధాంతం’పై చర్చలు జరిపేవారని హుయాన్‌ త్సాంగ్‌ పేర్కొన్నాడు. 

* పల్లవుల కాలంలో బౌద్ధవిహారాలు విద్యా కేంద్రాలుగా కొనసాగాయి. 

* బౌద్ధులు, శైవుల మధ్య మతపరమైన చర్చలు జరిగేవి. వీటిలో ఓడిపోయిన వారు గెలిచిన వారి మతాన్ని స్వీకరించాలనే నిబంధన ఉండేది. దీన్ని ‘పెరియ పురాణం’ తెలుపుతుంది.

 సంగీతం 

వీరి కాలంలో సంగీతంలో మృదంగం, యాళి, విరళి, వీణ లాంటి సంగీత పరికరాలను ఉపయోగించారు. ‘కుడుమియామలై’ శాసనంలో వీణపై సాధన చేయడానికి అవసరమైన సంగీత పాఠాలు ఉన్నాయి. వీటిని మొదటి మహేంద్రవర్మ రచించాడు.

   వాస్తు - శిల్పకళ 

* దక్షిణ భారతదేశంలో వాస్తు శిల్పకళా అభివృద్ధి పల్లవులతో ప్రారంభమైందని వి.ఎ.స్మిత్‌ అనే చరిత్రకారుడు అభిప్రాయపడ్డారు. పల్లవులు ద్రావిడ వాస్తు శైలిని అవలంబించారని ‘పెర్సిబ్రౌన్‌’ పేర్కొన్నారు. 

* పల్లవులు శాతవాహనులకు వారసులు కాబట్టి మొదట్లో బౌద్ధ వాస్తు సంప్రదాయాల ప్రకారం గుహాలయాలు, తర్వాత ఏకశిలా రథాలు, దేవాలయాలను నిర్మించారు. 

* వీరి వాస్తు శిల్పకళ మొదటి మహేంద్రవర్మ కాలంలో ప్రారంభమై, చివరి పల్లవ రాజు అపరాజితవర్మ కాలం వరకు అనేక దశల్లో అభివృద్ధి చెందింది. 

* వీరు నిర్మించిన మహాబలిపురం భారతీయ వాస్తుకళకు ప్రధానకేంద్రంగా ఉండేదని గ్రూసెట్‌ అనే పండితుడు తెలిపారు. 

*పల్లవుల వాస్తు, శిల్ప కళాభివృద్ధికి మహేంద్రవర్మ, నరసింహవర్మ, రాజసింహ, నందివర్మలు ఎంతో కృషి చేశారు. చరిత్రకారులు వీరి పేరు మీదుగా వాస్తు కళాశైలిని నాలుగు దశలుగా విభజించారు.

మహేంద్రవర్మ శైలి: ఇది మొదటి మహేంద్రవర్మ కాలానికి చెందింది. ఇతడు ఆంధ్రా ప్రాంతంలో కొండలు తొలిచి, ఆలయాలు నిర్మించే పద్ధతి ప్రవేశపెట్టాడు. 

మహాబలిపురంలోని వరాహ, దుర్గ మండపాలు; మహేంద్రవాడి, మందగపట్టు, మామండూరు, దళవానూరుల్లో గుహాలయాలు నిర్మించాడు. 

* మందగపట్టు వద్ద నిర్మించిన గుహాలయంలో సాధారణ స్తంభాలు, పెద్దగది, దాని వెనుక రెండు లేదా మూడు చిన్న గదులు కనిపిస్తాయి. పరిమిత రూపశిల్పాలంకరణ, గర్భాలయం, ద్వారపాలకులు, అష్టకోణాకృతులు ఉన్న శిల్పాలు ఈ శైలి లక్షణాలు. 

* మందగపట్టులోని ఆలయం, పల్లవరంలోని గుహాలయం, మహేంద్రవాడిలోని విష్ణు ఆలయం, ఉత్తర ఆర్కాట్‌ శృంగవరం దగ్గర ఉన్న ‘రంగనాథస్వామి’ ఆలయాలు ఈ కాలానికి చెందినవే.

మామల్ల శైలి: ఇది మొదటి నరసింహవర్మ కాలానికి చెందింది. ఇతడు గుహాలయాలు, ఏకశిలా రథాలు నిర్మించాడు. నిర్మాణాల్లో వాస్తవికత ఉండే శిల్పాలను అందంగా చెక్కడం, స్తంభాలపై అలంకరణ చేయడం లాంటివి చేశాడు.

* ఏకశిలా రథాల్లోని అయిదు పంచపాండవ రథాలు (ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు), రెండు పిడారి రథాలు (గణేశరథం, వలయ్య నికుట్టె రథం) ఈ కాలం నాటివే. వీటి కింది భాగం చతురస్రాకారంగా ఉండి, పైకి వెళ్లే కొద్దీ గోపురాకృతిలో ఉంటాయి. 

మహాబలిపురంలోని ‘గంగావతరణ శిల్పం’ ప్రపంచ ప్రసిద్ధి చెందింది. దీన్ని ఆచార్య నీలకంఠశాస్త్రి ‘రాతిలో రాసిన ఒక శాస్త్రీయ పద్య కావ్యం’గా అభివర్ణించారు. దీన్నే అర్జునుడు తపస్సు చేసే శిల్పం, భగీరథ తపస్సు శిల్పం అంటారు. ఈ శిల్పం పైభాగంలో సూర్య, చంద్ర, గంధర్వ, అప్సరసలు, యక్షిణి శిల్పాలు ఉన్నాయి. కింది భాగంలో ఏనుగులను చెక్కారు.

* పంచపాండవ రథాల్లో ధర్మరాజ రథం పల్లవుల వాస్తు శాస్త్రంలో అద్భుతమైందని కె.ఆర్‌.శ్రీనివాసన్‌ పేర్కొన్నారు. ఇది మూడు అంతస్తుల్లో ఉంది. భీమ, గణేశ రథాల అడుగుభాగం దీర్ఘచతురస్ర నమూనాలో ఉంది. నకుల, సహదేవ రథాలు ‘అర్ధచంద్రాకార’ నమూనాలో ఉన్నాయి. ద్రౌపది రథం అడుగుభాగం చతురస్ర నమూనాతో ఉండి, పైన నాలుగు దిశలు ఏకముఖ కప్పుగా కలిసిపోయాయి. ద్రౌపది, అర్జున రథానికి ఒకే ఉపపీఠం ఉంది. వీటిలో అధిష్టాన భాగంలో మెట్లు ఉన్నాయి.

రాజసింహ శైలి: ఇది ‘రెండో నరసింహవర్మ’ కాలానికి చెందింది. ఇటుక, రాయి, గచ్చుసున్నం కలిపి దేవాలయాలు నిర్మించారు. మహాబలిపురంలోని తీరదేవాలయాన్ని (శివాలయాన్ని) ఈ విధంగా నిర్మించారు. దీని గోడలపై శివలింగాలు, దక్షిణామూర్తి, నటరాజ విగ్రహాలను చాలా అందంగా చెక్కారు. ప్రాకార కుడ్యాలపై నంది విగ్రహాలు ఉన్నాయి. ఈ ఆలయంలో త్రిమూర్తుల విగ్రహాలు ఉన్నాయి. దీన్ని ‘త్రిమూర్తి కోయిల్‌’ అని కూడా అంటారు. ఈ దేవాలయం తూర్పు దిశలో ‘క్షత్రియ సింహపల్లమేశ్వర గృహం’, పశ్చిమాన ‘రాజసింహ పల్లమేశ్వరగృహం’ మధ్యలో సమతల కప్పు ఉన్న ‘నరపతి సింహపల్లవ విష్ణుగృహం’ ఉన్నాయి.

* కంచిలోని కైలాసనాథ ఆలయం, వైకుంఠ పెరుమాళ్‌ ఆలయం, దక్షిణ ఆర్కాట్‌లోని నిరుణమలై ఆలయం ఈ కాలానికి చెందినవే. 

నందివర్మ శైలి లేదా అపరాజిత శైలి: కంచిలోని ముక్తేశర్వ, మాతంగేశ్వర దేవాయాలు; ఒర్గడంలోని వాడమల్లేశ్వరాలయం; తిరుత్తణిలోని వివర్తనేశ్వరాలయం; గుడిమల్లంలోని పరమేశ్వరాలయం మొదలైనవి ఈ శైలిలో నిర్మించారు. 

* వైకుంఠ పెరుమాళ్‌ ఆలయాన్ని నందివర్మ నిర్మించాడు. ఇందులో నాలుగు అంతస్తులతో కూడిన గర్భగృహం ఉంది. ఈ ఆలయాన్ని కొంత ఇసుకతో, సగభాగం గ్రానైట్‌తో నిర్మించారు. విమానం, గర్భగృహం, శిఖరాలు, అంతరాలయం, మండపాలు, స్తంభాలు, శిల్పాలు ఈ శైలి లక్షణాలు.

ముఖ్యాంశాలు

పల్లవబొగ్గ: ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా.

భారవి: సింహవిష్ణువు ఆస్థానంలో ఉన్నాడు. కిరాతార్జునీయం రచించాడు.

దండి: దశకుమార చరిత్రను రచించాడు. ఇతడు రెండో నరసింహవర్మ ఆస్థానంలో ఉండేవాడు

ఘటికలు: విద్యాలయాలు.

దూతకలు: వార్తలను చేరవేసేవారు. 

సంజరంతకులు: రహస్యంగా వార్తలు సేకరించేవారు.

సాహిత్యం

పల్లవ మహేంద్రవర్మ సంస్కృతంలో ‘మత్తవిలాస ప్రహసనం’ రచించాడు. భారవి ‘కిరాతార్జునీయం’, ‘శిశుపాల వధ’; దండి ‘దశకుమార చరిత్ర’, ‘కావ్య దర్శనం’ (అలంకారశాస్త్రం); భాసుడు ‘స్వప్నవాసవదత్త’ను సంస్కృతంలో రచించారు. 

* నరసింహవర్మ కాలంలో సర్వనంది ‘భువనకోశం’ రాశాడు. 

*నాయనార్లు, ఆళ్వార్లు తమిళ భాషను, సాహిత్యాన్ని అభివృద్ధి చేశారు. 

*తిరువళ్వార్‌ రచించిన ‘కురల్‌’ అనే తమిళ కావ్యం, నాయనార్లు రచించిన ‘తేవారమ్‌’ (1000 భక్తి గీతాలు), ఆళ్వార్ల ‘నాయిలార్‌ దివ్య ప్రబంధం’ (4000 భక్తి స్తోత్రాలు) మొదలైనవి తమిళ భాషలో ఉన్నాయి.

చిత్రలేఖనం

* పల్లవుల కాలంలో చిత్రలేఖనం బాగా ఆదరణ పొందింది. మొదటి మహేంద్రవర్మ గొప్ప చిత్రకారుడు. చిత్తన్న వాసల్‌ గుహలోని (పుదుక్కోట) చిత్రలేఖనం, వర్ణచిత్రాలు ఇతడే గీశాడని చరిత్రకారుల భావన. 

*మహాబలిపురంలోని ఆదివరాహ గుహాలయం; మండూరు, కంచిలోని వైకుంఠ పెరుమాళ్‌ ఆలయాల్లోని వర్ణచిత్రాలు పల్లవుల కాలం నాటివే. ఈ చిత్రాలు అజంతా చిత్ర శైలిని పోలి ఉంటాయి. 

* సిత్తన్‌వాసల్‌లోని చిత్రలేఖనంలో విలాసంగా ఉండే అప్సరసలు కనిపిస్తారు. గుహాలయం పైకప్పుపై ఉండే చిత్రమైన ‘పద్మసరోవరం’ను అత్యుత్తమ చిత్రంగా చరిత్రకారులు పేర్కొన్నారు. 

*పల్లవ మహేంద్రవర్మ కాలంలో ప్రారంభమైన వాస్తు శిల్పకళా సంప్రదాయాలు చోళుల కాలం నాటికి మరింత అభివృద్ధి చెందాయి. ఈ విధంగా పల్లవులు దక్షిణభారతదేశంలో నూతన శిల్పకళ సంప్రదాయాలను ప్రవేశపెట్టి, భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. 


మత పరిస్థితులు

పల్లవులు వైదిక మతాన్ని అనుసరించారు. శివస్కందవర్మ, నందివర్మలు అశ్వమేధ యాగం చేశారు. ఆనాటి సమాజంలో శైవ, వైష్ణవ మత సంప్రదాయాలు ఎక్కువ ఆదరణ పొందాయి.

పల్లవుల్లో ఎక్కువమంది శైవులు. వీరి రాజలాంఛనం ‘వృషభం’. శైవంలో కాపాలిక, కాలముఖ లాంటి తీవ్రవాద శాఖలు ఉండేవి. 

* మహాబలిపురంలోని శిల్పాల్లో దుర్గాదేవికి బలి సమర్పించే దృశ్యాలు ఉన్నాయి. మహేంద్రవర్మ రచించిన ‘మత్తవిలాస ప్రహసనం’లో వీటిని విమర్శించాడు. 

* శైవంలో ‘నాయనార్లు’ అనే శాఖ ఉండేది. వీరికి భక్తి ప్రధానం. మొత్తం 63 మంది నాయనార్లు ఉండేవారు. వారిలో అప్పార్, జ్ఞానసంబందార్, సుందరమూర్తి, మాణిక్య వాశగర్‌ ముఖ్యులు. వీరితోపాటు ‘ఆళ్వార్లు’ అనే వైష్ణవులు ఉండేవారు. వీరిలో పోయిగై, తిరుమంగై,  తొందరప్పొడి (విప్రనారాయణ) మొదలైనవారు ప్రముఖులు. 

* నాయనార్లు ‘తేవారం’ అనే భక్తిగీతాలతో, ఆళ్వార్లు ‘నాయిలార్‌ దివ్య ప్రబంధం’ అనే గ్రంథాల ద్వారా సమాజంలో భక్తిని, నైతిక విలువలను ప్రచారం చేశారు. 

* కంచి శైవమతానికి ప్రధాన కేంద్రం. ఇది ‘సిటీ ఆఫ్‌ టెంపుల్స్‌’గా ప్రసిద్ధి చెందింది. శ్రీరంగం, తిరుపతి వైష్ణవ కేంద్రాలు.

* పల్లవులు జైన, బౌద్ధమతాలనూ ఆదరించారు. కంచిలో 10 వేల మంది బౌద్ధభిక్షువులు, 100 బౌద్ధ సంఘారామాలతో పాటు జైనులు కూడా ఉన్నట్లు హుయాన్‌ త్సాంగ్‌ తన రచనల్లో పేర్కొన్నాడు. 

మహేంద్రవర్మ మొదట జైన మతాభిమాని. అప్పార్‌ బోధనల వల్ల అతడు శైవ మతాన్ని స్వీకరించాడు. పల్లవులంతా వైదిక మతాన్ని ఆచరించడం వల్ల బౌద్ధ, జైన మతాలకు ఆదరణ తగ్గింది.

Posted Date : 14-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌