• facebook
  • whatsapp
  • telegram

ఆంధ్రలో శాసనోల్లంఘన ఉద్యమం

ఉల్లంఘనలో ఉద్యమించిన ఆంధ్రులు!

జాతీయోద్యమం సమయంలో జరిగిన ప్రతి పోరాటంలో ఆంధ్రుల చైతన్యం వెల్లివిరిసింది. శాసనోల్లంఘనలో భాగంగా సాగిన దండి సత్యాగ్రహం ఆంధ్రలోని అనేక ప్రాంతాల్లో ఉద్ధృతంగా నడిచింది. నాటి మచిలీపట్నం ఘర్షణల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమగోదావరిలో పిల్లలూ భాగస్వాములై శిక్షలకు గురయ్యారు. గుంటూరులో నాయకులు చైతన్య గీతాలను ఆలపించారు. ఈ మహాసమరంలో ఎందరో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు, అరెస్టయ్యారు. ఆరునెలల పసికందుతో జైళ్లకు వెళ్లారు. ఇంకొందరు నేతలు ప్రత్యేక సంస్థలను ఏర్పాటు చేశారు. వాటిపై పోలీసులు చేసిన దాడుల వల్ల ఒక నాయకుడి వెన్నుపూసలు విరిగి పోయాయి.  నిరసనగా రథోత్సవాలు నిర్వహిస్తూ మరి కొందరు కాల్పుల్లో మరణించారు. ఈ విధంగా శాసనోల్లంఘన ఉద్యమంలో ఆంధ్రులు చేసిన త్యాగాలను పోటీపరీక్షల అభ్యర్థులు తెలుసుకోవాలి. నిర్వహించిన పలు రకాల కార్యక్రమాలనూ గుర్తుంచుకోవాలి. 


భారత జాతీయ కాంగ్రెస్‌లో గాంధీజీ చేరిన తర్వాత జరిగిన అతి ముఖ్యమైన ఉద్యమాల్లో దండి సత్యాగ్రహం ఒకటి. దీని ప్రభావం నాటి ఆంధ్ర ప్రాంతంలోని అనేక జిల్లాల్లో ప్రస్ఫుటంగా కనిపించింది. 

1928లో జరిగిన బార్డోలీ సత్యాగ్రహంలో సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ దేశానికి సంపూర్ణ స్వరాజ్యం కావాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు జవహర్‌లాల్‌ నెహ్రూ, సుభాష్‌ చంద్రబోస్‌ సంపూర్ణ స్వరాజ్యం కోసం ‘ఇండియన్‌ ఇండిపెండెన్స్‌ లీగ్‌’ స్థాపించారు. 1928, డిసెంబరు 19న ‘ఆంధ్ర రాష్ట్ర ఇండిపెండెన్స్‌ లీగ్‌’ ఏర్పాటైంది. అందులో బులుసు సాంబమూర్తి (అధ్యక్షుడు), బ్రహ్మజోస్యుల సుబ్రమణ్యం (కార్యదర్శి), తెన్నేటి విశ్వనాథం (కోశాధికారి), సీతారామయ్య, గోవిందాచార్యులు ప్రముఖ పాత్ర పోషించారు. ఈ సంస్థల ప్రధాన ఉద్దేశం సంపూర్ణ స్వరాజ్య స్థాపన.

బార్డోలీ సత్యాగ్రహానికి కారణం గుజరాత్‌ ప్రాంతంలో భూమి శిస్తును 22% నుంచి 60% పెంచడం. ఆ సమయంలో గాంధీజీ సూచనల మేరకు శాంతియుతంగా పటేల్‌ నాయకత్వంలో ఉద్యమం చేయడంతో ప్రభుత్వం పెంచిన శిస్తులో 5.7% తగ్గించింది. కానీ అదే సమయంలో కృష్ణా, గోదావరి జిల్లాల్లో శిస్తును సుమారు 20 పైసలు పెంచింది. దీన్ని ఆంధ్ర కాంగ్రెస్‌ కమిటీ వ్యతిరేకించింది. ఒక కమిటీని ఏర్పాటు చేసి నివేదిక వచ్చే వరకు పెంచిన పన్నులను వసూలు చేయకూడదని కోరింది. ఈ పరిణామాలు దేశంలో, ఆంధ్రాలోనూ ప్రజలను ఉత్తేజపరిచాయి.

1929లో భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశం లాహోర్‌లో జరిగింది.అధ్యక్షుడు జవహర్‌లాల్‌ నెహ్రూ. ఆంధ్రుడైన బులుసు సాంబమూర్తి పాల్గొన్నారు. ఇందులో మూడు తీర్మానాలు చేశారు.

1) సంపూర్ణ స్వాతంత్య్రం కాంగ్రెస్‌ లక్ష్యం.

2) ఏటా జనవరి 26న స్వాతంత్య్ర   దినోత్సవం నిర్వహించాలి.

3) శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించాలి.

దండి సత్యాగ్రహం: 1930,   జనవరి 30న గాంధీజీ ‘యంగ్‌ ఇండియా’ అనే పత్రికలో దేశమంతటా మద్యపాన నిషేధం, భూమి శిస్తు 50% తగ్గించడం, ఉప్పు పన్నును రద్దు చేయడం తదితర అంశాలతో    గవర్నర్‌  జనరల్‌ లార్డ్‌ ఇర్విన్‌కు ప్రతిపాదనలు పంపారు. వాటిని గవర్నర్‌ జనరల్‌ అంగీకరించలేదు. దాంతో గాంధీజీ 1930, మార్చి 12న శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించారు. అందులో భాగంగా సబర్మతి ఆశ్రమం నుంచి మార్చి 12 మరుసటి రోజున 78 మంది అనుచరులతో కాలినడకన బయలుదేరారు. 24 రోజులపాటు 375 కిలోమీటర్లు నడిచి ఏప్రిల్‌ 6న దండికి చేరుకున్నారు. అక్కడ ఉప్పును తయారుచేసి ఉప్పు చట్టాలను ఉల్లంఘించారు. గాంధీజీ చేపట్టిన దండి యాత్రలో పాల్గొన్న ఆంధ్రులు ఎర్నేనీ సుబ్రమణ్యం, సరోజినీ నాయుడు, దుర్గాబాయి దేశ్‌ముఖ్‌. ఈ ఉద్యమ కాలంలో ‘డిక్టేటర్‌’గా పేరు పొందిన కొండా వెంకటప్పయ్య గాంధీజీని గుజరాత్‌లో కలిశారు. ఆయన సూచన మేరకు యుద్ధ సమితిని ఏర్పాటు చేశారు. ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క సత్యాగ్రహ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆంధ్రలో ఈ సత్యాగ్రహ పోరాటం మొదటగా మచిలీపట్నంలో 1930, ఏప్రిల్‌ 6న ప్రారంభమైంది. అనేక చోట్ల పలువురి నాయకత్వంలో సాగింది. 

ఈ సత్యాగ్రహ సమయంలో చేపట్టిన కార్యక్రమాలు:

* చట్టాలకు వ్యతిరేకంగా   సముద్రంలో ఉప్పును తయారు చేయడం

* విదేశీ వస్త్రాలు అమ్మే దుకాణాల ముందు - పికెటింగ్‌

* గ్రామాల్లో కల్లుగీతకు ఉపయోగించే తాటి గెలలను నరకడం

* కల్లు అంగళ్ల ముందు పికెటింగ్‌

* ఉప్పు కొటారులను ముట్టడించడం. 

మచిలీపట్నం: ఇక్కడ జరిగిన ఉద్యమంలో పట్టాభి సీతారామయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు, ముట్నూరి కృష్ణారావులతోపాటు అనేక మంది పాల్గొన్నారు. సముద్ర తీరంలోని ఉప్పును తెచ్చి మచిలీపట్నంలోని తిలక్‌ చౌక్‌ వద్ద వేలం వేయగా పురాణం సూరి శాస్త్రి కొనుగోలు చేశారు. ఈ సమయంలో కాశీనాథుని నాగేశ్వరరావును అరెస్టు చేయగా, జరిగిన ఘర్షణలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. తిలక్‌ చౌక్‌ వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేసి, పోలీసుల చేతిలో దెబ్బలు తిన్న తోట నరసయ్య అస్వస్థతకు గురయ్యారు.

తూర్పు గోదావరి: ఈ ప్రాంతంలో తిరుగుబాటు చేసింది బులుసు సాంబమూర్తి, వెన్నంటి సత్యనారాయణ. వీరు అనేకమంది వాలంటీర్లతో ఏప్రిల్‌ 6న కాకినాడ బయలుదేరి చొల్లంగి అనే గ్రామం వద్ద ఉప్పును తయారు చేశారు. కొత్తపల్లి శిబిరం నుంచి క్రొవ్విడి లింగరాజు నాయకత్వంలో వాలంటీరు దళం సముద్రంలోకి వెళ్లి ఉప్పు తయారుచేసింది.

పశ్చిమ గోదావరి: మే 4న ఏలూరులో నేషనల్‌ స్కూలు నుంచి వాలంటీరు బృందం బయలుదేరి సముద్ర సమీపంలో ఉప్పును తయారుచేసింది. దెందులూరు, నడింపల్లి, కొవ్వలి, చింతలపూడి గ్రామాల్లో ఉప్పు చట్టాలను ఉల్లంఘించారు. అప్పటికి బాలుడుగా ఉన్న పుచ్చలపల్లి సుందరయ్య సహా పలువురు పిల్లలు ఈ ఉద్యమంలో పాల్గొని బోర్‌స్టల్‌ స్కూలులో జైలుశిక్ష అనుభవించారు.

విశాఖపట్నం: ఈ ప్రాంతంలో తిరుగుబాటుకు నాయకత్వం వహించింది తెన్నేటి విశ్వనాథం. ఇతడికి సహకరించిన వారందరినీ అరెస్టు చేశారు. ఏప్రిల్‌ 18న తర్వాత భీమునిపట్నం వద్ద కొందరు వాలంటీర్లు ఉప్పును తయారుచేశారు.

గుంటూరు: ఇక్కడ ఉద్యమానికి నాయకత్వం వహించింది కొండా వెంకటప్పయ్య. 1930, ఏప్రిల్‌ 9న 100 మంది సత్యాగ్రహులు సముద్రతీరం నుంచి జలాలను సేకరించి కొండా వెంకటప్పయ్య ఇంటి వద్ద ఉప్పును తయారుచేశారు. 1930, ఏప్రిల్‌ 26న 41 మంది వాలంటీర్లు కనపర్తి ఉప్పు డిపోపై దాడి చేశారు. వారిని ప్రేరేపిస్తూ త్రిపురనేని రామస్వామి చౌదరి ‘‘వీరగంధం తెచ్చినారము వీరుడెవ్వడో తెల్పుడి’’ గీతం రాశారు.

నెల్లూరు: ఇక్కడి ఉద్యమానికి నాయకులు బొమ్మిశేషారెడ్డి, ఓరుగంటి వెంకటసుబ్బయ్య, బెజవాడ గోపాల్‌రెడ్డి, ఫకీర్‌ సుబ్బిరామిరెడ్డి. వీరు మైపాడు బీచ్‌ వద్ద ఉప్పు తయారుచేశారు. జిల్లాలో సత్యాగ్రహ దళానికి ఓరుగంటి వెంకటసుబ్బయ్య నాయకత్వం వహించారు. ఈ సమయంలో    నెల్లూరుకు చెందిన పోతూరి బాలసరస్వతమ్మ అరెస్టు అయ్యారు. ఆ తర్వాత ఓరుగంటి మహాలక్ష్మమ్మ, ఆమె కుమార్తె, కుమారుడు కూడా అరెస్టు అయ్యారు. పోనకా కనకమ్మ కూడా ఈ ఉద్యమకాలంలో అరెస్టు అయ్యారు.

దేవరపాడు: ప్రకాశం జిల్లాలోని ఈ ప్రాంతాన్ని ‘దక్షిణ దండి’ అని కూడా అంటారు. తీర ప్రాంతంలో దేవరపాడులోని టంగుటూరి ప్రకాశం ఇంటి వద్ద శిబిరం ఏర్పాటైంది. అదే గ్రామానికి పెద్ద అయిన సాగి విజయరామరాజు, చీరాలకు చెందిన గౌస్‌బేగ్‌ నాయకత్వం వహించారు. 1932లో దేవరపాడు శిబిరం వద్ద దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు అధ్యక్షతన విజయోత్సవ సభ జరిగింది. అందులో దేశభక్త కొండా వెంకటప్పయ్య త్రివర్ణ పతకాన్ని ఎగురవేశారు. 1935లో ఆంధ్రాలో పర్యటించిన డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌ సత్యగ్రహ శిబిరాన్ని దర్శించి నవంబరు 22న విజయ స్తూపాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా టంగుటూరి ప్రకాశం పంతులు ఒక ట్రస్టును ఏర్పాటుచేసి తన ఇంటిని దానంగా ఇచ్చారు. స్వాతంత్య్ర పోరాట సమయంలో ప్రకాశం జిల్లా ప్రజలు ప్రదర్శించిన చైతన్యానికి గుర్తుగా అది ఇప్పటికీ ఉంది. 

* ఈ ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖ రాయలసీమ వాసి కల్లూరి సుబ్బారావు.

దండి సత్యాగ్రహంలో ఏర్పాటైన కొన్ని విప్లవ సంస్థలు, సంఘటనలు:

సత్యాశ్రయ సంఘటన్‌: బ్రహ్మజోస్యుల సుబ్రహ్మణ్యం ఈ ఆశ్రమాన్ని రాజమండ్రి సమీపంలో ఏర్పాటు చేశారు. ఇది ఆంధ్ర దండి ఆశ్రమంగా పేరు పొందింది. ఈయన స్వదేశీ వస్తువులను ప్రోత్సహించారు. దాంతో పోలీసులు ఆశ్రమాన్ని ధ్వంసం చేశారు. ఆ సమయంలో జరిగిన దాడిలో బ్రహ్మజోస్యులు వెన్నుపూస విరిగి ఆసుపత్రి  పాలయ్యారు.

ఉజ్జీవన భారత సమ్మేళన సంస్థ:  

పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతివాది భయంకరచారి స్థాపించారు. దీని లక్ష్యం నాటి పోలీసు సూపరింటెండెంట్‌ ముస్తాఫా అలీని, ఎస్‌ఐ డప్పుల సుబ్బారావును హతమార్చడం. వీరిపై బాంబులతో దాడికి ప్రణాళిక రూపొందించగా విఫలమైంది. భయంకరచారిని అరెస్టుచేసి అండమాన్‌ జైలుకు పంపారు.

వాడపల్లి రథోత్సవ బలిదానం: 

వాడపల్లి రథోత్సవంలో హింసాత్మక సంఘటన జరిగింది. రథంపై నెహ్రూ, గాంధీజీ, సరోజినీ నాయుడు చిత్రపటాలను ఉంచి ఉత్సవాన్ని ప్రారంభించారు. పోలీస్‌ సూపరింటెండెంట్‌ ముస్తఫా అలీ రథోత్సవంపై కాల్పులు జరపడంతో ఏడుగురు మరణించారు.
మహోత్సాహంతో మహిళలు

ఆచంట రుక్మిణీ లక్ష్మీపతి: శాసనోల్లంఘన ఉద్యమ సమయంలో నిర్వహించిన అనేక సభలకు ఈమె  అధ్యక్షురాలిగా ఉన్నారు. జైలుకూ వెళ్లారు.

వేదాంతం కమలాదేవి: ఈమె గుంటూరు సభ అధ్యక్షురాలు. 60 మంది ప్రతినిధులతో సభను నిర్వహించారు. అందులో ‘‘పెళ్లికి తరలిన ముత్తయిదువ్వుల్లారా’’ అనే పాటను పాడారు.

కంభంపాటి మాణిక్యాంబ: ఈమె ఉద్యమంలో పాల్గొని ఆరు నెలల పసికందుతో జైలుకెళ్లారు. ఈమె అధ్యక్షతన తాలూకా స్థాయి మహాసభ తెనాలిలో జరిగింది.

రచయిత: గద్దె నరసింహారావు


 
 

Posted Date : 23-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌