• facebook
  • whatsapp
  • telegram

పౌరులు - పౌరసత్వం

ఒక వ్యక్తిని చట్టబద్ధంగా దేశపౌరుడిగా గుర్తించడాన్నే ‘పౌరసత్వం’ అంటారు. సాధారణంగా సమాఖ్య దేశాల్లోని పౌరులకు ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది. మనదేశ రాజ్యాంగం భారతదేశాన్ని ‘యూనియన్‌ ఆఫ్‌ స్టేట్స్‌’గా పేర్కొంది. ఇది అనేక సమాఖ్య లక్షణాలు కలిగి ఉంది. అయినప్పటికీ భారత పౌరులకు ఏకపౌరసత్వం మాత్రమే ఉంది. ఆర్టికల్‌ 370 ప్రకారం జమ్ముకశ్మీర్‌ రాష్ట్రానికి ప్రత్యేక స్వయం ప్రతిపత్తి ఉన్నందున ఆ రాష్ట్ర ప్రజలకు ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది.

ప్రజలు - వర్గీకరణ

ఒక దేశంలోని ప్రజలను పౌరులు, విదేశీయులని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు.

రాజకీయ హక్కులను కలిగి ఉండేవారిని పౌరులంటారు. ఆ హక్కులు లేనివారిని విదేశీయులంటారు.

రాజకీయ హక్కులంటే..

ఎన్నికల్లో పోటీచేసే హక్కు

ఎన్నికల్లో ఓటు వేసే హక్కు

రాజ్యాంగ అత్యున్నత పదవులను చేపట్టే హక్కు

ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు

భారత రాజ్యాంగం - పౌరసత్వ వివరణ

రాజ్యాంగంలోని 2వ భాగంలో ఉన్న ఆర్టికల్ 5 నుంచి ఆర్టికల్ 11 వరకు పౌరసత్వం గురించి వివరిస్తున్నాయి.

ఆర్టికల్‌ 5

1950, జనవరి 26 నాటికి ఉన్న రాజ్యాంగం ఆరంభంలోని పౌరసత్వాన్ని గురించి తెలియజేస్తుంది.

1950, జనవరి 26 లోపు భారతదేశంలో జన్మించి, శాశ్వత స్థిర నివాసం ఏర్పరచుకున్న ప్రతి ఒక్కరికీ భారతీయ పౌరసత్వం లభిస్తుంది.

1950, జనవరి 26 లోపు ఒక వ్యక్తి విదేశాల్లో జన్మించినప్పటికీ, అతడి తల్లి/తండ్రి ఆ సమయానికి భారతీయ పౌరసత్వం కలిగి ఉంటే ఆ వ్యక్తికి కూడా భారతీయ పౌరసత్వం లభిస్తుంది.

1950, జనవరి 26 లోపు ఒక వ్యక్తి భారతదేశంలో 5 సంవత్సరాలు శాశ్వత స్థిరనివాసం కలిగి ఉంటే ఆ వ్యక్తికి భారతీయ పౌరసత్వం లభిస్తుంది.

ఆర్టికల్‌ 6

పాకిస్థాన్‌ నుంచి భారతదేశానికి వలస వచ్చినవారి పౌరసత్వాన్ని గురించి తెలియజేస్తుంది.

1948, జులై 19 కంటే ముందు పాకిస్థాన్‌ నుంచి భారతదేశానికి వచ్చి స్థిర నివాసాన్ని ఏర్పరుచుకున్నవారంతా భారతీయ పౌరసత్వానికి అర్హులు.

ఆర్టికల్‌ 7

1947, మార్చి 1 తర్వాత భారతదేశం నుంచి పాకిస్థాన్‌కు వలస వెళ్లి అక్కడ ఇమడలేక 1948, జులై 19 నాటికి భారత్‌కు వలస వచ్చినవారి పౌరసత్వ హక్కులను గురించి వివరిస్తుంది.

ఆర్టికల్‌ 8

విదేశాల్లో నివసించే భారత సంతతి పౌరసత్వాన్ని గురించి ఉంటుంది.

ఆర్టికల్‌ 9

భారత పౌరులు ఎవరైనా విదేశీ పౌరసత్వాన్ని స్వీకరించినప్పుడు సహజంగానే భారత పౌరసత్వాన్ని కోల్పోతారు.

ఆర్టికల్‌ 10

భారతీయ పౌరసత్వం శాశ్వతత్వాన్ని కలిగి ఉంటుంది. అంటే భారతీయుడు ఎప్పటికీ భారతీయుడే.

ఆర్టికల్‌ 11

భారత రాజ్యాంగంలో పౌరసత్వానికి సంబంధించిన సమగ్రమైన నియమాలు  లేవు. పౌరసత్వానికి సంబంధించిన చట్టాలను రూపొందించే అత్యున్నత అధికారం పార్లమెంటుకు ఉంది.

భారత పౌరసత్వ చట్టం, 1955

భారత పార్లమెంటు పౌరసత్వానికి సంబంధించిన సమగ్రమైన నియమాలను నిర్దేశిస్తూ 1955లో భారత పౌరసత్వ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం రెండు ప్రధాన నియమాలపై ఆధారపడి ఉంది.  అవి:

1. Jus Soli (Right of the Soil): జన్మతః పౌరసత్వం

2. Jus Sanguinis (By Descent): రక్త సంబంధం/వారసత్వ రీత్యా పౌరసత్వం

1955 నాటి భారత పౌరసత్వ చట్టం ప్రకారం 5 రకాల పద్ధతుల ద్వారా భారత పౌరసత్వాన్ని పొందవచ్చు. అవి:

జన్మతః పౌరసత్వం (Citizenship by Birth)

1950, జనవరి 26 తర్వాత భారత్‌లో జన్మించి, స్థిర నివాసం ఏర్పరచుకున్న ప్రతి ఒక్కరూ భారతీయ పౌరసత్వాన్ని పొందగలరు.

పరిమితులు

మన దేశంలోని విదేశీ రాయబార కార్యాలయ ఉద్యోగులకు జన్మించిన పిల్లలు.

శత్రు దేశాల దంపతులకు జన్మించిన పిల్లలు, భారతదేశానికి విహారయాత్ర నిమిత్తం వచ్చిన విదేశాలకు సంబంధించిన దంపతులకు జన్మించిన పిల్లలు భారతీయ పౌరసత్వానికి అనర్హులు.

వారసత్వరీత్యా పౌరసత్వం (Citizenship by Descent)

1950, జనవరి 26 తర్వాత ఒక వ్యక్తి విదేశాల్లో జన్మించినప్పటికీ, ఆ వ్యక్తి తల్లి/ తండ్రి భారతీయ పౌరసత్వాన్ని కలిగి ఉంటే విదేశాల్లో జన్మించిన ఆ వ్యక్తిని కూడా భారతీయ పౌరుడిగా పరిగణిస్తారు.

ఉదా: శశిథరూర్‌ (లండన్‌లో జన్మించారు), రాహుల్‌ గాంధీ (అమెరికాలో జన్మించారు), విదేశాల్లోని భారత రాయబార ఉద్యోగులకు జన్మించిన పిల్లలు.

నమోదు ద్వారా పౌరసత్వం (Citizenship by Registration)

విదేశాల్లో నివసిస్తున్న భారత సంతతికి చెందిన వ్యక్తులు పౌరసత్వ చట్టం, 1955లోని సెక్షన్‌ 5(1)(a) ప్రకారం నమోదు ద్వారా పౌరసత్వాన్ని పొందవచ్చు.

భారత పౌరుడిని వివాహం చేసుకున్న విదేశీ మహిళ పౌరసత్వ చట్టం, 1955లోని సెక్షన్‌ 5(1)(c)ద్వారా భారత పౌరసత్వాన్ని పొందగలరు.

ఉదా: జన్మతః ఇటలీ దేశస్థురాలైన సోనియాగాంధీ రాజీవ్‌గాంధీని వివాహం చేసుకోవడంతో 1983లో భారత పౌరసత్వాన్ని పొందారు.

సహజీకృతం ద్వారా పౌరసత్వం (Citizenship by Naturalisation)

విదేశీయులు భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పట్ల మక్కువ, ప్రేమాభిమానాలతో భారత పౌరసత్వ చట్టం, 1955లోని సెక్షన్ 6(1) ద్వారా భారతీయ పౌరసత్వాన్ని పొందవచ్చు.

అర్హతలు

కనీసం 18 సంవత్సరాలు నిండి, రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో పేర్కొన్న ఏదైనా ఒక భారతీయ భాషలో తగిన ప్రావీణ్యం ఉండి, భారత్‌లో 5 సంవత్సరాలు శాశ్వత స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నవారు సహజీకృత పౌరసత్వానికి అర్హులు.

ఉదా: మదర్‌ థెరిసా (యుగోస్లావియా).

ఒక భూభాగం శాశ్వతంగా భారత్‌లో కలిసిపోవడం ద్వారా పౌరసత్వం (Citizenship by Incorporation of territory)

1950, జనవరి 26 తర్వాత ఒక కొత్త ప్రాంతం/ భూభాగం/ రాష్ట్రం/ దేశం భారత్‌లో శాశ్వతంగా కలిసిపోతే ఆ భూభాగంలోని ప్రజలందరికీ భారతీయ పౌరసత్వం లభిస్తుంది.

ఉదా: 1954లో ఫ్రెంచ్‌వారి నుంచి పాండిచ్చేరి, 1961లో పోర్చుగీసువారి నుంచి గోవా, 1975లో చోగ్యాల్‌ రాజు నుంచి సిక్కిం విముక్తి చెంది భారత్‌లో విలీనమయ్యాయి.

రద్దు పద్ధతులు

1955 భారత పౌరసత్వ చట్టం కింద 3 రకాల పద్ధతుల ద్వారా భారత పౌరసత్వం రద్దు అవుతుంది. అవి:

1. పరిత్యాగం (Renunciation): ఎవరైనా భారతీయ పౌరుడు విదేశీ పౌరసత్వాన్ని పొందాలనుకున్నప్పుడు భారతీయ పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా త్యజించవచ్చు.

2. రద్దు చేయడం (Termination):ఎవరైనా భారతీయ పౌరుడు భారతీయ పౌరసత్వాన్ని త్యజించకుండా, విదేశీ పౌరసత్వాన్ని పొందినప్పుడు భారతదేశ పౌరసత్వాన్ని రద్దు చేస్తారు.

3. అనివార్యపు రద్దు(By Deprivation): ఏ వ్యక్తి అయినా భారత పౌరసత్వాన్ని అక్రమంగా లేదా మోసపూరితంగా సంపాదించినా లేదా భారత రాజ్యాంగాన్ని, జాతీయ జెండాను, భారతీయ సంస్కృతిని అవమానిస్తే అలాంటివారి పౌరసత్వాన్ని రద్దు చేస్తారు.

భారత పౌరసత్వ సవరణ చట్టం, 1986

విదేశీయులు అక్రమంగా భారతీయ పౌరసత్వాన్ని పొందడాన్ని నిరోధించే లక్ష్యంతో అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ 1986లో భారత పౌరసత్వ సవరణ చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టం ద్వారా కింది మార్పులు జరిగాయి.

నమోదు ద్వారా భారతీయ పౌరసత్వాన్ని పొందాలనుకునే వ్యక్తి ఈ చట్టాన్ని అనుసరించి భారత్‌లో 5 సంవత్సరాల శాశ్వత స్థిరనివాసం కలిగి ఉండాలి. (1955 పౌరసత్వ చట్టం ప్రకారం 6 నెలలే)

ఈ చట్టంలో ‘స్త్రీలు’ అనే పదాన్ని తొలగించి దాని స్థానంలో ‘వ్యక్తులు’ అనే పదాన్ని చేర్చారు. (1955 పౌరసత్వ చట్టం ప్రకారం భారతీయుడిని వివాహమాడిన విదేశీ మహిళ అని ఉండేది.)

సహజీకృతం ద్వారా భారతీయ పౌరసత్వాన్ని పొందాలనుకునే వ్యక్తి ఈ చట్టాన్ని అనుసరించి దేశంలో 10 సంవత్సరాలు శాశ్వత స్థిర నివాసం ఉండాలి. (1955 పౌరసత్వ చట్టం ప్రకారం 5 సంవత్సరాలు ఉండేది). 

భారత పౌరసత్వ చట్టాన్ని 1992, 2003, 2005లో కూడా సవరించారు.

భారత పౌరసత్వ సవరణ చట్టం, 2003

ఎల్‌.ఎం. సింఘ్వీ కమిటీ సిఫారసుల మేరకు ప్రవాస భారతీయులకు (ఎన్‌ఆర్‌ఐ) ద్వంద్వ పౌరసత్వాన్ని కల్పించే లక్ష్యంతో భారత పార్లమెంటు 2003లో ఈ చట్టాన్ని రూపొందించింది.

ఈ చట్టం ప్రకారం 2004లో ప్రపంచంలోని 16 దేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులకు మనదేశం ద్వంద్వ పౌరసత్వాన్ని కల్పించింది.

16 దేశాలు

స్విట్జర్లాండ్, కెనడా, పోర్చుగల్, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్, ఫ్రాన్స్, స్వీడన్, గ్రీస్, న్యూజిలాండ్, సైప్రస్, ఫిన్లాండ్, ఐర్లాండ్, ఇటలీ, నెదర్లాండ్, అమెరికా, బ్రిటన్‌.

2006, జనవరి 9న జరిగిన ప్రవాస భారతీయ దినోత్సవం సందర్భంగా ప్రపంచంలో పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ తప్ప మిగిలిన అన్ని దేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులందరికీ ద్వంద్వ పౌరసత్వాన్ని పొందేందుకు అవకాశం కల్పించారు.

ద్వంద్వ పౌరసత్వం - ప్రయోజనాలు

ప్రవాస భారతీయులు భారత్‌లో ఆస్తులను సంపాదించుకోవచ్చు, పెట్టుబడులు పెట్టవచ్చు.

విద్య, ఆర్థిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో భారతీయులతో సమానమైన అవకాశాలు పొందవచ్చు.

ప్రవాస భారతీయులు భారతీయ పాస్‌పోర్ట్‌ను పొందవచ్చు.

పరిమితులు

ఎన్నికల్లో పోటీచేయడానికి వీల్లేదు.

రాజ్యాంగ అత్యున్నత పదవులను చేపట్టే అవకాశం లేదు.

ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు పొందే హక్కు లేదు.

2010, జనవరి 1 నుంచి ప్రవాస భారతీయులకు ఓటుహక్కు కల్పించారు.

భారతీయ సంతతి వ్యక్తుల పథకం  (పర్సన్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆరిజిన్‌ - పీఐఓ)

1999, మార్చిలో ప్రవేశపెట్టిన పీఐఓ కార్డు పథకాన్ని భారత ప్రభుత్వం పునః సమీక్షించి, 2002, సెప్టెంబరు 15 నుంచి కొత్త పీఐఓ కార్డు పథకాన్ని అమల్లోకి తెచ్చింది.

ముఖ్యాంశాలు

పీఐఓ కార్డు పొందాలనుకునే ప్రవాస భారతీయులు పెద్దలయితే రూ.15000, 18 సంవత్సరాల లోపువారైతే రూ.7500 చెల్లించాలి.

ఈ కార్డు కాలపరిమితి 15 సంవత్సరాలు.

అఫ్గానిస్థాన్, భూటాన్, బంగ్లాదేశ్, చైనా, నేపాల్, పాకిస్థాన్‌లోని ప్రవాస భారతీయులకు పీఐఓ కార్డులు జారీ చేయరు.

పీఐఓ కార్డు పొందినవారు మన దేశంలో వ్యవసాయ సంబంధ ఆస్తులను సంపాదించుకోవడాన్ని మినహాయించి, ఆర్థిక, వాణిజ్య, విద్యారంగాల్లో అన్ని రకాల అవకాశాలను పొందవచ్చు. వీరికి రాజకీయ హక్కులు ఉండవు.

ఓవర్సీస్‌ సిటిజన్‌ ఆఫ్‌ ఇండియా పథకం

భారత పౌరసత్వ సవరణ చట్టం 2003 ప్రకారం ఓవర్సీస్‌ సిటిజన్‌ ఆఫ్‌ ఇండియా (ఓసీఐ) కార్డుకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

ముఖ్యాంశాలు

ఓసీఐ కార్డును పొందేందుకు 275 అమెరికన్‌ డాలర్లు చెల్లించాలి.

ఓసీఐ కార్డు ఉన్నవారు భారతదేశాన్ని సందర్శించడానికి వీసా పొందాల్సిన అవసరం లేదు. ఈ కార్డు కాలపరిమితి జీవితకాలం కొనసాగుతుంది.

ఓసీఐ కార్డుపై బహుళ ప్రయోజన, బహుళ ప్రవేశిక వీసాలు మంజూరు చేస్తారు.

5 సంవత్సరాల పాటు ఓసీఐ నమోదైన వ్యక్తి 2 సంవత్సరాలు భారత్‌లో సాధారణ జీవితాన్ని గడిపితే అతడికి భారత పౌరసత్వం ఇస్తారు.

1950, జనవరి 26 తర్వాత భారత్‌ నుంచి విదేశాలకు వలస వెళ్లినవారికి ఓసీఐ కార్డు ఇస్తారు.

ప్రవాసీ భారతీయ దివస్‌

మహాత్మా గాంధీ 1915, జనవరి 9న దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చారు. ఈ చారిత్రక నేపథ్యం కారణంగా 2003, జనవరి 9 నుంచి ఏటా జనవరి 9న ‘ప్రవాసీ భారతీయ దివస్‌’ను జరుపుతున్నారు.

ప్రవాసీ భారతీయ వ్యవహారాల మంత్రిత్వశాఖను భారత ప్రభుత్వం 2004లో ఏర్పాటు చేసింది.

సుప్రీంకోర్టు తీర్పు

డేవిడ్‌ జాన్‌ హాప్‌కీన్స్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు - 1997

ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ భారతదేశ పౌరసత్వాన్ని విదేశీయులకు ప్రసాదించే విషయంలో మన దేశం విచక్షణాధికారాన్ని కలిగి ఉంటుందని, విదేశీయులు మన దేశ పౌరసత్వాన్ని పొందడమనేది ప్రాథమిక హక్కుగా పరిగణించరాదని పేర్కొంది.

నూతన పౌరసత్వ బిల్లు  - ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు

ముస్లిమేతర పౌరులకు భారత పౌరసత్వం ఇచ్చేందుకు ఉద్దేశించిన పౌరసత్వ సవరణ బిల్లు 2018ను లోక్‌సభ 2019, జనవరి 8న ఆమోదించింది.

దీని ప్రకారం బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌ దేశాల నుంచి వచ్చే హిందువులు, జైనులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్శీలకు భారత పౌరసత్వాన్ని ఇవ్వాలని ప్రతిపాదించారు. భారత్‌లో పౌరసత్వాన్ని పొందేందుకు కనీస నివాస కాలాన్ని 12 నుంచి 6 సంవత్సరాలకు తగ్గిస్తూ తీర్మానించారు.

దీనికి తీవ్రంగా స్పందించిన అసోం, మిజోరాం, అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్‌ రాష్ట్రాలు బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాయి.

అసోం ఒప్పందం - 1985

1971, మార్చి 24 తర్వాత అసోం రాష్ట్రానికి వచ్చిన విదేశీయులను మతాలతో సంబంధం లేకుండా బయటకు పంపాలని 1985లో అసోం ఒప్పందం కుదిరింది

1985 నాటి అసోం ఒప్పందాన్ని నూతన పౌరసత్వ బిల్లు ఉల్లంఘిస్తుందని అసోంలో తీవ్ర నిరసనలు కొనసాగుతున్నాయి.

రచయిత: బంగారు సత్యనారాయణ

Posted Date : 05-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌