• facebook
  • whatsapp
  • telegram

ఉత్తర అమెరికా ఖండం

కొలంబస్‌ కనిపెట్టిన కొత్త ప్రపంచం!


భారతదేశానికి సముద్ర మార్గం కనిపెడదామని బయలుదేరిన కొలంబస్‌ దారి తప్పి ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. అదే ఉత్తర అమెరికా. అప్పట్లో అనామకంగా ఉన్న ఆ ప్రాంతం ఇప్పుడు ప్రపంచ ఆర్థిక, సాంస్కృతిక, సాంకేతిక, పారిశ్రామిక కేంద్రంగా వెలుగుతోంది. ఆధునిక పద్ధతులు, సరికొత్త ఆవిష్కరణలకు చిరునామాగా మారి భూగోళానికి  దిశానిర్దేశం చేస్తోంది. అమెరికా, కెనడా లాంటి అతిపెద్ద, సంపన్న దేశాలు ఈ ఖండంలోనే ఉన్నాయి. అబ్బురపరచే వినోద, విహార ప్రదేశాలతోపాటు, ప్రమాదకర సముద్రాలూ ఉన్నాయి. వలస జనాభా, స్థానిక జాతుల సంగమంగా, అత్యంత ధనిక ఖండంగా ప్రసిద్ధి చెందిన ఉత్తర అమెరికా నైసర్గిక స్వరూపం, విశేషాల గురించి పోటీ పరీక్షార్థులకు స్థూల అవగాహన ఉండాలి. ఇక్కడి దేశాలు, ముఖ్యమైన పర్వతాలు, పీఠభూములు, జలసంధులు, దీవుల సమాచారాన్ని తెలుసుకోవాలి.

ఉత్తర అమెరికా ప్రపంచంలో జనాభా పరంగా నాలుగో అతిపెద్ద ఖండం (విస్తీర్ణపరంగా మూడోది). ఇది వైశాల్యపరంగా భారతదేశం కంటే 8 రెట్లు పెద్దది. 


ఉనికి: 7o నుంచి 83o ఉత్తర అక్షాంశాల మధ్య, 12'' నుంచి 172''పశ్చిమ రేఖాంశాల మధ్య పూర్తిగా ఉత్తరార్ధ గోళంలో విస్తరించి ఉంది. ఈ ఖండంలో మొత్తం దేశాల సంఖ్య 23. 100oల పశ్చిమ రేఖాంశం ఈ ఖండాన్ని నిలువుగా రెండు భాగాలుగా విభజిస్తుంది.


సరిహద్దులు: ఉత్తరం- ఆర్కిటిక్‌ సముద్రం, తూర్పు - అట్లాంటిక్‌ సముద్రం, పశ్చిమం - పసిఫిక్‌ సముద్రం, దక్షిణం - మెక్సికో సింధుశాఖ.

* 49o ఉత్తర అక్షాంశం - కెనడా, యూఎస్‌ఏల సరిహద్దు.

* ఉత్తర అమెరికా ఖండంలోని దేశాలను నాలుగు భాగాలుగా విభజించవచ్చు.

ఎ) ఉత్తర అమెరికా దేశాలు: యూఎస్‌ఏ, కెనడా, మెక్సికో.

బి) మధ్య అమెరికా దేశాలు: మెక్సికో, సెంట్రల్‌ అమెరికా దేశాలు 1) గ్వాటెమాల 2) కోస్టారికా 3) నికరాగ్వా 4) పనామా 5) హోండురస్‌ - ఇది అట్లాంటిక్, పసిఫిక్‌ తీరరేఖను కలిగి ఉంది. 6) ఎల్‌ సాల్వెడార్‌ - పసిఫిక్‌ తీర రేఖను కలిగి ఉంది. 7) బెలిజ్‌ - అట్లాంటిక్‌ తీర రేఖను మాత్రమే కలిగి ఉంది.

సి) కరీబియన్‌ ద్వీపాలు: కరీబియన్‌ దీవుల్లోని అనేక చిన్న చిన్న ద్వీపాలు (వెస్ట్‌ఇండీస్‌ దీవులతో కలిపి)
డి) లాటిన్‌ అమెరికన్‌ దేశాలు: మెక్సికో, సెంట్రల్‌ అమెరికా, వెస్టిండీస్‌ దీవులు, దక్షిణ అమెరికాలను కలిపి లాటిన్‌ అమెరికా అంటారు.


ముఖ్యాంశాలు: * ప్రపంచంలో పొడవైన తీర రేఖ ఉన్న దేశం - కెనడా (94,550 కి.మీ.). * ప్రపంచ సిలికాన్‌ వ్యాలీ, గోల్డెన్‌ సిటీగా పిలిచే ప్రాంతం - శాన్‌ఫ్రాన్సిస్కో * ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన ఓల్డ్‌ ఫెయిల్‌ గీజర్‌ ఉన్న ఎల్లో స్టోన్‌ నేషనల్‌ పార్కు యూఎస్‌ఏలోని వ్యోమింగ్‌ రాష్ట్రంలో ఉంది. * హాలీవుడ్‌గా పిలిచే ప్రాంతం - లాస్‌ఏంజెలెస్‌ * ప్రపంచంలో అతిపెద్ద ఎయిర్‌క్రాఫ్ట్‌ అసెంబ్లింగ్‌ కేంద్రం -  సియాటెల్‌ (వాషింగ్టన్‌) * ప్రపంచంలో అతిపెద్ద సింథటిక్‌ రబ్బరు, టైర్ల తయారీ కేంద్రం - ఆన్‌ (యూఎస్‌ఏ) * సిటీ ఆఫ్‌ స్కై స్క్రాపర్స్, ‘బి’గా పిలిచే ప్రాంతం - న్యూయార్క్‌ ‘ఐరన్‌ అండ్‌ స్టీల్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ సిటీలర్స్‌ * కెనడాలోని ‘సడ్‌ బరీ’ నికెల్, ప్లాటినం, కాపర్‌ ఖనిజాలకు ప్రసిద్ధి.* గ్రీన్‌లాండ్‌ - ప్రపంచంలో అతిపెద్ద దీవి. దీని రాజధాని కలాడిట్‌ మానట్‌. ఇది ఖండాల పరంగా ఉత్తర అమెరికాలో ఉన్నప్పటికీ ఐరోపాలోని డెన్మార్క్‌ దేశ సార్వభౌమాధికారం పరిధిలో ఉంది. * హవాయి దీవుల రాజధాని అయిన హునొలులు నగరాన్ని ‘క్రాస్‌ రోడ్స్‌ ఆఫ్‌ ది పసిఫిక్‌’ అని పిలుస్తారు.* ఇటలీ దేశ అన్వేషకుడైన అమెరిగో వెస్పూచి పేరు మీదుగా అమెరికాకు ఆ పేరు పెట్టారు. క్రీ.శ.1492లో క్రిస్టోఫర్‌ కొలంబస్‌ భారతదేశానికి సముద్ర మార్గం కనుక్కునే ప్రయత్నంలో ప్రస్తుతం ఉన్న పశ్చిమ ఇండియా దీవులను చేరుకుని అదే ‘ఇండియా’గా భావించారు. ఆ తర్వాత తాను చేరుకున్న ప్రదేశం ఇండియా కాదని తెలుసుకుని ఆ ప్రాంతానికి ‘న్యూ వరల్డ్‌’ అనే పేరు పెట్టారు. ఈ న్యూ వరల్డ్‌నే ప్రస్తుతం ఉత్తర అమెరికాగా పిలుస్తున్నారు. * ప్రపంచంలో అతిపెద్ద సమాంతర భ్రంశం(Parallel Fault) అయిన ‘శాన్‌ ఆండ్రియాస్‌ ఫాల్ట్‌’ ఉన్న ప్రాంతం. ఇది ఉత్తర అమెరికా ఫలకం, పసిఫిక్‌ ఫలకాలు ఒకదాంతో మరొకటి సమాంతరంగా కదిలే కాలిఫోర్నియా ప్రాంతంలో ఉంది. 1960లో కాలిఫోర్నియాలో ఏర్పడిన తీవ్ర భూకంపానికి కారణం ఈ రెండు ఫలకాలు ఈ భ్రంశం వెంట ఒకదాంతో మరొకటి సమాంతరంగా కదలడమే. * ఈ ప్రాంతంలో వాణిజ్యపరంగా పనామా కాలువ అత్యంత ప్రధానమైంది. ఇది న్యూయార్క్‌ - శాన్‌ఫ్రాన్సిస్కో మధ్య ప్రయాణ మార్గాన్ని 12,640 కి.మీ. మేరకు తగ్గిస్తుంది.

బెర్ముడా ట్రయాంగిల్‌: ఉత్తర అట్లాంటిక్‌లోని బెర్ముడా దీవి (యూకే), ఫ్లోరిడా (యూఎస్‌ఏ), కరేబియన్‌ దీవుల్లోని పోర్టోరికా దీవుల మధ్య ఉన్న ఉత్తర అట్లాంటిక్‌ జలరాశినే బెర్ముడా ట్రయాంగిల్‌ అని పిలుస్తారు. ఈ ప్రాంతంలో దిక్సూచి సరిగా పనిచేయడం లేదని, ఈ ప్రాంతం ద్వారా ప్రయాణించే యుద్ధ విమానాలు, నౌకలు, అదృశ్యమవుతున్నాయని, ఇక్కడ అప్పుడప్పుడు మంటలు ఎగిసిపడుతుంటాయని పేర్కోవడం సర్వసాధారణం. అక్కడ మానవాతీత శక్తులున్నాయని, అందువల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయన్న ప్రచారం కూడా ఉంది. అయితే శాస్త్రవేత్తల ప్రకారం సముద్రజీవుల మృతదేహాల నుంచి మీథేన్‌ హైడ్రేట్‌ అనే వాయువు విడుదలై నీటిసాంద్రతను తగ్గిస్తుందని, ఆ సమయంలో అక్కడ ప్రయాణిస్తున్న ఓడలు, విమానాలు మునిగిపోతాయని పేర్కొంటారు. అంతేకాకుండా మీథేన్‌ వాయువుకు పేలుడు గుణం ఉందన్నారు.


రచయిత: జయకర్‌ సక్కరి  

Posted Date : 23-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌