• facebook
  • whatsapp
  • telegram

శిలలు

      భూపటలానికి సంబంధించి ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన ఖనిజ నిర్మిత పదార్థాన్ని 'శిల' అంటారు. శిలతో నిర్మితమై, ఘనరూపంలో ఉండే భూమి ఉపరితలాన్ని 'శిలావరణం' (Lithosphere) అంటారు. గ్రీకు భాషలో "Lithos" అంటే 'శిల' అని అర్థం. నిర్దిష్టమైన, రసాయన సంఘటనం, క్రమబద్ధమైన అణు నిర్మాణం ఉండి, ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన అకర్బన (Inorganic) పదార్థాన్ని ఖనిజం అంటారు.
      ఖనిజాలతో ఏర్పడిన శిలలను ఖనిజనిర్మిత శిలలు అంటారు. శిలలు ఒకటి కంటే ఎక్కువ ఖనిజాలతో నిర్మితమై ఉంటాయి.

* ప్రకృతిలో లభ్యమయ్యే శిలలు రకరకాల ఆకారాలు, పరిమాణాలు, రంగుల్లో నిర్మితమై ఉంటాయి. కొన్ని శిలలు అత్యంత కఠినంగా ఉంటాయి. ఉదా: గ్రానైట్

* కొన్ని శిలలు మృదువుగా ఉంటాయి. ఉదా: జిప్సం, బంకమట్టి, సుద్ద మొదలైనవి.
 

శిలలు - వర్గీకరణ 

ఏర్పడే విధానం, భౌతిక లక్షణాల ఆధారంగా శిలలను 3 రకాలుగా వర్గీకరించారు. అవి: 1) అగ్నిశిలలు (Igneous), 2) అవక్షేప శిలలు (Sedimentary) 3) రూపాంతర శిలలు (Metamorphic).

అగ్నిశిలలు 

ఇవి అగ్ని లేదా నిప్పు వల్ల ఏర్పడ్డాయి. అందుకే వీటిని అగ్నిశిలలు అంటారు. లాటిన్ భాషలో 'Ignis' అంటే Fire అని అర్థం. భూ అంతర్భాగంలో, భూమి ఉపరితలంపై ఏర్పడిన అతి ప్రాచీన శిలలు కాబట్టి వీటిని 'ప్రథమ శిలలు' (Primary Rocks) అంటారు. భూమిపై ప్రప్రథమంగా ఏర్పడటం వల్ల 'ఆది శిలలు' అని కూడా పిలుస్తారు. ఈ శిలలు అవక్షేప, రూపాంతర శిలలకు మాతృక. అందుకే అగ్నిశిలలను 'మాతృ శిలలు' (Parent Rocks) అని కూడా అంటారు.

* భూమి అంతర్భాగంలో అత్యంత వేడిగా ఉన్న మాగ్మా అనే శిలాద్రవం, అగ్నిపర్వత బిలం ద్వారా బయటకు వచ్చి (లావా) చల్లబడి ఘనీభవించి శిలగా మారడం ద్వారా 'అగ్నిశిలలు' ఏర్పడతాయి.
 

అవక్షేప శిలలు

అవక్షేప శిలలు పొరలు పొరలుగా ఏర్పడతాయి. కాబట్టి వీటిని స్తరిత శిలలు అని కూడా అంటారు. 'స్తరం' అంటే పొర అని, 'స్తరిత' అంటే పొరలు కలిగినది అని అర్థం. వీటిని ద్వితీయ శిలలు అని కూడా పిలుస్తారు.

* భూమి మీద, భూ అంతర్భాగంలో ఏర్పడిన అగ్నిశిలలు, రూపాంతర శిలలు కొంతకాలం తర్వాత వాతావరణ ప్రభావం, గాలి, నీరు, హిమనీనదాలు మొదలైనవాటి వల్ల క్రమక్షయం చెంది, పెద్దపెద్ద శిలలు చిన్నచిన్న రేణువులుగా మారతాయి. దీన్ని 'అవక్షేపం' (Sediment) అంటారు.

* అవక్షేపం వల్ల ఏర్పడిన శిలలను అవక్షేప శిలలు అంటారు. అవక్షేపాలు అనేక రాతి పొరలుగా ఏర్పడతాయి. ఇలా రాతి పొరలుగా ఏర్పడిన శిలా భాగాలను 'స్తరిత శిలలు' అంటారు.
 

రూపాంతర శిలలు 

* రూపాంతరం అంటే 'పాత రూపం పోయి కొత్త రూపం కలగడం' అని అర్థం. గ్రీకు భాషలో 'మెటామార్ఫో' అంటే పాత రూపం పోవడం (Change of form).
* భూమి లోపల, బయట ఉన్న అగ్నిశిలలు, అవక్షేప శిలలు కొన్ని వందల సంవత్సరాల తర్వాత రూపాంతరం చెందడం వల్ల 'రూపాంతర శిలలు' అనే కొత్తరకం శిలలు ఏర్పడతాయి.

 

రూపాంతర ప్రక్రియ - రకాలు

1. ఆర్ధో మెటమార్ఫిజం: అగ్నిశిలలు రూపాంతరం చెందడాన్ని ఆర్ధో మెటమార్ఫిజం అంటారు.
2. పారా మెటమార్ఫిజం: అవక్షేప శిలలు రూపాంతరం చెందడాన్ని పారా మెటమార్ఫిజం అంటారు.
3. పాలీ మెటమార్ఫిజం: 'రూపాంతరం' చెందిన శిల మళ్లీ రూపాంతరం చెందడాన్ని పాలీ మెటమార్ఫిజం అంటారు.

 

శిలలు - లక్షణాలు (Characteristics)

అగ్నిశిలల లక్షణాలు: వీటిని ప్రథమ శిలలు, మాతృశిలలు, ఆది శిలలు అని కూడా పిలుస్తారు.
* సూక్ష్మ రేణువులు ఉండవు, స్పటికాలు ఉంటాయి.

* అగ్నిశిలలో పొరలు ఉండవు కాబట్టి వీటిని అస్తరిత శిలలుగా పిలుస్తారు.
* భూపటంలో సుమారు 90 శాతం అగ్నిశిలలు విస్తరించి ఉన్నాయి.
* అగ్నిశిలలో శిలాజాలు (Fossils) ఉండవు.
* అగ్నిశిలలు తమలో నీటిని ప్రవహించనివ్వవు.
* అగ్నిశిలల్లో బాహ్య అగ్నిశిలలు, అంతర్గత అగ్నిశిలలు అని రెండు రకాలు ఉంటాయి.
* ముద్దగా గట్టిగా కఠినంగా ఉంటాయి.
* కొన్ని శిలలు ఆమ్ల గుణాలు, కొన్ని శిలలు క్షార గుణాలను కలిగి ఉంటాయి.
* ఈ శిలల్లో దీర్ఘచతురస్రాకారంగా ఉండే పెద్దపెద్ద సంధులు ఉంటాయి.
* ఇవి దక్కన్ పీఠభూమిలో ఎక్కువ.
అవక్షేప శిలల లక్షణాలు: అగ్నిశిలలు, రూపాంతర శిలల అవక్షేపం వల్ల ఏర్పడినవి కావడంతో వీటిని అవక్షేప శిలలుగా పేర్కొంటారు.
* వీటిని ద్వితీయ శిలలు, స్తరిత శిలలు అంటారు.
* అగ్నిశిలతో పోల్చితే కాఠిన్యత తక్కువ.
* అవక్షేప శిలల కింది పొరల కంటే పైపొరలు కొత్తవిగా ఉంటాయి.

* అవక్షేప శిలలు తమ ద్వారా నీటిని ప్రవహించనిస్తాయి.
* అవక్షేప శిలల్లో శిలాజాలు (Fossils) ఉంటాయి.
* అవక్షేప శిలల్లో ముడుతలు క్రమపద్ధతిలో ఉండవు.
* జలాశయాల్లో ఏర్పడతాయి.
* హిమాలయాలు, గంగా-సింధూ మైదానాల్లో ఎక్కువ.

 

రూపాంతర శిలల లక్షణాలు: రూపాంతర శిలలు అనేవి అగ్నిశిలలు, అవక్షేప శిలల నుంచి ఏర్పడినవి కాబట్టి వీటిలో ఆ రెండు శిలల లక్షణాలూ ఉంటాయి.
* కొత్త స్పటికాల వల్ల ఈ ఖనిజాలు ఏర్పడతాయి.
* పీడనం కారణంగా ఏర్పడిన రూపాంతర శిలల్లో సంధులు, ముడుతలు ప్రధానంగా కనిపిస్తాయి. అవి క్రమపద్ధతిలో ఉండవు.
* రూపాంతర శిలల్లో లీనియేషన్, పొలియేషన్ సిస్టాసిటీ, నైసాసిటీ నిర్మాణాలు కనిపిస్తాయి.
* ముద్దగా ఉంటాయి. పొరలుగా ఉండవు.
* శిలాజాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు.
* రసాయన శిలా శైథిల్యం జరుగుతుంది.
* దక్కన్ పీఠభూమిలో ఎక్కువ.

అగ్నిశిలలు - రకాలు 

శిలలు ఏర్పడే ప్రదేశాన్ని బట్టి అగ్నిశిలలు ముఖ్యంగా రెండు రకాలు. ఎ) బాహ్య/ ఉద్గత శిలలు బి) అంతర్గత అగ్నిశిలలు.
* బాహ్య అగ్నిశిలలు: భూమి లోపలి మాగ్మా, అగ్నిపర్వత బిలం ద్వారా లావా రూపంలో భూమి ఉపరితలానికి వచ్చి చల్లబడటం ద్వారా ఏర్పడే శిలలను 'బాహ్య అగ్నిశిలలు' అంటారు.
ఉదా: బసాల్ట్, ఆండిసైట్, రాయోలైట్.
అంతర్గత శిలలు: భూమి అంతర్భాగంలోని మాగ్మా, భూమి ఉపరితలానికి వచ్చే క్రమంలో పైకి రాలేక భూ అంతర్భాగంలోనే చల్లబడి, ఘనీభవించడం ద్వారా ఏర్పడిన శిలలను 'అంతర్గత అగ్నిశిలలు' అంటారు.
* అంతర్గత శిలలను అవి ఏర్పడే ప్రదేశం, చల్లబడటానికి తీసుకునే సమయం ఆధారంగా 1) పాతాళ శిలలు 2) ఉపపాతాళ శిలలుగా వర్గీకరించారు.
పాతాళ శిలలు (Plutonic Rocks): భూమి అంతర్భాగంలో చాలా లోతులో ఏర్పడతాయి. మాగ్మా అనే శిలాద్రవం చాలా లోతులో ఉండి పైకి రాలేక నెమ్మదిగా చల్లబడి, ఘనీభవించడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. అందువల్ల అక్కడ ఏర్పడిన శిలలు పెద్దపెద్ద స్పటికాలతో ఉంటాయి. ఈ శిలలనే పాతాళ శిలలు అంటారు. గ్రీకు భాషలో "Pluto" అంటే 'పాతాళ లోకపు ప్రభువు' అని అర్థం.
ఉదా: గ్రానైట్, గాబ్రో

ఉపపాతాళ శిలలు: భూమి ఉపరితలానికి సమీప లోతులో మాగ్మా ఘనీభవించగా ఏర్పడే అగ్నిశిలలను 'ఉపపాతాళ శిలలు' అంటారు. తక్కువ లోతులో ఏర్పడటం వల్ల వీటికి ఆ పేరు వచ్చింది. భూమి లోపలి మాగ్మా ద్రవం మార్గమధ్యలో ఉన్న పగుళ్లలో ఇరుక్కుని నెమ్మదిగా చల్లబడటం వల్ల ఉపపాతాళ శిలలు ఏర్పడతాయి.



అవక్షేప శిలలు - రకాలు 

స్తరిత శిలలు ఏర్పడిన విధానాన్ని బట్టి అవక్షేప శిలలను 3 రకాలుగా వర్గీకరించారు.
        1) శకలమయ అవక్షేప శిలలు
        2) జీవసంబంధ అవక్షేప శిలలు
        3) రసాయన అవక్షేప శిలలు
శకలమయ అవక్షేప శిలలు: ఇవి కూడా మూడు రకాలుగా ఏర్పడతాయి.
ఎ) బంక మట్టి లేదా ఒండ్రు అణువులు లాంటి తేలికపాటి సూక్ష్మరేణువులతో అవక్షేప శిలలు ఏర్పడతాయి. ఉదా: షేల్ (Shale). వీటిని మృత్తికాసంబంధ శిలలు అంటారు.
బి) ఇసుక రేణువులు ఒత్తుగా మేళవించడం వల్ల వాలుకామయ శిలలు ఏర్పడతాయి. ఉదా: ఇసుకరాయి
సి) కంగ్లామరేట్: వివిధ పరిమాణాల్లో ఉన్న బొమ్మరాళ్ల మిశ్రమం సంఘటితమవడం వల్ల కంగ్లామరేట్ ఏర్పడుతుంది.

 

జీవసంబంధ లేదా కార్బనిక అవక్షేప శిలలు: జీవరాశుల అస్థిపంజరాల అవశేషాలతో ఏర్పడిన అవక్షేప శిలలను జీవసంబంధ అవక్షేప శిలలు అంటారు. జీవ ప్రక్రియల ఫలితంగా అవక్షేప శిలలు ఏర్పడితే అలాంటి శిలలను జీవ ప్రక్రియ అవక్షేప శిలలు అంటారు. భూమి లోపల లేదా భూమి మీద, సముద్రాలు, ఇతర జలాశయాల్లో పెరిగే వృక్షాలు, జంతువులు మొదలైనవి పెద్ద ఎత్తున శిథిలమైపోయినప్పుడు అవక్షేపం ఏర్పడుతుంది. ఇది జీవుల అవక్షేపం. ఈ అవక్షేపం వివిధ రకాల మూలాధారాల నుంచి ఏర్పడుతుంది.

రసాయన అవక్షేప శిలలు: రసాయన ప్రక్రియల వల్ల శిలలు శిథిలమై అవక్షేపంగా మారతాయి. భూమి పైభాగంలో శిలల పొరల్లోని రసాయనాలు అవపాతం చెందడం వల్ల లేదా నీటిలో ద్రావణ రూపంలో తేలియాడే రసాయనాలు అవపాతం చెందడం వల్ల రసాయన అవక్షేప శిలలు ఏర్పడతాయి.
* సోడియం క్లోరైడ్ ద్రావణం ఆవిరి అవడం - ఉప్పు (Table salt)
* కాల్షియం సల్ఫేట్ ద్రావణం ఆవిరి అవడం - జిప్సం.

 

రూపాంతర శిలలు - రకాలు

భూమి మీద లేదా భూమి లోపల ఉన్న అగ్నిశిలలు, అవక్షేప శిలలు మొదలైనవి ఉష్ణోగ్రత వల్ల రూపాంతరం చెందుతాయి. అధిక ఉష్ణోగ్రతలు శిలలపై ప్రభావం చూపడం వల్ల శిలల్లో ఉన్న ఖనిజాలు, స్పటికాల్లో మార్పులు వచ్చి, శిలలు రూపాంతరం చెందుతాయి.

నిర్వచనం 

భూమిపై ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన ఖనిజ నిర్మిత ఘనపదార్థాన్ని ‘శిల’ అంటారు. ప్రకృతిలో ఇప్పటి వరకు రెండు వేలకుపైగా మూలకాలను కనుక్కున్నారు. వాటిలో భూపటలంపై 50 మూలకాలు మాత్రమే ఉన్నాయి. అందులో అతిముఖ్యమైనవి 10 మాత్రమే. మూలకాల నుంచి ఖనిజాలు (Minerals) లభిస్తాయి. 

* నిర్దిష్టమైన రసాయన సంఘటనం, క్రమబద్ధమైన అణునిర్మాణం ఉండి ప్రకృతిసిద్ధంగా ఏర్పడ్డ అకర్బన పదార్థాన్ని ఖనిజం అంటారు. ఖనిజాలతో ఏర్పడ్డ శిలలను ‘ఖనిజ నిర్మిత శిలలు’ (rock Forming Minerals) అంటారు.

* ఒకే ఖనిజంతో ఏర్పడిన శిలలను ‘ఏకఖనిజ శిలలు’ అంటారు. రెండు లేదా అంతకంటే ఎక్కువ ఖనిజాలతో ఏర్పడ్డ శిలలను ‘బహు ఖనిజశిల’ అంటారు.

భూమి ఒక గ్రహం. సౌర కుటుంబ వరుస క్రమంలో మూడోది, పరిమాణంలో అయిదోది. భూమి క్రమరహితమైన దీర్ఘవృత్తాకారంలో ఉంటుంది. ఈ ఆకారాన్ని ‘‘జియోయిడ్‌’’ (Geoid) అంటారు. 

* జియోయిడ్‌ రూపంలో ఉన్న వస్తువు భూమి మాత్రమే.

* భూమి ఆవిర్భవించి 4.5 మిలియిన్‌ ఏళ్లు అయ్యింది. భూమిపై దాదాపు 3600 మిలియన్‌ సంవత్సరాల క్రితం శిలలు ఏర్పడ్డాయి. అంటే భూమి పుట్టిన 1000 మిలియన్‌ సంవత్సరాల తర్వాత శిలలు  ఆవిర్భవించాయి.

వర్గీకరణ 

స్వీడన్‌ దేశానికి చెందిన లిన్నేయస్‌ శిలావరణంపై ఉన్న శిలలను మొదటిసారి వర్గీకరించారు. 1770లో ఈయన ‘సిస్టమా నేచురే’ (Systema Naturae) అనే గ్రంథాన్ని రాశారు. అందులో వృక్షాలు, జంతువులు మొదలైన వాటిని వర్గీకరించారు. 

* లిన్నేయస్‌ తర్వాత 1787లో వెర్నర్‌ శిలల ధర్మాలు, ఖనిజ సంఘటన మొదలైన వాటిని ఆధారంగా చేసుకుని శిలలను రెండు రకాలుగా విభజించారు. అవి:

1. సామాన్య శిలలు (Simple Rocks) 

2. సంయుక్త శిలలు (Compound Rocks)

* ఈ వర్గీకరణను అనేక మంది వ్యతిరేకించారు.

పుట్టుక ఆధారంగా వర్గీకరణ: శిలలను వాటి పుట్టుక ఆధారంగా 3 రకాలుగా వర్గీకరించారు.

1. అగ్ని శిలలు  (Igneous Rocks)

2. అవక్షేప శిలలు (Sedimentary Rocks)

3. రూపాంతర శిలలు (Metamorphic Rocks)

అగ్నిశిలలు 

* ఇవి అగ్ని లేదా నిప్పు కారణంగా ఏర్పడ్డాయి. లాటిన్‌లో ఇగ్నిస్‌ అంటే అగ్ని అని అర్థం. 

* భూమి అంతర్భాగంలో ఉండే అగ్నిపర్వతాల్లో అత్యంత వేడిగా ఉండే ‘మాగ్మా’ అనే శిలాద్రవం ఉంటుంది. ఇది అగ్నిపర్వత బిలం నుంచి బయటికి వచ్చి చల్లబడి ఘనీభవించి, శిలగా రూపాంతరం చెందుతుంది. 

* భూమిపై మొదటగా ఏర్పడిన శిలలు ఇవే. వీటిని ‘ఆది శిలలు’ (Primary Rocks) అని కూడా పిలుస్తారు. 

* వీటి నుంచే అవక్షేప శిలలు, రూపాంతర శిలలు ఆవిర్భవిస్తాయి. అందుకే అగ్ని శిలలను ‘మాతృ శిలలు’ (Parent Rocks) అని కూడా అంటారు.

* ఈ శిలలు మాగ్మా ద్రవం భౌతిక, రసాయన లక్షణాలపై ఆధారపడి ఉంటాయి.

ఉదా: మాగ్మా ద్రవంలో ఆమ్ల ధర్మాలు అధికంగా ఉంటే, అగ్ని శిలల్లోనూ ఆమ్ల ధర్మాలు ఎక్కువగా ఉంటాయి. మాగ్మాలో క్షార ధర్మాలు అధికంగా ఉంటే, శిలల్లోనూ క్షార ధర్మాలే ఎక్కువగా ఉంటాయి.

వర్గీకరణ: శిలలు ఏర్పడే ప్రదేశం ఆధారంగా అగ్ని శిలలు ముఖ్యంగా రెండు రకాలు. అవి:

1) బాహ్య అగ్ని శిలలు (Extrusive Igneous Rocks)

2) అంతర్గత అగ్ని శిలలు (Intrusive Igneous Rocks)

బాహ్య అగ్ని శిలలు: అగ్ని పర్వతాల నుంచి విడుదలైన మాగ్మా శిలాద్రవం భూమి ఉపరితలానికి చేరి త్వరగా  చల్లబడటం ద్వారా ఏర్పడే శిలలను ‘‘బాహ్య అగ్ని శిలలు’’ అంటారు. ఇవి ముద్దగా ఉండవు. వీటిలో చిన్నచిన్న స్ఫటికాలు (Crystals) ఉంటాయి. 

* భూమి లోపల ఉండే శిలాద్రవాన్ని ‘మాగ్మా’ అని, ఉపరితలానికి వచ్చిన మాగ్మాను ‘లావా’ అని అంటారు. 

* ఈ శిలలు లావా కారణంగా ఏర్పడ్డాయి కాబట్టి వీటిని ‘అగ్ని పర్వతశిలలు’ (Volcanic Rocks) అని కూడా అంటారు. 

ఉదా: బసాల్ట్స్, ఆండిసైట్, రయోలైట్, అబ్సిడియన్‌.

అంతర్గత అగ్ని శిలలు: మాగ్మా భూమి ఉపరితలానికి చేరకుండా, మధ్యలోనే ఏదైనా అనుకూలమైన చోట నెమ్మదిగా చల్లారి ఘనీభవించటం ద్వారా ఇవి ఏర్పడతాయి. ఇవి ముద్దగా, పెద్దపెద్ద స్ఫటికాలుగా ఉంటాయి. 

రకాలు: అంతర్గత అగ్ని శిలలు ఏర్పడేచోటు, అవి చల్లారడానికి తీసుకునే సమయం ఆధారంగా వీటిని రెండు  రకాలుగా విభజించారు. 

I. పాతాళ శిలలు (Plutonic Rocks)

II. ఉపపాతాళ శిలలు (Hypabyssal Rocks)

పాతాళ శిలలు: ఇవి భూమి అంతర్భాగంలో చాలా లోతున ఏర్పడతాయి. భూమి ఉపరితలంపైకి రాలేని మాగ్మా లోపలి పొరల్లో ఎక్కడో నెమ్మదిగా చల్లబడి, ఘనీభవించి పాతాళ శిలలుగా రూపాంతరం చెందుతాయి.

ఉదా: గ్రానైట్, గాబ్రో, డయోరైట్, పెరిడోటైట్‌.

ఉపపాతాళ శిలలు: భూ ఉపరితలానికి రాలేని మాగ్మా ఎక్కడో ఒకచోట ఉన్న పగుళ్లలో ఇరుక్కుని చల్లబడి క్రమంగా ఘనీభవించి శిలగా మారుతుంది. ఈ శిలల్లోని స్ఫటికాలు అసంపూర్ణంగా ఉంటాయి.

ఉదా: గ్రానోఫైర్, పొరిఖరైస్, డోలరైట్‌.

* భూమి లోపల ఉన్న పగుళ్లు, రంధ్రాలు, ఖాళీ ప్రదేశాలు మొదలైనవాటి ఆధారంగా రకరకాల ఆకారాలున్న శిలలు ఏర్పడతాయి. వీటిని లాకోలిత్‌లు, బాతోలిత్‌లు, పాకోలిత్‌లు, బిస్మలిత్‌లు, నెక్‌లో, సిల్స్, డైక్స్‌ అని అంటారు. ఇవి రకాలు కాదు, రూపాలు మాత్రమే. 

* కొత్తగా ఏర్పడిన ఆకారాలు భూమి లోపల ఇదివరకే ఏర్పడి ఉన్న శిలలకు (Country Rocks) సమాంతరంగా ఏర్పడితే వాటిని అనుగతరూపాలు (Concordant) అంటారు. 

ఉదా: లాకోలిత్, లోపోలిత్, బిస్మలిత్, ఫాకోలిత్, సిల్స్‌ మొదలైనవి.

* అలాకాకుండా లంబంగా ఏర్పడితే ప్రతిగత రూపాలు (Discordant) అని అంటారు.

ఉదా: బాతోలిత్, డైక్, నెక్, స్టాక్‌ మొదలైనవి.

విస్తరణ, ఉపయోగాలు: 

* గ్రానైట్లు, డోలరైట్లు, చార్నోఖైట్స్‌ మొదలైన శిలలను భవన నిర్మాణంలో, రోడ్లు వేయడానికి ఉపయోగిస్తారు. 

* భారతదేశ ద్వీపకల్ప భాగంలో అగ్ని శిలలు ఎక్కువగా ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ మొదలైన రాష్ట్రాల్లో అగ్ని శిలలు ఎక్కువ. 

* ఈ శిలలు నీటిని పీల్చవు, తమ నుంచి నీటిని పారనీయవు. వీటిని ఉపయోగించి కట్టడాలు నిర్మించడం వల్ల అవి ఎక్కువ కాలం మన్నుతాయి. 

* ఈ శిలలకు ఉన్న స్వభావం కారణంగానే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ మొదలైన రాష్ట్రాల్లో చెరువులు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో ఇవి కొన్నిచోట్ల రూపాంతరం చెంది ఉన్నాయి.

* నల్లరేగడి నేలలు బసాల్ట్స్‌ అనే అగ్ని శిల వికోశీకరణం వల్ల ఏర్పడ్డాయి. ఈ నేలలు మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్‌  రాష్ట్రాల్లో ఎక్కువగా; ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఒక మోస్తరుగా విస్తరించి ఉన్నాయి. 

* ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో గ్రానైట్స్‌ క్రమక్షయం చెందడం వల్ల గుండ్రంగా ఉండే బండరాళ్లు ఏర్పడ్డాయి. వీటిని ‘టోర్స్‌’ అంటారు. 

* డోలిరైట్‌ అనే అంతర్గత అగ్ని శిల రాయలసీమ, రాణిగంజ్, ఝరియా మొదలైన ప్రాంతాల్లో విరివిగా విస్తరించి ఉంది. 

* తూర్పు కనుమల్లో చార్నోఖైట్‌ శిలలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి కూడా అగ్ని శిలలే అని కొందరు శాస్త్రవేత్తల భావన. అగ్ని శిలలతో, రోళ్లు, రోకళ్లు, తిరగళ్లు, పిండిరుబ్బే రోళ్లు మొదలైనవి తయారు చేస్తారు.

* అగ్నిశిలలు అచిద్ర sNon-porous) శిలలు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చోటానాగ్‌పుర్‌ పీఠభూమి ప్రాంతాల్లో ఎరుపు, తెలుపు రంగుల్లో ఉండే గ్రానైట్‌ శిలలు ఉన్నాయి. 

* అగ్ని శిలలను విగ్రహాల తయారీలో ఉపయోగిస్తారు.

                             శిలలు - లక్షణాలు

శిల పేరు   స్వభావం ఏర్పడే భూస్వరూపం
బసాల్ట్‌ ఒక మోస్తరు గట్టిగా ఉంటుంది.    a) కలమ్మార్‌ జాయింట్స్‌
ఆండిసైట్‌ గట్టిగా ఉంటుంది.   అరుదుగా కనిపిస్తుంది.
రయోలైట్‌ గట్టిగా ఉంటుంది. ఒక్కోసారి అతిగా రసాయనికంగా శైథిల్యం చెందుతుంది.   b) క్లిఫ్స్‌
గాబ్రో చాలా గట్టిగా ఉంటుంది.   ఎస్కార్ప్‌మెంట్‌
గ్రానైట్‌ ఎడారి ప్రాంతంలో ఉంటే గట్టిదనం తక్కువ, ఆర్ధ్ర ప్రాంతంలో ఉంటే గట్టిదనం ఎక్కువ. ఎక్స్‌ఫోలియేషన్‌ డోమ్స్‌

లాకోలిత్‌: లాకో (జర్మన్‌ పదం) అంటే రాయి అని అర్థం. లాకోలిత్‌ అనుగత రూపాలు. ఇవి ఇంచుమించు పుట్టగొడుగు ఆకారం కలిగి, పై భాగం ఉబ్బెత్తుగా ఉంటుంది. కొన్నిసార్లు ఇవి రకరకాల ఆకారాల్లో కూడా ఉంటాయి. భూమి లోపల చిక్కగా ఉన్న మాగ్మా ఎక్కువ దూరం ప్రవహించలేక పుట్టగొడుగు ఆకారం ఏర్పడుతుంది.  ఉదా: హెన్రీ పర్వతాలు. 

లాపోలిత్‌: లాపో అంటే జర్మన్‌ భాషలో సాసర్‌ ఆకారం అని అర్థం. ఇవి సాసర్‌ ఆకారంలో ఉండి, భూమి లోపల కొన్ని వేల కిలోమీటర్ల మేర వ్యాపించి ఉంటాయి. ఇవి అనుగత రూపాలు.

ఉదా: తమిళనాడులోని సీతంపూడి శిలాసముదాయం.

బిస్మలిత్‌: లాకోలిత్‌లపైకి భూమిలో ఉన్న మాగ్మా ఎక్కువ మొత్తంలో చొచ్చుకువచ్చి, ఒత్తిడి కలిగిస్తుంది. దీంతో లాకోలిత్‌పై భాగం మరింత ఉబ్బెత్తుగా తయారు అవుతుంది. భూమి లోపల కలిగే కొన్ని చలనాల వల్ల లాకోలిత్‌లో భ్రంశాలు (Faults), సంధులు (Joints) లాంటివి ఏర్పడతాయి. ఫలితంగా అవి అడ్డంగా విరిగినట్లు కనిపిస్తాయి. వీటిని బిస్మలిత్‌ అంటారు. ఇవి అనుగతరూపాలు.

ఫాకోలిత్‌: భూమి లోపల కలిగే భూచలనాల ఒత్తిడి వల్ల మెత్తటి శిలలు ముడతలు పడి, ఒక తరంగంలా ఉంటాయి. ఆ ముడతల్లో ఉబ్బెత్తుగా ఉన్న భాగాన్ని ‘అభినతవళి’ (Anticline) అని, తొట్టెలా ఉన్న భాగాన్ని ‘అపనతవళి’ (Syncline) అని అంటారు. మాగ్మా ద్రవం ఆ ముడతల్లో ఇరుక్కుని, దాని ఆకారంలోకి మారుతుంది. వీటినే ఫాకోలిత్‌ అంటారు. ఇవి అనుగత రూపాలు. 

సిల్స్‌/ షీట్స్‌: భూమి లోపల కొన్ని రాతి పొరలు సమతలంగా ఉండి వందలు, వేల కిలోమీటర్లు వ్యాపించి ఉంటాయి. ఇవి అవక్షేప శిలలు. మాగ్మా ద్రవం (చిక్కదనం లేని) రెండు పొరల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశంలో ఇరుక్కుని, వాటిని వేరు చేస్తుంది. ఈ మాగ్మా నెమ్మదిగా చల్లబడి, పలుచగా ఉన్న షీట్‌లాగా ఘనీభవిస్తుంది. దాన్ని ‘సిల్స్‌’ అంటారు. సన్నగా ఉన్న సిల్స్‌ను షీట్స్‌ అంటారు.

ఉదా: ఇంగ్లండ్‌లోని విన్‌ సిల్, ఆఫ్రికాలోని కరూడోలరైట్‌ సిల్‌ 

డైక్స్‌: ఇవి భూమి లోపల చాలా లోతుగా ఏర్పడతాయి. ఇవి గోడ కట్టినట్టుగా ఉండి, కొన్ని సెంటీమీటర్ల నుంచి వందల మీటర్ల వరకు వ్యాపించి ఉంటాయి. ఇవి భూగర్భజలం ఒకచోటు నుంచి మరొక చోటుకు ప్రవహించకుండా అడ్డుకుంటాయి. ఇవి ప్రతిగత రూపాలు. 

ఉదా: 1) గ్రేట్‌ డైక్‌ ఆఫ్‌ జింబాంబ్వే

2) జబల్‌పూర్‌లోని నర్మదా నదిపై దేంధారా జలపాతం వద్ద పెద్ద డైక్‌ ఉంది. 

* అగ్నిశిలలో 80 శాతం ఇసుక, 20 శాతం ఆమ్లాలు ఉంటే వాటిని ఆమ్ల శిలలు అని; 40 శాతం ఇసుక, 40 శాతం మెగ్నీషియం, 20 శాతం ఇతర క్షారాలు ఉంటే వాటిని క్షార అగ్ని శిలలు అని అంటారు.  

Posted Date : 22-10-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌