• facebook
  • whatsapp
  • telegram

సహకార సంఘాలు 

చారిత్రక నేపథ్యం

* ప్రపంచ సహకార ఉద్యమానికి పుట్టినిల్లు‘ఇంగ్లండ్‌’ కాగా, ఈ ఉద్యమ పితామహుడిగా అదే దేశానికి చెందిన రాబర్ట్‌ ఓవెన్‌ను పేర్కొంటారు.

* మన దేశంలో సర్‌ ఫ్రెడరిక్‌ నికల్సన్‌ను సహకార ఉద్యమ పితామహుడిగా చెబుతారు. 

* భారత్‌లో సహకార ఉద్యమ నిర్మాతగా జవహర్‌లాల్‌ నెహ్రూను పేర్కొంటారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సహకార ఉద్యమ పితామహుడిగా పేరొందింది వేమవరపు రామదాసు పంతులు.

* మన దేశంలో సహకార ఉద్యమం 1904లో ప్రారంభమైంది. వ్యవసాయదారులను వడ్డీ వ్యాపారుల దోపిడీ నుంచి కాపాడేందుకు 1904లో కో-ఆపరేటివ్‌ సొసైటీల చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టం ఆధారంగా ‘వ్యవసాయ పరపతి సంఘాలు’ ఏర్పడ్డాయి. 

మాంటేగ్‌-చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం 1919 ప్రకారం, సహకార వ్యవస్థను కేంద్రం నుంచి రాష్ట్రాలకు బదిలీ చేశారు.

సహకార సంస్థల్లో సమీకృత దృక్పథాన్ని పెంపొందించాలని 1954లో ‘అఖిల భారత గ్రామీణ పరపతి సర్వే కమిటీ’ తన నివేదికలో సిఫార్సు చేసింది.

1963లో జాతీయ సహకార అభివృద్ధి మండలి (National Co-operative Development Council)  ని ఏర్పాటు చేశారు.

* 1964లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ‘ఆంధ్రప్రదేశ్‌ సహకార సంఘాల చట్టాన్ని’ రూపొందించారు. దీన్ని 1995లో పునర్‌వ్యవస్థీకరించి,‘పరస్పర సహాయక సహకార సంఘాల చట్టం’గా మార్చారు.

రాజ్యాంగ వివరణ

ఆర్టికల్‌ 243(ZH): సహకార సంఘాలకు సంబంధించిన అంశాల నిర్వచనాలు ఇందులో ఉంటాయి.

రిజిస్ట్రార్‌: బహుళ రాష్ట్ర సహకార సంఘాలకు కేంద్ర ప్రభుత్వం నియమించిన వ్యక్తిని ‘కేంద్ర రిజిస్ట్రార్‌’ అని, రాష్ట్ర సహకార సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన వారిని ‘రిజిస్ట్రార్‌’ అని అంటారు.

అధికారం ఉన్న వ్యక్తి: ఆర్టికల్‌ 243(ZQ)లో వీరిని పేర్కొంటారు.

బోర్డు: సహకార సంఘం కార్యకలాపాల నిర్వహణకు అధికార బాధ్యతలు అప్పగించిన ‘పాలక మండలి’.

సహకార సంఘం: ఒక రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న సహకార సంఘ శాసన నిబంధనలను అనుసరించి నమోదు చేసిన లేదా నమోదు చేసినట్లు పరిగణించే సంఘం.

బహుళ రాష్ట్ర సహకార సంఘం: ప్రస్తుతం అమల్లో ఉన్న సహకార సంఘం చట్టం ప్రకారం, ఒక రాష్ట్రం కంటే ఎక్కువ రాష్ట్రాలకు వర్తించే విధంగా నమోదు చేసిన లేదా నమోదు చేసినట్లు పరిగణించే సంఘం.

రాష్ట్రస్థాయి సహకార సంఘం: ఒక రాష్ట్ర పరిధిలో కార్యకలాపాలను నిర్వహించడానికి ఏర్పాటు చేసిన సహకార సంఘం.

ఆర్టికల్‌ 243 (Zi): సహకార సంఘాల ఏర్పాటుకు సంబంధించిన నియమ - నిబంధనలతో కూడిన చట్టాన్ని రాష్ట్రశాసనసభ రూపొందించొచ్చు.

* సహకార సంఘాలను స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకోవడం; సభ్యుల ఆర్థిక భాగస్వామ్యానికి, ప్రజాస్వామ్యయుతంగా సభ్యుల నియంత్రణ మొదలైన అంశాలను చట్టం ద్వారా నిర్దేశించారు.

ఆర్టికల్‌  243 (Zj) : సహకార సంఘం బోర్డు సభ్యుల సంఖ్య, పాలక మండలి సభ్యుల సంఖ్య, వారి పదవీ కాల పరిమితిని ఇందులో నిర్దేశించారు.

* రాష్ట్ర శాసనసభ చేసిన చట్టం ప్రకారం, ఒక సహకార సంఘంలో బోర్డు డైరెక్టర్ల సంఖ్య గరిష్ఠంగా 21కి మించకూడదు. వీటిలో మహిళలకు 2 స్థానాలు, ఎస్సీ/ ఎస్టీ వర్గాల వారికి ఒక స్థానం రిజర్వ్‌ చేయాలి. 

* బ్యాంకింగ్, ఫైనాన్స్‌ మేనేజ్‌మెంట్‌ లాంటి రంగాల్లో నిష్ణాతులైన వారిని ఇద్దరికి మించకుండా కో-ఆప్టెడ్‌(co-opted) సభ్యులుగా నామినేట్‌ చేయొచ్చు (21 + 2).

* ఈవిధంగా నామినేట్‌ అయిన సభ్యులకు సహకార సంఘం చేసే తీర్మానాలపై ఓటు హక్కు ఉండదు.

* సహకార సంఘం బోర్డులో ఎన్నికైన పాలక మండలి సభ్యుల పదవీ కాలం 5 సంవత్సరాలు.

ఆర్టికల్‌ 243 (Zk): ప్రస్తుతం కొనసాగుతున్న బోర్డు పదవీకాలం ముగియక ముందే కొత్త బోర్డు సభ్యుల ఎన్నిక ప్రక్రియను పూర్తిచేయాలి.  

* సహకార సంఘం ఎన్నికల పర్యవేక్షణకు, ఓటర్ల జాబితా రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ఒక అథారిటీని ఏర్పాటు చేయాలి.

ఆర్టికల్‌ 243 (ZL): ప్రత్యేక పరిస్థితులు ఉంటే తప్ప, సహకార సంఘం బోర్డును 6 నెలలకు మించి రద్దు చేయకూడదు లేదా సస్పెన్షన్‌లో ఉంచకూడదు. సహకార సంఘం బోర్డును కింది కారణాలతో రద్దు/ సస్పెండ్‌ చేయొచ్చు. 

*  బోర్డు ఏర్పాటు లేదా బోర్డు కార్యకలాపాల్లో సంక్షోభం ఏర్పడినప్పుడు.

*  బోర్డు చాలాకాలంపాటు కార్యకలాపాలు నిర్వహించడంలో విఫలమైనప్పుడు.

*  బోర్డు తన విధుల నిర్వహణలో అలసత్వం వహించినప్పుడు.

* బోర్డు నిర్ణయాలు సహకార సంఘానికి లేదా దాని సభ్యుల ప్రయోజనాలకు హాని కలిగించే విధంగా ఉన్నప్పుడు.

*  ఏదైనా సహకార సంఘం బోర్డు రద్దయితే దానికి 6 నెలలలోపు ఎన్నికలు నిర్వహించి, పరిపాలనా బాధ్యతలను కొత్త బోర్డుకు అప్పగించేందుకు ఒక అడ్మినిస్ట్రేటర్‌ను నియమించాలి. దీనికి సంబంధించిన నియమ నిబంధనలను రాష్ట్ర శాసనసభ రూపొందిస్తుంది.

*  ఏదైనా సహకార సంఘం బ్యాంకింగ్‌ వ్యాపారాన్ని, లావాదేవీలను నిర్వహించాలంటే ‘1949 నాటి బ్యాంకింగ్‌ రెగ్యులేటింగ్‌ చట్టం’లోని నియమ నిబంధనలను అనుసరించాలి.

ఆర్టికల్‌ 243 (ZM): సహకార సంఘాల అకౌంట్లను ఆడిట్‌ చేసే ఆడిట్‌ కంపెనీలు, ఆడిటర్ల అర్హతలకు సంబంధించిన నియమ నిబంధనలను రాష్ట్ర శాసనసభ రూపొందిస్తుంది.  

*   సహకార సంఘం సర్వసభ్య సమావేశం నియమించే ఆడిటర్‌ లేదా ఆడిటింగ్‌ కంపెనీతోనే సహకార సంఘ అకౌంట్లను తప్పనిసరిగా ఆడిట్‌ చేయించాలి. 

*   ప్రతి సహకార సంఘం అకౌంట్లు ఆర్థిక సంవత్సరం ముగిసిన 6 నెలల్లోగా ఆడిట్‌ చేయాలి.

*   రాష్ట్ర సహకార సంఘ చట్టంలో నిర్వచించిన అపెక్స్‌ సహకార సంఘం ఖాతాల ఆడిట్‌ రిపోర్ట్‌ను రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టాలి.

ఆర్టికల్‌ 243(ZN): ఆర్థిక సంవత్సరం ముగిసిన 6 నెలల్లోపు ప్రతి సహకార సంఘం తప్పనిసరిగా సర్వసభ్య సమావేశం జరిపే విధంగా రాష్ట్ర శాసనసభ నియమ నిబంధనలను రూపొందించాలి. 

ఆర్టికల్‌ 243(ZO): ప్రతి సహకార సంఘ సభ్యుడికి ఆ సంఘానికి సంబంధించిన సమాచారం, అకౌంట్ల వివరాలను తెలుసుకునే హక్కు కల్పిస్తూ రాష్ట్ర శాసనసభ శాసనాన్ని రూపొందించొచ్చు.  

* సహకార సంఘం సమావేశాలకు హాజరయ్యే కనీస సభ్యుల గురించి; సంఘం నిర్వహణలో సభ్యులు పాల్గొనే విధానం గురించి; సహకార సంఘ సభ్యులందరికీ సహకార, విద్య, శిక్షణను అందించడం గురించి అవసరమైన శాసనాలను రాష్ట్ర శాసనసభ రూపొందిస్తుంది.


ఆర్టికల్‌243(ZP): ప్రతి సహకార సంఘం తమ కార్యకలాపాలకు సంబంధించిన వార్షిక నివేదికను, ఆడిట్‌ చేసిన ఖాతాల వివరాలను, సర్వసభ్య సమావేశంలో చేసిన తీర్మానాలను ప్రతి ఆర్థిక సంవత్సరం ముగిసిన 6 నెలల్లోపు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అథారిటీకి సమర్పించాలి. 


ఆర్టికల్‌ 243(ZQ): సహకార సంఘాలకు సంబంధించిన నేరాలు, వాటిపై తీసుకునే క్రమశిక్షణా చర్యలు, జరిమానాలకు సంబంధించిన నియమ నిబంధనలను రాష్ట్ర శాసనసభ రూపొందిస్తుంది. కింద పేర్కొన్న వాటిని నేరసంబంధిత అంశాలుగా పరిగణిస్తారు.

*  సహకార సంఘం చట్టంలోని నియమ నిబంధనలను సభ్యులు ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినప్పుడు.

*  యజమాని తన ఉద్యోగి నుంచి పట్టుకున్న/ స్వాధీనం చేసుకున్న మొత్తం నగదును, దాన్ని స్వాధీనం చేసుకున్న తేదీ నుంచి 14 రోజులలోపు తగిన కారణం లేకుండా సహకార సంఘానికి జమచేయడంలో విఫలమైనప్పుడు.

*   ఎవరైనా ఉద్యోగి లేదా అధికారి తన సహకార సంఘానికి సంబంధించిన రికార్డులు, ఖాతాల వివరాలు, డాక్యుమెంట్లను సంబంధిత అధీకృత అధికారికి అప్పగించడంలో విఫలమైనప్పుడు.


ఆర్టికల్‌ 243(ZR): రాజ్యాంగంలోని IX-Bలో పేర్కొన్న అంశాలు ‘బహుళ రాష్ట్ర సహకార సంఘాల’కు కూడా వర్తిస్తాయి. అయితే రాష్ట్ర శాసనసభ, రాష్ట్ర శాసనం, రాష్ట్ర ప్రభుత్వం అనే పదాలను పార్లమెంట్, కేంద్ర ప్రభుత్వ శాసనం, కేంద్ర ప్రభుత్వం అని అన్వయించుకోవాలి. 


ఆర్టికల్‌ 243(ZS): రాజ్యాంగంలోని IX-B భాగంలో పేర్కొన్న సహకార సంఘాలకు సంబంధించిన అంశాలు కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తింపజేయాలా? లేదా? అనే విషయాన్ని రాష్ట్రపతి గెజిట్‌ నోటిఫికేషన్‌ ద్వారా నిర్ధారిస్తారు. 

* కేంద్రపాలిత ప్రాంతాల్లోని సహకార సంఘాలకు ఆ ప్రాంత పాలనాధికారి ద్వారా, శాసన సభలు కలిగిన కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆ ప్రాంత శాసన సభల ద్వారా శాసనాలను రూపొందిస్తారు.

ఆర్టికల్‌243(ZT): రాజ్యాంగంలోని IX-B భాగంలో పేర్కొన్న సహకార సంఘాలకు సంబంధించిన నియమ నిబంధనలు 2012, ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే అప్పటికే వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమల్లో ఉన్న సహకార నియమాలు ఒక సంవత్సరం పాటు కొనసాగుతాయి.


రాజ్యాంగంలో ప్రస్తావన

* రాజ్యాంగంలోని 3వ భాగంలో ఉన్న ఆర్టికల్‌ 19(1)(c) ప్రకారం భారతీయులు సహకార సంఘాలను ఏర్పాటు చేసుకోవచ్చు.

*రాజ్యాంగంలోని 4వ భాగంలో పేర్కొన్న ఆర్టికల్‌ 43(b)  ప్రకారం, భారతీయులు సహకార సంఘాలను అభివృద్ధి చేసుకోవచ్చు, నిర్వహించుకోవచ్చు.


రాజ్యాంగ భద్రత

సహకార సంఘాలు స్వయం సమృద్ధితో పనిచేసేందుకు, ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు వాటికి రాజ్యాంగ భద్రత అవసరం. దీని కోసం మన్మోహన్‌సింగ్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం 97వ రాజ్యాంగ సవరణ చట్టం, 2011 ద్వారా ‘సహకార సంఘాల’కు రాజ్యాంగ భద్రత కల్పించింది. ఈ చట్టం 2012, ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి వచ్చింది.

97వ రాజ్యాంగ సవరణ చట్టం(2011) ద్వారా భారత రాజ్యాంగానికి కొత్తగా IX-B  అనే భాగాన్ని చేర్చారు. ఇందులోని ఆర్టికల్‌ 243(ZH) నుంచి ఆర్టికల్‌ 243(ZT) మధ్య సహకార సంఘాలకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేస్తూ, రాజ్యాంగ భద్రత కల్పించారు.


సహకార సంఘాల వల్ల కలిగే ప్రయోజనాలు

పేదరిక నిర్మూలనకు తోడ్పడతాయి. 

 ఆహార భద్రత కల్పించడంలో, ఉపాధి అవకాశాలు పెంచడంలో ఉపయోగపడతాయి. 

పరిమిత వనరులను కలిసికట్టుగా ఒకరికొకరు పంచుకోవడం ద్వారా వాటి వృథాను అరికట్టొచ్చు.

ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి, పొదుపును ప్రోత్సహించడానికి తోడ్పడతాయి. వ్యవసాయ దారులకు, కుటీర పరిశ్రమలు స్థాపించుకునేవారికి తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తాయి.

Posted Date : 15-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌