• facebook
  • whatsapp
  • telegram

గ్రహాలు - ప్రత్యేక లక్షణాలు

 అక్కడ సూర్యుడు పడమర ఉదయిస్తాడు!

సూర్యుడి చుట్టూ భూమి సహా అనేక గ్రహాలు తిరుగుతుంటాయి. ప్రతి గ్రహానికీ ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. బుధుడిపై ఉష్ణోగ్రత వ్యత్యాసాలు పెద్ద ఎత్తున ఉంటే, శుక్రుడిపై సూర్యుడు పశ్చిమాన ఉదయిస్తాడు. అంగారకుడిపై అగ్నిపర్వతాల విస్ఫోటాలు అధికంగా సంభవిస్తుంటాయి. బృహస్పతిని విషవాయువులు విస్తరించాయి. అందమైన వలయాలతో శని గ్రహం మణిహారంగా మెరుస్తోంది. యురేనస్‌ గతితప్పితే, నెఫ్ట్యూన్‌ నిర్మానుషంగా సంచరిస్తోంది. నీలి రంగు వాతావరణంతో ఫ్లూటో నిండి ఉంటుంది. వీటితోపాటు మరికొన్ని ఖగోళ స్వరూపాలు అంతరిక్షాన్ని ఆవరించి ఉన్నాయి. వాటన్నింటిపై ఉన్న వాతావరణం, నిరంతరం జరుగుతున్న మార్పులు, భూమితో ఉన్న పోలికలు, జీవరాశి ఉనికి తదితర అంశాలన్నింటినీ అభ్యర్థులు శాస్త్రీయంగా తెలుసుకోవాలి. పరీక్షల కోణంలో అవగాహన పెంచుకోవాలి. 

1) బుధుడు: సూర్యుడికి అత్యంత సమీప గ్రహం. దీనినే రోమన్లు నైపుణ్య, వాణిజ్య దేవుడిగా పిలుస్తారు. సౌర కుటుంబంలో అన్నింటి కంటే చిన్న గ్రహం కావడంతో సాటిలైట్‌ ప్లానెట్‌ (ఉపగ్రహ గ్రహం) అని కూడా అంటారు. దీనికే ‘అపోలో’ అనే పేరుంది. ఎలాంటి ఉపగ్రహాల్లేవు. భ్రమణ కాలం 58 రోజులు, పరిభ్రమణ కాలం 88 రోజులు. ఈ గ్రహ ఉపరితలంపై వాతావరణం చాలా తక్కువ. అందువల్ల 56.8 రోజుల చొప్పున పగలు, రాత్రులు ఉంటాయి. పగటి ఉష్ణోగ్రత 427ాది,  రాత్రి ఉష్ణోగ్రత 185ాదిగా నమోదవుతాయి. సౌర కుటుంబంలో అత్యధిక ఉష్ణోగ్రతా వ్యత్యాసాలున్న గ్రహం ్బ612ాద్శిగా దీన్ని పేర్కొనవచ్చు. అతితక్కువ పరిభ్రమణ కాలం ఉన్న గ్రహం ఇదే. బుధుడి గురించి తెలిపే అంతరిక్ష నౌక ‘మెరైనర్‌-10’.


2) శుక్రుడు: ‘వేగు చుక్క’ (ఎల్లో ప్లానెట్‌) అని పిలుస్తారు. ఆచ్ఛాదన గ్రహంగానూ పేరుంది. కారణం ఈ గ్రహం చుట్టూ దట్టమైన మేఘావరణం ఉండటమే. సౌర కుటుంబంలో అత్యంత ప్రకాశవంతమైన గ్రహం. దీని చుట్టూ 95 శాతం కార్బన్‌ డై ఆక్సైడ్, సల్ఫ్యూరిక్‌ ఆమ్లంతో కూడిన మబ్బుల్లాంటి వాతావరణం ఆవరించి ఉంటుంది. దీని కారణంగా ఈ గ్రహ ఉపరితలం వైపు ప్రసరించే సౌర వికిరణంలో దాదాపు 70% ఉపరితలం నుంచే పరావర్తనం (ఆల్బెడో) చెందుతుంది. మిగిలింది ఈ గ్రహ ఉపరితలాన్ని చేరుతుంది. సౌరకుటుంబంలో అత్యంత ఆల్బిడో పరిమాణం ఉన్న గ్రహమిది. అత్యంత వేడి గ్రహం కూడా. కారణం గ్లోబల్‌ వార్మింగ్‌  (600°C). సౌర కుటుంబంలో ఆత్మభ్రమణ కాలం (243 రోజులు), పరిభ్రమణ కాలం (225 రోజులు)  కంటే ఎక్కువగా ఉండే గ్రహం. భూమికి అతి దగ్గరగా ఉన్న గ్రహం శుక్రుడు. దీనినే ఉదయ తార, సంధ్యా తార అని పిలుస్తారు. దీని భ్రమణం తూర్పు నుంచి పడమరకు (సవ్యదిశ) ఉంటుంది. అందువల్ల ఈ గ్రహంపై సూర్యుడు పశ్చిమం వైపు ఉదయిస్తున్నట్లు కనిపిస్తాడు. ఈ గ్రహాన్ని గ్రీకులు అందమైన దేవతగా పరిగణిస్తారు. ఈ గ్రహ పరిమాణం, ద్రవ్యరాశి, సాంద్రత భూమిని పోలి ఉన్నందు వల్ల దీనిని ‘భూమి కవల’ అని పిలుస్తారు. శుక్రుడికి ఉపగ్రహాలు లేవు.


3) భూమి: దీనికి జీవ గ్రహం, జలయుత గ్రహం, నీలి గ్రహం అనే పేర్లున్నాయి. సూర్యుడి నుంచి దూరాన్ని బట్టి చూస్తే మూడోది, పరిమాణాన్ని బట్టి అయిదోది. భూమి వయసు దాదాపు 4.5 బిలియన్‌ సంవత్సరాలు. భూగోళ సగటు ఉష్ణోగ్రత 14.5ాది. భూమధ్యరేఖ వద్ద భూమి చుట్టుకొలత 40,066 కి.మీ (24,897 మైళ్లు). ధ్రువాల చుట్టుకొలత 39,992 కి.మీ. (24,814 మైళ్లు). భూమధ్యరేఖ వద్ద భూవ్యాసం 12,756 కి.మీ. (7,926 మైళ్లు), ధ్రువాల వద్ద భూవ్యాసం 12,714 కి.మీ. (7,900 మైళ్లు). ఇది అత్యంత సాంద్రత ఉండే గ్రహం (5.5 గ్రామ్‌/సి.సి.). భూమి ఆకారం జియాయిడ్‌. అంటే భూమధ్యరేఖా ప్రాంతాలు ఉబ్బెత్తుగా, ధ్రువాల వద్ద అణిగి ఉంటుంది.


* భూకక్ష్య పొడవు 965 మిలియన్‌ కి.మీ.లు. దీర్ఘవృత్తాకార మార్గంలో ఉంటుంది. సూర్యుడు, భూమికి మధ్య దూరం మారుతూ ఉంటుంది. అందువల్ల భూమి తన కక్ష్యామార్గంలో సంవత్సరంలో నిర్దిష్ట కాలంలో అతిదగ్గరగా రావడం (పరిహేళి), అత్యంత దూరానికి  వెళ్లడం(అపహేళి) జరుగుతుంది. భూమికి ఉపగ్రహం చంద్రుడు.


4) అంగారకుడు (కుజుడు): దీనినే రెడ్‌ ప్లానెట్‌ లేదా అరుణ గ్రహం అని పిలుస్తారు. చస్ట్‌/ఫియరీ ప్లానెట్‌ అని కూడా వ్యవహరిస్తారు. కారణం ఈ గ్రహంపై తరచూ అగ్నిపర్వత విస్ఫోటాలు సంభవించడంతో వాతావరణంలో దుమ్ము, ధూళి రేణువులు అధిక పరిమాణంలో చేరతాయి. అంతేకాకుండా దీని ఉపరితలంపై అగ్నిపర్వత క్రాటర్స్‌ ఎక్కువగా ఏర్పడ్డాయి. ఈ గ్రహంపై అత్యంత ఎత్తయిన శిఖరం మౌంట్‌ ఒలంపస్‌ (24,000 మీటర్లు). దీనిని యుద్ధ దేవుడి (గాడ్‌ ఆఫ్‌ వార్‌)గా పేర్కొంటారు.


* కుజుడి అక్షం, ఆత్మభ్రమణం, దినప్రమాణం భూమిని పోలి ఉంటాయి. అందువల్ల రుతువులు, రాత్రింబవళ్లలో తేడాలు భూగ్రహంపై మాదిరిగా సంభవిస్తుంటాయి.  ఈ గ్రహంపై జీవులు ఉండవచ్చని భావిస్తున్నారు. ఆ జీవరాశి ఉనికిని కనిపెట్టేందుకు 2011, నవంబరు 26న అమెరికా ‘క్యూరియాసిటీ’ అనే వాహక నౌకను పంపింది. అంగారకుడి ఆత్మభ్రమణ కాలం 24 గంటల 37 నిమిషాలు. పరిభ్రమణ కాలం 687 రోజులు. కుజుడికి ఫోబస్, డెమోస్‌ అనే రెండు ఉపగ్రహాలున్నాయి.


5) బృహస్పతి (గురుడు): సౌర కుటుంబంలో అతిపెద్ద, అతిబరువైన గ్రహం. ఎర్రటి మచ్చలున్న బృహస్పతిని నక్షత్ర గ్రహంగానూ పిలుస్తారు. ఇది సౌర కుటుంబంలో అతితక్కువ ఆత్మభ్రమణ కాలం ఉన్న గ్రహం (9 గంటల 50 నిమిషాలు). కారణం దీని కోణీయ ద్రవ్యవేగం అధికంగా ఉండటమే. దీనినే ‘లవ్‌ ఆఫ్‌ గాడ్‌ అండ్‌ హెవెన్‌’ అంటారు. దీని వాతావరణంలో 90% హైడ్రోజన్, అమ్మోనియా, మీథేన్‌ లాంటి విష వాయువులు ఉంటాయి. అందుకే గ్యాస్‌ జెయింట్‌ అని పిలుస్తారు. సౌర కుటుంబంలో అత్యధిక ఉపగ్రహాలున్న రెండో గ్రహం బృహస్పతి (79). అందులో ముఖ్యమైనవి గనిమెడ, కాలిస్టో, యూరోఫో, ఈవో. ఈ నాలుగింటిని గెలీలియో ఉపగ్రహాలు అంటారు. గనిమెడ సౌరకుటుంబంలో కెల్లా అతిపెద్ద ఉపగ్రహం. బృహస్పతి బలమైన అయస్కాంత క్షేత్రం ఉన్న గ్రహం.


6) శని (శాటర్న్‌): దీనిని సౌరకుటుంబ మణిహారంగా పిలుస్తారు. ‘గాడ్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌’ అని కూడా పేర్కొంటారు. దీని చుట్టూ దుమ్ము, ధూళి రేణువులతో కూడిన మూడు అందమైన వలయాలుంటాయి. నారింజ వర్ణంలో కనిపిస్తుండటంతో ఆరెంజ్‌ ప్లానెట్‌ అని పిలుస్తారు. సౌర కుటుంబంలో అత్యధిక ఉపగ్రహాలున్న (82) అతిపెద్ద గ్రహం. ఈ గ్రహ వాతావరణ సంఘటనం బృహస్పతిని పోలి ఉంటుంది. దీనిని ‘క్రూయల్, గోల్డెన్‌ ప్లానెట్‌’గా పిలుస్తారు. సౌర కుటుంబంలో అత్యల్ప సాంద్రత ఉన్న గ్రహం. దీని ఉపగ్రహాల్లో అతి పెద్దది టైటాన్‌.


7) వరుణుడు (యురేనస్‌): దీనిని ‘గ్రీన్‌ నెట్‌’, ‘గాడ్‌ ఆఫ్‌ ది స్కై’ అని పిలుస్తారు. కారణం ఈ గ్రహ వాతావరణంలో మీథేన్‌ వాయువు అధికంగా ఉండటమే. శుక్ర గ్రహం మాదిరి ఇది తూర్పు నుంచి పడమరకు భ్రమణం చేస్తుంది. అక్షం 98 డిగ్రీల కోణంతో ఒకవైపు వాలి ఉండటంతో ఈ గ్రహంపై అతిదీర్ఘ పగలు, అతిదీర్ఘ రాత్రులు ఏర్పడతాయి (48 సంవత్సరాలు). అందుకే దీనిని ‘గతితప్పిన గ్రహం’ అంటారు. దీని పరిభ్రమణ కాలం 84 ఏళ్లు. ఉపగ్రహాల సంఖ్య 27. మిరిందా, ఉమబ్రీల్, ఏరియల్, టిటానియా వాటిలో ముఖ్యమైనవి.


8) ఇంద్రుడు (నెప్ట్యూన్‌): ఇది ఎక్కువగా వరుణుడితో పాటు ఇతర ప్రధాన గ్రహాలను పోలి ఉంటుంది. 165 ఏళ్లలో సూర్యుడి చుట్టూ ఒక పరిభ్రమణం పూర్తి చేస్తుంది. 16 గంటల్లో తన అక్షం మీద ఒక భ్రమణం చేస్తుంది. దీనికి 14 ఉపగ్రహాలున్నాయి. అందులో ముఖ్యమైనవి ట్రిటాన్, నెరియడ్‌. దీనిని ‘నిర్మానుష్య గ్రహం’ అని కూడా పిలుస్తారు.


* ప్లూటో సాంకేతికంగా గ్రహ స్థాయిని కోల్పోయిన గ్రహం. దీని కక్ష్య అతిదీర్ఘ వృత్తాకారంగా ఉండటం వల్ల నెప్ట్యూన్‌ కక్ష్యను అప్పుడప్పుడు ఖండిస్తుంది. ఇది సూర్యుడికి అత్యంత దూరంలో ఉండే అతిశీతల గ్రహం. దీని వాతావరణం నీలి రంగులో ఉంటుంది.


ఆస్టరాయిడ్స్‌/లఘు గ్రహాలు/ గ్రహ శకలాలు: అంగారక, గురు గ్రహాల మధ్య సూర్యుడి చుట్టూ పరిభ్రమించే చిన్న చిన్న శిలా శకలాలివి. ఇందులో అతిపెద్ద ఆస్టరాయిడ్‌ సెరస్‌. (ప్రస్తుతం దీన్ని మరుగుజ్జు గ్రహాల జాబితాలో చేర్చారు) అతి చిన్న ఆస్టరాయిడ్‌ హెర్బ్‌.


తోకచుక్కలు: ఇవి సూర్యుడి చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో పరిభ్రమించే, ఘన స్థితిలో ఉన్న వాయు (దుమ్ము, ధూళి), లోహ కణాలతో కూడిన ఖగోళ స్వరూపాలు. ఇందులో మూడు భాగాలుంటాయి. కేంద్రకం, తల/కోమా, తోక. వీటిలో ప్రధానమైంది హేలీ తోకచుక్క. ఇది ప్రతి 76 ఏళ్లకు ఒకసారి భూమిని సమీపిస్తుంది. 1986లో ఇది భూమికి దగ్గరగా వచ్చింది. తోకచుక్కలనే మంచు గోళాలు (స్నోబాల్స్‌) అని కూడా పిలుస్తారు.

ఉల్కలు: ఒక్కోసారి తోకచుక్కలు తమ కక్ష్యను వీడి భూ వాతావరణంలోకి ప్రవేశించి, అక్కడున్న ఘర్షణ బలాల కారణంగా ప్రకాశవంతంగా మండుతాయి. వీటినే షూటింగ్‌ స్టార్స్‌ లేదా అతిథి నక్షత్రాలు అంటారు. భూమిని చేరే పెద్ద పరిమాణ ఉల్క భాగాలను ‘ఉల్కాపాతాలు’ అంటారు. వీటిలో ప్రధానంగా ఇనుము, నికెల్‌ లాంటి మూలకాలుంటాయి. భూమిని చేరే చిన్న పరిమాణంలో ఉండే ధూళి కణాలు/ఉల్క భాగాలను ‘ఉల్కా ధూళి’ అంటారు.



- రచయిత: సక్కరి జయకర్‌


 

Posted Date : 29-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌