• facebook
  • whatsapp
  • telegram

మృత్తికలు

మృత్తికలు ఏర్పడే విధానాన్ని బట్టి వాటిని రెండు రకాలుగా విభజించవచ్చు. అవి

i) స్థానబద్ధ మృత్తికలు: శిలాశైథిల్యం కారణంగా ఏర్పడిన మృత్తికలు. మాతృశిలా ప్రాంతంపై నిక్షిప్తం కావడంతో ఈ మృత్తికలు ఏర్పడతాయి.

ii) సంచార లేదా నిక్షేపణ మృత్తికలు: బహిర్జనిత బలాల కారణంగా రవాణా అయ్యే ఒండ్రుమట్టి శిథిలాలు వేరొక ప్రాంతంలో నిక్షేపితం చెందడం వల్ల ఏర్పడతాయి.

ఉదా: ఒండ్రు మృత్తికలు.

మృత్తికల రకాలు 

మృత్తికల ఆవిర్భావం, రంగు, నిర్మాణం, ఉనికి ఆధారంగా మనదేశంలోని మృత్తికలను ఐసీఏఆర్‌ (ICAR) ఎనిమిది రకాలుగా విభజించింది. అవి

1) ఒండ్రు మృత్తికలు (Alluvial Soils)

2) నల్లరేగడి మృత్తికలు (Black Soils)

3) ఎర్ర మృత్తికలు (Red Soils)

4) లేటరైట్‌ మృత్తికలు (Laterite Soils)

5) ఎడారి/ఇసుక మృత్తికలు (Arid Soils)

6) ఆమ్ల/క్షార మృత్తికలు (Saline and Alkaline Soils)

7) పీటి/సేంద్రియ మృత్తికలు (Peaty Soils)

8) పర్వత ప్రాంత మృత్తికలు (Mountain type Soils)


ఒండ్రు మృత్తికలు: నదులు మెత్తని రేణుయుత అవక్షేపాలను నిక్షేపించడం వల్ల ఈ మృత్తికలు ఏర్పడతాయి. దేశ భూభాగంలో ఈ మృత్తికలు సుమారు 43.36% విస్తరించి ఉన్నాయి.

*  గంగా, సింధూ, బ్రహ్మపుత్ర మైదానాలు, తూర్పు తీర డెల్టా ప్రాంతాలు, తీర మైదానాల్లో ఒండ్రు మృత్తికలు విస్తరించి ఉన్నాయి.

* ఈ మృత్తికల్లో సున్నపు రాయి, పొటాష్, ఫాస్పారిక్‌ ఆమ్లాలు సమృద్ధిగా; నత్రజని, హ్యూమస్‌ తక్కువగానూ ఉంటాయి.

* దేశంలో అత్యధిక వ్యవసాయ దిగుబడులు ఈ మృత్తికల నుంచే వస్తున్నాయి.

* వీటిని ‘భారతదేశ ధాన్యాగారాలు’ అంటారు.


ఒండ్రు మృత్తికల్లో రకాలు:

ఎ) భంగర్‌ - ప్రాచీన కాలంలో ఏర్పడిన ఒండ్రు మృత్తికలు

బి) ఖాదర్‌ - నూతనంగా ఏర్పడిన ఒండ్రు మృత్తికలు


నల్లరేగడి మృత్తికలు: అర్ధశుష్క పరిస్థితులుండే దక్కన్‌ పీఠభూమిలో లావా, నీస్, గ్రానైట్‌ శిలలపై ఈ మృత్తికలు ఏర్పడ్డాయి.

* దక్కన్‌ నాపరాళ్ల శైథిల్యం వల్ల ఇవి ఏర్పడతాయి.

* ఈ మృత్తికలు అత్యధికంగా మహారాష్ట్రలో విస్తరించి ఉన్నాయి.

* ఇవి దేశ భూభాగంలో 15% విస్తరించి ఉన్నాయి.

* వీటిలో ఎక్కువ బంకమన్ను ఉండటంతో తేమను నిల్వ ఉంచుకునే శక్తి అధికంగా ఉంటుంది.

* వేసవి కాలంలో ఈ మృత్తికల్లో లోతైన నెర్రలు ఏర్పడతాయి. దీంతో లోపలి పొరల్లోకి వాయు ప్రసరణ జరిగి, ఈ మృత్తికలు వాతావరణంలోని నత్రజనిని స్వీకరించడానికి వీలవుతుంది. వర్షం పడగానే పైన ఉన్న మట్టి పొర/ నెర్రల్లోకి చేరుతుంది. ఇలా స్వయంగా మట్టిమార్పిడి చేసుకోవడంతో వీటిని ‘తమను తాము దున్నుకునే మృత్తికలు’ (Self Ploughing Soils) అంటారు.

* ఈ మృత్తికల్లో ఇనుము, మెగ్నీషియం, అల్యూమినియం, లైమ్, పొటాష్‌ పుష్కలంగా ఉండి ఫాస్పరస్, సేంద్రియ పదార్థం, నత్రజని లోపించి ఉంటాయి.

* ఇవి పత్తి పంటకు అత్యంత అనుకూలం.  అందుకే వీటిని 'Black Cotton Soils' అని పిలుస్తారు.

* వీటిని తెలుగు రాష్ట్రాల్లో ‘రేగర్‌/రేగడి భూములు’ అంటారు. అంతర్జాతీయంగా‘ట్రాపికల్‌ చెర్నోజోమ్స్‌’ అంటారు.

* తక్కువ సారవంతమైన నల్లరేగడి భూములను మహారాష్ట్రలో ‘చోపాన్‌’ అని పిలుస్తారు. 


ఎర్ర మృత్తికలు: తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతాల్లో స్పటికాకార రూపాంతర శిలలు శైథిల్యం చెంది, ఎర్ర మృత్తికలు ఏర్పడతాయి.

* తేమ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇవి పసుపు రంగులోకి మారుతాయి.

* ద్వీపకల్ప పీఠభూమిలోని తూర్పు, దక్షిణ భాగాల్లో ఈ మృత్తికలు ఉన్నాయి.

* ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఆరావళి పర్వత భాగం, భాగేల్‌ఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో ఎర్రమృత్తికలు అధికంగా ఉన్నాయి.

* దేశ భూభాగంలో 18.50% ఈ మృత్తికలు ఉన్నాయి.

* ఒండ్రు, నల్లరేగడి మృత్తికలతో పోలిస్తే ఎర్రమృత్తికలు తక్కువ సారవంతమైనవి.

* వీటిలో నైట్రోజన్, హ్యూమస్‌ లోపం ఉంటుంది.

* సాగులో ఎరువులను ఎక్కువగా వాడితే ఈ మృత్తికల్లో పంట దిగుబడి అధికంగా వస్తుంది.

లేటరైట్‌ మృత్తికలు: లేటరైట్‌ అంటే లాటిన్‌ భాషలో ఇటుక అని అర్థం.

* ఈ మృత్తికలు ఇటుక ఎరుపు రంగులో ఉంటాయి.

* అధిక ఉష్ణోగ్రత, అధిక వర్షపాతాలు ఒకదాని తర్వాత ఒకటి సంభవించే ప్రాంతాల్లో ఇవి ఏర్పడతాయి.

* పశ్చిమ కనుమల దక్షిణ భాగాలైన కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో 1000 - 1500 మీటర్ల ఎత్తులో; ఆరావళి పర్వతాల దక్షిణ భాగంలో; ఝార్ఖండ్‌లోని రాజ్‌మహల్‌ కొండలు, ఒడిశా, ఉత్తరాంధ్రలోని తూర్పు కనుమలు, అసోంలోని కచార్‌ కొండలు, మేఘాలయాలోని షిల్లాంగ్‌ పీఠభూమిలో ఈ మృత్తికలు ఉన్నాయి.

* ఈ మృత్తికలు తక్కువ సారవంతమైనవి, దేశ భూభాగంలో కేవలం 3.70% విస్తరించి ఉన్నాయి.

* కాఫీ, తేయాకు, జీడిమామిడి, పోకచెక్క, రబ్బరు, కొబ్బరి, సుగంధ ద్రవ్యాలు లాంటి పంటలకు ఈ నేలలు అనుకూలమైనవి.


ఎడారి, ఇసుక మృత్తికలు: శుష్క శీతోష్ణస్థితి గల ప్రాంతాల్లో యాంత్రిక శిలాశైథిల్యాలతో ఎడారి మృత్తికలు ఏర్పడతాయి.

* ఈ మృత్తికలు గాలివాలును బట్టి విస్తరిస్తూ ఉంటాయి.

* ఇవి దేశంలోని వాయవ్య ప్రాంతాల్లో, గుజరాత్‌ ఉత్తర ప్రాంతం, హరియణా రాష్ట్రాల్లో ఉన్నాయి.

* దేశ భూభాగంలో 4.42% ఉన్న ఈ మృత్తికల్లో నీటి ఎద్దడికి తట్టుకునే పంటలు సజ్జ, జొన్న, పప్పుధాన్యాలు ప్రధానంగా పండుతాయి.


ఆమ్ల/క్షార మృత్తికలు: అధిక లవణాల గాఢత వల్ల ఈ మృత్తికలు ఏర్పడతాయి.

* ఈ మృత్తికల్లో పొటాషియం, సోడియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. అందువల్ల ఇవి వ్యవసాయానికి అనుకూలమైన భూములు కావు.

* ఇవి వాయవ్య గంగామైదాన ప్రాంతం, గుజరాత్‌లోని కచ్‌ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి.

* వ్యవసాయానికి పనికిరాని ఈ భూములను రే/ కల్లార్‌/ ఊసర మృత్తికలు అంటారు.


 పీటి (లేదా) సేంద్రియ మృత్తికలు: వీటినే ‘ఊబి నేలలు’ అంటారు.

* జీవ సంబంధ పదార్థం ఎక్కువగా సంచయనం అయితే ఈ మృత్తికలు ఏర్పడతాయి.

* ఇవి తేమ, బురదతో కూడి ఉండటంతో వరి సాగుకు అనుకూలం.

* ఈ మృత్తికలు బిహార్‌ ఉత్తర ప్రాంతాలు, పశ్చిమ్‌ బంగ, ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లా, తమిళనాడు తీరప్రాంతాలు, కేరళలోని అలప్పూజ, కొట్టాయం జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి.

* కేరళలో వీటిని ‘కరి మృత్తికలు’ అంటారు.


పర్వత ప్రాంత మృత్తికలు: ఈ మృత్తికలు దేశ భూభాగంలో 7.25% ఉన్నాయి.

* అధిక వర్షపాతం పొందే పర్వత ప్రాంత వాలుల్లో ఈ మృత్తికలు ఏర్పడతాయి.

* వీటిలో హ్యూమస్‌ పుష్కలంగా ఉంటుంది.

* ఇవి తక్కువ పరిణతి చెందిన మృత్తికలు. తోట పంటలకు, సుగంధ ద్రవ్యాల పెంపకానికి ఇవి అనుకూలం.


భారత వ్యవసాయ పరిశోధన సంస్థ

భారతదేశంలో వ్యవసాయంపై పరిశోధనలు చేసేందుకు 1929 జులై 16న భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రిసెర్చ్‌ - ICAR (Indian Council of Agricultural Research)) ను స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం న్యూదిల్లీలో ఉంది. ఈ సంస్థ ప్రస్తుత ఛైర్మన్‌ డా.త్రిలోచన్‌ మహాపాత్ర.


నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ సాయిల్‌ సర్వే అండ్‌ ల్యాండ్‌ యూజ్‌ ప్లానింగ్‌ (NBSS & LUP)

మృత్తికల పరిశోధనల కోసం ICAR  ఆధ్వర్యంలో నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ సాయిల్‌ సర్వే అండ్‌ ల్యాండ్‌ యూజ్‌ ప్లానింగ్‌ (The National Bureau of Soil Survey and Land Use Planning) సంస్థను 1976లో ఏర్పాటు చేశారు.


మృత్తికల రకాన్ని ప్రభావితం చేసే అంశాలు

1) మాతృశిల     2) భౌతిక స్వరూపం       3)శీతోష్ణస్థితి     

4) సమయం         5) జీవసంబంధ కారకాలు


1. మాతృశిల: మృత్తికల రకాన్ని ప్రభావితం చేసే అతి ముఖ్యమైన అంశం మాతృశిల. ప్రత్యేకించి స్థిరమృత్తికలు వీటిపై ఆధారపడతాయి.

ఉదా: పురాతన స్పటికాకార, రూపాంతర శిలలు ఉన్న చోట ఎర్రమృత్తికలు ఏర్పడతాయి.


2. భౌతిక స్వరూపం: భూభాగపు భౌతిక స్వరూపం మృత్తికల రకాన్ని ప్రభావితం చేస్తుంది. వాటిలో వాలు, ఎత్తు, లోతు ప్రధానమైనవి.

* వాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో క్రమక్షయం జరగడం వల్ల కందర భూములు (Ravine Lands) ఏర్పడతాయి.

* ఎక్కువ ఎత్తు కలిగిన ప్రాంతాల్లో విక్షాళన (Leaching) ప్రక్రియతో లేటరైట్‌ మృత్తికలు ఏర్పడతాయి.

* లోతుగా ఉన్న ప్రాంతాల్లో నిక్షేపణ వల్ల ఒండ్రు మృత్తికలు ఏర్పడతాయి.


3. శీతోష్ణస్థితి: శిలాశైథిల్యాన్ని, జీవరాశుల మనుగడను శీతోష్ణస్థితి ప్రభావితం చేస్తుంది. స్పటికాకార గ్రానైట్‌ శిలలు ఎక్కువగా ఉన్న రాజస్థాన్‌లో ఇసుక మృత్తికలు ఏర్పడ్డాయి. ఇవే శిలలు కర్ణాటకలో లేటరైట్‌ మృత్తికలుగా ఆవిర్భవించాయి.


4. సమయం: మృత్తికల ఏర్పాటులో సమయం ప్రధాన పాత్ర పోషిస్తుంది. 

* సమశీతోష్ణ ప్రాంతాల్లో 1 సెం.మీ. మందం ఉన్న మృత్తిక ఏర్పడటానికి 200 - 400 ఏళ్ల సమయం పడుతుంది.

* వ్యవసాయానికి అనువైన లోతు గల మృత్తికలు ఏర్పడటానికి దాదాపు 3 వేల ఏళ్ల సమయం పడుతుంది.


5. జీవ సంబంధ కారకాలు: సహజ వృక్ష సంపద అధికంగా ఉన్న ప్రాంతాల్లో ‘హ్యూమస్‌’ ఏర్పడుతుంది. ఈ హ్యూమస్‌ మృత్తికల్లో సారాన్ని పెంచుతుంది.

*******************

భూమిపై జరిగే శిలాశైథిల్యం, జంతు, వృక్ష సంబంధ పదార్థాలు కాలక్రమంలో అనేక భౌతిక, రసాయనిక మార్పులకులోనై  వివిధ పరిణామాలు చెందుతూ ఏర్పడే సున్నితమైన పదార్థాన్ని ‘మృత్తిక’ అంటారు లేదా భూ ఉపరితలంపై కర్బన, అకర్బన పోషకాలతో కూడి, వదులుగా ఉండే పొర/ నేలనే ‘మృత్తిక’ అంటారు.


* మృత్తిక ఏర్పడటానికి ఆధార శిల అవసరం.

* మృత్తికల భౌతిక, రసాయనిక ధర్మాలను లేదా నేలల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మృత్తికా శాస్త్రం (Pedology) అంటారు.

* మృత్తికలు సాధారణంగా 5 రకాల కారణాల వల్ల ఏర్పడతాయని రష్యా మృత్తికా శాస్త్రవేత్త డాకు చాయెల్‌ పేర్కొన్నారు.

అవి:

1. మాతృ శిలలు

2. స్థానిక శీతోష్ణస్థితి

3. వృక్ష సంబంధ పదార్థాలు 

4. నైసర్గిక స్వరూపం

5. నేల వయసు
 

* సాధారణంగా క్షారనీయతలోని లవణాలను pH విలువలతో కొలుస్తారు.  తటస్థ నేల pH విలువ 6.5 నుంచి 7.5 వరకు ఉంటుంది.

* pH విలువ 7 కంటే తక్కువగా ఉన్న నేలలను ఆమ్ల నేలలు,  7 కంటే ఎక్కువగా ఉన్న నేలలను క్షార నేలలు/ లవణీయత ఉన్న నేలలు/ చవుడు నేలలు అని పిలుస్తారు.

మృత్తికలను ఏర్పడే విధానాన్ని బట్టి 2 రకాలుగా వర్గీకరించవచ్చు


1. స్థానబద్ధ మృత్తికలు (Sedentary Soils)

* శిలా శైథిల్యం కాగా, ఆ మాతృశిలపైనే ఏర్పడిన మృత్తికలను స్థానబద్ధ మృత్తికలు అంటారు.

ఉదా: నల్లరేగడి నేలలు, లేటరైట్‌ నేలలు, ఎర్ర నేలలు


2. నిక్షేపిత/ పరస్థానీయ మృత్తికలు (Drift/ Transported Soils)

* బహిర్జనిత బలాల కారణంగా శిథిలాలు రవాణా అయి వేరొకచోట నిక్షేపితం చెందడం వల్ల ఏర్పడే నేలలు.

ఉదా: ఒండ్రు మట్టి నేలలు

* ఓల్కర్‌ అనే శాస్త్రవేత్త మృత్తికలను నాలుగు రకాలుగా వర్గీకరించాడు. 

1. ఒండ్రు నేలలు

2. నల్లరేగడి నేలలు

3. ఎర్ర నేలలు

4. జేగురు నేలలు (లేటరైట్‌ నేలలు)


* భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ (ICAR - Indian Council for Agricultural Research) భారతదేశంలో నేలలను 8 రకాలుగా వర్గీకరించింది.

1. ఒండ్రు నేలలు

2. నల్లరేగడి నేలలు

3. ఎర్ర నేలలు

4. లేటరైట్‌ నేలలు

5. క్షార నేలలు

6. పర్వత ప్రాంత నేలలు

7. ఎడారి/ఇసుక నేలలు

8. పీట్‌/సేంద్రియ నేలలు

ఒండ్రు నేలలు/ డెల్టా నేలలు

* నదులు మెత్తని రేణుయుత అవక్షేపాలను నిక్షేపించడం వల్ల ఏర్పడతాయి.

* ఇవి అత్యంత సారవంతమైన, ఉత్పాదకత కలిగిన నేలలు.

* దేశం మొత్తం భూభాగంలో సుమారు 23 - 40 శాతం ఆక్రమించి ఉన్నాయి.

ఉదా: గంగా - సింధు డెల్టా, కృష్ణా డెల్టా, గోదావరి డెల్టా, మహానది డెల్టా

* దేశ వ్యవసాయ సంపదలో అధికభాగం ఒండ్రు మృత్తికల నుంచే లభిస్తోంది.

* ఈ మృత్తికల్లో అన్ని రకాల పంటలు పండుతాయి.

ఉదా: వరి, గోధుమ, పప్పు ధాన్యాలు, నూనె గింజలు, పత్తి, జనుము
 

ఎర్రనేలలు

* పురాతన అగ్నిశిలలు, స్ఫటికాకార రూపాంతర ప్రాప్తి శిలలు తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతాల్లో శైథిల్యం చెందడం వల్ల ఎర్రనేలలు ఏర్పడతాయి.

* ఇవి ఎరుపు వర్ణంలో ఉండటానికి ప్రధాన కారణం ఆ మృత్తికల్లోని ఫెర్రస్‌ ఆక్సైడ్‌.

* ఇవి తేలికపాటి వయనంతో సచ్చిద్రంగా, సులభంగా చూర్ణమయ్యే విధంగా ఉంటాయి.  గాలి పారేలా ఉంటాయి.

* ఇవి దేశ విస్తీర్ణంలో అత్యధికంగా దాదాపు 29% ఆక్రమించి ఉన్నాయి.

* ఇవి దక్షిణ భారతదేశంలో అధికంగా; ఆగ్నేయ మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి.

* వీటిలో పొటాషియం అధికంగా, నైట్రోజన్, ఫాస్ఫ్రస్, హ్యూమస్‌ తక్కువగా ఉంటాయి.

* ఈ మృత్తికల్లో నీరు తొందరగా ఇంకిపోతుంది. కాబట్టి నీటిపారుదల సౌకర్యాలు, ఎరువుల ఉపయోగం ద్వారా అన్ని రకాల పంటలు పండించవచ్చు.  చిరుధాన్యాల ఉత్పత్తికి ఈ నేలలు బాగా అనుకూలం.

* నీటిపారుదల లేనిచోట వేరుశనగ, ఆముదాలు లాంటి నూనెగింజలను పండించవచ్చు.
 

లవణ మృత్తికలు లేదా క్షారమృత్తికలు

* ఇవి సారవంతమైనవి కావు.  దేశ భూభాగంలో సుమారు 1.29% విస్తరించి ఉన్నాయి.

* ఉత్తర భారతదేశంలోని పొడి ప్రాంతాల్లో ఈ నేలలు ఎక్కువ.

* వీటిని వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు.

ఉదా: రేహ్, కల్లార్, యుసర్, దుర్గ్, కార్ల్, షోపాన్‌ మొదలైనవి.

* ఇవి పంటలు పండించడానికి అనుకూలమైనవి కావు.

ఎడారి నేలలు/ఇసుక నేలలు

* ఇవి అధిక లవణీయత లేదా క్షారత్వాన్ని కలిగి ఉంటాయి.

* జిప్సంను కలపడం ద్వారా ఈ నేలలను కొంతవరకు సారవంతంగా మార్చవచ్చు.

* దేశ భూభాగంలో సుమారు 8.46% విస్తరించి ఉన్నాయి.

* దేశ పశ్చిమ ప్రాంతంలో ప్రధానంగా రాజస్థాన్, పంజాబ్, హరియాణాలలో విస్తరించి ఉన్నాయి.

* నీటిపారుదల ద్వారా బార్లీ, పత్తి, చిరుధాన్యాలను పండించవచ్చు.
 

పీట్‌/ సేంద్రియ నేలలు

* ఇవి నల్లని, బరువైన మృత్తికలు.

* ఈ నేలల్లో నీరు ప్రవహించకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండటం వల్ల అవి తేమ, బురదను కలిగి నల్లని రంగును సంతరించుకుంటాయి.

* ఇవి అత్యధిక సేంద్రియ పదార్థాలను కలిగి ఉన్నప్పటికీ సాగుకు అనుకూలం కాదు.

* ఇవి అత్యధికంగా కేరళ, ఉత్తరాఖండ్‌లోని అల్మోరా ప్రాంతం, పశ్చిమ్‌ బంగా, ఒడిశాల్లో విస్తరించి ఉన్నాయి.

* కేరళలో వీటిని కరినేలలు అనిపిలుస్తారు.
 

మృత్తికా క్రమక్షయం
* నదులు, వర్షాలు, వరదలు, గాలి లాంటి సహజ కారణాల వల్ల మెత్తని, సారవంతమైన మృత్తిక పైపొర కొట్టుకుపోవడాన్ని మృత్తికా క్రమక్షయం అంటారు.

మృత్తికా క్రమక్షయం వల్ల జరిగే ముఖ్య పరిణామాలు
1. ఎడారిగా మారడం
2. జలాశయాల్లో పూడిక చేరడం
3. మృత్తికలు సారాన్ని కోల్పోయి నిస్సారంగా మారడం.
* మన దేశంలో సుమారు 175 మిలియన్ హెక్టార్లలో జరిగే ఈ క్రమక్షయం వల్ల ఏటా సుమారు 6,000 మి.‌ట.  మృత్తికలు అంటే సగటున ప్రతి హెక్టారుకు 16.4 టన్నులకు పైగా మృత్తిక కొట్టుకుపోతుంది.
* ఫలితంగా కలిగే పోషక పదార్థాల నష్టం భూమిలోవాడే ఎరువుల కంటే అధికంగా ఉంటుంది.
* ఇది ఏటా సుమారు 30 నుంచి 50 మి.ట. ల పంట నష్టాన్ని కలిగిస్తుంది.
* ఈ క్రమక్షయం ఫలితంగా నదులు, జలాశయాలు ఏటా 1% నుంచి 2% వరకు తమ నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయి, పూడుకుపోతున్నాయి.

 

మృత్తికా క్రమక్షయం మూడు రకాలు
1) పట క్రమక్షయం
2) వంక క్రమక్షయం
3) అవనాళికా క్రమక్షయం

 

పర్వత మృత్తికలు
* ఇవి పూర్తిగా పరిణతి చెందని మృత్తికలు.
* తక్కువ సారవంతమైనవి. 
* ఇవి దేశ భూభాగంలో సుమారు 10.64% వరకు విస్తరించి ఉన్నాయి.
* ఎక్కువగా పంజాబ్, కర్ణాటక, జమ్మూకశ్మీర్, మణిపూర్, నీలగిరి ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి.
* ప్రధానంగా పండ్ల తోటలు, కాఫీ, తేయాకు, క్యాబేజీ, రబ్బరు, బంగాళదుంపలు పండిస్తారు.

 

నల్లరేగడి మృత్తికలు
* అర్ధశుష్క పరిస్థితులు ఉండే దక్కన్‌ పీఠభూమి ప్రాంతంలో లావా, నీస్, గ్రానైట్‌ శిలలు లేదా బసాల్ట్‌ అగ్నిశిలలు శైథిల్యం చెందడం వల్ల ఏర్పడతాయి.
* ఇవి అమెరికాలోని ప్రయరీ ప్రాంతంలో ఉన్న చెర్నోజమ్‌ నేలలను పోలి ఉండటం వల్ల చెర్నోజమ్‌ నేలలని పిలుస్తారు.
* వేసవిలో ఈ నేలల్లో పగుళ్లు ఏర్పడి, ఆ పగుళ్లలోకి పైనున్న మెత్తని మట్టి జారి వర్షాకాలంలో వాటంతటవే జిగటగా మారిపోవడం వల్ల తమను తామే దున్నుకునే నేలలు (Self Ploughing Soils) అని కూడా పిలుస్తారు.
* బంకమన్ను ఉండటం వల్ల తేమను నిలుపుకునే సామర్థ్యాన్ని అధికంగా కలిగి ఉంటాయి.  దేశ విస్తీర్ణంలో సుమారు 24% ఆక్రమించి ఉన్నాయి.
* దీనిలో సేంద్రియ పదార్థాలు, నైట్రోజన్, ఫాస్ఫరస్‌ తక్కువగా ఇనుము, పొటాష్, సున్నం అధికంగా ఉంటాయి.
* ఈ నేలలు పత్తిపంటకు ప్రసిద్ధి. దీనితోపాటు పొగాకు, మిరప, నూనెగింజలు, చెరకు మొదలైనవి పండుతాయి.
* ప్రధానంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, తెలంగాణలలో విస్తరించి ఉన్నాయి.

లేటరైట్‌ నేలలు/జేగురు నేలలు
* అధిక ఉష్ణోగ్రత (అనార్ద్ర), అధిక వర్షపాత (ఆర్ద్ర) శీతోష్ణస్థితి పరిస్థితులు ఏకాంతరంగా ఉండే పర్వతశిఖర, పీఠభూమి ప్రాంతాల్లో ఈ నేలలు ఏర్పడతాయి.
* వీటిని మొదటగా జార్జ్‌ బుకానన్‌ అనే శాస్త్రవేత్త మలబార్‌ తీరంలో గుర్తించాడు.
* ఈ నేలలు ప్రధానంగా సహ్యాద్రి పర్వత ప్రాంతాల్లో (పశ్చిమ కనుమల ప్రాంతం); కేరళ, కర్ణాటక, తమిళనాడు; తూర్పు కనుమల ప్రాంతాల్లోని ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో కొన్ని ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి.
* ఇవి దేశ విస్తీర్ణంలో సుమారు 4.30% ఆక్రమించి ఉన్నాయి.
* ఈ నేలలో ఆమ్లత ఎక్కువగా ఉంటుంది. ఇవి తక్కువ సారవంతమైన నేలలు.
* ఈ మృత్తికలు తేనెపట్టులోని బుడిపెల మాదిరి ఇనుప ఆక్సైడ్‌లను కలిగి ఉంటాయి. సాధారణ సమయంలో ఎరుపు వర్ణంలో ఉండే ఈ నేలలు వర్షానికి తడిసినప్పుడు నల్లగా మారతాయి.
* ఈ నేలలు తేయాకు, కాఫీ, జీడిమామిడి, కొబ్బరి, రబ్బరు లాంటి తోట పంటలకు అనుకూలం.

Posted Date : 25-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌