(ఖండాలు - భౌగోళిక స్వరూపాలు)
అతి విశాలం.. అత్యంత వైవిధ్యం!
అత్యంత విశాలమైన పర్వత శ్రేణులు, మైదానాలు, పీఠభూములు, ఎడారులు, పొడవైన సముద్ర తీరప్రాంతాలతో, అన్ని రకాల భౌగోళిక వైవిధ్యాలతో విస్తరించి ఉన్న అతిపెద్ద ఖండం ఆసియా. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న చైనా, భారత్ వంటి దేశాలు ఇందులోనే ఉన్నాయి. అనేక రకాల దీవులు, జలసంధులు, సింధుశాఖలను కలిగి ఉంది. ఈ విశేషాలన్నింటినీ పరీక్షల కోణంలో అభ్యర్థులు తెలుసుకోవాలి.

ఉనికి: ఆసియా ఖండం 10C0 దక్షిణ అక్షాంశం నుంచి 80C0 ఉత్తర అక్షాంశం వరకు, 28C0 తూర్పు రేఖాంశం నుంచి 170C0 పశ్చిమ రేఖాంశం వరకు 64.25 మిలియన్ చదరపు కిలోమీటర్లు ఆసియా ఖండం విస్తరించి ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఖండం. భారతదేశ భూభాగం కంటే 13 రెట్లు పెద్దది. ఈ ఖండంలో మొత్తం 49 దేశాలున్నాయి. వాటిలో అతిపెద్ద దేశం రష్యా, అతిచిన్న దేశం మాల్దీవులు. ప్రపంచ జనాభాలో 60%, భూభాగంలో 30% ఆసియా వాటాగా ఉంది. ఈ ఖండానికి మధ్యలో 90 డిగ్రీల తూర్పు రేఖాంశం, దక్షిణ ఆగ్నేయంగా భూమధ్యరేఖ వెళుతున్నాయి.
* ఆగ్నేయాసియాలోని గోల్డెన్ ట్రయాంగిల్ ఓపియం (నల్లమందు) తయారీకి, ఉత్పత్తికి ప్రసిద్ధి. మధ్య ఆసియాలో ఉన్న అఫ్గానిస్థాన్‌లోని ‘గోల్డెన్ క్రిసెంట్’ ఓపియం ఉత్పత్తిలో ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉంది. ‘సుయ్ గ్యాస్ ఫీల్డ్’ బెలూచిస్థాన్‌లో ఉంది.
సరిహద్దులు:
* ఉత్తరం - ఆర్కిటిక్ సముద్రం
* తూర్పు - బేరింగ్ జలసంధి, పసిఫిక్
* దక్షిణం - హిందూ మహాసముద్రం.
* నైరుతి - ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం
* పశ్చిమం - యురాల్ పర్వతాలు, కాస్పియన్ సముద్రం, కాకస్ పర్వతాలు, నల్ల సముద్రం.
* ఆసియా, ఐరోపా భూభాగాలను కలిపి యురేషియా అని పిలుస్తారు. ఈ రెండు ఖండాల్లో విస్తరించి ఉన్న దేశాలు 1) రష్యా 2) తుర్కియే (ఒకప్పటి టర్కీ - దీన్నే ఐరోపా జబ్బు మనిషిగా పిలుస్తారు).
* ఆసియా ఖండ పశ్చిమ చివరి ప్రాంతం తుర్కియేలోని బాబా అగ్రం. తూర్పు చివరి ప్రాంతం ఈశాన్య సైబీరియాలోని డెజ్‌నెవ్ అగ్రం.
* ఎత్తయిన ప్రాంతం ఎవరెస్ట్. లోతైన ప్రాంతం మృత సముద్రం (జోర్డాన్, ఇజ్రాయెల్).
* విస్తీర్ణంలో అతిపెద్ద దేశాలు రష్యా, చైనా, ఇండియా, కజకిస్థాన్, సౌదీ అరేబియా, ఇండొనేసియా.
* భూమధ్యరేఖ వెళ్లే ఆసియా ప్రాంతాలు ఇండొనేసియాలోని సుమత్రా, బోర్నియో, సెలిబసి (సులేవాసి).
* వలస రాజ్యస్థాపన జరగని ఆగ్నేయాసియా దేశం థాయిలాండ్.
* ఆగ్నేయాసియాలో భూపరివేష్టిత దేశం లావోస్. ప్రపంచంలో అతిపెద్ద భూపరివేష్టిత దేశం మంగోలియా. ‘క్రా’ భూసంధి అనే థాయిలాండ్‌లోని భూభాగం మలేసియాను ఆసియా ప్రధాన భూభాగంతో కలుపుతుంది.
* కర్కటరేఖ వెళుతున్న ఆసియా దేశాలు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్, ఇండియా, బంగ్లాదేశ్, మయన్మార్, చైనా, తైవాన్.
ఉత్తరం నుంచి దక్షిణానికి అమరి ఉన్న పసిఫిక్ మహాసముద్రంలోని సముద్రాలు:
ఎ) ఓఖోత్స్క్ సముద్రం
బి) జపాన్ సముద్రం
సి) పసుపు సముద్రం
డి) తూర్పు చైనా సముద్రం
ఇ) దక్షిణ చైనా సముద్రం.
ఆసియాలో భౌగోళిక, ఆర్థిక, సాంఘికపరమైన ప్రత్యేకతలు
* జనాభా పరంగా అతిపెద్దది, విస్తీర్ణపరంగా మూడో అతిపెద్ద దేశం భారత్.
* మెకాంగ్ నది చైనా, లావోస్, థాయిలాండ్, కంబోడియా, వియత్నాం దేశాల నుంచి ప్రవహిస్తూ వియత్నాంలో డెల్టాను ఏర్పరుస్తోంది.
* క్రాకటోవా అగ్నిపర్వతం సుమత్రా, జావా దీవుల మధ్య ఉన్న సుందాకందంలో ఉంది.
* ప్రపంచంలో ఆటబొమ్మలు ఎక్కువగా ఉత్పత్తి చేసే ప్రాంతం హాంకాంగ్.
* ఆగ్నేయాసియాలో విస్తీర్ణపరంగా అతిపెద్ద దేశం థాయిలాండ్, అతి చిన్న దేశం సింగపూర్. ఆగ్నేయాసియాలో జనాభా పరంగా పెద్ద దేశం ఇండొనేసియా. తక్కువ జనాభా ఉన్న దేశం బ్రూనై.
దక్షిణార్ధ గోళంలోని ఆసియా ప్రాంతాలు: ఇండొనేసియాలోని జావా, జకార్తా, బాలి, పశ్చిమ తిమూర్.
* తూర్పు ప్రాచ్యంలో ఏకైక క్రిస్టియన్ దేశం ఫిలిప్పీన్స్.
* ల్యాండ్ ఆఫ్ మౌంటైన్స్ అండ్ రివర్స్ - మయన్మార్.
* ల్యాండ్ ఆఫ్ వైట్ ఎలిఫెంట్స్ - థాయిలాండ్.
* అత్యధిక జనాభా ఉన్న పశ్చిమాసియా దేశం లెబనాన్.
* ప్రపంచంలో అతి తక్కువ తీర రేఖ ఉన్న దేశం మొనాకో (4 కి.మీ.), బోస్నియా హెర్జెగోనియా (20 కి.మీ.), తువాలు (24 కి.మీ.), జోర్డాన్ (26 కి.మీ.).
ఆగ్నేయాసియాలోని ముఖ్యమైన సముద్రాలు:
* తూర్పు సైబీరియా సముద్రం ఉత్తర రష్యాలో ఆర్కిటిక్ ప్రాంతంలో ఉంది.
* బేరింగ్ సముద్రం ఈశాన్య రష్యాలో పసిఫిక్‌లో భాగంగా ఉంది.
* ఓఖోత్క్స్ సముద్రం- తూర్పు రష్యా (పసిఫిక్)
* జపాన్ సముద్రం - పశ్చిమ జపాన్ (పసిఫిక్)
* పసుపు సముద్రం-పశ్చిమ కొరియా (పసిఫిక్)
* తూర్పు చైనా సముద్రం - తూర్పు చైనా (పసిఫిక్)
* దక్షిణ చైనా సముద్రం - దక్షిణ చైనా (సముద్రాలన్నింట్లో అతి పెద్దది - పసిఫిక్‌లో భాగం)
* సులు - పశ్చిమ ఫిలిప్పీన్స్ (పసిఫిక్)
* సెలిబస్ సముద్రం - సెలిబస్ దీవికి ఉత్తరం (పసిఫిక్)
* బాండా సముద్రం - సెలిబస్ దీవికి తూర్పు (పసిఫిక్)
* జావా సముద్రం - జావాకు ఉత్తరం (పసిఫిక్)
* తిమూర్ సముద్రం - ఆస్ట్రేలియాకు వాయవ్యం (పసిఫిక్)
* అరాపురా సముద్రం-ఆస్ట్రేలియాకు ఉత్తరం (దక్షిణ పసిఫిక్)
* ఎర్ర సముద్రం-ఆసియాను, ఆఫ్రికాను వేరుచేస్తుంది (హిందూ మహాసముద్రం).
ఆసియా ఖండంలోని ముఖ్యమైన సింధు శాఖలు:
* గల్ఫ్ ఆఫ్ ఓబ్ - యమాల్, గైడా ద్వీపకల్పాల మధ్య ఆర్కిటిక్ మహాసముద్రంలో భాగంగా ఉంది.
* పర్షియన్ గల్ఫ్ - అరేబియన్ ద్వీపకల్పం, ఇరాన్ పీఠభూమికి మధ్య (హిందూ మహా సముద్రం)
* గల్ఫ్ ఆఫ్ ఒమన్ - ఒమన్, ఇరాన్ పీఠభూమికి మధ్య (హిందూ మహాసముద్రం).
* గల్ఫ్ ఆఫ్ ఎడెన్ - సోమాలియా, యెమెన్‌కు మధ్య (హిందూ మహాసముద్రం)
* గల్ఫ్ ఆఫ్ ఆక్వాబా - జోర్డాన్‌లోని ఆక్వాబాకు, ఈజిప్ట్‌లోని సినాయి ద్వీపకల్పానికి మధ్య (ఎర్రసముద్రం).
ఆసియాలోని ముఖ్యమైన దీవులు:
* వ్రాంగల్ దీవులు - రష్యాకు ఉత్తరాన తూర్పు సైబీరియా సముద్రానికి, ఆర్కిటిక్ సముద్రానికి మధ్య విస్తరించి ఉన్నాయి.
* కురిల్ దీవులు - కమ్చట్కా ద్వీపకల్పానికి, జపాన్‌లోని హోక్కైడో దీవులకు మధ్య పసిఫిక్‌లో భాగంగా ఉన్నాయి. ఇవి జపాన్, రష్యా మధ్య వివాదాస్పదంగా ఉన్నాయి.
* స్పార్ట్సి, పార్సెల్ దీవులు - చైనా, వియత్నాం, మలేసియా, తైవాన్, ఫిలిప్పీన్స్, బ్రూనై మధ్యలోని వివాదాస్పద దీవులు. ఈ ప్రాంత సముద్ర భూతలంపై అధిక మొత్తంలో క్రూడాయిల్ నిల్వలున్నాయి (దక్షిణ చైనా సముద్రం - పసిఫిక్ మహాసముద్రంలో భాగం).
ముఖ్యమైన జలసంధులు
బేరింగ్ జలసంధి: ఆసియాను ఉత్తర అమెరికా నుంచి వేరుచేస్తుంది. తూర్పు సైబీరియాను బేరింగ్ సముద్రంతో కలుపుతుంది.
ఫార్మోసా లేదా తైవాన్ జలసంధి: తైవాన్ నుంచి చైనాను వేరు చేస్తుంది. తూర్పు చైనా, దక్షిణ చైనా సముద్రాలను కలుపుతుంది.
లుజోన్ జలసంధి: తైవాన్ నుంచి ఫిలిప్పీన్స్‌లోని లుజోన్ జలసంధి దక్షిణ చైనా సముద్రాన్ని, పసిఫిక్ ప్రాంతాన్ని వేరుచేస్తుంది.
మక్కసార్ జలసంధి: బోర్నియోను సెలిబస్ దీవుల నుంచి వేరుచేస్తుంది. సెలిబస్ సముద్రాన్ని జావా సముద్రంతో కలుపుతుంది.
మలక్కా జలసంధి: మలయా ద్వీపకల్పాన్ని సుమత్రా దీవుల నుంచి వేరుచేస్తుంది. జావా సముద్రాన్ని బంగాళాఖాతంతో కలుపుతుంది.
హార్మోజ్ జలసంధి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి ఇరాన్‌ను వేరుచేస్తుంది. పర్షియన్ సింధు శాఖను ఒమన్ సింధు శాఖతో కలుపుతుంది.
బాస్పోరస్ జలసంధి: ఆసియాను, ఐరోపాను వేరుచేస్తుంది. నల్లసముద్రాన్ని మార్మరా సముద్రంతో కలుపుతుంది.
టాటార్ జలసంధి: ప్రపంచంలో పొడవైంది. తూర్పు రష్యాను సణాలిన్ ద్వీపం నుంచి వేరు చేస్తుంది. ఒకాట్సన్ సముద్రాన్ని జపాన్ సముద్రంతో కలుపుతుంది.
ఆసియా ఖండంలోని పీఠభూములు, మైదానాలు
లద్దాఖ్ (పర్వతాంతర పీఠభూమి): కారకోరం, హిమాలయాలకు మధ్య విస్తరించి ఉంది.
టిబెట్ (పర్వతానంతర పీఠభూమి): కున్‌లున్ పర్వతాలు, హిమాలయాల మధ్య ఉంది.
యునాన్ పీఠభూమి: టిబెట్ పీఠభూమికి ఈశాన్యంలో ఉంది.
తక్లమకాన్ ఎడారి పీఠభూమి: చైనాలోని టియాన్గాన్, కున్‌లున్ పర్వతాల మధ్య ఉంది.
తారీమ్ బేసిన్: చైనా
ఆర్మేనియన్ పీఠభూమి: కాస్పియన్, నల్లసముద్రాల మధ్య ఉంది.
ఇరానియన్ పీఠభూమి: ఇరాన్‌లోని జాగ్రోస్, ఎల్జ్ పర్వతాల మధ్య ఉంది.
మంగోలియన్ పీఠభూమి: తూర్పున కింగాన్, దక్షిణాన అల్టుస్థాన్, టియాన్షన్, పశ్చిమాన అల్ట్రాయ్, ఉత్తరాన యల్బల్నోవి పర్వతాల మధ్య ఉంది.
షాన్ పీఠభూమి: మయన్మార్‌లోని పెగుయోమా, అరకానోమా పర్వతాల మధ్య ఉంది.
దక్కన్ పీఠభూమి: దక్కన్ పీఠభూమి వాయవ్యంలో ఉంది (ఇండియా).
అనటోలియా పీఠభూమి లేదా ఏసియామైనల్: తుర్కియే, ఇరాన్ (టైగ్రిస్, యూఫ్రటీస్ నదులు ప్రవహిస్తాయి.)
మెసపటోమియా మైదానం: ఇరాక్‌లోని టైగ్రిస్, యూఫ్రటీస్ నదుల వల్ల ఏర్పడింది.
తురానియన్ మైదానం: కజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్, కిర్గిస్థాన్‌లలో అము దర్యా, సిర్ దర్యా నదుల వల్ల ఏర్పడింది.
ఇరాన్, సౌదీ అరేబియాలో ఎడారులు
రుబ్-అల్-కలి: సౌదీ అరేబియా దక్షిణ ప్రాంతంలో ఉంది. దీన్నే 'Empty Quartere’ అని పిలుస్తారు.
అల్-న-ఫుద్: సౌదీ అరేబియాకు ఆగ్నేయ ప్రాంతంలో ఉంది.
దస్త్-ఐ-కవిర్: ప్రపంచంలో అతిపెద్ద ‘ఉప్పు ఎడారి’ ఉత్తర ఇరాన్‌లో ఉంది.
దస్త్-ఐ-లట్: ఇరాన్ తూర్పు ప్రాంతంలో ఉంది.
రచయిత: జయకర్ సక్కరి