• facebook
  • whatsapp
  • telegram

మృత్తికలు

భూమి ఉపరితలంపై కప్పి ఉన్న సన్నటి మట్టి పొరను ‘నేల’ లేదా ‘మృత్తిక’ అంటారు. ఇవి సేంద్రీయ పదార్థాలు, ఖనిజాలు, రూపాంతర శిలల వల్ల ఏర్పడతాయి. ఇది శిలాశైథిల్యం అనే ప్రక్రియ ద్వారా జరుగుతుంది.


శిలాశైథిల్యం: వాతావరణంలోని మార్పులు; జంతువులు, మొక్కలు, మానవ చర్యల ఫలితంగా రాళ్లు బలహీనమై పగిలిపోయి మట్టిగా మారతాయి. ఈ ప్రక్రియనే శిలాశైథిల్యం అంటారు.


మృత్తికలు ఏర్పడటానికి ప్రధాన కారణాలు

నేలలు ఏర్పడటానికి ప్రధాన కారకాలు మాతృ శిలల స్వభావం, వాతావరణం. స్థలాకృతి, సేంద్రీయ పదార్థం, నేల ఏర్పడటానికి పట్టిన సమయం మొదలైనవి ఇతర కారకాలు.

మాతృశిల: మృత్తికలకు రంగు, రూపం, రసాయన లక్షణాలు, ఖనిజ పదార్థాలు మాతృశిల నుంచి వస్తాయి.

ఉదా: పురాతన స్పటికాకార, రూపాంతర శిలల శైథిల్యం వల్ల ఎర్ర మృత్తికలు ఏర్పడతాయి.

* దక్కన్‌ నాపరాయి ఉన్న ప్రాంతాల్లో నల్లరేగడి మృత్తికలు ఏర్పడతాయి.

* టెర్షరీ శిలలు ఉన్నచోట పర్వత మృత్తికలు ఏర్పడతాయి.

భౌగోళిక స్వరూపం: భూమి భౌతిక స్వరూపం అనేక రకాల మృత్తికలను ప్రభావితం చేస్తుంది. వాటిలో ఎత్తు, వాలు, లోతు ప్రధానమైనవి.


* వాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో క్రమక్షయం అధికంగా ఉంటుంది.


* ఎత్తు ఎక్కువగా ఉన్న పశ్చిమ కనుమల ప్రాంతంలో విక్షాళన ప్రక్రియ వల్ల లేటరైట్‌ మృత్తికలు ఏర్పడ్డాయి.


* లోతుగా ఉన్న ఉత్తర భారతదేశ భూ అభినతిలో నిక్షేపణ వల్ల ఒండ్రు మృత్తికలు ఏర్పడ్డాయి. వీటిని భారతదేశ ధాన్యాగారాలుగా పిలుస్తారు.
   
మృత్తికా క్రమక్షయం

* భూ ఉపరితలంపై ఉండే సారవంతమైన మట్టి కొట్టుకుపోవడాన్ని మృత్తికా క్రమక్షయం అంటారు. దేశంలో ఏటా సుమారు 175 మిలియన్‌ హెక్టార్ల భూమి క్రమక్షయానికి గురవుతోంది.


* క్రమక్షయం కారణంగా మన దేశంలో ఏటా 6000 మిలియన్‌ టన్నులు, సరాసరి ప్రతి హెక్టారుకు 16.4 టన్నుల మృత్తికలను కోల్పోతున్నాం.


* మృత్తికా క్రమక్షయం వల్ల ఏటా సుమారు 30 నుంచి 50 టన్నుల పంటనష్టం వాటిల్లుతోంది. నదులు, జలాశయాలు ఏటా 1 నుంచి 2 శాతం తమ నీటి నిల్వ సామర్థ్యాన్ని కోల్పోతున్నాయి.


క్రమక్షయం - రకాలు

క్రమక్షయం ప్రధానంగా రెండు రకాల్లో జరుగుతుంది. 

అవి: 

1. జల క్రమక్షయం  

2. పవన క్రమక్షయం


జల క్రమక్షయం

వర్షం, భూ ఉపరితలంపై నీటి ప్రవాహం వల్ల మృత్తికలు ఉపరితలం నుంచి తొలగిపోతాయి. దీన్ని జలక్రమక్షయం అంటారు. ఇది 4 రకాలు. అవి

1) పట క్రమక్షయం

2) వంక క్రమక్షయం

3) అవనాళికా క్రమక్షయం

4) రిపేరియన్‌ క్రమక్షయం


పట క్రమక్షయం: కుండపోత వర్షం లేదా వరదల వల్ల విశాల ప్రాంతంలోని పైపొర కొట్టుకుపోతుంది. దీన్నే పట క్రమక్షయం అంటారు.


అధిక వర్షపాత ప్రాంతాలైన శివాలిక్‌ కొండలు, పశ్చిమ, తూర్పు కనుమలు, అసోం, ద్వీపకల్పంలోని ఈశాన్య ప్రాంతాల్లో పట క్రమక్షయం సర్వసాధారణం.


* దేశంలో 69 మిలియన్‌ హెక్టార్ల ఎర్ర మృత్తికలు, నల్లరేగడి నేలల్లో 67 మిలియన్‌ హెక్టార్లు పట క్రమక్షయానికి గురవుతున్నాయి.


వంక క్రమక్షయం: పట క్రమక్షయం కొనసాగితే మృత్తికల్లో చేతివేళ్ల ఆకారంలో అనేక గాడులు ఏర్పడతాయి. ఇలాంటి క్రమక్షయాన్ని వంక క్రమక్షయం అంటారు.


* బిహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తర్‌ ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో వంక క్రమక్షయం ఎక్కువగా జరుగుతుంది.


అవనాళికా క్రమక్షయం: వంక క్రమక్షయం తీవ్రస్థాయిలో జరిగి అతిపెద్ద, లోతైన గాడులు ఏర్పడటాన్ని అవనాళికా క్రమక్షయం అంటారు.


* చంబల్, సింధూ, యమునా, గంగా, మహి, నర్మదా నదీ పరీవాహక ప్రాంతాల్లో అవనాళికా క్రమక్షయం జరుగుతుంది.


* అవనాళిక క్రమక్షయం వల్ల ఏర్పడిన భూములను ‘కందర భూములు’ అంటారు. కందర భూములు ఎక్కువగా ఉత్తర్‌ ప్రదేశ్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఉన్నాయి.


రిపేరియన్‌ క్రమక్షయం: గంగా, కృష్ణ, గోదావరి లాంటి నదులు గట్లను కోసివేయడాన్ని రిపేరియన్‌ క్రమక్షయం అంటారు.


* ఏటా నదుల వల్ల 53.34 మిలియన్‌ హెక్టార్ల భూమి క్రమక్షయానికి గురవుతోంది.


జీవ సంబంధ కారకాలు: హ్యూమస్‌ రేటు మృత్తికలను ప్రభావితం చేస్తుంది. హ్యూమస్‌ వల్ల మృత్తికలు బాగా సారవంతమవుతాయి. దీనికి అనేక సూక్ష్మజీవులు తోడ్పడతాయి.


శీతోష్ణస్థితి/ వాతావరణం: ఉష్ణోగ్రత, వర్షపాతం మొదలైనవి శైథిల్యరేటును, హ్యూమస్‌ నిర్మాణాన్ని ప్రభావితం చేస్తాయి.


* శైథిల్యంతో పాటు జీవరాశుల మనుగడకు శీతోష్ణస్థితి అవసరం. ఇది మృత్తికల రకాలను కూడా ప్రభావితం చేస్తుంది.


ఉదా: స్పటికాకార గ్రానైట్‌ శిలలు ఉన్న రాజస్థాన్‌లో ఇసుక మృత్తికలు ఏర్పడితే, అవే శిలలు ఉన్న కర్ణాటక, కేరళ ప్రాంతాల్లోని ఉష్ణమండల ఆర్థ్ర ప్రాంతాల్లో లేటరైట్‌ మృత్తికలు ఏర్పడ్డాయి.


* అధిక వర్షపాతం ఉండే హిమాలయ సానువుల్లో ఊబి నేలలు (పీటీ నేలలు) ఏర్పడ్డాయి.


సమయం/కాలం: ఒక సెంటీమీటరు మృత్తిక తయారవ్వాలంటే కొన్ని వందల సంవత్సరాల సమయం పడుతుంది.


* నేల/ మృత్తిక పొర మందాన్ని కాలం నిర్ణయిస్తుంది.


* ఒక మీటరు మందం ఉన్న నేల ఏర్పడటానికి సుమారు 5000- 10,000 సంవత్సరాల సమయం పడుతుంది.


*వ్యవసాయానికి అనువుగా ఉండే లోతైన మృత్తికలు ఏర్పడటానికి సుమారు 3000 సంవత్సరాల సమయం పడుతుంది.


పవన క్రమక్షయం


* అధిక వేగంతో నిరంతరం వీచే గాలుల వల్ల అనార్థ్ర ప్రాంతాలు, తీర ప్రాంతాల్లో మృత్తిక క్రమక్షయం జరుగుతుంది.


వేగంగా వీచే గాలితో పాటు నిస్సార ఇసుక రేణువులు దొర్లుతూ ఇసుక దిబ్బలుగా పోగవుతాయి.


* మన దేశంలో పవన క్రమక్షయం రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, హరియణా రాష్ట్రాల్లో జరుగుతోంది.


* శుష్క పరిస్థితులు; మృత్తికలో తేమ, పచ్చదనం లేకపోవడం వల్ల పవన క్రమక్షయం జరుగుతుంది. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అంచనా ప్రకారం సుమారు మన దేశంలో 18.23 మిలియన్‌ హెక్లార్ల విస్తీర్ణంలో పవన క్రమక్షయం జరుగుతుంది.


 పవన క్రమక్షయ నియంత్రణ పద్ధతులు


* పవన  క్రమక్షయం, రవాణా వల్ల పరిసర ప్రాంతాల్లోని ఒండ్రు మృత్తికలు కూడా నష్టపోతున్నాయి. దీన్ని నియంత్రించడానికి సెంట్రల్‌ ఆరిడ్‌ జోన్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ కొన్ని ప్రతిపాదనలు చేసింది. వీటిలో ముఖ్యమైనవి చెట్లు, పొదలు, గడ్డి భూములను పెంచడం, కృత్రిమ అవరోధాలను నిర్మించడం. 


మృత్తిక క్రమక్షయ సంరక్షణ పద్ధతులు


కాంటూర్‌ బారియర్స్‌: భూ స్వరూప వాలుకు అనుగుణంగా కట్టలను నిర్మించడం. దీనివల్ల నీటి ప్రవాహ వేగం తగ్గి, క్రమక్షయం తగ్గుతుంది. నీలగిరి కొండల్లో ఆలుగడ్డలు సాగు చేస్తున్న ప్రాంతాల్లో ఒక హెక్టారుకు 39 అడుగుల చొప్పున సంవత్సరానికి క్రమక్షయం అవుతుంటే, కాంటూరు నిర్మాణాల తర్వాత అది 15 అడుగులకు తగ్గింది.


మల్చింగ్‌ (గడ్డి కప్పడం): మొక్కల మధ్య ఉండే ఖాళీ స్థలంలో సేంద్రీయ పదార్థాలతో నిండిన పొడవైన, గుండ్రటి గడ్డి కట్టలను ఉంచుతారు. ఇది నేలలోని తేమను పట్టి ఉంచుతుంది.


రాక్‌డ్యాం: కొండ పైభాగం నుంచి వచ్చే నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించేందుకు రాళ్లతో కట్టిన నిర్మాణాన్ని రాక్‌డ్యాం అంటారు. ఇది కొండ ప్రాంతాల్లో నష్ట తీవ్రతను తగ్గిస్తుంది.


సోపాన వ్యవసాయం (టెర్రస్‌ ఫార్మింగ్‌): ఏటవాలు ప్రాంతాల్లో వెడల్పుగా మెట్టు ఆకారంలో నేలను చదును చేసి, పంటలు పండిస్తారు. ఇది ఉపరితల నీటి ప్రవాహాన్ని, నేల కోతను తగ్గిస్తుంది.


అంతర పంటలు: ఈ విధానంలో భిన్న రకాల పంటలను ఒకేసారి వేర్వేరు వరుసల్లో సాగు చేస్తారు. నీటి ప్రవాహాల వల్ల నేల కొట్టుకుపోకుండా ఇది చేస్తుంది.


షెల్టర్‌ బెల్ట్స్‌: కోస్తా, పొడి వాతావరణ ప్రాంతాల్లో గాలుల ఉద్ధృతిని తగ్గించి, తద్వారా నేలల సంరక్షణ కోసం మొక్కలను వరుసగా గట్లపై పెంచుతారు.


*  ఖాళీగా ఉన్న బంజరు భూముల్లో సామాజిక అడవుల పెంపకాన్ని చేపట్టారు.


* పంట మార్పిడి పద్ధతులను అనుసరించడం లేదా పంట తర్వాత అదే భూమిలో గడ్డి సాగు చేస్తారు.


 

Posted Date : 02-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌