• facebook
  • whatsapp
  • telegram

ఆంధ్రప్రదేశ్‌ - అడవులు

 తెలుగు నేలలో వైవిధ్య వనాలు!


జీవుల మనుగడకు, జీవవైవిధ్యానికి, వాతావరణ సమతౌల్యానికి, ఆర్థికాభివృద్ధికి, సంస్కృతుల సంరక్షణకు అడవులు అత్యంత ప్రధానమైనవి. శీతోష్ణస్థితులను అనుసరించి ఇవి అనేక రకాలుగా ఉంటాయి. ఒక రాష్ట్రం ప్రగతిలో కీలకంగా వ్యవహరిస్తాయి. తీర మైదానం, తూర్పు కనుమలు, దక్కన్‌ పీఠభూమి లాంటి భిన్న భౌగోళిక, నైసర్గిక స్వరూపాలతో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ అంతటా అలాంటి చిన్న, పెద్ద అడవులు విస్తరించి ఉన్నాయి. ఆ విశిష్ట సహజ వనరుల్లోని రకాలు, స్వభావం, జిల్లాలవారీగా విస్తీర్ణం తదితర వివరాలపై పోటీ పరీక్షార్థులకు సమగ్ర అవగాహన ఉండాలి.

విశాల ప్రాంతంలో సహజ పరిస్థితుల్లో చెట్లు, పొదలతో కూడిన నిర్దిష్ట ప్రాంతాన్ని అడవి అంటారు. దీనికి ఆంగ్ల పదం ఫారెస్ట్‌. ఇది ఫోరెస్‌ అనే లాటిన్‌ పదం నుంచి వచ్చింది. ఫోరెస్‌ అంటే గ్రామ వెలుపలి సరిహద్దు ప్రాంతమని అర్థం.

పూర్వం ఎడారులు, మంచుతో నిండిన ప్రాంతాలు తప్ప మిగతా అంతా అడవులతో నిండి ఉండేది. ఆధునిక కాలంలో మానవ చర్యల వల్ల అడవులు చాలావరకు అదృశ్యమయ్యాయి. 20వ శతాబ్దం వచ్చేసరికి వ్యవసాయానికి అనువుకాని ప్రాంతాలు, కొండలు, గుట్టలున్న ప్రాంతాలు, చిత్తడి భూములు, చాలా చలిగా ఉండే ప్రాంతాలు (టైగా), జనావాసాలకు దూరంగా ఉండే ప్రాంతాల్లో మాత్రమే అడవులు మిగిలాయి. అడవులున్న ప్రాంతాల్లో పర్యావరణ సమతౌల్యత, వర్షపాతం, నేలలు, నీటి ప్రవాహ నియంత్రణ, పారిశ్రామిక ప్రాంతాల కాలుష్య నివారణ మొదలైనవి ప్రభావితమవుతాయి.

విస్తీర్ణం: 1952 జాతీయ అటవీ విధానం ప్రకారం మొత్తం దేశ భూభాగంలో 33% అడవులు అవసరమని నిర్ణయించారు. ఇటీవల రూపొందించిన 2018 జాతీయ అటవీ విధానం కూడా 33.3% అడవులు ఉండాలని, మొత్తం అటవీ విస్తీర్ణం 71 మిలియన్‌ హెక్టార్ల నుంచి 100 మిలియన్‌ హెక్టార్లకు పెంచాలని లక్ష్యంగా నిర్దేశించింది. ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఐ) 1987 నుంచి దేశంలో అటవీ విస్తీర్ణాన్ని లెక్కించి, ప్రతి రెండేళ్లకు ఒకసారి ఇండియన్‌ స్టేట్‌ ఫారెస్ట్‌ రిపోర్ట్‌ (ఐఎస్‌ఎఫ్‌ఆర్‌)ను వెల్లడిస్తుంది. ఇటీవల విడుదల చేసిన ‘ఐఎస్‌ఎఫ్‌ఆర్‌ - 2021’ అనేది 17వ నివేదిక.

17వ అటవీ నివేదిక ఐఎస్‌ఎఫ్‌ఆర్‌ - 2021: ఈ నివేదికను 2022, జనవరిలో విడుదల చేశారు. దీని ప్రకారం దేశంలో మొత్తం అటవీ విస్తీర్ణం 7,13,789 చ.కి.మీ. కాగా భౌగోళిక విస్తీర్ణంలో 21.71%గా ఉంది. అటవీ విస్తీర్ణం అధికంగా మధ్యప్రదేశ్‌లో, అత్యల్పంగా హరియాణాలో ఉంది. అదే విధంగా అటవీ శాతం అధికంగా ఉన్న రాష్ట్రం మిజోరాం,  అత్యల్పంగా ఉన్న రాష్ట్రం హరియాణా.

17వ అటవీ నివేదిక - ఏపీలో అడవులు: రాష్ట్రంలో మొత్తం అటవీ విస్తీర్ణం 29,784.30 చ.కి.మీ. రాష్ట్ర మొత్తం భూభాగంలో ఇది 18.93%. దేశంలో అటవీ విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్‌ 7వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం అధికంగా ఉన్న జిల్లాలు 1) తూర్పుగోదావరి 2) కడప 3) విశాఖపట్నం. అత్యల్పంగా ఉన్న జిల్లాలు 1) కృష్ణా 2) శ్రీకాకుళం.

* 2021 నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో కెనోపీ ఆధారంగా అడవులు (కెనోపీ అంటే వృక్షాల ఎగువ ఛత్రం ప్రకారం)

గమనిక: కెనోపీ 10% పైగా ఉన్న ప్రాంతాన్నే అడవిగా పరిగణిస్తాం.

రాష్ట్రంలో అధిక సాంద్రత గల అడవులు ఎక్కువగా ఉన్న జిల్లాలు: 1) తూర్పు గోదావరి  2) పశ్చిమ గోదావరి

మధ్యస్థ సాంద్రత అడవి అధికంగా ఉన్న జిల్లాలు: 1) కడప, 2) తూర్పుగోదావరి.

ఓపెన్‌ ఫారెస్ట్‌ అధికంగా ఉన్న జిల్లాలు: 1) చిత్తూరు, 2) విశాఖపట్నం

అడవుల వృద్ధి (2019 - 2021): ఐఎస్‌ఎఫ్‌ఆర్‌ - 2021 ప్రకారం దేశంలో అటవీ విస్తీర్ణం పెరుగుదల ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ (647 చ.కి.మీ.) ఉండగా తర్వాతి స్థానాల్లో తెలంగాణ (632), ఒడిశా (537), కర్ణాటక (155) ఉన్నాయి.  * ఏపీలో అడవుల విస్తీర్ణం 2019లో 29,137 చ.కి.మీ. ఉండగా, 2021లో 29,784 చ.కి.మీ.గా ఉంది. ఇందులో పెరుగుదల 647 చ.కి.మీ.* అటవీ విస్తీర్ణం పెరుగుదల అధికంగా నమోదైన జిల్లాలు (2019 - 2021) 1) నెల్లూరు 2) తూర్పుగోదావరి (గమనిక: ఈ జిల్లాల ర్యాంకులు, 13 జిల్లాల ఆధారంగా ఇచ్చారు).*శాతం పరంగా అటవీ విస్తీర్ణం వృద్ధి రేటుతో మొదటి స్థానంలో తెలంగాణ, రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ ఉన్నాయి.

అడవులు - రకాలు: శీతోష్ణస్థితి, నేల స్వభావం, ఉపరితలం ఎత్తు ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌లో అడవులను నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చు. 1) ఆర్ధ్ర ఆకురాల్చు అడవులు 2) అనార్ధ్ర ఆకురాల్చు అడవులు 3) ముళ్ల అడవులు 4) మడ అడవులు.

ఆర్ద్ర ఆకురాల్చు అడవులు: ఇవి వర్షపాతం 125 సెం.మీ. నుంచి 200 సెం.మీ. ఉన్న ప్రాంతాల్లో పెరుగుతాయి. ఇక్కడి వృక్షాలు వేసవిలో బాష్పోత్సేకాన్ని తగ్గించడానికి ఆకులను రాలుస్తాయి. తిరిగి వర్షాకాలం నాటికి కొత్త ఆకులు చిగురిస్తాయి. కొన్ని నెలలపాటు వర్షాలు కురిసి, సంవత్సరంలో అధిక భాగం పొడిగా, వెచ్చగా ఉండే ప్రాంతాల్లో ఈ రకం అడవులు పెరుగుతాయి. ఇక్కడ పెరిగే ముఖ్య వృక్షాలు వేగి, ఏగిస, వెదురు, మద్ది, బండారు, జిట్టేగి, సాల్‌. ఈ అడవులు మన రాష్ట్రంలో ఈశాన్య భాగంలో శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. వీటిల్లో లభించే వృక్షసంపద నిర్మాణ రంగం, రవాణా వస్తువుల సామగ్రి తయారీకి అనువుగా ఉంటుంది. ఈ అడవులను తేమతో కూడిన ఆకురాల్చే అడవులు అని కూడా అంటారు.

అనార్ద్ర ఆకురాల్చు అడవులు: ఈ అడవులు 75 సెం.మీ. నుంచి 100 సెం.మీ. వర్షపాతం ఉండే ప్రాంతాల్లో పెరుగుతాయి. వీటినే శుష్క ఆకురాల్చు అడవులు అంటారు. ఈ రకం అడవులు మన దేశంలో, ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి. వర్షపాతం తక్కువగా ఉండటం వల్ల ఆకులను పూర్తిగా రాలుస్తాయి. వాటి వల్ల నేలకు సేంద్రియ పదార్థం అధికంగా లభిస్తుంది. ఈ రకం అడవులు మన రాష్ట్రంలో రాయలసీమ జిల్లాలైన కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లో ఉన్నాయి. ఇక్కడి ముఖ్య వృక్షాలు టేకు, మద్ది, బిల్లు, వెలగ, ఏగిస, వేప, బూరగ, మోదుగ, శ్రీగంధం, ఎర్రచందనం. ఇవి అత్యధికంగా ఉన్న జిల్లాలు కడప, కర్నూలు.


ముళ్ల అడవులు: 75 సెం.మీ. కంటే తక్కువ వర్షం కురిసే ప్రాంతాల్లో ఈ అడవులు పెరుగుతాయి. వీటిని చిట్టడవులు, పొద అడవులు, ఎడారి వృక్షజాలం అని కూడా పిలుస్తారు. ఇవి జీరోఫైటిక్‌ లక్షణాలతో ఉంటాయి. చాలా తక్కువ వర్షం, అధిక ఉష్ణోగ్రతలు ఉండే పొడి ప్రాంతాల్లో పెరుగుతాయి. ఈ రకమైన చెట్లకు పొడవైన వేర్లు, చాలా చిన్న ఆకులు, దట్టమైన బెరడు, పొడవైన ముళ్లు ఉండి నీటి నష్టాన్ని తగ్గిస్తాయి. దట్టంగా కాకుండా, తక్కువ చెట్లు, పొదలు, ఎక్కువ ఖాళీ ప్రదేశాలతో ఉంటాయి. ఇక్కడ తుమ్మ, బలుసు, రేగు, చందనం, వేప లాంటి వృక్ష జాతులు పెరుగుతాయి. రాయలసీమ జిల్లాలైన కడప, అనంతపురం, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, శ్రీసత్యసాయి జిల్లాల్లో కనిపిస్తాయి. 


మడ అడవులు: సముద్ర అలలతో ప్రభావితమయ్యే నేలలున్న తీర ప్రాంతాల్లో ఈ అడవులు పెరుగుతాయి. ఇక్కడి చెట్లు సముద్ర లవణీయతను, అలల తాకిడిని తట్టుకునే విధంగా ఉంటాయి. భూమి లోపలి నుంచి పైకి పొడుచుకొచ్చిన శ్వాస వేర్లున్న చెట్లు ఇక్కడ ప్రధానమైనవి. ఇవి తీర ప్రాంతాలతో పాటు డెల్టాలు, సముద్ర వెనుక జలాలు (బ్యాక్‌ వాటర్‌), క్రీక్స్, నదీ ముఖద్వారాల వద్ద పెరుగుతాయి. సముద్ర అలలు ఈ ప్రాంతాలను రోజులో కొన్ని గంటల పాటు ఉప్పు నీటితోనూ, మరికొన్ని గంటల పాటు నీళ్లు లేకుండానూ చేస్తాయి.  చిత్తడి అడవులు, డెల్టా అడవులు, క్షార జలారణ్యాలు, పోటు- పాటు అడవులు, మాంగ్రూవ్‌ అడవులు అని ఈ అడవులకు ఇతర పేర్లు ఉన్నాయి. ఇవి ఏపీ తీరప్రాంతం (974 కి.మీ.) అంతటా ఉన్నప్పటికీ అధికంగా కాకినాడ, కృష్ణా, కోనసీమ, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతాల్లో అధికంగా విస్తరించి ఉన్నాయి. ఐఎస్‌ఎఫ్‌ఆర్‌ -2021 నివేదికలో ఏపీలో మడ అడవుల పెరుగుదల నమోదైనప్పటికీ పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం వాటి ఉనికి లేకుండా పోయింది. దేశంలో మడ అడవుల విస్తీర్ణం అధికంగా ఉన్న రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్‌ (2,114 చ.కి.మీ.), గుజరాత్‌ (1,175 చ.కి.మీ.), ఆంధ్రప్రదేశ్‌ (405 చ.కి.మీ). ఏపీలో అతిపెద్ద మడ అడవి కాకినాడ జిల్లాలోని కోరింగ అడవి. ఈ అడవుల్లో ఉప్పు పొన్న, బొడ్డు పొన్న, ఉరడ మడ, తెల్ల మడ పత్రితీగ, బలబండి తీగ లాంటి వృక్ష సంపద లభిస్తుంది.


భారత ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం అడవులను మూడు రకాలుగా విభజించింది.

1) రిజర్వ్‌ అడవులు: ఇవి ప్రభుత్వ నియంత్రణలో ఉంటాయి. వీటిలో వేట, మేత, కలప కోసం చెట్లు నరకడం, గ్రామీణ ప్రజలు ప్రవేశించడం లాంటి వాటిని నిషేధించారు. రాష్ట్రంలోని అడవిలో 79.10% ఈ రకం ఉంది.

2) రక్షిత అడవులు: ఇవి ప్రభుత్వ రక్షణలో ఉంటాయి. ప్రజలు సంచరించడం, పశువులు తిరగడం, కలప సేకరణకు అవకాశం ఉంటుంది. అంటే ఈ అడవులను ప్రజలు సొంత అవసరాలకు వినియోగించుకోవచ్చు. కానీ వాటికి నష్టం కలిగించకూడదు. ఈ అడవుల కింద రాష్ట్రంలో 19.38% అడవి ఉంది.

3) వర్గీకరించని అడవులు: ఈ అడవుల్లో చెట్లు నరకడానికి, పశువులు సంచరించడానికి ఏ మాత్రం ఆటంకం లేదు.ఇవి రాష్ట్రంలో 1.52% ఉన్నాయి.

* రాష్ట్రంలో అతిపెద్ద అడవి - నల్లమల అడవి.

* ప్రపంచ అటవీ దినోత్సవం - మార్చి 21


మాదిరి ప్రశ్నలు

1. ఆకురాల్చే అడవులకు మరో పేరు?

1) రుతుపవన అడవులు    2) మాంగ్రూవ్‌ అడవులు

3) పొద అడవులు     4) సతతహరిత అడవులు



2. ఆంధ్రప్రదేశ్‌లో అధికంగా పెరిగే అడవులు?

1) శుష్క ఆకురాల్చే అడవులు    2) అనార్ద్ర ఆకురాల్చే అడవులు

3) తక్కువ వర్షం ఉన్న ఆకురాల్చే అడవులు    4) పైవన్నీ



3. ఐఎస్‌ఎఫ్‌ఆర్‌- 2021 ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం అటవీ విస్తీర్ణం?

1) 28,137 చ.కి.మీ.    2) 29,137 చ.కి.మీ. 

3) 29,784 చ.కి.మీ.   4) 29,487 చ.కి.మీ.



4. కిందివాటిలో సరైంది?

1) దేశంలో అడవుల విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్‌ ఏడో స్థానంలో ఉంది. 

2) దేశంలో అడవుల పెరుగుదలలో ఏపీ మొదటి స్థానంలో ఉంది. 

3) దేశంలో అడవుల పెరుగుదల రేటులో ఏపీ రెండో స్థానంలో ఉంది.

4) పైవన్నీ



5. ఆంధ్రప్రదేశ్‌లో కిందివాటిలో ఏ రకమైన అడవి అధికంగా ఉంది?

1) అత్యధిక సాంద్రత ఉన్న అడవి   2) ఓపెన్‌ ఫారెస్ట్‌

3) పొదలు    4) మధ్యస్థ సాంద్రత ఉన్న అడవి



6. 2019-21 సంవత్సరాల మధ్య ఆంధ్రప్రదేశ్‌లో అటవీ పెరుగుదల ఎంత?

1) 632 చ.కి.మీ.   2) 647 చ.కి.మీ.   3) 674 చ.కి.మీ.  4) 623 చ.కి.మీ.



7. రేగు, బలుసు, తుమ్మ లాంటి వృక్షాలు ఏ అడవుల్లో పెరుగుతాయి?

1) ఆర్ద్ర ఆకురాల్చు అడవులు  2) అనార్ద్ర ఆకురాల్చు అడవులు

3) చిట్టడవులు   4) మడ అడవులు



8. కిందివాటిలో మడ అడవుల లక్షణం కానిది?

1) శ్వాస వేర్లు ఉంటాయి  2) ఉప్పు నీటితో పెరగవు

3) తీర ప్రాంతాల్లో పెరుగుతాయి  4) వర్షంతో సంబంధం లేదు



9. ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలనా పరంగా కిందివాటిలో ఏ రకమైన అడవులు అధికంగా ఉన్నాయి?

1) రిజర్వ్‌ అడవి     2) రక్షిత అడవి    3) వర్గీకరించని అడవి    4) పైవన్నీ



10. ఆర్ధ్ర ఆకురాల్చు అడవులు ఆంధ్రప్రదేశ్‌లో అధికంగా ఏ ప్రాంతంలో ఉన్నాయి?

1) ఆంధ్రప్రదేశ్‌ ఈశాన్య భాగం  2) ఆంధ్రప్రదేశ్‌ వాయవ్య భాగం

3) ఆంధ్రప్రదేశ్‌ నైరుతి భాగం  4) ఆంధ్రప్రదేశ్‌ ఆగ్నేయ భాగం

సమాధానాలు: 1-1; 2-4; 3-3; 4-4; 5-4; 6-2; 7-3; 8-2; 9-1; 10-1.

రచయిత: దంపూరు శ్రీనివాసులు

Posted Date : 10-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌