• facebook
  • whatsapp
  • telegram

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌

 రాజ్యాంగం యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ)ను దేశంలో ప్రతిభ ఆధారిత వ్యవస్థను కాపాడే సంస్థగా రూపొందించింది. ఇది అఖిల భారత సర్వీసులు, కేంద్ర సర్వీసుల్లో గ్రూప్‌-ఎ, గ్రూప్‌-బి లాంటి నియామకాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. జాతీయ స్థాయిలో అత్యున్నత సర్వీసుల ఎంపికను పటిష్ఠంగా, పారదర్శకంగా నిర్వహించడం ద్వారా యూపీఎస్సీ దేశ పరిపాలనకు అవసరమైన ఉద్యోగులను అందిస్తోంది.

చారిత్రక నేపథ్యం

    పోటీపరీక్షల ద్వారా ఉద్యోగులను ఎంపిక చేసే పద్ధతిని ప్రవేశపెట్టిన మొదటి దేశం చైనా. ఉద్యోగస్వామ్యానికి సంబంధించిన పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ విధానాన్ని మనం బ్రిటన్‌ నుంచి గ్రహించాం. మన దేశంలో వారన్‌ హేస్టింగ్స్‌ కాలంలో 1772లో జిల్లా కలెక్టర్‌ వ్యవస్థను ప్రవేశపెట్టారు. లార్డ్‌ కారన్‌వాలీస్‌ 1793లో పబ్లిక్‌ సర్వీసులను పునర్‌వ్యవస్థీకరించి సివిల్‌ సర్వీసు విధానాన్ని ప్రవేశపెట్టాడు.

    1919 నాటి మాంటేగ్‌ - చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకోసం ఒక పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ను ఏర్పాటు చేయాలని పేర్కొంది. దీనిలో భాగంగా ‘లీ’ కమిషన్‌ సిఫార్సుల మేరకు 1926లో కేంద్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం జాతీయస్థాయిలో ఫెడరల్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్, రాష్ట్రాల్లో రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ల ఏర్పాటును నిర్దేశించారు.

రాజ్యాంగంలో వివరణ

స్వాతంత్య్రానంతరం రాజ్యాంగం అమల్లోకి రావడంతో ఫెడరల్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు రాజ్యాంగ భద్రత కల్పించినట్లయ్యింది. ఇది 1950లో యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌గా మారి స్వయం ప్రతిపత్తి గల సంస్థగా కొనసాగుతుంది. దీనికి 1947 నుంచి 1949 వరకు హెచ్‌.కె.కృపలాని, 1949 నుంచి 1955 వరకు ఆర్‌.ఎస్‌.బెనర్జీ  ఛైర్మన్‌గా వ్యవహరించారు. ప్రస్తుత కమిషన్‌ ఛైర్మన్‌ అరవింద్‌ సక్సేనా. భారత రాజ్యాంగంలోని శ్రీఖిజువ భాగంలో ఆర్టికల్‌ 315 నుంచి 323 వరకు యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్మాణం, సభ్యుల నియామకం, తొలగింపు; సంస్థ స్వతంత్రత, అధికారాలు, విధుల గురించి వివరణ ఉంది.

ఆర్టికల్‌ 315: జాతీయస్థాయిలో ఉద్యోగాల భర్తీకి యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్, రాష్ట్రాల్లో ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను నిర్దేశించారు. రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల కోరిక మేరకు పార్లమెంటు చట్టం ద్వారా జాయింట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (జేపీఎస్సీ)ను ఏర్పాటు చేయవచ్చు. రాష్ట్రాల గవర్నర్‌ల కోరిక మేరకు రాష్ట్రపతి అనుమతితో యూపీఎస్సీ ఆయా రాష్ట్రాల బాధ్యతలను చేపట్టవచ్చు.

ఆర్టికల్‌ 316: యూపీఎస్సీ, జేపీఎస్సీల ఛైర్మన్, సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారు. ప్రస్తుతం యూపీఎస్సీ సభ్యుల సంఖ్య ఛైర్మన్‌తో కలిపి 11. వీరి పదవీకాలం పదవి చేపట్టినప్పటి నుంచి 6 సంవత్సరాలు లేదా 65 ఏళ్ల వయసు వరకు ఉంటుంది. జేపీఎస్సీ ఛైర్మన్, సభ్యుల పదవీకాలం 6 సంవత్సరాలు లేదా 62 ఏళ్ల వయసు వరకు ఉంటుంది. వీరు తమ రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించాలి. రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్, సభ్యులను గవర్నర్‌ నియమిస్తారు. వీరి పదవీకాలం 6 సంవత్సరాలు లేదా 62 ఏళ్ల వయసు వరకు ఉంటుంది. వీరు తమ రాజీనామాను గవర్నర్‌కు సమర్పించాలి.  

ఆర్టికల్‌ 317: యూపీఎస్సీ, జేపీఎస్సీ, రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్, సభ్యులను అసమర్థత, అవినీతి, దుష్ప్రవర్తన లాంటి కారణాలతో సుప్రీంకోర్టు విచారణ అనంతరం రాష్ట్రపతి తొలగిస్తారు. యూపీఎస్సీ, జేపీఎస్సీ ఛైర్మన్, సభ్యులను రాష్ట్రపతి సస్పెండ్‌ చేయగలరు. రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్, సభ్యులను గవర్నర్‌ సస్పెండ్‌ చేయగలరు. వారిని తొలగించే అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది.

ఆర్టికల్‌ 318: యూపీఎస్సీ, జేపీఎస్సీ ఛైర్మన్, సభ్యుల సంఖ్యను, వారి నియమ నిబంధనలను రాష్ట్రపతి నిర్ణయించగా, రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్, సభ్యుల సంఖ్యను, వారి నియమ నిబంధనలను ఆయా రాష్ట్రాల గవర్నర్‌లు నిర్ణయిస్తారు. 

ఆర్టికల్‌ 319: 

*  పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్, సభ్యులు పదవీ విరమణ అనంతరం ఇతర ప్రభుత్వ ఉద్యోగాలను చేపట్టకూడదు. 

*  ఒక రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్‌ తన పదవీ విరమణ అనంతరం యూపీఎస్సీ సభ్యుడు లేదా ఛైర్మన్‌గా లేదా మరొక రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా ఉండవచ్చు. 

* యూపీఎస్సీ ఛైర్మన్‌ కాకుండా మిగిలిన సభ్యులు పదవీ విరమణ అనంతరం యూపీఎస్సీ ఛైర్మన్‌ లేదా రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా నియమితులుకావచ్చు. 

*  రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సభ్యుడిగా పదవీ విరమణ చేసినవారు అదే రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు ఛైర్మన్‌ లేదా యూపీఎస్సీ సభ్యుడు/ఛైర్మన్‌గా లేదా మరొక రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు ఛైర్మన్‌గా నియమితులు కావచ్చు.

సుప్రీంకోర్టు తీర్పు: యూపీఎస్సీ మాజీ ఛైర్మన్‌ ఎ.ఆర్‌.కిద్వాయ్‌ను బిహార్‌ రాష్ట్రానికి గవర్నర్‌గా నియమించడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. గవర్నర్‌ పదవి ప్రభుత్వ ఉద్యోగం కాదని, అది రాజ్యాంగపరమైన పదవి అని కోర్టు పేర్కొంది.

ఆర్టికల్‌ 320: 

యూపీఎస్సీ విధులు: అఖిల భారత సర్వీసులు, కేంద్ర సర్వీసులు, కేంద్ర పాలిత ప్రాంతాల సర్వీసుల నియామకాలకు పరీక్షల నిర్వహణ.

ప్రభుత్వానికి యూపీఎస్సీ సలహాలు, సూచనలు 

*  అంతర్‌ సర్వీసుల మార్పుకు సంబంధించిన అంశాలు

*  సివిల్‌ పోస్టుల రిక్రూట్‌మెంట్‌ పద్ధతి

*  పోస్టుల నియామకం, ప్రమోషన్‌లు, బదిలీలు

* ఉద్యోగుల క్రమశిక్షణా చర్యలకు సంబంధించిన అంశాలు

* సర్వీసు పొడిగింపునకు సంబంధించిన, పదవీ విరమణ చేసిన సివిల్‌ సర్వెంట్ల పునర్నియామక విషయాలు


ఆర్టికల్‌ 321: యూపీఎస్సీ, జేపీఎస్సీల అధికారాలు, విధులను విస్తరిస్తూ పార్లమెంటు ప్రత్యేక చట్టాన్ని రూపొందించవచ్చు.


ఆర్టికల్‌ 322: యూపీఎస్సీ ఛైర్మన్, సభ్యులు, ఇతర ఉద్యోగుల వేతనాలు, పెన్షన్‌లు, కార్యాలయ పరిపాలనా ఖర్చులను కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు.


ఆర్టికల్‌ 323: యూపీఎస్సీ తన వార్షిక నివేదికను రాష్ట్రపతికి సమర్పిస్తుంది. దాన్ని రాష్ట్రపతి పార్లమెంటుకు సమర్పిస్తారు.

అఖిల భారత సర్వీసులు

  ప్రస్తుతం మన దేశంలో మూడు అఖిల భారత సర్వీసులు ఉన్నాయి. 1947లో ఐఏఎస్‌ (ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసెస్‌), ఐపీఎస్‌ (ఇండియన్‌ పోలీస్‌ సర్వీసెస్‌) ఉండేవి. 1966లో ఐఎఫ్‌ఎస్‌ (ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసెస్‌) అమల్లోకి వచ్చింది. ఈ సర్వీసులను మూడు కేంద్ర మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తున్నాయి. 

 ఐఏఎస్‌ను ఉద్యోగ బృంద మంత్రిత్వ శాఖ, ఐపీఎస్‌ను హోంమంత్రిత్వ శాఖ, ఐఎఫ్‌ఎస్‌ను పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్నాయి. అఖిల భారత సర్వీసులను నియంత్రించే అంతిమ అధికారం భారత ప్రభుత్వానికే ఉంటుంది.

సివిల్‌ సర్వీసుల దినోత్సవం 

1947 ఏప్రిల్‌ 21న న్యూదిల్లీలో భారత తొలి హోంమంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ మొదటి సివిల్‌ సర్వీసెస్‌ ప్రొబెషనరీ బ్యాచ్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. అందుకే మన దేశంలో ఏటా ఏప్రిల్‌ 21న  ‘సివిల్‌ సర్వీసుల దినోత్సవాన్ని’ నిర్వహిస్తున్నారు. సివిల్‌ సర్వెంట్లు ప్రజాసేవకు పునరంకితమవడం, పౌరుల అవసరాలను తీర్చడంలో తమ కర్తవ్యాన్ని గుర్తించడం లక్ష్యంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

స్వాతంత్య్రానంతరం సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ కృషి ఫలితంగా మన దేశంలో అఖిల భారత సర్వీసులు ఏర్పాటయ్యాయి. అందుకే సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ను అఖిల భారత సర్వీసుల పితామహుడిగా పేర్కొంటారు.

Posted Date : 04-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌