• facebook
  • whatsapp
  • telegram

రాతియుగం - దశలు

ప్రజలు ఉపయోగించే రాతి పనిముట్ల స్వభావం, వాతావరణ మార్పు, టెక్నాలజీ ఆధారంగా భారతదేశంలో పాలియోలిథిక్‌ యుగాన్ని మూడు దశలుగా విభజించారు. అవి:

1. దిగువ/ పూర్వ ప్రాచీన శిలాయుగం 

2. మధ్య ప్రాచీన శిలాయుగం

3. ఎగువ ప్రాచీన శిలాయుగం 

దిగువ/ పూర్వ ప్రాచీన శిలాయుగం 

* రెండు మిలియన్‌ సంవత్సరాల నుంచి క్రీ.పూ. 1,00,000 మధ్య కాలాన్ని దిగువ/పూర్వ ప్రాచీన శిలాయుగం అంటారు.

* పాలియోలిథిక్‌ సంస్కృతులు ప్లీస్టోసిన్‌ (Pleistocene) భౌగోళిక యుగానికి చెందినవి. మెసోలిథిక్, నియోలిథిక్‌ సంస్కృతులు హోలోసిన్‌ (Holocene) యుగానికి చెందినవి. ఈ కాలంలో వాతావరణం తేమగా మారింది. 

* పాత రాతి యుగం సంస్కృతి మంచు యుగంలో భాగంగా ఉంటుంది. మనుషులు పచ్చి మాంసం తినేవారు. ఆహారం కోసం వేటాడేవారు, ప్రకృతిలో లభించేవాటిని సేకరించేవారు. స్థిరంగా ఉండక, ఎప్పుడూ సంచార జీవనం గడిపేవారు. వ్యవసాయంపై ఎలాంటి అవగాహన లేదు. ప్రజలు ఆహారం, నీరు, రాతి వనరులకు దగ్గరగా నివసించారు. ఉదాహరణకు నదీ ప్రవాహాల ఒడ్డున, గుహల్లో జీవించారు.

పరికరాలు:

* ప్రాచీన కాలంలో ప్రజలు వాడిన పనిముట్ల ఆధారంగానే శాస్త్రవేత్తలు చరిత్రపూర్వ మానవుల జీవితాలను అంచనా వేస్తారు. వీరు గండ శిలలతో వాడిన పరికరాలను ఉపయోగించినట్లు ఆధారాలున్నాయి. ఇవి మోటుగా ఉండేవి. ముఖ్యంగా కత్తిరించే పరికరాలు, చేతి గొడ్డలి, క్లీవర్‌ అనే సన్నటి పదునైన పరికరాన్ని, గులకరాళ్లను, అచ్యులియన్‌ అనే బండరాయిని ఎక్కువగా ఉపయోగించారు. పనిముట్ల తయారీకి సున్నపురాయిని కూడా వాడారు. వీటిని ప్రధానంగా కత్తిరించడానికి, తవ్వడానికి, రుబ్బడానికి ఉపయోగించారు.

శాస్త్రీయ ఆధారాలు:

* పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్‌ కె. పెద్దయ్య కర్ణాటకలోని హున్‌సాగి వ్యాలీలో దిగువ పాలియోలిథిక్‌ యుగానికి చెందిన ఆధారాలను గుర్తించారు. అప్పటి ప్రజలు ఈ లోయలో లభించే పండ్లు, బెర్రీలు, కాయలు, ఆకుకూరలు, పుట్టగొడుగులు సహా సహజ సిద్ధంగా లభించే అన్ని ఆహార పదార్థాలను తిన్నారని పేర్కొన్నారు. ఈయన దిగువ పాలియోలిథిక్‌ సంస్కృతి స్థిరత్వం, జీవనాధార నమూనాలను అధ్యయనం చేశారు.

* బ్రిటిష్‌ కాలంలో ఒక పురావస్తు శాస్త్రవేత్తల బృందం జీలం బేసిన్‌లోని దినా (ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది), జలాల్‌పూర్‌ (ప్రస్తుత ఉత్తర్‌ ప్రదేశ్‌)లో బండరాతితో చేసిన మూడు చేతి గొడ్డళ్లతో సహా 15 కళాఖండాలను కనుక్కుంది. ఇవి క్రీ.పూ. 7,00,000 క్రీ.పూ. 5,00,000 సంవత్సరాల క్రితం నాటివి. వీటిని ‘పాలియోమాగ్నెటిక్‌ పద్ధతి’ ఆధారంగా కనుక్కున్నారు.

* ఉత్తర్‌ ప్రదేశ్‌లోని బేలన్‌ వ్యాలీ, రాజస్థాన్‌లోని దిద్వాన ఎడారి ప్రాంతంలో దిగువ పాలియోలిథిక్‌కు చెందిన పరికరాలు లభించాయి.

* హిమాలయాల దిగువ భాగంలో చేతి గొడ్డలి దొరికింది. ఇది పశ్చిమ ఆసియా, యూరప్, ఆఫ్రికాల్లో లభించిన గొడ్డలిలాగానే ఉంది. 

* దేశంలోని వివిధ ప్రాంతాల్లో అనేక దిగువ ప్రాచీన శిలా యుగం స్థావరాలను కనుక్కున్నారు. రాజస్థాన్‌లోని దిద్వానా, గుజరాత్‌లోని హిరాన్‌ లోయ, మధ్యప్రదేశ్‌లోని సోన్‌వ్యాలీ, మహారాష్ట్రలోని నివాస, కర్ణాటకలోని యెదుర్వాడి ప్రాంతాల్లో వీరు ప్రధానంగా నివసించినట్లు చారిత్రక ఆధారాలు లభించాయి.

* దక్షిణ దిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో పాతరాతి యుగం, మధ్యరాతి యుగానికి చెందిన 43 సైట్‌లను గుర్తించారు. 

* హరియాణాలోని అనంగ్‌పుర్‌లో అచ్యులియన్‌ టూల్స్‌ కనుక్కున్నారు. ఇది యూరప్‌ పూర్వ సంస్కృతికి చెందిన పనిముట్టు. 

* రాజస్థాన్‌లోనూ దిగువ, మధ్య, ఎగువ పాలియోలిథిక్‌ సాధనాలను గుర్తించారు.

* మధ్యప్రదేశ్‌లోని రైసెస్‌ జిల్లాలోని భింబెట్కాలో లక్ష సంవత్సరాల క్రితం నాటి వందలాది రాక్‌ షెల్టర్‌లను కనుక్కున్నారు. ఇవి మానవులకు నివాసయోగ్యంగా ఉండేవి.

* ఉత్తర్‌ ప్రదేశ్‌లోని బేలన్‌ లోయ, చోటా నాగ్‌పుర్‌ పీఠభూమి, ఝార్ఖండ్‌లోని నదీ లోయలు, ఒడిశా - బిహార్‌ పరిసర ప్రాంతాలు రాతియుగ సంస్కృతుల క్రమాన్ని వెల్లడించాయి.

* సంబల్‌పూర్‌ జిల్లాలోని దరి-డుంగ్రిలో నిర్వహించిన తవ్వకాల్లో దిగువ, మధ్య పాలియోలిథిక్‌కు చెందిన అనేక టూల్స్‌ లభించాయి.

* బుద్ధబాలన్, బ్రాహ్మణి నదుల లోయల వెంట దిగువ పాలియోలిథిక్‌ టూల్స్‌ను గుర్తించారు.

* కర్ణాటకలోని మలప్రభ-ఘటప్రభ లోయల్లో దిగువ, ఎగువ శిలాజ శిలాయుత సాధనాలు లభించాయి.

* కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా ఇసాంపూర్‌ రాతి పనిముట్ల తయారీ కేంద్రంగా ఉండేదని పురావస్తు పరిశోధకులు పేర్కొంటున్నారు.

* ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం సముద్రతీర ప్రాంతంలో, నాగార్జునకొండ, కారంపూడిలో దిగువ పాలియోలిథిక్‌ సాధనాలు గుర్తించారు.

* అనంతపురంలోని గుంతకల్‌లో కొయ్య దువ్వెన లభించింది.

* కేరళలోని పాల్‌ఘాట్‌ జిల్లాలో ఒక వైపు పదును ఉన్న రాతి చేధకం (Choppers), స్క్రాపర్లు గుర్తించారు. వీటిని క్వార్ట్జ్‌తో తయారు చేశారు.

* 1863లో తమిళనాడులోని అత్తిరామపాక్కంలో ఉన్న కొర్తల్లయార్‌ నదీ పరీవాహక  ప్రాంతంలో చేతి గొడ్డలిని కనుక్కున్నారు. అత్తిరామపాక్కాన్ని తమిళనాడులోని అత్యంత సంపన్నమైన పాలియోలిథిక్‌ ప్రదేశాల్లో ఒకటిగా పేర్కొంటారు.

ఎగువ ప్రాచీన శిలాయుగం 

* క్రీ.పూ. 40,000 నుంచి క్రీ.పూ. 10,000 మధ్య కాలాన్ని ఎగువ ప్రాచీన శిలాయుగం అంటారు.

* ఇది మంచు యుగం చివరి దశకు చెందింది. వాతావరణం తులనాత్మకంగా వెచ్చగా,  తక్కువ తేమగా మారింది. 

* హోమోసెపియన్స్‌ ఆవిర్భావం ఈ యుగంలోనే మొదలైంది. 

* ఈ యుగంలో పెద్ద ఫ్లేక్స్, బ్లేడ్లు, బురిన్‌లను వాడారు. వీటి ఆధారాలు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ ప్రదేశ్,  దక్షిణ బిహార్‌ పరిసర ప్రాంతాల్లో లభించాయి. 

* మానవులు రాక్‌ షెల్టర్లు, గుహల్లో నివసించారు. వీటిని మధ్యప్రదేశ్‌లోని భింబెట్కాలో గుర్తించారు.

* ఈ కాలంలో టూల్స్‌ తయారీలో కొత్త సాంకేతికతను వాడారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో సూదులు, హార్పూన్స్, Parallelsided Blades, ఫిషింగ్‌ టూల్స్, బురిన్‌ టూల్స్‌తో సహా ఎముకలతో చేసిన అనేక పరికరాలను కనుక్కున్నారు. పర్యావరణ మార్పుల కారణంగా బురిన్‌లు, చిన్న సాధనాల సంఖ్య పెరిగింది. ఉత్తర, పశ్చిమ భారతదేశ వాతావరణం మరింత శుష్కంగా (Arid) మారినట్లు గుర్తించారు. 

* రివత్, సంఘావో గుహ, సోన్‌ వ్యాలీ, రోహ్రీ హిల్స్‌ (సింధ్‌), కశ్మీర్, కర్నూలు గుహల్లో మధ్య, ఎగువ పాలియోలిథిక్‌ సాధనాలు, పొయ్యిలు (Hearths), జంతువుల ఎముకలు, బరియల్స్‌ (సమాధి) లాంటి ఆధారాలు లభించాయి.

* బుద్ధ పుష్కర్‌ సరస్సు చుట్టూ మానవ నివాసాలు ఏర్పరచుకున్నారు. బేలాన్‌ లోయలోని చోపాని మండోలో ఎగువ పాలియోలిథిక్‌ నుంచి నియోలిథిక్‌ యుగం వరకు సాంస్కృతిక క్రమాన్ని కనుక్కున్నారు. 

* బేలాన్‌ లోయలో అడవి పశువులు, గొర్రెలు, మేకల ఎముకలు గుర్తించారు. ఇది జంతువుల పెంపకం ప్రారంభ దశను సూచిస్తుంది. 

* జి.ఆర్‌.శర్మ, జె.డి.క్లార్క్‌ అనే పురావస్తు శాస్త్రవేత్తలు సోన్‌ నదికి సమీపంలోని బాఘోర్‌లో ఎగువ ప్రాచీనశిలా యుగం నాటి  పనిముట్లు, మానవుల అవశేషాలు గుర్తించారు.

స్థావరాలు:

* భారత ఉపఖండంలో అనేక ఎగువ ప్రాచీన శిలాయుగ ప్రదేశాలు ఉన్నాయి. బంగ్లాదేశ్‌లోని లాల్‌మాయి కొండల్లో, పశ్చిమ త్రిపురలోని హౌరా, హవాయి నదీ లోయల్లో శిలాజ చెక్కతో తయారు చేసిన బ్లేడ్లు, బురిన్‌లు లాంటి అనేక సాధనాలు లభించాయి. మయన్మార్‌లోని ఎగువ ఐరావతి లోయలో కూడా ఇలాంటి సాధనాలనే గుర్తించారు.

* ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, ముచ్చట్ల చింతమాని గవి గుహ ప్రదేశాల్లో జంతువుల ఎముకలతో చేసిన సాధనాలను కనుక్కున్నారు. ఇక్కడ దట్టమైన అడవులు, ఎక్కువ తేమతో కూడిన పరిస్థితులు ఉన్నాయి. 

* ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా రేణిగుంట వద్ద ఒక గుహలో ఎగువ పాలియోలిథిక్‌ కళాఖండాలు కనుక్కున్నారు.

మధ్య ప్రాచీన శిలాయుగం

క్రీ.పూ. 1,00,000 నుంచి క్రీ.పూ. 40,000 మధ్య కాలాన్ని మధ్య ప్రాచీన శిలాయుగం అంటారు.

* ఈ యుగంలో మనుషులు ఫ్లేక్స్‌  (పెచ్చులు) అనే రాతి పనిముట్లను ఉపయోగించారు. ఇవి మహారాష్ట్రలోని నివాస వద్ద లభించాయి. వీరు మొన తేలిన రాతి ముక్కలను, గీకుడు రాళ్లను, బోరెర్స్‌ (తొలిచే సాధనాలు)ను వాడారు. ఇవి చిన్నగా, సన్నగా, తేలిగ్గా ఉండేవి.

* ఈ యుగంలో చేతి గొడ్డలి వాడకం తగ్గింది. 

* నర్మదా, తుంగభద్ర నదికి దక్షిణాన, ఇతర ప్రదేశాల్లో అనేక సంఖ్యలో బోరెర్స్, పదునైన సాధనాలు లభించాయి. 

* పాకిస్థాన్‌లోని నార్త్‌-వెస్ట్‌ ఫ్రాంటియర్‌ ప్రావిన్స్‌లోని సంఘావో గుహలో ఎముకలతో పాటు, రాతి పనిముట్లు లభించాయి. అన్ని సాధనాలను క్వార్ట్జ్‌తో తయారు చేశారు. 

* రాజస్థాన్‌లోని థార్‌ ప్రాంతంలో అధికంగా వృక్ష శిలాజాలు బయటపడ్డాయి. ఇక్కడ ఎక్కువ నీటి వసతితోపాటు, తేమతో కూడిన వాతావరణం ఉండేదని పురావస్తు శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఇక్కడే వివిధ ప్రాంతాల్లో చిన్న ఫ్యాక్టరీ సైట్లు, క్యాంప్‌ సైట్లను కనుక్కున్నారు. 

* బుద్ధ పుష్కర్‌ సరస్సు, లూనీ నది, అజ్మీర్, జైసల్మీర్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో రాతియుగం నాటి ఆనవాళ్లు లభించాయి. 

* మధ్య రాతి యుగంలో ప్రజలు రాతి పనిముట్లను విలక్షణమైన పద్ధతిలో తయారు చేశారు. ఈ ఆయుధాలు చిన్నగా, తేలిగ్గా ఉండేవి. ఇవన్నీ తొలిసారి పారిస్‌ దగ్గర్లోని లెవలోయిస్‌ పెరెట్‌ వద్ద లభ్యమయ్యాయి. అందుకే పురావస్తు శాస్త్రవేత్తలు దీనికి లెవలోయిస్‌ టెక్నిక్‌ అనే పేరు పెట్టారు. ఈ టెక్నిక్‌ను మొదట చరిత్ర పూర్వ రాతి పనిముట్లపై గుర్తించారు. 

* లెవలోయిస్‌ టెక్నిక్‌లో ఫ్లేక్‌ తాబేలు షెల్‌ (పైభాగం)లా కనిపిస్తుంది. దీన్ని ‘తాబేలు కోర్‌’ అని కూడా అంటారు. 

* ‘డిస్కోయిడ్‌ కోర్‌ టెక్నిక్‌’ అని పిలిచే మరో సాంకేతికత కూడా ఆ కాలంలో ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇందులో ఫ్లేక్‌లు పెద్ద కోర్‌ లేదా ఫ్లేక్‌ చుట్టుకొలత నుంచి కనీసం ఒక ఫ్లాట్‌ సైడ్‌తో స్కాలోప్‌ చేస్తారు. మిగిలిన కోర్‌ ఒక బెవెల్డ్‌ రిమ్‌ను కలిగి, మధ్యలో ఫ్లాట్‌గా ఉంటుంది.

* లెవలోయిస్‌ టెక్నిక్‌లో ఒకసారి ఒక ఫ్లాక్‌ ఉత్పత్తి అవుతుంది. డిస్కోయిడ్‌ కోర్‌ టెక్నిక్‌లో అనేక ఫ్లాక్స్‌ను ఉత్పత్తి చేయొచ్చు.

* భారత పురావస్తు శాస్త్రవేత్త హెచ్‌.డి.సంకాలియా మహారాష్ట్రలోని నివాసలో రాతియుగానికి చెందిన అనేక పరికరాలను కనుక్కున్నారు. ఈయన్ను భారతీయ పురావస్తుశాస్త్ర మార్గదర్శకుడిగా పేర్కొంటారు. సంకాలియా మధ్య పాలియోలిథిక్‌ కాలానికి చెందిన అనేక రకాల కళాకృతులను కనుక్కున్నారు. 

* నివాస సమీపంలోని చిర్కి వద్ద ఉన్న దక్షిణ యమునా నది ఒడ్డున ఒక శిలాజాన్ని గుర్తించారు. అదే ప్రాంతంలో గులకరాళ్లు, సైడ్‌ స్క్రాపర్లు, ఎండ్‌ స్క్రాపర్లు, బురిన్‌లు (రంధ్రాలు చేసేవి), ఎముకతో చేసిన పనిముట్లు గుర్తించారు. 

* మధ్య భారతదేశం, దక్కన్, రాజస్థాన్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఒడిశాల్లో మధ్య పాలియోలిథిక్‌కు చెందిన అనేక సాధనాలను కనుక్కున్నారు. 

* ఆ కాలంలోని అతి ముఖ్యమైన ప్రదేశాలు భింబెట్కా, నివాస, పుష్కర్, ఎగువ సింధులోని రోహిరి కొండలు, సామ్నాపూర్‌ మొదలైనవి.

Posted Date : 14-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌