• facebook
  • whatsapp
  • telegram

ఆంధ్రప్రదేశ్‌ - నదులు

పశ్చిమ కనుమల్లో పుట్టి.. తెలుగు నేలను దాటి!


  తాగడానికి నీరు కావాలి. పంటలకి నీరు కావాలి. పరిశ్రమలకు నీరు కావాలి. ప్రగతికి నీరు కావాలి. ప్రతిదానికీ నీరు కావాలి. నీరు లేకుండా జీవులు లేవు, జీవితాలు లేవు. భూమి మీద అత్యంత కీలకమైన ఆ నీటికి అతి ముఖమైన ఆధారం నదులు. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అభివృద్ధిలో, పర్యావరణ పరిరక్షణలో ప్రధాన పాత్ర పోషించే ఆ జీవనాడులు ఆంధ్రప్రదేశ్‌లో అనేకం ఉన్నాయి. వాటిలో పశ్చిమ కనుమల్లో పుట్టి, తెలుగు నేలను దాటి సముద్రంలో కలిసే దక్షిణ గంగ గోదావరి, శిల్పుల నది కృష్ణా,  గండికోట గార్జ్‌ పెన్నా గురించి పరీక్షల కోణంలో అభ్యర్థులు అవగాహన కలిగి ఉండాలి. వాటి జన్మస్థానాలు, ప్రవహించే ప్రాంతాలు, ఇతర ప్రాధాన్యాలను తెలుసుకోవాలి. 

 
  పర్వతాలు లేదా పీఠభూముల వద్ద జన్మించి, మైదానం మీదుగా ప్రవహించి సముద్రంలో కలిసే శాశ్వత, అశాశ్వత జల ప్రవాహమే ‘నది’. ప్రధాన నదిని కలిసే చిన్న నది లేదా సెలయేరును ‘ఉపనది’గా పేర్కొంటారు.  ఒక నది, అందులో కలిసే ఉపనదులు, వాగులు, వంకలు, ఏరులు మొదలైన వాటిని కలిపి నదీ వ్యవస్థ అంటారు. నదికి నీటిని అందించే మొత్తం భౌగోళిక ప్రాంతాన్ని ‘నదీ పరీవాహక ప్రాంతం’ అంటారు. ఆంధ్రప్రదేశ్‌లో చిన్నా, పెద్ద మొత్తం కలిపి 40 నదులు ప్రవహిస్తున్నాయి. అందుకే ఏపీని నదుల రాష్ట్రం అంటారు.


* ఆంధ్రప్రదేశ్‌లో ప్రవహించే నదుల్లో ముఖ్యమైనవి గోదావరి, కృష్ణా, పెన్నా, తుంగభద్ర, వంశధార, నాగావళి.


* పశ్చిమ కనుమల్లో పుట్టి ఆంధ్రప్రదేశ్‌ మీదుగా ప్రవహించే నదులు - గోదావరి, కృష్ణా, పెన్నా, తుంగభద్ర.


* తూర్పు కనుమల్లో పుట్టి ఆంధ్రప్రదేశ్‌ మీదుగా ప్రవహించే నదులు - వంశధార, నాగావళి, ఝంజావతి.


* నల్లమల కొండల్లో జన్మించే నదుల్లో ముఖ్యమైంది - గుండ్లకమ్మ


* శేషాచల కొండల్లో జన్మించే నదుల్లో ముఖ్యమైంది - స్వర్ణముఖి


* ఆంధ్రప్రదేశ్‌ నైసర్గికంగా వాయవ్య భాగంలో ఎత్తుగా, ఆగ్నేయ దిశగా వాలుగా ఉండటంతో రాష్ట్రంలో ప్రవహించే నదులన్నీ ఆగ్నేయ దిశగా (తూర్పు దిశగా) ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి.


గోదావరి 


జన్మస్థలం: మహారాష్ట్రలోని నాసిక్‌ జిల్లాలోని నాసికాత్రయంబకం పీఠభూమిలోని ‘బీలే సరస్సు’ వద్ద ఉంది. ఇది అరేబియా సముద్రానికి 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.


పొడవు: మొత్తం పొడవు 1,465 కి.మీ.; తెలుగు రాష్ట్రాల్లో 775 కి.మీ. (తెలంగాణలో 563 కి.మీ, ఏపీలో 212 కి.మీ.)


* పరీవాహక ప్రాంతం - 3,12,812 చదరపు కిలోమీటర్లు (3.13 లక్షల చ.కి.మీ).


* ఈ నది పరీవాహక ప్రాంతం దేశం మొత్తం భూభాగంలో 1/10వ వంతు ఉంది. ఈ విస్తీర్ణం ఇంగ్లండ్, ఐర్లాండ్‌ దేశాల భూభాగం కంటే అధికం.


* గోదావరి పరీవాహక ప్రాంతం ఉన్న రాష్ట్రాలు 7, కేంద్రపాలిత ప్రాంతం 1.(మహారాష్ట్ర - 49 శాతం, 2. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ - 20 శాతం, 3. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 20 శాతం, ఒడిశా).


ఇతర పేర్లు: దక్షిణ గంగోత్రి దక్షిణ గంగ, వృద్ధ గంగ, ఇండియన్‌రైన్, సప్త గోదావరి. బౌద్ధ సాహిత్యంలో ‘తెలివాహన’ అని పిలిచారు. 


* ద్వీపకల్ప నదుల్లో పెద్దది, భారతదేశంలో రెండో పెద్ద నది.


* పాపికొండల నడుమ ప్రవహిస్తున్నందు వల్ల ‘ఇండియన్‌ రైన్‌’ అనే పేరు వచ్చింది.


* ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి నది పరీవాహక ప్రాంతం 24 శాతం ఉంది.


* తెలంగాణలోకి ప్రవేశించేది నిజామాబాద్‌ జిల్లా రేంజల్‌ మండలంలోని కందుకుర్తి.


* తెలంగాణలో ప్రవహించే జిల్లాలు వరుసగా నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం.


* ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశించే ప్రదేశం - భూర్గం పహాడ్‌ (అల్లూరి జిల్లా).


* ఏపీలో ప్రవహించే జిల్లాలు - అల్లూరి, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ.


* మైదాన ప్రాంతంలోకి ప్రవేశించే ప్రదేశం - పోలవరం (ఏలూరు జిల్లా).


* గోదావరి రాజమండ్రి తర్వాత ఏడు పాయలుగా చీలి బంగాళాఖాతంలో కలుస్తుంది. (సప్త గోదావరి)


కుడి వైపు కలిసే ఉపనదులు: మంజీర, ప్రవర, సింధూపన, పెద్దవాగు, కిన్నెరసాని, మానేరు, మూల, నసార్థి. 


ఎడమవైపు కలిసే ఉపనదులు: ప్రాణహిత, పెన్‌గంగ, వెన్‌గంగ, వార్థా, దూద్‌నా, పూర్నా, ఇంద్రావతి, తాలిపేరు, శబరి, సీలేరు, పెంచ్, ధారణ, కడెం, కన్యాన్‌.

* అతిపెద్ద ఉపనది - ప్రాణహిత


* అతి పొడవైన ఉపనది - మంజీరా


గోదావరి నదీ వ్యవస్థలో ఉపనదులు, గోదావరి వాటా: ప్రాణహిత (34.87 శాతం), గోదావరి (24.2 శాతం), ఇంద్రావతి (12.98 శాతం), మంజీరా (9.86 శాతం), శబరి (6.53 శాతం), పూర్ణా (4.98 శాతం), మానేరు (4.18 శాతం).


* ఆంధ్రప్రదేశ్‌కి అధిక నీరు తీసుకొచ్చే గోదావరి ఉపనది - సీలేరు


* సముద్రంలో కలవక ముందు గోదావరి నదిలో కలిసే చివరి ముఖ్య ఉప నది - శబరి


* ధవళేశ్వరం బ్యారేజీ (ఆంధ్రప్రదేశ్, తూర్పు గోదావరి జిల్లా, 1852)


* మేడిగడ్డ (తెలంగాణ, జయశంకర్‌ జిల్లా)


* గోదావరి పాపికొండల నడుమ బైసన్‌ గార్జ్‌ను ఏర్పరుస్తుంది.


బంగాళాఖాతంలో కలిసే గోదావరి నదీ పాయలు, ప్రదేశం 


* ఉత్తరపాయ (గౌతమి) - యానాం  


* మధ్యపాయ (వశిష్ట) -  అంతర్వేది


* దక్షిణపాయ (వైనతేయ) - కొమరిగిరి పట్నం  


* తుల్య, భరద్వాజ పాయలు-  బెండమూరి లంక  


* కౌశిక్‌ పాయ వశిష్టలో కలుస్తుంది. 


* ఆత్రేయ పాయ వైనతేయలో కలుస్తుంది.


పుణ్య క్షేత్రాలు: ఆంధ్రప్రదేశ్‌లో 1. పట్టిసం 2. కోటిపల్లి    3. ముక్తేశ్వరం 4. అంతర్వేది 5. శ్రీవీరేశ్వరస్వామి  


కృష్ణానది


జన్మస్థలం: మహారాష్ట్రలో పశ్చిమ కనుమల సమీపంలోని మహాబలేశ్వర్‌ (సతారా జిల్లా).


పొడవు: మొత్తం 1400 కిలోమీటర్లు. ఆంధ్రప్రదేశ్‌లో 485 కిలోమీటర్లు, తెలంగాణలో 416 కిలోమీటర్లు. పరీవాహక ప్రాంతం - 51,000 చ.కి.మీ. పరీవాహక ప్రాంతాలున్న రాష్ట్రాలు మహారాష్ట్ర-27 శాతం, కర్ణాటక -44 శాతం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ-29 శాతం.


* ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా నది పరీవాహక ప్రాంతం - 27.4 శాతం.


* తెలంగాణలో ప్రవేశం - నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం తంగడి.


* తెలంగాణలో ప్రవహించే జిల్లాలు - నారాయణపేట, మహబూబ్‌నగర్, నాగర్‌ కర్నూల్, వనపర్తి, గద్వాల్, నల్గొండ, సూర్యాపేట.


* ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించే ప్రదేశం - కర్నూలు జిల్లా ముచ్చుమర్రి (సంగమేశ్వరం)


* ఆంధ్రప్రదేశ్‌లో ప్రవహించే జిల్లాలు - కర్నూలు, నంద్యాల, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా.


* కృష్ణానది విజయవాడ తర్వాత 64 కిలోమీటర్ల దూరంలో రెండు పాయలుగా చీలి మళ్లీ కలుస్తుంది. ఈ పాయల మధ్య ప్రాంతాన్ని ‘దివిసీమ’ అంటారు.


* సముద్రంలో కలిసే ప్రదేశం-హంసలదీవి (కృష్ణా జిల్లా)


* ద్వీపకల్ప నదుల్లో రెండో పెద్దది - కృష్ణా.


* దీనికి శిల్పుల నది అని పేరు.


కుడివైపు కలిసే ఉపనదులు: తుంగభద్ర, ఘటప్రభ, మలప్రభ, దూద్‌గంగా, పంచగంగ, కోయనా, వెన్నా


ఎడమవైపు కలిసే ఉపనదులు: భీమ, దిండి, మూసీ, మున్నేరు, పాలీ, పెద్దవాగు, హాలియా.


* కృష్ణానది ఉపనదుల్లో పెద్దది - తుంగభద్ర


* కృష్ణానది ఉపనదుల్లో పొడవైంది - భీమ 


పెన్నా నది


జన్మస్థలం: కర్ణాటకలోని కోలార్‌ జిల్లాలో ఉన్న పశ్చిమ కనుమల్లో భాగమైన నందిదుర్గం కొండలోని చెన్నకేశవగిరి.


ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశం: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని చౌటుప్పల్‌.


పొడవు: 597 కిలోమీటర్లు 

ఇతర పేర్లు: పినాకిని, పెన్నేరు, పెన్నార్, రాయలసీమ జీవనాడి.


ఆంధ్రప్రదేశ్‌లో ప్రవహించే జిల్లాలు: శ్రీసత్యసాయి జిల్లా, అనంతపురం, వైఎస్‌ఆర్, నెల్లూరు


*పెన్నానది క్రమక్షయం వల్ల కడప జిల్లాలోని గండికోటకు పశ్చిమోత్తర భాగాల్లో లోతైన అగాధ ధరిని ఏర్పరిచింది. దీన్ని ‘భారతదేశపు గ్రాండ్‌ క్యానన్‌’ (గండికోట గార్జ్‌) అంటారు.


సముద్రంలో కలిసే ప్రాంతం: నెల్లూరు జిల్లా ఊటుకూరు.


కుడివైపు కలిసే ఉపనదులు: చిత్రావతి, చెయ్యేరు, పాపాగ్ని


ఎడమవైపు కలిసే ఉపనదులు: జయమంగళి, కుందేరు, సగిలేరు. 


ఆంధ్రప్రదేశ్‌లో జన్మించిన ఉపనదులు: సగిలేరు, చెయ్యేరు, కుందేరు. 


కర్ణాటకలో జన్మించే ఉపనదులు: పాపాగ్ని, చిత్రావతి, జయమంగళి 


రచయిత: దంపూరు శ్రీనివాసులు

Posted Date : 26-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌