• facebook
  • whatsapp
  • telegram

కేంద్ర మంత్రిమండ‌లి

 రాజ్యాంగరీత్యా దేశాధిపతి రాష్ట్రపతి. అయితే మంత్రి మండలి వాస్తవమైన కార్యనిర్వాహక సంస్థ. రాజ్యాంగం ప్రకారం విధినిర్వహణలో రాష్ట్రపతికి సలహాలు ఇవ్వడానికి, సహాయం చేయడానికి ప్రధానమంత్రి నేతృత్వంలో మంత్రిమండలి ఉంటుంది. కేంద్ర మంత్రిమండలి అనేది కేంద్ర కార్యనిర్వాహకశాఖలో వివిధ రకాల మంత్రులతో కూడిన సమూహం.

కేంద్ర మంత్రిమండలి వర్గీకరణ: 

భారతదేశంలో 1947 ఆగస్టు 15న ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ నాయకత్వంలో మొదటి 'మంత్రిమండలి' ఏర్పాటయినప్పుడు దాన్ని మంత్రిపరిషత్ లేదా క్యాబినెట్ అని పిలిచేవారు. నెహ్రూ మంత్రిమండలిని వ్యవస్థీకృతం చేయడానికి గోపాలస్వామి అయ్యంగార్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. మొత్తం మంత్రిమండలిని మూడు వర్గాలుగా విభజించి, ఒక్కొక్క వర్గానికి ప్రత్యేక స్థాయి, హోదా కల్పించి, తగిన విధులు బాధ్యతలు అప్పగించాలని ఆ కమిటీ సిఫారసు చేసింది. ఆ సిఫారసులను పూర్తిగా కాకున్నా, చాలావరకు పాటించి మూడు అంచెలలో కేంద్ర మంత్రిమండలిని ఏర్పరచారు. అవి:

1. క్యాబినెట్ మంత్రులు

2. స్టేట్ మంత్రులు లేదా రాజ్య మంత్రులు

3. డిప్యూటీ లేదా సహాయ మంత్రులు.

క్యాబినెట్ మంత్రులు:

కేంద్ర ప్రభుత్వంలోని రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, హోం, రైల్వే లాంటి ముఖ్య శాఖలకు అధిపతులుగా క్యాబినెట్ హోదాగల మంత్రులు వ్యవహరిస్తారు.

క్యాబినెట్ మంత్రులు తమ మంత్రిత్వశాఖల నిర్ణయాలు తీసుకోవడంలో స్వతంత్రంగా వ్యవహరిస్తారు.

కేంద్ర మంత్రిమండలి, కేంద్ర క్యాబినెట్ సమావేశాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో క్యాబినెట్ మంత్రులకు నిర్ణయాత్మక పాత్ర ఉంటుంది.

అంతర్జాతీయ, జాతీయ వ్యవహారాలను విశ్లేషించి నిర్ణయాలు తీసుకోవడంలో క్యాబినెట్ మంత్రులు ప్రధానమంత్రికి సన్నిహిత నాయకులుగా వ్యవహరిస్తారు.

క్యాబినెట్‌మంత్రులు అధికారపార్టీలో అత్యంత ప్రాబల్యం, విశేష పరిపాలనానుభవం పొందినవారై ఉంటారు.

రాజ్య మంత్రులు లేదా స్టేట్ మంత్రులు :

క్యాబినెట్ మంత్రికి అప్పగించిన ప్రభుత్వశాఖల్లో ఒక శాఖను స్టేట్‌మంత్రులు స్వతంత్రంగా నిర్వహించవచ్చు. వీరు తమ మంత్రిత్వశాఖకు సంబంధించి చర్చ జరిగే సమయంలో మాత్రమే ప్రత్యేక ఆహ్వానంపై క్యాబినెట్ సమావేశాలకు హాజరవుతారు. వీరికి ప్రభుత్వ విధానాల రూపకల్పనలో ఏ పాత్ర ఉండదు. కొన్ని మంత్రిత్వశాఖల్లో ఇద్దరు లేదా ముగ్గురు రాజ్య మంత్రులు ఉండవచ్చు.

డిప్యూటీ మంత్రులు లేదా సహాయ మంత్రులు:

మంత్రిత్వశాఖకు సంబంధించిన శాసన, పరిపాలనా వ్యవహారాల్లో క్యాబినెట్ మంత్రులకు సహాయపడేందుకు నియమితులయ్యేవారు డిప్యూటీ మంత్రులు లేదా సహాయమంత్రులు. బ్రిటన్‌లో వీరిని జూనియర్ మంత్రులు, పార్లమెంట్           కార్యదర్శులని పిలుస్తారు.

డిప్యూటీ మంత్రులకు స్వతంత్ర ప్రభుత్వ శాఖలను నిర్వహించే బాధ్యత ఉండదు.

పార్లమెంటులో ప్రవేశపెట్టాల్సిన బిల్లులకు సంబంధించి, సభ్యులు అడిగిన ప్రశ్నలకు జవాబులు రాయడం మొదలైన కొన్ని విధులు నిర్వహిస్తారు.

ఈ విధంగా కేంద్ర మంత్రిమండలిలో క్యాబినెట్ మంత్రులు, రాజ్య మంత్రులు, డిప్యూటీ మంత్రులు ఉంటారు. మొత్తం కేంద్ర మంత్రిమండలికి ప్రధానమంత్రి అధినేత.

మంత్రిమండలి నియామకం:

75(1) ప్రకరణ ప్రకారం కేంద్ర మంత్రిమండలి సభ్యులను ప్రధానమంత్రి సలహాపై రాష్ట్రపతి నియమిస్తారు. మంత్రివర్గ నిర్మాణంలో ప్రధానిదే అంతిమ నిర్ణయం.
ప్రధానమంత్రి కేంద్ర మంత్రిమండలి సభ్యుల పేర్లతో కూడిన జాబితాను రాష్ట్రపతికి సమర్పిస్తే, రాష్ట్రపతి వారిని నియమిస్తారు.
సాధారణంగా ప్రధానమంత్రి తన పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుల్లో కొందరిని మంత్రులుగా ఎంపిక చేస్తాడు.

సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు, ప్రధానమంత్రి భావసారూప్యమున్న ఇతర పార్టీలవారికి కూడా కేంద్ర మంత్రిమండలిలో భాగస్వామ్యం కల్పించవచ్చు. సంకీర్ణ ప్రభుత్వంలోని మంత్రులందరు కూడా ప్రధానమంత్రి మార్గదర్శకత్వంలోనే నడచుకోవాలి.
 

మంత్రుల సంఖ్య:
మంత్రిమండలిలో ఎందరిని నియమించాలి? కనిష్ఠ, గరిష్ఠ సంఖ్య ఎంత? అనే విషయాల గురించి రాజ్యాంగంలో వివరణలేదు.
మొదటి పరిపాలనా సంస్కరణల సంఘం క్యాబినెట్ మంత్రుల సంఖ్య 16కు మించరాదని, మొత్తం మంత్రుల సంఖ్య 45కు మించరాదని సిఫారసు చేసింది. కానీ ఈ నియమం ఆచరణలో లేదు.
2003లో రాజకీయపార్టీల్లో చీలికల నిరోధానికిగాను మంత్రివర్గ సైజును పరిమితం చేశారు. దీనికోసం 91వ రాజ్యాంగ సవరణ చట్టం తీసుకొచ్చారు. ఈ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ మంత్రుల సంఖ్య దిగువసభ  అంటే లోక్‌సభ లేదా విధానసభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో 15 శాతం మించరాదు.

 

మంత్రుల అర్హతలు:

కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా నియమితులయ్యేవారికి కొన్ని అర్హతలుండాలి.
1. పార్లమెంటు ఉభయసభల్లో ఏదో ఒకదానిలో సభ్యత్వం ఉండాలి.
2. ఒకవేళ సభ్యత్వం లేనిపక్షంలో మంత్రిగా ప్రమాణం స్వీకరించాక ఆరునెలల్లోగా ఉభయసభల్లో ఏదో ఒకదానిలో సభ్యుడవ్వాల్సి ఉంటుంది.

పదవీ ప్రమాణం: 

రాష్ట్రపతి మంత్రులతో పదవీప్రమాణం చేయిస్తారు. రాజ్యాంగంలోని మూడో షెడ్యూల్‌లో పదవీ ప్రమాణ స్వీకార నమూనా పత్రం ఉంటుంది.
 

మంత్రి మండలి కాలపరిమితి:

కేంద్ర మంత్రిమండలి సభ్యుల కాలపరిమితి గురించి భారత రాజ్యాంగం స్పష్టంగా పేర్కొనలేదు. 75(2) అధికరణ ప్రకారం రాష్ట్రపతి ఇష్టాయిష్టాల మేరకు కేంద్ర మంత్రులు పదవుల్లో కొనసాగుతారు. అంటే రాష్ట్రపతి సంతృప్తి మేరకు కేంద్ర మంత్రులు అధికారంలో ఉంటారు. 75(3) ప్రకరణ ప్రకారం లోక్‌సభకు సమష్టిగా బాధ్యత వహించడంలో విఫలమైతే లేదా బాధ్యత వహించాల్సిన సభలో విశ్వాసం కోల్పోతే మంత్రివర్గం రాష్ట్రపతి సంతృప్తికి దూరమైనట్లే అవుతుంది. సాధారణంగా లోక్‌సభ కాల పరిమితి ప్రకారం మంత్రిమండలి అయిదేళ్లు ఉండవచ్చు.
 

మంత్రుల తొలగింపు:

మంత్రులు వ్యక్తిగతంగా రాష్ట్రపతికి, సమష్టిగా లోక్‌సభకు బాధ్యత వహిస్తారు. క్యాబినెట్ నిర్ణయాలలో మంత్రులు ఏకీభవించకపోతే వారు స్వయంగా రాష్ట్రపతికి రాజీనామా సమర్పించి తొలగిపోవచ్చు. కొన్ని సందర్భాల్లో ప్రధానమంత్రి ఒక మంత్రిని పదవినుంచి తొలగించాలని సంకల్పిస్తే తొలగించవచ్చు. ప్రధానమంత్రి తనకు ఇష్టంలేని మంత్రిని రాజీనామా చేయాల్సిందిగా కోరవచ్చు లేదా మంత్రిని తొలగించాల్సిందిగా రాష్ట్రపతికి సిఫారసు చేయవచ్చు. ఈ విధంగా మంత్రులు రాష్ట్రపతిచే నియమితులవుతారు. రాష్ట్రపతిచే తొలగించబడతారు. దీనినే 'మంత్రులు రాష్ట్రపతికి వ్యక్తిగత బాధ్యత వహించడం' అంటారు.

మంత్రిమండలి సమష్టి బాధ్యత: 

*  రాజ్యాంగ నిబంధన 75(3) ప్రకారం మంత్రిమండలి లోక్‌సభకు సమష్టి బాధ్యత వహిస్తుంది. భారత రాజ్యాంగ నిర్మాతలు సమష్టి బాధ్యత సూత్రాన్ని బ్రిటిష్ రాజ్యాంగం నుంచి గ్రహించారు.
సమష్టి బాధ్యత అంటే, కార్యనిర్వాహకశాఖలోని మంత్రులు అధికారంలో ఉండగా తమ చర్యలకు, కార్యకలాపాలకు లోక్‌సభకు సమష్టిగా బాధ్యత వహించడం. మంత్రిమండలి తమవల్ల జరిగే తప్పొప్పులకు పార్లమెంటుకు జవాబుదారీగా           ఉంటుంది.
*  సమష్టి బాధ్యత ప్రకారం మంత్రిమండలి ప్రతి ప్రభుత్వ విధానానికి కట్టుబడి ఉండాలి. మంత్రులందరూ జట్టుగా కలిసి పదవిలో ఉంటారు లేదా పదవిని వదలుకుంటారు.
*  సమష్టి బాధ్యతా సూత్రాన్ని ప్రధానమంత్రి ఆచరణలో ఉంచుతారు. మంత్రివర్గ సమావేశాల్లో ఆమోదించిన నిర్ణయాలను ప్రతి ఒక్క మంత్రి గౌరవించేట్లు, అమలులో ఉంచేట్లు చర్యలు తీసుకుంటారు.
*  కార్య నిర్వాహకశాఖ సమష్టి బాధ్యతను శాసన నిర్మాణశాఖ అనేక విధాలుగా ఆచరణలో ఉంచుతుంది. ఉదాహరణకు పార్లమెంటు, మంత్రి మండలిపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించి ఆమోదిస్తుంది. అవిశ్వాస తీర్మానం ఆమోదం               పొందిన తక్షణమే మంత్రిమండలి అధికారాన్ని కోల్పోతుంది.
సమష్టి బాధ్యత అనేది మంత్రిమండలికి, లోక్‌సభకు సంబంధించిన అంశం. శాసననిర్మాణశాఖ, కార్యనిర్వాహకశాఖలు రెండూ విడివిడిగా తమ సామర్థ్యాలను నిరూపించుకునేందుకు వీలుంటుంది. మంత్రిమండలి సమైక్యంగా, బాధ్యతాయుతంగా, సదవగాహనతో వ్యవహరించేందుకు సమష్టి బాధ్యత దోహదపడుతుంది.

సమష్టి బాధ్యతలో ఒక మంత్రి తన వ్యక్తిగత మంత్రిత్వశాఖ నిర్వహణ విషయంలో బాధ్యత వహించడంతోపాటు తన సహచర మంత్రుల మంత్రిత్వశాఖ విధానాలు, పనిచేసే తీరు మొదలైన విషయాల్లో కూడా కలిసికట్టుగా బాధ్యత వహిస్తారు.

మంత్రిమండలి పనిచేసే తీరులో పార్లమెంటరీ సంప్రదాయాలు - సూత్రాలు:

1. రాష్ట్రపతి పేరిట పరిపాలనా నిర్వహణ:

రాజ్యాంగరీత్యా  రాష్ట్రపతి దేశాధినేత. రాష్ట్రపతి స్వయంగాగానీ, అధికారుల ద్వారాగానీ విధులు, బాధ్యతలు నెరవేరుస్తారు.

74(1) నిబంధన ప్రకారం రాష్ట్రపతికి బాధ్యతల నిర్వహణలో సలహాలు, సహకారాలు అందించడానికి ప్రధానమంత్రి నాయకత్వంలో మంత్రిమండలి ఉంటుంది.
రాష్ట్రపతి తన విధుల నిర్వహణలో మంత్రిమండలి సలహాను తప్పక పాటించాల్సి ఉంటుంది. ఎప్పుడైనా భిన్నంగా భావించిన పక్షంలో మంత్రిమండలి సలహాను కేవలం ఒక్క పర్యాయం మాత్రమే పునః పరిశీలనకు పంపవచ్చు. పునఃపరిశీలించిన నిర్ణయం తన ఆమోదంకోసం వస్తే రెండోసారి తప్పకుండా ఆమోదముద్ర వేయాలి.

2. మంత్రులు లోక్‌సభ లేదా రాజ్యసభలో సభ్యత్వం పొందాలి: 

మంత్రులుగా నియమితులయ్యేవారు పార్లమెంటు ఉభయసభల్లో ఏదో ఒక సభలో సభ్యత్వం పొందడం తప్పనిసరి. ఒకవేళ సభ్యులుకానివారిని మంత్రిపదవిలో నియమిస్తే, పదవీ స్వీకారం తేదీ మొదలుకుని ఆరునెలల్లోగా ఏదో ఒక సభలో సభ్యత్వాన్ని పొందాలి.

3. మంత్రులు ఉభయసభలకు బాధ్యులు: 

  మంత్రులు ఏ సభకు చెందినవారైనప్పటికీ వారు ఉభయసభలకు జవాబుదారీగా ఉంటారు. సభ్యుల ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. తమకు సభ్యత్వం లేని సభల్లో ఓటు వేయరు.

4. లోక్‌సభ విశ్వాసం పొందినంతకాలం మాత్రమే మంత్రుల పదవీకాలం: మంత్రిమండలి లోక్‌సభ విశ్వాసం పొందినంతకాలం మాత్రమే పదవిలో ఉంటుంది. లోక్‌సభ ప్రధానమంత్రికి వ్యతిరేకంగాగానీ లేదా మంత్రిమండలికి వ్యతిరేకంగాగానీ అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించినట్లయితే మంత్రిమండలి పతనం అవుతుంది.

5. మంత్రులమధ్య సామరస్య భావన - సమైక్యత: 

మంత్రులందరూ సాధారణంగా ఒకే రాజకీయపార్టీకి చెందినవారై ఉంటారు. మంత్రిమండలి ఒక జట్టుగా పని చేస్తుంది. పార్టీలో క్రమశిక్షణ మూలంగా వారి మధ్య ఐక్యత ఉంటుంది.

6. మంత్రిమండలిపై పార్లమెంటు నియంత్రణ: 

పార్లమెంటు ప్రశ్నలు, తీర్మానాలు, బడ్జెట్ ఆమోదం, విశ్వాస, అవిశ్వాస తీర్మానాలు మొదలైనవాటిద్వారా ప్రభుత్వాన్ని నియంత్రిస్తూ, ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉండే విధంగా చేస్తుంది.

7. ప్రధానమంత్రి నాయకత్వం: 

మంత్రిమండలి ప్రధానమంత్రి నాయకత్వంలో పనిచేస్తుంది. లోక్‌సభలో అధికారపార్టీకి అత్యధిక మెజారిటీ ఉన్నప్పుడు ప్రధాన మంత్రికి మంత్రిమండలిమీదా, పార్లమెంటులోనూ మంచి పట్టు ఉంటుంది.

మంత్రిమండలి - క్యాబినెట్ పాత్ర: 

*    మంత్రిమండలిలో క్యాబినెట్ అతి ముఖ్యమైంది. భారత రాజ్యాంగంలో మొదట క్యాబినెట్ అనే పదం లేదు. 1978లో 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా క్యాబినెట్ అనే పదాన్ని చేర్చారు.
కేంద్ర మంత్రిమండలిలోని సీనియర్ మంత్రులు క్యాబినెట్‌లో సభ్యులుగా ఉంటారు. రాజకీయ అనుభవం, పేరు ప్రఖ్యాతలు, పాలనా సామర్థ్యం, రాజ్యాంగ పరిజ్ఞానం కలిగిన కొందరు వ్యక్తులను సాధారణంగా ప్రధానమంత్రి క్యాబినెట్ సభ్యులుగా ఎంపిక చేస్తారు.
భారత రాజకీయ వ్యవస్థలో క్యాబినెట్ కింది సూత్రాల ప్రాతిపదికపై పనిచేస్తుంది.
1. ప్రధానమంత్రి ఆధ్వర్యంలో అధికార విధులను క్యాబినెట్ నిర్వర్తిస్తుంది.
2. పార్లమెంటులోని దిగువసభకు సమష్టిగా బాధ్యత వహిస్తుంది.
3. క్యాబినెట్ సమావేశాలకు ప్రధానమంత్రి అధ్యక్షత వహిస్తారు.
4. క్యాబినెట్ సభ్యులు కనీసం వారానికోసారి లేదా అనివార్యమైతే ముందుగానే సమావేశమవుతారు.
5. సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను క్యాబినెట్ రహస్యంగా, విశ్వసనీయంగా ఉంచుతుంది.
6. పార్లమెంటులోని దిగువసభలో మెజారిటీ సభ్యుల మద్దతు ఉంటుంది.

క్యాబినెట్ విధులు:

1. కేంద్ర ప్రభుత్వ విధానాలను రూపొందిస్తుంది. జాతి అంతర్గత, విదేశీ విధానాలను సుదీర్ఘమైన, తీవ్రమైన సమాలోచనల తర్వాత ఖరారు చేస్తుంది.

2. కేంద్ర ప్రభుత్వ వ్యవహారాలన్నింటిలో రాష్ట్రపతికి సలహాలు అందిస్తుంది. రాష్ట్రపతి విధుల నిర్వహణలో క్యాబినెట్ మార్గదర్శకంగా ఉంటుంది.
3. పార్లమెంటు సమావేశాల్లో లేనప్పుడు అత్యవసరమని భావిస్తే ఆర్డినెన్స్‌లను జారీచేయాల్సిందిగా రాష్ట్రపతికి సలహాలిస్తుంది. ఆర్డినెన్స్ అంటే పార్లమెంటు సమావేశాల్లో లేనప్పుడు రాష్ట్రపతి జారీ చేసే చట్టం లేదా శాసనం.
4. భూకంపం, వరదలు, అనావృష్టి, తుపాను మొదలైన ప్రకృతి ఉపద్రవాలు సంభవించినప్పుడు బాధిత ప్రజలను ఆదుకునేందుకు నిర్ణయాలు తీసుకుంటుంది.

 

క్యాబినెట్‌పై ప్రముఖుల వ్యాఖ్యానాలు :
రామ్‌సేమ్యూర్ :

రాజ్యమనే నౌకకు క్యాబినెట్ అనేది చోదక చక్రం వంటిది.
 

జాన్‌మారియట్ : 

మొత్తం రాజకీయ వ్యవస్థ క్యాబినెట్ చుట్టూనే పరిభ్రమిస్తుంది.
 

సర్ ఐవర్ జెన్నింగ్స్ : 

రాజ్యాంగ ప్రధాన భూమికయే క్యాబినెట్.

ప్రధానమంత్రి:  

భారత్‌ అనుసరిస్తున్న పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానంలో దేశాధినేత అయిన రాష్ట్రపతి ‘డీజ్యూరీ సార్వభౌమాధికారి’గా (నామమాత్రపు సార్వభౌమాధికారి), ప్రభుత్వాధినేత అయిన ప్రధానమంత్రి ‘డీఫ్యాక్టో సార్వభౌమాధికారి’గా (వాస్తవ సార్వభౌమాధికారి) వ్యవహరిస్తారు. 


ప్రధానమంత్రి - ప్రత్యేకతలు

భారతదేశంలో కేంద్ర కేబినెట్‌కు నాయకత్వం వహించే ప్రధానమంత్రి పార్లమెంటరీ తరహా ప్రభుత్వ నిర్మాణం, నిర్వహణలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. స్వాతంత్య్రానంతర కాలం నుంచి ఇప్పటి వరకు ప్రధాని పదవిని చేపట్టిన వ్యక్తులకున్న సమ్మోహన శక్తి ఫలితంగా ఈ పదవికి మరింత ప్రాధాన్యం పెరిగింది. ప్రధానమంత్రి ప్రభుత్వానికి, ప్రజలకు, పార్లమెంట్‌కు నాయకుడిగా వ్యవహరిస్తారు. రాష్ట్రపతికి పరిపాలనలో ప్రధాన సలహాదారుడిగా, ప్రభుత్వ విధానాల రూపకర్తగా వ్యవహరిస్తారు. దేశ ప్రగతి, ప్రభుత్వ భవిష్యత్‌ ప్రధాని అనుసరించే విధానాలపై ఆధారపడి ఉంటుంది.


రాజ్యాంగంలో ప్రధాని పదవి వివరణ

ఆర్టికల్‌ 74 (1): ప్రధాని నాయకత్వంలోని కేంద్ర మంత్రిమండలి సూచనల మేరకు రాష్ట్రపతి పరిపాలనను నిర్వహిస్తారు.

ఆర్టికల్‌ 74 (2): ప్రధాని నాయకత్వంలోని కేంద్ర మంత్రిమండలి పదవీకాలం లోక్‌సభ విశ్వాసం ఉన్నంత వరకే కొనసాగుతుంది.

ఆర్టికల్‌ 75 (1): లోక్‌సభకు జరిగిన సాధారణ ఎన్నికల అనంతరం రాష్ట్రపతి లోక్‌సభలో మెజార్టీ పార్టీ నాయకుడిని, లేదా మెజార్టీ పార్టీల కూటమి నాయకుడిని ప్రధానమంత్రిగా నియమిస్తారు.

ఆర్టికల్‌ 75(1)(A): కేంద్ర మంత్రిమండలి సభ్యుల సంఖ్య లోక్‌సభ మొత్తం సభ్యుల సంఖ్యలో 15 శాతానికి మించరాదు. 

ఆర్టికల్‌ 75(1)(B): పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఎవరైనా ఒక చట్టసభ సభ్యుడిని సభాధిపతి అనర్హుడిగా ప్రకటిస్తే ఆ  సభ్యుడిని ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి లాభదాయక పదవిలో నియమించరాదు. ఈ నియమం అతడు తిరిగి పార్లమెంట్‌కు ఎన్నికయ్యే వరకు వర్తిస్తుంది. ఒకవేళ పార్లమెంట్‌కు తిరిగి ఎన్నిక కాకపోతే ఆ సభ పదవీకాలం ముగిసేవరకూ ఈ అనర్హత వర్తిస్తుంది.

* అటల్‌ బిహారీ వాజ్‌పేయీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 91వ రాజ్యాంగ సవరణ చట్టం (2003) ద్వారా ఆర్టికల్‌ ఆర్టికల్‌ 75(1)(A),  75(1)(B) లను రాజ్యాంగానికి చేర్చింది.

* ఆర్టికల్‌ 75(2): ప్రధాని నాయకత్వంలోని కేంద్ర మంత్రిమండలి వ్యక్తిగతంగా రాష్ట్రపతికి బాధ్యత వహిస్తుంది.

* ఆర్టికల్‌ 75(3): ప్రధాని నాయకత్వంలోని కేంద్ర మంత్రిమండలి సమష్టిగా లోక్‌సభకు బాధ్యత వహిస్తుంది. లోక్‌సభ విశ్వాసం ఉన్నంతవరకే కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉంటుంది.

* ఆర్టికల్‌ 75(4): ప్రధాని నాయకత్వంలోని కేంద్ర మంత్రిమండలి సభ్యులు రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణస్వీకారం చేస్తారు.

* ఆర్టికల్‌ 75(5): ప్రధానమంత్రిగా లేదా కేంద్రమంత్రులుగా నియమితులు కావాలంటే పార్లమెంట్‌ ఉభయ సభల్లోని ఏదైనా సభలో సభ్యులై ఉండాలి. ఏ సభలోనూ సభ్యత్వం లేనివారు ప్రధానిగా లేదా కేంద్రమంత్రిగా నియమితులైన ఆరు నెలల్లో ఏదో ఒక సభలో తప్పనిసరిగా సభ్యత్వం పొందాలి. లేకపోతే పదవిని కోల్పోతారు.

* ఆర్టికల్‌ 75(6): ప్రధాని నాయకత్వంలోని కేంద్ర మంత్రిమండలి సభ్యుల జీతభత్యాలను పార్లమెంట్‌ నిర్ణయిస్తుంది.

* ఆర్టికల్‌ 78(1): కేంద్ర మంత్రిమండలి నిర్ణయాలను ప్రధానమంత్రి రాష్ట్రపతికి తెలియజేయాలి.

* ఆర్టికల్‌ 78(2): దేశ పరిపాలనకు సంబంధించిన కేంద్ర కేబినెట్‌ నిర్ణయాలను రాష్ట్రపతి స్వయంగా తెలుసుకోవచ్చు. 

ఉదాహరణ: బోఫోర్స్‌ ఆయుధాల కొనుగోలు విషయమై 1986లో అప్పటి రాష్ట్రపతి జ్ఞానీ జైల్‌సింగ్‌ రాజీవ్‌గాంధీ ప్రభుత్వాన్ని వివరణ కోరారు.

ఆర్టికల్‌ 78(3): ప్రధాని నాయకత్వంలోని కేంద్ర మంత్రిమండలి పంపిన తీర్మానంపై రాష్ట్రపతి తన ఆమోదముద్ర వేయకుండా పునఃపరిశీలన కోసం తిరిగి మంత్రిమండలికి పంపొచ్చు. పునఃపరిశీలన అనంతరం వచ్చిన తీర్మానానికి రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదం తెలపాలి. 


అధికారాలు, విధులు

* ప్రధానమంత్రి కేంద్ర కేబినెట్‌కు అధ్యక్షత వహిస్తారు. ప్రధాని సలహా మేరకు రాష్ట్రపతి కేంద్ర మంత్రులను నియమించి, వారికి మంత్రిత్వ శాఖలను కేటాయిస్తారు.

* ఏ కారణంతోనైనా ప్రధాని పదవి ఖాళీ  అయితే మొత్తం మంత్రిమండలి రద్దవుతుంది.

* ప్రధానమంత్రి తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించాలి.

* ప్రధాని సలహా మేరకు రాష్ట్రపతి ఆర్టికల్‌ 85 ప్రకారం లోక్‌సభను రద్దుచేస్తారు.

* రాష్ట్రపతికి, కేంద్ర మంత్రిమండలికి మధ్య ప్రధాని సంధానకర్తగా వ్యవహరిస్తారు.

* మన దేశ విదేశాంగ విధానం ప్రధాని ఆధ్వర్యంలో రూపొందుతుంది.

* ప్రధానమంత్రి రాజ్యసభ సభ్యుడైతే లోక్‌సభలో తన ప్రతినిధిగా వేరొకరిని నియమించుకుంటారు.


ప్రధానమంత్రి పదవి రీత్యా అధ్యక్షులుగా వ్యవహరించేవి:

* నీతి ఆయోగ్‌ 

* జాతీయ అభివృద్ధి మండలి

* జాతీయ సమైక్యతా మండలి 

* అంతర్‌ రాష్ట్ర మండలి 

* జాతీయ భద్రతా మండలి 

* జాతీయ జనాభా నియంత్రణ మండలి

* అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం

* జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ సమాచార కమిషన్, లోక్‌పాల్, కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ల ఛైర్మన్లను నియమించే/ఎంపిక చేసే స్క్రీనింగ్‌ కమిటీకి ప్రధానమంత్రి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు.

ప్రధాని నాయకత్వంలోని కేంద్ర మంత్రిమండలి అధికారాన్ని కోల్పోయేది ఎప్పుడంటే... 

* లోక్‌సభలో అధికారపక్షం ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానం వీగిపోయినప్పుడు

* లోక్‌సభలో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గినప్పుడు

* లోక్‌సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్, ఆర్థిక బిల్లులు తిరస్కరణకు గురైనప్పుడు

* లోక్‌సభలో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన కోత తీర్మానాలు గెలిచినప్పుడు

* లోక్‌సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం తిరస్కరణకు గురైనప్పుడు

* లోక్‌సభలో ప్రభుత్వం వ్యతిరేకిస్తుండగా ప్రతిపక్షాలు ప్రవేశపెట్టే ప్రైవేట్‌ బిల్లులు నెగ్గినప్పుడు


ప్రముఖుల వ్యాఖ్యానాలు

* ‘ప్రధాని సమానుల్లో ప్రథముడు’  - లార్డ్‌ మార్లే

* ‘ప్రధాని చుక్కల్లో చంద్రుడు’   - విలియం వెర్నార్‌ కోట్‌

* ‘ప్రధానమంత్రి సూర్యుడు అయితే అతడి మంత్రివర్గ సహచరులు అతడి చుట్టూ పరిభ్రమించే గ్రహాల లాంటి వారు’  - ఐవర్‌ జెన్నింగ్స్‌

* ‘ప్రధానమంత్రి ఎన్నికైన రారాజు’  - హింటన్‌

* ‘ప్రధాని పార్లమెంటరీ ప్రభుత్వమనే భవనానికి మూలస్తంభం లాంటివారు’  - డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌

* ‘పార్లమెంటరీ ప్రభుత్వమనే పడవను నడిపే కెప్టెన్‌ ప్రధాని’ - రాంసేమ్యూర్‌

నమూనా ప్రశ్నలు

1. కింద పేర్కొన్న వాటిలో సరైన జవాబును గుర్తించండి.

1) మన దేశంలో రాష్ట్రపతి ‘డీజ్యూరీ సార్వభౌమాధికారి’

2) మన దేశంలో ప్రధానమంత్రి ‘డీఫ్యాక్టో సార్వభౌమాధికారి’

3) మన ప్రభుత్వ విధానం ‘పార్లమెంటరీ తరహా’ విధానం.

4) పైవన్నీ సరైనవి


2. మన దేశంలో కేంద్ర కేబినెట్‌కు నాయకత్వం వహించేది ఎవరు?

1) రాష్ట్రపతి              2) సీనియర్‌ కేబినెట్‌ మంత్రి

3) ప్రధానమంత్రి        4) కేబినెట్‌ కార్యదర్శి


3. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 75్బ1్శ్బత్శి ప్రకారం కేంద్ర మంత్రిమండలి సభ్యుల సంఖ్య లోక్‌సభ సభ్యుల సంఖ్యలో ఎంతకు మించరాదని 91వ రాజ్యాంగ సవరణ చట్టం ్బ2003్శ ద్వారా నిర్దేశించారు?

1) 12 శాతం          2) 15 శాతం           3) 18 శాతం          4) 19 శాతం


4. ఆర్టికల్‌ 75(3) ప్రకారం ప్రధాని నాయకత్వంలోని కేంద్ర మంత్రిమండలి ఎవరికి సమష్టి బాధ్యత వహించాలి?

1) రాజ్యసభ      2) రాష్ట్రపతి           3) లోక్‌సభ       4) సుప్రీంకోర్టు


5. ప్రధాని నాయకత్వంలోని కేంద్ర మంత్రిమండలి సభ్యులు ఎవరి సమక్షంలో ప్రమాణస్వీకారం చేయాలి?

1) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి          2) రాష్ట్రపతి        

3) ప్రధానమంత్రి                                  4) లోక్‌సభ స్పీకర్‌


6. 1986లో బోఫోర్స్‌ ఆయుధాల కొనుగోలు విషయమై రాష్ట్రపతి జ్ఞానీ జైల్‌సింగ్‌ నాటి ప్రధానమంత్రిని వివరణ కోరారు. అది ఎవరు? 

1) ఇందిరా గాంధీ               2) విశ్వనాథ్‌ ప్రతాప్‌సింగ్‌

3) చంద్రశేఖర్‌                    4) రాజీవ్‌ గాంధీ


7. కింద పేర్కొన్న ఏ వ్యవస్థకు ప్రధానమంత్రి పదవిరీత్యా అధ్యక్షులుగా వ్యవహరించే వీలు లేదు?

1) నీతి ఆయోగ్‌                              2)  కేంద్ర ఆర్థిక సంఘం

3) జాతీయ సమైక్యతా మండలి          4) అంతర్‌రాష్ట్ర మండలి


8. ప్రధానమంత్రి అధికార, విధులకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి.

1) ప్రధానమంత్రి తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించాలి.

2) ప్రధానమంత్రి కేంద్ర మంత్రిమండలికి, రాష్ట్రపతికి మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తారు.

3) ప్రధాని సలహా మేరకు రాష్ట్రపతి కేంద్రమంత్రులను నియమించి, వారికి మంత్రిత్వ శాఖలను కేటాయిస్తారు.

4) పైవన్నీ సరైనవి


9. ప్రధాని నాయకత్వంలోని కేంద్ర కేబినెట్‌ అధికారాన్ని కోల్పోయే సందర్భం కానిది ఏది?

1) లోక్‌సభలో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గినప్పుడు

2) లోక్‌సభలో అధికార పక్షం ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానం నెగ్గినప్పుడు

3) లోక్‌సభలో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన కోత తీర్మానాలు వీగిపోయినప్పుడు

4) లోక్‌సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌ నెగ్గినప్పుడు


10. పార్లమెంట్‌ సభ్యుడు కాని వ్యక్తి ప్రధాని/కేంద్రమంత్రిగా నియమితులైతే ఎంతకాలంలో పార్లమెంట్‌ సభ్యత్వం పొందాలి? (పార్లమెంట్‌ పొందని పక్షంలో వారు తమ పదవిని కోల్పోతారు.)

1) 3 నెలలు       2) 6 నెలలు          3)12 నెలలు      4) 5 సంవత్సరాలు


11. ప్రధాని నాయకత్వంలోని కేంద్ర మంత్రిమండలి సభ్యుల జీతభత్యాలను ఎవరు  నిర్ణయిస్తారు?

1) కేంద్ర ఆర్థిక సంఘం                        2) జాతీయ ప్రణాళికా సంఘం

3) రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా           4) పార్లమెంట్‌

12. ‘ప్రధానమంత్రి పార్లమెంటరీ ప్రభుత్వమనే భవనానికి మూలస్తంభం లాంటి వారు’ అని ఎవరు వ్యాఖ్యానించారు?

1) జవహర్‌లాల్‌ నెహ్రూ               2)  డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌

3) ఐవర్‌ జెన్నింగ్స్‌                     4)  రాంసేమ్యూర్‌


13. ‘ప్రధానమంత్రి పదవిని చుక్కల్లో చంద్రుడి’ గా అభివర్ణించింది ఎవరు? 

1) విలియం వెర్నార్‌ కోట్‌             2) లార్డ్‌ మార్లే     

3) విన్‌స్టన్‌ చర్చిల్‌                    4) ఐవర్‌ జెన్నింగ్స్‌


14. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన చట్టసభ సభ్యుడి అనర్హతను ఎవరు ప్రకటిస్తారు?

1) కేంద్ర ఎన్నికల సంఘం   2) ప్రధానమంత్రి      3) సంబంధిత సభాధ్యక్షులు   4)రాష్ట్రపతి


సమాధానాలు

1)4    2) 3   3) 2    4) 3   5) 2     6) 4     7) 2    8) 4    9) 3     10) 2     11) 4     12) 2    13) 1      14) 3.


 

Posted Date : 26-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌