• facebook
  • whatsapp
  • telegram

మానవాభివృద్ధి సూచిక 

సమ్మిళిత వృద్ధిపై శాస్త్రీయ అంచనా! 

భారతదేశం సమ్మిళిత వృద్ధి కోసం కృషి చేస్తోంది. ఆర్థిక, సామాజిక అసమానతలను తగ్గించడానికి ప్రయత్నిస్తోంది. అది సరిగా సాగాలంటే జనాభాలో ఆదాయాల పంపిణీ, విద్య, ఆరోగ్యం తీరుతెన్నులు తెలియాలి. అందుకోసం మానవాభివృద్ధి సూచీ సాయపడుతుంది. అది ఒక దేశ వాస్తవ ప్రగతిని, అక్కడి జనాభా నాణ్యతను శాస్త్రీయంగా వివరిస్తుంది. జనాభా పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద దేశమైన భారత్‌లో ఆ సూచిక స్థాయి, గమనం, మార్పుల గురించి అభ్యర్థులు తెలుసుకోవాలి. మానవాభివృద్ధి సూచిక మూలాలు, జనాభా పరిణామ దశలు, దేశంలో జనాభా లెక్కల విశేషాలు, వివిధ దేశాలతో పోల్చినప్పుడు వెల్లడయ్యే ఆసక్తికర అంశాలు, సంబంధిత గణాంకాలను వివరణాత్మకంగా అర్థం చేసుకోవాలి.

మానవాభివృద్ధిని సంక్షిప్తంగా కొలిచే సాధనమే  మానవాభివృద్ధి సూచిక (HDI-Human Development Index)ఈ పదాన్ని 1990లో ఐక్యరాజ్యసమితికి చెందిన యూఎన్‌డీపీ సంస్థ రూపొందించింది. ప్రపంచ దేశాల మానవాభివృద్ధి స్థాయులను తెలిపే నివేదికను ఏటా ఇది విడుదల చేస్తుంది. పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త మహబూబ్‌ ఉల్‌ హక్‌ మూడు అంశాల ఆధారంగా ఈ సూచీని రూపొందించారు.

HDI = (తలసరి ఆదాయం + ఆయుర్దాయం + అక్షరాస్యత)/3

* పాయింట్ల గరిష్ఠ విలువ ‘+1’, కనిష్ఠ విలువ ‘0’.

* పాయింట్ల ఆధారంగా దేశాలను 4 రకాలుగా వర్గీకరించారు.

1) 0.800 అంతకంటే అధికం - అత్యధిక హెచ్‌డీఐ (అభివృద్ధి చెందిన దేశాలు)

2) 0.799 నుంచి 0.700 - అధిక హెచ్‌డీఐ ఉన్న దేశాలు (వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు)

3) 0.699 నుంచి 0.550 మధ్యస్థ హెచ్‌డీఐ ఉన్న దేశాలు (తక్కువ అభివృద్ధిని సాధిస్తున్న దేశాలు)

4) 0.550 కంటే తక్కువ - అల్ప హెచ్‌డీఐ ఉన్న దేశాలు (పేద దేశాలు)

ఉదా: 2020లో భారత్‌ పాయింట్లు 0.633 కాగా, ర్యాంకు 132/191. (మధ్యస్థ హెచ్‌డీఐ ఉన్న దేశం)

సామాజిక చైతన్యానికి ‘మానవాభివృద్ధి’ కీలకం. 2020, 2021లో కొవిడ్‌-19 మహమ్మారి చూపిన ప్రభావం, 2022లో రష్యా - ఉక్రెయిన్‌ ఘర్షణ, ఆ తర్వాత ఎదురైన సవాళ్లు.. భారతదేశం, ప్రపంచ అభివృద్ధి పథంపై ప్రభావం చూపాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా మానవాభివృద్ధి క్షీణించింది. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం నివేదిక ప్రకారం, 2020 లేదా 2021లో 90% దేశాలు తమ మానవ అభివృద్ధి సూచిక 6 విలువలతో రెండేళ్ల తగ్గింపును నమోదు చేశాయి. ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా గత 32 సంవత్సరాల్లో మొదటిసారి మానవ అభివృద్ధి నిలిచిపోయిందని సూచిస్తుంది. 2021/2022 హెచ్‌డీఐ నివేదికలో 191 దేశాలు, భూభాగాల్లో భారతదేశం 132వ స్థానంలో నిలిచింది. 2021లో భారత్‌ హెచ్‌డీఐ విలువ 0.633. ఇది 2019లో ఉన్న విలువ 0.645 కంటే తక్కువ. భారతదేశం హెచ్‌డీఐ విలువ దక్షిణాసియా సగటు (8) మానవ జనాభాను మించిపోతోంది. సార్వత్రిక ఆరోగ్యం, విద్యను నిర్ధారించడంతో పాటు సామాజిక, మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఇది 1990 నుంచి క్రమంగా పెరుగుతూ ప్రపంచ సగటు వైపు కదులుతోంది.

* హెచ్‌డీఐ 2021 నివేదిక ప్రకారం సగటు భారతీయుడి ఆయుర్దాయం 67.2 సంవత్సరాలు. ప్రపంచ సగటు ఆయుర్దాయం 71.4 ఏళ్లు.

* సార్క్‌ కూటమిలో అత్యధిక హెచ్‌డీఐ ఉన్న దేశం శ్రీలంక. తర్వాత స్థానంలో భూటాన్, బంగ్లాదేశ్‌ ఉండగా, భారత్‌ నాలుగో స్థానంలో నిలిచింది. తక్కువ హెచ్‌డీఐ ఉన్న దేశం అఫ్గానిస్థాన్‌.

* బ్రిక్స్‌ కూటమిలో అత్యధిక హెచ్‌డీఐ కలిగిన దేశం రష్యా కాగా చివరి స్థానంలో ఉన్న దేశం భారత్‌.

* ఆసియాలో అధిక హెచ్‌డీఐ ఉన్న దేశం హాంకాంగ్‌.

* 2021 హెచ్‌డీఐ ర్యాంకింగ్‌ ప్రకారం మన దేశంలో రాష్ట్రాలవారీగా చూస్తే 0.630 పాయింట్లతో ఆంధ్రప్రదేశ్‌ 24వ స్థానంలో ఉంది.

జనాభా పరివర్తన సిద్ధాంతాలు: దేశంలో నియమిత కాలవ్యవధిలో జనాభా పరిణామంలో వచ్చే మార్పునే ‘జనాభా పరివర్తనం లేదా జనాభా పరిణామం’ అని పిలుస్తారు. జనాభా పరివర్తనకు సంబంధించి అనేకమంది జనాభా సిద్ధాంతకారులు పలు సిద్ధాంతాలను రూపొందించారు. ఇందులో మాక్స్‌ అనే జనాభా శాస్త్రవేత్త అధిక జనన, మరణ రేటు ఉన్న, నిలకడతో కూడిన జనాభా దశ నుంచి అల్ప జనన, అల్ప మరణ రేటు కలిగిన జనాభా దశకు మారే నిలకడతో కూడిన జనాభా పరిమాణంలో వచ్చే మార్పు గురించి వివరించారు. దీనికి సంబంధించి మాక్స్‌ ‘జనాభా పరివర్తనం’ను నాలుగు దశలుగా విభజించారు.

ఒకటో దశ: అల్ప ఆర్థికాభివృద్ధి దేశాల్లో జనన, మరణ రేట్లు అధికంగా ఉంటాయి. జనాభా వృద్ధి రేటు తక్కువగా ఉండి, జనాభా పెరుగుదల స్థిరంగా ఉంటుంది. అందుకు పలు కారణాలు ఉన్నాయి. 

* వ్యవసాయ ఆధిక్యత, తక్కువ తలసరి ఆదాయం, అల్పజీవన ప్రమాణం, పౌష్టికాహార కొరత, ఆరోగ్య సదుపాయాల కొరత, ప్రాణాంతక వ్యాధులకు నివారణ లేకపోవడం, అధిక శిశు మరణరేటు లాంటి కారణాల వల్ల మరణ రేటు అధికంగా ఉంటుంది.

* బాల్య వివాహాలు, నిరక్షరాస్యత, కుటుంబ నియంత్రణ సాధనాలపై అవగాహన లేకపోవడంతో జననాలు అధికంగా ఉంటాయి. 1921కి పూర్వం భారత్‌ ఈ దశలో ఉంది.

రెండో దశ: నిలకడతో కూడిన అధిక జనన రేటు, వేగంగా మరణాల రేటు తగ్గడం, సత్వర జనాభావృద్ధి ఉంటుంది.

కారణం: తలసరి ఆదాయం, జీవన ప్రమాణాలు, పౌష్టికాహార లభ్యత పెరగడంతో మరణాల రేటు వేగంగా తగ్గుతుంది. అంటువ్యాధుల నివారణ, వైద్యసదుపాయాల కల్పన, మరణాల రేటు తగ్గడానికి దోహదపడుతుంది. ఫలితంగా జనన, మరణాల మధ్య వ్యత్యాసం ఎక్కువై జనాభా విజృంభణ లేదా జనాభా విస్ఫోటానికి దారితీస్తుంది. 1921 తర్వాత భారత్‌ ఈ దశలోకి ప్రవేశించింది.

మూడో దశ: జనన రేటు తగ్గుతూ, మరణ రేటు దాదాపు నిలకడ స్థితికి వచ్చి, జనాభా స్థిరీకరణ ప్రారంభమవుతుంది.

కారణం: ఈ దశలో సమాజంలోని కుటుంబాలకు సంతానం ఒక భాగంగా పరిగణించడం వల్ల, సంవర్గ వయోవర్గాల వారి జనాభా ఎక్కువగా ఉంటుంది. వేగవంతమైన పారిశ్రామికీకరణ జరిగి ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయి. ప్రస్తుతం భారతదేశం ఈ దశలో ఉండగా, అనేక అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పటికే ఈ దశకు చేసుకున్నాయి.

నాలుగో దశ: తక్కువ జనన, మరణ రేటు, అల్పస్థాయిలో నిలకడ జనాభా ఈ దశలో కనిపిస్తుంది.

కారణం: ఉచ్ఛ స్థితికి చేరిన సామాజిక, ఆర్థికాభివృద్ధి; వేగవంతమైన పట్టణీకరణ జరుగుతుంది. జపాన్, రష్యాలు ఈ దశకు చేరుకున్నాయి.

ముఖ్యాంశాలు

* భారతదేశ జనాభా యూఎస్‌ఏ, ఇండొనేసియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, జపాన్, బ్రెజిల్‌ దేశాల మొత్తం జనాభాకు దాదాపు సమానం.

* దేశంలో వార్షికంగా పెరిగే జనాభా.. ఆస్ట్రేలియా మొత్తం జనాభా కంటే ఎక్కువ.

* ఒక్క ఉత్తర్‌ప్రదేశ్‌ జనాభానే చైనా, యూఎస్‌ఏ, ఇండొనేసియా, బ్రెజిల్‌ జనాభాలను మినహాయిస్తే ప్రపంచంలోని మరే ఇతర దేశం కన్నా ఎక్కువ. ఒడిశా జనాభా కెనడా కంటే ఎక్కువగా, ఛత్తీస్‌గఢ్‌ జనాభా ఆస్ట్రేలియా కంటే అధికంగా ఉంది.

* భారత్‌ జనాభా-యూఎస్‌ఏ జనాభా కంటే 3.6 రెట్లు, బ్రెజిల్‌ కంటే 6 రెట్లు, కెనడా కంటే 33 రెట్లు, ఆస్ట్రేలియా కంటే 55 రెట్లు అధికం.

* 1841లో ప్రపంచంలో ఆధునిక జనాభా లెక్కల సేకరణను ఇంగ్లండ్‌లో ప్రవేశపెట్టారు. 1851లో సెన్సెస్‌ ప్రవేశపెట్టిన రెండో దేశం న్యూజిలాండ్‌.

* భారతదేశంలో మొదటి జనాభా లెక్కల సేకరణ 1872లో లార్డ్‌ మేయో కాలంలో ప్రవేశపెట్టగా, 1881 నుంచి ప్రతి పదేళ్లకోసారి నిర్వహించడం లార్డ్‌ రిప్పన్‌ కాలంలో ప్రారంభమైంది. 

* 2011 జనాభా లెక్కల సేకరణ పదిహేనోది,  స్వాతంత్య్రం తర్వాత ఏడోది. సెన్సెస్‌ కమిషనర్‌ డాక్టర్‌ చంద్రమౌళి. ఈ జనాభా లెక్కల సేకరణ 2010, ఏప్రిల్‌ 1న అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ పేరుతో నమోదై 2011, మార్చి 1తో ముగిసింది.

* 2012 నాటికి ప్రపంచ జనాభా 700 కోట్లుగా నమోదైంది. ఇందులో 700 కోట్లవ శిశువుగా 2011, అక్టోబరు 31న భారత్‌లోని లఖ్‌నవూలో పుట్టిన ‘నర్గీస్‌’ అనే శిశువు; ఫిలిప్పైన్స్‌లోని మనీలాలో జన్మించిన ‘మేఖామ్‌ కో’ అనే బాలిక సంయుక్తంగా నమోదయ్యారు.

* ‘యునైటెడ్‌ నేషన్స్‌ పాపులేషన్‌ ఫండ్‌’ నివేదిక ప్రకారం నవంబరు 15, 2022 నాటికి ప్రపంచ జనాభా 800 బిలియన్లకు చేరింది.

* 2011లో జనాభా లెక్కల్లో మొత్తం 35 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వివరాలు సేకరించారు.

* భారతదేశ జనాభా లెక్కల సేకరణలో 1921ను సెన్సెస్‌ గొప్ప విభాజక సంవత్సరంగా పేర్కొంటారు. ఆ సెన్సెస్‌లో అంతకుముందు దశాబ్దం కంటే జనాభా తగ్గుదల కనిపించడమే ఇందుకు కారణం.

* ప్రపంచ జనాభాలో సుమారు 61% ఆసియాలో నివసిస్తున్నారు.

* ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభా దాదాపు 18%. జనాభా పరంగా అతిపెద్ద దేశం మనదే. ప్రపంచంలో ప్రతి ఆరుగురిలో ఒకరు భారతీయుడు.

* 2001-2011 మధ్య భారతదేశంలో పెరిగిన జనాభా, బ్రెజిల్‌ (203 మిలియన్లు) జనాభాకు దాదాపు సమానం.

* ప్రపంచంలో జనాభా వృద్ధి రేటు అధికంగా ఉన్న దేశాలు 1) నైజీరియా 2) పాకిస్థాన్‌ 3) రష్యా

* అత్యధిక జనసాంద్రత ఉన్న దేశాలు 1) మొనాకో 2) చైనా

* అతి తక్కువ జనాభా ఉన్న దేశం వాటికన్‌ సిటీ (832)



రచయిత: సక్కరి జయకర్‌

 

Posted Date : 09-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌