• facebook
  • whatsapp
  • telegram

సెక్రెటేరియేట్స్-డైరెక్టరేట్స్

సెక్రటేరియట్స్‌ - వివరణ

మన దేశంలో జాతీయస్థాయిలో ప్రభుత్వ విధానాల రూపకల్పనలో అత్యంత కీలక పాత్ర పోషించేవి:

1. సెంట్రల్‌ సెక్రటేరియట్‌ (కేంద్ర సచివాలయం)               2. కేబినెట్‌ సెక్రటేరియట్‌

3. ప్రధానమంత్రి కార్యాలయం (prime ministers office - PMO)

సెంట్రల్‌ సెక్రటేరియట్‌ 

* భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల సమన్వయమే సెంట్రల్‌ సెక్రటేరియట్‌. ఇది కేంద్రప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా విధులు నిర్వహిస్తుంది. 

* బ్రిటిష్‌ పాలనా కాలంలో అప్పటి గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ కారన్‌ వాలీస్‌ సెంట్రల్‌ సెక్రటేరియట్‌కి నిర్దిష్ట రూపాన్ని కల్పించారు. 

* లార్డ్‌ వెల్లస్లీ గవర్నర్‌ జనరల్‌గా ఉన్న కాలంలో దీని పరిధిని మరింత విస్తృతం చేశారు. 

* సెంట్రల్‌ సెక్రటేరియట్‌ కేంద్ర ప్రభుత్వ ప్రధాన కార్యనిర్వాహక విభాగంగా వ్యవహరిస్తుంది. ఇది జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలను సమన్వయం చేయడంతో పాటు ఆర్థిక, విదేశాంగ విధానాల రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది జారీచేసే ఆదేశాలను కేంద్రప్రభుత్వం జారీచేసే ఆదేశాలుగానే భావించాలి.

* కేంద్ర సచివాలయంలో విధులు నిర్వహించే కార్యదర్శులందరినీ భారత ప్రభుత్వానికి కార్యదర్శులుగా పరిగణిస్తారు. ఇది ఉమ్మడి యూనిట్‌గా సమష్టి బాధ్యతతో విధులు నిర్వహిస్తుంది.

టెన్యూర్‌ విధానం: సెంట్రల్‌ సెక్రటేరియట్‌లో పనిచేసే వివిధ ఉద్యోగులకు నిర్ణీత కాలపరిమితిని నిర్దేశించే సూత్రాన్ని ‘టెన్యూర్‌ విధానం’ అంటారు. 

* కేంద్రప్రభుత్వంలో ‘ఆల్‌ ఇండియా సర్వీసెస్‌’కి ప్రత్యేక కేడర్‌ లేదు. రాష్ట్ర కేడర్‌ మాత్రమే ఉంది. దీనివల్ల కేంద్రానికి కావాల్సిన ఐఏఎస్‌ అధికారులను రాష్ట్రాల నుంచి డిప్యుటేషన్‌పై బదిలీ చేస్తున్నారు. 

* ఈ విధంగా డిప్యుటేషన్‌పై బదిలీ అయిన ఉద్యోగులకు నిర్ణీత కాలపరిమితి ఉండాలని 1905లో అప్పటి గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ కర్జన్‌ ‘టెన్యూర్‌ విధానాన్ని’ ప్రవేశపెట్టాడు.

* సెంట్రల్‌ సెక్రటేరియట్‌లో పనిచేసే వివిధ అధికారులకు ప్రస్తుతం ఉన్న కనీస కాలపరిమితి కింది విధంగా ఉంది.

* అండర్‌ సెక్రటరీ - 3 ఏళ్లు

* డిప్యూటీ సెక్రటరీ - 4 ఏళ్లు

* అడిషనల్‌ సెక్రటరీ - 5 ఏళ్లు

* జాయింట్‌ సెక్రటరీ - 5 ఏళ్లు

* సెక్రటరీ - 5 ఏళ్లు

* మన దేశంలో 1948లో ‘సెంట్రల్‌ సెక్రటేరియట్‌ సర్వీస్‌’ అమల్లోకి వచ్చింది. దీనివల్ల శాశ్వత ప్రాతిపదికన కార్యదర్శుల బృందం ఏర్పడింది. అండర్‌ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీలను దీని నుంచే నియమిస్తారు.

* 1957లో ‘సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌పూల్‌’ అనే పాలనా బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో నుంచే డిప్యూటీ సెక్రటరీ, ఆపై పదవులకు ఉద్యోగులను నియమిస్తున్నారు.

* 1961లో ‘ఇండియన్‌ ఎకనామిక్స్‌ సర్వీస్‌’, ‘ఇండియన్‌ స్టాటిస్టికల్‌ సర్వీస్‌’ను ఏర్పాటు చేశారు. కేంద్ర ఆర్థిక శాఖలో ఐఏఎస్‌లకు బదులు వీరిని నియమిస్తారు.

విధులు: వివిధ మంత్రిత్వ శాఖలకు సెంట్రల్‌ సెక్రటేరియట్‌ కింది సేవలను అందిస్తోంది.

* వివిధ అంశాలకు సంబంధించిన ప్రణాళికలు, కార్యక్రమాలు రూపొందించడం.

* విధానాలను సమన్వయం చేయడం, సమీక్షించడం.

* పార్లమెంట్‌లో మంత్రులు ఇచ్చే సమాధానాలకు అవసరమైన నివేదికలు రూపొందించడం. 

* క్షేత్రస్థాయి ఏజెన్సీల ద్వారా విధానాలు, కార్యక్రమాల అమలు తీరును పర్యవేక్షించడం, సమీక్షించడం.

* మంత్రిత్వ శాఖలు, సివిల్‌ సర్వెంట్ల మధ్య సత్సంబంధాలను పెంపొందించడం.

* విధానాల అమలుకి సంబంధించి డైరెక్టరేట్స్‌కి మార్గదర్శకాలు జారీచేయడం.

కేబినెట్‌ సెక్రటేరియట్‌

* కేబినెట్‌ మంత్రులకు పరిపాలనలో సహాయ సహకారాలను, సాంకేతిక సమాచారాన్ని అందించడానికి ఇది తోడ్పడుతుంది.

* 1861లో లార్డ్‌ కానింగ్‌ వైస్రాయ్, గవర్నర్‌ జనరల్‌గా ఉన్న సమయంలో మన దేశంలో మొదటిసారి ‘పోర్ట్‌ఫోలియో’ విధానాన్ని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం వైస్రాయ్‌ కార్యనిర్వాహక మండలిలోని ప్రతి సభ్యుడికి ఒక ప్రత్యేక మంత్రిత్వశాఖ కేటాయించారు. 

* కార్యనిర్వాహక మండలి సచివాలయానికి వైస్రాయ్‌ వ్యక్తిగత కార్యదర్శి సారథ్యం వహించేవారు. వీరు కార్యనిర్వాహక మండలి సమావేశాలకు హాజరయ్యేవారు కాదు. 

* లార్డ్‌ వెల్లింగ్టన్‌ వైస్రాయ్‌గా ఉన్న కాలంలో అతడి వ్యక్తిగత కార్యదర్శి సమావేశాలకు హాజరయ్యారు. దీంతో ఈ పదవికి ప్రాధాన్యం పెరిగింది. ఇది తర్వాతి కాలంలో ‘కేబినెట్‌ సెక్రటరీ’ పదవికి మూలంగా నిలిచింది.

* మన దేశంలో కేబినెట్‌ సెక్రటేరియట్‌ ప్రధానమంత్రి ప్రత్యక్ష పర్యవేక్షణలో పనిచేస్తుంది. దీనికి పరిపాలనా అధిపతిగా కేబినెట్‌ కార్యదర్శి వ్యవహరిస్తారు. 

* 1950 నుంచి కేబినెట్‌ కార్యదర్శిని దేశంలో అత్యున్నత సివిల్‌ సర్వీసెస్‌ అధికారిగా పరిగణిస్తున్నారు. మొదటి కేబినెట్‌ కార్యదర్శిగా ఎన్‌.ఆర్‌.పిళ్లై 1950లో బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబా. ఈయన 2019 నుంచి ఈ హోదాలో ఉన్నారు.

* 1988లో కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డైరెక్టరేట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ గ్రీవెన్సెస్‌ అనే ప్రధాన విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థలపై వచ్చే ఫిర్యాదులను విచారిస్తుంది.

విధులు: పాలనా, కార్యకలాపాల నియమ నిబంధనల్లో భాగంగా 1961లో దీని విధులను రెండు రకాలుగా వర్గీకరించారు. అవి:

1. పాలనా నియమాలు అమలు చేయడం:  

i. భారత ప్రభుత్వ కార్యకలాపాల పాలనా నియమాలు - 1961 (Government of india rules business)

ii. భారత ప్రభుత్వ పోర్ట్‌ఫోలియో పాలనా నియమాలు - 1961 (Government of india allocation of rules)

2. సచివాలయ సహాయ అంశాలు:

* ప్రధానమంత్రిని సంప్రదించి కేబినెట్‌ సమావేశాల ఎజెండా రూపొందించడం.

* కేబినెట్, కేబినెట్‌ కమిటీలకు సహకరించడం.

ఇతర కీలక విధులు: 

* ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయాన్ని సాధించడం.

* విదేశాలతో కుదుర్చుకున్న ఒప్పంద విషయాలను కేబినెట్‌ ముందు ఉంచడం.

* పార్లమెంట్‌ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగించే నివేదికను కేబినెట్‌కు తెలియజేయడం.

* కేబినెట్‌లో చర్చించే సమాచారాన్ని, పత్రాలను అందుబాటులో ఉంచడం.

* కేబినెట్‌ వ్యవహారాల నిర్వహణకు అవసరమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం.

* ప్రజాసంక్షేమానికి సంబంధించి జారీచేయాల్సిన ఆర్డినెన్స్‌లను కేబినెట్‌కు తెలియజేయడం.

* ప్రభుత్వ వ్యవహారాలను వివిధ మంత్రిత్వ శాఖలకు తెలియజేయడం.

* విదేశాలకు పంపే ప్రతినిధుల బృందాన్ని రూపొందించడంలో సహకరించడం.

* పార్లమెంట్‌ను సమావేశపరచడం, వాయిదా వేయడం, రద్దు చేయడం లాంటి అంశాలకు చెందిన సమాచారాన్ని కేబినెట్‌కి తెలపడం.

* ప్రభుత్వ విధానాల రూపకల్పన, అమలులో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడం.

* కేబినెట్‌ సమావేశంలో తీర్మానించిన అంశాల ఆధారంగా రూపొందించిన పత్రాలను భద్రపరచడం.

ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ)

భారత్‌ పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తుంది. మన దేశంలో వాస్తవ కార్యనిర్వాహక అధికారాలన్నీ ప్రధానమంత్రి చేతిలోనే ఉంటాయి. ప్రధానమంత్రి దేశంలో ముఖ్య రాజకీయ కార్యనిర్వాహకుడు, ప్రభుత్వాధినేత.

* 1947, ఆగస్టు 15న ప్రధానమంత్రి సచివాలయాన్ని ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రికి రోజువారీ ప్రభుత్వ కార్యకలాపాల్లో సహకరించడం; ప్రభుత్వ విధానాల రూపకల్పనలో వివిధ మంత్రిత్వ శాఖలకు, కేబినెట్‌ సచివాలయానికి, ప్రధానమంత్రికి మధ్య సమన్వయం ఉండేలా చూడటం దీని ఉద్దేశం.

* కాలక్రమేణా ప్రధానమంత్రి ప్రాబల్యం పెరగడంతో దీని పాత్ర మరింత కీలకంగా మారింది. 

* లాల్‌బహదూర్‌ శాస్త్రి పాలనాకాలంలో ప్రధానమంత్రికి వ్యక్తిగత కార్యదర్శిగా ఆర్థికవేత్త ఎల్‌.కె.ఝా నియమితులయ్యారు. ఈయన ప్రధానమంత్రి సచివాలయాన్ని అత్యున్నత స్థాయిలో తీర్చిదిద్దారు.

* ఇందిరాగాంధీ కాలంలో కార్యదర్శిగా నియమితులైన పి.ఎన్‌.హక్సర్‌ గరీబీ హఠావో, సామ్యవాదం లాంటి విధానాల అమలులో పాలనా యంత్రాంగం మరింత సమర్థవంతంగా పనిచేసేలా చూశారు.

* మొరార్జీదేశాయ్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక 1977, జూన్‌లో ప్రధానమంత్రి సచివాలయం పేరును ప్రధానమంత్రి కార్యాలయంగా మార్చారు. వీరి హయాంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన వి.శంకర్‌ ఆదేశాలు ప్రధానమంత్రి ఆదేశాల స్థాయిలో అమలయ్యాయి. 

* ఇందిరాగాంధీ హయాంలో 1980-84 మధ్య కాలంలో కేబినెట్‌ సెక్రటేరియట్‌ కంటే ప్రధానమంత్రి కార్యాలయం శక్తిమంతంగా తయారైంది.

* పీఎంఓలో అవినీతి నిరోధక విభాగం, ప్రజా సమస్యల నివారణ యంత్రాంగం అనే రెండు విభాగాలు ఉన్నాయి. 

* రక్షణ శాఖ, విదేశీ వ్యవహారాలకు సంబంధించిన కీలకమైన అంశాలను పీఎంఓ పర్యవేక్షిస్తుంది. విదేశాల్లో భారతదేశం తరఫున రాయబారులను నియమించడం, వివిధ రాష్ట్రాలకు ప్రకటించే ప్రత్యేక ఆర్థిక సహాయం, వివిధ రాజ్యాంగ సంస్థల అధిపతుల నియామకం మొదలైన అంశాల్లో పీఎంఓ కీలకపాత్ర పోషిస్తుంది.

విమర్శ: పీఎంఓ సూపర్‌ కేబినెట్‌గా వ్యవహరిస్తుందని, ప్రభుత్వంలో ఉండే అన్ని మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పాలనా వ్యవహారాలను ఇది నిర్వహించాకే సంబంధిత మంత్రిత్వ శాఖలకు తెలుపుతుందనే విమర్శ ఉంది. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, అటల్‌ బిహారీ వాజ్‌పేయీ, నరేంద్రమోదీ పాలనా కాలంలో పీఎంఓ అపరిమితమైన అధికారాలను అన్వయించుకుంది.

డైరెక్టరేట్స్‌ 

ప్రభుత్వ విధానాలను కార్యాచరణలోకి తీసుకురావడం డైరెక్టరేట్స్‌ బాధ్యత. 

* సెక్రటేరియట్‌లోని ప్రతి శాఖకు అనుబంధంగా డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేస్తారు. 

* డైరెక్టరేట్‌కు అధిపతిగా డైరెక్టర్‌ వ్యవహరిస్తారు. వీరికి సహకరించడానికి ఇద్దరు అడిషనల్‌ డైరెక్టర్లు ఉంటారు. వీరి కింద డిప్యూటీ డైరెక్టర్లు ఉంటారు.

విధులు: 

* మంత్రిత్వ శాఖలకు సంబంధించిన బడ్జెట్‌ను రూపొందించడం, సాంకేతిక పరమైన సలహాలు ఇవ్వడం.

* నియామకాలు, పదోన్నతులు, బదిలీలకు సంబంధించిన అంశాలు పరిశీలించడం.

* ఉద్యోగులకు వృత్తిపరమైన శిక్షణా కార్యక్రమాలను నిర్వహించడం.

* శాఖాపరమైన పరిశోధన, ప్రయోగాలు చేపట్టి పరిపాలనా సామర్థ్యాన్ని పెంచడం.

* నిబంధనల మేరకు పరిపాలనా వ్యవహారాలు సాగేలా పర్యవేక్షించడం.

* వివిధ సమావేశాలకు హాజరయ్యేలా ఉద్యోగులకు అనుమతులు ఇవ్వడం.

* పదోన్నతులు, క్రమశిక్షణా చర్యలకు సంబంధించిన సూచనలతో కూడిన నివేదికలను సమర్పించడం.

* దీని అధీనంలో ఉండే ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలకు ఆదేశించడం.

* దిగువస్థాయిలో ఉండే సిబ్బంది అమలు చేస్తున్న పథకాలను పర్యవేక్షించడం.

* వివిధ రంగాలకు ప్రాధాన్యతా క్రమంలో నిధుల (Grants) మంజూరుకు సిఫార్సు చేయడం.

* ఉద్యోగుల పనితీరుకు సంబంధించిన వార్షిక నివేదికలను సమీక్షించడం.


 

Posted Date : 14-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌