• facebook
  • whatsapp
  • telegram

జనాభా

జనాభా పరివర్తన సిద్ధాంతం

ఒక నిర్ణీత కాలంలో దేశంలో నివసించే ప్రజలను జనాభా అంటారు. వీరు దేశాభివృద్ధికి ఎంతో అవసరం. ఆర్థికాభివృద్ధిలో జనాభా, మానవ వనరులకు అధిక ప్రాధాన్యం ఉంది. మానవులు ఉత్పత్తికి దోహదపడే సాధనాలే కాదు, వాటిని ఉపయోగించేది కూడా వారే. ప్రస్తుతం భారత్, వర్ధమాన ప్రపంచ దేశాలు (అభివృద్ధి చెందుతున్న దేశాలు) జనాభా విస్ఫోటన దశలో ఉన్నాయి.

1798 లో లండన్‌ (ఇంగ్లండ్‌)కు చెందిన థామస్‌ రాబర్ట్‌ మాల్థస్‌ మొదటిసారి జనాభావృద్ధి, రాజకీయ, ఆర్థిక వ్యవస్థలు, పేదరికం, ఆహార భద్రతను గురించి అధ్యయనం చేసి, ‘ఎన్‌ ఎస్సే ఆన్‌ ద ప్రిన్సిపుల్స్‌ ఆఫ్‌ పాపులేషన్‌’ అనే పుస్తకాన్ని రచించారు.  జనాభా గురించి అధ్యయనం చేయడాన్ని ‘డెమోగ్రఫీ’ అంటారు.


జనాభా సిద్ధాంతం

ఆర్థికాభివృద్ధిలో జనాభా పరిణామ సిద్ధాంతాన్ని అనుసరించి జనన, మరణాల రేటు నాలుగు స్థాయుల్లో ఉన్నట్లు చెప్పొచ్చు. దీని ప్రకారం ఎక్కువ మరణాల రేటు ఉన్న స్థితి నుంచి తక్కువ జనన, మరణాల రేటు స్థితికి చేరడాన్నే ఒక ప్రాంత జనాభా మార్పు అంటారు. గ్రామీణ వ్యవసాయిక నిరక్షరాస్యత ఆర్థిక వ్యవస్థల నుంచి పట్టణ పారిశ్రామిక అక్షరాస్యత ఆర్థిక వ్యవస్థలుగా మారుతుంది. 


మొదటి దశ: 

ఈ స్థాయిలో జననాలు, మరణాల రేటు రెండూ ఎక్కువగా ఉంటాయి. వీటికి ప్రధాన కారణాలు నిరక్షరాస్యత, సాంఘిక మూఢనమ్మకాలు, ఆచారాలు, పౌష్టికాహారలోపం, అపరిశుభ్రత, ప్రజారోగ్య/ వైద్య సదుపాయాలు లేకపోవడం, బాల్యవివాహాలు, కుటుంబ నియంత్రణ పద్ధతులపై అవగాహన లోపం. కాబట్టి జనాభా వృద్ధిరేటు అధికంగా ఉండదు. దీన్ని సమాన లేదా స్థబ్దత దశ అంటారు. ఈ స్థితి అభివృద్ధి చెందని దేశాలు, వ్యవసాయ ప్రాధాన్యం ఉన్న ఆర్థిక వ్యవస్థల్లో ఉంటుంది. ఈ దశ భారతదేశంలో 1921 కి పూర్వం బాగా ఉంది. తర్వాత ఆ స్థాయి తగ్గుతూ 1950 వరకు కొనసాగింది.


రెండో దశ: 

ఈ స్థాయిలో జననాల రేటు ఎక్కువ ఉండి, మరణాల రేటు అకస్మాత్తుగా తగ్గుతుంది. ఈ రెండింటి మధ్య వ్యత్యాసానికి కారణం ఆదాయాలు పెరగడం, సమృద్ధిగా పౌష్టికాహారం లభించడం, ఆరోగ్య వసతులు అభివృద్ధి చెందడం వల్ల ప్రాణ రక్షణ ఔషధాలు, మందుల లభ్యత అధికమవ్వడం. వీటి ఫలితంగా ప్రజల ఆదాయాలు పెరిగి ఆహార అలవాట్లు మెరుగవుతాయి. 

ఈ దశలో జనాభా పెరుగుదల వేగంగా ఉండటంతో దీన్ని ‘జనాభా విస్ఫోటన’ అంటారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ దశ పరిధిలోకి వస్తాయి. భారతదేశంలో ఈ దశ 1921 నుంచి ప్రారంభమైది. 1951 నుంచి పెరుగుతూ 1990 వరకు కొనసాగింది.


మూడో దశ: 

ఈ స్థాయిలో జననాలు, మరణాల రేటు రెండూ తగ్గుతున్న దశలో ఉంటాయి. ఇవి తగ్గడానికి కారణం అభివృద్ధి అధిక స్థాయిలో ఉండటం, జీవన వ్యయం పెరగడంతో గృహ సమస్యలు పెరిగి కుటుంబ పరిమాణం తగ్గుతుంది. ఈ దశలో సంతానాన్ని ఆస్తిగా కాకుండా భారంగా భావిస్తారు. ఈ మార్పు మొదట పట్టణ ప్రాంతాల్లో, అధిక ఆదాయ వర్గాల్లో మొదలై గ్రామీణ ప్రాంతాలకూ విస్తరిస్తుంది. దీని వల్ల జననాల రేటు ఒక్కసారిగా తిరోగమనం చెందుతుంది. 

పారిశ్రామికీకరణ, ఆధునికీకరణ, అక్షరాస్యత అభివృద్ధి చెందడంవల్ల దేశంలో జనాభా పెరుగుదల సమస్య ఉండదు. దీంతో ప్రజల జనన, మరణాల రేట్లలో సమతౌల్యత ఏర్పడి అల్పవృద్ధి రేటు నమోదవుతుంది. ప్రస్తుతం ఈ దశ అభివృద్ధి చెందిన దేశాలు, మరింత అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కనిపిస్తోంది. భారతదేశంలో 1991 నుంచి ప్రారంభమై నేటి వరకు ఈ స్థితిని గుర్తించవచ్చు.


నాలుగోదశ: 

ఈ స్థాయిలో జననాలు, మరణాల రేటు చాలా తక్కువ స్థితికి చేరుకుని ఇంచుమించు స్థిరంగా ఉంటాయి. దీనికి కారణం ఆర్థిక వ్యవస్థ ఎక్కువ పారిశ్రామికంగా మారడం, పట్టణ జనాభా అధికంగా అభివృద్ధి చెందడం. ఉన్నత జీవన ప్రమాణాలను ఏర్పరుచుకుని చిన్న కుటుంబాన్ని ప్రామాణికంగా అంశీకరించడం వల్ల జనాభా బాగా తగ్గిపోతుంది. ఈ స్థితి బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో కనిపిస్తుంది. ఈ దశ భారతదేశంలో కనిపించదు.


భారతదేశంలో జనాభా పరిణామక్రమం

* జనాభా పరిణామ సిద్ధాంతం ప్రకారం జనన, మరణ రేట్లలో భారతదేశం మూడోస్థాయి ప్రారంభశలో ఉంది. మనదేశంలో మరణాల రేటు అతి తక్కువ స్థితికి చేరింది. జననరేటును క్రమంగా తగ్గించుకోవాల్సి ఉంది.


* జనాభా పెరుగుదలను పరీక్షిస్తే, 1911 నుంచి 1951 వరకు ఉన్న కాలాన్ని మొదటిదశ లేదా ప్రాథమిక స్థితిగా; 1951 నుంచి 1991 వరకు ఉన్న సమయాన్ని రెండో దశ లేదా ద్వితీయ స్థితిగా; 1991 నుంచి 2011 వరకు ఉన్న కాలాన్ని మూడో దశ లేదా తృతీయ స్థితిగా గుర్తించవచ్చు.


* మొదటిదశలో సహజ పెరుగుదల రేటు క్రమంగా తగ్గి, పెరిగింది. రెండో దశలో జననాల రేటు పెరిగి, మరణాల రేటు తగ్గడంతో సహజ పెరుగుదల రేటు ఎక్కువగా ఉంది. మూడో దశలో సహజ రేటు క్రమంగా తగ్గింది. జననాలు, మరణాలు తగ్గడమే కాకుండా సహజ రేటులోనూ వ్యత్యాసం ఉంది. ఈ దశలో ప్రజలు జనాభా నియంత్రణ పరిమితిని పాటించడం వల్లే సహజ పెరుగుదల తగ్గింది.


* ప్రపంచంలోనే మొదటగా భారత్‌ కుటుంబ నియంత్రణ ప్రణాళికను ప్రారంభించింది. 1925లో ప్రొఫెసర్‌ రఘునాథ్‌ దొండా కార్వే తొలిసారి వ్యక్తిగత ఫ్యామిలీ ప్లానింగ్‌ క్లినిక్‌ను ఏర్పాటుచేశారు. 1932లో మద్రాస్‌ ప్రభుత్వం జనన నియంత్రణ క్లినిక్‌ను ప్రారంభించింది. స్వాతంత్య్రానంతరం 1952లో భారత ప్రభుత్వం ‘జాతీయ కుటుంబ నియంత్రణ ప్రణాళిక’ను అధికారికంగా అమలు చేసి తక్కువ పునరుత్పత్తి రేటు, తక్కువ జనాభావృద్ధిని సాధించి ఆర్థికాభివృద్ధికి బాటలువేసింది. 2016లో బిహార్, యూపీ, అసోం, ఛత్తీస్‌గఢ్, ఎంపీ, రాజస్థాన్, ఝార్ఖండ్‌ రాష్ట్రాలు పునరుత్పత్తి రేటు తగ్గించుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ‘మిషన్‌ పరివార్‌ వికాస్‌’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాయి.


* ఒక దేశంలోని మరణరేటు ఆధారంగా ఆ దేశపు ఆరోగ్య ప్రమాదాల స్థితిని అంచనా వేయొచ్చు. 150 ఏళ్ల క్రితం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మరణాలరేటు సుమారుగా 40 ఉంటే, 2001 జనాభా లెక్కల ప్రకారం ఈ రేటు 810 మధ్యలో ఉంది. దీనికి కారణం పోషకాహార లభ్యత, రక్షిత నీరు, వైద్య సౌకర్యాలు, అంటువ్యాధుల నిర్మూలన, కొత్త రకం మందులు కనిపెట్టడం. 


* 20వ శతాబ్దం మొదటి భాగంలో మరణాల రేటు ఎక్కువగా ఉండి, జనాభా పెరుగుదల కొంతమాత్రమే ఉంది. ఆ సమయంలో ఏర్పడిన క్షామం, ఇన్‌ఫ్లూయంజా వల్ల జనాభాలో చెప్పుకోదగ్గ పెరుగుదల లేదు. ఉదాహరణకు 191820 మధ్య స్పానిష్‌ ఇన్‌ఫ్లూయంజా కారణంగా సుమారు కోటిన్నర మంది మరణించారు. 


* 191718లో మరణాల రేటు 33 ఉండగా, 191819 లో ఇది 63కు చేరింది. దీనివల్ల 1921 జనాభా గణనలో మైనస్‌ నమోదు అయ్యింది. ఈ ఏడాదినే ‘గొప్ప విభాజక సంవత్సరంగా’ పేర్కొన్నారు. దాదాపు వంద సంవత్సరాల తర్వాత కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాలు కుదేలు అవుతున్నాయి.


జనాభా పరిమాణం  పంపిణీ

2016 నాటికి భారతదేశ జనాభా 133 కోట్లు ఉందని అంచనా. ప్రపంచవ్యాప్తంగా జనాభాలో మనం రెండో స్థానంలో ఉన్నాం. ప్రపంచ జనాభాలో భారత్‌లో 17% మంది నివసిస్తున్నారు. భౌగోళికంగా మనదేశం 3.28 మిలియన్‌ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. అన్ని ప్రాంతాల్లో జనాభా రేటు ఒకేలా లేదు. ఉదాహరణకు ఉత్తర్‌ప్రదేశ్‌లో 200 మిలియన్‌ జనాభా నివసిస్తుంటే, సిక్కింలో 0.5 మిలియన్‌ మాత్రమే ఉన్నారు. 

* 2016 జనాభా అంచనాల ప్రకారం భారత్‌లో మొత్తం జనాభా 132.5 కోట్లు; జనసాంద్రత ఒక చదరపు కిలోమీటర్‌కు 382 మంది; వృద్ధి రేటు 1.19 శాతంగా ఉంది. ప్రతి వెయ్యి మందికి జనన రేటు  19.3 శాతం ఉంటే, మరణాల రేటు 7.3 శాతంగా నమోదైంది. 

* మనదేశంలో 014 ఏళ్ల మధ్య వయసు వారు  28.6%; 1559 ఏళ్ల మధ్య 63.6%; 60 అంత కంటే ఎక్కువ వయసున్నవారు 5.3% ఉన్నారు. జూ 2011 లెక్కల ప్రకారం శ్రామికరంగం ప్రాథమిక రంగంలో 54.6%, గౌణ రంగంలో 3.8% తృతీయ రంగంలో 41.6% ఉన్నారు.


మత జనాభా

2015, ఆగస్టు 25న జనాభా రిజిస్ట్రార్‌ అండ్‌ కమిషనర్‌ సి.ఎం.చంద్రమౌళి దేశంలో మతాలవారీగా నివసించే ప్రజల జనాభా లెక్కను విడుదల చేశారు. 2011 జనాభా లెక్కల ఆధారంగానే వీటిని ప్రకటించారు. దేశంలో అన్ని మతాల జనాభా 121.0 కోట్లు (100%) గా ఉంది.

2001 జనాభాతో 2011 జనాభా లెక్కలను పరిశీలిస్తే, హిందూ జనాభా 16.8% వృద్ధి రేటుతో 0.7% తగ్గుదల ఉంది. ముస్లింలు అత్యధికంగా 24.6% వృద్ధి రేటుతో   0.8% పెరిగారు. క్రైస్తవులు 15.5%, జైనులు 5.4 శాతం వృద్ధి రేటు కలిగినా జనాభా పరంగా ఎలాంటి మార్పులేదు.  సిక్కులు 8.4%, బౌద్ధులు 6.1% వృద్ధి రేటు ఉన్నా, జనాభాలో తగ్గుదల ఉంది. దేశంలో ఎక్కువమంది హిందూ మతాన్ని, తక్కువమంది జైన మతాన్ని  ఆచరిస్తున్నారు.


మాతృ భాషలు

2018, జూన్‌ 26న కేంద్ర ప్రభుత్వం జాతీయ భాష గణాంకాలను (డేటా) విడుదల చేసింది. 2011 జనాభా గణన ప్రకారం హిందీ అనేక రాష్ట్రాల్లో మాతృ భాషగా ఉంది. దేశంలో 57.1 శాతం ప్రజలు హిందీని తమ వాడుక భాషగా, 43.63% మంది మాతృభాషగా ప్రకటించారు. దేశంలో 96.7% ప్రజలు 22 రకాల మాతృ భాషల్లో మాట్లాడుతున్నారు. 
 
                       భారత్‌లో వివిధభాషల్లో మాట్లాడే ప్రజలు

జనాభా లెక్కల సేకరణ

భారతదేశంలో జనాభా లెక్కలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని రిజిస్ట్రార్‌ జనరల్‌ అండ్‌ సెన్సెస్‌ కమిషనర్‌ నిర్వహిస్తారు. సెన్సెస్‌ ఆర్గనైజేషన్‌ ద్వారా జనాభా లెక్కల మదింపు ప్రక్రియను చేపడతారు. మొదటిసారిగా బ్రిటిష్‌ వారి హయాంలో 1872లో లార్డ్‌ మేయో కాలంలో దాదాభాయ్‌ నౌరోజీ జనాభా లెక్కలను మదింపు వేశారు. అయితే శాస్త్రీయబద్ధమైన జనాభా లెక్కల క్రమబద్ధీకరణ 1881 నుంచి లార్డ్‌ రిప్పన్‌ ఆధ్వర్యంలో జరిగింది. మనదేశంలో 1881 నుంచి క్రమం తప్పకుండా ప్రతి పదేళ్లకు ఒకసారి జనాభా లెక్కలను సేకరిస్తున్నారు. మొదటిసారిగా 2021 జనాభా లెక్కల సేకరణను కొవిడ్‌ కారణంగా వాయిదా వేశారు. స్వాతంత్య్రానంతరం 1948లో భారత పార్లమెంట్‌ సెన్సెస్‌ యాక్ట్‌ను ఆమోదించింది. ‘జనాభా లెక్కల సేకరణ’ అనే పదాన్ని రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌లో 246 అధికరణంలో వివరించారు. దీన్ని కేంద్ర జాబితాలో 69వ అంశంలో పేర్కొన్నారు. 1976లో మొదటి జనాభా విధానాన్ని, 2000లో ఎం.ఎస్‌. స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులతో నూతన జనాభా విధానాన్ని ప్రకటించారు.


జనాభా పెరుగుదల - పంపిణీ

ప్రపంచంలోని 90% జనాభా 10% భూభాగంలోనే నివసిస్తున్నారు. మొత్తం ప్రపంచ దేశాల్లో కేవలం 10 ప్రధాన దేశాల్లోనే 60% ప్రపంచ జనాభా నివసిస్తోంది. వీటిలో 6 దేశాలు ఆసియా ఖండంలోనే ఉన్నాయి. అవరోహణక్రమంలో చూస్తే చైనా, భారత్, యూఎస్‌ఏ, ఇండోనేసియా, బ్రెజిల్, పాకిస్థాన్, నైజీరియా, బంగ్లాదేశ్, రష్యా, మెక్సికో అధిక జనాభా కలిగి ఉన్నాయి. ఖండాలవారీగా పరిశీలిస్తే 2018 నాటికి ఆసియా - 4,545,133,094 (59.5%) , ఆఫ్రికా - 1,287,920,518 (16.9%), యూరప్‌ - 742,648,010 (9.7%), లాటిన్‌ అమెరికా అండ్‌ కరేబియన్‌ - 652,012,001 (8.5%), ఉత్తర అమెరికా - 363,844,490 (4.8%), ఆస్ట్రేలియా- ఒషినియా దీవులు - 41,261,212 (0.5%) మంది జనాభా ఉన్నారు.  ప్రపంచ జనాభా పెరుగుదలను ప్రతి బిలియన్‌కు పరిశీలిస్తే క్రీస్తుపూర్వం 10 వేల సంవత్సరాల క్రితం 5 మిలియన్లు,  క్రీ.శ.1650 నాటికి 500 మిలియన్లు, 1830 నాటికి 1 బిలియన్‌ ్బ1500 సంవత్సరాల్శు, 1930 నాటికి 2 బిలియన్లు ్బ100 సంవత్సరాల్శు, 1960 నాటికి 3 బిలియన్లు ్బ30 సంవత్సరాల్శు, 1975 నాటికి 4 బిలియన్లు ్బ15 సంవత్సరాల్శు, 1987 నాటికి 5 బిలియన్లు ్బ12 సంవత్సరాల్శు, 1999 నాటికి  6 బిలియన్లు ్బ12 సంవత్సరాల్శు, 2011 నాటికి 7 బిలియన్లు ్బ12 సంవత్సరాల్శు ఉంటే 2025 నాటికి 8 బిలియన్లకు చేరుతుందని అంచనా. 1987, జులై 11న ప్రపంచ జనాభా 5 బిలియన్లకు చేరుకున్న సందర్భంగా ఆ రోజున అంతర్జాతీయ జనాభా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. మనదేశంలో 1901 నాటికి జనాభా 23 కోట్లు ఉండగా, 1951లో 36 కోట్లు, 2001లో 102 కోట్లుగా నమోదై, 2011లో 121 కోట్లకు పెరిగింది.


2011 జనాభా గణన

1881 నుంచి ప్రతి పదేళ్లకు జనాభా లెక్కల సేకరణ జరుగుతోంది. 2011 నాటి జనాభా లెక్కల సేకరణ 15వది. అయితే, స్వాతంత్య్రం తర్వాత 1951 నుంచి పరిశీలిస్తే 2011లో జరిగింది ఏడో జనగణన. 2010, ఏప్రిల్‌ 1న రాష్ట్రపతి పేరుతో జనాభా లెక్కల సేకరణను ప్రారంభించారు. నాటి జనాభా లెక్కల రిజిస్ట్రార్‌ జనరల్‌ అండ్‌ కమిషనర్‌ డాక్టర్‌ సి.ఎం.చంద్రమౌళి. 2011 జనాభా లెక్కల నినాదం ‘మన జనాభా -మన భవిష్యత్తు’. ఈ గణనలో మొదటిసారిగా 12 అంకెల యూనిక్‌ కోడ్‌ విధానం ఉపయోగించారు. 2011 జనాభా లెక్కల్లో 28 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు, 640 జిల్లాలు, 5,624 డివిజన్లు ్బళిదీవ్శీ, 7935 పట్టణాలు, 6.40 లక్షల గ్రామాల్లో జనగణన జరిగింది.


జనాభా స్వరూపం - భారత్‌

2001లో భారత జనాభా 102.7 కోట్లు ఉండగా, 2011 నాటికి 121.05 కోట్లకు చేరింది. అంటే 2001 - 11 మధ్య 18.19 కోట్ల జనాభా పెరిగింది.

మొత్తం తుది జనాభా - 121,05,69,573 

పురుషులు - 62.32 కోట్లు (51.47%)

స్త్రీలు - 58.75 కోట్లు (48.53%)

గ్రామీణ జనాభా - 83.40 కోట్లు (68.85%)

పట్టణ జనాభా - 37.71 కోట్లు (31.14%)

ఆంధ్రప్రదేశ్‌ జనాభా - 4.95 కోట్లు (4.10%)

తెలంగాణ - 3.50 కోట్లు (2.89%)

ప్రపంచంలో అధిక జనాభా ఉన్న దేశాల్లో భారత్‌ రెండో స్థానంలో ఉంది. మన దేశంలో అధిక జనాభా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 10, 12వ స్థానాల్లో ఉన్నాయి.


దశాబ్ద వృద్ధిరేటు 

ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో పది సంవత్సరాల కాలంలో పెరిగే జనాభాను జనాభివృద్ధి రేటు అంటారు. అలాగే ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఒక ఏడాది వృద్ధిని లెక్కిస్తే దాన్ని వార్షిక వృద్ధిరేటు అంటారు. రెండు జనగణన కాలాల (2001-2011)  మధ్య జనాభా తగ్గితే రుణాత్మకమని, పెరిగితే ధనాత్మక వృద్ధిరేటు అని అంటారు. మన దేశంలో  1921లో అత్యల్పంగా  రుణాత్మక వృద్ధిరేటు (-0.31%) నమోదు కాగా, 1971లో అత్యధిక ధనాత్మక వృద్ధిరేటు (24.8%) నమోదైంది.

ఉదాహరణ: 2001లో జనాభా 102.7 కోట్లు ఉండగా, 2011లో 121.05 కోట్లకు చేరింది. అంటే 18.19 కోట్ల జనాభా పెరిగింది. దశాబ్ద వృద్ధిరేటు 


2011 లెక్కల్లో పెరిగిన జనాభా 


2001లో జనాభా వృద్ధిరేటు 21.54% కాగా, 2011లో 17.7% వృద్ధిరేటు నమోదైంది. వార్షిక వృద్ధిరేటు 1.67%గా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో దశాబ్ద వృద్ధిరేటు 9.21%, తెలంగాణలో 13.58%గా నమోదైంది.

లింగ నిష్పత్తి


ప్రతి 1000 మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారో లెక్కించడాన్ని లింగ నిష్పత్తి అంటారు.


        

జన సాంద్రత

ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఒక చ.కి.మీ వైశాల్యంలో నివసించే ప్రజలను జన సాంద్రత అంటారు. 


మనదేశంలో 2001లో జనసాంద్రత 325 మంది కాగా, 2011లో 382 మంది ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఒక చదరపు కిలోమీటర్‌కు 308 మంది, తెలంగాణలో 312 మంది ఉన్నారు.

 

గ్రామీణ - పట్టణ జనాభా

భారతదేశంలో 2001 లెక్కల ప్రకారం 74.26 కోట్ల గ్రామీణ జనాభా ఉండగా, 2011లో 83.35 కోట్లు ఉంది. శాతాల పరంగా చూస్తే 2001లో 72.2% ఉంటే, 2011లో 68.86% ఉంది. అయితే 2011లో గ్రామీణ జనాభా వృద్ధి రేటు 12.3% గా నమోదైంది. 2011లో   ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ జనాభా 3.49 కోట్లు ్బ70.53%్శ ఉంది. 2011లో తెలంగాణ గ్రామీణ జనాభా 2.13 కోట్లుగా ్బ61.1%్శ నమోదైంది ఉంది.

పట్టణ జనాభా

భారతదేశంలో 2001 జనాభా లెక్కల ప్రకారం 28.61 కోట్ల పట్టణ జనాభా ఉంటే, 2011లో 37.71 కోట్లు ఉంది. శాతంపరంగా పరిశీలిస్తే 2001లో 27.8% శాతం ఉంటే 2011 జనగణనలో 31.14% ఉంది. 

*  2011 జనగణనలో ఆంధ్రప్రదేశ్‌ పట్టణ జనాభా 1.46 కోట్లు ( 29.47 శాతం) ఉంది. అలాగే తెలంగాణ పట్టణ జనాభా 1.36 కోట్లు (38.9%) ఉంది.

నగరాలు (cities)

ఐక్యరాజ్య సమితి నిర్వచనం ప్రకారం ఒక కోటి జనాభా (10 మిలియన్లు) దాటిన పట్టణాన్ని మెగాసిటీ అంటారు. ప్రపంచంలో మొత్తం 33 మెగాసిటీలు ఉన్నాయి. 

*  ప్రపంచంలో అతిపెద్ద మెగాసిటీ టోక్యో (జపాన్‌).

*  ఇండియాలో 2011 జనాభా లెక్కల ప్రకారం మూడు నగరాలు ఉంటే 2020 ప్రకారం మొత్తం అయిదు మెగా/మెట్రోపాలిటన్‌ నగరాలు ఉన్నాయి.


ఇండియాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 53 మిలియన్‌ నగరాలు ఉన్నాయి. 10 లక్షల జనాభా దాటిన  పట్టణాలను మిలియన్‌ నగరాలు అంటారు. 

* అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో 7, కేరళలో 7 మిలియన్‌ నగరాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం (17.2 లక్షలు), విజయవాడ (14.7 లక్షలు) ఉన్నాయి. తెలంగాణలో హైదరాబాద్‌ ఉంది.    

* ఒక లక్ష జనాభా దాటిన పట్టణాలను నగరపాలక సంస్థ/ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అంటారు. దేశంలో మొత్తం 205 కార్పొరేషన్లు ఉన్నాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 27 మున్సిపల్‌ కార్పొరేషన్లు, ఆంధ్రప్రదేశ్‌లో 16, తెలంగాణలో 13 కార్పొరేషన్లు ఉన్నాయి.

అక్షరాస్యత

ఎవరైతే ఏదైనా ఒక భాషలో చదవడం లేదా రాయడాన్ని అర్థం చేసుకోగలుగుతారో, వారిని అక్షరాస్యులుగా పరిగణిస్తారు. ఏడు సంవత్సరాలు, ఆపైన వయసు ఉన్న అక్షరాస్యులను మొత్తం జనాభాతో భాగిస్తే అక్షరాస్యత వస్తుంది

.

2001లో అక్షరాస్యత 64.8% ఉంటే, 2011లో    72.98% ఉంది. 2001లో పురుషుల అక్షరాస్యత 75.9% ఉండగా, 2011లో ఇది 80.9% గా నమోదైంది.

2001లో స్త్రీల అక్షరాస్యత 54.2%, 2011లో ఇది  64.6% గా ఉంది. 2011లో గ్రామీణ అక్షరాస్యత 67.8%, పట్టణ అక్షరాస్యత 84.1% ఉంది. 2011లో ఆంధ్రప్రదేశ్‌లో అక్షరాస్యత   67.41%, తెలంగాణలో 66.54% ఉంది.
  

 

మాదిరి ప్రశ్నలు


1. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు దేశ జనాభా, వైశాల్యంలో ఏఏ స్థానాల్లో ఉన్నాయి?

1) 10వ, 7వ - 12వ, 11వ స్థానం

2) 10వ, 8వ - 12వ, 12వ స్థానం

3) 7వ, 10వ - 11వ, 12వ స్థానం

4) 5వ, 4వ - 6వ, 5వ స్థానం

2. 2011 జనగణన ప్రకారం దేశంలో ఎన్ని మెగా  సిటీలు ఉన్నాయి?

1)  3     2) 6     3) 4     4) 7


3. ఏ సంవత్సరాన్ని గొప్ప జనాభా విభాజక సంవత్సరంగా పేర్కొంటారు?

1) 1951     2) 1971    3) 1921     4) 1901

4. శాస్త్రీయబద్ధమైన జనాభా లెక్కల సేకరణ జరిపించిన బ్రిటిష్‌ జనరల్‌ ఎవరు?

1) లార్డ్‌ మేయో     2) లార్డ్‌ రిప్పన్‌   3) లార్డ్‌ కర్జన్‌     4) వారన్‌ హేస్టింగ్స్‌ 

5. ‘జనాభా విస్పోటన’ అని ఏ దశకు పేరు?

1) మొదటి దశ        2) మూడో దశ   3) అయిదో దశ     4) రెండో దశ

6. భారతదేశంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు?

1) 1972     2)1992    3) 1952     4) 1921


7.  ఎం.ఎస్‌.స్వామినాథన్‌ సిఫార్సుల ద్వారా ఏ సంవత్సరంలో నూతన జనాభా విధానాన్ని ప్రకటించారు?

1) 1976     2) 1998     3)  2000     4) 2005

8. 2001 జనగణనతో పోల్చితే 2011 జనగణన వృద్ధిరేటు అనేది..?

1) పెరిగింది        2)  తగ్గింది     3)  స్థిరంగా ఉంది        4) మిశ్రమంగా ఉంది.

9. దేశంలో అత్యధిక మున్సిపల్‌ కార్పొరేషన్లు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?

1) మధ్యప్రదేశ్‌        2)  ఆంధ్రప్రదేశ్‌     3) తమిళనాడు        4) మహారాష్ట్ర

10. కిందివాటిలో మెగా సిటీలో భాగం కానిది ఏది?

1)  చెన్నై        2)  ముంబయి    3)  హైదరాబాద్‌        4) కోల్‌కతా 

11. ప్రపంచంలో కుటుంబ నియంత్రణ ప్రణాళికను ప్రారంభించిన తొలి దేశం?

1) అమెరికా   2) భారత్‌   3) రష్యా   4) జపాన్‌


12. దేశంలో జాతీయ కుటుంబ నియంత్రణ ప్రణాళిక కార్యక్రమం ఎప్పుడు అమల్లోకి వచ్చింది?

1) 1951   2) 1952   3) 1953   4) 1954


13. ఆర్థిక శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ‘జనాభా విస్ఫోటన దశ’ అని ఏ స్థాయిని పిలుస్తారు?

1) మొదటిస్థాయి       2) రెండో స్థాయి   

3) మూడో స్థాయి       4) నాలుగో స్థాయి


14. జనాభా పరిణామ సిద్ధాంతం ప్రకారం ‘సమాన/ స్థబ్దత దశ’ అని ఏ స్థాయిని పిలుస్తారు?


1) మొదటి స్థాయి       2) రెండో స్థాయి   

3) మూడో స్థాయి      4) నాలుగో స్థాయి


15. 2018 జూన్‌ 26న విడుదల చేసిన జాతీయ భాషా గణాంకాల (డేటా) ప్రకారం దేశలో ఎక్కువమంది ప్రజలు మాట్లాడుతున్న భాషలను అవరోహణ క్రమంలో అమర్చండి.

a. తెలుగు     b. బెంగాలీ  

c. హిందీ      d. మరాఠీ

1) a, b, c, d            2) d, c, b, a
3) c, d, b, a           4) c, b, d, a


16. ప్రపంచవ్యాప్తంగా జనాభా పరంగా భారత్‌ ఎన్నో స్థానంలో ఉంది?

1) మొదటి స్థానం       2) రెండోస్థానం     3) మూడోస్థానం       4) నాలుగోస్థానం


17. 2011 జనాభా గణన ప్రకారం దేశంలో ఏ మతానికి చెందిన వారు అత్యల్పంగా ఉన్నారు?

1) హిందువులు     2) సిక్కులు     3) జైనులు          4) బౌద్ధులు

18. 2011 జనగణనలో అత్యల్ప వృద్ధిరేటుతో  మైనస్బ్శ్‌లో చేరిన తొలి రాష్ట్రం?

1) మేఘాలయ        2) నాగాలాండ్‌     3)  కేరళ        4) మిజోరాం

19. కిందివాటిలో అత్యధిక గ్రామీణ జనాభా శాతం ఉన్న రాష్ట్రం ఏది?

1)  ఉత్తర్‌ప్రదేశ్‌      2)  హిమాచల్‌ప్రదేశ్‌      3) తమిళనాడు         4) గోవా 

సమాధానాలు

1-1    2-1    3-3    4-2    5-4    6-3    7-3    8-2    9-4    10-1  11-2   12-2   13-2   14-1   15-4   16-2   17-3       18-2  19-2.

Posted Date : 04-12-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌