• facebook
  • whatsapp
  • telegram

ఆంధ్రలో ఆత్మగౌరవ ఉద్యమాలు 

(ఆది ఆంధ్ర ఉద్యమాలు)

హక్కుల సాధనలో చైతన్య పోరాటాలు!


కులవ్యవస్థ నిర్మాణంలో అణచివేతకు గురైన వర్గాలను చైతన్యపరిచి, సామాజిక సమానత్వం సాధించే లక్ష్యంతో సాగినవే ఆత్మగౌరవ ఉద్యమాలు. అవి ఆధునిక భారతదేశ చరిత్రలో దక్షిణాదిన జరిగిన అతిపెద్ద హక్కుల పోరాటాలు. తమిళనాట బ్రాహ్మణాధిపత్యాన్ని సవాలు చేస్తూ మొదలైన ఆందోళనలు పక్కనే ఉన్న ఆంధ్ర ప్రాంతానికీ వ్యాపించాయి. ఈ క్రమంలో విద్యావంతులైన దళితుల నుంచి ఉద్యమకారులు, అభ్యుదయ రచయితలు పుట్టుకొచ్చారు. పీడిత ప్రజల హక్కుల సాధనకు గళమెత్తారు.  శక్తిమంతమైన నినాదాలు, రచనలతో అంటరానితనం, వర్ణవ్యవస్థ దురాచారాలు, కులజాడ్యాలను చీల్చిచెండాడారు. చదువుల విలువను చాటి చెప్పి సామాజిక చైతన్యానికి దోహదపడ్డారు. దళితులు ఆత్మగౌరవంతో జీవించాలనే ఆకాంక్షను రగిలించిన ఈ ఉద్యమాల గురించి పరీక్షార్థులు తెలుసుకోవాలి. ఆ పోరాటాలతో వచ్చిన రాజకీయ మార్పులు, దళిత జనోద్ధరణకు అహర్నిశలు పాటుపడిన ప్రముఖులు, వారి రచనలపై    అవగాహన పెంచుకోవాలి. 


ఆంగ్లేయుల కాలంలో బ్రాహ్మణులు దుబాసీలుగా ఉండి బ్రిటిష్‌ పరిపాలనలో ప్రధాన పాత్ర పోషించారు. వీరు ఉద్యోగాల్లోనే కాకుండా రాజకీయంగా కూడా ఆధిపత్యం పొంది, క్రమంగా స్వాతంత్య్ర ఉద్యమంలోనూ ప్రధాన పాత్ర పోషించారు. 1885లో భారత జాతీయ కాంగ్రెస్‌ స్థాపించిన తర్వాత బ్రాహ్మణేతరుల్లో చైతన్యం వచ్చి సాంఘిక ఉన్నతి కోసం ఆత్మగౌరవ ఉద్యమాలు  నడిపారు. వీరిలో ప్రముఖులు నారాయణ గురు, రామస్వామి  నాయకర్‌. ఈ ఉద్యమాల్లో భాగంగా మద్రాసు రాష్ట్రంలో వచ్చిన ఉద్యమం ఆత్మగౌరవ ఉద్యమం. ఇందులో భాగంగా స్థాపించిన పార్టీ జస్టిస్‌ పార్టీ.


జస్టిస్‌ పార్టీ: ఇది మధ్యతరగతి కుల ఉద్యమం, బ్రాహ్మణ ప్రాబల్య వ్యతిరేక ఉద్యమం. 1916, నవంబరు 20న బ్రాహ్మణేతరుల అభివృద్ధి కోసం ‘దక్షిణ భారత ప్రజల సంఘం’ అనే సంస్థ ఏర్పడింది. ఈ సంస్థ 1917లో ‘జస్టిస్‌’ పత్రికను ప్రచురించింది. అదే ఏడాది జులైలో ‘జస్టిస్‌ పార్టీ’గా ఆవిర్భవించింది. దీని గుర్తు త్రాసు. పార్టీ వ్యవస్థాపకులు సి.ఎన్‌.మొదలియార్, టి.ఎమ్‌.నాయర్, పి.త్యాగరాయశెట్టి. బ్రాహ్మణులకు వ్యతిరేకంగా స్థాపించిన మొదటి రాజకీయ పార్టీ ఇది. ద్రవిడ భాషా ఉద్యమానికి ఆద్యురాలిగానూ నిలిచింది. ఆంధ్రలో ఈ పార్టీ మొదటి సమావేశాలు 1917, అక్టోబరు 27న బిక్కవోలు వద్ద, అదే ఏడాది నవంబరు 3న పులివెందుల వద్ద జరిగాయి. పార్టీ పత్రికలు జస్టిస్, ద్రావిడియన్, ఆంధ్ర ప్రకాశిక. మాంటేగ్‌ ఛెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల ద్వారా ఈ పార్టీ లబ్ధి పొందడానికి ప్రయత్నించింది. బ్రిటిష్‌ ప్రభుత్వ పక్షం వహిస్తూ వారి చట్టాలను స్వాగతించింది. 1919 ఎన్నికల్లో పాల్గొని 98 సీట్లకు 63 సీట్లు సాధించింది. మద్రాసు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. 1921, 1937 ఎన్నికల్లోనూ విజయాలుసాధించింది.


జస్టిస్‌ పార్టీ సాధించిన విజయాలు:  ఉద్యోగ నియామకాలు కులాల ద్వారా జరిగే విధానాన్ని 1921లో జస్టిస్‌ పార్టీ తీసుకొచ్చింది. విద్యాసంస్థల్లో బ్రాహ్మణేతరులకు 50% సీట్లు కేటాయించింది. కర్మకాండలు చేసే విధానం బ్రాహ్మణులకే కాదు తమకు కూడా వచ్చని ప్రకటించిన ఆత్మూరి లక్ష్మీనరసింహం అనే వైశ్యుడు ‘సోమయాజీ’గా పేరు పొందాడు. బ్రాహ్మణేతర ఉద్యమం సాహిత్య రంగంలోనూ ప్రవేశించింది. తాపీ ధర్మారావు అధ్యక్షతన తెనాలి వద్ద బ్రాహ్మణేతరుల రచయితల సంఘం ఏర్పడింది. ‘జస్టిస్‌ పార్టీ’ చొరవతో 1926, ఏప్రిల్‌ 26న ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. దీన్ని మొదట విజయవాడలో ఏర్పాటు చేసి, తర్వాత విశాఖపట్నానికి మార్చారు. దీని మొదటి ఛాన్సలర్‌ కట్టమంచి రామలింగారెడ్డి.


జస్టిస్‌ పార్టీ పతనానికి కారణాలు: పార్టీ నాయకులకు ప్రజాబలం లేకపోవడం; ఆంధ్ర, తమిళ అనే భేదాలు రావడం ముఖ్య కారణాలు. ఈ పార్టీ స్వాతంత్రోద్యమాన్ని, ప్రత్యేకాంధ్ర ఉద్యమాన్ని బలపరచలేదు. ముఖ్య నాయకులు మరణించడంతో పార్టీ కూడా బలహీనపడిపోయింది.


ఇ.వి. రామస్వామి నాయకర్‌: బిరుదు పెరియార్‌ (పెద్దాయన). ఈయనదే ఆత్మగౌరవ ఉద్యమం. ఈయన పత్రికలు ‘కుడి అరసు’, ‘విధొతలై’. భారత జాతీయ కాంగ్రెస్‌లో సభ్యుడు. తమిళనాడులో జాతీయభావాన్ని పెంపొందించారు. తమిళ దేశంలో ఆర్యుల అధికారం చెల్లదని హెచ్చరించారు. తమిళనాడును ప్రత్యేక ద్రావిడ దేశంగా ఏర్పాటు చేయాలని కోరారు. కాంగ్రెస్‌ సమావేశాల్లో కుల ప్రాతిపదికన భోజనాలు ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకించి, ఆ పార్టీని వీడారు. పాకిస్థాన్‌ కోసం ఉద్యమిస్తున్న జిన్నాకు మద్దతిచ్చారు. ‘హిందూ - హిందీ వద్దేవద్దు’ అనే ఉద్యమం నడిపారు. రామాయణం, భగవద్గీతలను వ్యతిరేకించారు. ఆర్య సంస్కృతిని, మను సిద్ధాంతాలను తిరస్కరించారు.


ఆది ఆంధ్ర ఉద్యమాలు: రుగ్వేదంలో పదో మండలంలోని పురుష సూక్తంలో వర్ణవ్యవస్థ గురించి ఉంది. కులవ్యవస్థను వ్యతిరేకిస్తూ నిమ్నకులాల వారు అనేక ఉద్యమాలు చేశారు. వాటిలో ఆది ఆంధ్ర ఉద్యమం ఒకటి. ఈ ఉద్యమం చేసిన వారిలో పలువురు ప్రముఖులున్నారు.


1) జ్వాలా రంగస్వామి: ఈయన బిరుదు ‘ఆంధ్రమహాత్మా’, ‘సేవాదురంధర’. కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం స్వస్థలం. భార్య మంగమ్మతో కలిసి దళితుల కోసం పారిశ్రామిక శిక్షణ సంస్థను ఏర్పాటు చేశారు. వారికి   వసతి గృహాలను నిర్మించారు. ‘అంటరానివారెవ్వరు’ అనే గేయం రాశారు. ఆయన పత్రికలు ‘జైభీమ్‌’, ‘వీరభారతి’. రాసిన గ్రంథం ‘నిమ్నజాతుల వారి చరిత్ర’.


2) ఉండ్రు తాతయ్య: ఆంధ్ర పరపతి సంఘాలను  స్థాపించారు. ‘పొన్నమండ’ అనే గ్రామంలో దళితుల కోసం ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేశారు. ఇందులో  బోధించేందుకు అగ్రవర్ణ ఉపాధ్యాయులు నిరాకరించడంతో, బర్మా నుంచి ఉపాధ్యాయులను రప్పించారు.


3) అరిగె రామస్వామి: ‘సునీతా బాల సమాజం’ అనే దళిత సంఘాన్ని ఏర్పాటు చేశారు. మద్యపాన నిషేధం, జోగిని వ్యవస్థ నిషేధం కోసం ఉద్యమాలు చేశారు. ఈయనతో పాటు దళితుల కోసం ఉద్యమాలు చేసిన ప్రముఖుల్లో బొజ్జ అప్పలరాజు, వేముల కూర్మయ్య, ఎం.ఎల్‌.ఆదయ్య ఉన్నారు.


4) భాగ్యరెడ్డి వర్మ: ఈయన భాగ్యయ్యగా ప్రసిద్ధి. దళితులను పంచములుగా పిలవకూడదని, ఆది ఆంధ్రులు అనాలని పేర్కొన్నారు. ఈయన ఉద్దేశంలో దళితులే ఈ ప్రాంతపు మూలవాసులు. దళితుల్లో జనాదరణ ఉన్న కళలతో వారిలో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నించారు. హైదరాబాద్‌ నిజాంను ఒప్పించి దళితుల కోసం పాఠశాల స్థాపించారు. దళిత బాలికలను జోగిని, మాతమ్మ, దేవదాసీలుగా మార్చడాన్ని గర్హించారు. దేవదాసీలు ప్రదర్శించే ‘సదిర్‌’ నాట్యాన్ని వ్యతిరేకించారు.


రెండు దశలు: ఆది ఆంధ్ర ఉద్యమాలు దశలవారీగా  జరిగాయి.


మొదటి దశ (1917-1931): ఈ దశలో గూడూరు రామచంద్రరావు, భాగ్యరెడ్డివర్మ, చిలుకూరి వెంకటస్వామి, చుండ్రు వెంకయ్య, కుసుమ వెంకట్రామయ్య తదితర ప్రముఖులు  దళితుల విద్యావ్యాప్తి కోసం కృషిచేశారు. అనేక సదస్సులు నిర్వహించారు. ఉపాధి అవకాశాలు, రాజకీయాల్లో  రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానాలు చేశారు.


రెండో దశ (1931-1956): ఈ దశలో కాంగ్రెస్,కమ్యూనిస్టు పార్టీలు, అంబేడ్కర్, మహాత్మాగాంధీ ఈ ఉద్యమాలను నడిపారు. గాంధీజీ ‘హరిజన్‌ సేవక్‌ సంఘం’ పేరుతో దళితుల ఆలయ ప్రవేశానికి ఉద్యమం చేపట్టారు.హైదరాబాద్, విజయవాడల్లో ఈ సంఘాలు స్థాపించారు.విజయవాడలోని హరిజన్‌ సేవక్‌ సంఘం అధ్యక్షుడుకె.నాగేశ్వరరావు. గాంధీజీ 1983లో కృష్ణా జిల్లాలోని ‘సిద్ధాంతం’ గ్రామంలో దళితులను ఆలయప్రవేశం చేయించారు.


బి.ఆర్‌.అంబేడ్కర్‌: 1919లో అమెరికా నుంచి  భారత్‌కు తిరిగి వచ్చారు. దళితుల కోసం ‘ది డెవిల్‌ ఆఫ్‌ క్యాస్ట్‌’, ఇతర ఉద్యమాలెన్నో నిర్వహించారు. ‘బహిష్కృత భారత్‌’, ‘మూక్‌ నాయక్‌’ అనే పత్రికలు నడిపారు. దళితుల రాజకీయ హక్కుల కోసం ‘ఇండిపెండెంట్‌ లేబర్‌ పార్టీ’ని స్థాపించారు. హిందూ మతంలోని వర్ణవ్యవస్థను వ్యతిరేకిస్తూ కొన్ని లక్షల మందిని బౌద్ధమతంలోకి మార్చారు. దళితుల విద్యావ్యాప్తి కోసం కృషి చేశారు.


దళిత రచయితల గ్రంథాలు: వర్ణవ్యవస్థ దళితులకు విద్యను నిషేధించింది. అందుకే దాని నిర్మూలనకు దళితులు పోరాడుతున్నారు. దళితుల సమస్యలను చిత్రించిన తొలి రాజకీయ నవల ముల్క్‌రాజ్‌ ఆనంద్‌ రాసిన ‘అన్‌టచబుల్‌’. రవీంద్రనాథ్‌ ఠాకుర్‌ కూడా వర్ణవ్యవస్థ గురించి అనేక రచనలు చేశారు. కుసుమ ధర్మన్న అనే కవి అస్పృశ్యుల కష్టాల గురించి ‘మాకొద్దీ తెల్లదొరతనం’, హరిజన శతకం’ లాంటి గేయాలు రాశారు.


గుర్రం జాఘవా: ప్రసిద్ధ దళిత కవి. స్వస్థలం పల్నాడు జిల్లాలోని వినుకొండ. ఈయన బిరుదులు కవి కోకిల, నవయుగ కవి చక్రవర్తి, విశ్వకవి సామ్రాట్, కవితా విశారద. జాషువా రచించిన గ్రంథాలు గబ్బిలం, ఫిరదౌసి, ముంతాజ్‌ మహల్, క్రీస్తు చరిత్ర, అనాథ కాందిశీకులు మొదలైనవి. ఈయన పద్యకావ్యాలు కన్యకా పరమేశ్వరి, శివాజీ ప్రబంధం. గద్యకావ్యం కుశలోపాఖ్యానం.


బోయి భీమన్న: కళాప్రపూర్ణ, మహాకవి అనే బిరుదులున్నాయి. స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా. ఈయన ప్రముఖ గ్రంథాలు - ‘పాలేరు నుంచి పద్మశ్రీ వరకు’ (స్వీయచరిత్ర), గుడిసెలు కాలిపోతున్నాయి, జానపదం జవాబులు, జన్మాంతర వైరం, మానవుని మరో మజిలీ. నాటకాలు: కూలిరాజు, పాలేరు.


శ్రీశ్రీ: దళితుడు కానప్పటికీ ఈయన అట్టడుగువర్గాల సమస్యల కోసం అనేక రచనలు చేశారు. వాటిలో మహాప్రస్థానం, మరోచరిత్ర, దేశ చరిత్రలు ప్రముఖమైనవి.


రచయిత: గద్దె నరసింహారావు 

Posted Date : 15-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌