• facebook
  • whatsapp
  • telegram

 భారతదేశంలో రవాణా వ్యవస్థ - రైలు మార్గాలు

దేశ సుస్థిర సర్వతో ముఖాభివృద్ధిలో రవాణా రంగం కీలకపాత్ర పోషిస్తోంది. అంటే దేశ వ్యవసాయ, పారిశ్రామిక, సామాజికాభివృద్ధిలో రవాణా వ్యవస్థ ప్రధానమైంది. స్వాతంత్య్రానంతరం భారతదేశం రవాణా రంగంలో గణనీయమైన అభివృద్ధిని సాధించింది. మనదేశంలో పర్వత, ఎడారి, చిత్తడి ప్రాంతాలను మినహాయిస్తే మిగిలిన భూ భాగమంతా రవాణా సౌకర్యాలకు అనుకూలంగా ఉంది.

రవాణా సాధనాలను ముఖ్యంగా 4 రకాలుగా విభజించవచ్చు: అవి: 1) రైలు మార్గాలు 2) రోడ్డు మార్గాలు 3) జలమార్గాలు 4) వాయు మార్గాలు.

భారతదేశ రవాణా రంగంలో రైల్వే వ్యవస్థ ప్రధానమైంది. ప్రయాణికుల, వస్తు రవాణాలోనే కాకుండా దేశ సమగ్రతను, సమైక్యతను పెంపొందించడంలో, విభిన్న సంస్కృతులను పరిరక్షించడంలో, పర్యాటక రంగ అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషిస్తోంది. భారతదేశంలో రైలు మార్గాల చరిత్ర 1853లో లార్డ్ డల్హౌసి గవర్నర్ జనరల్‌గా ఉన్న కాలంలో ప్రారంభమైంది. ఆ సంవత్సరంలోనే బొంబాయి - థానేల మధ్య మొట్టమొదటి రైలును ఆరంభించారు. ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం 34 కిలోమీటర్లు. ఇప్పుడు మన రైలు మార్గాల మొత్తం పొడవు 63,273 కి.మీ.లు. భారతదేశంలో రైల్వే రంగం అతి పెద్ద ప్రభుత్వరంగ వ్యవస్థగా ఉంది.

ప్రస్తుతం భారతీయ రైల్వే వ్యవస్థ ఆసియాలో రెండో అతిపెద్ద రైల్వే వ్యవస్థగా, ప్రపంచంలో నాలుగో పెద్ద వ్యవస్థగా గుర్తింపు పొందింది. (మొదటి మూడు దేశాలు వరుసగా అమెరికా, రష్యా, చైనా).  ప్రస్తుతం భారతదేశంలోని మొత్తం 63,273 కి.మీ. పొడవునా విస్తరించిన రైల్వే దేశవ్యాప్తంగా 7,025 రైల్వే స్టేషన్లను కలిగి ఉంది. భారత రైల్వేలను 16 ప్రాంతీయ మండలాలుగా విభజించారు. ఈ 16 మండలాలు, వాటి ప్రథాన కేంద్రాలు.

భారతీయ రైల్వే అతిపెద్ద నెట్‌వర్క్‌ కలిగి అమెరికా, చైనా, రష్యాల తర్వాత 4వ స్థానంలో ఉంది. ఈ సంస్థను రైల్వే బోర్డ్‌ నిర్వహిస్తుంది. ఇది రైల్వే మంత్రిత్వశాఖ అధీనంలో పనిచేస్తుంది. 2020 ఏప్రిల్‌ 1 నాటికి దేశంలో తూర్పు - పడమర, ఉత్తర - దక్షిణాలుగా మొత్తం 68,155 కి.మీ. రైలు మార్గాలు ఉన్నాయి. ఇందులో 39,866 కి.మీ.(58.5%) విద్యుదీకరణ జరిగింది. 202023 నాటికి మొత్తం మార్గాలను 100 శాతం విద్యుదీకరించి 2030 నాటికి ‘నెట్‌ - జీరో రైల్వే’గా ప్రపంచ రికార్డు సృష్టించాలని ప్రభుత్వం భావిస్తోంది. 2019  20 ఆర్థిక సంవత్సరాన్ని పరిశీలిస్తే భారతీయ రైల్వే ప్రపంచ నెట్‌వర్క్‌ యాజమాన్యంలో ద్వితీయస్థానం కలిగి ఉంది. ఇది దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ.

1951 నుంచి 2019 మధ్య దేశంలో మొత్తం 18 జోన్లు, 70 డివిజన్లను ఏర్పాటుచేశారు.  దేశంలో మొదటగా ఏర్పాటుచేసిన జోన్‌ దక్షిణ రైల్వే, చెన్నై. చివరిది దక్షిణ కోస్తా, విశాఖపట్నం. అత్యధిక పొడవైన, పెద్ద రైల్వే జోన్‌ ఉత్తర రైల్వే, దిల్లీ. చిన్నది తూర్పుకోస్తా, భువనేశ్వర్‌.
 

జోన్‌ 

స్థాపించిన సంవత్సరం ప్రధాన కార్యాలయం డివిజన్లు
దక్షిణ రైల్వే 14 - 4 - 1951 చెన్నై 6
కేంద్రీయ రైల్వే 5 - 11 - 1951 ముంబయి 5
పశ్చిమ రైల్వే 5 - 11 - 1951 ముంబయి(చర్చిగేట్‌) 6
ఉత్తర రైల్వే 14 - 4 - 1952 న్యూదిల్లీ 5
ఈశాన్య రైల్వే 14 - 4 - 1952 గోరఖ్‌పుర్‌  3
ఆగ్నేయ రైల్వే 1 - 8 - 1955 కోల్‌కత 4
తూర్పు రైల్వే 1 - 8 - 1955  కోల్‌కత 4
ఈశాన్య సరిహద్దు రైల్వే 15 - 1 - 1958  గువహటి 5
దక్షిణ మధ్య రైల్వే 1 - 10 - 1966  సికింద్రాబాద్ 3
తూర్పు మధ్య రైల్వే 1 - 10 - 2002   హాజీపుర్ 5
వాయవ్య రైల్వే 1 - 10 - 2002 జైపూర్‌ (జయపుర) 4
తూర్పు కోస్తా రైల్వే 1 - 4 - 2003   భువనేశ్వర్ 3
ఉత్తర మధ్య రైల్వే 1 - 4 - 2003 అలహాబాద్ 3
ఆగ్నేయ మధ్య రైల్వే 1 - 4 - 2003 బిలాస్‌పూర్‌ 3
నైరుతి రైల్వే 1 - 4 - 2003 హుబ్లీ 3
పశ్చిమ మధ్య రైల్వే 1 - 4 - 2003 జబల్‌పూర్‌ 3
మెట్రో రైల్వే 31 - 12 - 2010 కోల్‌కత 2
దక్షిణ కోస్తా రైల్వే 1 - 3 - 2019 విశాఖపట్నం 3


ఉత్తర రైల్వే మండలం అత్యంత పొడవైన రైల్వే మార్గాన్ని కలిగి ఉంది. దాని తర్వాత పశ్చిమ మండలం, ఆ తర్వాత దక్షిణ మధ్య రైల్వేలు పొడవైన రైలు మార్గాన్ని కలిగి ఉన్నాయి.

భారతదేశంలో మొట్టమొదటిసారిగా BOT ప్రాతిపదికపై (అంటే Build Operate adn Transfer) నిర్మించిన రైలు మార్గం కొంకణ్ రైల్వే. దీని ప్రధాన కేంద్రం నవీ ముంబాయి. కొంకణ్ రైల్వే మార్గం 1998 జనవరి 26 నుంచి పనిచేయడం ప్రారంభించింది. దీని మొత్తం పొడవు 760 కిలోమీటర్లు. ఇది ఆసియాలోనే అతి పెద్ద సొరంగ మార్గాన్ని కలిగి ఉంది. ఈ మార్గాన్ని నిర్మించేందుకు కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ అనే సంస్థను ఏర్పాటు చేశారు.

ఈ ప్రాజెక్టువల్ల లబ్ధి పొందుతున్న రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, కేరళ. పట్టాల మధ్య ఉన్న వెడల్పును బట్టి రైలు మార్గాలను మూడు తరగతులుగా విభజించవచ్చు. అవి


 

భారతదేశంలో మొదటి ఎలక్ట్రిక్ రైల్వే లైన్‌ను 1925లోబొంబాయిలోని విక్టోరియా టర్మినస్ నుంచి కుర్లా (V.T.Kurla) వరకు ఏర్పాటు చేశారు. మొట్టమొదటి ఎలక్ట్రిక్ రైలు పేరు డక్కన్ క్వీన్.  ఇప్పటివరకు దేశంలోని మొత్తం రైలు మార్గాల పొడవులో దాదాపు 28 శాతం రైలు మార్గాలను విద్యుద్దీకరించారు. 
ప్రపంచంలోకెల్లా అత్యధిక మంది ఉద్యోగులను కలిగి ఉన్న సంస్థ - భారతీయ రైల్వేలు. సుమారు 14 లక్షల మంది పనిచేస్తున్నారు. ప్రపంచంలో కెల్లా మిక్కిలి పొడవైన రైల్వే ప్లాట్‌ఫాం- బెంగాల్‌లోని ఖరగ్‌పూర్ ప్లాట్‌ఫారం.

 

భారతీయ రైల్వేలు - ప్రధాన ఘట్టాలు

* భారతదేశంలో 1832లో మద్రాస్‌లో మొదటి రైల్వేలైన్‌ను ప్రతిపాదించారు. 1837లో మద్రాస్‌ రెడ్‌హిల్స్‌ చింతాద్రిపేట వద్ద, 1845లో ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి వద్ద గోదావరి నదిపై రైలు బ్రిడ్జి నిర్మించారు. 

* దేశంలో మొదటి ప్యాసింజర్‌ రైల్వేలైన్‌ 1853 ఏప్రిల్‌ 16న మహారాష్ట్రలోని ముంబయి - థానే మధ్య ఏర్పాటుచేశారు. ఈ రైల్వేట్రాక్‌ పొడవు 34 కిలోమీటర్లు. 14 బోగీలు, 400 మంది ప్రయాణికులతో ఫెయిర్‌ క్వీన్‌ ఇంజిన్‌ ద్వారా తొలిరైలు ప్రయాణించింది. మొత్తం ప్రయాణ సమయం 75 నిమిషాలు. 

* మొదటి తూర్పు ఇండియా రైల్వే హౌరా - హుగ్లీ మధ్య 1854 ఆగస్టు 15న, దక్షిణ భారత మొదటి లైన్‌ మద్రాస్‌ - ఆర్కాట్‌ మధ్య 1856 జులై 1న ప్రారంభమయ్యాయి. మొదటి ఉత్తర భారత రైల్వేలైన్‌ 1859లో అలహాబాద్‌ - కాన్పూర్‌ మధ్య ప్రారంభమైంది.

* ఆంధ్రప్రదేశ్‌లో 1862లో పుత్తూరు - రేణిగుంట మధ్య, తెలంగాణలో 1874లో సికింద్రాబాద్‌ - వాడి మధ్య మొదటిలైన్‌ ప్రారంభించారు.

* దేశంలో మొదటి ఎలక్ట్రిక్‌ ప్యాసింజర్‌ రైలు విక్టోరియా టెర్మినల్‌ - కుర్లా మధ్య ప్రారంభమైంది.

* 1924 - 25లో బ్రిటిష్‌ వారు ప్రత్యేకంగా రైల్వేబడ్జెట్‌ను ఏర్పాటుచేశారు. 2016లో ప్రవేశ పెట్టింది చివరి ప్రత్యేక రైల్వే బడ్జెట్‌గా నిలిచిపోయింది. 2017 ఫిబ్రవరి 1న దీన్ని సాధారణ బడ్జెట్‌లో విలీనం చేశారు. 

* 1951లో రైలుమార్గాలను జాతీయం చేశారు. దీంతో ఇవి భారతీయ రైల్వేగా అవతరించాయి. అలాగే రైల్వేజోన్‌ వ్యవస్థను కూడా ప్రారంభించారు. 1951 ఏప్రిల్‌ 14న చెన్నై, 1951 నవంబరు 5న కేంద్ర, పశ్చిమ రైల్వే జోన్‌లను ముంబయిలో ఏర్పాటుచేశారు. 

* 1986లో మొదటిసారి కంప్యూటరైజ్డ్‌ టికెటింగ్, రిజర్వేషన్‌ వ్యవస్థను న్యూదిల్లీలో ప్రారంభించారు. 1995లో దేశమంతా రైల్వే రిజర్వేషన్‌ వ్యవస్థను కంప్యూటీకరించారు.

* 1989 - 90లో కొంకణ్‌ రైల్వేలైన్‌ పనులు చేపట్టి, 1998 జనవరిలో ప్రారంభించారు. ఇది ప్రత్యేక కార్పొరేషన్‌. ఇదే కొంకణ్‌ రైల్వే కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (కేఆర్‌సీఎల్‌) కింద స్వయం ప్రతిపత్తి సంస్థగా పనిచేస్తోంది. ఇందులో కేంద్ర ప్రభుత్వానికి 51 శాతం వాటా, మహారాష్ట్ర - 22, కర్ణాటక - 15, కేరళ, గోవా ప్రభుత్వాలకు ఆరు శాతం వాటా ఉన్నాయి. 741 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గాన్ని కర్ణాటకలోని థోకూర్‌ నుంచి మహారాష్ట్రలోని రోహ వరకు నిర్మించారు. ఈ సింగిల్‌ ట్రాక్‌లో సుమారు 10 శాతం సొరంగ మార్గాలు ఉన్నాయి. వీటిలో అత్యంత పొడవైన సొరంగ మార్గం రత్నగిరి సమీపంలోని కర్బూడే వద్ద ఉంది. దీని పొడవు 6.5 కిలోమీటర్లు.

* 2015 జులైలో జపాన్‌ సాంకేతిక సహాయంతో దేశంలో తొలిసారిగా ముంబయి - అహ్మదాబాద్‌ మధ్య హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌కు శంకుస్థాపన చేశారు. దీన్ని 2023 డిసెంబరు నాటికి పూర్తిచేయాలని నిర్ణయించారు. దీని మొత్తం పొడవు 508.18 కిలోమీటర్లు. స్టాండర్డ్‌గేజ్‌ ద్వారా గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.

* దేశంలో తొలి గ్రీన్‌ఫీల్డ్‌ రైల్‌ కారిడార్‌ను 2016 జులై 15న రామేశ్వరం - మనామధురై మధ్య 114 కిలోమీటర్ల పొడవుతో ప్రారంభించారు. పర్యావరణాన్ని కాపాడేందుకు బయోటాయిలెట్లను ఉపయోగిస్తున్నారు.

* దేశంలో తొలి ప్రైవేటు రైలు తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఐఆర్‌సీటీసీ నిర్వహణలో 2019 అక్టోబరు 4న న్యూదిల్లీ - లఖ్‌నవూ మధ్య ప్రారంభించారు. తర్వాత 2020 జనవరి 17న అహ్మదాబాద్‌ - ముంబయి మధ్య రెండో సర్వీసు ప్రారంభమైంది.

రైల్వే ఉత్పత్తి యూనిట్లు
ప్రస్తుతం భారతీయ రైల్వేలకు రైలు ఇంజన్‌లనూ, రైలుపెట్టెలనూ వాటికి సంబంధించిన భాగాలనూ ఉత్పత్తిచేసే యూనిట్లు ఆరు ఉన్నాయి. అవి:
1. చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్, చిత్తరంజన్: అవిరి లోకోమోటివ్‌లను తయారుచేసేది. 1971 నుంచి ఈ రకం లోకోమోటివ్‌లను ఉత్పత్తిచేయడం నిలిపివేశారు. ప్రస్తుతం ఇది ఎలక్ట్రిక్ డీజిల్ హైడ్రాలిక్ షంటింగ్ లోకోమోటివ్‌లను ఉత్పత్తిచేస్తోంది.
2. డీజిల్ లోకోమోటివ్ వర్క్స్, వారణాసి (DLW): డీజిల్ లోకోమోటివ్‌లను తయారు చేయడానికి 1964లో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ వర్క్‌షాపు, బ్రాడ్‌గేజ్, మీటర్‌గేజ్, డీజిల్ లోకోమోటివ్‌లను, డీజిల్ షంటర్‌లనూ, విద్యుత్ షంటర్‌లనూ తయారుచేస్తోంది.
3. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, పెరంబూర్ (ICF) చెన్నై: ఇది 1955లో ఉత్పత్తిని ప్రారంభించింది. బ్రాడ్‌గేజ్, మీటర్ గేజ్‌లకు సంబంధించిన అన్ని సౌకర్యాలున్న రైలు పెట్టెలను తయారుచేస్తున్నారు.
4. విల్ అండ్ యాక్సిల్ ప్లాంటు, ఎలహంక (RWF) (బెంగళూరు): ఇది 1983లో చక్రాలు, ఇరుసు దండాల ఉత్పత్తిని ప్రారంభించింది.
5. డీజిల్ కాంపోనెంట్ వర్క్స్, పాటియాలా (పంజాబ్): పాటియాలాలోని డీజిల్ కాంపొనెంట్ వర్క్స్ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన డీజిల్ లోకోమోటివ్‌ల కాంపోనెంట్లను (విడిభాగాలను) ఉత్పత్తి చేస్తోంది. 
6. రైల్ కోచ్ ఫ్యాక్టరీ కపుర్తలా, (పంజాబ్) (RCF): భారతదేశంలో అతిపెద్ద రైల్వే ఉత్పత్తి యూనిట్ ఇది. ఈ కర్మాగారం ప్రయాణికుల పెట్టెలను తయారుచేస్తోంది.
               ప్రైవేటు రంగంలో డీజిల్ రైలు ఇంజన్లను ఉత్పత్తి చేసే సంస్థ టాటా- ఇంజనీరింగ్ లోకోమోటివ్ వర్క్స్- జంషెడ్‌పూర్ (జార్ఖండ్).  భారత రైల్వే పరిశోధన అభివృద్ధి (R&D)కి సంబంధించిన Research Design and Standard Organisation(RDSO) ను లక్నోలో స్థాపించారు. భారతదేశంలో అత్యధిక రైలు మార్గాల సాంద్రత కలిగిన రాష్ట్రం పంజాబ్. పశ్చిమ బెంగాల్ రెండో స్థానంలోను, బీహార్ మూడో స్థానంలోనూ ఉన్నాయి. భారతదేశంలో అత్యంత దూరం ప్రయాణించే రైలు- హిమసాగర్ ఎక్స్‌ప్రెస్. ఇది జమ్ముతావి నుంచి కన్యాకుమారి వరకు పయనిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే ప్లాట్‌ఫాం- ఖరగ్‌పూర్ (పశ్చిమబెంగాల్). దీని పొడవు 2,733 అడుగులు. 2010-11 రైల్వే బడ్జెట్‌లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి పర్యాటక, పుణ్యక్షేత్రాలను కలుపుతూ భారత తీర్థ్ రైళ్లను ఆరంభించారు. మహిళల కోసం మాతృభూమి రైళ్ళను, కార్మికుల కోసం కర్మభూమి రైళ్ళను తీసుకొచ్చారు. దేశ భద్రతా దళాలకు గౌరవ సూచకంగా జన్మభూమి ప్రత్యేక రైళ్ళను ప్రవేశపెట్టారు.

 

రైలు - ప్రయాణికుల సౌకర్యాలు
* ప్రస్తుతం దేశంలో 28 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల్లో (దిల్లీ, పుదుచ్చేరి, చండీఘడ్, లద్దాఖ్‌) రైలుమార్గాలు ఉన్నాయి. వీటిద్వారా సుమారు 2.3 కోట్ల మంది ప్రయాణికులు రోజూ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. రైలు మార్గాలు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు ఉత్తర్‌ ప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర. అత్యల్పంగా ఉన్నవి: సిక్కిం, మేఘాలయ, నాగాలాండ్‌.
* భారతదేశంలో ఎక్కువ వేగంతో నడిచే రైళ్లు 10 ఉన్నాయి. వీటిలో అత్యంత వేగవంతమైన రైలు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ (ట్రైన్‌-18.) ఇది న్యూదిల్లీ - వారణాసి మధ్య నడుస్తోంది. దీని అత్యధిక వేగం గంటకు 180 కిలోమీటర్లు. తర్వాతి స్థానంలో హజ్రత్‌ నిజాముద్దీన్‌ - ఝాన్సీ మధ్య నడిచే గతిమాన్‌ ఎక్స్‌ప్రెస్‌ (గంటకు 160 కి.మీ.), న్యూదిల్లీ - భోపాల్‌ మధ్య తిరిగే శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ (గంటకు 150 కి.మీ.) ఉన్నాయి. 
* ఊటీ పరిసర ప్రాంతాల్లో నడిచే రైలు నెమ్మదిగా ప్రయాణిస్తుంది. ఇది ఊటీ - మెటుపాళ్యం మధ్య గంటకు పది కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో వెళ్తుంది.
* ఎక్కువ దూరం ప్రయాణించే రైలు వివేక్‌ ఎక్స్‌ప్రెస్‌. ఇది తమిళనాడులోని కన్యాకుమారి నుంచి అస్సోం - డిబ్రుఘర్‌ మధ్య 9 రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తుంది. దూరం, సమయంపరంగా చూసినా ఇదే ముందుస్థానంలో నిలుస్తుంది. ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం 4,219 కిలోమీటర్లు. పట్టే సమయం 82 గంటల 50 నిమిషాలు. అతి తక్కువ దూరం ప్రయాణించే రైలు మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌ - అజ్నిల మధ్య నడుస్తోంది. ఇది కేవలం 3 కి.మీ మాత్రమే ప్రయాణిస్తుంది.
* దేశంలో అత్యధిక రాష్ట్రాల మీదుగా ప్రయాణించే రైలు నవయుగ ఎక్స్‌ప్రెస్‌. ఇది మంగళూరు - జమ్మూ తావి జంక్షన్‌ మధ్య 13 రాష్ట్రాలను కలుపుతూ ప్రయాణిస్తుంది.
* త్రివేండ్రం - హజ్రత్‌ నిజాముద్దీన్‌ మధ్య తిరిగే రాజధాని ఎక్స్‌ప్రెస్, వడోదర - కోటా మధ్య సుమారు 538 కిలోమీటర్లు నాన్‌-స్టాప్‌గా ప్రయాణిస్తుంది. ఎక్కువ స్టాప్‌లు కలిగిన రైలు మెయిల్‌ ఎక్స్‌ప్రెస్‌. ఇది హౌరా - అమృత్‌సర్‌ మధ్య నడుస్తుంది. దీనికి దాదాపు 115 స్టాపులు ఉన్నాయి.
* కర్ణాటకలోని హుబ్లీ రైల్వేస్టేషన్‌లో ఉన్న రైల్వే ఫ్లాట్‌ఫామ్‌ ప్రపంచవ్యాప్తంగా అత్యంత పొడవైందిగా రికార్డు సృష్టించింది. దీని పొడవు 1400 మీటర్లు. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ (1366 మీ.) రెండో స్థానంలో నిలిచింది. 
* అత్యల్ప పొడవైన ఫ్లాట్‌ఫామ్‌ ఒడిశాలోని ఇబ్‌ రైల్వేస్టేషన్‌లో ఉంది. దీని పొడవు కేవలం 207 మీ. మాత్రమే. 
* ఇంటర్‌ లాకింగ్‌ వ్యవస్థ ద్వారా ఎక్కువ మార్గాలకు రైళ్లను నడిపిస్తున్న స్టేషన్‌గా దిల్లీ రైల్వే స్టేషన్‌ గిన్నిస్‌ రికార్డ్‌ నెలకొల్పింది.
* దేశంలో మొదటి రైల్‌వైర్‌, వై-ఫై ఉచిత సౌకర్యాలను బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్‌లో ఏర్పాటుచేయగా, ఉచిత గూగుల్‌ వై-ఫైను ముంబయి సెంట్రల్‌ స్టేషన్‌లో ప్రారంభించారు. 
* మొదటి సోలార్‌ రైల్వే స్టేషన్‌ - గువహటి (గౌహతి), ఎలక్ట్రానిక్‌ రైల్వే స్టేషన్‌ - కాచిగూడ (హైదరాబాద్‌), గ్రీన్‌ఫీల్డ్‌ స్టేషన్‌ - మన్వాలి, సోలార్‌ పవర్‌ ట్రైన్‌ - సఫ్దర్‌జంగ్‌ రైల్వే స్టేషన్‌ (దిల్లీ)లో ఏర్పాటయ్యాయి. మధ్యప్రదేశ్‌లోని హబిబ్‌గంజ్‌ రైల్వేస్టేషన్‌ను దేశంలో తొలిసారిగా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించారు. ప్రపంచంలోనే మొదటి రైల్వే సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ను బినా (మధ్యప్రదేశ్‌)లో నెలకొల్పారు. 
* దేశంలో మొదటి హాస్పిటల్‌ ట్రైన్‌ ‘లైఫ్‌లైన్‌’ (జీవనరేఖ) ఎక్స్‌ప్రెస్‌ను 1991 జులై 16 న ముంబయి కేంద్రంగా ప్రారంభించారు. హెచ్‌ఐవీ/ ఎయిడ్స్‌పై అవగాహన కల్పించేందుకు ఇండియన్‌ రైల్వే 2007 డిసెంబరు 1న దిల్లీ కేంద్రంగా ‘రెడ్‌ రిబ్బన్‌ ఎక్స్‌ప్రెస్‌’ను ప్రారంభించింది. పిల్లలకు సైంటిఫిక్‌ ఎగ్జిబిషన్, బయోడైవర్సిటీ స్పెషల్, వాతావరణ మార్పులు, పర్యావరణంపై అవగాహన కల్పించడానికి దిల్లీ కేంద్రంగా 2007 అక్టోబరు 1న సైన్స్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు.

Posted Date : 11-12-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌