• facebook
  • whatsapp
  • telegram

ఆంధ్రప్రదేశ్‌ - జీవవైవిధ్యం   

విభిన్న జీవజాతులకు విశిష్ట రక్షణ!


  దేశంలో విస్తృత జీవవైవిధ్యం ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఒకటి. భౌగోళికంగా ఒక వైపు బంగాళాఖాతం, రాష్ట్రమంతా విస్తరించిన తూర్పుకనుమలు, తీర మైదానాలు, విభిన్న అడవులు, సరస్సులు వంటివన్నీ జీవవైవిధ్యానికి ప్రతీకలుగా నిలిచాయి. ప్రకృతి సంరక్షణ, జీవావరణ పరిరక్షణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పార్కులు, సంరక్షణ కేంద్రాలు, అభయారణ్యాలను ఏర్పాటు చేశాయి. వీటి ఉనికి, పరిధి, విస్తరణ, ప్రత్యేకతల గురించి పోటీ పరీక్షార్థులు క్షుణ్ణంగా తెలుసుకోవాలి. మన రాష్ట్రానికే ప్రత్యేకమైన జంతుజాలం, వృక్ష జాతులపై అవగాహన పెంచుకోవాలి.


ఆంధ్రప్రదేశ్‌లో ఒక బయోస్ఫియర్‌ రిజర్వు, మూడు జాతీయ పార్కులు, ఒక వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉన్నాయి. ఇవన్నీ కలిసి రాష్ట్ర భూభాగంలో 4.448% అంటే 8139.89 చ.కి.మీ. విస్తీర్ణాన్ని ఆక్రమించాయి. ఇందులో ఒక టైగర్‌ రిజర్వు, ఒక ఏనుగుల రిజర్వు కూడా ఉన్నాయి. రాష్ట్రంలో 5,757 రకాల జంతువులు, 2,800 రకాల చెట్లను గుర్తించారు.

బయోస్ఫియర్‌ రిజర్వు: ఏదైనా ఒక భౌగోళిక ప్రాంతంలో అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న జాతులను, అదే సహజసిద్ధ పరిసరాలతో పరిరక్షించాలి. అలాగే గిరిజనుల జీవనశైలి, జంతువులు, మొక్కల జన్యు ఆధారాలను సంరక్షించాలి. వాటి కోసం ఏర్పాటైన బహుళ ప్రయోజనకర రక్షిత ప్రాంతాలను బయోస్ఫియర్‌ రిజర్వులు అంటారు. దేశంలో మొదటి బయోస్ఫియర్‌ నీలగిరి బయోస్ఫియర్‌ రిజర్వు (1986). దేశంలో ఇలాంటివి మొత్తం 18 ఉన్నాయి. ఏపీలో శేషాచలం బయోస్ఫియర్‌ రిజర్వు ఉంది.


శేషాచలం బయోస్ఫియర్‌ రిజర్వు: దీన్ని 2019, సెప్టెంబరు 20న 17వ బయోస్ఫియర్‌ రిజర్వుగా ప్రకటించారు. 4755.997 చ.కి.మీ. విస్తీర్ణంతో దేశంలో 9వ స్థానంలో ఉంది. తూర్పు కనుమల్లో భాగంగా తిరుపతి జిల్లాలో విస్తరించింది. ఇందులో 178 కుటుంబాలకు చెందిన 1700 రకాల వృక్షజాతులున్నాయి. వాటిలో అరుదైన ఎర్రచందనం కూడా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ పార్కులు: ఏదైనా భౌగోళిక ప్రాంతంలో మానవ చర్యల వల్ల అంతరించిపోయే ప్రమాదం ఉన్న ప్రకృతి సంపద, సుందర దృశ్యాలు, వన్య ప్రాణులను సంరక్షించేందుకు ఏర్పాటు చేసిన రక్షిత ప్రాంతాలను జాతీయ పార్కులు అంటారు. ప్రస్తుతం దేశంలో 106 జాతీయ పార్కులున్నాయి. వాటిలో మొదటిది ఉత్తరాఖండ్‌లో 1936లో ఏర్పాటు చేసిన జిమ్‌కార్బెట్‌ నేషనల్‌ పార్కు. ఆంధ్రప్రదేశ్‌లో మూడు జాతీయ పార్కులున్నాయి. 1) శ్రీ వేంకటేశ్వర నేషనల్‌ పార్కు 2) రాజీవ్‌గాంధీ నేషనల్‌ పార్కు 3) పాపికొండ నేషనల్‌ పార్కు


శ్రీ వేంకటేశ్వర నేషనల్‌ పార్కు: తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో ఈ పార్కు ఉంది. దీన్ని 1985, సెప్టెంబరు 2న అభయారణ్యంగా, 1989 అక్టోబరు 16న జాతీయ పార్కుగా ప్రకటించారు. వైశాల్యం 526 చ.కి.మీ. శేషాచల కొండల్లో భాగమైన ఈ ప్రాంతంలో జీవ వైవిధ్యం ఎక్కువ. దీని పరిధిలో తలకోన, గుండలకోన, గుంజనా జలపాతాలున్నాయి. భారత ప్రభుత్వం 2010లో శేషాచలం కొండలను బయోస్ఫియర్‌గా ప్రకటించడంతో ఈ పార్కు దానిలో భాగమైంది. నక్కలు, హైనాలు, ఎగిరే బల్లులు, ఎలుగుబంట్లు, అడవి పిల్లులు వంటి ఎన్నోరకాల వన్యప్రాణులకు ఇది ఆవాసం. ఇందులో ఆకురాల్చే అడవులు ఉన్నాయి.

రాజీవ్‌గాంధీ నేషనల్‌ పార్కు: కడప జిల్లాలో ఉంది. దీన్ని రామేశ్వరం జాతీయ పార్కు అని కూడా పిలుస్తారు. 2.4 చ.కి.మీ. వైశాల్యంతో పెన్నానది ఉత్తర ఒడ్డున ఉంది. 2005, నవంబరు 19న దీన్ని జాతీయ పార్కుగా ప్రకటించారు. 2017, మే 15న పార్కు చుట్టూ 500 మీటర్ల ప్రాంతాన్ని ఎకో జోన్‌గా గుర్తించారు. ఈ పార్కు కడప జిల్లాలో వెలికొండలు, పాలకొండలు, ఎర్రమల కొండల శ్రేణుల మధ్య ఉంది. దీనికి సమీపంలోని నగరం కడప.

పాపికొండ నేషనల్‌ పార్కు: ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో, గోదావరి నదీ ప్రాంతంలో విస్తరించి ఉంది. 1978లో వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంగా, 2008లో జాతీయ పార్కుగా ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఈ పార్కు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఏపీలో అతిపెద్ద జాతీయ పార్కు ఇదే. వైశాల్యం 562 చ.కి.మీ.

జులాజికల్‌ పార్కులు: తిరుపతి, విశాఖపట్నంలో ఈ జులాజికల్‌ పార్కులున్నాయి.


శ్రీ వేంకటేశ్వర జులాజికల్‌ పార్కు: దీన్ని తిరుపతిలో 1987, సెప్టెంబరు 29న స్థాపించారు. ఇది ఆసియాలోనే ప్రసిద్ధి చెందింది. 5,532 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఏనుగు, నెమలి, సాంబార్‌ జింక, చిరుతపులి, మొసలి, తెల్లపులి, సింహాలు, అడవి పంది లాంటి వాటితో కలిపి దాదాపు 1008 జంతువులున్నాయి. 75 రకాల క్షీరద జాతులు కనిపిస్తాయి. పక్షులు, సరీసృపాల్లాంటి వైవిధ్యమైన జీవులున్నాయి.

ఇందిరాగాంధీ జులాజికల్‌ పార్కు: విశాఖపట్నంలో కంబాలకొండ రక్షిత అడవి మధ్యలో ఈ పార్కు ఉంది. దీన్ని 1977, మే 19న ప్రారంభించారు. విస్తీర్ణం 625 ఎకరాలు. మూడువైపుల్లో తూర్పు కనుమలు, ఒక వైపు బంగాళాఖాతం ఉంది. ఇందులో దాదాపు 800 రకాల జంతువులున్నాయి. పులులు, సింహాలు, చిరుతలు, తోడేళ్లు, నక్కలు, హైనా, మొసలి, ఏనుగు, కోతులు ప్రధానమైనవి. పెలికాన్, నెమలి, బాతు, చిలుక లాంటి పక్షి జాతులూ కనిపిస్తాయి.

రాష్ట్రంలో జింకల పార్కులు:  1) కండలేరు జింకల పార్కు (నెల్లూరు) 2) చిత్తూరు రిజర్వ్‌ ఫారెస్ట్‌ జింకల పార్కు 3) పులియం జింకల పార్కు - కర్నూలు


* రాష్ట్రంలోని ఏకైక ఏనుగుల రిజర్వు - కౌండిన్య ఎలిఫెంట్‌ రిజర్వ్‌ (చిత్తూరు)

పులుల అభయారణ్యం (టైగర్‌ రిజర్వ్‌): ఆంధ్రప్రదేశ్‌లోని ఏకైక, దేశంలోనే పెద్దదైన పులుల అభయారణ్యం రాజీవ్‌గాంధీ టైగర్‌ రిజర్వు. దీన్ని నాగార్జునసాగర్‌ - శ్రీశైలం టైగర్‌ రిజర్వుగా వ్యవహరిస్తారు. 1983లో ఈ ప్రాంతాన్ని పులుల అభయారణ్యంగా ప్రకటించారు. 3,296 చ.కి.మీ. విస్తీర్ణంతో నంద్యాల, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో విస్తరించి ఉంది. తూర్పు కనుమల్లో భాగంగా నల్లమల అడవుల్లో కృష్ణా నది లోయలో ఉంది. ఇక్కడ నివసించే చెంచులు పులుల సంరక్షణలో పాలు పంచుకుంటున్నారు.


వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలు: రాష్ట్రంలో 13 వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో పెద్దది రాజీవ్‌గాంధీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. చిన్నది రోళ్లపాడు పక్షుల అభయారణ్యం.


వలస పక్షుల సంరక్షణ: రాష్ట్రంలో కొల్లేరు, పులికాట్‌ సరస్సులతో పాటు నేలపట్టు చెరువును వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలుగా నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, బర్డ్‌ వాచర్స్‌ సొసైటీ, సాకన్‌ (SACON n- Salim Ali Centre for Ornithology History) సంస్థలు వలస పక్షుల సంరక్షణ చేపడుతున్నాయి.


సముద్ర తాబేళ్ల సంరక్షణ:  తీరం వెంట స్థానీయ, పరస్థానీయ తాబేళ్ల గుడ్లను నెట్ల ద్వారా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రక్షిస్తోంది. ఏటా నవంబరులో పరస్థానీయ లేదా వలస వచ్చే తాబేళ్ల కోసం తగిన ఏర్పాట్లు చేస్తోంది.


మడ అడవుల స్థిరీకరణ: రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నదీ ముఖద్వారాల్లో 5,600 హెక్టార్ల ప్రాంతం మడ అడవుల నిర్మూలన జరిగి ఖాళీ ప్రాంతాలుగా మారాయి. వీటిని స్థిరీకరణ చేయడానికి భారత ప్రభుత్వం యూఎన్‌డీపీ (యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌) సహకారంతో పనిచేస్తోంది. మడ అడవులు, సునామీ లాంటి విపత్తుల నుంచి తీరప్రాంతాన్ని రక్షిస్తాయి.


కొల్లేరు సరస్సు స్థిరీకరణ: ఈ సరస్సు ఏలూరు జిల్లాలో గోదావరి, కృష్ణా డెల్టాల మధ్య విస్తరించి ఉంది. 1971 రామ్‌సర్‌ ఒప్పందంలో భాగంగా దీన్ని చిత్తడి నేలల సంరక్షణ ప్రాంతంగా గుర్తించారు. ఇందులో అయిదు అడుగుల కాంటూర్‌లో ఉన్న ప్రాంతాన్ని వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా నిర్ణయించారు.

ఏపీలో అరుదైన, అంతరించిపోయే ప్రమాదం ఉన్న జాతులు:


గ్రేట్‌ ఇండియన్‌ బస్టర్డ్‌ (బట్టమేక పక్షి): ఎవెస్‌ జాతికి చెందిన ఈ పక్షి అత్యంత అరుదైంది. పొడవైన కాళ్లు, పెద్ద శరీరంతో ఉంటుంది. సాధారణంగా భారత్, పాకిస్థాన్‌ల్లో కనిపిస్తుంది. కొంత దూరం మాత్రమే ఎగురుతుంది, నడుస్తుంది. గడ్డి భూములు, పొదల్లో నివసిస్తుంది. భారత ఉపఖండంలో 250 వరకు ఉంటాయని అంచనా.


స్లెండర్‌ లోరిస్‌: పిల్లి లాంటి జంతువు. క్షీరద జాతికి చెందింది. పెద్దకళ్లతో, గుడ్లగూబ ఆకారంలో ఉండే లోరిస్‌ భారత్, శ్రీలంకల్లో కనిపిస్తుంది. ఉష్ణమండల వర్షారణ్యాలు, ఆర్ద్ర ఆకురాల్చు, పొద అడవుల్లో చెట్లపై నివసిస్తుంది.


జెర్డాన్‌ కోర్సెస్‌ (కలివి కోడి): ఎవెస్‌ జాతికి చెందిన పక్షి. తూర్పు కనుమల్లోని పొద అడవులు, వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలోని శ్రీలంక మల్లేశ్వర అభయారణ్యంలో కనిపిస్తుంది.


గోల్డెన్‌ గెకో (బంగారు బల్లి): సరీసృప జాతికి చెందిన గెకో ప్రధానంగా వియత్నాం దేశంలో కనిపిస్తుంది. తిరుపతి కొండల్లోనూ దీన్ని చూడవచ్చు.


రెడ్‌ సాండర్స్‌ (ఎర్ర చందనం): శాస్త్రీయ నామం టీరోకార్పస్‌ శాంటలైనస్‌. తూర్పు కనుమల్లో భాగంగా చిత్తూరు, తిరుపతి, కడప, నెల్లూరు అడవుల్లో పెరుగుతుంది.


సైకస్‌ బెడ్డోమి: ఇది వివృత బీజ వర్గానికి చెందిన మొక్క. ప్రధాన ఆవాసం భారతదేశం. తిరుమల కొండల్లో కనిపిస్తుంది. 90 సెం.మీ పొడవున్న ఆకులు పసుపు, గోధుమ రంగులో ఉంటాయి.

సామాజిక అడవులు: ప్రభుత్వం, ప్రజల భాగస్వామ్యంలో మొక్కలు నాటే కార్యక్రమమే సామాజిక అడవుల పథకం. ఈ కార్యక్రమాన్ని అయిదో పంచవర్ష ప్రణాళికలో ప్రవేశపెట్టి ఆరో పంచవర్ష ప్రణాళికలో అమలుచేశారు. స్థానిక సమాజాల ప్రయోజనాల కోసం అడవుల నిర్వహణ చేపట్టడమే దీని ఉద్దేశం. ఇందులో భాగంగా బంజరు భూములు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు మొదలైన చోట్ల మొక్కలు నాటుతారు. అడవుల్లో ఆర్థిక వనరులను సృష్టించడానికి, వాయు కాలుష్యాన్ని, మృత్తికా క్రమక్షయాన్ని అరికట్టడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది.


జీవ వైవిధ్యంలో ఏపీకి ప్రత్యేకం


* ఒంగోలు గిత్త  - ప్రకాశం


* దక్కన్‌ పొట్టేలు - నెల్లూరు


* పుంగనూరు ఆవు  - చిత్తూరు


* పెరీతి (సైకస్‌) మొక్క  - శ్రీకాకుళం


* ఎర్రచందనం మొక్క - నెల్లూరు, కడప, చిత్తూరు (శేషాచలం అటవీ ప్రాంతం) 


రచయిత: దంపూరి శ్రీనివాస్‌


 

Posted Date : 12-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌