• facebook
  • whatsapp
  • telegram

క్రీ.పూ. ఆరో శతాబ్దంలో భిన్న మతాల ఆవిర్భావం

(జైనమతం)

నైతిక నడవడిక  నేర్పిన ధర్మం!



వేదసంస్కృతి, జీవన విధానంలోని అహేతుక అంశాలను, బ్రాహ్మణాధికత్యను ప్రశ్నిస్తూ భారత గడ్డపై జైన, బౌద్ధ  మతాలు ఆవిర్భవించాయి. వర్ణవ్యవస్థను, సంక్షిష్ట మతాచారాలను నిరసించి అభ్యుదయ భావాలను, నైతిక విలువలను బోధించాయి. సామాన్యుడు ఆచరించేందుకు కష్టతరంగా ఉన్న వైదిక సంప్రదాయాలు ఎందుకంటూ ఆలోచనలు రేకెత్తించి, అందరినీ ఆకర్షించి విస్తృత జనాదరణ పొందాయి. అహింస, నైతికతతో కూడిన సరళ జీవనానికి మార్గం చూపాయి. ఆరో శతాబ్దంలో మతపరమైన అశాంతి నుంచి పుట్టిన అభ్యుదయవాదంగా ప్రసిద్ధికెక్కిన ఈ పరిణామాలను పరీక్షార్థులు తెలుసుకోవాలి. జైన మతం విస్తరించిన తీరు, భారతీయ సంస్కృతిని పరిపుష్టం చేసిన విధానంతో సహా, వర్ధమాన మహావీరుడి        త్రిరత్నాలపై సమగ్ర పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. 



ప్రాచీన భారతదేశ చరిత్రలో క్రీ.పూ.ఆరో శతాబ్దం విప్లవాత్మక పరిణామాలకు నాంది పలికింది. నాటి సమాజంలో నెలకొన్న సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిణామాలు మత ఉద్యమాలకు నేపథ్యమై, తర్వాతి కాలంలో భారతీయ సమాజాన్ని ప్రగాఢంగా ప్రభావితం చేశాయి.


క్రీ.పూ. ఆరో శతాబ్దం నాటికి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలతో కూడిన వర్ణవ్యవస్థ దృఢంగా మారింది. వర్ణాల మధ్య వ్యత్యాసం పెరిగిపోయింది. కులవ్యవస్థ రూపుదిద్దుకుంది. ఆర్యావర్తంలో ఆర్యగణాలు స్థిర జీవనానికి అలవాటుపడి, భూమితో అనుబంధం ఏర్పరచుకుని రాజ్యాలు స్థాపించాయి. ఆనాటి ఉత్తర భారతదేశం 16 మహాజనపదాలతో (షోడశ మహాజనపదాలు - అంగ, అవంతి, అశ్మక, చేది, గాంధార, కురు, కాశి, కాంభోజ, కోసల, మగధ, మత్య, మల్ల, పాంచాల, శూరసేన, వత్స, వజ్జి) ఉన్నట్లు ప్రాచీన మతసాహిత్యం తెలియజేస్తోంది. వీటి మధ్య ఐకమత్యం లేదు. నిరంతరం కలహించుకునేవి.


జనపదాల్లో ఉద్యోగ బృందాలు పెరిగి పాలనా వ్యవస్థ ఏర్పాటైంది. ఆర్థిక రంగంలో పెనుమార్పులు వచ్చాయి. ఇనుము ఉపయోగంలోకి రావడంతో అడవులను నరికి వ్యవసాయ యోగ్యం చేశారు. అధిక పంటలు వాణిజ్యానికి దారితీసి, వాణిజ్య కూడళ్లు ఏర్పడ్డాయి. అవి పట్టణాలు (శ్రావస్తి, కౌశంబి, వైశాలి, పాటలీపుత్రం, కాశి, అహిచ్ఛత్రం తదితరాలు)గా రూపొందాయి. దీనిని రెండో పట్టణీకరణ దశ అంటారు. వృత్తులు, వృత్తిపనివారు పెరిగారు. పాలకుడు బలవంతుడయ్యాడు. ప్రాంతాల మధ్య రవాణా సౌకర్యాలు ఏర్పడ్డాయి. వ్యాపారుల ప్రాముఖ్యత పెరిగి, శ్రేణులుగా ఏర్పడ్డారు. లిపి రూపుదిద్దుకోవడం ఆ కాలంలోనే మొదలైంది.


ఆనాటి ఉత్తర భారతదేశంలో ప్రధానంగా రెండు అంశాలు ప్రబలమయ్యాయి. ఒకటి ఆర్యగణాల మధ్య అనైక్యత. రెండోది మతపరమైన అశాంతి. క్రీ.పూ.ఆరో శతాబ్దం నాటికి వైదిక మతం సంక్లిష్టంగా మారింది. వైదిక క్రతువుల నిర్వహణ సామాన్య గృహస్థుడికి భారంగా మారింది. పురోహిత వర్గ ప్రాబల్యం, కర్మకాండలు, జంతుబలులు పెరిగాయి. సంస్కృతం/విద్య కొద్దిమందికే (ద్విజులు) అందుబాటులో ఉండేది. మోక్ష సాధన ఒక్కటే ఆర్యుల జీవిత లక్ష్యంగా మారింది. అయితే మోక్షసాధన మార్గాల (కర్మ మార్గం, తపస్య మార్గం, జ్ఞాన మార్గం) విషయంలో గందరగోళం నెలకొంది. సాంఘిక, ఆర్థిక అంతరాలు, కట్టుబాట్లు కఠినతరమయ్యాయి. వైశ్యుల ఆర్థిక పరిస్థితి మెరుగై సామాజికంగా ఉన్నతి స్థానాన్ని ఆశించారు.. క్షత్రియులు కూడా సమాజంలో బ్రాహ్మణాధిక్యతను నిరసించారు. మతం విషయంలో అశాంతి నెలకొంది. ఈ నేపథ్యంలోనే సంస్కర్తలు ముందుకొచ్చి హేతుబద్ధమైన మోక్షమార్గాన్ని అన్వేషిస్తూ, ప్రజలకు సరళమైన మతాన్ని అందించేందుకు ప్రయత్నించారు. అనేక నూతన మతాలను స్థాపించారు. వాటిలో వర్ధమానుడు స్థాపించిన జైన మతం, సిద్ధార్థుడు స్థాపించిన బౌద్ధ మతం భారతీయ సమాజంపై ప్రగాఢ ముద్రలు వేశాయి.


జైన మతం:  జైన మతవిశ్వాసాల ప్రకారం 24 మంది తీర్థంకరులు ఈ మతాన్ని స్థాపించారు. తీర్థంకరుడు అంటే ‘జీవితం అనే నదిని దాటేందుకు వంతెన లాంటివాడు’. మొదటి తీర్థంకరుడు వృషభనాథుడు, రెండో తీర్థంకరుడు అజితనాథుడు. 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు, 24వ తీర్థంకరుడు వర్ధమానుడు. చివరి ఇద్దరు చారిత్రక పురుషులు. 


23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు: క్రీ.పూ.8వ శతాబ్దంలో కాశీ రాజు అశ్వసేనుడు, రాణి విమల దంపతుల కుమారుడు. తల్లిదండ్రుల మరణాంతరం ఆయన సంసార జీవితాన్ని వదిలి, సత్యాన్వేషణ కోసం అడవులకు వెళ్లి ధ్యానం చేసి జ్ఞానం పొందాడు. తాను గ్రహించిన సత్యాలు 1) సత్య 2) అహింస 3) అస్తేయ (అనుమతి లేకుండా ఇతరుల సొత్తు పొందకపోవడం) 4) అపరిగ్రహ (అవసరానికి మించి సంపద కూడబెట్టడంపై ఆసక్తి లేకపోవడం) లను ప్రచారం చేశాడు.


24వ తీర్థంకరుడు వర్ధమానుడి తొలి జీవితం: జాంత్రిక తెగకు చెందిన రాజు సిద్ధార్థుడు, లిచ్ఛవీ వంశానికి చెందిన త్రిషాల దంపతులకు క్రీ.పూ.540వ సంవత్సరంలో కుంద గ్రామంలో వర్ధమానుడు జన్మించాడు. తన 30వ ఏట రాజప్రాసాదాన్ని వదిలి సత్యాన్వేషణలో అడవులకు వెళ్లాడు. ఆరేళ్లపాటు మక్కలి గోసల అనే సన్యాసితో సంచరించాడు. ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు. గోసల అజ్విక మతాన్ని స్థాపించాడు. అప్పటి నుంచి ఆరేళ్లపాటు వర్ధమానుడు అడవుల్లో కఠోర ధ్యానం చేసి, రిజుపాలిక నది ఒడ్డున జృంబికా గ్రామంలో జ్ఞానం పొందాడు. తిరిగి రాజ్యానికి వచ్చి ప్రజలకు తాను గ్రహించిన విషయాలను బోధించాడు. మహాజనపదాల్లో (మగధ, మల్ల, వత్స, కోసల మొదలైనవి) పర్యటించి, ప్రజల వాడుక భాష (అర్ధ మాగధి)లో సరళంగా బోధనలు చేసి ఆకట్టుకున్నాడు. ఇతడి బిరుదులు ‘నిర్గ్రంధ’ (సకల బంధాలు తెంచుకొన్నవాడు), అరిహంత (మోక్షాన్ని పొందినవాడు), ‘జీన’ (ఇంద్రియాలను జయించినవాడు), మహావీర మొదలైనవి.


మహావీరుడి బోధనలు: 24వ తీర్థంకరుడు అయిన వర్ధమాన మహావీరుడు జైన మతాన్ని సంస్కరించి వ్యాప్తిలోకి తెచ్చాడు. పార్శ్వనాథుడు బోధించిన సత్య, అహింస, అస్తేయ, అపరిగ్రహలను బోధిస్తూ వాటికి బ్రహ్మచర్యాన్ని జోడించాడు. ఆత్మ పరిశుద్ధంగా ఉండటం మోక్షానికి (కైవల్యం) అవసరమని బోధించాడు. ఈ విశ్వ సృష్టి వెనుక ఏ మహత్తర దైవశక్తి లేదని, అది తనంతట తానుగా ఆవిర్భవించి, నిర్వహణలో ఉన్న ఒక భౌతిక చర్య అని బోధించాడు. వేదాల సాధికారతను, మోక్ష మార్గాలుగా వైదిక సిద్ధాంతాలను తిరస్కరించాడు. సృష్టిలో ప్రతి జీవికి, అజీవికి ఆత్మలు ఉన్నాయని, వాటిని బాధిస్తే, కర్మ రూపంలో ఆత్మ తిరిగి జన్మ, పునర్జన్మ పొందుతూనే ఉంటుందని, జన్మ రాహిత్యానికి దూరమవుతుందని బోధించాడు. కఠోరమైన అహింసాచరణ ద్వారా ఆత్మను పునీతం చేసుకోవచ్చని చెప్పాడు. ఆత్మ జన్మరాహిత్య స్థితి పొందాలంటే మానవుడు మూడు క్రియలు నిర్వర్తించాలని ఉద్బోధించాడు. జైన మతంలో వీటిని ‘త్రిరత్నాలు’ అంటారు. అవి: సమ్యక్‌ విశ్వాస్‌ (తీర్థంకరులపై విశ్వాసం ఉండటం), సమ్యక్‌ జ్ఞాన్‌ (తీర్థంకరుల బోధనల పట్ల సమగ్ర అవగాహన), సమ్యక్‌ క్రియ (జైనమత పంచ మహావ్రతాలు ఆచరించడం). వీటిని ఆచరించి జన్మ రాహిత్య స్థితి అయిన ‘కేవల’ స్థితిని పొందవచ్చని ఉద్బోధించాడు. జైన మతవ్యాప్తికి సంఘాన్ని స్థాపించాడు. ఇందులో స్త్రీ, పురుషులు ఇద్దరూ సభ్యులే. అశోకుడి కాలంలో జైన మతాన్ని నిర్గ్రంధుల మతంగా వ్యవహరించేవారు. జైన మత సాహిత్యాన్ని తొలిదశలో 14 పర్వాలుగా పేర్కొన్నారు. తర్వాత ఆరో శతాబ్దిలో వల్లభిలో జరిగిన రెండో జైన సమావేశంలో పన్నెండు అంగాలుగా (ద్వాదశ) రూపొందించారు. 


జైన మతం ఎదుగుదలకు కారణాలు: వర్ధమాన మహావీరుడితో పునఃస్థాపితమైన జైన మతం కొద్దికాలానికే గొప్ప మతంగా ఎదిగింది. తొలిదశలో మహావీరుడి విలక్షణ వ్యక్తిత్వం, సరళమైన మత సిద్ధాంతాలు ప్రజలను అతడి బోధనల వైపు ఆకర్షించాయి. మహావీరుడి బోధనలను శిష్యులు (గణాచారలు) చిత్తశుద్ధితో ప్రజల్లోకి తీసుకెళ్లడం, సంస్కృతాన్ని వదిలి ప్రజల వాడుక భాషలో బోధనలు చేయడం, అనేకమంది రాజులు (చంద్రగుప్త మౌర్యుడు, కళింగ పాలకుడు చేది వంశ రాజు ఖారవేలుడు, రాష్ట్రకూట రాజు అమోఘవర్షుడు మొదలైన వారు) జైన మతాన్ని ప్రోత్సహించడంతో గొప్ప మతంగా ఎదిగింది. మహావీరుడి కాలంలో గంగా లోయ ప్రాంతానికి పరిమితమైన మతం ఆ తర్వాత మాళ్వ, గుజరాత్, రాజస్థాన్, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలకు వ్యాపించింది.


భారతీయ సంస్కృతికి జైన మత సేవ: భారతీయ పరిణామ దశలో జైనమతం అద్వితీయ పాత్ర పోషించింది. ఆ కాలం నాటికి జంతుబలులు, క్రతువులతో నిండిన వైదిక మత స్థానంలో అహింసను పరమ ధర్మంగా బోధిస్తూ, సత్యం, అస్తేయ, అపరిగ్రహ లాంటి సద్గుణాలతో కూడిన నైతిక విలువలను పెంపొందించి ఆత్మ సంస్కారం కలిగించింది. మానవ జాతి మనుగడకు అత్యవసరమైన అహింసను ఒక తత్వంగా రూపొందించింది. జైనమతం గుజరాతీ, రాజస్థానీ, మరాఠీ, కన్నడ లాంటి ప్రాంతీయ భాషల అభివృద్ధికి తోడ్పడింది. జైనమత క్షేత్రాలైన రాజగృహ, వైశాలి, పవపురి, శ్రావణ బెళగొళ, అబూ కొండలు; ఖారవేలుడు కళింగలో నిర్మించిన ఉదయగిరి, స్కందగిరి గుహలు; మైసూరు, శ్రావణ బెళగొళ వద్ద ఉన్న బాహుబలి విగ్రహాలు జైనమత వాస్తు, శిల్పకళకు ప్రసిద్ధి. చంద్రగుప్తు మౌర్యుడి సమకాలికుడు బద్రబాహుడు రాసిన ‘కల్పసూత్ర’ గ్రంథం, కుందాచార్యుడి ‘సమయసార, ప్రవచన సార’, 12వ శతాబ్దంలో హేమచంద్రుడు రాసిన ‘పరిశిష్టపర్వం’, జినసేనుడు రాసిన ‘హరివంశ పురాణం,’ రాష్ట్రకూట రాజు అమోఘవర్షుడు రాసిన ‘కవిరాజ మార్గ, ప్రశ్నోత్తర రత్నమాలిక’ లాంటి గ్రంథాలు, పండితుల వ్యాఖ్యానాలు జైనమతానికి పరిపుష్టి చేకూర్చడమే కాకుండా, భారతీయ సంస్కృతికి నైతికతతో కూడిన నిండుతనాన్ని తెచ్చాయి.



రచయిత: వి.వి.ఎస్‌. రామావతారం 

Posted Date : 26-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌