• facebook
  • whatsapp
  • telegram

భారతదేశ శీతోష్ణస్థితి - రుతుపవనాలను ప్రభావితం చేసే అంశాలు

 క్షేమక్షామాలను నిర్ణయించే పవనాలు!

భూమిపై వర్షాలకు, వాతావరణ మార్పులకు మహాసముద్రాలే ప్రధాన కారణం. సముద్రాల ఉపరితలం సాధారణ స్థాయి కంటే అధికంగా వేడెక్కినప్పుడు రుతుపవనాలు అదుపు తప్పుతాయి. అప్పుడు కొన్ని దేశాల్లో విపరీతమైన వర్షాలు, మరికొన్ని దేశాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయి. దీంతో వ్యవసాయానికి, ఆర్థిక వ్యవస్థ గమనానికి రుతుపవన వర్షపాతమే ఆధారమైన మన దేశంలో కొంతకాలం కుంభవృష్టి వర్షాలు, మరికొంత కాలం కరవు పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ పరస్పర విరుద్ధ పరిణామాలు, అసాధారణ వాతావరణ పరిస్థితుల వివరాలను పోటీ పరీక్షార్థులు స్థూలంగా తెలుసుకోవాలి. ఎల్‌ నినో, లా నినో, డైపోల్‌ వంటి వాతావరణ అంశాల గురించి అర్థం చేసుకోవాలి.

ఎల్‌ నినో, లా నినో, హిందూ మహాసముద్ర డైపోల్‌

భారతదేశంలో వ్యవసాయం ఎక్కువగా రుతుపవన ఆధారితంగా ఉంటుంది. దేశ ఆర్థిక వ్యవస్థను, వాతావరణాన్ని, పంటలను, సంస్కృతిని ఈ రుతుపవనాలు ప్రభావితం చేస్తాయి. రుతుపవనాలు ఒక ప్రత్యేకమైన వర్షాన్నిచ్చే శక్తి కలిగిన అశాశ్వత గాలులు. ఇవి అస్థిరమైనవి. సంవత్సరం మొత్తం వీయకుండా కొన్ని నెలలు, కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమై వీస్తాయి. భూమార్గం, జలమార్గాల మధ్య కాలానుగుణంగా దిశను మార్చుకొని వర్షపాతాన్ని అందిస్తాయి. రుతుపవనాలను ఆంగ్లంలో మాన్‌సూన్‌ అంటారు. ఇది మౌసిమ్‌ అనే అరబిక్‌ పదం నుంచి వచ్చింది. మౌసిమ్‌ అంటే రుతువు అని అర్థం.

సూర్యగమనం, ఉష్ణోగ్రతల్లో వచ్చే మార్పుల వల్ల రుతుపవనాలు ఏర్పడతాయి. నేల, నీరు స్పందించే విధానంపైనా రుతుపవనాలు ఆధారపడి ఉంటాయి. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, శ్రీలంక, థాయ్‌లాండ్, మయన్మార్, వియత్నాం, లావోస్, కంబోడియా, మలేసియా, ఇండొనేసియా, ఫిలిప్పీన్స్, చైనా, హాంగ్‌కాంగ్, కొరియా, జపాన్‌ మొదలైన ఆసియా దేశాలు ఈ రుతుపవనాల వల్ల ప్రభావితమవుతాయి. రుతుపవన వ్యవస్థ దక్షిణార్ధ గోళం కంటే ఉత్తరార్ధ గోళంలో నిర్దిష్టంగా ఉంటుంది. ఉత్తరార్ధ గోళంలో భూభాగం, నీటి భాగం దాదాపు సమానం. దీనివల్ల పీడన వ్యవస్థలో మార్పులు జరిగి రుతుపవనాలు ఏర్పడతాయి. దక్షిణార్థ గోళంలో భూభాగం తక్కువ, జలభాగం ఎక్కువ ఉండటం వల్ల పీడన వ్యవస్థలో మార్పులు ఎక్కువగా ఉండవు. ఫలితంగా రుతుపవన వ్యవస్థ పటిష్ఠంగా ఉండదు.

రుతుపవనాల ఆవిర్భావానికి కారణమయ్యే అంశాలు:

1) ఒక ప్రాంతంలోని భూభాగం, జలభాగాలు వివిధ రకాలుగా వేడెక్కడం, చల్లబడటం వల్ల స్థానిక పవనాలు ఏర్పడతాయి. ఇలా ఎక్కువ మొత్తంగా జరిగినప్పుడు విశాల ప్రాంతంలో రుతుపవనాలు సంభవిస్తాయి. 

2) పీడన మేఖల వ్యతిక్రమణం: జూన్‌లో సూర్యుడు కర్కటరేఖపై ఉండటంతో అక్కడ అల్పపీడనం ఏర్పడుతుంది. అదే సమయంలో మకరరేఖ దగ్గర అధిక పీడనం ఉంటుంది. పవనాలు మకరరేఖ నుంచి కర్కటరేఖ వైపు వీస్తాయి. డిసెంబరులో దీనికి భిన్నంగా సూర్యుడు మకరరేఖపై ఉండటం వల్ల అక్కడ అల్పపీడనం, కర్కటరేఖ వద్ద అధిక పీడనం ఏర్పడతాయి. పవనాలు కర్కటరేఖ నుంచి మకరరేఖ వైపు వీస్తాయి. ఈ విధంగా మకరరేఖ నుంచి వీచే గాలులను భూమధ్యరేఖ దాటిన తర్వాత నైరుతి రుతుపవనాలుగా, కర్కటరేఖ నుంచి వీచే గాలులను భూమధ్య రేఖ దాటిన తర్వాత ఈశాన్య రుతుపవనాలుగా పిలుస్తారు.

3) భూభాగం, జలభాగాలు పక్కపక్కనే ఉండటం వల్ల తేమతో కూడిన రుతుపవనాలు వీస్తాయి.

4) రుతుపవన ద్రోణి స్థాన గమనం: ITCZ (Inter Tropical Convergence Zone) లేదా అంతర అయనరేఖ అభిసరణ మండలం లేదా రుతుపవన ద్రోణి ఉనికి సూర్యుడిపై ఆధారపడి ఉంటుంది. ITCZ జూన్‌లో కర్కటరేఖ వద్ద ఉన్నప్పుడు దక్షిణార్ధ గోళం నుంచి వీచే ఆగ్నేయ వ్యాపార పవనాలు భూమధ్యరేఖను దాటి ఖిగిద్ట్రి వరకు ప్రయాణిస్తాయి. భూమధ్యరేఖను దాటిన తర్వాత భారత్‌లో అవి నైరుతి రుతుపవనాలుగా ప్రవేశిస్తాయి. దీనికి వ్యతిరేకంగా డిసెంబరు నెలలో ఖిగిద్ట్రి మకరరేఖ దగ్గర కేంద్రీకృతమై, ఈశాన్య వ్యాపార పవనాలు మకరరేఖను చేరుకునే క్రమంలో భూమధ్యరేఖను దాటి ఆస్ట్రేలియాలో వాయవ్య రుతుపవనాలుగా మారతాయి.


జెట్‌ స్ట్రీమ్స్‌: ఇవి వ్యాపార పవనాలకు వ్యతిరేక దిశలో అత్యధిక వేగంతో ట్రోపో ఆవరణం పైన వీచే బలమైన శీతలగాలులు. భారతదేశం పైన తూర్పు జెట్‌ స్ట్రీమ్స్, పశ్చిమ జెట్‌ స్ట్రీమ్స్‌ అనే రెండు రకాల జెట్‌ స్ట్రీమ్స్‌ ప్రభావం చూపుతాయి. తూర్పు జెట్‌ స్ట్రీమ్స్‌ను ఆఫ్రికన్‌ జెట్‌ స్ట్రీమ్స్‌ అని కూడా పిలుస్తారు. 6-9 కి.మీ. ఎత్తులో భారత్‌ నుంచి పశ్చిమ ఆఫ్రికా వైపు ప్రయాణిస్తూ నైరుతి రుతుపవనాల పురోగమనానికి తోడ్పడతాయి. ఇవి జూన్‌లో ప్రారంభమై సెప్టెంబరు వరకు వీస్తాయి. నైరుతి రుతుపవనాలు భారత పశ్చిమ కర్ణాటక తీరం (నైరుతి) నుంచి తూర్పు కోల్‌కతా (ఈశాన్యం) వైపు భూమి మీదుగా ప్రయాణిస్తాయి. తూర్పు జెట్‌ స్ట్రీమ్‌ కోల్‌కతా నుంచి (ఈశాన్యం నుంచి) పశ్చిమ కర్ణాటక తీరం (నైరుతి వైపు) ట్రోపో ఆవరణం పైభాగాన వీస్తాయి. ఈ గాలులు టిబెట్‌ పీఠభూమిలో ఏర్పడిన అల్పపీడన గాలులు. తూర్పు జెట్‌ స్ట్రీమ్స్‌ చల్లగా, పొడిగా ఉంటాయి. ఇవి రుతుపవన కాలంలో సముద్రంలో ఏర్పడే వాయుగుండాలు భారతదేశం వైపు పురోగమించడానికి తోడ్పడతాయి. 5o - 20o ఉత్తర అక్షాంశాల మధ్య గంటకు 110 కి.మీ. వేగంతో వీస్తాయి.


పశ్చిమ జెట్‌ స్ట్రీమ్స్‌: ఇవి శీతాకాలంలో ఆసియాలో మధ్యధరా ప్రాంతంలో ఏర్పడే అల్పపీడన గాలులను భారతదేశ వాయవ్య ప్రాంతానికి లాగడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈశాన్య రుతుపవనాల రాకకు కారణమవుతాయి. ఇవి30o అక్షాంశం వద్ద గంటకు 184 కి.మీ. వేగంతో వీస్తాయి.


కొరియాలిసిస్‌ ప్రభావం: భూమి పశ్చిమం నుంచి తూర్పుకు తిరుగుతుండటంతో భూమధ్య రేఖకు ఉత్తరాన గాలులు కుడి వైపు, దక్షిణాన ఎడమ వైపు వీస్తాయి. ఇందుకు భూ గురుత్వాకర్షణ, కొరియాలిసిస్‌ ప్రభావం కారణాలు. ఉత్తరంగా పయనించే వ్యాపార పవనాలు భారత్‌ వైపు, ఈశాన్య వ్యాపార పవనాలు ఆస్ట్రేలియా వైపు వీయడానికి కూడా కొరియాలిసిస్‌ ప్రభావమే కారణం.

రుతుపవనాలను క్రియాశీలకంగా ప్రభావితం చేసే అంశాలు:

ఎల్‌ నినో: ఎల్‌ నినో అంటే లాటిన్‌ భాషలో క్రీస్తు జననం/చిన్న బాలుడు. ఇది ఒక అసాధారణ ప్రక్రియ. ప్రతి 5-7 సంవత్సరాలకు ఒకసారి తూర్పు పసిఫిక్‌ మహాసముద్రంలో ఏర్పడే అయనరేఖ ఉష్ణప్రవాహమే ఎల్‌ నినో. ఇది దక్షిణ అమెరికాలోని పెరూ దేశ పశ్చిమతీర ప్రాంతం వైపు కదిలినప్పుడు అక్కడి ఉష్ణోగ్రతలు పెరిగి అల్పపీడన పరిస్థితులు ఏర్పడతాయి. దీని కారణంగా పెరూ తీర ప్రాంతంలో చేపలు వంటి కొన్నిరకాల జలచరాలు చనిపోవడమే కాకుండా భారత్, ఆగ్నేయాసియా దేశాల్లో రుతుపవన వ్యవస్థ బలహీనపడి వర్షపాతం తగ్గుతుంది. తద్వారా తీవ్ర దుర్భిక్ష, కరవు పరిస్థితులు ఏర్పడతాయి.

 సాధారణంగా పెరూ తీరంలో శీతల సముద్ర ప్రవాహాలు ఉంటాయి. దాని వల్ల అక్కడ అధిక పీడన పరిస్థితులు ఉండి, ఆగ్నేయాసియా ప్రాంతంలో సాధారణ వాతావరణ పరిస్థితులుంటాయి. కానీ ఎల్‌ నినో ఏర్పడటం వల్ల ఉష్ణ సముద్ర ప్రవాహాల కారణంగా అల్పపీడన పరిస్థితులు ఏర్పడి అక్కడ విపరీతమైన వర్షపాతం సంభవిస్తుంది. దానివల్ల ఆగ్నేయాసియాలో చురుగ్గా ఉండాల్సిన రుతుపవన గాలులు ప్రభావితమై బలహీనపడి వర్షపాతం తగ్గుతుంది. కొన్నిసార్లు కరవు పరిస్థితులు ఏర్పడతాయి.

ఎల్‌ నినో కారణంగా సాధారణ పరిస్థితుల్లో పెరూ తీరం వెంట కదిలే హోంబోల్ట్‌ శీతల ప్రవాహం దూరంగా (30ా దక్షిణ అక్షాంశం వరకు) నెట్టివేతకు గురవుతుంది. దీని ప్రభావంతో తూర్పు పసిఫిక్‌ మహాసముద్ర ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగి పెరూ తీర ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి ఏర్పడుతుంది. ఈ ప్రక్రియ వల్ల భారత, ఆగ్నేయ వ్యాపార పవనాలు పెరూ తీర ప్రాంతం వైపు కదులుతాయి. దీంతో పెరూ తీర ప్రాంతంలో కుండపోత వర్షాలు కురుస్తాయి. ఇదే సమయంలో భారత్, ఆగ్నేయాసియా దేశాల్లో రుతుపవన వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిని కరవు పరిస్థితులు సంభవిస్తాయి. 

భూతాపం (గ్లోబల్‌ వార్మింగ్‌) వల్ల కూడా ఎల్‌ నినో, నైరుతి రుతుపవన వ్యవస్థల మధ్య సంబంధం బలహీనపడుతున్నట్లు తెలుస్తోంది. ఎల్‌ నినో మాత్రమే కాకుండా హిందూ మహాసముద్రంలో ఏర్పడే డైపోల్, ఈక్విటోరియల్‌ ఇండియన్‌ ఓషన్‌ ఆసిలేషన్‌ వంటి దృగ్విషయాల ప్రభావం నైరుతి రుతుపవనాలపై అధికంగా ఉంటుంది.


లా నినో:  ఇది ఎల్‌ నినోకు పూర్తి భిన్నంగా ఉంటుంది. లా నినో అంటే పెరూ తీరం వెంబడి కదిలే శీతల సముద్ర ప్రవాహం. పెరూ తీరంలో ఈ పరిస్థితులు ఉన్నప్పుడు భారత్‌లో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి. లాటిన్‌ భాషలో లా నినో అంటే ఆడ శిశువు/క్రీస్తు బాలిక అని అర్థం. పెరూ శీతల ప్రవాహం బలంగా ఉన్నప్పుడు,  అది భూమధ్యరేఖ వరకు ప్రయాణించి పసిఫిక్‌ మహాసముద్ర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. దీనివల్ల తాహితి వద్ద అధిక పీడన పరిస్థితులు, డార్విన్‌ వద్ద అల్పపీడన పరిస్థితులు ఏర్పడతాయి. వ్యాపార పవనాలు ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వీస్తాయి. ఈ దశలో భారత్‌లో నైరుతి రుతుపవనాలు బలంగా వీచి, వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి.


దక్షిణ డోలాయనం: ఈ అసాధారణ వాతావరణ స్థితిని మొదటగా గిల్బర్ట్‌ వాకర్‌ అనే శాస్త్రవేత్త 1910లో పరిశీలించాడు. దక్షిణార్ధ గోళంలో ఆస్ట్రేలియా వాయవ్య తీరం వద్ద ఉన్న  హిందూ మహాసముద్రంలోని డార్విన్, దక్షిణ పసిఫిక్‌ మహాసముద్రంలో 17o 6' అక్షాంశం వద్ద తాహితి ద్వీపానికి మధ్య, గాలులు పీడన వ్యవస్థలో వ్యత్యాసం వల్ల ఏర్పడే పరస్పర వ్యతిరేకతనే దక్షిణ డోలాయనం అని పిలుస్తారు.

హిందూ మహాసముద్ర డైపోల్‌: పశ్చిమ హిందూ మహాసముద్రంలో అరేబియా సముద్రం కలిసే చోట ఉష్ణోగ్రత సాధారణం కంటే 0.40సెం.గ్రే. పెరిగితే దాని ప్రభావం వల్ల  తూర్పు భాగంలో బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలో కలిసేచోట ఉష్ణోగ్రత కొంచెం తగ్గుతుంది. ఈ రెండు ప్రాంతాలను హిందూ మహాసముద్ర రెండు చివరలుగా చెప్పవచ్చు. హిందూ మహాసముద్ర తూర్పు భాగంలో ఉష్ణోగ్రత తగ్గడం వల్ల (హిందూ మహాసముద్ర పశ్చిమ భాగం ఉష్ణోగ్రతలు పెరిగే స్థితి) అక్కడి గాలులు నైరుతి రుతుపవనాలను బలంగా భారత్‌ వైపు నెడతాయి. ఫలితంగా ఇక్కడ సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయి. ఈ స్థితినే భారత్‌లో ధనాత్మక స్థితి అంటారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఇండొనేసియా, ఆస్ట్రేలియా ప్రాంతాల్లో కరవు ఏర్పడుతుంది. హిందూ మహాసముద్రం తూర్పు ధ్రువ ఉష్ణోగ్రతలు పెరిగితే (హిందూ మహాసముద్ర పశ్చిమ  ధ్రువాన ఉష్ణోగ్రతలు తగ్గే స్థితి), వ్యాపార పవనాలు ఆస్ట్రేలియాలో అధిక వర్షాలు కురిపిస్తాయి. ఇదే సమయంలో భారత్‌లో సగటు వర్షపాతం తగ్గుతుంది. ఈ అసాధారణ స్థితిని రుణాత్మక స్థితి అంటారు.

* ఎల్‌ నినో, హిందూ మహాసముద్ర డైపోల్‌ రెండూ వేర్వేరు వాతావరణ అంశాలు. ఇవి రెండూ ఒకేసారి ఏర్పడవచ్చు. భారత్‌పై ఎల్‌ నినో ప్రభావం ఉన్నా, హిందూ మహాసముద్ర డైపోల్‌ సానుకూలంగా ఉంటే దేశంలో వర్షపాతం సాధారణ స్థాయిలోనే ఉంటుంది.

రచయిత: డాక్టర్‌ గోపగోని ఆనంద్

Posted Date : 13-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌