• facebook
  • whatsapp
  • telegram

దీవులు

ఖండ భాగాలు.. ఖనిజ నిలయాలు!

చుట్టూ నీరు ఆవరించి, చూడగానే ఆకర్షించే ఖండ భూభాగాలు దీవులు. జీవ వైవిధ్యం, పర్యావరణ పరిరక్షణలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. మనుషులకు ఆవాసాలుగా ఉపయోగపడతాయి. ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడతాయి. అలాగే వాతావరణాన్ని, అందులో వచ్చే మార్పులను అర్థం చేసుకోడానికి సాయపడే మరో ముఖ్యమైన అంశం లవణీయత. అంటే అనేక ఖనిజ లవణాల నిలయాలైన సముద్రాల్లో, అవి కరిగి ఉండటం వల్ల ఏర్పడిన సాంద్రతర స్థితి. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలను, పోషకాల రవాణాను ప్రభావితం చేస్తుంది. జాగ్రఫీ అధ్యయనంలో భాగంగా పోటీ పరీక్షల అభ్యర్థులు ఈ వివరాలను తెలుసుకోవాలి. 

నాలుగు వైపులా నీటితో ఆవరించి ఉన్న భూభాగాన్నే దీవులుగా పిలుస్తారు. అత్యధిక సంఖ్యలో దీవులు పసిఫిక్‌ మహాసముద్రంలో ఉన్నాయి. దీవులను రెండు రకాలుగా విభజించవచ్చు. 

1) ఖండ సంబంధ దీవులు: ఒకప్పుడు ప్రధాన ఖండాల్లో భాగంగా ఉండి, కాలక్రమంలో ఆ భూభాగం నుంచి విడిపోయి ఏర్పడిన దీవులను ఖండ సంబంధ దీవులు అంటారు. ఉదా: మడగాస్కర్, న్యూఫౌండ్‌ లాండ్‌ (కెనడా), టాస్మానియా, సిలోస్, ఎలైసియన్, బ్రిటిష్‌ దీవులు.

2) సముద్ర దీవులు: వీటిని రెండు రకాలుగా విభజించవచ్చు. 

ఎ) అగ్నిపర్వత దీవులు: సముద్ర భూతలంపై ఉన్న అగ్నిపర్వత శిఖరాలు సముద్ర ఉపరితలానికి చొచ్చుకొని వచ్చి దీవులుగా ఏర్పడతాయి. వీటినే అగ్నిపర్వత దీవులని అంటారు.  ఉదా: హవాయ్‌ దీవులు, గాలాపాగస్‌ దీవులు, అజోర్, సెయింట్‌ మెరీనా, కెనరీ దీవులు, మారిషస్‌ దీవులు, అండమాన్‌ నికోబార్‌ దీవులు.

బి) పగడపు దీవులు: ప్రవాళభిత్తికల అవశేషాలు సముద్ర భూతలంపై పోగుపడి ఘనీభవించడం వల్ల ఏర్పడిన దీవులను పగడపు దీవులు అంటారు. ఈ దీవులు ఎక్కువగా పసిఫిక్‌ మహాసముద్రంలో విస్తరించి ఉన్నాయి.  ఉదా: భారతదేశంలోని లక్షదీవులు


హిప్సోగ్రాఫిక్‌ వక్రరేఖ:  హిప్సోగ్రాఫిక్‌ వక్రరేఖ అంటే సముద్రమట్టంతో భూమి ఉపరితలం, సముద్ర అంతర్భాగంలోని నిమ్నోన్నతాలను పోల్చడం. ఈ వక్రరేఖ సముద్ర మట్టం నుంచి భూమి ఉపరితలంపైన సగటు ఎత్తును, సముద్రమట్టం నుంచి సగటు లోతును సూచిస్తుంది. దీన్ని 1921లో కోసిన్న అనే శాస్త్రవేత్త రూపొందించాడు. 1940లో స్వార్థప్‌ దీన్ని మెరుగుపరిచాడు. దీని ప్రకారం ఖండాల సగటు ఎత్తు 840 మీ. విస్తరించి ఉంటుంది. సముద్రాల సగటు లోతు 3800 మీ. ఈ వక్రరేఖ సముద్రాల్లో వివిధ ప్రాంతాలు ఆక్రమించిన లోతును, భూఉపరితలంపై ఉండే ఎత్తు పల్లాలను తెలియజేస్తుంది.

ముఖ్యాంశాలు: * నిట్రంగా ఉండే అంచులతో U - ఆకారంలో ఉండే సముద్రాంతర్గత లోయలను సముద్రాంతర్గత కెనయాన్స్‌ అంటారు. ఇవి ఖండ తీరపు వాలులో ఉంటాయి.

* సముద్రగర్భ రిడ్జ్‌లు అట్లాంటిక్‌ మహాసముద్రంలో ఎక్కువగా ఉంటాయి.

* అగాధాలకు ప్రసిద్ధి చెందిన సముద్రం - పసిఫిక్‌ మహాసముద్రం

* కల్లోల సముద్రమని అట్లాంటిక్‌ మహాసముద్రాన్ని పిలుస్తారు. 

సముద్ర లవణీయత 

సముద్రజలానికి ఉన్న ఉప్పదనాన్ని లవణీయత అని పిలుస్తారు. ఆ ఉప్పదనానికి కారణం అందులో కరిగి ఉన్న వివిధ రకాల ఖనిజ లవణాలు. సముద్ర జలాల్లో అధికంగా కరిగి ఉన్న ఖనిజ లవణం సోడియం క్లోరైడ్‌ కాగా, తర్వాత స్థానంలో మెగ్నీషియం క్లోరైడ్‌ ఉంటుంది.

సముద్రజలాల్లోని ఖనిజ లవణాలు 

* సోడియం క్లోరైడ్‌ - 77.8%   

* మెగ్నీషియం క్లోరైడ్‌ - 10.8% 

* మెగ్నీషియం సల్ఫేట్‌ - 4.2% 

* కాల్షియం సల్ఫేట్‌ - 3.6% 

* పొటాషియం సల్ఫేట్‌ - 2.5% 

* కాల్షియం కార్బొనేట్‌ - 3.0%

* సముద్ర జలాల సగటు లవణీయత 35o/00 గా సూచిస్తారు. అంటే ప్రతి 1000 గ్రాముల సముద్ర నీటిలో సగటున 35 గ్రాముల ఖనిజ లవణాలు కరిగి ఉంటాయని అర్థం.

* సముద్ర లవణీయత అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా ఉండదు. కొన్ని కారణాలతో ప్రభావితమైన ప్రాంతాన్ని బట్టిమారుతూ ఉంటుంది.

ఉష్ణోగ్రత: ఉష్ణోగ్రత పెరిగే కొద్ది సముద్ర ఉపరితల నీరు వేడెక్కి ఆవిరవుతుంది. ఫలితంగా సముద్ర నీటిలో లవణాల సాంద్రత ఎక్కువై లవణీయత పెరుగుతుంది. అంతేకాకుండా గాలి పొడిగా, ఆకాశం నిర్మలంగా, పవనాలు వేగంగా వీచినట్లయితే ఆ ప్రాంతంలో నీరు ఎక్కువగా ఆవిరై లవణీయత పెరుగుతుంది. 

ఉదా: ఉప అయన రేఖ అధిక పీడనా ప్రాంతంలో అంటే 10O నుంచి 30Oఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఇలాంటి లక్షణాలు ఉన్నందువల్ల ఆ ప్రదేశాల్లో సముద్ర లవణీయత అత్యధికంగా ఉంది (35.5% - 36.5%).

భూమధ్యరేఖా ప్రాంతం నుంచి ఉన్నత అక్షాంశాల వైపునకు వెళ్లే కొద్దీ సముద్ర లవణీయత కొంతదూరం పెరిగి తర్వాత తగ్గుతూ ధ్రువాల వద్దకు చేరేసరికి కనిష్ఠ స్థాయికి పడిపోతుంది.

వర్షపాతం: వర్షపాతం అధికంగా ఉన్న చోట సముద్రాల లవణీయత తగ్గుతుంది. 

ఉదా: భూమధ్యరేఖ ప్రాంతంలో ఉష్ణోగ్రత అధికంగా ఉన్నప్పటికీ లవణీయత ఉప అయనరేఖ అధిక పీడన ప్రాంతంతో పోల్చినప్పటికీ తక్కువగా ఉంటుంది. దీనికి కారణం ఈ ప్రాంతంలో అధికంగా రోజూ సంభవించే వర్షపాతం.

* ఉప అయనరేఖ అధిక పీడన ప్రాంతంలో లవణీయత అత్యధికంగా ఉండటానికి ప్రధాన కారణం అధిక ఉష్ణోగ్రత, అల్ప వర్షపాతం, ఆకాశం మేఘరహితంగా ఉండటమే. ఈ కారణాల వల్ల నీరు ఎక్కువగా ఆవిరై లవణీయత అధికంగా ఉంటుంది.

నదుల నీరు సముద్రంలో కలవడం: పెద్దపెద్ద నదులు సముద్రాల్లో కలిసే ప్రదేశాల్లో లవణీయత తక్కువగా ఉంటుంది. నదుల వల్ల సముద్రాల్లో కలిసే మంచి నీరు లవణీయతను తగ్గిస్తుంది.

ఉదా: ధ్రువ ప్రాంతాల్లో లవణీయత తక్కువగా ఉంటుంది. ఎందుకంటే అక్కడి అల్ప ఉష్ణోగ్రత, వేసవిలో మంచు కరిగి, మంచినీరు సముద్రంలో చేరడం వల్ల.

సముద్రాల లోతు: సముద్రజల ఉపరితలం నుంచి 200 పాథమ్స్‌ లోతు వరకు మాత్రమే సూర్యకిరణాలు ప్రసరిస్తాయి. అందువల్ల ఈ లోతు వరకు నీరు ఆవిరయ్యే రేటు పెరిగి సముద్రజల లవణీయత క్రమంగా పెరుగుతుంది. ఆ తర్వాత లోతులో సముద్రం అడుగు వరకు తగ్గుతుంది.

* అత్యధిక లవణీయత ఉన్న సముద్రం మృతసముద్రం. దీని లవణీయత 238o/00. ఇది పాలస్తీనా, ఇజ్రాయిల్, జోర్డాన్‌ దేశాల సరిహద్దుల్లో ఉంది.  

మృత సముద్రం అత్యధిక లవణీయతకు కారణాలు 

1) అధిక ఉష్ణోగ్రత ప్రాంతాల్లో ఉండటం 

2) అల్పవర్షపాత ప్రాంతాల్లో ఉండటం 

3) ఇందులో కలిసే నదులు ఏవీ లేకపోవడం

ముఖ్యాంశాలు 

* అత్యంత ఎక్కువ లవణీయత ఉన్న సరస్సు - టర్కీలోని లేక్వాన్‌. దీని లవణీయత 330o/00

* అతితక్కువ లవణీయత ఉన్న సముద్రం - బాల్టిక్‌ సముద్రం. దీని లవణీయత 80o/00. 

* స్వచ్ఛమైన నీటిలో (చెరువులు, సరస్సులు, నదులు) లవణీయత 0.5o/00 

* తాగేనీటిలో లవణీయత 1o/00 

* వ్యవసాయనీటిలో లవణీయత 3o/00.

* ఒకే లవణీయత ఉన్న ప్రదేశాలను కలుపుతూ గీసిన ఊహారేఖలను ఐసోహైలెన్స్‌ అంటారు.

* సముద్ర ఉపరితలం నుంచి లోతుకు వెళ్లేకొద్దీ లవణీయత కొంతవరకు పెరుగుతూ ఆ తర్వాత తగ్గుతుంది.

* సముద్రాల్లో సరాసరి ఉష్ణోగ్రత 29o సెంటీగ్రేడ్‌.

* మధ్యధరా, బాల్టిక్, ఎర్ర సముద్రం లాంటి భూపరివేష్టిత సముద్రాల్లో లవణీయత అధికంగా ఉంటుంది. ఈ సముద్రాల్లోని నీరు పరిసర సముద్రాల నీటిలో మిళితం కావడానికి అవకాశం ఉండదు. అంతేకాకుండా నదులు తీసుకువచ్చే లవణాలు క్రమంగా ఈ సముద్రాల్లో అధికమవడం వల్ల లవణీయత పెరుగుతుంది.

* సముద్రాల లవణీయత 10o నుంచి 23 1/2o ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య అంటే ఉప అయనరేఖ అధిక పీడన ప్రాంతంలో అధికంగా ఉండటానికి కారణం అధిక ఉష్ణోగ్రత, అల్పవర్షపాతం, ఆకాశం మేఘరహితమై ఉండటం, పవనాలు ఎక్కువ వేగంతో వీచడం.

* భూమధ్యరేఖా ప్రాంతంలో ఉప అయనరేఖ అధికపీడనా ప్రాంతంతో పోలిస్తే లవణీయత తక్కువ ఉండటానికి కారణం ఇక్కడ సంభవించే అధిక వర్షపాతం.

నమూనా ప్రశ్నలు

1. సామాన్య లవణీయత అంటే?

1) సగటున 1000 గ్రాముల నీటిలో 1000 గ్రాముల లవణీయత ఉండటం.

2) సగటున 1000 గ్రాముల నీటిలో 35 గ్రాముల లవణీయత ఉండటం.

3) సగటున 1000 గ్రాముల నీటిలో 100 గ్రాముల లవణీయత ఉండటం.

4) ఏదీకాదు

జ: సగటున 1000 గ్రాముల నీటిలో 35 గ్రాముల లవణీయత ఉండటం.

2. సముద్ర లవణాల్లో అధికశాతం ఉండే రసాయనం?

1) సోడియం క్లోరైడ్‌            2) మెగ్నీషియం క్లోరైడ్‌   

3) మెగ్నీషియం సల్ఫేట్‌       4) కాల్షియం సల్ఫేట్‌

జ: సోడియం క్లోరైడ్‌

3. ఉప ఆయన రేఖా అధిక పీడన ప్రాంతాల్లో సముద్ర లవణీయత అత్యధికంగా (36 - 37o) ఉండటానికి కారణం?

1) వర్షపాతం అతి తక్కువగా ఉండటం.    2) గాలి వేడిగా, పవనాలు వేగంగా వీచడం.

3) 1, 2               4) ఏదీకాదు

జ: 1, 2

4. అత్యధిక లవణీయతను కలిగిన సముద్రం ఏది?

1) నల్ల సముద్రం     2) మృత సముద్రం      3) బాల్టిక్‌ సముద్రం   4) ఎర్ర సముద్రం

జ: మృత సముద్రం

5. అత్యధిక లవణీయత కలిగిన సరస్సు ఏది?

1) వాన్‌         2) మిచిగాన్‌       3) కొల్లేరు       4) లోనార్‌

జ: వాన్‌

6. సముద్రపు నీటి లవణీయత కింది ఏ అంశంపై ఆధారపడి ఉంటుంది?

1) నదుల నీరు సముద్రంలో కలవడం        2) వర్షపాతం 

3) సముద్రపు నీరు ఆవిరి కావడం          4) 1, 3

జ: 1, 3

7. నల్ల సముద్రంలో లవణీయత శాతం సుమారుగా ఎంత ఉంటుంది?

1) 37%      2) 17%        3) 35%        4) 40%

జ:  17%

8. ఏ అక్షాంశాల్లో లవణీయత అత్యధికంగా ఉంటుంది?

1) 50 - 70o         2) 35 - 45o       3) 70 - 50o        4) 30 - 50o

జ: 30 - 50o

9. సమానమైన లవణీయతను కలిగిన ప్రాంతాలను కలుపుతూ గీసిన ఊహారేఖను ఏమని పిలుస్తారు?

1) ఊసో నైప్స్‌    2) ఐసో హలైన్స్‌      3) ఐసో హైట్స్‌     4) ఏదీకాదు

జ:  ఐసో హలైన్స్‌

10. ప్రపంచంలో అతిపెద్ద నదీ ద్వీపం ఏది?

1) శ్రీరంగం ద్వీపం     2) మజులి ద్వీపం    3) భవానీ ద్వీపం    4) అగట్టి ద్వీపం

జ:  మజులి ద్వీపం

11. సముద్రపు నీటిలో ఉండే హాలోజన్‌ మూలకాలు ఏవి?

1) అయోడిన్‌       2) ఫ్లోరిన్‌        3) బ్రోమిన్‌         4) పైవన్నీ

జ:  పైవన్నీ

12. మృత సముద్రంలో లవణీయత శాతం?

1) 40%       2) 365%       3) 60%        4) 237%

జ:  237%

13. సాధారణంగా మ్యాప్‌లో (పటం) పైభాగం సూచించే దిక్కు ఏది?

1) ఉత్తరం    2) దక్షిణం      3) తూర్పు     4) పడమర

జ:  ఉత్తరం

14. సాండ్‌ డ్యూన్స్‌ (ఇసుక దిబ్బలు/తిన్నెలు) అని పిలిచే ఇసుక పర్వతాలు ఏ నగరంలో ఉన్నాయి?

1) అబుదాబి      2) బెర్లిన్‌       3) తింపు       4) కాబూల్‌

జ: అబుదాబి

15. ప్రకటన 1: హిందూ మహాసముద్రం ఆకారం U.

ప్రకటన 2: హిందూ మహాసముద్రం U  ఆకారం సహజ హార్బర్లకు అనువైన స్థానాన్ని అందిస్తుంది. 

ఇచ్చిన ప్రకటనల నుంచి సరైన వాటిని ఎంచుకోండి.

1) 1, 2 రెండూ సత్యం       2) 1, 2 రెండూ అసత్యం

3) 1 సత్యం, 2 అసత్యం        4) 2 సత్యం, 1 అసత్యం

జ:  1, 2 రెండూ అసత్యం

రచయిత: జయకర్‌ సక్కరి 

Posted Date : 21-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌