• facebook
  • whatsapp
  • telegram

శాస‌న‌స‌భ‌

  భారత రాజ్యాంగంలోని 168వ అధికరణ ప్రకారం ప్రతి రాష్ట్రానికి శాసనసభ ఉంటుంది. శాసనసభ అంటే గవర్నర్, విధానసభ, విధానపరిషత్ అని అర్థం. మన దేశంలో ఆరు రాష్ట్రాల్లో ద్విసభావిధానం (విధానసభ, విధానపరిషత్), మిగిలిన రాష్ట్రాల్లో ఏకసభావిధానం (విధానసభ) ఉన్నాయి. ఢిల్లీ, పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా విధానసభలున్నాయి. శాసనసభల ప్రధాన కర్తవ్యం శాసనాలు లేదా చట్టాలు చేయడం. వీటితో పాటు శాసనసభలకు అనేక విధులు, అధికారాలు ఉన్నాయి. విధానసభ, విధానపరిషత్ అధికారాలు; విధానసభ, విధానపరిషత్ మధ్య పోలికలు, భేదాలు మొదలైన విషయాల గురించి  వివరంగా తెలుసుకుందాం. 

శాసనసభ అధికారాలను కిందివిధంగా పరిశీలించవచ్చు. 

*  శాసన అధికారాలు

*  కార్యనిర్వాహక అధికారాలు

*  ఆర్థిక అధికారాలు

*  ఎన్నికల అధికారాలు

*  ఇతర అధికారాలు

శాసన అధికారాలు 

* రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్‌లో ఉండే రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలోని అంశాలపై శాసనసభ చట్టాలు చేస్తుంది. 

* గవర్నర్ జారీచేసిన ఆర్డినెన్స్‌లను కాలపరిమితి ముగిసేలోపు చట్టబద్ధం చేస్తుంది. అంటే శాసనసభ సమావేశాలు లేనప్పుడు జారీచేసిన ఆర్డినెన్స్‌కు శాసనసభ సమావేశమైన 6 వారాల్లో ఆమోదం లభించాలి. 

* రాష్ట్ర శాసనసభలో శాసన నిర్మాణ ప్రక్రియ ఒకే సభ ఉన్నప్పుడు, రెండు సభలున్న పరిస్థితుల్లో వేర్వేరుగా ఉంటుంది.
 

ఒకే సభ (విధానసభ) ఉన్నప్పుడు శాసన నిర్మాణ ప్రక్రియ: రాష్ట్ర శాసనసభలో విధానసభ మాత్రమే ఉంటే, బిల్లును విధానసభలో ప్రవేశపెట్టి ఆమోదించిన తర్వాత గవర్నర్‌కు పంపాలి. 

* విధానసభలో ప్రవేశపెట్టిన బిల్లును తిరస్కరిస్తే ఆ బిల్లు అక్కడితో అంతమైపోతుంది.
 

రెండు సభలు (విధానసభ, విధానపరిషత్) ఉన్నప్పుడు శాసన నిర్మాణ ప్రక్రియ: రాష్ట్ర శాసనసభలో విధానసభ, విధానపరిషత్ రెండూ ఉంటే, బిల్లు చట్టంగా లేదా శాసనంగా మారే ప్రక్రియ రెండు రకాలుగా ఉంటుంది.
 

బిల్లు మొదట విధానపరిషత్‌లో ప్రవేశపెట్టడం: బిల్లు మొదట విధానపరిషత్‌లో ప్రవేశపెడితే, అక్కడ ఆమోదం పొందిన తర్వాత విధానసభకు పంపాలి. అలా విధానసభకు పంపినప్పుడు విధానసభకు ఆ బిల్లు విషయంలో కింది ప్రత్యామ్నాయాలున్నాయి.
1) విధానసభ ఆ బిల్లును ఆమోదించవచ్చు.
2) తిరస్కరించవచ్చు.
3) బిల్లును ఆమోదిస్తే గవర్నర్ ఆమోదానికి పంపుతుంది.

4) తిరస్కరిస్తే ఆ బిల్లు అక్కడితో అంతమైపోతుంది. విధానపరిషత్ నుంచి విధానసభకు వచ్చిన బిల్లును ఎంతకాలంలోగా ఆమోదించాలనే దానిపై నిర్ణీత కాల పరిమితి లేదు.
 

బిల్లు ముందుగా విధానసభలో ప్రవేశపెట్టినప్పుడు: విధానసభలో మొదటగా ప్రవేశపెట్టిన బిల్లును ఆమోదించి విధానపరిషత్‌కు పంపిస్తే విధానపరిషత్‌కు ఆ బిల్లు విషయంలో కింది ప్రత్యామ్నాయాలుంటాయి.
1) బిల్లును తిరస్కరించవచ్చు.
2) బిల్లుకు సవరణలు ప్రతిపాదించవచ్చు.
3) మూడు నెలలవరకు ఆమోదం తెలపకపోవచ్చు
4) యథాతథంగా ఆమోదించవచ్చు. విధానపరిషత్ బిల్లును యథాతథంగా ఆమోదిస్తే (4వ ప్రత్యామ్నాయం) ఆ బిల్లును గవర్నర్ దగ్గరికి పంపుతారు. 
* విధానపరిషత్‌పై 1, 2, 3 ప్రత్యామ్నాయాల్లో అంటే బిల్లును తిరస్కరించినా, సవరణలు చేసినా, ఆమోదం తెలపకపోయినా బిల్లు విధానసభ పరిశీలనకు వస్తుంది. విధానసభ ఆ బిల్లు పునఃపరిశీలనలో, విధానపరిషత్ తిరస్కరించడానికి లేవనెత్తిన అభ్యంతరాలను, ఒకవేళ ఏదైనా బిల్లుకు సవరణ చేసినా వీటిని ఆమోదించవచ్చు, ఆమోదించకపోవచ్చు. 
* విధానసభకు వచ్చిన ఆ బిల్లును పునఃపరిశీలించి రెండోసారి విధానపరిషత్‌కు పంపాలి. అలా వచ్చిన బిల్లును విధానపరిషత్ తిరస్కరించినా లేదా విధానపరిషత్ నెలపాటు ఆమోదించకుండా అలాగే ఉంచినా; విధానపరిషత్ ఆ బిల్లును ఆమోదించినట్లే భావించి గవర్నర్‌కు పంపుతారు.

గమనిక: రెండోసారి విధానపరిషత్‌కు, విధానసభ నుంచి వచ్చిన బిల్లును ఒక నెలలోగా ఆమోదించాలి. ఆమోదించకపోయినా ఆమోదించినట్లే అవుతుంది. దీన్నిబట్టి గ్రహించాల్సిన విషయం విధానపరిషత్ మొదటిసారిగా బిల్లును 3 నెలల కాలం, రెండో సారి ఒక నెల కాలం అంటే గరిష్ఠంగా 4 నెలల కాలంపాటు బిల్లును ఆమోదించకుండా జాప్యం చేయవచ్చు తప్ప మరేమీ చేయలేదు. బిల్లుల ఆమోదం విషయంలో విధానసభకే ఎక్కువ అధికారాలున్నాయి.

కార్యనిర్వహణ అధికారాలు

రాష్ట్ర కార్యనిర్వాహక వర్గాన్ని పరోక్షంగా శాసనసభ ఎంపిక చేస్తుంది. అంటే ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రిమండలిని విధానసభ, విధానపరిషత్‌నుంచి ఎంపిక చేస్తారు. 
 

* శాసనసభ మంత్రిమండలిని నియంత్రిస్తుంది. ఇలా నియంత్రించేందుకు అవిశ్వాస తీర్మానం, కోత తీర్మానం, వాయిదా తీర్మానం, ప్రశ్నోత్తరాల కార్యక్రమాలు మొదలైనవాటిని ఉపయోగించుకుంటుంది.
 

గమనిక: మంత్రిమండలిపై అవిశ్వాస తీర్మానాన్ని విధానసభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. ఇది విధానసభకు ఉండే ప్రత్యేక అధికారం. మంత్రిమండలి విధానసభకు సమష్టి బాధ్యత వహిస్తుంది. విధానసభ అనేది ప్రజలతో ప్రత్యక్షంగా ఎన్నికయ్యే సభ్యుల సభ కాబట్టి, మంత్రిమండలి విధానసభకు సమష్టి బాధ్యత వహిస్తుంది.
 

గమనిక: పార్లమెంటు కేంద్ర కార్యనిర్వాహక వర్గాన్ని నియంత్రించినట్లే, శాసనసభ రాష్ట్ర కార్యనిర్వాహకవర్గాన్ని అవిశ్వాస తీర్మానం, కోత తీర్మానం లాంటి పద్ధతుల ద్వారా నియంత్రిస్తుంది.

ఆర్థిక అధికారాలు

* శాసనసభ ఆమోదం లేనిదే ఎలాంటి పన్నులు విధించకూడదు. 
* రాష్ట్రప్రభుత్వ ఆదాయ వ్యయాల పట్టికైన బడ్జెట్‌ను శాసనసభ ఆమోదించాలి. 
* ద్రవ్యబిల్లును గవర్నర్ అనుమతితో మొదట విధానసభలోనే ప్రవేశపెట్టాలి

 

ద్రవ్యబిల్లు ఆమోదం - విధాన పరిషత్:
* విధానసభలో ఆమోదించిన ద్రవ్యబిల్లును విధానపరిషత్‌కు పంపితే బిల్లు అందిన 14 రోజుల్లోపు విధానపరిషత్ ఆమోదించాలి. ఒకవేళ ఆమోదించకపోయినా ఆమోదించినట్లే పరిగణిస్తారు. 
* ద్రవ్యబిల్లు విషయంలో విధానపరిషత్ ఏమైనా సలహాలిచ్చి ఉంటే, వాటిని కూడా 14 రోజుల్లోపే విధానసభకు పంపాలి. విధానసభ ఆ సలహాలను ఆమోదించవచ్చు, ఆమోదించకపోవచ్చు. 
* కాబట్టి ద్రవ్యబిల్లు విషయంలో విధానపరిషత్ అధికారాలు చాలా స్వల్పం. కేవలం 14 రోజులు మాత్రమే తన దగ్గర ఉంచుకునే అధికారం ఉంది. 
* సాధారణ బిల్లును విధానపరిషత్ గరిష్ఠంగా 4 నెలలు ఉంచుకోవచ్చు. అదే ద్రవ్యబిల్లును కేవలం 14రోజులు తన దగ్గర ఉంచుకోవచ్చు. రెండు రకాల బిల్లుల విషయంలో కూడా విధానసభదే పైచేయి. విధానపరిషత్ సలహాలు, సవరణలను విధానసభ ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు.

ఎన్నికల సంబంధ అధికారాలు 

శాసనసభకు కింది ఎన్నికల సంబంధ అధికారాలున్నాయి. 
* విధానసభ సభ్యులు తమలో ఒకరిని స్పీకర్‌గా, మరొకరిని డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నుకుంటారు. అలాగే విధాన పరిషత్ సభ్యులు తమలో ఒకరిని ఛైర్మన్‌గా, మరొకరిని డిప్యూటీ ఛైర్మన్‌గా ఎన్నుకుంటారు. 
* విధానసభ సభ్యులు రాష్ట్రపతి ఎన్నికల్లో, రాజ్యసభ సభ్యుల ఎన్నికల్లో విధాన పరిషత్ సభ్యుల ఎన్నికల్లో పాల్గొంటారు.

రాజ్యాంగ సంబంధ అధికారాలు

* కొన్ని రాజ్యాంగ సవరణ బిల్లుల ఆమోదం విషయంలో పార్లమెంటు ఉభయసభలు ప్రత్యేక మెజారిటీతోపాటు, దేశంలోని కనీసం 1/2 వ వంతు (సగం) రాష్ట్ర శాసనసభల ఆమోదం పొందాలి.
ఉదా: రాష్ట్రపతి ఎన్నిక కావలసిన విధానం 
* రాజ్యాంగ సవరణ విధానం 
* న్యాయవ్యవస్థ అధికార పరిధి మొదలైనవి
పైవాటికి సంబంధించి రాజ్యాంగ సవరణ బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టి ప్రత్యేక కమిటీతో ఆమోదం పొందడంతోపాటు దేశంలోని కనీసం సగంకంటే ఎక్కువ శాసనసభలు సాధారణ మెజారిటీతో ఆమోదం పొందాలి. రాష్ట్రాలకు పంపిన రాజ్యాంగ సవరణ బిల్లులను ఎంతకాలం లోపల ఆమోదించాలి అనేది రాజ్యాంగంలో వివరించలేదు.

గమనిక: రాజ్యాంగ సవరణ చేసే ప్రత్యేక సదుపాయం పార్లమెంటుకు మాత్రమే ఉంది. రాష్ట్ర శాసనసభలు రాజ్యాంగ సవరణలకు బిల్లులను ప్రవేశపెట్టకూడదు. 
* రాజ్యాంగ సవరణ బిల్లులను విధానసభ మాత్రమే ఆమోదిస్తుంది.

శాసనసభల ఇతర అధికారాలు 

* విధానపరిషత్ ఏర్పాటు లేదా రద్దు విషయంలో విధానసభ ప్రత్యేక మెజారిటీతో తీర్మానం ఆమోదించి దాన్ని పార్లమెంటుకు పంపుతుంది.
 

విధానసభ - విధానపరిషత్ పోలికలు, భేదాలు: విధానసభ, విధానపరిషత్‌కు పలు అంశాల్లో పోలికలు, భేదాలు ఉన్నాయి.
* రాజ్యాంగంలోని 168 అధికరణ ప్రకారం విధానసభ, విధానపరిషత్‌లు శాసనసభలో అంతర్భాగాలు.
* రాజ్యాంగంలోని 170 అధికరణ విధానసభ నిర్మాణాన్ని, 171 అధికరణ విధానపరిషత్ నిర్మాణాన్ని గురించి తెలియజేస్తాయి.
* విధానసభ కనిష్ఠ సభ్యుల సంఖ్య 60 అయితే విధానపరిషత్ కనిష్ఠ సభ్యుల సంఖ్య 40 (కొన్ని శాసనసభల్లో కనిష్ఠ సంఖ్య కంటే కూడా తక్కువ స్థానాలున్నాయి. వాటికి మినహాయింపు ఉంది.)
* విధానసభ గరిష్ఠ సభ్యుల సంఖ్య 500. విధాన పరిషత్ గరిష్ఠ సభ్యుల సంఖ్య అనేది ఏ రాష్ట్రంలో అయితే విధానపరిషత్ ఉంటుందో, ఆ రాష్ట్ర విధానసభ మొత్తం సభ్యుల సంఖ్యలో 1/3 వ వంతు మించకూడదు.
* విధానసభకు ప్రత్యక్ష ఎన్నికలు, విధానపరిషత్‌కు పరోక్ష ఎన్నికలు జరుగుతాయి.

ప్రత్యక్ష ఎన్నికలు: ఓటుహక్కు ఉన్న ప్రతి ఒక్కరికి ఏ ఎన్నికల్లో అయితే పాల్గొని ఓటుహక్కు ద్వారా ప్రతినిధులను ఎన్నుకునే అవకాశం ఉంటుందో, ఆ ఎన్నికలు ప్రత్యక్ష ఎన్నికలు. మన రాజ్యాంగం ప్రకారం 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉంటుంది. వీరందరికీ ఏ ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఉంటుందో అవే ప్రత్యక్ష ఎన్నికలు.
ఉదా: గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ సభ్యుడు, జడ్పీటీసీ సభ్యుడు, ఎమ్మెల్యే, లోక్‌సభ సభ్యుడు మొదలైన ఎన్నికలు.

 

పరోక్ష ఎన్నికలు: ఓటు హక్కు ఉన్న అందరూ ఏ ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఉండదో అవే పరోక్ష ఎన్నికలు. లేదా కొద్దిమందికి మాత్రమే ఎన్నుకునే అవకాశం ఉండే ఎన్నికలు.
ఉదా: ఎం.ఎల్.సి. (విధానపరిషత్ సభ్యుడు) మండల పరిషత్ అధ్యక్షుడు, జిల్లాపరిషత్ అధ్యక్షుడు, ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి ఎన్నిక విధానం.
* 18 సంవత్సరాలు నిండి ఓటుహక్కు ఉన్న అందరూ రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనరు. కేవలం ఎన్నికైన (నామినేట్ అయినవారు కాకుండా) పార్లమెంటు ఉభయసభల సభ్యులు, ఎన్నికైన విధానసభ సభ్యులు రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొంటారు. 
* విధానపరిషత్ సభ్యుడి ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ల నియోజకవర్గాల నుంచి ఉదాహరణగా తీసుకుంటే ఎన్నిక జరిగే నాటికి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి మూడేళ్లు పూర్తయిన వారే విధానపరిషత్ సభ్యుడిని ఎన్నుకుంటారు. అంటే 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఎన్నికల్లో పాల్గొనే అవకాశంలేదు. గ్రాడ్యుయేట్లుగా ఉన్నవారికే అవకాశం ఉంది. కాబట్టి, ఎమ్మెల్సీ ఎన్నికలు పరోక్ష ఎన్నికలు.
* గ్రామ సర్పంచ్‌ని పంచాయతీలోని ఓటర్లందరూ ఎన్నుకునే అవకాశం ఉంది. కాబట్టి అవి ప్రత్యక్ష ఎన్నికలు. 
* ఎమ్మెల్యేని విధానసభ నియోజకవర్గంలోని ఓటర్లందరూ ఎన్నుకుంటారు. కాబట్టి, ఎమ్మెల్యేను ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు.

Posted Date : 03-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌