• facebook
  • whatsapp
  • telegram

ఆంధ్రప్రదేశ్‌ - ఇతర నదులు

 తెలుగు సీమలో సస్యశ్యామల ధారలు!
 

  నదుల రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో చిన్నవి, పెద్దవి కలిసి మొత్తం 40 నదులున్నాయి. గోదావరి, కృష్ణా, పెన్నా పెద్దవి కాగా మిగతావన్నీ వాటి ఉప నదులు, చిన్న నదులు. ఎగువ రాష్ట్రాల నుంచి జలజలా జారుతూ వస్తున్న వాటికి తోడు ఇక్కడే పుట్టి సముద్రం వైపు సాగుతున్నవీ ఉన్నాయి. అన్నివైపుల నుంచి జలధారల్లా ప్రవహిస్తూ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తున్న అలాంటి జలవనరులు, వాటి ప్రవాహ మార్గాలు, ప్రాజెక్టులు, ఇతర విశేషాల పరిజ్ఞానం పోటీ పరీక్షార్థులకు ఉండాలి.


* ఆంధ్రప్రదేశ్‌ను సస్యశ్యామలం చేయడంలోనూ, అభివృద్ధి పథంలో నడిపించడంలోనూ గోదావరి, కృష్ణా, పెన్నా నదులతోపాటు మరిన్ని చిన్నా, పెద్ద నదులు దోహదపడుతున్నాయి. 


వంశధార: దీని జన్మస్థలం ఒడిశాలోని జైపుర్‌ కొండలు. తూర్పు కనుమల్లో పుట్టి తూర్పునకు ప్రవహించే నదుల్లో ఇదే పెద్దది. శ్రీకాకుళంలోని పాతపట్నం వద్ద ఏపీలోకి ప్రవేశిస్తుంది. మొత్తం పొడవు 226 కి.మీ. (ఒడిశా 96 కి.మీ., ఆంధ్రప్రదేశ్‌ 130 కి.మీ.), మహీంద్ర తనయ అనే ఉపనది ఉంది. శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నం వద్ద సముద్రంలో కలుస్తుంది. వంశధారపై గొట్టా, నేరేడీ అనే బ్యారేజీలున్నాయి. నదీ పరీవాహక ప్రాంతం 10,830 చ.కి.మీ. దీని ఒడ్డున శ్రీముఖలింగ దేవాలయం, కళింగపట్నం పట్టణాలున్నాయి. వంశధార నీటిని ఒడిశా ప్రభుత్వం రుషికుల్య నదికి మళ్లించింది.


నాగావళి: ఒడిశాలోని రాయగఢ్‌ కొండల్లో జన్మిస్తుంది. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో ఏపీలోకి ప్రవేశిస్తుంది. మొత్తం పొడవు 208 కి.మీ. (ఒడిశా 96 కి.మీ., ఆంధ్రప్రదేశ్‌ 112 కి.మీ.), పరీవాహక ప్రాంతం 9,510 చ.కి.మీ.


* ఉపనదులు: ఒట్టిగడ్డ, జంఝావతి, రెల్లిగడ్డ, బర్నా, బల్దియా పంతాల, సువర్ణవతి, బరా, వేగావతి, గెముడుగెడ్డ, శ్రీకోన, సీతగర్వ.

* నాగావళిపై తోటపల్లి, నారాయణపురం ప్రాజెక్టులున్నాయి. నది ఒడ్డున రాయ్‌గఢ్‌ (ఒడిశా), శ్రీకాకుళం (ఆంధ్రప్రదేశ్‌) నగరాలున్నాయి. శ్రీకాకుళం జిల్లా మోపనుబందరు వద్ద సముద్రంలో కలుస్తుంది. ఈ నదీ జలాలపై ఆంధ్రప్రదేశ్, ఒడిశాల మధ్య వివాదం ఉంది.

స్వర్ణముఖి: తిరుపతి జిల్లా చంద్రగిరి కొండల్లో తొండవాడ వద్ద మొదలై 155 కి.మీ. ప్రవహించి, వాకాడు మండలం ‘అందాలమాల’ వద్ద సముద్రంలో కలుస్తుంది. ఈ నది ఒడ్డున శ్రీకాళహస్తి, నాయుడుపేట పట్టణాలున్నాయి. ధూర్జటి కవి తన రచనల్లో ఈ నదిని ‘మొగలేరు’ అని పిలిచారు. ఈ నదిలో ఇసుక రేణువులు బంగారం వర్ణంలో ఉండటంతో స్వర్ణముఖిగా పేరు వచ్చింది.

* స్వర్ణముఖి తన ఉపనదులైన భీమా, కల్యాణి నదుల్లో సంగమించి తొండవాడలో త్రివేణి సంగమం ఏర్పడుతుంది.

గుండ్లకమ్మ: తూర్పు కనుమల్లోని నల్లమల శ్రేణుల్లో నంద్యాల జిల్లా గుండ్లబ్రహ్మేశ్వరం వద్ద జన్మిస్తుంది. 225 కి.మీ. ప్రవహించి ప్రకాశం జిల్లా ఉలిచి గ్రామం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. దీని ఉపనదులు రామవాగు, రాళ్లవాగు, పొగుళ్లవాగు, దువ్వలేరు, జంపలేరు, చిలకలేరు.


ప్రాధాన్యం: కృష్ణా, పెన్నా నదుల మధ్య స్వతంత్రంగా తూర్పు వైపు ప్రవహించే చిన్న నదుల్లో పెద్దదే గుండ్లకమ్మ. నంద్యాల, పల్నాడు, ప్రకాశం జిల్లాలో ప్రవహిస్తుంది. కంభం, మార్కాపురం చెరువుల్ని ఏర్పరుస్తుంది. దీనిపై నెమలిగుండం జలపాతంతో పాటు, పరీవాహకంలో గుండ్లబ్రహ్మేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది. ఈ నదిపై ప్రకాశం జిల్లాలో మల్లారం రిజర్వాయర్‌ నిర్మించారు. ఇదే జిల్లాలో వెల్లంపల్లి వద్ద ఎన్‌హెచ్‌ - 5ను దాటుతుంది. దీని ఒడ్డున ఉన్న పట్టణాలు మార్కాపురం, అద్దంకి.

గోస్తనీ: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అనంతగిరి పర్వతాలలో మొదలై బొర్రా గుహల మీదుగా ప్రవహిస్తుంది. దీని పొడవు 120 కిలోమీటర్లు. ఈ నదిపై తాటిపూడి రిజర్వాయర్‌ నిర్మించారు. భీమునిపట్నం వద్ద బంగాళాఖాతంలో కలిసే చోట చాలా మట్టి దిబ్బలు ఉంటాయి.

శారద: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని తూర్పు కనుమల్లో వెయ్యి మీటర్ల ఎత్తులో దీని జన్మస్థానం ఉంది. 122 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. 2,665 చ.కి.మీ. పరీవాహక ప్రాంతం ఉంది. ఈ నది ఒడ్డున యలమంచిలి, అనకాపల్లి నగరాలున్నాయి. దీని ఉపనది పెద్దేరు.

తాండవ: జన్మస్థలం తూర్పు కనుమలు, పొడవు 99 కి.మీ, తుని సమీపంలో పెంటకోట వద్ద సముద్రంలో కలుస్తుంది. తాండవ నదికి మరో పేరు బొడ్డేరు. ఒడ్డున తుని, పాయకరావుపేట, నర్సీపట్నం, చింతపల్లి పట్టణాలున్నాయి.

చంపావతి: తూర్పు కనుమల్లో 1200 మీటర్ల ఎత్తులో ఉన్న ఆండ్ర గ్రామం వద్ద మొదలవుతుంది. కోనాడ వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.. దీని ఉపనదులు ఏడువంపుల గడ్డ, చిట్టగడ్డ, పోతుల గడ్డ, గాది గడ్డ.

* గజపతినగరం, నెల్లిమర్ల, సారిపల్లి, నాతవలస పట్టణాల మీదుగా ప్రవహిస్తుంది. చంపావతిపై తారకరామ తీర్థ సాగరం, కుమిలి డ్యాం ఆనకట్టలు ఉన్నాయి.

పాపాఘ్ని: పెన్నా నదికి ఉపనది. కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌ జిల్లా సిడ్లఘట్ట సమీపంలోని నందికొండల్లో మొదలవుతుంది. మొత్తం పొడవు 205 కి.మీ. మొగలేరు దీని ఉపనది. పాలకొండల మీదుగా ప్రవహించి మైదానంలోకి ప్రవేశిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోకి చిత్తూరు జిల్లాలో ప్రవేశిస్తుంది. వైఎస్‌ఆర్‌ జిల్లా కమలాపురం వద్ద పెన్నానదిలో కలుస్తుంది. పాపాఘ్నిపై వెలిగల్లు గ్రామం వద్ద అన్నమయ్య ఆనకట్ట నిర్మించారు.

* దీని ఒడ్డున గండి క్షేత్రం ఉంది. ఈ నదిలో స్నానం చేస్తే పాపాలు పోతాయనే భావనతో పాపాఘ్ని అనే పేరు నిలిచిపోయింది.

కుందూ (కుముదావతి): ఇది పెన్నానదికి ఉపనది. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు మండలం ఉప్పలపాడు జన్మస్థానం. పొడవు 205 కి.మీ. దీన్నే నంద్యాల దుఃఖదాయిని అంటారు. నంద్యాల, కోయిలకుంట్ల ప్రాంతాల్లో తరచూ వరదలకు కారణమవుతోంది. కుందూ నది నీరు తాగితే రేనాటి పౌరుషం వస్తుందని నమ్మకం. ఈ నది లోయను రేనాడుగా వ్యవహరిస్తారు.

చెయ్యేరు (బహుదా నది): పెన్నానదికి ఇది ఉపనది. వైఎస్‌ఆర్‌ జిల్లా ‘అత్తిరాల’ జన్మస్థలం. అన్నమయ్య జిల్లాలో చెయ్యేరుపై అన్నమయ్య ప్రాజెక్టు నిర్మించారు. 2021లో వరదలకు ఈ ప్రాజెక్టు కొట్టుకుపోయింది.

చిత్రావతి: కర్ణాటకలోని నంది దుర్గం కొండల్లో భాగమైన హరిహరేశ్వర కొండల్లో జన్మిస్తుంది. వైఎస్‌ఆర్‌ జిల్లా గండికోట వద్ద పెన్నా నదిలో కలుస్తుంది. చిత్రావతి అంటే దేవకన్య. ఈ నది తీరాన పుట్టపర్తి ఉంది. కర్ణాటకలో దీనిపై పరగోడ ఆనకట్ట నిర్మించారు. ఏపీలో హిందూపురం, బుక్కపట్నం, ధర్మవరం, తాడిపత్రి, కదిరి మీదుగా ప్రవహిస్తుంది.

* ఈ నదిపై కోలార్‌ జిల్లా బాగీపల్లి వద్ద కర్ణాటక ప్రభుత్వం నిర్మించే ఆనకట్ట ఆంధ్ర - కర్ణాటక మధ్య వివాదానికి దారితీసింది.

సగిలేరు: కర్నూలు జిల్లా నల్లమల కొండల్లోని గంగాయపల్లి జన్మస్థలం. కడప జిల్లా బద్వేల్‌లోకి ప్రవేశించి పెన్నా నదిలో కలుస్తుంది. ప్రకాశం జిల్లాలోని కంభం, గిద్దలూరు మీదుగా వెళ్తుంది. దీనికి మరో పేరు స్వర్ణ బాహునది. సగిలేరుపై వైఎస్‌ఆర్‌ జిల్లాలో ఎగువ సగిలేరు, సగిలేరు ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి.

జయమంగళి: జన్మస్థలం కర్ణాటక, పొడవు 77 కి.మీ, అనంతపురం జిల్లా పరిగి మండలంలో ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. ఇదే మండలంలోని సంగమేశ్వరపల్లి గ్రామం వద్ద పెన్నానదిలో కలుస్తుంది.

జంఝావతి: విజయనగరం జిల్లాలోని తూర్పు కనుమల్లో పుడుతుంది. ఇదే జిల్లాలో నాగావళి నదిలో కలుస్తుంది. దీనిపై రబ్బరు డ్యామ్‌ నిర్మించారు.

సువర్ణముఖి: ఒడిశాలోని తూర్పుకనుమల్లో మొదలై పార్వతీపురం-మన్యం, విజయనగరం జిల్లాల్లో ప్రవహిస్తుంది. శ్రీకాకుళంలోని పాలకొండ సమీపంలో నాగావళిలో కలుస్తుంది. దీనిపై ‘మద్దువలస’ ప్రాజెక్టు నిర్మించారు. 

మాచ్‌ఖండ్‌: దీని జన్మస్థలం అల్లూరి జిల్లా మాడుగుల కొండలు. సీలేరు నదిలో కలుస్తుంది. దీనిపై ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో డుడుమా జలపాతం ఉంది. దీనిపై మాచ్‌ఖండ్‌ జల విద్యుత్తు కేంద్రం నిర్మించారు. ఇది ఒడిశా, ఏపీల ఉమ్మడి ప్రాజెక్టు.

మహేంద్ర తనయ: ఒడిశాలోని గజపతి జిల్లా తుపారసింగి గ్రామం వద్ద మహేంద్రగిరి కొండల్లో పుడుతుంది. 56 కి.మీ. ప్రవహించి గొట్టా బ్యారేజీ సమీపంలో గులుమూరు వద్ద వంశధారలో కలుస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో మొదటగా శ్రీకాకుళంలో ప్రవేశిస్తుంది.


వేదవతి (హగరి): కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లో సహ్యాద్రి పర్వతాల వద్ద వేద, అవతి అనే రెండు సెలయేళ్లు కలిసి ఈ నది జన్మించింది. పుర అనే ప్రాంతంలో వేదవతి నదిగా మారింది. సిరిగుప్ప వద్ద తుంగభద్రలో కలుస్తుంది. దీనిపై ‘బైరవానితిప్ప రిజర్వాయర్‌’ నిర్మించారు.

తుంగభద్ర: కర్ణాటకలో పశ్చిమ కనుమల్లోని వరాహ పర్వతాలలో జన్మిస్తుంది. తుంగ, భద్ర అనే రెండు నదులు ‘కూడీ’్ల వద్ద కలిసి తుంగభద్రగా మారుతుంది. దీని పొడవు 531 కి.మీ, వేదవతి (హగరి), వరదా నది, హంద్రీ, కుముదవతి వంటి ఉపనదులున్నాయి. కర్నూలు జిల్లాలోని సంగమేశ్వర్‌ వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. ఈ నదిని రామాయణంలో ‘పంపా’నదిగా పిలిచారు. తుంగభద్ర ఒడ్డున మంత్రాలయం, కర్నూలు ఉన్నాయి. మంత్రాలయంలో నది గట్టునే రాఘవేంద్ర స్వామి మఠం ఉంది. 

* కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రవహిస్తుంది. కర్నూలు జిల్లా కౌతలం మండలం మేళగనూరు వద్ద ఏపీలోకి ప్రవేశిస్తుంది. కర్ణాటకలోని హోస్పేట్‌ వద్ద దీనిపై ఆనకట్ట నిర్మించారు. కృష్ణా నది ఉపనదుల్లో తుంగభద్ర పెద్దది.

పాలేరు: వరంగల్‌ జిల్లా పాకాల చెరువు నుంచి మొదలవుతుంది. 198 కి.మీ. ప్రవహించి జగ్గయ్యపేట వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది.

మున్నేరు: రంగల్‌ జిల్లాలోని చెన్నాపురం వద్ద పుడుతుంది. 150 కి.మీ. ప్రవహించి జగ్గయ్యపేట సమీపంలో పులిచింతలకు 20 కి.మీ దిగువన మక్తేశ్వరం వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. దీని ఉపనదులు ఆకేరు, వైరా.

బుడమేరు: కృష్ణా జిల్లాలోని మైలవరం సమీప కొండల్లో మొదలై కొల్లేరు సరస్సులోకి ప్రవేశిస్తుంది. దీన్ని ‘విజయవాడ దుఃఖదాయని’ అంటారు. ఇక్కడినుంచి వరద నీరు ప్రకాశం బ్యారేజీ ఎగువన కృష్ణా నదిలో కలుస్తుంది. పోలవరం కుడి కాలువ ద్వారా బుడమేరుకు, అక్కడినుంచి ప్రకాశం బ్యారేజ్‌కు నీటిని తరలించేలా పథకం సిద్ధం చేశారు.

శబరి: ఒడిశాలోని తూర్పుకనుమల పశ్చిమ వాలులో ‘సింకారం’ కొండల్లో పుడుతుంది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల మీదుగా ఏపీలోకి ప్రవహిస్తుంది. పై మూడు రాష్ట్రాల సరిహద్దుల్లోనే సీలేరు నది శబరిలో కలుస్తుంది. మొత్తం 418 కి.మీ. ప్రవహించే శబరి కూనవరం ప్రాంతంలో గోదావరిలో కలుస్తుంది. గోదావరిలో కలిసే చివరి ఉపనది ఇదే.

సీలేరు: ఏపీలోని అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో పుట్టి ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల మీదుగా వెళ్లి శబరిలో కలుస్తుంది.


ప్రశ్నలు


1. కిందివాటిలో భిన్నమైంది?

1) తుంగభద్ర    2) కృష్ణా     3) గోదావరి     4) పెన్నా


2. కిందివాటిలో మొదటి జత ఆధారంగా రెండో జతను పూరించండి.

గోదావరి - మంజీరా ; కృష్ణా - ?

1) ప్రవర   2) కిన్నెరసాని   3) పూర్ణ    4) కోయనా


3. కిందివాటిలో గోదావరి నదికి కుడి వైపు కలిసే ఉపనదులు -

1) మానేరు, మూల    2) శబరి, సీలేరు    3) వార్థా, పూర్ణ   4) ప్రాణహిత, ఇంద్రావతి


4. ‘నంద్యాల దుఃఖదాయని’ అనే పేరున్న నది?

1) చెయ్యేరు   2) తుంగభద్ర    3) కుందేరు   4) సగిలేరు


5. శ్రీకాళహస్తి ఏ నది ఒడ్డున ఉంది?

1) పెన్నా నది    2) పాలార్‌ నది   3) స్వర్ణముఖి    4) చెయ్యేరు 


6. కిందివాటిలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో ప్రవహించని నది?

1) వంశధార   2) నాగావళి   3) మాచ్‌ఖండ్‌    4) పాలేరు


7. కిందివాటిలో కృష్ణా నదితో సంబంధం లేని భారీ నీటిపారుదల ప్రాజెక్టు-

1) ప్రకాశం బ్యారేజ్‌   2) ధవళేశ్వరం బ్యారేజ్‌

3) శ్రీశైలం ప్రాజెక్టు     4) నాగార్జున సాగర్‌


8. ఇటీవల వరదలకు కొట్టుకుపోయిన అన్నమయ్య ప్రాజెక్టు ఏ నదిపై నిర్మించారు?

1) సగిలేరు    2) చెయ్యేరు    3) చిత్రావతి     4) జయమంగళి


9. కిందివాటిలో సరికాని జత-

1) వంశధార - మహేంద్ర తనయ    2) తుంగభద్ర - హంద్రీ

3) నాగావళి - ఝంజావతి         4) గుండ్లకమ్మ - పెద్దేరు


10. కిందివాటిలో ఆంధ్రా - కర్ణాటక రాష్ట్రాల మధ్య వివాదాస్పద నది?

1) పాలార్‌ నది    2) చిత్రావతి    3) సగిలేరు     4) చెయ్యేరు

సమాధానాలు: 1-1; 2-4; 3-1; 4-3; 5-3; 6-4; 7-2; 8-2; 9-4; 10-2.

రచయిత: దంపూరు శ్రీనివాసులు

Posted Date : 12-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌