• facebook
  • whatsapp
  • telegram

భారతదేశ శీతోష్ణస్థితి - 2

వాతావరణం 

ఒక ప్రాంతంలో నిర్దిష్ట సమయంలోని వాతావరణ పరిస్థితులను వాతావరణం అంటారు. ఇది ప్రతిరోజూ మారుతూ ఉంటుంది.


శీతోష్ణస్థితి 

ఒక విశాల ప్రాంతంలో దీర్ఘకాలం పాటు ఒక క్రమాన్ని చూపే వాతావరణ స్థితులను శీతోష్ణస్థితి అంటారు.

* సాధారణంగా ఒక ప్రాంత 30 ఏళ్ల వాతావరణ పరిస్థితులను అంచనా వేసి, దాని శీతోష్ణస్థితిని కనుక్కుంటారు.

* భారతదేశ శీతోష్ణస్థితిని ఉష్ణమండల రుతుపవన శీతోష్ణస్థితిగా పేర్కొంటారు.


శీతోష్ణస్థితిని ప్రభావితం చేసే అంశాలు

1. అక్షాంశం     2. ఉనికి

3. భౌగోళిక స్వరూపం

4. భూమికి - నీటికి ఉన్న సంబంధం

5. ఉపరితల గాలి ప్రసరణ


అక్షాంశం: 

* కర్కటరేఖ భారతదేశం మధ్యగా వెళ్తోంది.

* కర్కటరేఖ దక్షిణ ప్రాంతం ఉష్ణమండలంలో, ఉత్తర ప్రాంతం సమశీతోష్ణ మండలంలో ఉన్నాయి. 

* భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వైపు వెళ్తున్న కొద్దీ సగటు వార్షిక ఉష్ణోగ్రతలు తగ్గుతాయి.


ఉష్ణ ప్రాంతాలు 

- భూమధ్య రేఖకు దగ్గరగా ఉండేవి.

ధ్రువ ప్రాంతాలు 

- ధ్రువాలకు దగ్గరగా ఉండేవి.

సమశీతోష్ణ ప్రాంతాలు 

- ఉష్ణ ప్రాంతాలు, ధ్రువ ప్రాంతాలకు మధ్య ఉన్న ప్రాంతం.

* భూ ఉపరితలంపై ఉష్ణోగ్రత ఆ ప్రాంతంలోని సూర్యపుటంపై ఆధారపడి ఉంటుంది.


భూమికి - నీటికి ఉన్న సంబంధం: 

భూభాగంతో పోలిస్తే సముద్రాలు నిదానంగా వేడెక్కి, నెమ్మదిగా చల్లారతాయి.


సమశీతోష్ణస్థితి: 

వేసవి, శీతాకాల సమయాల్లో పగలు, రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతల్లో పెద్దగా తేడా కనిపించని స్థితిని ‘సమశీతోష్ణస్థితి’ అంటారు.

*  సాధారణంగా సముద్ర తీర ప్రాంతాల్లో దీన్ని గమనించొచ్చు.

ఎత్తు:  

సముద్ర మట్టం నుంచి పైకి వెళ్తున్న కొద్దీ ప్రతి 1000 మీటర్ల ఎత్తుకు 6.4°C  లేదా ప్రతి 165 మీటర్ల ఎత్తుకు 1°C చొప్పున ఉష్ణోగ్రత తగ్గుతుంది.

* మైదాన ప్రాంతాల కంటే కొండలు, పర్వతాలపై ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి.


ఉపరితల గాలి ప్రసరణ: వీటినే ‘జెట్‌ ప్రవాహాలు’ అని కూడా అంటారు.

* నేల నుంచి 12,000 మీటర్ల ఎత్తులో ప్రవహించే గాలులను జెట్‌ ప్రవాహాలు అంటారు.

* వీటి వేగం గంటకి వేసవిలో 110 కి.మీ., శీతాకాలంలో గంటకు 184 కి.మీ. ఉంటుంది.

* తూర్పు జెట్‌ ప్రవాహం 25°  ఉత్తర అక్షాంశం వద్ద ఏర్పడుతుంది.


ట్రేడ్‌ విండ్స్‌ (వ్యాపార పవనాలు): 

* ఇవి శాశ్వత పవనాలు.

* ఉత్తరార్ధ గోళంలో ఉపఆయన రేఖ వద్ద ఏర్పడే అధిక పీడనం వల్ల ఈ పవనాలు ఏర్పడతాయి.

*  జర్మనీ భాషలో ట్రేడ్‌ అంటే ‘ట్రాక్‌’ అని అర్థం.

* ‘ట్రాక్‌’ అంటే ఒకే దిశలో స్థిరంగా ప్రయాణించే గాలులు.

* భారతదేశం శుష్క ఈశాన్య రుతుపవనాల రేఖల్లో ఉంది.


భారతదేశం - కాలాలు

 మనదేశ భూభాగ శీతోష్ణస్థితి వైవిధ్యం ఆధారంగా భారత వాతావరణ పరిశోధనా సంస్థ ఏడాదిని నాలుగు శీతోష్ణస్థితులుగా విభజించింది. అవి:

1. శీతాకాలం (డిసెంబరు - ఫిబ్రవరి)

2. వేసవి కాలం (మార్చి - మే)

3. నైరుతి రుతుపవన కాలం (జూన్‌ - సెప్టెంబరు)

4. ఈశాన్య రుతుపవన కాలం (అక్టోబరు - నవంబరు)


శీతాకాలం 

* నిర్మల ఆకాశం, గాలిలో తక్కువ తేమ, చల్లటి గాలులతో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.

* భారతదేశంలో అత్యంత చలిగా ఉండే నెల జనవరి.

* ఉత్తర భారత భూభాగం నుంచి దక్షిణంగా వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయి.


శీతాకాలంలో వివిధ ప్రాంతాల్లో నమోదయ్యే ఉష్ణోగ్రతలు:

* హిమాలయాలకు దగ్గరగా ఉండే రాష్ట్రాలు:10°C

* కర్కట రేఖ వెళ్లే రాష్ట్రాలు: 20°C

* కోస్తా ప్రాంతాలు: : 25°C

* నీలగిరి కొండలు: 20°C


పశ్చిమ విక్షోభాలు: మధ్యదరా సముద్రం నుంచి భారతదేశం వైపు వచ్చే వాయుగుండాలు.

* పశ్చిమ విక్షోభాల కారణంగా ఉత్తర భారతదేశంలో శీతాకాలంలో 10 -12 సెం.మీ. వర్షం కురుస్తుంది.

* శీతాకాలంలో కురిసే ఈ వర్షం రబీ కాలంలో పండే గోధుమ, బార్లీ పంటలకు చాలా అనుకూలం.

* రబీ పంట కాలాన్ని శీతాకాల పంట కాలం అని, గోధుమను శీతాకాల పంట అని అంటారు.

* దేశంలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం కార్గిల్‌ సమీపంలోని డ్రాస్‌(−40°C)

* ఆంధ్రప్రదేశ్‌లో అత్యల్ప ఉష్ణోగ్రత విశాఖ జిల్లాలోని లంబసింగి వద్ద నమోదవుతుంది.


వేసవికాలం 

ఏప్రిల్, మే నెలల్లో సూర్యుడు కర్కటరేఖ వైపు ప్రయాణిస్తాడు. దీంతో ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారత భూభాగం వైపు వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతాయి.

* భారతదేశంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే నెల మే.

* ఈ కాలంలో ఉత్తర భారతదేశ మైదానాల్లో గరిష్ఠంగా 37°C ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.

* వేసవిలో నమోదయ్యే కనిష్ఠ ఉష్ణోగ్రత: 20°C.. 

* వేసవిలో వాయవ్య భారతదేశంలో ఉష్ణోగ్రతలు 41°C ఉంటే, మధ్య భారతదేశంలో  42°C నమోదవుతాయి.

* ఈ కాలంలో ఉత్తర భారతదేశంలో వీచే వేడి స్థానిక పవనాలను ‘లూ’ (Loo) అంటారు.

* మే నెలలో సగటు పగటి ఉష్ణోగ్రత దిల్లీలో 42°C ఉంటే, చెన్నైలో 38.5°C  గా నమోదవుతుంది.


తొలకరి జల్లులు:

* వేసవి కాలం ముగిసే సమయంలో దక్కన్‌ పీఠభూమిలో కురిసే చిరుజల్లులను తొలకరి జల్లులు అంటారు.

* భారత ద్వీపకల్ప ప్రాంతంలో మామిడి, ఇతర పండ్లు త్వరగా పండటానికి ఇవి ఉపయోగపడతాయి.


తొలకరి జల్లులు - స్థానిక పేర్లు:

ఆంధ్రప్రదేశ్, కేరళ - మామిడి జల్లులు

తెలంగాణ - తొలకరి జల్లులు

కర్ణాటక - చెర్రీ బ్లాసమ్‌

పశ్చిమ్‌ బంగా - కాల్‌బైసాఖి

అసోం - బోర్దామచిల్లా

ఉత్తర్‌ ప్రదేశ్‌ - అంధీలు

రుతుపవనాలు 

* రుతుపవనాన్ని ఆంగ్లంలో ‘మాన్‌సూన్‌’ అంటారు.

* మాన్‌సూన్‌ పదం ‘మౌసమ్‌’ అనే అరబిక్‌ పదం నుంచి వచ్చింది.

* మౌసమ్‌ అంటే రుతువు అని అర్థం.

* రుతుపవనాలు కాలాన్ని బట్టి వీచే గాలులు.

* వర్షాన్ని ఇచ్చే మేఘాలను రవాణా చేసే పవనాలే రుతుపవనాలు.


నైరుతి రుతుపవన కాలం

* ఉష్ణ ప్రాంతంలో సుమారు 20°  ఉత్తర  -20° దక్షిణ అక్షాంశాల మధ్య రుతుపవనాలు ఏర్పడతాయి.

* జూన్‌ 21న సూర్యుడు కర్కటరేఖపై ఉంటాడు. దీంతో గంగా-సింధు మైదాన ప్రాంతంలో అంతర ఆయనరేఖ అభిసరణ మండలం (ITCZ) ఏర్పడుతుంది.

* ఆగ్నేయ వ్యాపార పవనాలు భూమధ్య రేఖను దాటి కొరియాలిస్‌ ప్రభావం వల్ల భారత భూభాగంలోకి వస్తాయి. ఇవి నైరుతి దిశ నుంచి ప్రవేశిస్తాయి. అందుకే వీటిని నైరుతి రుతుపవనాలు అంటారు.

* ఈ పవనాలు కన్యాకుమారి ప్రాంతం వద్దకు రాగానే రెండు శాఖలుగా విడిపోతాయి. అవి:

1. అరేబియా సముద్ర శాఖ 

2. బంగాళాఖాతం శాఖ

* అరేబియా శాఖ భారత పడమటి తీరాన్ని చేరి ఉత్తర దిశగా కదులుతుంది.


అరేబియా శాఖ ప్రయాణం:

జూన్‌ 1 - కేరళ తీరం, ఏపీలోని చిత్తూరు, కర్నూలు జిల్లా.

జూన్‌ 5 - కర్ణాటక, ఏపీలోని కృష్ణా, గోదావరి డెల్టా.

జూన్‌ 10 - ముంబయి, ఒడిశా, చోటానాగ్‌పుర్‌ పీఠభూమి, బిహార్‌.

జూన్‌ 15 - గుజరాత్, మాల్వా పీఠభూమి, గంగా మైదానం.

జూలై 1 - దిల్లీ, పంజాబ్‌.

జూల్‌ 15 - థార్‌ ఎడారి.

జూలై 15 నాటికి ఆరేబియా నైరుతి రుతుపవన శాఖ దేశవ్యాప్తంగా వ్యాపిస్తుంది.


బంగాళాఖాత నైరుతి శాఖ: 

ఈ శాఖ మే 20 నాటికి అండమాన్‌ నికోబార్‌ దీవులను చేరుతుంది.

* దేశంలో సంభవించే మొత్తం వర్షపాతంలో 80% నైరుతి రుతుపవనాల వల్లే కురుస్తుంది.

* తమిళనాడు, లద్దాఖ్‌ మినహా దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల వల్ల వర్షం కురుస్తుంది.


ఈశాన్య రుతుపవన కాలం

* అక్టోబరు నెలలో సూర్యుడు దక్షిణార్ధగోళం వైపు కదులుతాడు. దీంతో హిందూ మహాసముద్రంలో అల్పపీడన ద్రోణి ఏర్పడుతుంది.

* సెప్టెంబరు మూడో వారం నుంచి నైరుతి రుతుపవనాలు దేశ భూభాగం నుంచి క్రమంగా వెనక్కి మళ్లుతాయి. ఇవే ఈశాన్య రుతుపవనాలుగా మారతాయి.

* ఈశాన్య రుతుపవనాలను తిరోగమన రుతుపవనాలు అని కూడా అంటారు.

* ఈ కాలంలో ఎక్కువగా తుపానులు, వాయుగుండాలు ఏర్పడతాయి.

* ఈశాన్య రుతుపనవాల వల్ల ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో అధిక వర్షాలు కురుస్తాయి.


దేశంలో వర్షపాత విస్తరణ

*  మనదేశ వార్షిక సగటు వర్షపాతం 125 సెం.మీ.

మేఘాలయలోని మాసిన్రామ్‌ ప్రాంతంలో దేశంలో అత్యధిక, ప్రపంచంలో రెండో అధిక వర్షపాతం నమోదైంది (1141 సెం.మీ.).

* దేశంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే రెండో ప్రాంతం చిరపుంజి (1087 సెం.మీ.).

* దేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతం జైసల్మీర్‌ (12 సెం.మీ.).


అక్టోబర్‌ హీట్‌

తిరోగమన రుతుపవన కాలంలో ఆకాశం నిర్మలంగా ఉండి, ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. దీని కారణంగా బెంగాల్‌ మైదాన ప్రాంతంలోని వాతావరణంలో ఆర్థ్రత పరిమాణం ఎక్కువై, ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఈ స్థితిని ‘అక్టోబర్‌ వేడిమి’ అంటారు. 

Posted Date : 19-01-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌