• facebook
  • whatsapp
  • telegram

రాతియుగం - మానవ పరిమాణం 

కొన్ని బిలియన్‌ సంవత్సరాల క్రితం భూమి చాలా వేడిగా ముద్దలా ఉండేది. ఒక పెద్ద పేలుడు సంభవించడం వల్ల కణాలు, అణువులు, నక్షత్రాలు, గెలాక్సీలు ఏర్పడ్డాయని; దీని నుంచి భూమి ఉనికిలోకి వచ్చిందని శాస్త్రవేత్తల అభిప్రాయం. కాలక్రమంలో విశ్వం విస్తరించి, ఉష్ణోగ్రత తగ్గింది. ఆ కాలంలో భూమిపై వాతావరణం లేదు, దీన్ని ‘బిగ్‌ బ్యాంగ్‌ థియరీ’ అంటారు. ఈ సిద్ధాంతం విశ్వం మూలం గురించి వివరిస్తుంది.

 కెనడియన్‌ శాస్త్రవేత్తల ప్రకారం, కాల క్రమంలో భారీ నక్షత్రం కూలిపోవడం వల్ల విశ్వం ఏర్పడింది.

 బిలియన్‌ సంవత్సరాలపాటు మహాసముద్రాల్లో సేంద్రియ రసాయనాల కలయికతో జీవం ఏర్పడింది. సేంద్రియ రసాయనాల నుంచి ఏకకణ జీవులు ఆవిర్భవించాయి. వాటి నుంచి జలచరాలు; వాటి నుంచి నాలుగు అవయవాల జంతువులు; వాటి నుంచి క్షీరదాలు; వాటి నుంచి ప్రైమేట్లు (Primates) వాటి నుంచి మానవులు వచ్చారు.

* ఆధునిక మానవుల ఆవిర్భావానికి కారణమైన శరీర నిర్మాణ ప్రక్రియను మానవ పరిణామం అంటారు. ఇది శరీర నిర్మాణశాస్త్రం, అభివృద్ధి, శరీరధర్మశాస్త్రం, ప్రవర్తన ఆధారంగా అనేక మార్పులకు గురైంది. అవి: కాళ్లపై నడవడం, మెదడు పరిమాణం పెరగడం, సుదీర్ఘమైన గర్భావధి కాలం, బాల్యం, లైంగిక ప్రత్యుత్పత్తి. ఇవేకాకుండా అనేక ఇతర మార్పులు కూడా మానవ పరిణామంలో భాగంగా ఉన్నాయి.

* భూమిపై వివిధ రకాల క్షీరదాలు, జంతువులు ఉన్నాయి. ఇది విభిన్న పరిణామం, వీటిని హోమోలాగ్స్‌ అంటారు.

* భూమిపై అనేక మార్పుల తర్వాత డ్రైయోపిథికస్‌ (కోతి లాంటిది), రామపిథికస్‌ (మనిషి లాంటిది) అనే ప్రైమేట్స్‌ ఉనికిలోకి వచ్చాయి. వీటి ఆధారాలను ఇథియోపియా, టాంజానియాలో కనుక్కున్నారు. 

* ప్రైమేట్స్‌ లాంటి మనిషి ఆనవాళ్లను తూర్పు ఆఫ్రికాలో కనుక్కున్నారు. వీరు నాలుగు అడుగుల ఎత్తు  ఉండేవారు. వేటకు రాతి ఆయుధాలను వినియోగించారు, పండ్లు తినేవారు.

* హోమినిడ్‌ లాంటి మొదటి మానవుడ్ని హోమో హబిలిస్‌ (చేతిని ఉపయోగించే మనిషి) అని పిలిచేవారు. వీరు రెండు మిలియన్‌ సంవత్సరాల క్రితం భూమిపై ఉన్నారని శాస్త్రవేత్తల అభిప్రాయం. వీరి ఆనవాళ్లు కెన్యాలోని కూబిఫోరా, టాంజానియాలోని ఓల్డువై జార్జ్‌ ప్రాంతాల్లో లభించాయి.

* సుమారు 2.5 మిలియన్‌ సంవత్సరాల క్రితం ఉపయోగించిన తొలి రాతి ఉపకరణాలను ఇథియోపియాలోని హదర్‌ వద్ద కనుక్కున్నారు.

* హోమో సెపియన్స్‌గా పిలిచే ఆధునిక మానవులను జ్ఞానం కలిగిన లేదా తెలివైన మనిషిగా పేర్కొంటారు. వీరి మెదడు ఆకారంలో పెద్దగా ఉంటుంది. సమాజంలో నివసిస్తూ, ఇతరులతో సామాజిక పరస్పర చర్యలను నిర్వహిస్తారు.

* హోమో సెపియన్‌ అనేది లాటిన్‌ పదం, దీని అర్థం ‘ఆలోచించే మనిషి’.


శాస్త్రవేత్తల రచనలు

* చార్లెస్‌ లయెల్‌ (Charles Lyell) 1830-33 మధ్యకాలంలో ‘ప్రిన్సిపుల్స్‌ ఆఫ్‌ జియాలజీ’ అనే గ్రంథాన్ని రచించారు. అందులో భూమి ఉపరితలంపై పూర్వం జరిగిన మార్పులను వివరించారు. ఇందులోని అంశాలు డార్విన్‌ను ప్రభావితం చేశాయి.

* చార్లెస్‌ డార్విన్‌ 1859లో ‘ఆరిజన్‌ ఆఫ్‌ స్పీసిస్‌’ అనే గ్రంథాన్ని ప్రచురించారు. అందులో ఆయన అన్ని రకాల జీవుల పరిణామం సహజ ఎంపిక ద్వారా జరుగుతుందని  వివరించారు. కొత్త జాతుల దత్తత, సహజ ఎంపిక ప్రక్రియ ఫిట్టెస్ట్‌ మనుగడకు ఎలా దారితీసింది అనే విషయాలను కూడా ఆయన అందులో పేర్కొన్నారు. దీన్నే ‘డార్విన్‌ పరిణామ సిద్ధాంతం’ అంటారు.

* థామన్‌ హెన్రీ హక్స్‌లీ 1863లో రచించిన ‘ఎవిడెన్స్‌ టు మ్యాన్స్‌ ప్లేస్‌ ఇన్‌ నేచర్‌’ ద్వారా ‘డార్విన్‌ పరిణామ సిద్ధాంతాన్ని’ మరింత విస్తరింపజేశాడు.

* కార్ల్‌ లిన్నేయస్‌ తన ‘సిస్టమా నేచురే’ (Systema naturae)లో ఆధునిక మానవులను హోమో సెపియన్స్‌ అనే జాతులుగా వర్గీకరించాడు. మొదటి జీవన సమూహాలను ఏప్స్, గిబ్బన్స్, ఒరాంగుటాన్స్‌గా పేర్కొన్నాడు. తర్వాతివి గొరిల్లాలు, చింపాంజీలు. కాలక్రమంలో అనేక పదనిర్మాణ (Morphological), అభివృద్ధి, శారీరక (Physiological), ప్రవర్తనా మార్పుల (Behavioral changes) వల్ల  మానవ పరిణామక్రమం జరిగిందని అభిప్రాయపడ్డారు.

రాతి యుగ సంస్కృతులు (Stone Age Cultures)

* ఈ కాలంలో మానవుడు రాతి పనిముట్లను ఉపయోగించాడు. అందుకే దీన్ని ‘శిలాయుగం’ అంటారు.

* 19వ శతాబ్దం ప్రారంభంలో డానిష్‌ చరిత్రకారులైన పి.ఎఫ్‌.సుహ్మ్, క్రిస్టియన్‌ థామ్సన్‌లు ‘టూల్‌ మేకింగ్‌’ని వ్యాప్తిలోకి తెచ్చారు. రాతియుగం సంస్కృతిని ‘టూల్‌ మేకింగ్‌’ ఆధారంగా మూడు దశలుగా విభజించారు. అవి: రాతి పనిముట్ల యుగం (Stone age), కాంస్య యుగం (Bronze age), ఇనుప యుగం (Iron age). 

* బ్రిటన్‌కు చెందిన జాన్‌ లుబ్బాక్‌ 1863లో రాతి యుగాన్ని పాలియోలిథిక్, నియోలిథిక్‌ అనే రెండు భాగాలుగా విభజించారు. 

* కొన్ని సంవత్సరాల తర్వాత ఫ్రెంచ్‌కు చెందిన ఎడ్వర్డ్‌ లార్టట్, జంతు జాలంలో మార్పులు, సాధనాల తయారీ సంప్రదాయాలు, రాతి యుగంలో జీవనాధార పద్ధతుల ఆధారంగా పాలియోలిథిక్‌ను (పాతరాతియుగం) లోయర్, మిడిల్, అప్పర్‌ పాలియోలిథిక్‌గా విభజించారు.

* బ్రిటిష్‌ పురావస్తు శాస్త్రవేత్త రాబర్ట్‌ బ్రూస్‌ ఫుట్‌ 1863లో భారతదేశంలో మొదటిసారి పురావస్తు సర్వే ప్రారంభించాడు. అతడు అప్పటి మద్రాస్‌లోని పల్లవరంలో పాలియోలిథిక్‌కు చెందిన చేతి గొడ్డలిని కనుక్కున్నాడు.

* భౌగోళిక వయసు, రకం, రాతి పనిముట్లు, జీవనాధార నమూనా ఆధారంగా భారతీయ రాతి యుగాన్ని మూడు దశలుగా వర్గీకరించారు. అవి:

పాలియోలిథిక్‌ ఏజ్‌ (పాతరాతియుగం)

 మెసోలిథిక్‌ ఏజ్‌ (మధ్యరాతి యుగం)

 నియోలిథిక్‌ ఏజ్‌ (కొత్తరాతి యుగం)

ప్రాక్‌ చరిత్ర - చారిత్రక పూర్వ యుగం (Pre and Proto History)

* మానవ పరిణామానికి సంబంధించి రాతపూర్వక ఆధారాలు లేదా రికార్డులు లేని కాలాన్ని పూర్వ చరిత్ర యుగం అంటారు. ఇది భారత ఉపఖండంలోని తొలి మానవ ఆవాసాల నమూనాలు ఎలా ఉన్నాయో తెలియజేస్తుంది.

* పూర్వ చరిత్ర కాలంలో సంస్కృతి, నాగరికత అభివృద్ధి చెందలేదు. ఇది రచన, ఆవిష్కరణకు ముందు జరిగిన అన్ని సంఘటనలను తెలియజేస్తుంది. ఉదాహరణకు మూడు రాతి యుగ సంస్కృతులు (పాలియోలిథిక్‌ ఏజ్, మెసోలిథిక్‌ ఏజ్, నియోలిథిక్‌ ఏజ్‌) పూర్వచరిత్రకు చెందినవే.

* ‘‘2.5 మిలియన్‌ సంవత్సరాలకు ముందు భూమిపై జీవించిన మానవులకు రాయడం తెలియదు. వారు రాతి పనిముట్లను, కళాఖండాలను తయారు చేశార’’ని లెస్లీ కెన్నెడీ అనే పురావస్తు శాస్త్రవేత్త అభిప్రాయపడ్డారు.

* పాలియోలిథిక్‌ ఏజ్, మెసోలిథిక్‌ ఏజ్, నియోలిథిక్‌ ఏజ్‌ సంస్కృతుల కాలాన్ని ‘రాతి యుగ సంస్కృతులు లేదా లిథిక్‌ సంస్కృతులు’ అని పిలుస్తారు. ఈ కాలంలో నాగరికత అభివృద్ధి చెంద లేదు.

* పూర్వ చరిత్ర, చరిత్ర మధ్య కాలాన్ని ప్రొటో హిస్టరీ సూచిస్తుంది. దీన్ని ‘చారిత్రక సంధి యుగం’ అంటారు. ఈ కాలంలో, సంస్కృతి, నాగరికత అభివృద్ధి చెందలేదు. ఈ సమయంలోనే మానవుడు శిలలపై బొమ్మలు గీయడం, గుర్తులు పెట్టడం లాంటివి చేశాడు. దీన్నే అప్పటి అక్షరాస్యతగా చరిత్రకారులు పేర్కొంటారు. ఈ యుగంలో మానవుల చర్యలకు లిఖిత ఆధారాలు ఉన్నాయి.

తొలి మనిషి (Early Man)

* ప్లీస్టోసీన్‌ ప్రారంభంలో మనిషి భూమిపై నివసించాడని శాస్త్రవేత్తల అభిప్రాయం.

* భారతదేశంలో క్రీ.పూ. 2,50,000 కాలంలో శివాలిక్‌ పర్వతాల వద్ద మనిషి ఉనికిలో ఉన్నట్లు ఆధారాలు లభించాయి. మహారాష్ట్రలోని బోరిలో 1.4 మిలియన్‌ సంత్సరాల నాటి రాతి ఆయుధాలను, కళాఖండాలను కనుక్కున్నారు. పాకిస్థాన్‌లోని రివత్‌లో 1.9 మిలియన్‌ సంవత్సరాల నాటి రాతి కళాఖండాల సమూహం లభ్యమైంది. వీటిని ‘పాలియోమాగ్నెటిక్‌ పద్ధతి’ ఆధారంగా కనుక్కున్నారు.

* 1982లో జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాకు చెందిన అరుణ్‌ సోనాకియా మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌లో ఉత్తర నర్మద ఒడ్డున హోమినిడ్‌ శిలాజాన్ని కనుక్కున్నారు.

* పురావస్తు శాస్త్రవేత్త విష్ణు ఎస్‌ వాకంకర్‌ మధ్యప్రదేశ్‌లోని భింబెట్కాలో ప్రాచీన యుగానికి చెందిన గుహ చిత్రలేఖనాలను కనుక్కున్నారు.


వేటాడేవారు - సేకరించేవారు 

* పూర్వచారిత్రక యుగంలో మానవులు ఆహారం కోసం వేటాడేవారు లేదా ప్రకృతి నుంచి సేకరించేవారు. 

* వేటగాళ్లు, సేకరించేవారు సమూహాలుగా ఏర్పడి సహజంగా లభించే కందగడ్డలు, పండ్లు, తేనెను తినేవారు. వారి జీవన పరిసర ప్రాంతాల్లో ఉండే జంతువులు, పక్షులు, చేపలను కూడా తినేవారు. ఇవి మానవ అభివృద్ధి దశను సూచిస్తాయి. 

* ప్రారంభంలో మానవుడు వేట, ఇతర అవసరాల కోసం ముక్కలు చేసిన రాతి పనిముట్లను, తరిగిన గులకరాళ్లను ఉపయోగించాడు. 

* కాలానుగుణంగా వీరు సంఘాలుగా ఏర్పడి జీవించారు. 

పాతరాతి యుగం (Palaeolithic Age)

*  ‘పాలియోలిథిక్‌’ అనే పదం గ్రీకు భాష నుంచి వచ్చింది. ‘పాలియో’ అంటే ‘పాత’, ‘లిథిక్‌’ అంటే ‘రాయి’ అని అర్థం. 

* భారతదేశంలోని పాలియోలిథిక్‌ సంస్కృతి ప్లీస్టోసీన్‌ (pleistocene) శకం లేదా మంచు యుగానికి చెందింది.

* ఈ కాలంలో భూమి మంచుతో ఉండి, వాతావరణం చాలా చల్లగా ఉండేది. మనుషులు, మొక్కలు లేవు. కానీ మంచు కరిగిన ఉష్ణమండల ప్రాంతంలో మనుషుల తొలి ఆనవాళ్లు లభించాయి. 

* పాతరాతి యుగ మానవుడు బహిరంగప్రదేశాల్లో, నదీ లోయల్లో, రాతి గుహల్లో నివసించాడు. అడవిపండ్లు, కూరగాయలు సేకరించి తినేవారు, జంతువులను వేటాడేవారు. ఇళ్ల నిర్మాణం, చేతివృత్తులు, వ్యవసాయం గురించి వీరికి తెలియదు.

* వీరు Quartzite అనే గట్టి రాతితో తయారుచేసిన పనిముట్లను ఉపయోగించారు. 

* ప్రజలు ఉపయోగించే రాతి పనిముట్ల స్వభావం, వాతావరణ మార్పు, టెక్నాలజీ ఆధారంగా భారతదేశంలో పాలియోలిథిక్‌ యుగాన్ని మూడు దశలుగా విభజించారు. అవి:

1. దిగువ పాలియోలిథిక్‌ (Lower Palaeolithic)

2. మధ్య పాలియోలిథిక్‌ (Middle Palaeolithic)

3. ఎగువ పాలియోలిథిక్‌ (Upper Palaeolithic)

Posted Date : 14-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌