• facebook
  • whatsapp
  • telegram

హర్షవర్ధనుడి పాలనా విధానం

* రాచరిక వ్యవస్థలో ‘రాజే’ సర్వాధికారి. రాచరికం వంశపారంపర్యంగా ఉండేది. ప్రజలు రాజును దైవాంశ సంభూతుడిగా భావించేవారు. రాజు నిరంకుశుడిగా ఉన్నప్పటికీ ప్రజాసంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చేవాడు.

* హర్షుడు ‘హర్షదేవ’ అనే బిరుదును తన నాణేలపై ముద్రించాడు. రాజ్యంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని పర్యవేక్షించడానికి, ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు హర్షుడు మారువేషంలో పర్యటించేవాడని హుయాన్‌త్సాంగ్‌ తన రచనల్లో పేర్కొన్నాడు.

* హర్షుడికి రాజపుత్ర, శిలాదిత్య, పరమభట్టారక, మహారాజాధిరాజ అనే బిరుదులు ఉన్నాయి.

పరిపాలనా వ్యవస్థలో రాజు కేంద్రస్థానంలో ఉన్నప్పటికీ అధికారాలను వికేంద్రీకరించి మంత్రులు, రాజోద్యోగులకు ఇచ్చేవాడు. మొత్తం పాలన రాజు పేరిట జరిగేది. అయితే మౌర్యుల కాలం నాటి కేంద్రీకృతపాలనా వ్యవస్థ హర్షుడి కాలంలో లేదని ‘రొమిల్లా థాపర్‌’ అభిప్రాయపడ్డారు.

మంత్రిపరిషత్తు 

*పాలనా వ్యవహారాల్లో రాజుకు సహాయం చేసేందుకు మంత్రి పరిషత్తు ఉండేది. విజ్ఞులు, అనుభవజ్ఞులు, ప్రజాహిత అభిలాషులు, సజ్జనులు, అన్ని విధాలా యోగ్యులైన వారిని మంత్రులుగా నియమించేవారు. ఇందులో 820 మంది సభ్యులు ఉండేవారు.

* మంత్రి పరిషత్తుకు విశిష్ట అధికారాలతో పాటు పాలనలో ఉన్నతమైన స్థానం ఉండేది. వారసత్వాన్ని నిర్ణయించే అధికారం దీనికి ఉండేది. 


ఉద్యోగస్వామ్యం 

* హర్షుడికి వివిధ పాలనా అంశాల్లో సహకరించడానికి ఉన్నత ఉద్యోగ వ్యవస్థ ఉండేది. వివిధ శాసనాల్లో, హర్ష చరిత్రలో వీరి ప్రస్తావన ఉంది. 

* మహాబలాధికృత (సైన్యాధిపతి), భాండాగారాధికృత (కోశాధికారి), మహాసంధి విగ్రహాధికృత (యుద్ధ వ్యవహారాల మంత్రి), రాజస్థానీయ (విదేశీ వ్యవహారాలు), మహాప్రతిహార (రాజాంతఃపుర పర్యవేక్షకుడు), మహాక్ష పాతలిక (ప్రభుత్వ పత్ర రచన, సంరక్షణ చేసేవాడు), కూటక (న్యాయశాఖాధికారి) మొదలైనవారు ఉన్నత ఉద్యోగులుగా ఉండేవారు. 

* కింది తరగతి ఉద్యోగుల్లో దివిరపతి (ప్రధాన గుమస్తా), లేఖక, ఆయుక్తక, సర్వఘట (వార్తలను చేరవేసేవాడు), మీమాంస, దూతక మొదలైనవారు ఉండేవారు.

మండల వ్యవస్థ 

*హర్షుడి కాలంలో రాజ్యం ‘మండల వ్యవస్థ’గా ఉండేది. ఒక రాజ్యానికి దగ్గరగా, దూరంగా, చుట్టుపక్కల, ఇరుగుపొరుగు రాజ్యాలతో ఏర్పడిన విస్తృతమైన మండలాన్నే ‘మండల వ్యవస్థ’గా పేర్కొంటారు. ఇది భౌగోళిక ప్రాతిపదికపై ఏర్పడింది. 

*ఈ మండలంలో కేంద్ర భాగం ‘రాజు’ కాగా, అతడి చుట్టూ ఏర్పడిన వలయంలో మరో 12 మంది రాజులు ఉంటారని కౌటిల్యుడు పేర్కొన్నాడు. 

* ఈ 12 మంది రాజులు పరస్పర అంతర్‌రాజ్యసంబంధాల్లో అర్థశాస్త్రంలో పేర్కొన్న విధానాలను పాటించారని కామందకుడు తన నీతిసారంలో పేర్కొన్నాడు. 

* వీరి మధ్య సంబంధాలు సంధి (శాంతి కోసం ఒప్పందాలు), విగ్రహ (యుద్ధం), అసన (తటస్థం), యాన (అకస్మాత్తుగా దండెత్తడం), సంశ్రయ (ఆశ్రయాన్ని కోరడం), లాంటి అంశాలతో ముడిపడి ఉండేవి. 

* వీరి మధ్య అవగాహన కూడా ఉండేది. అయితే కాలక్రమేణా ఇందులో రాజకీయ అనైక్యత ఏర్పడి, హర్షుడి తర్వాత రాజ్యం చిన్న భాగాలుగా విడిపోయింది.

న్యాయపాలన 

* ఆ కాలంలో రాజే సర్వోన్నత న్యాయాధికారి. న్యాయపాలనలో మూఢనమ్మకాలు ఉండేవి. దివ్య పరీక్షల ద్వారా న్యాయ నిరూపణ జరిగేది. 

*శిక్షలు కఠినంగా ఉండేవి. మరణశిక్షలు లేవు. జరిమానాలు విధించేవారు. 

*హర్షుడి సామ్రాజ్యంలో శాంతిభద్రతలు కొరవడి, దొంగతనాలు ఎక్కువగా జరిగేవని హుయాన్‌త్సాంగ్‌ తన రచనల్లో పేర్కొన్నాడు.

*దేశద్రోహం తర్వాత దోపిడీని పెద్ద నేరంగా పరిగణించేవారు. దొంగలకు శిక్షగా కుడి చేతిని నరికేవారు. జీవితఖైదు లాంటి శిక్షలు ఉండేవి. 

* ఆనాటి న్యాయస్థానాలను అధికరణ, ధర్మ అధికరణ అని పిలిచేవారు.  న్యాయాధికారులను ‘ప్రాఢ్వివాకులు’ లేదా ‘ధర్మాధ్యక్ష’ అనేవారు. న్యాయస్థానాల్లో జరిగే కార్యక్రమాన్ని ‘వ్యవహార’ అని పేర్కొనేవారు. 

*న్యాయ వ్యవహారానికి ధర్మ, వ్యవహార, చరిత్ర, రాజ శాసనాలు అనే నాలుగు ప్రధాన అంగాలు ఉండేవి. 

* న్యాయవ్యవహారంలో వాది, ప్రతివాది, నేర నిరూపణ, నిర్ణయం అనే నాలుగు దశలు ఉండేవి. 

*దండిక, దండపాసిక, దండి, చౌర, ఔద్ధరాణిక, చారజట మొదలైన పేర్లు పోలీసు వ్యవస్థలో ఉండేవి.


మహాయాన పరిషత్తు

*హర్షుడు క్రీ.శ.643లో హుయాన్‌త్సాంగ్‌ అధ్యక్షతన కనౌజ్‌లో మహాయాన పరిషత్తును నిర్వహించాడు. దీనికి 18 మంది సామంత రాజు లు, 3000 మంది బ్రాహ్మణులు, 3000 మంది బౌద్ధ భిక్షువులు, 3000 మంది నిగ్రోధులు, నలందా బౌద్ధ సంఘారామం నుంచి 1000 మంది బౌద్ధ పండితులు హాజరయ్యారు. 

*హర్షుడు కనౌజ్‌లో పెద్ద గోపురాన్ని నిర్మించి, అందులో నిలువెత్తు బంగారు బుద్ధ ప్రతిమను ప్రతిష్ఠించాడు. 

మహామోక్ష పరిషత్తు

* హర్షుడు ప్రతి అయిదేళ్లకోసారి ‘ప్రయాగ’ దగ్గర మహామోక్ష పరిషత్తును నిర్వహించేవాడని హుయాన్‌త్సాంగ్‌ తన రచనల్లో రాశాడు. క్రీ.శ. 643లో జరిగిన మహామోక్ష పరిషత్తు ఆరోది. 

*అయిదేళ్లపాటు సంపాదించిన మొత్తమంతా దానం చేసి, హర్షుడు కట్టుబట్టలతో కనౌజ్‌ చేరేవాడని హుయాన్‌త్సాంగ్‌ పేర్కొన్నాడు. 

*ఈ సమావేశాలు 90 రోజులపాటు జరిగేవి. మొదటిరోజు బుద్ధుడ్ని, రెండో రోజు సూర్యుడ్ని, మూడోరోజు శివుడ్ని ప్రతిష్ఠించేవారు. ప్రతిరోజు పేదలకు, బ్రాహ్మణులకు, బౌద్ధ భిక్షువులకు అనేక రకాల దానాలు చేసేవారు.

* అయిదేళ్ల సంపద దానం రూపంలో ఖర్చుచేసినా, మళ్లీ ప్రజలు చెల్లించే పన్నుల రూపంలో ఖజానాకు ధనం చేరేదని చరిత్రకారులు పేర్కొన్నారు. వారు హర్షుడ్ని అశోకుడితో పోల్చారు.

రాష్ట్ర - గ్రామ పాలన 

*పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని భుక్తులు (రాష్ట్రాలు)గా విభజించారు. మళ్లీ దీన్ని ‘విషయాలు’, ‘గ్రామాలు’గా వర్గీకరించారు. 

* భుక్తికి ‘భోగపతి’ లేదా ‘ఉపరిక మహారాజు’; రాష్ట్రానికి రాజస్థానీయుడు; విషయానికి ‘విషయపతి’; గ్రామానికి ‘కరణికుడు’ అధికారులుగా ఉండేవారు. హర్షుడు వేయించిన బన్సీఖేరా, మధుబన్‌ శాసనాల్లో వీటి ప్రస్తావన ఉంది. 

* విషయపతికి సలహాలు ఇచ్చేందుకు ‘విషయమహత్తరసభ’ ఉండేది. ఇందులో సార్థవాహ, నగరశ్రేష్ఠి, ప్రథమకులిక, స్థానిక మొదలైన ఉద్యోగులు సభ్యులుగా ఉండేవారు. వీరు రాష్ట్ర-గ్రామ పాలనలో రాజుకు సహాయపడేవారు.

* ముఖ్య పట్టణాలకు ‘అధిష్టాన’ అనే పురపాలక సంఘం ఉండేది. ఇందులో 20 మంది సభ్యులు ఉండేవారు.

* ఉద్యోగులకు జీతాలు ధన, ధాన్యరూపంలో చెల్లించేవారు. భూములను ప్రతిఫలంగా ఇవ్వడం ఉండేది. విద్యాకేంద్రాలు, మతసంస్థలకు ఎక్కువ భూములు ఉండేవి. ఇది భూస్వామ్య వ్యవస్థకు దోహదం చేసింది. దీని వల్ల సామాజిక అంతరాలు పెరిగాయి.


సైనిక పాలన 

* హర్షుడి సైన్యంలో 60,000 ఏనుగులు, 50,000 అశ్వదళం, లక్ష కాల్బలం ఉండేదని బాణుడు పేర్కొన్నాడు. 

* సైన్యానికి రాజే సర్వాధికారి. సేనాపతి సైనిక కార్యకలాపాలు నిర్వహించేవాడు. సర్వసైన్యాధిపతిగా ‘మహాబలాధికృత’ అనే అధికారి ఉండేవాడు. 

* సైన్యంలో శాశ్వత సైనికులను ‘చాతులు’, తాత్కాలిక సైనికులను ‘భటులు’ అనేవారు. అశ్వదళాధిపతిని ‘కుంతల’ లేదా ‘బృహదాశ్వవారు’ అని పేర్కొనేవారు. పదాతి సైనిక స్కంధావార పర్యవేక్షకులను ‘పాతి’ లేదా ‘పాతిపతి’గా వ్యవహరించేవారు. సైన్యం, రక్షకభట వర్గం వేర్వేరు అధికారుల కింద పనిచేసేవి.


రెవెన్యూ పాలన (లేదా) ఆదాయవ్యయాలు

* రాజ్యానికి ప్రధాన ఆదాయం భూమిశిస్తు. పన్నులు, సామంతులు కట్టే కప్పాలు, రాచభూములపై వచ్చే మొత్తం, కానుకల వల్ల ప్రభుత్వానికి అధిక ఆదాయం సమకూరేది. పన్నులను ధన, ధాన్య రూపంలో చెల్లిచేవారు. 

* ధాన్య రూపంలో చెల్లించే పన్నును ‘భాగ’ అని, ధనంగా ఇచ్చేవాటిని ‘హిరణ్య’ అనేవారు. ఇది పంటలో 1/6 వంతుగా ఉండేది. 

* అమ్మకం పన్నును ‘తుల్యమేయ’ అంటారు. 

* పన్ను వసూలుకు భోగపతి, చెల్మిక, గౌల్మిక అనే ఉద్యోగులు ఉండేవారు. పురోహితులకు పన్ను రాయితీ ఉండేది.

* హర్షుడి కాలంలో ప్రభుత్వ ఆదాయాన్ని నాలుగు భాగాలుగా విభజించినట్లు  హుయాన్‌త్సాంగ్‌ తన రచనల్లో పేర్కొన్నాడు. మొదటి భాగాన్ని రాజు కోసం, రెండోదాన్ని పండిత పోషణకు, మూడోభాగాన్ని ఉద్యోగ వర్గంపై, నాలుగోదాన్ని మత కార్యకలాపాలకు ఖర్చు చేసేవారు. ప్రభుత్వ ఆదాయంలో 18 రకాల పన్నులు ఉండేవి.


మత విధానం

* హర్షుడిని బన్సీఖేరా, మధుబన్‌ శాసనాల్లో ‘పరమ మహేశ్వరుడి’గా కీర్తించారు. దీంతో అతడు శైవ మతాన్ని అనుసరించినట్లు తెలుస్తోంది. చివరి దశలో అతడి సోదరి రాజ్యశ్రీ, హుయాన్‌త్సాంగ్‌ ప్రభావం వల్ల బౌద్ధమతాన్ని స్వీకరించినట్లు కొందరు చరిత్రకారులు పేర్కొన్నారు.

* హర్షుడు ఎన్నో బౌద్ధరామాలు, స్తూపాలు, చైత్యాలు కట్టించాడు. జంతువధను నిషేధించాడు. బౌద్ధ బిక్షువులకు, సంఘాలకు దానధర్మాలు చేశాడు. 

* ఇతడు ‘మహాయాన పరిషత్తును’ నిర్వహించాడు. 


మాదిరి ప్రశ్నలు

1. ‘ఆక్స్‌ఫర్డ్‌ ఆఫ్‌ ఇండియా’గా కింది ఏ విశ్వవిద్యాలయాన్ని పేర్కొంటారు?

1) నాగార్జున    2) విక్రమశిల    3) తక్షశిల     4) నలంద 

జ: నలంద


2. హర్షుడు మహామోక్ష పరిషత్తును ఎక్కడ నిర్వహించాడు?

1)కనౌజ్‌      2) ప్రయాగ      3) కశ్మీర్‌     4) పాటలీపుత్రం

జ: ప్రయాగ      


3. హర్షుడి ఆస్థానంలోని కవులు?

1)బాణుడు     2) మయూరుడు      3) మాతంగ దివాకరుడు    4) పైవారంతా

జ​​​​​​​: పైవారంతా    


4. ‘ధర్మగంజ్‌’ అనే గ్రంథాలయం కింది ఏ విశ్వవిద్యాలయంలో ఉండేది?

1) తక్షశిల     2) నలంద     3)వల్లభి    4) ఉద్ధంతపురి

జ​​​​​​​:నలంద

Posted Date : 23-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌