• facebook
  • whatsapp
  • telegram

పల్లవులు

రెండో మహేంద్రవర్మ 

* ఇతడు క్రీ.శ. 668 - 670 వరకు రాజ్యపాలన చేశాడు.

ఇతడు చాళుక్య వంశానికి చెందిన మొదటి విక్రమాదిత్యుడి చేతిలో ఓడిపోయాడు. రేనాటి తెలుగు చోళులు, బాణవంశ రాజులను తిరస్కరించి చాళుక్య ఆధిపత్యాన్ని అంగీకరించాడు.


పరమేశ్వరవర్మ 

* ఇతడు క్రీ.శ. 670 - 685 వరకు రాజ్యపాలన చేశాడు. 

ఇతడి కాలంలోనే బాదామి చాళుక్య రాజైన విక్రమాదిత్యుడు కాంచీపురాన్ని జయించాడు.

* పరమేశ్వరవర్మ పెరవళ్లనూర్‌ (తిరుచ్చి జిల్లా) యుద్ధంలో విక్రమాదిత్యుడ్ని, అతడికి సాయంగా వచ్చిన పాండ్య రాజును ఓడించాడు. అంతకు ముందు పరమేశ్వరవర్మ సత్వాలి, శంకరమంగై యుద్ధాల్లో పాండ్యరాజును ఓడించాడు.


రెండో నరసింహవర్మ 

* ఇతడు క్రీ.శ. 685  730 వరకు రాజ్యపాలన చేశాడు.

* ఇతడి కాలంలో ఎలాంటి యుద్ధాలు జరగలేదు. 

* నరసింహవర్మ గుహలను తొలిచి ఆలయాలు నిర్మించే పద్ధతిని కొనసాగిస్తూ  పెద్దరాళ్లతో దేవాలయాలను నిర్మించే పద్ధతిని ప్రారంభించాడు.

* మహాబలిపురంలోని తీర దేవాలయం, కాంచీపురంలోని కైలాసనాథాలయాలను ఇతడే కట్టించాడు.

* చైనాకు దౌత్య వర్గాలను పంపి, వర్తక వాణిజ్యాలు పెంపొందించాడు. 

* ‘దశకుమార చరిత్ర’ రచించిన దండి కవి ఇతడి ఆస్థానంలోని వారే. 

* రెండో నరసింహవర్మకు ‘ఆగమప్రియ’, ‘రాజసింహ’, ‘శంకరభక్త’ అనే బిరుదులు ఉన్నాయి.


రెండో పరమేశ్వరవర్మ 

* ఇతడు క్రీ.శ. 730 నుంచి 733 వరకు రాజ్యపాలన చేశాడు. 

చాళుక్య రాజైన రెండో విక్రమాదిత్యుడు ఇతడి కాలంలోనే కాంచీపురానికి వచ్చి, అక్కడి కైలాసనాథాలయంలో తన విజయ శాసనాన్ని వేయించాడు.

* పరమేశ్వరవర్మను ఓడించి, అతడి నుంచి కప్పం వసూలు చేశాడు. చాళుక్య విక్రమాదిత్యుడికి పశ్చిమగాంగులు సహాయం చేశారు. 

* క్రీ.శ. 731లో పశ్చిమగాంగులను శిక్షించేందుకు పరమేశ్వరవర్మ వారిపై దండెత్తాడు. దీనికి ‘మిళిందై’ యుద్ధం అని పేరు. ఇందులో పరమేశ్వరవర్మ మరణించాడు.


నందివర్మ 

* ఇతడు క్రీ.శ. 733 నుంచి క్రీ.శ. 794 వరకు రాజ్యపాలన చేశాడు. 

* రెండో పరమేశ్వరవర్మ మరణించాక సింహవిష్ణువు వంశం అంతరించింది. ఇతడికి వారసులు లేరు. దీంతో పల్లవ రాజవంశాల మధ్య ఘర్షణ ప్రారంభమైంది. చివరికి సామంతులు, విద్వాంసులు ‘కాంచీపుర ఘటిక’లో సమావేశమై పల్లవవంశ శాఖకు చెందిన నందివర్మను రాజుగా ప్రకటించారు. 

* నందివర్మ చాళుక్య, రాష్ట్రకూట, పాండ్య, గాంగ వంశస్థులతో పాటు తన వంశానికే చెందిన ‘చిత్రమాయ’ లాంటి వారితో యుద్ధాలు చేశాడు.

* చిత్రమాయ పాండ్యరాజు మొదటి రాజసింహుడి సాయంతో నందివర్మపై దండెత్తి, అతడ్ని కుంభకోణం సమీపంలో ‘నందిపురం’ కోటలో బంధించాడు. ఆ సమయంలో పల్లవుల సేనాని ఉదయచంద్ర నందివర్మను కాపాడాడు. 

* నందివర్మ కాలంలో చాళుక్య రెండో విక్రమాదిత్యుడు పల్లవ రాజ్యంపై దండెత్తి, కంచిని ఆక్రమించాడు. కైలాసనాథ దేవాలయంలో ఒక శాసనాన్ని వేయించాడు. నిపుణులైన శిల్పులను తన రాజ్యానికి తీసుకెళ్లాడు. 

* కైలాసనాథ దేవాలయానికి విక్రమాదిత్యుడు విరాళాలు ఇచ్చాడు.

* నందివర్మ అశ్వమేధ యాగం చేసి ‘పల్లవమల్ల’ అనే బిరుదు పొందాడు. 

* క్రీ.శ. 733లో విక్రమాదిత్యుడు రెండోసారి కంచిపై దండెత్తి దోచుకున్నాడు. తర్వాతి కాలంలో రాష్ట్రకూటులు చాళుక్యులను అంతం చేయడంతో చాళుక్యుల బెడద పల్లవులకు లేకుండా పోయింది. 

* రాష్ట్రకూటరాజు దంతిదుర్గుడు పల్లవ రాజ్యంపై దండెత్తి నందివర్మను ఓడించాడు. యుద్ధం తర్వాత వీరి మధ్య సంధి కుదిరింది. దంతిదుర్గుడు తన కుమార్తె రేవాదేవిని నందివర్మకు ఇచ్చి వివాహం చేశాడు. 

* నందివర్మ గొప్ప విష్ణు భక్తుడు. కంచిలో ముక్తేశ్వరాలయం, వైకుంఠ పెరుమాళ్‌ ఆలయాలపై అందమైన శిల్పాలు చెక్కించాడు.


దంతివర్మ 

* ఇతడు నందివర్మ కుమారుడు. క్రీ.శ. 795 నుంచి క్రీ.శ. 845 మధ్య రాజ్యాన్ని పాలించాడు.

* ఇతడి కాలంలో రాష్ట్రకూటరాజు మూడో గోవిందుడు కాంచీపురంపై దండెత్తి దోచుకున్నాడు.


మూడో నందివర్మ 

* క్రీ.శ. 845 నుంచి క్రీ.శ. 866 మధ్య రాజ్యాన్ని పాలించాడు. ఇతడు మంచి పాలకుడు, యోధుడిగా గుర్తింపు పొందాడు. 

* సామంతుల సాయంతో పాండ్యులను ‘తల్లార్‌’ యుద్ధంలో ఓడించాడు. 

* తెలుగు చోళులను ఓడించి తన రాజ్యాన్ని వాగై నది వరకు విస్తరింపజేశాడు. 

* పాండ్యరాజు శ్రీమారవల్లభ మూడో నందివర్మను కుంభకోణ యుద్ధంలో ఓడించాడు.


నృపతుంగవర్మ 

* క్రీ.శ. 866 నుంచి క్రీ.శ. 880 మధ్య రాజ్యాన్ని పాలించాడు. పాండ్యరాజు శ్రీమార వల్లభను ఓడించాడు.


అపరాజితవర్మ 

* ఇతడు క్రీ.శ. 880లో శ్రీపురంబీయం యుద్ధంలో పాండ్యులను ఓడించాడు. ఆ సమయంలో ఇతడికి చోళులు సాయం చేశారు.

* ఆదిత్యచోళుడు క్రీ.శ. 897లో అపరాజితవర్మను వధించాడు. దీంతో పల్లవ రాజ్యం చోళుల హస్తగతం అయ్యింది.

సాంఘిక పరిస్థితులు

పల్లవులు వైదికమతాన్ని పాటించారు. సమాజంలో చాతుర్వర్ణ వ్యవస్థ ఉండేది. 

సంఘంలో బ్రాహ్మణులకు అధిక ప్రాధాన్యం ఉండేది. వీరికి భూములు దానంగా ఇచ్చేవారు. 

* ఆనాటి సమాజంలో తుడియం, వణం, పరియన్, కడంగన్‌ అనే 4 వర్ణాలు ఉండేవి.

* పల్లవులు బ్రాహ్మణులు. అయితే చాలా కాలం నుంచి వీరు క్షత్రియ ధర్మాలను పాటించడం వల్ల క్షత్రియులయ్యారు.

* బ్రాహ్మణులు యజ్ఞయాగాదులు, శుభకార్యాలతో పాటు, విద్యాబోధన చేసేవారు. వీరికి ప్రభుత్వ ఉద్యోగాల్లో అధిక ప్రాధాన్యం ఉండేది. వీరు చతురాశ్రమ ధర్మాలు పాటించారు. అగ్రహారాల్లో నివసించారు. 

* ఎక్కువ శాతం ప్రజలు గ్రామాల్లో నివసించేవారు. వీరి ప్రధాన వృత్తి వ్యవసాయం. రైతులు ముఖ్యంగా వరి, బార్లీ పండించేవారు.

సమాజంలో వివిధ రకాల వృత్తులు ఉండేవి. కుల, వృత్తి సంఘాలు ఉండేవి. గ్రామాలకు స్వయం నిర్ణయాధికారం ఉండేది. 

స్త్రీ, పురుషులు అలంకరణకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. వివిధ రకాల ఆభరణాలు ధరించేవారు. ధనికులు పట్టు వస్త్రాలు వేసుకునేవారు. 

* ఆర్థిక అసమానతలు, దేవదాసీ వ్యవస్థ ఉండేది. 

* ఆ కాలంలో ప్రధాన వినోదాలు నాటకాలు, సంగీతం, నృత్యం.


ఆర్థిక పరిస్థితులు

* ఆనాటి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. పల్లవులు నీటిపారుదలకు ప్రాధాన్యం ఇచ్చారు. బంజరు భూములకు సైతం నీరు పారించి, సాగులోకి తెచ్చారు. పండ్లు, ధాన్యాలు, కూరగాయలు పండించేవారు. గ్రామాలకు పొలిమేరలు ఉండేవి. పంటపొలాలకు గట్లు వేసేవారు. 

* కుమ్మరి, కమ్మరి, సాలె, భజంత్రీలు, గ్రామసేవకులు, దేవదాసీలకు మాన్యాలను దానంగా ఇచ్చేవారు. కుటీర పరిశ్రమలు ఉండేవి. వర్తకులు ‘శ్రేణులు’గా (వర్తక సంఘాలు) ఏర్పడి చైనా, ఆగ్నేయాసియా దేశాలతో వ్యాపారం చేసేవారు. నానాదేశి, మణిగ్రాం అనే వర్తక సంఘాలు ఉండేవి. మామల్లపురం, నాగపట్నం రేవుల ద్వారా నౌకాయానం జరిగేది. 

* యాలకులు, మిరియాలు, ముత్యాలు, సుగంధ ద్రవ్యాలు ప్రధాన ఎగుమతులు. గుర్రాలు, విలువైన వస్తువులు దిగుమతులు. 

* బ్రాహ్మణులకు బ్రహ్మదేవ్, దేవాదాన అనే పేరుతో భూములను దానాలుగా ఇచ్చేవారు.

* రాజ్యానికి భూమి శిస్తు ప్రధాన ఆదాయమార్గం. పంటలో 1/10 లేదా 1/6 వంతు పన్నులుగా వసూలు చేసేవారు. 

* పల్లవులు 18 రకాల పన్నులను ప్రజల నుంచి వసూలు చేసేవారు. వృత్తిపన్ను, వివాహపన్ను, ఉప్పు, చక్కెరపై పన్నులు ఉండేవి. ప్రభుత్వ ఉద్యోగులకు పాలు, పెరుగు, కూరగాయలు, కలప, వంటచెరకు, పశుగ్రాసం మొదలైనవాటిని ప్రభుత్వమే ఇచ్చేది. 

* దేశ పర్యటనలో రాజుకు అయ్యే ఖర్చును గ్రామ ప్రజలు భరించేవారు. రాజసింహుడు చైనాకు రాయబారులను పంపాడు. ఇతర దేశాలతో వర్తక వ్యాపారాలు నిర్వహించడం వల్ల భారతీయ సంస్కృతి ఇతర దేశాలకు వ్యాపించింది.


పల్లవుల పరిపాలన

* పల్లవుల పరిపాలనా విధానం శాతవాహనుల పాలనను పోలి ఉంటుంది. 

* పల్లవ రాజులు నిరంకుశంగా రాజ్యపాలన చేసినప్పటికీ ప్రజా శ్రేయస్సుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. 

* వీరు హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం పాలన సాగించారు.

* వీరికి ‘రాజాధిరాజ’, ‘ధర్మమహారాజాధిరాజ’, ‘పంచమలోక పాలక’ లాంటి బిరుదులు ఉన్నాయి.

* పాలనలో రాజే సర్వాధికారి. రాజరికం వంశపారంపర్యంగా ఉండేది. 

* రాజుకు సలహాలు ఇచ్చేందుకు ‘మంత్రిపరిషత్‌’ ఉండేది. 

* పల్లవ రాజ్యం అధిక భాగం సామంతుల అధీనంలో ఉండేది. పల్లవ, చాళుక్య యుద్ధాల్లో వీరే కీలకపాత్ర పోషించారు. 

* ప్రజాపరిషత్‌లో అమాత్య, యువరాజు, రహస్యాధీకృత, కోశాధ్యక్షుడు సభ్యులుగా ఉండేవారు. 

* పల్లవ రాజులు దూతికలు (messengers) సంజరంతకులను (spies) నియమించి రాజ్యంలో విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేవారు.

* పరిపాలనా సౌలభ్యం కోసం పల్లవులు రాజ్యాన్ని మండలాలు, నాడులు, గ్రామాలుగా విభజించారు. 

* మండలాధిపతిగా యువరాజు లేదా రాజు వర్గానికి చెందినవారిని నియమించేవారు. 

* పరిపాలనలో చివరిభాగం గ్రామం. ప్రతి గ్రామానికి గ్రామాధికారి ఉండేవాడు. గ్రామ పాలనకు సభ, ఉర్, నగర అనే గ్రామసభలు ఉండేవి. 

* గ్రామాధికారి గ్రామానికి చెందిన దేవాలయాలు, తోటలు, నీటిపారుదల, జనాభా లెక్కలు చూసేవాడు. గ్రామ సరిహద్దులు గుర్తించడం, ఆదాయవ్యయాల గణన ఇతడి ప్రధాన విధి.

* గ్రామసభకు న్యాయాధికారం ఉండేది. ఇందులో బ్రాహ్మణులు సభ్యులుగా ‘సభ’, భూస్వాములు సభ్యులుగా ‘ఉర్‌’, వర్తకులు సభ్యులుగా ‘నగర’ ఉండేవి.

* గ్రామాల్లో ‘ధర్మాసనాలు’ అనే న్యాయస్థానాలు ఉండేవి. ఇక్కడ నేరస్తులకు శిక్షలు అమలు చేసేవారు.

* భోగాలు, విషయాల్లో కూడా ఇలాంటి విధానమే ఉండేది.

Posted Date : 13-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌