• facebook
  • whatsapp
  • telegram

ఆంధ్రప్రదేశ్‌ మృత్తికలు (నేలలు)

పీఠ‌భూమి జిల్లాల్లో స్వ‌యంసిద్ధ సాగు నేల‌లు!
 


 

అంతకంతకు పెరుగుతున్న దేశ జనాభాకు అవసరమైన ఆహారాన్ని అందించాలంటే పంటలు నిండుగా పండాలి. అప్పుడే ఉత్పత్తులు పెరిగి ఆహారభద్రత ఏర్పడుతుంది. అందుకోసం సారవంతమైన మృత్తికలు కావాలి. అలాంటి నేలలు ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఒకటి. ధాన్యం, వాణిజ్య పంటల సాగులో ఈ రాష్ట్రం ముందంజలో ఉందంటే అందుకు ఇక్కడి వైవిధ్యభరిత, సారవంతమైన నేలలే కారణం. అన్నపూర్ణగా ప్రసిద్ధికెక్కిన ఏపీలోని నేలల రకాలు, వాటి విస్తరణ తీరు, పండే పంటల గురించి పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. మృత్తికా క్రమక్షయం, రకాలు, వాటికి కారణాలు, వాటివల్ల కలిగే నష్టాలు, నివారణ చర్యల గురించి సమగ్రంగా తెలుసుకోవాలి.


   భూమి ఉపరితలంపై ఉండే సన్నటి మట్టి పొరను నేల అంటారు. సరైన మోతాదులో సేంద్రియ పదార్థాలు, ఖనిజాల కలయిక వల్ల సారవంతమైన నేలలు ఏర్పడతాయి. రాళ్లు విచ్ఛిన్నం కావడం, సేంద్రియ పదార్థాలు కుళ్లడం, జీవరాశులు, నీరు, గాలి లాంటి అంశాల కలయిక వల్ల ఏర్పడిన ఖనిజ సమ్మేళనంతో భూ ఉపరితలంపై ఉన్న పొరను మృత్తికగా పిలుస్తారు.

నేలలు ఏర్పడటానికి ప్రధాన కారకాలు: 1) మాతృశిల 2) శీతోష్ణస్థితి 3) భౌగోళిక స్వరూపం 4) జీవక్రియలు 5) కాలం


మాతృశిల: వాతావరణంలో మార్పులు, జంతువులు, మొక్కలు, మానవ చర్యల ఫలితంగా రాళ్లు బలహీనమై, పగిలిపోయి మట్టిగా మారే ప్రక్రియను శిలాశైథిల్యం అంటారు. మాతృశిల నుంచి వేరుపడిన శిథిల పదార్థ పరిమాణంపై మృత్తికల నిర్మాణం, రసాయన ఖనిజాల మిశ్రమం ఆధారపడుతుంది. అంతేకాకుండా మృత్తిక రంగు, రూపం, రసాయన లక్షణాలు, ఖనిజ పదార్థం అనేవి మాతృశిలపై ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు రూపాంతర శిలలు ఉన్నచోట ఎర్ర నేలలు; బసాల్ట్‌ శిలలు ఉన్నచోట నల్లరేగడి నేలలు; టెర్షియరీ శిలలు ఉన్నచోట పర్వత నేలలు ఏర్పడతాయి.


శీతోష్ణస్థితి: శీతోష్ణస్థితి అంశాలైన ఉష్ణోగ్రత, వర్షపాతాలు శిలాశైథిల్యాన్ని, హ్యూమస్‌ నిర్మాణాన్ని ప్రభావితం చేస్తాయి. భూమధ్యరేఖ ప్రాంతంలో ఎక్కువ వర్షపాతం వల్ల నేలలోని కాల్షియం, సోడియం, మెగ్నీషియం, పొటాషియం, సిలికా అనే మూలకాలు చాలా తక్కువగా ఉంటాయి. అధిక ఉష్ణోగ్రత ఉండి, అవపాతం కంటే బాష్పీభవనం ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో నేలలో లవణాలు నిక్షేపితమవుతాయి.


భౌగోళిక స్వరూపం: భూభాగం ఎత్తు, వాలు, లోతు అనేవి మృత్తిక ఏర్పాటును ప్రభావితం చేస్తాయి. ఎత్తు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో విక్షాళన (లీచింగ్‌) జరిగి లాటరైట్‌ మృత్తికలు ఏర్పడతాయి. వాలు అధికంగా ఉన్న ప్రదేశాల్లో క్రమక్షయం ఎక్కువగా జరిగి కంచర భూములు ఏర్పడే అవకాశముంది. లోతున్న ప్రాంతాల్లో అధికంగా నిక్షేపణ జరిగి ఒండ్రు మృత్తికలు ఏర్పడతాయి.


జీవక్రియలు: వీటి వల్ల నేలలో పలు దశల్లో జీవపదార్థం ద్వారా హ్యూమస్‌ అభివృద్ధి చెందుతుంది. సహజ వృక్షసంపద అధికంగా ఉండే ప్రాంతాల్లో హ్యూమస్‌ ఏర్పడుతుంది. పుష్కలమైన హ్యూమస్‌తో మృత్తికలు సారవంతంగా ఉంటాయి.


కాలం: ఒక సెంటీమీటరు మృత్తిక తయారుకావడానికి కొన్ని వందల ఏళ్లు పడుతుంది. కాలం నేల పొర మందాన్ని నిర్ణయిస్తుంది. వ్యవసాయానికి అనువైన మృత్తికలు ఏర్పడటానికి దాదాపుగా 3000 సంవత్సరాలు పడుతుంది.


మృత్తికలు - రకాలు: పురాతన కాలంలో నేలలను రెండు సమూహాలుగా వర్గీకరించారు. 


1) ఉర్వారా నేలలు: ఇవి సారవంతమైనవి. 


2) ఉసర నేలలు: ఇవి నిస్సారమైనవి.


క్రీ.శ. 16వ శతాబ్దంలో నేలలను వాటి సహజ లక్షణాలు, తేమ ఆధారంగా వర్గీకరించారు. పైపొర ఆధారంగా ఇసుక, మన్ను, సిల్టి, లోమ్‌ మృత్తికలుగా విభజించారు.


మృత్తికల ఆవిర్భావం, రంగు, నిర్మాణం ఆధారంగా దేశంలో నేలల వర్గీకరణ 


1) ఒండ్రు నేలలు - 5%  


2) నల్లరేగడి నేలలు - 25% 


3) ఎర్ర నేలలు - 65%  


4) లాటరైట్‌ నేలలు - 3% 


5) తీరప్రాంత ఇసుక నేలలు - 2% 


ఒండ్రు నేలలు: నదులు తీసుకొచ్చిన మెత్తని రేణువులను నిక్షేపించడం వల్ల ఈ నేలలు ఏర్పడతాయి. ఇవి లేత బూడిద రంగు నుంచి ముదురు బూడిద రంగులో ఉంటాయి. మన దేశంలో ఎక్కువ విస్తీర్ణంలో ఉండి అధిక వ్యవసాయ సంపదకు కారణమవుతున్నాయి. ఇవి అన్ని నేలల్లో కెల్లా అధిక సారవంతంగా ఉండి అన్ని పంటలకు అనుకూలంగా ఉంటాయి. ఇసుక, లోమ్, బంకమట్టితో కూడి ఉంటాయి. సాధారణంగా ఈ నేలల్లో ఫాస్ఫారిక్‌ ఆమ్లం, పొటాషియం సమృద్ధిగా; ఫాస్ఫరస్, నత్రజని కొరతగా ఉంటాయి. ఈ నేలలు ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి, కృష్ణా, వంశధార, పెన్నానది పరీవాహక ప్రాంతాల్లో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. రాష్ట్రంలో ముఖ్యంగా బాపట్ల, గుంటూరు, కృష్ణా, ఏలూరు, కాకినాడ, పశ్చిమగోదావరి, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి.


నల్లరేగడి నేలలు: అగ్నిశిలలైన గ్రానైట్, నీస్, బసాల్ట్‌ శిలలు శైథిల్యం చెందడం వల్ల ఇవి ఏర్పడ్డాయి. అంతర్జాతీయంగా వీటిని ‘ట్రోపికల్‌ చెర్నోజెమ్‌ నేలలు’ అంటారు. ఇవి సాధారణంగా బంకమన్ను ఎక్కువగా ఉండి తేమను కలిగి ఉంటాయి. వర్షాకాలం తడిసిపోయి జారుడు స్వభావంతో బంకగా మారుతాయి. వీటికి నిదానంగా తేమను పీల్చుకునే, పొగొట్టుకునే గుణం ఉండటం వల్ల ఈ నేలల్లో ఎక్కువకాలం తేమ ఉంటుంది. ఇవి ముదురు నలుపు నుంచి ఊదా రంగులో ఉంటాయి. వర్షాకాలం బంకగా, వేసవిలో పగుళ్లతో ఉంటాయి. అందువల్ల వీటిని ‘సెల్ఫ్‌ ప్లవింగ్‌ నేలలు అంటారు. ఇవి పత్తి పంటకు అనుకూలంగా ఉండటం వల్ల వీటిని నల్లటి పత్తి నేలలు అని కూడా పిలుస్తారు. రేగర్‌ నేలలు, ‘తనను తాను దున్నుకునే నేలలు’ లేదా ‘స్వయంసిద్ధ సాగునేలలు’ అని కూడా వీటికి పేరు. ఈ నేలల్లో పొటాషియం, మెగ్నీషియం, అల్యూమినియం పుష్కలంగా; ఫాస్ఫరస్, నైట్రోజన్‌ సేంద్రియ పదార్థం లోపించి ఉంటాయి. దేశంలో ప్రధానంగా దక్కన్‌ పీఠభూమిలో, ఏపీలో గుంటూరు, పల్నాడు, కర్నూలు, కడప, నంద్యాల జిల్లాల్లో అధికంగా విస్తరించి ఉన్నాయి. ఈ మృత్తికలు పత్తి, పొగాకు, మిరప, నూనెగింజలు, చెరకు పంటలకు అనుకూలం.


ఎర్ర నేలలు: ఈ నేలలు రూపాంతర శిలలు శైథిల్యం చెందడం వల్ల ఏర్పడ్డాయి. ఐరన్‌ ఆక్సైడ్‌ను కలిగి ఉండటం వల్ల ఎరుపు రంగులో ఉంటాయి. వీటిని చల్క నేలలు, దుబ్బ నేలలు అని కూడా అంటారు. ఇవి తేలికగా ఉంటాయి. వీటికి నీటిని గ్రహించే శక్తి అధికంగా ఉంటుంది. అయితే తక్కువ సారవంతమైనవి. నీటిపారుదల సదుపాయాలుండి, ఎరువులు ఎక్కువగా వినియోగిస్తే అధిక దిగుబడి సాధించవచ్చు. ఈ నేలల్లో నత్రజని, సేంద్రియ పదార్థాలు, ఫాస్ఫరస్‌ ఆమ్లం తక్కువగా; పొటాషియం, ఇనుము, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌లో భౌగోళికంగా ఇవి ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. పప్పుధాన్యాలు, నూనెగింజల సాగుకు అనుకూలం. వేరుశనగ పంటకు ఈ నేలలు అత్యంత అనుకూలం. ఆంధ్రప్రదేశ్‌లో నెల్లూరు, ప్రకాశం, అనంతపురం, చిత్తూరు, విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, సత్యసాయి జిల్లాల్లో అధికంగా విస్తరించి ఉన్నాయి. వీటిలో చల్కనేలలు రాయలసీయలో, దుబ్బ నేలలు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి.


లాటరైట్‌ నేలలు: అధిక ఉష్ణోగ్రత, వర్షపాతం ఉండే కొండ ప్రాంతాల్లో విక్షాళనం వల్ల భూమి పైపొరలోని ఐరన్‌ ఆక్సైడ్, సిలికా, అల్యూమినియం కొట్టుకుపోవడంతో ఈ నేలలు ఏర్పడ్డాయి. లాటర్‌ అనే లాటిన్‌ పదానికి ఇటుక అని అర్థం. ఈ నేలలను ఇటుకల నిర్మాణంలో ఉపయోగిస్తారు. ఈ నేలల్లో ఐరన్‌ ఆక్సైడ్, పొటాష్‌ పుష్కలంగా; సేంద్రియ పదార్థం, నత్రజని, ఫాస్ఫేట్, కాల్షియం తక్కువగా ఉంటాయి. ఈ నేలలు జీడిమామిడి, కాఫీ, తేయాకు, రబ్బరు, కొబ్బరి పంటలకు అనుకూలం. చిత్తూరు జిల్లాలోని సత్యవేడు, పుత్తూరు మండలాలు; తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాల్లోని కావలి, కోవూరు; తిరుపతి జిల్లాలోని గూడూరు, సూళ్లూరుపేట మండలాలు; శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి.


 


తీరప్రాంత ఇసుక నేలలు: ఇవి ఎక్కువగా శ్రీకాకుళం, నెల్లూరు, బాపట్ల, విజయనగరం జిల్లాల్లోని తీరప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. ఈ నేలల్లో తేమ, హ్యూమస్, సేంద్రియ పదార్థం తక్కువగా ఉంటాయి. సారం తక్కువగా ఉండే నేలలు. కొబ్బరి, రాగులు, సజ్జలు, మామిడి, జీడిమామిడి, వేరుశనగ పంటలు సాగు చేస్తారు. ఈ నేలల్లో ఇసుక శాతం ఎక్కువగా, బంకమట్టి శాతం తక్కువగా ఉంటుంది. ఇవి తీరం నుంచి 3 - 12 కి.మీ. వరకు వ్యాపించి ఉంటాయి.


మృత్తికా క్రమక్షయం: భూమి ఉపరితలంపై ఉండే మృత్తిక క్రమంగా కొట్టుకుపోవడాన్ని మృత్తికా క్రమక్షయం అంటారు.


కారణాలు:  1) అటవీ నిర్మూలన  


2) వర్షపునీటి ప్రవాహం  


3) వరదలు 


4) కొండచరియలు విరిగిపడటం 


5) రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల వినియోగం 


6) ప్రకృతి విపత్తులు


ప్రభావితం చేసే అంశాలు:

 1) భూ ఉపరితలం వాలు 


2) మృత్తిక పరిమాణం 


3) భూమి వినియోగ తీరు 


4) మృత్తిక నిర్మాణం 


5) అడవుల విస్తృతి 


6) మానవ కార్యకలాపాలు 


7) వర్షపాతం


మృత్తికా క్రమక్షయం - రకాలు: 


1) పట క్రమక్షయం: అసాధారణ వర్షం, వరదల వల్ల విశాల ప్రాంతంలోని పైపొర.. పొరలు పొరలుగా కొట్టుకుపోవడం. ఈ రకమైన క్రమక్షయం ఎర్రనేలలు, నల్లరేగడి నేలల్లో జరుగుతుంది.


2) వంక క్రమక్షయం: వర్షం వల్ల నేలలోని పైపొర చేతివేళ్ల ఆకారంలో కొట్టుకుపోవడాన్ని వంక క్రమక్షయం అంటారు.


3) అవనాళికా క్రమక్షయం: వంక క్రమక్షయం తీవ్రస్థాయిలో జరిగి అతిపెద్దవైన, లోతయిన గాడులు ఏర్పడటాన్ని అవనాళికా క్రమక్షయం అంటారు. ఈ విధంగా ఏర్పడిన వాటిని కందర భూములు అంటారు.


4) రిపేరియన్‌ క్రమక్షయం: నదుల గట్లు కోతకు గురికావడాన్ని రిపేరియన్‌ క్రమక్షయం అంటారు.


5) పవన క్రమక్షయం: శుష్కప్రాంతాల్లో అధికంగా వీచే గాలుల వల్ల మృత్తిక కొట్టుకుపోవడం. మృత్తికలో తేమ, పచ్చదనం లేకపోవడం వల్ల ఈ రకమైన క్రమక్షయం సంభవిస్తుంది.


నష్టాలు:

 * పోషకాలను నష్టపోవడం, ఫలితంగా వ్యవసాయ ఉత్పాదకత తగ్గిపోతుంది.


* అదనంగా రసాయనిక ఎరువులను వినియోగించాల్సి వస్తుంది.


* ఎడారీకరణ జరుగుతుంది.


* మృత్తికలో తేమ శాతం తగ్గిపోతుంది.


* జలాశయాల్లో పూడిక చేరి నీటి నిల్వ తగ్గిపోతుంది.


నియంత్రణ పద్ధతులు:


1) కాంటూర్‌ బారియర్స్‌: భూస్వరూపం వాలుకు అనుగుణంగా రాళ్లు, గడ్డి, మట్టితో వరుసగా కట్టలు కడతారు. ఈ కట్టలకు ముందు భాగంలో నీటిని సేకరించడం కోసం కందకాలు తవ్వుతారు. దీనివల్ల నీటి ప్రవాహ వేగం తగ్గుతుంది. దాంతో క్రమక్షయమూ తగ్గుతుంది.


2) అంతర పంటలు: ఇందులో భాగంగా భిన్నరకాల పంటలను ఒకేసారి వేర్వేరు వరుసల్లో సాగు చేస్తారు. ఈ విధానం నీటి ప్రవాహాలకు నేల కొట్టుకుపోకుండా కాపాడుతుంది.


3) మల్చింగ్‌: మొక్కల మధ్య ఖాళీ స్థలంలో సేంద్రియ పదార్థాలతో నిండిన పొడవైన గుండ్రని కట్టలా ఉంటుంది. అది నేలలోని తేమను పట్టి ఉంచుతుంది.


4) రాక్‌డ్యామ్‌: పర్వత/కొండ పైభాగం నుంచి వచ్చే నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించడానికి రాళ్లతో కూడిన ఆనకట్ట నిర్మించడం. ఈ నిర్మాణం మృత్తికా క్రమక్షయాన్ని తగ్గిస్తుంది.


5) టెర్రస్‌ ఫార్మింగ్‌: ఏటవాలు ప్రాంతాల్లో వెడల్పైన మెట్టు ఆకారంలో నేలను చదును చేసి పంటలు పండిస్తారు. ఇది ఉపరితల నీటి ప్రవాహాన్ని, నేలకోతను నివారిస్తుంది.


6) షెల్డర్‌ బెడ్స్‌: కోస్తా, పొడి(శుష్క) ప్రాంతాల్లో గాలుల ఉద్ధృతిని తగ్గించి, తద్వారా నేలల సంరక్షణ కోసం మొక్కలను వరుసగా గట్లపై పెంచుతారు.


7) పశువుల మేపడాన్ని నియంత్రించడం.


8) పోడు వ్యవసాయాన్ని నియంత్రించడం.


9) పంటమార్పిడి పద్ధతులు అనుసరించడం.


మాదిరి ప్రశ్నలు

1) ఆంధ్రప్రదేశ్‌లో అధిక విస్తీర్ణంలో విస్తరించిన నేలలు-

1) ఒండ్రు నేలలు     2) ఎర్ర నేలలు

3) నల్లరేగడి నేలలు    4) లాటరైట్‌ నేలలు

2. ‘స్వయంసిద్ధ సాగునేలలు’ అని వేటిని పిలుస్తారు?

1) ఒండ్రు నేలలు        2) ఎర్ర నేలలు 

3) నల్లరేగడి నేలలు      4) లాటరైట్‌ నేలలు 

3) నేలల రంగు, రూపం, రసాయన లక్షణాలను ప్రభావితం చేసే కారకం- 

1) శీతోష్ణస్థితి     2) మాతృశిల

3) కాలం     4) భౌగోళిక స్వరూపం

 4. పత్తి పంటకు అనుకూలమైన నేలలు- 

1) నల్లరేగడి నేలలు    2) ఒండ్రు నేలలు

3) ఎర్ర నేలలు     4) లాటరైట్‌ నేలలు

5. ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతాల్లో అధికంగా విస్తరించి ఉన్న నేలలు 

1) ఒండ్రు నేలలు      2) ఎర్ర నేలలు

3) నల్లరేగడి నేలలు     4) లాటరైట్‌ నేలలు 

6. కోస్తా, పొడి ప్రాంతాల్లో గాలుల ఉద్ధృతిని తగ్గించడానికి గట్లపై మొక్కలు పెంచే నేల సంరక్షణ పద్ధతి-

1) మల్చింగ్‌    2) కాంటూర్‌ బారియర్స్‌ 

3) షెల్టర్‌ బెడ్స్‌    4) రాక్‌డ్యామ్‌

7. కాంటూర్‌ బారియర్స్‌ ఏ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు?

1) మైదాన   2) శుష్క  

3) తీర    4) కొండవాలు

8. పప్పుధాన్యాలు, నూనె గింజలు ఏ నేలల్లో అధికంగా పండుతాయి? 

1) ఎర్ర నేలలు     2) ఒండ్రు నేలలు

3) లాటరైట్‌ నేలలు     4) తీరప్రాంత ఇసుక నేలలు 

9. ఒండ్రు నేలల్లో ఏ పదార్థం లోపిస్తుంది?

1) మెగ్నీషియం, ఫాస్ఫరస్‌     2) అల్యూమినియం, కాల్షియం

3) ఫాస్ఫరస్, నత్రజని     4) పొటాష్, మెగ్నీషియం

10. అధిక ఉష్ణోగ్రత, వర్షపాతం ఉండే కొండ ప్రాంతాల్లో విక్షాళనం వల్ల ఏర్పడే నేలలు?

1) నల్లరేగడి నేలలు    2) ఎర్ర నేలలు

3) లాటరైట్‌ నేలలు     4) ఒండ్రు నేలలు  


సమాధానాలు: 1-1, 2-3, 3-2, 4-1, 5-1, 6-3, 7-4, 8-1, 9-3, 10-3.

 

 

రచయిత: దంపూరు శ్రీనివాస్‌

Posted Date : 18-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌