• facebook
  • whatsapp
  • telegram

జీవ వైవిధ్యం - సంరక్షణ

వన్యమృగ సంరక్షణ కేంద్రాలు


వీటిని వన్య ప్రాణుల సంరక్షణకు కేటాయించారు. వీటికి సరిహద్దులు ఉండవు. సాధారణ ప్రజలు ఇక్కడి వన్య ప్రాణులకు హాని కలిగించనంత వరకు అటవీ కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుమతి ఉంది.


* దేశంలో మొత్తం 567 వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. ఇవి ఎక్కువగా ఉన్న రాష్ట్రం - మహారాష్ట్ర (49), కేంద్రపాలిత ప్రాంతం - అండమాన్‌ నికోబార్‌ (97).


* ఆంధ్రప్రదేశ్‌లో 13, తెలంగాణలో 9 అభయారణ్యాలు ఉన్నాయి.


వేదాంతంగళ్‌ బర్డ్‌ శాంక్చుయరీ


దేశంలో మొదటి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం తమిళనాడులోని వేదాంతంగళ్‌. దీన్ని 1895లో ఏర్పాటు చేశారు. ఇది దేశంలో అతి పురాతనమైన నీటి పక్షుల అభయారణ్యం.


* తమిళ భాషలో వేదాంతంగళ్‌ అంటే ‘వేటగాడి కుగ్రామం’ అని అర్థం.


* దేశంలో అతిపెద్ద వన్యప్రాణి సంరక్షణ కేంద్రం రాజస్థాన్‌లోని రణ్‌తంబోర్‌.


దేశంలో ముఖ్యమైన వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు


ఆంధ్రప్రదేశ్‌: కొల్లేరు పక్షి సంరక్షణ కేంద్రం, కంబాల కొండ, లంకమల్లేశ్వర-కడప, కౌండిన్య-చిత్తూరు (ఆంధ్రప్రదేశ్‌లోని ఏకైక ఏనుగుల పరిరక్షణ కేంద్రం), శ్రీ వేంకటేశ్వర-తిరుపతి, శ్రీ పెనుశిల నరసింహ - నెల్లూరు, గుండ్ల బ్రహ్మేశ్వర-కర్నూలు, రోళ్లపాడు-నంద్యాల (బట్టమేకతల పక్షి), రాజీవ్‌గాంధీ- నంద్యాల, పల్నాడు, ప్రకాశం, కృష్ణా (బావురు పిల్లి), కోరింగ- కాకినాడ, నేలపట్టు-తిరుపతి, పులికాట్‌-తిరుపతి.


తెలంగాణ: పాకాల, ఏటూరునాగారం (భూపాలపల్లి), ప్రాణహిత (మంచిర్యాల), కిన్నెరసాని (భద్రాద్రి), అమ్రాబాద్‌ (నల్గొండ, నాగర్‌కర్నూల్‌).


కర్ణాటక: దండేలి (దీని మీదుగా కాళీ నది ప్రవహిస్తుంది), రంగన్‌తిట్టూ, బందీపూర్‌ (కర్ణాటకలో పెద్దది).


రాజస్థాన్‌: కియోలాడియో ఘనా (సైబీరియన్‌ కొంగలు), డెసర్ట్‌(బట్టమేకతల పక్షి), సరిస్కా, చిత్తోడ్‌.


జమ్మూకశ్మీర్‌: సలీంఅలీ (మంచుకోడి సంరక్షణ), డచ్చిగామ్, కిష్తవార్‌.


బయోస్పియర్‌ రిజర్వ్‌లు


IUCN (International Union for Conservation of Nature) జాబితాలో Vకేటగిరీకి చెందిన రక్షిత ప్రాంతాలు. IUCN ను 1948, అక్టోబరు 5న స్థాపించారు. 


* 1968లో యునెస్కో నిర్వహించిన సమావేశంలో బయోస్పియర్‌ రిజర్వ్‌లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దీని ఫలితంగా 1970లో MAB (Man And the Biosphere) పై సమావేశాన్ని నిర్వహించారు. ఇది 1971లో కార్యరూపం దాల్చింది.


* 1986లో BRP (Biosphere Reserve Programme) లో భాగంగా భారతదేశంలో బయోస్పియర్స్‌ను ఏర్పాటు చేశారు.


* దేశంలో మొత్తం 18 బయోస్పియర్లు ఉన్నాయి.


నీలగిరి బయోస్పియర్‌: భారతదేశంలో మొదటి బయోస్పియర్‌. దీన్ని 1986లో ప్రకటించారు. తమిళనాడులో ఉంది.


* MAB కార్యక్రమం ప్రారంభమై 2011 నాటికి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నీలగిరి బయోస్పియర్‌ రిజర్వ్‌ యునెస్కో అవార్డు పొందింది.


* ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, కడప, జిల్లాల్లో ఉన్న శేషాచలం కొండలను 17వ బయోస్పియర్‌ రిజర్వ్‌గా 2010లో ప్రకటించారు.


* దేశంలో 16వ బయోస్పియర్‌ రిజర్వ్‌ - Cold desert (శీతల ఎడారి). ఇది హిమాచల్‌ ప్రదేశ్‌లో ఉంది. 2009లో ప్రకటించారు. 


* దేశంలో 18వ బయోస్పియర్‌ రిజర్వ్‌ - మధ్యప్రదేశ్‌లోని పన్నా. 2011లో ప్రకటించారు.


* దేశంలో ఎత్తయిన బయోస్పియర్‌ రిజర్వ్‌ సిక్కింలోని కాంచనజంగా (Khangchendzonga).


బయోస్పియర్‌ రకాలు


బయోస్పియర్‌ రిజర్వ్‌లను 1993లో మూడు భాగాలుగా విభజించారు. అవి:


1. కోర్‌ జోన్‌: ఇక్కడ మానవ సంచారం నిషేధం. జీవజాతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు. పర్యాటకం, నివాసం, ఆర్థిక కార్యకలాపాలు నిషేధం.


2. బఫర్‌జోన్‌: తటస్థ ప్రాంతం. కోర్‌ జోన్‌ చుట్టూ ఉన్న ప్రాంతం. పరిమితంగా పర్యాటకం, పరిశోధనలు,కొంతవరకు ఆర్థిక కార్యకలాపాలకు అనుమతి ఉంటుంది.


3. ట్రాన్సిషన్‌ జోన్‌: పరివర్తిత ప్రాంతం. బయోస్పియర్‌ రిజర్వ్‌కి కొన్ని సరిహద్దులు నిర్ణయిస్తారు. ఇక్కడ నివాసాలు, వ్యవసాయానికి అనుమతి ఉంటుంది.



మాదిరి   ప్రశ్నలు


1. జిమ్‌ కార్బెట్‌ నేషనల్‌ పార్క్‌ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? (దీన్ని హేలీ నేషనల్‌ పార్క్‌ అని కూడా అంటారు.) 

1) 1936     2) 1952     3) 1963     4) 1947 



2. ఆంధ్రప్రదేశ్‌లోని అతిచిన్న నేషనల్‌ పార్క్‌? 

1) శ్రీ వేంకటేశ్వర నేషనల్‌ పార్క్‌   2) పాపికొండ నేషనల్‌ పార్క్‌ 

3) రామేశ్వరం నేషనల్‌ పార్క్‌    4) మృగవని నేషనల్‌ పార్క్‌ 



3. ఒంటి కొమ్ము ఖడ్గమృగాలకు ప్రసిద్ధి చెందిన నేషనల్‌ పార్క్‌? 

1) కజిరంగ (అసోం)       2) జల్దపార (పశ్చిమ్‌ బంగా) 

3) దుద్వా (ఉత్తర్‌ ప్రదేశ్‌)       4) దండేలి (కర్ణాటక) 



4. కింది ఏ నేషనల్‌ పార్క్‌లో కనిపించే నల్ల చిరుతను ‘కబిని ప్రాంతపు దెయ్యం’ అంటారు? 

1) రణ్‌తంబోర్‌ (రాజస్థాన్‌)   2) సుందర్‌బన్స్‌ (పశ్చిమ్‌ బంగా)

3) మానస్‌ (అసోం)       4) నాగర్‌ హాల్‌ (కర్ణాటక)



5. దేశంలో మొదటి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం? 

1) వేదాంతంగళ్‌ (తమిళనాడు)     2) రణ్‌తంబోర్‌ (రాజస్థాన్‌) 

3) రంగన్‌ తిట్టూ (కర్ణాటక)        4) సరిస్కా (రాజస్థాన్‌) 



6. ఆంధ్రప్రదేశ్‌లోని శేషాచలం కొండలను 2010లో బయోస్పియర్‌ రిజర్వ్‌గా ప్రకటించారు. అయితే ఇది దేశంలో ఎన్నో బయోస్పియర్‌? 

1) 16వ     2) 17వ     3) 18వ     4) 15వ 



7. భారతదేశంలో జాతీయ పార్క్‌లు లేని రాష్ట్రం? 

1) పంజాబ్‌    2) హరియాణా    3) త్రిపుర    4) సిక్కిం 



8. గరంపానీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది? 

1) కర్ణాటక    2) తమిళనాడు    3) అసోం    4) పంజాబ్‌ 



9. అంతర్జాతీయ మంచు చిరుత పులుల దినోత్సవాన్ని ఏటా ఎప్పుడు నిర్వహిస్తారు? 

1) అక్టోబరు 13   2) అక్టోబరు 23   3) జులై 29   4) జులై 24 



10. భారతదేశంలో ఉన్న చిత్తడి నేలల్లో రామ్‌సర్‌లో భాగంగా ఉన్న అతి చిన్న చిత్తడి ప్రాంతం? (రామ్‌సర్‌ అనేది చిత్తడి నేలల సంరక్షణకు సంబంధించిన అంతర్జాతీయ ఒప్పందం.) 

1) చిల్కా (ఒడిశా)         2) కియోలాడియో ఘనా (రాజస్థాన్‌) 

3) రేణుక (హిమాచల్‌ ప్రదేశ్‌)      4) లోనార్‌ (మహారాష్ట్ర) 



11. భారతదేశంలో ఎక్కువ చిత్తడి నేలలు ఉన్న రాష్ట్రం? 

1) పంజాబ్‌   2) పశ్చిమ్‌ బంగా   3) అసోం   4) ఉత్తర్‌ ప్రదేశ్‌ 



12. కింది ఏ ప్రాంతం గంగా నది డాల్ఫిన్‌ను తమ పట్టణ జంతువుగా ప్రకటించింది? 

1) ముంబయి   2) గువాహటి     3) ఇండోర్‌     4) పట్నా


సమాధానాలు

1-1   2-3    3-2   4-4    5-1    6-2    7-1    8-3    9-2    10-3    11-3     12-2

Posted Date : 01-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌