• facebook
  • whatsapp
  • telegram

సుప‌రిపాల‌న 

ఆధునిక రాజ్యాలన్నీ సంక్షేమ రాజ్యాలేనని, సంక్షేమ రాజ్యాలన్నీ శ్రేయోరాజ్యాలేనని రూస్కో పౌండ్‌ అనే రాజనీతిజ్ఞుడు పేర్కొన్నారు. ‘రాజ్యం’ అనేది మానవుడికి ఉత్తమ జీవితాన్ని ప్రసాదించడానికి ఏర్పడి, దాని కోసమే కొనసాగుతుందని రాజనీతి శాస్త్ర పితామహుడైన అరిస్టాటిల్‌ పేర్కొన్నారు. నేటి ప్రజాస్వామ్య రాజ్యాలన్నీ ప్రజాసంక్షేమం సాధించే క్రమంలో ‘పాలన’ను ఊయల నుంచి శ్మశానం వరకు అనే అర్థంతో మానవుడి అన్ని దశలను స్పృశిస్తున్నాయి.

గవర్నెన్స్‌

గవర్నెన్స్‌ (పాలన) అంటే నిర్ణయీకరణ ప్రక్రియ. ఆ నిర్ణయాలను అమలు చేసే పద్ధతే గవర్నెన్స్‌.

దేశ సమగ్రతను పరిరక్షిస్తూ పౌరులందరి భద్రతను, రాజ్యాంగ నియమాలను పరిరక్షిస్తూ, విద్య, ఆరోగ్యం మొదలుకొని ఉపాధి, ఆహారభద్రతల వరకు ఉన్న సేవలను అందించే నిర్ణయీకరణ ప్రక్రియనే గవర్నెన్స్‌గా పేర్కొనవచ్చు.

నిర్ణయీకరణ ప్రక్రియ అమలు చేస్తున్న ప్రతి వ్యవస్థలోను గవర్నెన్స్‌ ఉంటుంది.

సుపరిపాలన అనే భావన గురించి మొదటిసారిగా ఆఫ్రికా దేశాల పాలనపై 1989లో ప్రచురించిన ‘సబ్‌సహారా’ అనే నివేదికలో ప్రపంచ బ్యాంకు పేర్కొంది. దీని ప్రకారం సుపరిపాలనలో మూడు కీలకాంశాలను ప్రపంచబ్యాంకు గుర్తించింది. అవి:

1) పాలనా వ్యవస్థ నిర్మాణం.

2) విధానాలను రూపొందించి అమలు చేయడానికి ప్రభుత్వానికి ఉన్న శక్తిసామర్థ్యాలు.

3) ఆర్థిక, సామాజిక వనరుల నిర్వహణలో అధికారాన్ని అమలుపరిచే విధానం.

పాలన నుంచి సుపరిపాలన

ప్రపంచంలోని అనేక దేశాలు తమ పాలనలో ఆధునికీకరణ, నూతన ప్రభుత్వ నిర్వహణ అనే అంశాలమీద దృష్టి సారించడంతో ‘గవర్నెన్స్‌’ స్థానంలో ‘గుడ్‌ గవర్నెన్స్‌’ అనే భావన చోటుచేసుకుంది.

నేడు అనేక దేశాలు తమ పాలనలో సంప్రదాయ వ్యవస్థలను కొనసాగిస్తూనే నూతన విధానాలు, భావనలకు అవకాశం కల్పిస్తూ సరళతర, పారదర్శక విధానాలను అమలుచేయడానికి కృషి చేస్తున్నాయి.

నూతన విధానాల వల్ల ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సంబంధాలు మెరుగుపడి ప్రజలకు మరిన్ని సమర్థవంతమైన సేవలను ప్రభుత్వం అందిస్తుంది.

సుపరిపాలనలో ప్రభుత్వం తనకున్న అధికారాలను ఉపయోగించి, ఆర్థిక వనరులను సమాజ అభివృద్ధికి వినియోగిస్తూ, తక్కువ అధికారాన్ని చెలాయిస్తూ ఎక్కువ అభివృద్ధికి కృషి చేస్తుంది.

ప్రపంచబ్యాంకు నివేదిక - ముఖ్యాంశాలు

1992లో ప్రపంచ బ్యాంకు వెలువరించిన ‘గవర్నెన్స్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ రిపోర్టు’  ప్రకారం అస్తవ్యస్థ పాలనకు, అవినీతికి చరమగీతం పలకాలంటే కింది మార్గాలను అమలుచేయాలి. అవి:

అభివృద్ధి పథకాలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం.

ప్రజలందరిలో స్వయంసమృద్ధి, సాధికారతను ప్రోత్సహించడం.

అన్ని వర్గాల్లో సామాజిక విలువలను పెంపొందించడం.

సమాజ ప్రగతిలో ప్రభుత్వేతర సంస్థలు, పౌరసమాజాల పాత్రను పెంచడం.

ప్రభుత్వ, మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థల, ప్రజల మధ్య అన్యోన్య సంబంధాలను మెరుగుపరచడం. 

పౌరసమాజంలో జవాబుదారీతనాన్ని మెరుగుపరచడం.

సుపరిపాలన - ప్రధాన లక్ష్యాలు

1995లో ‘దర్బన్‌’లో జరిగిన సామాజిక అభివృద్ధి శిఖరాగ్ర సమావేశంలో సుపరిపాలనకు ఉన్న 3 ప్రధాన లక్ష్యాలను నిర్ధేశించారు. అవి:

 1) పేదరిక నిర్మూలన

 2) ఉత్పాదక ఉద్యోగితా సృష్టి

 3) సామాజిక ఏకీకరణ

ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ నివేదిక

1999లో ఆసియా అభివృద్ధి బ్యాంక్‌ ‘ఆన్‌ గవర్నెన్స్‌ ఇన్‌ ఆసియా’ అనే రిపోర్ట్‌లో ‘సుపరిపాలన’ అనేది నాలుగు ప్రధానాంశాలపై ఆధారపడుతుందని పేర్కొంది.

1) జవాబుదారీతనం        2) పారదర్శకత     3) భవిష్యత్‌ అంచనా          4) భాగస్వామ్యం

యూఎన్‌డీపీ రిపోర్ట్‌

ఐక్యరాజ్యసమితి అనుబంధ విభాగమైన యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (యూఎన్‌డీపీ) సుస్థిర మానవాభివృద్ధిని సాధించే సుపరిపాలనకు నాలుగు కీలకాంశాలను గుర్తించింది. అవి:  

1) పేదరిక నిర్మూలన

2) పర్యావరణ పరిరక్షణ- పునరుజ్జీవనం

3) మహిళల ప్రగతిని పెంపొందించడం

4) ఉపాధి కల్పన, నిలకడైన జీవన విధానం

సుపరిపాలన లక్షణాలు

పౌరులందరికీ సమన్యాయాన్ని అందించాలి.

అన్నివర్గాల వారికి పారదర్శకమైన పాలనను అందించాలి.

రక్షణ రంగానికి వెచ్చిస్తున్న నిధులను తగ్గించి, వాటిని మానవాభివృద్ధి పథకాలకు మళ్లించాలి.

పౌరుల సంక్షేమం కోసం ప్రభుత్వం అభిలషణీయ విధానాలను రూపొందించాలి.

అన్ని వర్గాల్లోనూ జవాబుదారీతనాన్ని పెంపొందించాలి.

పౌరుల రాజకీయ, సామాజిక, ఆర్థిక, నైతిక జీవితాన్ని పెంపొందించాలి.

రాజ్యాంగంలో నిర్దేశించిన హక్కులను, సంక్షేమ పథకాలను పౌరులందరికీ సక్రమంగా అందించాలి.

వివిధ శాసనాలు, పథకాల అమల్లో జాప్యాన్ని నివారించి అవినీతిని నియంత్రించాలి.

సామాజిక తనిఖీలను సమర్థంగా నిర్వహించడం ద్వారా అకౌంటింగ్‌ వ్యవస్థను మెరుగుపరచాలి.

నేరాల రాజకీయాలను నియంత్రించాలి. 

వివిధ పథకాల అమల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించాలి. 

భారత్‌లో సుపరిపాలనకు శ్రీకారం

1991లో పి.వి. నరసింహారావు ప్రధానిగా ఉన్న కాలంలో ప్రవేశపెట్టిన నూతన ఆర్థిక సంస్కరణల ద్వారా ప్రభుత్వ రంగాన్ని పరిమితం చేసి, ప్రైవేట్‌ రంగానికి అవకాశాలను కల్పించారు. తద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించి సుపరిపాలనకు శ్రీకారం చుట్టారు.

భారతదేశం ప్రణాళికలకు సమాంతరంగా తన పరిపాలనా విధానాన్ని మలచుకుంది. అంటే పాలనలో ప్రభుత్వం పర్యవేక్షక పాత్రకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తుంది.

భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలో న్యూదిల్లీలో ‘సెంటర్‌ ఫర్‌ ఈ - గవర్నెన్స్‌’ను నెలకొల్పింది.

అటల్‌ బిహారి వాజ్‌పేయీ ప్రభుత్వం డిసెంబరు 25వ తేదీని ‘జాతీయ సుపరిపాలన’ దినోత్సవంగా నిర్దేశించింది. 

ఆంధ్రప్రదేశ్‌లో సుపరిపాలనకు పునాదులు

1983లో ఎన్‌.టి.రామారావు ప్రభుత్వం సాధారణ పరిపాలనా శాఖలో ఒక డిప్యూటీ సెక్రటరీ నాయకత్వంలో  మొదటిసారి ‘పౌర సహాయ పౌర ఫిర్యాదుల బ్యూరో’ను ఏర్పాటుచేసింది.

1983లో శాసన ప్రాతిపదికపై లోకాయుక్త వ్యవస్థను ఏర్పాటుచేయడాని కంటే ముందు ఆంధ్రప్రదేశ్‌లో స్వతంత్ర అధికార ప్రతిపత్తి గల ‘ధర్మ మహామాత్ర’ వ్యవస్థ అమల్లో ఉండేది.

1984లో ఎన్‌.టి. రామారావు ప్రభుత్వం గ్రామాధికారుల వ్యవస్థను రద్దుచేసి, వారిస్థానంలో ‘విలేజ్‌ అసిస్టెంట్స్‌’ వ్యవస్థను ప్రవేశపెట్టింది.

1985లో తాలుకాలను రద్దుచేసి వాటిస్థానంలో రెవెన్యూ మండలాలను ఏర్పాటుచేసింది. 

1987లో సుమారు 330 పంచాయతీ సమితులను రద్దుచేసి వాటి స్థానంలో 1004 మండల పరిషత్‌లను ఏర్పాటుచేశారు.

సహకార సంస్థల ద్వారా రైతులకు అందజేస్తున్న స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలు; మార్కెటింగ్‌ సదుపాయాలు, ఉత్పాదకాలు లాంటి అనేక సౌకర్యాలను ఒకే ప్రాంగణంలో కల్పించే లక్ష్యంతో ‘ఏక గవాక్ష పద్ధతి’ని ప్రవేశపెట్టారు

2001, అక్టోబరులో హైదరాబాద్‌లో ‘సుపరిపాలన కేంద్రం’ను ఏర్పాటుచేశారు. ఇది ప్రభుత్వ పరిపాలన సంస్కరణ కార్యక్రమ రూపకల్పన, అమలుకు తన సహకారాన్ని అందిస్తూ సమన్వయపరుస్తుంది

Posted Date : 04-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌