• facebook
  • whatsapp
  • telegram

ఐరోపావాసుల రాక

 ఆంధ్ర వస్త్రాల కొనుగోలుకు ఐరోపా దేశాల పోటీ!

ఆధునిక యుగం ప్రారంభంలో భారతదేశంలో విస్తృత రాజకీయ, ఆర్థిక, సామాజిక మార్పులకు కారణమైన ఐరోపావారి రాక, దాదాపు అదే ప్రభావాన్ని ఆంధ్ర ప్రాంతంలోనూ చూపింది. ఇక్కడ కూడా పోర్చుగీసు, డచ్చి, ఇంగ్లిష్, ఫ్రెంచ్‌ వర్తక స్థావరాల ఏర్పాటు, వలసవాద దోపిడీ, సాంస్కృతిక మార్పిడి, స్థానిక శక్తుల అణచివేత తదితర పరిణామాలు సంభవించాయి. ఈ అంశాలపై పోటీ పరీక్షార్థులు అవగాహన పెంచుకోవాలి. ముఖ్యంగా ఆ సమయంలో జరిగిన మూడు చారిత్రక కర్ణాకటక యుద్ధాలు, వాటి ఫలితాల గురించి తెలుసుకోవాలి. 


చరిత్రను ప్రాచీన యుగం, మధ్య యుగం, ఆధునిక యుగం అని మూడు రకాలుగా విభజించారు. ఆధునిక యుగం అంటే ఐరోపావారు సముద్ర మార్గం ద్వారా భారతదేశానికి వచ్చిన కాలం. వీరు ఆంధ్ర ప్రాంతంలోనూ వర్తక స్థావరాలను స్థాపించి వ్యాపారం చేశారు. 1453లో కానిస్టాంటెనోపుల్‌ను  రెండో మహ్మద్‌ ఆక్రమించడంతో ఆధునిక యుగం ప్రారంభమైంది. భారతదేశానికి సముద్ర మార్గాలను కనుక్కోవడానికి పోర్చుగల్, స్పెయిన్‌ దేశాలు ప్రయత్నించాయి. పోర్చుగల్‌ రాజు రెండో విక్టర్‌ ఇమ్మాన్యుయేల్‌ సముద్ర మార్గాలను కనుక్కోవడానికి ప్రోత్సహించారు. పోర్చుగల్‌కు చెందిన వాస్కోడిగామా, లిస్బన్‌ అనే ప్రాంతం నుంచి ప్రయాణాన్ని ప్రారంభించి 1498, మే 17న కేరళలోని మలబార్‌ తీరంలో ఉన్న కాలికట్‌/కోజికోడ్‌కు అబ్దుల్‌ మజ్జిద్‌ సహకారంతో చేరాడు. ఆనాడు  విజయనగర రాజుగా ఇమ్మడి నరసింహరాయలు ఉన్నాడు. కాలికట్‌ పాలకుడు జామెరిన్‌ పోర్చుగీసు వారిని ఆదరించాడు. 


పోర్చుగీసు వారు: పోర్చుగీసు గవర్నర్‌లలో ప్రముఖుడు సర్‌ ఫ్రాన్సిస్‌-డి-ఆల్మిడా. ఇతడు నీలి నీటి విధానాన్ని ప్రారంభించాడు. బలమైన నౌకాదళాన్ని నిర్మించి సముద్రంపై గుత్తాధిపత్యాన్ని సాధించాడు. మరొక గవర్నర్‌ ఆల్బూకర్క్‌ పోర్చుగీసు సామ్రాజ్య నిర్మాత. ఇతడు విజయనగర రాజులతో స్నేహ సంబంధాలను పెంపొందించుకున్నాడు. 1510లో బహమనీ రాజ్యంపై దండెత్తి గోవాను ఆక్రమించాడు. ఇతడు ధైర్యసాహసాల్లో ఇంగ్లండ్‌ గవర్నర్‌ క్లైవ్‌ లాంటివాడు. గోవా ఆక్రమణలో ఆల్బూక్లర్క్‌కు శ్రీకృష్ణదేవరాయలు సహాయం చేశారు. కృష్ణదేవరాయలతో ఒప్పందం చేసుకొని హోనోవర్, భట్కుల్‌ కోటలను నిర్మించాడు. వీరు మచిలీపట్నం వద్ద ఒక వర్తక స్థావరాన్ని స్థాపించారు. కానీ ఐరోపావారి పోటీని తట్టుకోలేకపోయారు. పోర్చుగీసు వారు వర్తకం కోసం భారతదేశానికి మొదటగా వచ్చినప్పటికీ అంతగా ప్రభావితం చేయలేకపోయారు. 1961లో జె.ఎన్‌.చౌదరి నిర్వహించిన ‘ఆపరేషన్‌ విజయ్‌’ అనే సైనిక చర్య ద్వారా భారత్‌ నుంచి పోర్చుగీసు వారిని పంపేశారు. వీరిని తెలుగువారు బుడతకీచులు అని పిలిచేవారు.


డచ్చివారు: డచ్చి దేశాన్ని హాలెండ్‌ లేదా నెదర్లాండ్స్‌ అని పిలుస్తారు. 1602లో డచ్‌ ఈస్ట్‌ఇండియా కంపెనీని స్థాపించారు. అది తన మొదటి వర్తక స్థావరాన్ని 1605లో మచిలీపట్నం వద్ద ఏర్పాటుచేసింది. దీనిని స్థాపించడానికి మహమ్మద్‌ కులీ కుతుబ్‌షా అనుమతి ఇచ్చారు. వీరు మచిలీపట్నంతో పాటు నర్సాపురం, భీమునిపట్నం, యానాం, పులికాట్‌ల వద్ద కూడా వర్తక స్థావరాలను స్థాపించారు. డచ్చివారి మొదటి ప్రధాన వర్తక స్థావరం పులికాట్‌. ఆ తర్వాత దానిని నాగపట్నానికి మార్చారు. 1623 వరకు వీరికి ఆంధ్రదేశంలోని వజ్రపు గనులపై గుత్తాధిపత్యం ఉండేది. సుగంధ ద్రవ్యాలతో పాటు నీలిమందు, నూలు కలంకారీ ముతక దుస్తులను వారి దేశానికి ఎగుమతి చేస్తూ సిల్కు, పింగాణి వస్తువులను దిగుమతి చేసేవారు.ఆంగ్లేయులతో పోటీపడలేక డచ్చివారు భారతదేశంలోని స్థావరాలను వదిలి ఇండోనేషియాకు వెళ్లిపోయారు.


ఆంగ్లేయులు: 1600 సంవత్సరంలో ఈస్టిండియా కంపెనీని ఇంగ్లండ్‌ స్థాపించింది. దీని ప్రధాన కార్యాలయం లండన్‌లోని లీడెన్‌హాత్‌ స్ట్రీట్‌లో ఉంది. ఈ కంపెనీకి ఇంగ్లండ్‌ రాణి ఎలిజబెత్‌  ఖి ‘రాయల్‌ చార్టర్‌’ ప్రకారం తూర్పు దేశాల్లో వ్యాపారం చేసుకోవడానికి గుత్తాధిపత్య హక్కులు ఇచ్చింది. 1608లో కెప్టెన్‌ హకీన్స్‌ ఈస్ట్‌ఇండియా కంపెనీ తరఫున భారతదేశానికి వచ్చి మొగల్‌ చక్రవర్తి జహంగీర్‌ ఆస్థానాన్ని సందర్శించి సూరత్‌ వద్ద వర్తక స్థావరం ఏర్పాటుకు అనుమతి పొందారు. కానీ పోర్చుగీసు వారి జోక్యం కారణంగా అది రద్దయ్యింది. కెప్టెన్‌ హిప్పన్‌ 1611లో ‘గ్లోబ్‌’ అనే నౌక ద్వారా మచిలీపట్నం చేరుకున్నాడు. అక్కడ వర్తక స్థావరాన్ని స్థాపించడానికి మహ్మద్‌ కులీ కుతుబ్‌షా అనుమతి పొందాడు. మచిలీపట్నం వద్ద 1611 జనవరిలో మొదటి వర్తక స్థావరాన్ని, 1622లో ఫ్యాక్టరీని నెలకొల్పారు. ఫ్యాక్టరీ అంటే క్రయవిక్రయం జరిగే ప్రదేశం, గిడ్డంగి, కార్యాలయం, ఉద్యోగుల నివాస స్థలం ఉండే ప్రాంతం. ఫ్యాక్టరీలో పనిచేసేవారిని ఫ్యాక్టర్స్‌ అంటారు. 1621లో చంద్రగిరి రాజు అనుమతితో పులికాట్‌ వద్ద, 1622లో ఆర్మగం (పులికాట్‌ సమీపంలో) దగ్గర వర్తక స్థావరాలను స్థాపించారు. అంతేకాకుండా నిజాంపట్నం, నర్సాపురం, వీరవాసరంలలో వర్తక స్థావరాలను ఏర్పాటు చేశారు. మచిలీపట్నం వద్ద వర్తకానికి ప్రత్యేక పరిస్థితులు కల్పిస్తూ 1636లో అబ్దుల్లా హుస్సేన్‌ కుతుబ్‌షా ‘బంగారు ఫర్మానా’ను జారీచేశారు. ఆర్మగం వద్ద పనిచేసిన బ్రిటిష్‌ అధికారి సర్‌ ఫ్రాన్సిస్‌ డే. ఇతడు శ్రీకాళహస్తిలోని వెలుగోటి వంశానికి చెందిన దామెర్ల సోదరుల (వెంకటాద్రి, అయ్యప్ప) సహకారంతో విజయనగర రాజైన మూడో వెంకటపతిరాయల నుంచి మద్రాసును పొందాడు. ఫ్రాన్సిస్‌ డే మద్రాసులో సెయింట్‌ జార్జ్‌ అనే కోటను నిర్మించాడు.

ఫ్రెంచి వారు: వ్యాపార నిమిత్తం భారతదేశానికి వచ్చిన చివరి ఐరోపా దేశస్థులు.. 1664లో 14వ లూయీ కాలంలో కోల్బర్ట్‌ అనే ఆర్థికవేత్త ఫ్రాన్స్‌ ఈస్టిండియా కంపెనీని స్థాపించాడు. ఆంధ్రాకు వచ్చిన మూడో ఐరోపా దేశం ఫ్రెంచి. వీరికి 1669లో మచిలీపట్నం వద్ద వర్తకానికి అబ్దుల్లా కుతుబ్‌షా అనుమతి ఇచ్చాడు. 1760 వందవాసి/వాండివాష్‌ యుద్ధం తర్వాత వీరు పాండిచ్చేరికి మాత్రమే పరిమితమయ్యారు. 18వ శతాబ్దంలో ఆంధ్రదేశపు వస్త్రాలకు ఆగ్నేయాసియా, ఇంగ్లండ్, పర్షియ దేశాల్లో మంచి గిరాకీ ఉండేది. ఆంధ్రాలో తయారయ్యే ప్రముఖ వస్త్రాలు కాలికో/కలంకారీ. వీటి కొనుగోలుకు ఐరోపా దేశాలు పోటీపడేవి. వస్త్రాల వర్తకంలో డచ్‌ వారికి మంచిపేరు ఉండేది.

ఆంగ్లో-ఫ్రెంచ్‌ యుద్ధాలు: 1707లో మొగల్‌ చక్రవర్తి ఔరంగజేబు మరణం తర్వాత దక్కన్‌ ప్రాంత సుబేదారులు స్వాతంత్య్రం ప్రకటించుకున్నారు. కర్ణాటక, హైదరాబాదు రాజ్యాలు ఏర్పడ్డాయి. దక్కన్‌లో స్థాపించిన ఈ రాజ్యాలు ఆంగ్లో-ఫ్రెంచ్‌ ఘర్షణలకు కారణమయ్యాయి. స్థానిక రాజుల మధ్య వివాదాలు వచ్చినప్పుడు ఐరోపావారు ఎవరో ఒకరి పక్షాన చేరి విజయం సాధించిన వారి నుంచి బహుమానాలుగా నగదు లేదా రాజ్యం లేదా పన్ను రాయితీ పొందేవారు. 

మొదటి కర్ణాటక యుద్ధం (1746-48): ఈ యుద్ధానికి కారణం ఆస్ట్రియా వారసత్వ యుద్ధం. ఆస్ట్రియా, ప్రష్యాల మధ్య జరిగిన యుద్ధంలో ఇంగ్లండ్, ఫ్రాన్స్‌ దేశాలు కూడా పాల్గొన్నాయి. దీనివల్ల భారతదేశంలో ఇంగ్లండ్, ఫ్రెంచ్‌ దేశాలు కూడా యుద్ధానికి దిగాయి. దీనిని అడయార్‌ యుద్ధం, శాంథోమ్‌ యుద్ధం అంటారు. ఇది ఎక్స్‌-లా-చాఫెల్‌ సంధితో ముగిసింది. ఈ యుద్ధకాలంలో ఫ్రాన్స్‌ గవర్నర్‌ డూప్లే కర్ణాటకలో శాంతిని పరిరక్షించాల్సిందిగా ఆ రాష్ట్ర నవాబైన అన్వరుద్దీన్‌ను కోరాడు. రహస్యంగా యుద్ధ ప్రయత్నాలు కూడా కొనసాగించాడు. మారిషస్‌కు చెందిన లాంబోర్డునాయ్‌ సహకారంతో డూప్లే మద్రాసును ఆక్రమించాడు. కానీ లాంబోర్డునాయ్‌ లంచం తీసుకొని మద్రాసును ఆంగ్లేయులకు అప్పగించాడు. అన్వరుద్దీన్‌ సహాయంతో డూప్లే మద్రాసును తిరిగి ఆక్రమించాడు. కానీ ఆ ప్రాంతాన్ని అన్వరుద్దీన్‌కు ఇవ్వడానికి నిరాకరించాడు. డూప్లే నమ్మకద్రోహానికి ప్రతికారంగా అన్వరుద్దీన్‌ సైన్యంతో దాడి చేశాడు. కానీ వేలమంది అన్వరుద్దీన్‌ సైన్యాన్ని వందల సంఖ్యలో ఉన్న ఐరోపా సైన్యం ఓడించింది. 1700 సంవత్సరంలో ఐరోపా సైన్యం భారతీయ సైన్యం కంటే అధిక నైపుణ్యాన్ని కలిగి ఉండేది. కారణం ‘వారు నిత్యం కవాతు చేయడం, అధునాతన ఆయుధాలు కలిగి ఉండటం, అధిక జీతాలు పొందడం’. ఈ యుద్ధంలో ఫ్రెంచ్‌ విజయం సాధించింది.


రెండో కర్ణాటక యుద్ధం (1749-56): ఈ యుద్ధానికి కారణం హైదరాబాద్, కర్ణాటకల మధ్య వారసత్వ యుద్ధాలు. ఇది పాండిచ్చేరి సంధితో ముగిసింది. ఈ యుద్ధ కాలం నాటి కర్ణాటక నవాబులు అన్వరుద్దీన్, చాంద్‌ సాహెబ్‌; హైదరాబాద్‌ నవాబులు నాజర్‌జంగ్, ముజఫర్‌జంగ్‌. ఈ సమయంలో అన్వరుద్దీన్, నాజర్‌జంగ్, ఆంగ్లేయులు ఒక కూటమి అయితే, చందాసాహెబ్, ముజఫర్‌జంగ్, ఫ్రెంచ్‌వారు మరో కూటమిగా ఏర్పడ్డారు. రెండో కర్ణాటక యుద్ధాన్ని అంబూర్‌ యుద్ధం అంటారు. ఈ యుద్ధంలో  అన్వరుద్దీన్‌ మరణించాడు. దీనిలో భాగంగా జరిగిన ఆర్కాట్‌ యుద్ధంలో చందాసాహెబ్‌ మరణించాడు. ఈ సమయంలో ఆర్కాట్‌ వీరుడిగా రాబర్డ్‌క్లైవ్‌ పేరుపొందాడు. యుద్ధంలో కర్ణాటక నవాబులైన అన్వరుద్దీన్, చందాసాహెబ్‌లు మరణించగా మహ్మద్‌ అలీ దీనికి నవాబు అయ్యాడు. ఈ యుద్ధంలో హైదరాబాద్‌ నవాబులైన నాజర్‌జంగ్, ముజఫర్‌జంగ్‌ మరణించగా హైదరాబాద్‌ ప్రాంతానికి సలాబత్‌ జంగ్‌ నవాబు అయ్యాడు.  


మూడో కర్ణాటక యుద్ధం (1756-63): ఈ యుద్ధానికి కారణం ఆస్ట్రియా, ప్రష్యాల మధ్య జరిగిన సప్తవర్ష సంగ్రామం. అందులో ఇంగ్లండ్, ఫ్రెంచ్‌ కూడా పాల్గొనడంతో ఇక్కడ ఆ రెండు దేశాల కంపెనీల మధ్య వందవాసి యుద్ధం/వాండివాష్‌ యుద్ధం జరిగింది. సప్తవర్ష సంగ్రామం పారిస్‌ సంధితో ముగిసింది. మూడో కర్ణాటక యుద్ధం తర్వాత  ఫ్రెంచ్‌ వారు తమ ప్రాబల్యాన్ని కోల్పోయి పాండిచ్చేరికి మాత్రమే పరిమితమయ్యారు.

రచయిత: గద్దె నరసింహారావు


 

Posted Date : 05-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌